ఎల్నినో పరిస్థితుల్లో పాడి పశువులకు పశుగ్రాసాల ఎంపిక

    ఎల్నినో పరిస్థితుల్లో సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం అస్థిరంగా ఉండటం, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు మరియు నీటి లభ్యతలో మార్పులు వ్యవసాయంతో పాటు పశుపోషణపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026లో ఎల్నినో ప్రభావాలను ఎదుర్కొనేందుకు పంటలతో పాటు పశుసంపద, పశుగ్రాసం మరియు నీటి వనరుల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ICAR సంస్థలు కూడా సూచిస్తున్నాయి.ఎల్నినో పరిస్థితుల్లో పచ్చిమేత లభ్యత తగ్గితే పశువులకు పోషక పదార్థాల కొరత ఏర్పడి, పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల “పశుగ్రాస భద్రత – పాడి పశువుల ఆరోగ్యం – పాల ఉత్పత్తి – రైతు ఆదాయం” అనే నాలుగు అంశాలను సమగ్రంగా చూడాలి

పశుగ్రాసం అనగానే మన రైతులకు వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ వంటి పంట అవశేషాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటిలో పశువులకు అవసరమైన అన్ని పోషక పదార్థాలు తగిన స్థాయిలో ఉండవు. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల్లో పచ్చిమేత కొరత ఏర్పడితే కేవలం ఎండుమేతపై ఆధారపడటం వల్ల పశువుల పోషక అవసరాలు పూర్తిగా తీరకపోవచ్చు.

అదే సమయంలో జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి ధాన్యాలను అధికంగా పశుదాణాలో ఉపయోగించడం ఆర్థికంగా కూడా భారమవుతుంది. కాబట్టి రైతులు తమ భూమి, నీటి లభ్యత మరియు పశువుల సంఖ్యకు అనుగుణంగా పచ్చిమేత + ఎండుమేత + కాయజాతి పశుగ్రాసాలు + అవసరమైన మిశ్రమ దాణా కలిపి సమతుల్య పశుగ్రాస ప్రణాళికను రూపొందించుకోవాలి.

I.ఎల్నినో పరిస్థితుల్లో పశుగ్రాసాల ఎంపిక ఎలా ఉండాలి

  1. ఒకటి లేదా రెండు పాడి పశువులు ఉన్న రైతులు
    సన్నకారు మరియు చిన్నకారు రైతులు తమ ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
    • సుబాబుల్, అవిస వంటి పశుగ్రాస చెట్లను పెంచుకోవాలి.
    • ఇంటి పరిసరాలు, పొలాల గట్లను పశుగ్రాస వనరులుగా ఉపయోగించుకోవాలి.
    • నీటి లభ్యత ఉన్నట్లయితే కొంత భూమిలో శాశ్వత పచ్చిమేతను సాగు చేయాలి.
    • పంట అవశేషాలను వృథా చేయకుండా ఎండుమేతగా నిల్వ చేసుకోవాలి.
    • ఎల్నినో సమయంలో అత్యవసర పరిస్థితులకు ముందుగానే పశుగ్రాస నిల్వ చేసుకోవాలి.
  2. మధ్యస్థ స్థాయిలో పాడి పశువులు ఉన్న రైతులు
    పాడి పశువుల సంఖ్య పెరిగిన కొద్దీ రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని తప్పనిసరిగా పశుగ్రాస సాగుకు కేటాయించాలి.

నీటి వసతి ఉన్న భూముల్లో హైబ్రిడ్ నేపియర్ రకాలు (CO-1, CO-2, CO-3) వంటి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు లూసర్న్, అలసంద, అనుములు, హెడ్జ్ లూసర్న్, స్టైలో వంటి కాయజాతి పశుగ్రాసాలను కూడా పెంచుకోవాలి.
గడ్డిజాతి మరియు కాయజాతి పశుగ్రాసాలను కలిపి మేపడం ద్వారా పశువులకు మెరుగైన పోషక సమతుల్యతను అందించవచ్చు.

