వండని వంట… కడుపులో చల్లటి భోజనం

మామూలుగా ఎండాకాలంలో ఏమి తినాలనిపియదు. నీళ్లు బాగా తాగిన తర్వాత కడుపు నిండుగా అనిపిస్తుంది, కాసేపటికి నీరసం వస్తుంది, అటువంటి పరిస్థితుల్లో దీన్ని బాగా తినొచ్చు.

కావాల్సిన వస్తువులు: ఒక సగం కీర, చిన్న దోసకాయ ముక్క, మూడు నాలుగు క్యారెట్ ముక్కలు అంటే చిన్న క్యారెట్ ఒకటి, చిన్న బీట్రూట్ ముక్క రెడ్ కలర్ ఉండొద్దు అనుకుంటే బీట్రూట్ వేయకుండా ఉండొచ్చు. ఒక టమాటా, ఒక చిన్న కప్పు పెరుగు, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ ముక్కలు కొన్ని….

చేసుకునే విధానం: అన్ని ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని పెరుగు వేసి కలుపుకోవాలి. పెరుగు తక్కువ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది గట్టిగా లేకుండా కొంచెం లూస్‌గా ఉంటేనే బాగుంటుంది. ఉదయము, మధ్యాహ్నము ఎప్పుడైనా మనం దీన్ని తినొచ్చు. అమృత ఆహారం అనలేము, ఎందుకంటే సాల్ట్ కలుస్తుంది కాబట్టి. ఉప్పు లేకుండా కూడా బాగానే ఉంటుంది.
అన్నం తింటేనే కడుపు నిండుతుంది అనుకునేవాళ్ళు కరెక్ట్‌గా ఒక ముద్ద అన్నాన్ని పిసికి, దీంట్లో కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది

కీర లేకున్నా టమాటా, ఉల్లిగడ్డ, పెరుగు…. వీటితో కూడా ట్రై చేసుకోవచ్చు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అమృత ఆహారము

ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఆహారము ‘అమృత ఆహారము’.

ఈ అమృతాహారం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయి. దీని తయారీ విధానము మొదట్లో ఇది కొంచెం ఇబ్బంది అనిపించినప్పటికీ, ఒకసారి చేసుకుంటే చాలా సులువు. దీనికి సంబంధించి మూడు భాగాలుగా ఈ ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని మనము డివైడ్ చేసుకుందాం. దానివల్ల మీకు కొంచెం సులువు అవుతుంది.

మొదటి భాగం: కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఇవి అవసరము. మనకు అందుబాటులో ఉన్నటువంటి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు ఎక్కువ ధర పెట్టాలని ఏం లేదు, మనకు అందుబాటు ధరలలో ఏవైతే దొరుకుతాయో, అవి ఎన్ని ఎక్కువ రకాలు దొరుకుతాయో అన్ని.

ఒకవేళ రెండు మూడు రకాలు దొరికినాయి అనుకోండి, అంటే రెండు కూరగాయలు – ఒక ఆకుకూర – రెండు రకాల పండ్లు, అట్లా అయినా పర్వాలేదు. వాటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

రెండవ భాగం: మొలకలు అంటే, పప్పు ధాన్యాలకు సంబంధించి పెసలు, ఉలువలు, శనగలు, పల్లీలు, బొబ్బర్లు,
రాజ్మా, కాబూలీచెన ఇట్లాంటివి. అంటే రెండు పలకల నుండి మొలకలు వచ్చేవి ఏవైనా గాని, అవి కూడా అందుబాటులో ఉన్నవి ముందే తయారు చేసుకొని మొలకగట్టి రెడీగా ఉంచుకోవాలి.

మూడవ భాగం: ధాన్యము, చిరుధాన్యాలకు సంబంధించి అంటే బియ్యము దంపుడు బియ్యం అయితే మంచిది, ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, కొర్రలు, అండు కొర్రలు, జొన్నలు, గోధుమలు, ఇందులో ఏవి అందుబాటులో ఉంటే అవి. ఉదయం నానబెట్టి రాత్రికి ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బి పక్కన పెట్టుకుంటే, పొద్దునకి పులుస్తది. ఈ పులిసిన పేస్ట్ లోంచి ఒక మనిషికి రెండు స్పూన్ల చొప్పున అవసరం అయితది.

