ఔషధ మొక్క… రేల చెట్టు

రేలచెట్టు ఒక మధ్యమ పరిమాణం గల చెట్టు. ఇది వేగంగా పెరిగే 10-20 మీ. ఎత్తు పెరగే చెట్టు. ఆకులు 15-60 సెం.మీ. పొడవుంటాయి. ప్రతి పెద్ద ఆకులో 3-8 జతల చిన్న ఆకులుంటాయి. ప్రతి చిన్న ఆకు 7-21 సెం.మీ. పొడవు, 4-9 సెం.మీ. వెడల్పు వుంటుంది. పూలు 20-40 సెం.మీ. రెసిమ్‌లో ఏర్పడతాయి. ప్రతి పూవు 4-7 సెం.మీ. వ్యాసము ఉండి 5 పసుపు రంగు ఆకర్షక పత్రాలుంటాయి. కాయ 30-60 సెం.మీ. పొడవు, 1.5-3.5 సెం.మీ. వెడల్పు వుంటుంది. కాయలో గింజలుంటాయి. చెట్టు కొయ్య బలంగా వుండి, దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటుంది.

సాధారణ నామం : గోల్డెన్ షవర్ శాస్త్రీయ నామం : క్యాసియా ఫిస్ట్యులా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • చెట్టు యొక్క అన్ని భాగాలు ఔషద గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో సెన్నోసైడ్స్, రీన్ గ్లూకోసైడ్స్, బార్సలాయిన్, ఎలోయిన్, ఫార్మిక్ ఆమ్లం, టానిన్లు, ఆక్సిఆంధ్రాక్వినోన్లు ఉంటాయి.
  • మొక్క భాగాలన్నీ ముఖ్యంగా పండులోని గుజ్ౙు మలబద్ధకాన్ని పోగొట్టి మూలవ్యాధి చికిత్సకు ఉపయోగపడతాయి.
    వేర్లు చర్మవ్యాధులు, సిఫిలిస్ చికిత్సకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • రేల చెట్టు నీటి ద్రావణం (0.25%) రైజోపెర్తా డామినికపై బలమైన యాంటిఫీడెంట్ ప్రభావాన్ని చూపింది (రాజారామ్ శైలజ్, ఆమె అనుచరులు, 2013).
  • రేల చెట్టు ఆకు ద్రావణం సైటోఫిలస్ ఒరైజెపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించింది.
  • క్యాసియాటోరా ఇథైల్ ఎసిటేట్ ద్రావణం హెలికోవర్పా ఆర్మిజరాపై 65% కన్నా ఎక్కువ యాంటిఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (రాజి, ఆమె అనుచరులు, 2016).
  • రేల చెట్టు ఇథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర 3వ దశ లార్వాలపై అధిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి (చౌహాన్, అతని అనుచరులు, 2011).
  • రేల చెట్టు ద్రావణం పీచ్ పండుఈగ, బాక్ట్రోసిరా జోనేట గణనీయమైన గుడ్లు పెట్టడాన్ని నిరోధించే చర్యను ప్రదర్శించింది. దీనిని పీచ్ పండుఈగ యాజమాన్యంలో ఉపయోగించవచ్చు. (ఇలియాస్, అతని అనుచరులు, 2017).
  • రేల చెట్టు ద్రావణం రైస్ వీవిల్, సైటోఫిలస్ ఒరైజె చావు, పెద్ద పురుగుల విడుదలను తగ్గించడంపై అధిక ప్రభావాన్ని చూపింది (డెర్బలా, అతని అనుచరులు, 2012).
  • వీవర్ అండ్ సుబ్రమణ్యం (2000) నిల్వధాన్యంలో ఆశించే పురుగులను నివారించే లక్షణాలు గల 200 మొక్కలను గుర్తించారు. అందులో రేల చెట్టు కూడా ఒకటి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తీగజాతి కూరగాయల్లో పందిరి సాగు – అధిక దిగుబడికి మార్గం

తీగజాతి కూరగాయలు మన రైతులు విస్తృతంగా సాగు చేస్తున్న ముఖ్యమైన కూరగాయ పంటలు. దోసకాయ, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, చిక్కుడు వంటి పంటలను సాధారణంగా నేలపై పాకే విధానంలో సాగు చేస్తారు. అయితే పందిరి సాగు విధానం ద్వారా తీగలను పైకి పెంచడం వల్ల పంటలో గాలి, వెలుతురు ప్రసరణ మెరుగుపడి, కాయల నాణ్యత పెరగడంతో పాటు కోత, పంట సంరక్షణ పనులు సులభతరం అవుతాయి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు పందిరి సాగు రైతులకు అధిక దిగుబడి మరియు మెరుగైన ఆదాయాన్ని అందించే అవకాశం ఉంది.

పందిరి సాగు అంటే ఏమిటి?
తీగజాతి కూరగాయల తీగలను నేలపై పాకనివ్వకుండా, వెదురు, ఇనుప స్తంభాలు, జీఐ వైర్లు, ప్లాస్టిక్ లేదా నైలాన్ తాళ్ల సహాయంతో ఒక ఎత్తైన నిర్మాణాన్ని ఏర్పాటు చేసి దానిపై తీగలను పెంచే విధానాన్ని పందిరి సాగు అంటారు. పంటను బట్టి పందిరి ఎత్తు, స్తంభాల మధ్య దూరం మరియు ఉపయోగించే వస్తువులు నిర్ణయించాలి.

పందిరి సాగుకు అనుకూలమైన పంటలు
బీరకాయ, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, దోసకాయ, చిక్కుడు వంటి తీగజాతి కూరగాయలను పందిరి విధానంలో విజయవంతంగా సాగు చేయవచ్చు. పంట స్వభావం, తీగల పెరుగుదల మరియు కాయల బరువును బట్టి పందిరి నిర్మాణాన్ని బలంగా ఏర్పాటు చేయాలి.