  1. పెద్దస్థాయి పాడి పరిశ్రమలు
    వాణిజ్య స్థాయిలో పాడి పరిశ్రమ నిర్వహించే రైతులు “సంవత్సరం పొడవునా పశుగ్రాస లభ్యత” అనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించుకోవాలి.
    • నీటి వసతి ఉన్న చోట బహువార్షిక పశుగ్రాసాలు.
    • వర్షాధార ప్రాంతాల్లో సీజనల్ పశుగ్రాసాలు.
    • అదనపు పచ్చిమేతను సైలేజీగా నిల్వ చేయడం.
    • పంట అవశేషాలను శాస్త్రీయ పద్ధతిలో ఎండుమేతగా నిల్వ చేయడం.
    • కాయజాతి పశుగ్రాసాల సాగు.
    • అత్యవసర పరిస్థితులకు ముందుగానే పశుగ్రాస బ్యాంకును ఏర్పాటు చేయడం.

II.నీటి లభ్యత ఆధారంగా పశుగ్రాసాల ఎంపిక
ఎల్నినో పరిస్థితుల్లో నీరు అత్యంత విలువైన వనరు. అందువల్ల నీటి లభ్యతను బట్టి పశుగ్రాసాలను ఎంపిక చేయాలి.

A.నీటి వసతి ఉన్న భూముల్లో:
హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, లూసర్న్, పేరాగడ్డి వంటి బహువార్షిక పశుగ్రాసాలను సాగు చేయవచ్చు.

B.నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో:
జొన్న, సజ్జ, మొక్కజొన్న వంటి సీజనల్ పశుగ్రాసాలను వర్షాధారంగా సాగు చేయవచ్చు.

C.నీరు నిలిచే ప్రాంతాల్లో:
పేరాగడ్డి వంటి రకాలను అనువైన పరిస్థితుల్లో సాగు చేయవచ్చు

III.ఎల్నినో సమయంలో పశుగ్రాస భద్రత కోసం రైతులు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు

  1. తోటలలో / చెట్ల నీడల్లో – అనువైన పశుగ్రాసాలు : గినిగడ్డి, (మకుని), స్టైలో
  2. మిశ్రమ పంటగా పనికివచ్చే అనువైన పశుగ్రాసాలు : అలసంద, స్టైలో
  3. చవుడు భూములలో- అనువైన పశుగ్రాసాలు : రోడ్స్ గడ్డి
  4. తక్కువ వర్షపాతము గల ప్రాంతాలకు – అనువైన పశుగ్రాసాలు : సజ్జ
  5. నల్లరేగడి భూములకు – అనువైన పశుగ్రాసాలు : ఆఫ్రికన్ టాల్ రకపు మొక్కజొన్న ఎస్.ఎస్.జి
  6. ఎఱ్ఱభూములు, తేలిక పాటి భూములకు – అనువైన పశుగ్రాసాలు : ఏకవార్షికాలు- ఎస్.ఎస్.జి, ఎమ్.పి.చారి, సజ్జరకాలు బహువార్షికాలు- స్టైలో
  7. బంజరు, పడావు భూములలో – అనువైన పశుగ్రాసాలు : స్టైలో, అంజాన గడ్డి
  8. నీరునిలువ ఉండు భూములలో – అనువైన పశుగ్రాసాలు : పేరాగడ్డి
  9. ఎండుమేతగా నిలువ చేయుటకు – అనువైన పశుగ్రాసాలు : వరిగడ్డి, జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, జనుము, అంజాన గడ్డి, గినిగడ్డి
  10. సైలేజి (పాతరగడ్డి) గా వాడుటకు – అనువైన పశుగ్రాసాలు : జొన్న, మొక్కజొన్న, నేపియర్ రకాలు
  11. యూరయాతో సుపోషకం చేసుకోవడానికి – అనువైన పశుగ్రాసాలు : వరిగడ్డి, ముక్కలుగా నరికిన జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప
  12. ముక్కలుగా (చాఫింగ్) నరికి మేపుటకు – అనువైన పశుగ్రాసాలు : జొన్న, సజ్జ, మొక్కజొన్న రకాలు
    ఇలాంటి ముందస్తు ప్రణాళిక ఎల్నినో వంటి వాతావరణ ఒత్తిడి సమయంలో పశుగ్రాస కొరతను తగ్గించడంలో పశుగ్రాస భద్రత, సైలేజీ తయారీ మరియు contingency preparedness సహాయపడుతుంది.