ఇప్పుడు ఈ మూడు భాగాలను ఒక భాగంగా తయారు చేసి, మనం ఎట్లా ఆహారంగా తీసుకోవాలో చూద్దాం.
మనము తినగలిగినన్ని కూరగాయ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకొని, దాంట్లోకి రెండు చెంచాల పేస్టు, ఒక చెంచా మొలకలు కలుపుకొని తినొచ్చు.

ఉదయము ఈ ఆహారాన్ని తీసుకుంటే ఆకలి కూడా ఎక్కువగా వేయదు. మనము తినగలిగినంత అమృతారాన్ని తినొచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. మధ్యాహ్నముా, రాత్రికి కూడా ఇదే ఆహారాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అట్లా తీసుకోలేకపోతే, మనం భోజనం చేసేముందు కొంత, అంటే ఒక రెండు మూడు చెంచాలు ఈ అమృత ఆహారాన్ని తీసుకొని, తర్వాత భోజనాన్ని కంటిన్యూ చేయొచ్చు.

ఇది అనేక ఆరోగ్య సమస్యలను నిర్మూలిస్తుంది, రాకుండా చేస్తుంది. కాబట్టి మిత్రులు దీన్ని ప్రయత్నం చేయొచ్చు.

మేము ఒక నెల నుంచి తింటున్నాము.

ప్రాణం తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ కొత్తలో ఎవరికైనా తినడం కష్టం అనిపిస్తే, కొంచెం బెల్లం ముక్క లేదంటే ఒక రెండు చెంచాల పెరుగు, కొన్ని ఎక్కువ పండ్ల ముక్కలు మనకు ఇష్టమైనవి వేసుకొని తినొచ్చు. తినే ముందు కొన్ని నువ్వులు కొన్ని అవిసెలు దీంట్లో కలుపుకొని తింటే, అప్పుడు పంటికి పచ్చివి చాలా టేస్ట్ అనిపిస్తాయి.
మేము ఇద్దరమే తింటాం కాబట్టి మాకు వారానికి అవసరమైనటువంటి పండ్ల ముక్కల్ని కూరగాయ ముక్కలు ఒకసారి కట్ చేసి పెట్టుకుంటున్నాము. దాన్యాలకి సంబంధించినటువంటి పేస్టును కూడా ఒకేసారి రుబ్బి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నాము. తినడానికి రెండు మూడు గంటల ముందు ఫ్రిజ్ లోంచి మన అవసరం నిమిత్తం ఎంతయితే తినాలో అంత క్వాంటిటీని వేరే గిన్నెలోకి తీసుకొని బయటపెట్టి దాన్ని బ్రేక్ ఫాస్ట్‌కి తీసుకుంటున్నాం.

ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే Ameya Krishi Vikasa Kendram YouTube Channel / అమేయ కృషి వికాస కేంద్రం యూట్యూబ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన వీడియో ఉన్నది మిత్రులు గమనించగలరు.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కొత్తిమీర పచ్చడి

కొత్తిమీరని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. కూరల్లో, పచ్చళ్ళలో, పప్పులో, సాంబారులో చివరగా ఇంత కొత్తిమీర వేస్తే చాలు… ఆ ఘుమఘుమలు మనకు ఆ పదార్థం నచ్ౘ్కపోయినా రుచి చూసేట్టు చేస్తుంది. ఆనక తినేట్లుగా కూడా చేస్తుంది.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది.