పందిరి సాగు వల్ల ప్రయోజనాలు

  1. మొక్కలకు మంచి గాలి, వెలుతురు
    తీగలు నేలపై పాకకుండా పైకి పెరగడం వల్ల మొక్కల మధ్య గాలి ప్రసరణ మెరుగుపడుతుంది. తగినంత సూర్యకాంతి అందడంతో మొక్కల పెరుగుదల చురుకుగా ఉంటుంది.
  2. తెగుళ్ల ఉధృతి తగ్గే అవకాశం
    మొక్కల భాగాలు నేలతో నేరుగా సంబంధం లేకపోవడం వల్ల అధిక తేమ కారణంగా వచ్చే కొన్ని శిలీంధ్ర తెగుళ్ల సమస్యను తగ్గించవచ్చు. అయితే సమగ్ర పంట సంరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి.
  3. కాయల నాణ్యత మెరుగుదల
    పందిరిపై వేలాడుతూ పెరిగే కాయలు నేలను తాకకుండా ఉండటం వల్ల కాయలపై మచ్చలు, వంకరలు మరియు నేలతో సంబంధం వల్ల వచ్చే నాణ్యత లోపాలు తగ్గుతాయి. తద్వారా మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉంటుంది.
  4. కోత సులభతరం
    పందిరిపై కాయలు స్పష్టంగా కనిపించడం వల్ల కోత సమయంలో కాయలను గుర్తించడం సులభంగా ఉంటుంది. దీనివల్ల కోతకు పట్టే సమయం మరియు శ్రమ తగ్గుతుంది.
  5. భూమి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది
    తీగలు పైభాగంలో విస్తరించడం వల్ల నేలపై అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరైన పంట మరియు అంతర పంట ప్రణాళికతో భూమి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు.

పందిరి నిర్మాణంలో జాగ్రత్తలు
పందిరి సాగులో విజయానికి బలమైన పందిరి నిర్మాణం చాలా ముఖ్యమైనది. పందిరి నిర్మించేటప్పుడు మంచి నాణ్యత కలిగిన వెదురు కర్రలు లేదా తగిన స్తంభాలను ఉపయోగించాలి. తీగలు, కాయల బరువును తట్టుకునే విధంగా ప్రధాన స్తంభాలను బలంగా పాతాలి.

పందిరిపై తీగలను పట్టుకునేందుకు బలమైన వైరు లేదా నైలాన్ తాళ్లను ఉపయోగించాలి. పందిరి నిర్మాణం గాలి వేగానికి తట్టుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో అధిక గాలులు, భారీ వర్షాల వల్ల పందిరి కూలిపోకుండా ముందుగానే తగిన బలపరిచే చర్యలు చేపట్టాలి.

నేల మరియు నాటే విధానం
నీరు నిల్వ ఉండని, మంచి నీటి పారుదల కలిగిన నేలలు తీగజాతి కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటాయి. పొలాన్ని బాగా దున్ని, సేంద్రియ ఎరువును తగిన మోతాదులో కలపాలి. విత్తనాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పంటను బట్టి గోతులు లేదా ఎత్తైన మడులు ఏర్పాటు చేసి విత్తనాలను నాటాలి. మొక్కల మధ్య దూరాన్ని పంట రకం, తీగల పెరుగుదల మరియు పందిరి నిర్మాణాన్ని బట్టి నిర్ణయించాలి.

ఎరువుల యాజమాన్యం
పందిరి సాగులో మొక్కలు వేగంగా పెరిగి అధికంగా తీగలను, ఆకులను మరియు కాయలను ఉత్పత్తి చేస్తాయి. అందువల్ల సమతుల్య పోషక యాజమాన్యం అవసరం. నేల పరీక్ష ఆధారంగా ఎరువుల మోతాదును నిర్ణయించడం ఉత్తమం.

నీటి యాజమాన్యం
తీగజాతి కూరగాయల్లో నీటి యాజమాన్యం చాలా కీలకం. నీటి కొరత వల్ల మొక్కల పెరుగుదల, పూత మరియు కాయల అభివృద్ధి దెబ్బతినవచ్చు. అదే సమయంలో అధిక నీరు ఇవ్వడం వల్ల వేర్ల వద్ద తేమ ఎక్కువై తెగుళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.

బిందు సేద్యం ద్వారా మొక్కలకు అవసరమైనంత నీటిని అందించడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా పూత మరియు కాయల అభివృద్ధి దశల్లో నీటి లభ్యతలో హెచ్చుతగ్గులు లేకుండా చూడాలి.

తీగల శిక్షణ మరియు నిర్వహణ
పందిరి సాగులో తీగలను సక్రమంగా పందిరిపైకి ఎక్కించడం చాలా ముఖ్యం. మొక్కలు పెరుగుతున్న కొద్దీ తీగలను మృదువైన తాళ్ల సహాయంతో పందిరిపైకి చేర్చాలి.

అవసరం లేని, బలహీనమైన లేదా వ్యాధి సోకిన భాగాలను తొలగించడం ద్వారా మొక్కలో గాలి ప్రసరణను మెరుగుపరచవచ్చు. అయితే కత్తిరింపు పద్ధతులు పంట రకాన్ని బట్టి మారుతాయి. కాబట్టి సంబంధిత పంటకు సిఫారసు చేసిన విధానాన్ని మాత్రమే అనుసరించాలి.

చీడపీడలు మరియు తెగుళ్ల యాజమాన్యం
పందిరి సాగులో మొక్కలకు మంచి గాలి, వెలుతురు లభించడం వల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ చీడపీడలు పూర్తిగా నివారించబడవు. కాయతొలుచు పురుగులు, పేనుబంక, తెల్లదోమ, ఎర్రనల్లి వంటి పురుగులను ఎప్పటికప్పుడు గమనించాలి.

అదేవిధంగా బూజు తెగుళ్లు, వడల తెగుళ్లు మరియు ఇతర వ్యాధుల లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించాలి. పొలాన్ని తరచుగా పరిశీలిస్తూ సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులు (IPM) పాటించాలి.

పుష్పించే దశలో ప్రత్యేక శ్రద్ధ
తీగజాతి కూరగాయల్లో మంచి కాయ దిగుబడికి పుష్పించే దశ చాలా కీలకం. పుష్పాలు వచ్చే సమయంలో మొక్కలకు తగినంత నీరు, పోషకాలు అందేలా చూడాలి. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత లేదా అధిక తేమ వంటి వాతావరణ పరిస్థితులు పూత మరియు కాయల ఏర్పాటుపై ప్రభావం చూపవచ్చు.

తేనెటీగలు వంటి పరాగసంపర్క కీటకాల పాత్ర ముఖ్యమైన పంటల్లో, పుష్పించే సమయంలో వాటి సంచారాన్ని దెబ్బతీసే చర్యలను తగ్గించడం మంచిది.