డా. ఎం. గంగా దేవి, సీనియర్ సైంటిస్ట్ (అగ్రానమీ),
డా. ఎం. యుగంధర్ కుమార్ , ప్రిన్సిపల్ సైంటిస్ట్, డా. కె. రవిచంద్ర, సైంటిస్ట్,
డా. సౌజన్య లక్ష్మి, సైంటిస్ట్
కృషి విజ్ఞాన కేంద్రం, లాం, గుంటూరు. Ph: 9490035258

Read More

వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం పెద్దపీట: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతులు తమకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడంతో పాటు, వారి అవసరాలు, డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.

నాణ్యతకు ప్రాధాన్యత.. పరీక్షించిన యంత్రాలే రైతులకు సరఫరా…

యాంత్రీకరణ పథకం కింద రైతులకు నాణ్యమైన, ప్రమాణాలు కలిగిన వ్యవసాయ యంత్ర పరికరాలను మాత్రమే అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. తయారీదారులు, సరఫరాదారులు అందించే ఉత్పత్తులను ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ లేదా కేంద్ర వ్యవసాయ శాఖ (DA&FW) ద్వారా గుర్తింపు పొందిన సంస్థల వద్ద పరీక్షించిన తర్వాతనే రైతులకు సరఫరా చేస్తున్నామని తెలిపారు.

రైతుల భద్రత, యంత్రాల నాణ్యత, పనితీరు వంటి అంశాల్లో ఎలాంటి రాజీ లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

గతంలో ఉన్న సమస్యలకు ఇక తావులేదు…

యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పరికరాలు వారు కోరుకున్న విధంగా లభించడం లేదని, సబ్సిడీపై అందించే యంత్రాలకు, మార్కెట్లో లభించే యంత్రాలకు తేడా ఉంటుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రస్తావించారు. సబ్సిడీ పరికరాలకు ఇచ్చే కొటేషన్ ధరలు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. డిమాండ్ ఉన్న యంత్రాలను ఎక్కువగా అందించాలని, డ్రోన్లను కూడా అధిక సంఖ్యలో అందించాలని కోరారు.

దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ, ఎమ్మెల్సీ ప్రస్తావించిన అంశాలు గతంలో ఉన్న పరిస్థితులకు సంబంధించినవని, ప్రస్తుతం ఆ విధానం లేదని స్పష్టం చేశారు. రైతులు తమకు నచ్చిన పనిముట్టును, తమకు నచ్చిన కంపెనీ నుంచి కొనుగోలు చేసుకునే విధంగా ప్రస్తుత యాంత్రీకరణ విధానాన్ని రూపొందించామని తెలిపారు.

గత ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది…
గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను వినియోగించుకోకుండా యాంత్రీకరణ పథకాన్ని నిలిపివేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించి తిరిగి అమలులోకి తీసుకొచ్చిందన్నారు.

వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం ద్వారా రైతులపై శారీరక శ్రమ తగ్గడంతో పాటు, సాగు ఖర్చులు తగ్గి, సమయానికి వ్యవసాయ పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

రూ.63.11 కోట్లతో 15,565 యంత్ర పరికరాల సరఫరా…

2025-26 ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకం కోసం ప్రభుత్వం రూ.71 కోట్లు కేటాయించగా, రూ.63.11 కోట్లు ఖర్చు చేసి 15,565 వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు సరఫరా చేసినట్లు మంత్రి వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణ పథకానికి రూ.147.91 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రైతుల డిమాండ్‌ను అనుగుణంగా, అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను యాంత్రీకరణ పథకం కింద సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

చిన్న, సన్నకారు రైతులకు 50 శాతం సబ్సిడీ…

యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు అందించే పరికరాలపై ప్రభుత్వం గణనీయమైన సబ్సిడీని అందిస్తోందని మంత్రి తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతులు, మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో వ్యవసాయ యంత్ర పరికరాల కొనుగోలుకు రైతులపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఎంప్యానెల్‌మెంట్‌లో రైతులకు భాగస్వామ్యం…

రైతులు కోరుకునే విధంగా వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉండేలా ఎంప్యానెల్‌మెంట్ కమిటీలో రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించినట్లు మంత్రి తెలిపారు. కమిటీలో శాస్త్రవేత్తలు, టెక్నికల్ ఇంజనీర్లు, అధికారులతో పాటు ఆదర్శ రైతులు, ఎఫ్‌పీవోలు (FPOs) ప్రతినిధులను కూడా భాగస్వాములను చేశామని వివరించారు. రైతుల వాస్తవ అవసరాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, వివిధ ప్రాంతాల్లో సాగు విధానాలను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాల ఎంపిక జరిగేలా ఈ విధానం రూపొందించామని తెలిపారు.