కొత్తిమీర గుండెకు చాలా మంచిది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అల్సర్‌ని తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కొత్తిమీర రోటి పచ్చడి కావల్సిన దినుసులు :
పది పన్నెండు ఎండుమిర్చి, పదిదాకా పచ్చిమిరప కాయలు.
జీలకర్ర›, గోలీకాయంత చింతపండు
చిన్న ముక్క బెల్లం, సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు (ఇష్టం ఉంటే వేసుకోండి)

పైన చెప్పిన వాటిలో పచ్చిమిర్చి, ‘కొత్తిమీర సేంద్రియం కాకపోతే, కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పచ్చిమిర్చి తొడిమ తీసి వేసి పదినిమిషాలు ఉంచి, బాగా కడగండి. ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ ఇంకో రెండుసార్లు కడగండి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కొంతన్నా పోతాయి. కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్‌లో కడిగి, రెండూ తడి లేకుండా ఆరపెట్టుకోండి. తరువాత జీలకర్ర, పచ్చి, ఎండుమిర్చిని కలిపి మెత్తగా నూరి, అందులో ఉప్పు, వెల్లుల్లి వేసి మరింత నూరి, చివరికి కొత్తిమీర, బెల్లం వేసి మెత్తగా నూరి, గిన్నెలోకి తీసుకోవాలి.
పోపు అవసరం లేదు. వేడి అన్నంలో కలిపి, అవసరం అనుకున్న వారు నెయ్యి, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేసుకుని తినవచ్చు. అవి లేకున్నా రుచిగానే ఉంటుంది. తడి లేకపోతే, మీరు చేసిన పచ్చడి వారమైనా పాడవదు.

రచన : కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

దోసకాయ-మామిడికాయ పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా తయారుచేసే సహజాహార వంటకం ఈ ‘దోసకాయ-మామిడికాయ’ పచ్చడి
దోసకాయను-మామిడికాయను బాగా కడిగి, చెక్కు తీసి కానీ, తీయకుండా కానీ, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ, పండుమిర్చి కానీ, బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. (కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు).

సముద్రపు రాళ్ళ ఉప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ తగినంత తీసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూరు కున్న పచ్చడిని, మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు. లేదంటే దోసకాయ ముక్కలు దానిలో కలిపి దోసకాయ ష మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు.

రెండు రకాలుగా చేసుకోవచ్చు.

అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీలలో కూడా బాగుంటుంది.

ఎండుమిర్చికంటే పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వాడుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది.
పండుమిర్చిఎండిన తర్వాత కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి తక్కువ వాడుకుంటే మంచిది.

మామిడికాయ బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. కానీ చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకని మామిడికాయ వాడుకుంటే రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడిని ఏ రోజుకు ఆరోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

రచన : లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… శీకాయ

శీకాయ దాదాపు 10-12 మీ. ఎత్తు వరకు పెరిగే బలమైన ముళ్ళతో కూడిన బహువార్షిక తీగ. కొమ్మలు గోధుమరంగులో వుండి, తెల్లని మచ్చలతో కూడి ఉంటుంది. పుష్పాలు చిన్నగా, కాయలు చిన్న కాడతో పలుచగా, బల్లపరుపుగా ఉండి 6-15 గింజలు కలిగి ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

సాధారణ నామం : సోప్‌నట్ అకేసియా, శీకాకాయ
శాస్త్రీయ నామం : అకేసియా కాన్సిన్నా కుటుంబం: మైమోసేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కాయలు, బెరడు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. బెరడులో సపానిన్, కాయలో అకేసిన్ అనే రసాయనాలుంటాయి. బెరడును ఉబ్బసవ్యాధి నివారణకు, సబ్బులు మరియు షాంపూల తయారీలో ఉపయోగిస్తారు. మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, క్రిమిసంహారిణిగా, రక్తస్రావాన్ని అరికట్టుటకు, కుష్టు, బొల్లి వంటి చర్మవ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలను అతికించడానికి కట్టే కట్టులో, పొడి చేసిన కాయలను సబ్బులకు బదులుగాను ఉపయోగించవచ్చు.