కోత మరియు మార్కెటింగ్
కూరగాయలను పంటకు అనుగుణమైన సరైన పరిపక్వ దశలో కోయాలి. ఆలస్యంగా కోయడం వల్ల కాయల నాణ్యత తగ్గడంతో పాటు తదుపరి కాయల ఉత్పత్తిపై కూడా ప్రభావం పడవచ్చు.

పందిరి సాగులో కాయలు స్పష్టంగా కనిపించడం వల్ల సరైన పరిమాణంలో ఉన్న కాయలను ఎంపిక చేసి కోయడం సులభం. కోత అనంతరం కాయలను నాణ్యత ఆధారంగా వేరు చేసి, శుభ్రమైన ప్యాకింగ్లో మార్కెట్కు తరలిస్తే మెరుగైన ధర పొందే అవకాశం ఉంటుంది.

రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యాంశాలు
పందిరి సాగులో అధిక దిగుబడి పొందడానికి కేవలం పందిరి ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదు. నాణ్యమైన విత్తనం, సరైన మొక్కల సాంద్రత, బలమైన పందిరి, సమతుల్య ఎరువుల యాజమాన్యం, క్రమబద్ధమైన నీటి సరఫరా, తీగల శిక్షణ, సమగ్ర చీడపీడల యాజమాన్యం మరియు సరైన సమయంలో కోత వంటి అన్ని అంశాలను సమన్వయంతో పాటించాలి.

తీగజాతి కూరగాయల్లో పందిరి సాగు పద్ధతి రైతులకు నాణ్యమైన దిగుబడి, మెరుగైన కాయల నాణ్యత, కోతలో సౌలభ్యం మరియు భూమి వినియోగ సామర్థ్యం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ప్రారంభ దశలో పందిరి నిర్మాణానికి కొంత అదనపు పెట్టుబడి అవసరమైనప్పటికీ, సరైన పంట యాజమాన్యంతో దీర్ఘకాలంలో మెరుగైన దిగుబడి మరియు ఆదాయం పొందే అవకాశం ఉంది.

అందువల్ల మార్కెట్ డిమాండ్, స్థానిక వాతావరణ పరిస్థితులు మరియు సాగు వనరులను పరిగణనలోకి తీసుకుని తీగజాతి కూరగాయల్లో పందిరి సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టడం రైతులకు లాభదాయకమైన సాగు విధానంగా నిలుస్తుంది.

డా. టి. థామ్సన్, డా. టి. తేజస్విని, డా. వి. సుధావాణి
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం. ఫోన్ 9494963291

Read More

పశువైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) వినియోగం: భవిష్యత్ పశుసంవర్ధకానికి నూతన దిశ

పరిచయం
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం మరియు పశుసంవర్ధక రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) నేటి కాలంలో పశువైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. పశువుల ఆరోగ్య సంరక్షణ, వ్యాధుల ముందస్తు గుర్తింపు, పాల ఉత్పత్తి పెంపు, సంతానోత్పత్తి నిర్వహణ, మేత నిర్వహణ మరియు వ్యవసాయ ఆధారిత నిర్ణయాలు తీసుకోవడంలో AI కీలక పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో కూడా పశుపాలక రైతులు ఆధునిక సాంకేతికతలను స్వీకరిస్తూ అధిక ఉత్పాదకత మరియు లాభదాయకత సాధిస్తున్నారు. AI ఆధారిత పరికరాలు, సెన్సర్లు, మొబైల్ యాప్‌లు మరియు డేటా విశ్లేషణ వ్యవస్థలు పశుసంవర్ధక రంగాన్ని స్మార్ట్ వ్యవస్థగా మార్చుతున్నాయి.

పశువుల ఆరోగ్య పర్యవేక్షణలో AI
పశువుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతోంది. ప్రస్తుతం పశువుల మెడకు లేదా కాళ్లకు ధరించే స్మార్ట్ కాలర్లు మరియు సెన్సర్లు శరీర ఉష్ణోగ్రత, కదలికలు, మేత తీసుకునే సమయం మరియు విశ్రాంతి వ్యవధిని నమోదు చేస్తాయి. ఈ సమాచారాన్ని AI సాఫ్ట్ వేర్ విశ్లేషించి జ్వరం, మాస్టిటిస్, జీర్ణ సమస్యలు లేదా ఇతర వ్యాధుల సంకేతాలను ముందుగానే గుర్తిస్తుంది. తద్వారా రైతులు మరియు పశువైద్యులు వెంటనే చికిత్స చర్యలు చేపట్టగలుగుతారు.

వ్యాధుల నిర్ధారణలో కృత్రిమ మేధస్సు
ఇటీవలి కాలంలో AI ఆధారిత మొబైల్ అప్లికేషన్లు పశువుల ఫోటోలు, వీడియోలు మరియు లక్షణాలను విశ్లేషించి సంభావ్య వ్యాధులను సూచిస్తున్నాయి. చర్మ వ్యాధులు, కుంటితనం (Lameness), మాస్టిటిస్, శ్వాసకోశ వ్యాధులు మరియు ఇతర అంటువ్యాధులను గుర్తించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. కొన్ని దేశాల్లో ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ మరియు ప్రయోగశాల పరీక్షల ఫలితాలను AI ద్వారా విశ్లేషించి వేగవంతమైన మరియు ఖచ్చితమైన నిర్ధారణ చేస్తున్నారు.

సంతానోత్పత్తి నిర్వహణలో AI
పాడి పశువులలో ఈస్ట్రస్ (Heat) గుర్తించడం రైతులకు ప్రధాన సవాలు. ప్రస్తుతం AI ఆధారిత సెన్సర్లు మరియు యాక్టివిటీ మానిటరింగ్ పరికరాలు పశువుల ప్రవర్తనలో మార్పులను గుర్తించి సరైన కృత్రిమ గర్భధారణ (AI) సమయాన్ని సూచిస్తున్నాయి.
దీని వల్ల:
• గర్భధారణ శాతం పెరుగుతుంది.
• ఖాళీ రోజులు తగ్గుతాయి.
• పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది.
• రైతుల ఆదాయం పెరుగుతుంది.