యాంత్రీకరణ పథకం కింద పరికరాలను సరఫరా చేసేందుకు 444 కంపెనీలు ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని మంత్రి వెల్లడించారు. అయితే ప్రతి కంపెనీని ఎంపిక చేయడం జరగదని, నిర్దేశిత ప్రమాణాలను పాటించే కంపెనీలను, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత సంస్థలు గుర్తించి ఎంపిక చేసే ప్రమాణాలను అనుసరించే కంపెనీలను మాత్రమే జాబితాలో చేర్చుతామని స్పష్టం చేశారు.

దీంతో రైతులకు నాణ్యత లేని లేదా ప్రమాణాలు లేని యంత్ర పరికరాలు అందకుండా చూడటంతో పాటు, నాణ్యమైన ఉత్పత్తులకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు.

రైతుకే పూర్తి స్వేచ్ఛ.. నచ్చిన కంపెనీ నుంచే కొనుగోలు…

యాంత్రీకరణ పథకంలో రైతుకు కొనుగోలు విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతు తనకు నచ్చిన పనిముట్టును, తనకు నచ్చిన కంపెనీ దగ్గరే కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతుల తరఫున ఒక నిర్దిష్ట కంపెనీ నుంచి మాత్రమే యంత్రాన్ని కొనుగోలు చేయాలని నిర్దేశించడం లేదన్నారు. అదేవిధంగా, రైతులు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణమైన తమకు నచ్చిన పరికరాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు.
 
సబ్సిడీ నేరుగా రైతు ఖాతాలోకి…

యాంత్రీకరణ పథకంలో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నామని చెప్పారు.

దళారులకు, మధ్యవర్తులకు అవకాశం లేకుండా రైతుకు నేరుగా ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. రైతు తన అవసరానికి అనుగుణంగా పరికరాన్ని ఎంపిక చేసుకుని కొనుగోలు చేసుకునే అవకాశం ఉండటంతో పాటు, సబ్సిడీ కూడా నేరుగా రైతు ఖాతాలో జమ కావడం ద్వారా పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.

రైతుల డిమాండ్‌కు అనుగుణంగా యంత్రాల సరఫరా…

రాష్ట్రంలో పంటల సాగు విధానాలు, రైతుల అవసరాలలో ఉండే అసమానతల వలన, యాంత్రీకరణకు ఉన్న డిమాండ్ ప్రాంతాల వారిగా భిన్నంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అందువల్ల రైతులకు అవసరం లేని పరికరాలను పెద్ద ఎత్తున సరఫరా చేయడం కాకుండా, రైతుల నుంచి వచ్చే డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన యంత్రాలను అందుబాటులోకి ఉంచుతున్నామని స్పష్టం చేశారు.

డ్రోన్లు సహా ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరికరాలకు పెరుగుతున్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోందన్నారు.

ఆయిల్‌పామ్ సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం…

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, వచ్చే మూడు సంవత్సరాల్లో మరో 6 లక్షల ఎకరాలను ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అనుగుణంగా రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను కూడా యాంత్రీకరణ పథకం కింద అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగులో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న అత్యుత్తమ యంత్ర పరికరాలను గుర్తించి, అవసరమైన వాటిని దిగుమతి చేసుకుని రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

ఈ యంత్ర పరికరాలను ఫ్యాక్టరీ వద్దే రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్‌పామ్ సాగులో యాంత్రీకరణ పెంచి, రైతుల శ్రమను తగ్గించడంతో పాటు ఉత్పాదకతను పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

రైతు ప్రయోజనమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, రైతుల శ్రమను తగ్గించడం, సాగు ఖర్చులను తగ్గించడం, వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు యాంత్రీకరణ కీలకమని మంత్రి తుమ్మల అన్నారు.

రైతులకు అవసరమైన పరికరాలను వారి డిమాండ్‌కు అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, నాణ్యత విషయంలో రాజీ పడకుండా, సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ పారదర్శకమైన, రైతు కేంద్రిత యాంత్రీకరణ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.