వ్యవసాయరంగంలో …

  • శీకాయ గింజల మిథనాల్ ద్రావణం మరియు గింజల, ఆకుల ఇథైల్ ఎసిటేట్ ద్రావణాలు హైబ్లేయ ప్యూరియాని అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2000).
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలసఒరైజె, మరియు రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం కాస్టానియంపై యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (క్వాద్రి, 1973). అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణాన్ని (2%, 5%) 40 రోజుల వరినారు మొక్కలపై పిచికారి చేస్తే సుడిదోమ, నీల పర్వత లూజెన్స్ గుడ్లు పెట్టడాన్ని తగ్గించింది (రెడ్డి అండ్ అర్స్, 1988)
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం (50 పిపియం) పొగాకు లద్దెపురుగు, స్పోడోప్టెరా లిటూర లార్వాలను (85.2%) సమర్ధవంతంగా నివారించింది. ఇది సోయాబీన్ పంటనాశించే పొగాకు లద్దె పురుగు పర్యావరణహిత యాజమాన్యానికి సుస్థిర పరిష్కార మివ్వగలదు (పాటిల్ అండ్ చావన్, 2010).
  • శీకాయ చెట్టు బెరడు క్లోరోఫాం ద్రావణం సూడోమోనాస్ ఈరోజినోసా, స్టెఫైలో కోకస్ ఆరియస్‌పై బాక్టీరియానాశక చర్యను ప్రదర్శించింది (వర్గీస్ రాజా అండ్ శివరాజ్, 2012) శీకాయ గింజల ద్రావణం రూట్‌నాట్ నెమటోడ్, మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిటపై నెమటిసైడల్ చర్యను ప్రదర్శించింది (ద్విజేంద్ర సింగ్, 2014).
  • శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయ ఇథనాల్ ద్రావణం (సాపోనిన్ కలిగి ఉన్నవి)తో శుద్ధి చేసిన ఫేసియోలస్ అకానిటిఫోలియస్ గింజలపై కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, గింజల నుండి వెలువడే పెద్ద పురుగులను గణనీయంగా తగ్గించింది. శీకాయకాయల ఇథనాల్ ద్రావణం జీవపురుగు మందు లక్షణాలు కలిగి పల్స్‌బీటిల్‌ని సమర్ధవంతంగా నివారించగలదు (బజాద్ అండ్ పరదేశి, 2016).
  • అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ మరియు ఇథైల్ అసిటేట్ ద్రావణాలు మరియు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణం టేకు ఆకులను తినే పురుగు హైబ్లీయప్యూరియా లార్వాలను అత్యంత సమర్ధవంతంగా 100% నివారించాయి (దీప అండ్ రెమాదేవి, 2011).
  • అకేసియా కాన్సిన్నా గింజల పొడి వరి ధాన్యాన్ని నిల్వ సమయంలో ఆశించే పురుగులను యాంటీఫీడెంట్ చర్య ద్వారా నివారించింది., అకేసియా కాన్సిన్నా క్రూడ్ ద్రావణం చెరకు పంటలో ముఖ్యపురుగైన సెరటోవాక్యునా లానిజెరాని ప్రయోగశాలలో మరియు క్షేత్ర ప్రయోగాలలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (పాటిల్ అండ్ చవాన్, 2009).
  • అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ ద్రావణం యానిమల్ స్కిస్టోమియాసిస్ వాహకం ఫ్రెష్‌వాటర్ నత్త, లిమ్నీయ లూటియోలపై మొల్లస్కిసైడల్ చర్యను ప్రదర్శించింది (సుకుమారన్, అతని అనుచరులు, 2002).
  • అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానికస్ యుర్టికె జీవిత చక్రాన్ని పొడిగించి, అధిక మరణశాతాన్ని నమోదు చేసింది (ఎల్‌గెపలి, అతని అనుచరులు, 2016).

Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

వండని వంట… పండు మిర్చి పచ్చడి

వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.

ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.

మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!

అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!

వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!

అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!

మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.

కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.

పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More