పాల ఉత్పత్తి పెంపులో AI
ఆధునిక డెయిరీ ఫార్ములలో AI ఆధారిత మిల్కింగ్ సిస్టమ్స్ వినియోగంలోకి వస్తున్నాయి. ఈ వ్యవస్థలు ప్రతి పశువు పాల ఉత్పత్తి, పాల నాణ్యత, కొవ్వు శాతం మరియు ఆరోగ్య స్థితిని నమోదు చేస్తాయి.

AI విశ్లేషణ ద్వారా:
• అధిక ఉత్పత్తి చేసే పశువులను గుర్తించవచ్చు.
• పోషకాహార లోపాలను అంచనా వేయవచ్చు.
• పాల ఉత్పత్తిని మెరుగుపరచే సూచనలు పొందవచ్చు.

మేత నిర్వహణలో AI
పశువుల ఉత్పాదకతలో మేత కీలక పాత్ర పోషిస్తుంది. AI ఆధారిత ఫీడ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు పశువు వయస్సు, బరువు, పాల ఉత్పత్తి మరియు శారీరక స్థితిని బట్టి సరైన మేత మిశ్రమాన్ని సూచిస్తాయి.

దీని వల్ల:
• మేత ఖర్చులు తగ్గుతాయి.
• పోషకాహార సమతుల్యత మెరుగుపడుతుంది.
• పాలు మరియు మాంస ఉత్పత్తి పెరుగుతుంది.

పౌల్ట్రీ రంగంలో AI
కోళ్ల పరిశ్రమలో AI వినియోగం వేగంగా పెరుగుతోంది. సెన్సర్లు మరియు కెమెరాల ద్వారా కోళ్ల కదలికలు, ఆహార వినియోగం, నీటి వినియోగం మరియు ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షిస్తారు.

AI వ్యవస్థలు:
• వ్యాధుల ప్రారంభ సంకేతాలను గుర్తిస్తాయి.
• మరణాల రేటును తగ్గిస్తాయి.
• ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి.
• నిర్వహణ ఖర్చులను తగ్గిస్తాయి.

డ్రోన్లు మరియు రోబోటిక్స్ వినియోగం
అభివృద్ధి చెందిన దేశాల్లో డ్రోన్లు మరియు రోబోటిక్స్ పశుసంవర్ధక రంగంలో వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పెద్ద పశువుల మందలను పర్యవేక్షించడం, మేత భూముల పరిస్థితిని అంచనా వేయడం జరుగుతోంది. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు మానవ శ్రమను తగ్గించి పాల సేకరణను వేగవంతం చేస్తున్నాయి.

తాజా AI సాంకేతికతలు
ప్రస్తుతం పశువైద్య రంగంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన AI సాంకేతికతలు:

  1. స్మార్ట్ కాలర్లు మరియు వేర్‌బుల్ సెన్సర్లు
  2. AI ఆధారిత హీట్ డిటెక్షన్ సిస్టమ్స్
  3. రోబోటిక్ మిల్కింగ్ యంత్రాలు
  4. AI వ్యాధి నిర్ధారణ మొబైల్ యాప్‌లు
  5. డ్రోన్ ఆధారిత పశు పర్యవేక్షణ
  6. ఆటోమేటిక్ ఫీడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్
  7. కంప్యూటర్ విజన్ ఆధారిత లేమ్‌నెస్ గుర్తింపు
  8. AI ఆధారిత పౌల్ట్రీ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్స్

రైతులకు కలిగే ప్రయోజనాలు
• వ్యాధుల ముందస్తు గుర్తింపు
• చికిత్స ఖర్చుల తగ్గింపు
• పాలు, మాంసం మరియు గుడ్ల ఉత్పత్తి పెంపు
• సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగుదల
• మేత వినియోగ సామర్థ్యం పెంపు
• శ్రమ మరియు నిర్వహణ ఖర్చుల తగ్గింపు
• అధిక ఆదాయం మరియు లాభదాయకత

ముగింపు
కృత్రిమ మేధస్సు పశువైద్య మరియు పశుసంవర్ధక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. వ్యాధుల ముందస్తు గుర్తింపు నుండి పాల ఉత్పత్తి పెంపు వరకు ప్రతి దశలో AI రైతులకు తోడ్పడుతోంది. భవిష్యత్తులో AI ఆధారిత సాంకేతికతల వినియోగం మరింత విస్తరించి, స్మార్ట్ పశుసంవర్ధక వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది. రైతులు, పశువైద్యులు మరియు విస్తరణ సంస్థలు ఈ సాంకేతికతలను స్వీకరించడం ద్వారా పశుసంవర్ధక రంగాన్ని మరింత లాభదాయకంగా మరియు స్థిరంగా తీర్చిదిద్దవచ్చు.

డా జె. సాయి కిరణ్ ( శాస్త్రవేత, ఎల్ పి ఎం), ఫోన్ : 8121451017
కృషి విజ్ఞాన కేంద్రం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, మామునూరు, వరంగల్

Read More

ఔషధ మొక్క… తంగేడు

తంగేడు లెగ్యూమ్ జాతికి చెందిన పూలు పూసే మొక్క. పెద్ద ఆకులో 16-24 చిన్న ఆకులుంటాయి. చిన్న ఆకుల కాడలు 2.2-2.5 సెం.మీ. పొడవు, 1þ1.3 సెం.మీ. వెడల్పు, రెండు చివరలు కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. పూలు క్రమాకారం లేకుండా, కాంతివంతమైన పసుపు రంగులో పెద్దవిగా 2.5 సెం.మీ. పొడవు కలిగి ఉంటాయి. కాయలు 7.5 సెం.మీ. పొడవు, 1.5 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. కాయలో 12-20 విత్తనాలుంటాయి..