రైతు ఏ పనిముట్టు కోరుకుంటున్నాడో, ఏ కంపెనీ పరికరం తనకు అనుకూలంగా ఉంటుందో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకే ఉండేలా ప్రభుత్వం విధానాలను రూపొందించిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునిక యాంత్రీకరణను మరింత విస్తరించి, రాష్ట్ర రైతాంగానికి మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

Read More

కూరగాయల్లో మల్చింగ్ పద్ధతి – నీటి పొదుపు మరియు కలుపు నివారణ

కూరగాయల సాగులో నీటి లభ్యత, కలుపు మొక్కల నియంత్రణ మరియు నేలలో తేమను నిలుపుకోవడం రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో నేల నుంచి నీరు ఆవిరైపోవడం వల్ల పంటకు అందుబాటులో ఉండే తేమ తగ్గుతుంది. అదే సమయంలో కలుపు మొక్కలు నీరు, పోషకాలు, వెలుతురు కోసం ప్రధాన పంటతో పోటీ పడుతూ దిగుబడిని తగ్గిస్తాయి.
ఈ సమస్యలకు సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారాల్లో మల్చింగ్ పద్ధతి ఒకటి. మొక్కల చుట్టూ లేదా పంట వరుసల మధ్య నేలపై సేంద్రియ లేదా కృత్రిమ పదార్థాలతో ఒక పొరను ఏర్పాటు చేయడాన్ని మల్చింగ్ అంటారు. సరైన పద్ధతిలో మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమను నిలుపుకోవడంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను నియంత్రించవచ్చు.

మల్చింగ్ అంటే ఏమిటి?
పంట మొక్కల చుట్టూ నేల ఉపరితలాన్ని పూర్తిగా లేదా కొంతమేర కప్పే విధంగా వివిధ పదార్థాలను పరచడాన్ని మల్చింగ్ అంటారు. మల్చింగ్ పదార్థాలు నేలపై ఒక రక్షణ పొరలా పనిచేస్తాయి.
మల్చింగ్లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి:

  1. సేంద్రియ మల్చింగ్
  2. అసేంద్రియ లేదా కృత్రిమ మల్చింగ్
    పంట, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, అందుబాటులో ఉన్న వనరులు మరియు రైతు పెట్టుబడి సామర్థ్యాన్ని బట్టి మల్చింగ్ విధానాన్ని ఎంపిక చేసుకోవాలి.

సేంద్రియ మల్చింగ్
సేంద్రియ పదార్థాలతో నేలను కప్పే పద్ధతిని సేంద్రియ మల్చింగ్ అంటారు. ఎండిన గడ్డి, వరి గడ్డి, పంట అవశేషాలు, ఎండిన ఆకులు, కొబ్బరి పీచు, చెక్క పొట్టు వంటి పదార్థాలను ఉపయోగించవచ్చు.
సేంద్రియ మల్చింగ్ వల్ల నేలపై నేరుగా సూర్యరశ్మి పడకుండా ఉండటంతో నేల ఉష్ణోగ్రతలో తీవ్రమైన మార్పులు తగ్గుతాయి. కాలక్రమేణా ఈ పదార్థాలు కుళ్లి నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతాయి.

సేంద్రియ మల్చింగ్ ప్రయోజనాలు
• నేలలో తేమను నిలుపుతుంది.
• కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది.
• నేల ఉష్ణోగ్రతను కొంతవరకు నియంత్రిస్తుంది.
• నేలపై వర్షపు చినుకుల ప్రత్యక్ష ప్రభావాన్ని తగ్గిస్తుంది.
• సేంద్రియ పదార్థం కుళ్లిన తర్వాత నేల సారాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
• పంట అవశేషాలను ఉపయోగించుకోవడం ద్వారా వ్యర్థాల నిర్వహణకు తోడ్పడుతుంది.
అయితే చీడపీడలు లేదా వ్యాధులు సోకిన పంట అవశేషాలను మల్చింగ్ కోసం ఉపయోగించకూడదు.

ప్లాస్టిక్ మల్చింగ్
కూరగాయల సాగులో వివిధ రకాల ప్లాస్టిక్ మల్చింగ్ పదార్థాలను కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వెండి-నలుపు, నలుపు మరియు ఇతర రంగుల మల్చింగ్ షీట్లను పంట అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు.
ప్లాస్టిక్ మల్చింగ్లో షీట్ను నేలపై సరిగ్గా పరచి, మొక్కలు నాటే ప్రాంతాల్లో మాత్రమే తగిన పరిమాణంలో రంధ్రాలు చేయాలి. షీట్ అంచులను నేలలో బిగించి ఉంచడం వల్ల గాలి లేదా వర్షం కారణంగా షీట్ తొలగిపోకుండా ఉంటుంది.

