కొత్తిమీరని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. కూరల్లో, పచ్చళ్ళలో, పప్పులో, సాంబారులో చివరగా ఇంత కొత్తిమీర వేస్తే చాలు… ఆ ఘుమఘుమలు మనకు ఆ పదార్థం నచ్ౘ్కపోయినా రుచి చూసేట్టు చేస్తుంది. ఆనక తినేట్లుగా కూడా చేస్తుంది.
పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది.
కొత్తిమీర గుండెకు చాలా మంచిది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అల్సర్‌ని తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
కొత్తిమీర రోటి పచ్చడి కావల్సిన దినుసులు :
పది పన్నెండు ఎండుమిర్చి, పదిదాకా పచ్చిమిరప కాయలు.
జీలకర్ర›, గోలీకాయంత చింతపండు
చిన్న ముక్క బెల్లం, సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు (ఇష్టం ఉంటే వేసుకోండి)
పైన చెప్పిన వాటిలో పచ్చిమిర్చి, ‘కొత్తిమీర సేంద్రియం కాకపోతే, కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పచ్చిమిర్చి తొడిమ తీసి వేసి పదినిమిషాలు ఉంచి, బాగా కడగండి. ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ ఇంకో రెండుసార్లు కడగండి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కొంతన్నా పోతాయి. కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్‌లో కడిగి, రెండూ తడి లేకుండా ఆరపెట్టుకోండి. తరువాత జీలకర్ర, పచ్చి, ఎండుమిర్చిని కలిపి మెత్తగా నూరి, అందులో ఉప్పు, వెల్లుల్లి వేసి మరింత నూరి, చివరికి కొత్తిమీర, బెల్లం వేసి మెత్తగా నూరి, గిన్నెలోకి తీసుకోవాలి.
పోపు అవసరం లేదు. వేడి అన్నంలో కలిపి, అవసరం అనుకున్న వారు నెయ్యి, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేసుకుని తినవచ్చు. అవి లేకున్నా రుచిగానే ఉంటుంది. తడి లేకపోతే, మీరు చేసిన పచ్చడి వారమైనా పాడవదు.
రచన : కొలను పద్మావతి
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