సాధారణ నామం : ట్యానర్స్ క్యాసియా శాస్త్రీయ నామం : క్యాసియా ఆరిక్యులేటా కుటుంబం: ఫాబేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • తంగేడు పూలను ఆరబెట్టి, మెత్తని పొడి చేసి ఫేస్ పౌడర్, పెరుగుతో కలిపి అనేక మంది భారతీయ మహిళలు గరుకు చర్మం, నల్ల మచ్ౘ్లు పోగొట్టుకోవడానికి ఉపయోగిస్తారు.
  • డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో రక్తంలో గ్లూకోస్ స్థాయిని నియంత్రిస్తుంది. తంగేడు పానీయం పసిపిల్లలు, చిన్న పిల్లలలో జ్వరాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తంగేడు పూల రసం మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. తంగేడు విత్తనాలు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి గనోరియా, కళ్ళకలక చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని ఆయుర్వేద మందు…లÕ టానిక్‌గా, డయాబెటిస్ మందుగా ఉపయోగిస్తారు.
  • తంగేడు పూలు, ఆకులు, కాండం, వేరు, పచ్చి కాయలు ఆయుర్వేదంలో కీళ్ళు, కండరాల నొప్పులు, మలబద్ధకం, పచ్ౘ్కామెర్లు, మూత్రకోశ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • తంగేడు ఆకు ద్రావణం (1%) వంగ పంట నాశించే అక్షింతల పురుగు (హెనోసెపిలాక్న లిగ్నింటియో పంక్టేట, స్పోడోప్టెరా లిటూర, 2వ, 4వ దశ లార్వాలపై ఆకులు తినడాన్ని ఆటంక పరిచే చర్య (యాంటీఫీడెంట్), కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (చిత్ర, 1991).
  • తాజా తంగేడు ఆకులను సేకరించి నీటిలో బాగా కడిగి తర్వాత డిస్టిల్డ్ వాటర్‌లో కడిగి నీడలో ఆరబెట్టి, పొడి చేయాలి. 5 గ్రా. పొడిని 100 మి.లీ. నీటికి చొప్పున కలిపి 5 గంటలుంచాలి. తర్వాత వాట్‌మన్ నెం.1 ఫిల్టర్ పేపర్ ద్వారా వడపోయాలి. దీనికి 0.05% సర్ప్ పొడి కలిపి పిచికారి చేసి టీ పంటనాశించే ఎర్రనల్లి (ఓలిగోనైకస్ కాఫియే)ని సమర్ధవంతంగా నివారించవచ్చు. ఇది ఎర్రనల్లిని నివారించడానికి సులభమైన, ప్రత్యామ్నాయ, పర్యావరణహిత పద్ధతి (కుమార్, అతని అనుచరులు, 2016).
  • తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, అడవి ఆముదం, వేప, జిల్లేడు, ఈశ్వరవేరు, తుమ్మ, పెద్దమాను, మొక్కలన్నింటినీ ఆరబెట్టి పొడి చేసి ఆవుపేడ, ఆవు మూత్రంలో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. తర్వాత దీనిని వడపోసి 1 లీ. ద్రావణాన్ని 20 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేసి పంటల్లో పురుగులు, తెగుళ్ళును సమర్ధవంతంగా నివారించవచ్చు. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పార్థీనియంను నిర్మూలిద్దాం

పార్థీనియంను శాస్త్రీయంగా పార్థేనియం హిస్టరోఫోరస్ అని పిలుస్తారు. ఇది మెక్సికో ప్రాంతానికి చెందినది. ప్రస్తుతం భారతదేశం అంతటా విస్తరించి, వ్యవసాయం, పర్యావరణం మరియు ప్రజారోగ్యానికి తీవ్రమైన సమస్యగా మారింది. 1950లలో దిగుమతి సరుకుల ద్వారా ఇది అనుకోకుండా భారతదేశంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. దేశంలోకి వచ్చిన తరువాత ఇది వేగంగా వ్యాపించి పర్యావరణ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. 21 వ పార్థీనియం అవగాహన వారోత్సవం 16 ఆగష్టు నుండి 22 ఆగష్టు,2026 వరకు నిర్వహించబడింది.

పార్థీనియం దేశంలో అత్యంత సమస్యాత్మకమైన కలుపు మొక్కలలో ఒకటి. ఇది సుమారు 3.5 కోట్ల హెక్టార్ల భూమిలో వ్యాపించినట్లు అంచనా. తేలికపాటి నుంచి తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వరకు వివిధ ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో దీని సమస్య ఎక్కువగా ఉంది. మొదట రహదారులు, కాలువలు మరియు ఖాళీ ప్రదేశాల్లో కనిపించిన ఈ కలుపు, తరువాత పంట పొలాలు, అటవీ ప్రాంతాలు మరియు రక్షిత ప్రాంతాలకు కూడా వ్యాపించింది. జాతీయ ఉద్యానవనాల్లో గడ్డి కొరతకు కారణమై శాకాహార జంతువుల మనుగడను ప్రభావితం చేస్తోంది. పశుగ్రాస భూములను ఆక్రమించడం ద్వారా పశువులకు లభించే మేతను కూడా తగ్గిస్తోంది.

  1. పర్యావరణంపై ప్రభావాలు
  • వేగవంతమైన వ్యాప్తి: పార్థీనియం వేగంగా పెరిగి వివిధ వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలదు. అందువల్ల వ్యవసాయ భూముల నుంచి నీటి వనరుల పరిసరాల వరకు వివిధ ప్రాంతాలను ఆక్రమిస్తుంది.
  • జీవ వైవిధ్య నష్టం: స్థానిక మొక్కలతో పోటీ పడి వాటి పెరుగుదలను తగ్గిస్తుంది. దీని వల్ల సహజ ఆవాసాల్లో జీవ వైవిధ్యం తగ్గుతుంది.
  1. వ్యవసాయంపై ప్రభావాలు
  • పంటలతో పోటీ: పార్థీనియం పంటలతో పోటీ పడి నీరు, పోషకాలు మరియు సూర్యకాంతిని వినియోగిస్తుంది. దీంతో పంట దిగుబడి తగ్గుతుంది.
  • అల్లెలోపతి ప్రభావం: ఇది విడుదల చేసే కొన్ని రసాయనాలు ఇతర మొక్కల విత్తనాలు మొలకెత్తడం మరియు పెరుగుదలను అడ్డుకుంటాయి.
  1. ఆరోగ్య సమస్యలు
  • అలెర్జీ: పార్థీనియం పుప్పొడి తీవ్రమైన అలెర్జీని కలిగించవచ్చు. శ్వాసకోశ సమస్యలు, చర్మ అలెర్జీలు మరియు ఉబ్బసం వంటి సమస్యలు రావచ్చు.
  • వృత్తిపరమైన ఆరోగ్య ప్రమాదం: పార్థీనియం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయం లేదా చెత్త తొలగింపు వంటి పనులు చేసే వారికి దీర్ఘకాలికంగా ఈ కలుపుతో సంబంధం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
  1. పశువులపై ప్రభావాలు
  • విషపూరిత ప్రభావం: పార్థీనియం పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కలుషితమైన మేతను తినడం వల్ల చర్మ సమస్యలు, సూర్యకాంతికి అధిక సున్నితత్వం మరియు శ్వాసకోశ ఇబ్బందులు కలగవచ్చు.

పార్థీనియం నియంత్రణ
పార్థీనియం వేగంగా పెరగడం మరియు వివిధ పరిస్థితులకు తట్టుకోవడం వల్ల దీని నియంత్రణ సవాలుగా ఉంటుంది. అందువల్ల ఒకటి కంటే ఎక్కువ నియంత్రణ పద్ధతులను కలిపి ఉపయోగించడం ఉత్తమం.

  1. చేతితో తొలగింపు
  • చేతితో పీకడం: చిన్న స్థాయిలో ఉన్న పార్థీనియం మొక్కలను వేర్లతో సహా చేతితో పీకడం సమర్థవంతమైన పద్ధతి. ఇది శ్రమతో కూడుకున్నప్పటికీ స్థానికంగా ఉన్న కలుపును నియంత్రించడానికి ఉపయోగపడుతుంది.
  1. జీవ నియంత్రణ
  • కీటకాల ద్వారా నియంత్రణ: పార్థీనియంను తినే కొన్ని ప్రత్యేక కీటకాలను ఉపయోగించడం ద్వారా దీని పెరుగుదలను తగ్గించవచ్చు. ఉదాహరణకు, పార్థీనియం ఆకులను తినే Calligrapha bicolorata అనే బీటిల్ను జీవ నియంత్రణలో ఉపయోగిస్తారు.
  1. సాంప్రదాయ పద్దతులతో నియంత్రణ
  • పంట మార్పిడి: పంటలను మారుస్తూ సాగు చేయడం ద్వారా పార్థీనియం జీవచక్రాన్ని భంగపరచి వ్యవసాయ భూముల్లో దాని వ్యాప్తిని తగ్గించవచ్చు.
  • పోటీ పంటలు: పార్థీనియంతో పోటీ పడగల మరియు వేగంగా పెరిగే పంటలను ప్రోత్సహించడం ద్వారా ఈ కలుపు పెరుగుదలను తగ్గించవచ్చు.
  1. నివారణ చర్యలు
  • నిర్బంధ చర్యలు: పార్థీనియం కొత్త ప్రాంతాలకు వ్యాపించకుండా కలుషితమైన సరుకులు మరియు వాహనాల ద్వారా విత్తనాలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
    పరిశుభ్రమైన వ్యవసాయ పద్ధతులు: వ్యవసాయ యంత్రాలు మరియు పరికరాలను పూర్తిగా శుభ్రం చేయడం ద్వారా పార్థీనియం విత్తనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వ్యాపించకుండా నివారించవచ్చు.
  1. యాంత్రిక పద్దతులతో నియంత్రణ
  • కోత మరియు తుంచడం: పార్థీనియం మొక్కలను క్రమం తప్పకుండా కోయడం లేదా తుంచడం ద్వారా వాటి ఎత్తును నియంత్రించి విత్తన ఉత్పత్తిని తగ్గించవచ్చు. అయితే దీనివల్ల కలుపు పూర్తిగా నిర్మూలించబడకపోవచ్చు.
  1. ప్రజల్లో అవగాహన
  • అవగాహన కార్యక్రమాలు: పార్థీనియం వల్ల కలిగే హానికర ప్రభావాలు మరియు దాని నియంత్రణ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దీని వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చు.
  1. పరిశోధన మరియు పర్యవేక్షణ
  • నిరంతర పరిశోధన: పార్థీనియం కోసం కొత్త మరియు మరింత సమర్థవంతమైన నియంత్రణ పద్ధతులను అభివృద్ధి చేయడానికి నిరంతర పరిశోధన అవసరం.
  • పర్యవేక్షణ కార్యక్రమాలు: పార్థీనియం వ్యాప్తిని గమనించడం మరియు అమలు చేస్తున్న నియంత్రణ చర్యల ప్రభావాన్ని అంచనా వేయడం సమర్థవంతమైన నిర్వహణకు అవసరం.

పార్థీనియం అవగాహన వారోత్సవం
భారతదేశంలో పార్థీనియం విస్తరణ సమస్యను పరిష్కరించడంలో ICAR–Directorate of Weed Research (DWR) ముందంజలో ఉంది. పార్థీనియంపై విస్తృత అవగాహన మరియు సమష్టి చర్యల అవసరాన్ని గుర్తించి, DWR 2004లో ‘పార్థీనియం అవగాహన వారోత్సవం’నిర్వహణను ప్రారంభించింది. ఈ వారోత్సవం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ICAR సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs), వ్యవసాయ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు (NGOs) మరియు ఇతర సంస్థలను ఒక వేదికపైకి తీసుకువస్తుంది.

పార్థీనియం అవగాహన వారోత్సవం లక్ష్యాలు

  • సమాజంలో అవగాహన కల్పించడం: పార్థీనియం వల్ల వ్యవసాయం, పర్యావరణం మరియు ప్రజారోగ్యంపై కలిగే హానికర ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేయడం. దీని ఆక్రమణ స్వభావం, జీవ వైవిధ్యంపై ప్రభావం మరియు ఆరోగ్య ప్రమాదాలపై అవగాహన పెంచడం.
  • సమగ్ర కలుపు నిర్వహణ (IPM)ను ప్రోత్సహించడం: ప్రాంతానుసారంగా చేతితో తొలగింపు, రసాయన, జీవ మరియు సాంస్కృతిక నియంత్రణ పద్ధతులను సమన్వయంతో ఉపయోగించాల్సిన అవసరాన్ని తెలియజేయడం.
  • సమష్టి సహకారాన్ని పెంపొందించడం: పార్థీనియం సమస్యను పరిష్కరించడానికి పరిశోధనా సంస్థలు, వ్యవసాయ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు మరియు స్థానిక ప్రజల మధ్య సహకారాన్ని పెంచడం.
  • ఉత్తమ పద్ధతులను ప్రచారం చేయడం: పార్థీనియం నియంత్రణలో సమర్థవంతమైన పద్ధతులు, నివారణ చర్యలు మరియు పరిశుభ్రమైన వ్యవసాయ పద్ధతులను ప్రజలకు చేరవేయడం.

డా. కే. శేఖర్, సహాయ ఆచార్యులు (సేద్య విభాగం), వ్యవసాయ కళాశాల, హైద్రాబాద్
ఫోన్ : 9032128124

Read More

చాలా రకాల వ్యాధుల నియంత్రణకు ఉల్లి కషాయం

ఉల్లి కషాయం : ఉల్లిలో ఉండే ఆల్కలాయిడ్లు కూడా చాలా రకాల వ్యాధుల నియంత్రణలో ఉపయోగపడతాయి. ఉల్లి కషాయం వ్యాధి కారకాల పెరుగుదల నిలిపివేయుటలోను, తెగులు కారకాల బీజాలు మొలకెత్తుటను నియంత్రిస్తాయి.

పారిజాతం కషాయం : దీని ఆకుల నుండి తీసిన కషాయం బ్యాక్టీరియా తెగుళ్ళ నియంత్రణలో బాగా పనిచేస్తుంది.

గంగరావి కషాయం : ఈ చెట్టు ఆకుల కషాయం రైజెక్టోనియా కుళ్ళు తెగులు నియంత్రించుటలో బాగా పనిచేస్తుంది. ఇది ఆ శిలీంద్రం పెరుగుదలను నిలిపివేస్తుంది.

Read More

ఔషధ మొక్క…. నేల తంగేడు

నేల తంగేడు ఒక చిన్నపాటి ఏకవార్షిక లేదా బహువార్షిక మొక్క లేదా పొద. సుమారు 60-90 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు సంయుక్తం. పత్రకాలు 7-8 జతలుంటాయి. నూగు లేకుండా నున్నగా, లేత ఆకుపచ్చ పసుపు పచ్చ వర్ణం కలిగి ఉంటాయి. పూవులు పసుపు రంగులోను, కాయలు ఆకుపచ్చ, గోధుమ మిశ్రమ వర్ణంలో, గింజలు 5-7 వరకు ఉండి, దట్టమైన గోధుమ వర్ణం కలిగి నున్నగా ఉంటాయి.

సాధారణ నామం : పెన్నా / సునాముఖి / సనాయ్ శాస్త్రీయ నామం : క్యాసియా అంగుస్టిఫోలియా కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, కాయలకు ఔషధగుణాలున్నాయి. దీనికాయలలో సెన్నోసైడ్ ‘ఎ’, ‘బి’ అనే గ్లూకోసైడ్లు ఉంటాయి. ఆకులలో ఫ్లేవనాల్స్, ఎమోడిన్, రీన్, సెన్నోసైడ్ ‘ఎ’, ‘బి’ , ‘సి’, ‘డి’ ఉంటాయి.
  • ఆకులు, కాయలు మల బద్ధకాన్ని పోగొడతాయి. కొన్ని రకాల చర్మవ్యాధులు, కాలేయ మరియు ప్లీహానికి సంబంధించిన వ్యాధుల చికిత్సకు ఉపయోగపడతాయి.

వ్యవసాయరంగంలో

  • నేలతంగేడు కీటకనాశక చర్యలను కలిగి ఉంది (కామరాజ్, అతని అనుచరులు 2010).
  • నేలతంగేడు ద్రావణం తెల్లదోమ, బెమిసియా టబాసిపై అత్యధిక ప్రభావాన్ని చూపింది (బిర్గ్యుటి, అతని అనుచరులు, 2015).
  • క్యాసియాటోరాని ఒక సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

కుళ్ళు తెగులు నివారణకు నిమ్మగడ్డి కషాయం

నిమ్మగడ్డి కషాయం : నిమ్మగడ్డి కషాయం ముఖ్యంగా భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ యాజమాన్యంలో బాగా పనిచేస్తుంది. ఇది మాక్రోఫోమినా ఫాసియోలినా అనే శిలీంధ్రం కలుగజేసే కుళ్ళు తెగులు నివారణలో బాగా పనిచేస్తుంది.

ఉత్తరేణి కషాయం: ఉత్తరేణి కషాయం చాలా రకాల శిలీంధ్రాల నివారణకు పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా శిలీంధ్ర బీజాలను చంపి, శిలీంధ్రబీజాలు మొలకెత్తుటను కూడా ఆపివేస్తుంది. ఉత్తరేణి కషాయం బోట్రైటిస్ తెగులు నివారణకు బాగా పనిచేస్తుందని చాలామంది శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

విప్ప కషాయం : విప్ప బద్దలు మన అడవులలో విస్తారంగా దొరుకుతాయి. వీటికి తెగుళ్ళ యాజమాన్యంలో చాలా పాత్ర వుంది. విప్పను తెగుళ్ళ యాజమాన్యంలో మన భారతదేశంలో సంప్రదాయంగా వాడేవారని విన్నీపియెరా అనే ఆమె తన పుస్తకం ‘టెండింగ్ ది ఎర్త’లో పేర్కొన్నారు. విప్పలో ఉండే చాలా రకాల ఆల్కలాయిడ్లు తెగుళ్ళ యాజమాన్యంలో శిలీంధ్ర పెరుగుదల నిలిపి వేయుటలో పాత్ర వహిస్తాయి. దీని వలన వ్యాధి వ్యాప్తి ఆగిపోతుంది.

Read More

ఔషధ మొక్క…. సీమ మెట్ట తామర

ఇది సుమారు 1.5 మీ. ఎత్తు పెరిగే ఒక చిన్న పొద. దీని శాఖలు సమాంతరంగా విస్తరిస్తాయి. పత్రములు పక్షవత్ సంయుక్తం. కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. పత్రకములు 8-12 జతలు, వెడల్పుగా, గుండ్రంగా ఉంటాయి. మొదలు వంకరగా ఉంటుంది. కాడలు మరియు పత్రవృంతములు సాధారణంగా ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. పుష్పవిన్యాసం ఆకుల మొదలు నుండి లేదా కొమ్మల చివర్ల నుండి వస్తుంది. నిటారైన పుష్పగుచ్చాలు కల్గి ఉంటుంది. పూలు పసుపు రంగులో ఉంటాయి. కాయలు పొడవుగా కొద్దిగా నొక్కినట్లు ఉండి అంచులు రెక్కలలాగా ఉంటాయి. గింజలు అనేకం ఉండి నలుపు రంగులో ఉంటాయి. తేమ గల ప్రాంతాలలో మరియు సాగు నేలలలోను కలుపుగా బాగా పెరుగుతుంది. అందమైన పూల కొరకు కూడా దీనిని పెంచుతారు. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : రింగ్ వార్మ్ క్యాసియా / వింగ్‌డ్ సెన్నా / కాండిల్ బుష్ శాస్త్రీయ నామం : క్యాసియా అలాట కుటుంబం: సీసాల్పినియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు మరియు కాండం ఔషధగుణాలు కలిగి ఉంటాయి. వీటిలో ఆంత్రాగ్లూకోసైడ్లు, క్రైసోఫిన్ మరియు రీన్ అనే రసాయనాలు ఉన్నాయి. ఆకులు మరియు కాండమునకు శరీర భాగాలు కుళ్ళిపోకుండా చేసే గుణం ఉంది. విరేచనకారిగా పనిచేసి మలబద్ధకాన్ని నివారిస్తాయి.
  • దీనిని ఎడిమా, హెపాటైటిస్ మొదలగు జబ్బుల చికిత్సకూ, తామర, గజ్ౙి వంటి చర్మవ్యాదుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • సీమ మెట్ట తామర ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ పీకాలిస్, ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిలాబిలిస్‌పై యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (ఇగ్వె అండ్ ఓన్వు, 2015)
  • బెరడు మరియు ఆకుద్రావణాలు సాధారణ నల్ల చీమలు, ఎర్రచీమల పై విష చర్యను ప్రదర్శించాయి (ప్లూక్, 1999).
  • క్యాసియా నైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ తెల్లదోమ, బెమిసియా టబాసి పెద్ద పురుగులపై కీటక నాశక చర్యను, అనోఫెలెస్ గాంబియే దోమల లార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అజిర్ౙెస్, అతని అనుచరులు, 2008).
  • దీని ఆకులలోని ఎమోడిన్ యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించింది (అయో, అతని అనుచరులు, 2007).
  • సీమ మెట్టతామర ఆకుల ఎసిటోన్, ఇథనాల్ ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, ఎస్కెరిచియా కోలి, విబ్రియో కలరా, క్లెబ్సియెల్లా న్యుమోనియేపై యాంటి మైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి (సకార్కర్, అతని అనుచరులు, 1998).
  • దీని ఆకులలో ఉన్న క్యాసియాక్ౙాంతోన్, కీంప్‌ఫెరాల్, గ్లెåకోసైడ్స్, క్రైసోఫినాల్స్, ఐసోక్రైసోఫినాల్ చీమలను సమర్ధవంతంగా వికర్షించాయి (వాట్ అండ్ బ్రేయర్, 1962, ప్రసాద్, 2007)
  • సీమ మెట్ట తామర మానవులలో వ్యాధులు కలిగించే క్యాండిడా ఆల్బికాన్స్, మైక్రోస్పోరం కానిస్, ట్రైకోఫైటాన్ మెంటగ్రోఫైట్స్ శిలీంద్రపెరుగుదలను అరికట్టింది (టమోతి, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క భాగాలను స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సబ్‌టైలిస్ కలిగించే వ్యాధుల నివారణలో ఉపయోగించవచ్చు. (అలలార్, అతని అనుచరులు, 2012).
  • ఈ మొక్క ఆకుల ఇథనాల్ ద్రావణంతో తయారు చేసిన ఆయింట్‌మెంట్లు పశువులలో డెర్మటోఫైలోసిస్ వ్యాధిని సమర్ధవంతంగా నివారించాయి. (ఆలిఎమ్మాన్యుయెల్, అతని అనుచరులు, 2003).
  • దీని ఆకులు, కాండం, బీన్స్ ద్రావణాలు బలమైన యాంటిబాక్టీరియల్ చర్యను, బలహీనమైన యాంటిఆక్సిడెంట్ చర్యను ప్రదర్శించాయి (వహాల్, అతని అనుచరులు, 2014).
  • సీమ మెట్టతామర మొక్కను అరటి కాండంతొలుచు పురుగు, ఒడోయిపోరస్ లాంగికోల్లిస్ నివారణలో ఉపయోగించవచ్చు.(బాలన్, దయానందన్, 2016).
  • ఈ మొక్క బెరడు పొడి టిక్స్‌ని నాశనం చేస్తుంది (సోరోన్)
  • సీమ మెట్టతామర సాల్వెంట్ ద్రావణాలు కాల్లసోబ్రూకస్ కైనెన్సిస్‌పై శక్తివంతమైన విష చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011)
  • దీని కాండం బెరడు ద్రావణంలో ఆల్కలాయిడ్స్, సపానిన్స్, ఫ్లేవనాయిడ్స్, టానిన్స్, గ్లెåకోసైడ్స్ ఉంటాయి (అవంతి అండ్ సుబ్బలక్ష్మి, 2016).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వ్యవసాయంలో బయోచార్ ఉపయోగాలు

బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పంటల పెరుగుదల, దిగుబడి మరియు సాగు స్థిరత్వాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బయోచార్ వినియోగం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవి:

• నేలలో సేంద్రియ కార్బన్ పెరిగి భూసారం మెరుగుపడుతుంది.
• నేలలో పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి, మొక్కలకు అవి క్రమంగా అందుబాటులోకి వస్తాయి.
• నత్రజని వంటి పోషకాలు వర్షం లేదా నీటితో కొట్టుకుపోవడం (లీచింగ్) తగ్గి, ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
• నేల నిర్మాణం మెరుగుపడి, గాలి ప్రసరణ మరియు వేర్ల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
• నేలలో నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం పెరగడంతో ఎండ పరిస్థితుల్లో కూడా పంటలు మెరుగ్గా తట్టుకుంటాయి.
• ఆమ్ల నేలల్లో నేల ప్రతిచర్య (pH) సమతుల్యంగా ఉండేందుకు కొంతవరకు సహాయపడుతుంది.
• బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు మరియు వానపాములకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.
• నేలలో పోషకాల నష్టాన్ని తగ్గించడం ద్వారా రసాయన ఎరువుల అవసరాన్ని కొంత మేర తగ్గించవచ్చు.
• నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.
• వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే వాతావరణ అనుకూల వ్యవసాయ సాంకేతికతగా బయోచార్ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది.
• బయోచార్‌లోని విస్తారమైన ఉపరితల వైశాల్యం మరియు సూక్ష్మ రంధ్రాల నిర్మాణం నీరు, పోషకాలను నిల్వ ఉంచడంతో పాటు నేలలోని ఉపయోగకరమైన జీవసంపద అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More