నీటి పొదుపులో మల్చింగ్ పాత్ర
మల్చింగ్ యొక్క ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి నేల నుంచి నీరు ఆవిరైపోవడాన్ని తగ్గించడం. మల్చింగ్ పొర నేల ఉపరితలాన్ని కప్పి ఉంచడం వల్ల సూర్యరశ్మి నేరుగా నేలను తాకదు. ఫలితంగా నేలలోని తేమ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

బిందు సేద్యంతో మల్చింగ్ను కలిపి ఉపయోగించినప్పుడు నీటిని మొక్కల వేర్ల ప్రాంతానికి సమర్థవంతంగా అందించవచ్చు. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
అయితే మల్చింగ్ ఉన్నంత మాత్రాన నీటి అవసరం పూర్తిగా తగ్గిపోతుందని భావించకూడదు. పంట దశ, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు మరియు మొక్కల అవసరాన్ని బట్టి నీటి సరఫరాను సర్దుబాటు చేయాలి.

కలుపు మొక్కల నివారణ
కలుపు మొక్కలు కూరగాయ పంటలతో నీరు, పోషకాలు, వెలుతురు మరియు స్థలం కోసం పోటీ పడతాయి. ముఖ్యంగా పంట ప్రారంభ దశలో కలుపు అధికంగా ఉంటే మొక్కల పెరుగుదల మందగించి దిగుబడిపై ప్రభావం పడుతుంది.
మల్చింగ్ పొర నేలను కప్పి ఉంచడం వల్ల కలుపు విత్తనాలకు అవసరమైన వెలుతురు అందకుండా చేస్తుంది. ఫలితంగా కలుపు మొక్కలు మొలకెత్తడం మరియు పెరుగుదల తగ్గుతుంది.
అయితే మల్చింగ్ చేయడానికి ముందే పొలంలో ఉన్న కలుపు మొక్కలను తొలగించడం మంచిది. లేకపోతే ఇప్పటికే పెరిగిన కలుపు మొక్కలు మల్చింగ్ పొరను దాటి బయటకు రావచ్చు.

నేల ఉష్ణోగ్రతపై ప్రభావం
మల్చింగ్ నేల ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎండాకాలంలో నేల అధికంగా వేడెక్కకుండా కొంత రక్షణ కల్పిస్తుంది. మరోవైపు చల్లటి వాతావరణంలో కొన్ని రకాల మల్చింగ్ పదార్థాలు నేల ఉష్ణోగ్రతను అనుకూల స్థాయిలో ఉంచడానికి సహాయపడతాయి.
అయితే మల్చింగ్ పదార్థం రంగు, మందం మరియు రకాన్ని బట్టి నేల ఉష్ణోగ్రతపై ప్రభావం మారుతుంది. కాబట్టి పంట మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మల్చింగ్ పదార్థాన్ని ఎంపిక చేసుకోవాలి.

కూరగాయల పంటల్లో మల్చింగ్
టమాటా, మిరప, వంకాయ, దోసకాయ, కాకరకాయ, బీరకాయ, సొరకాయ, పుచ్చకాయ వంటి అనేక పంటల్లో మల్చింగ్ను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా బెడ్ పద్ధతిలో సాగు చేసే కూరగాయ పంటల్లో మల్చింగ్ చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది.

తీగజాతి కూరగాయల్లో మల్చింగ్ చేయడం ద్వారా తీగలు నేలపై పాకుతున్నప్పుడు కాయలు నేరుగా తడి నేలతో సంబంధం కలిగి ఉండే పరిస్థితిని కొంతవరకు తగ్గించవచ్చు. దీనివల్ల కాయల నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంటుంది.

మల్చింగ్ ఏర్పాటు చేసే విధానం
మల్చింగ్కు ముందు నేలను మంచిగా తయారు చేసి, అవసరమైన ప్రాథమిక ఎరువులను నేలలో కలపాలి. బిందు సేద్యం ఉంటే మల్చింగ్ షీట్ పరచడానికి ముందే డ్రిప్ లైన్లను సరైన స్థానంలో ఏర్పాటు చేయాలి.
తర్వాత మల్చింగ్ పదార్థాన్ని పంట వరుసలపై సమానంగా పరచాలి. ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించినప్పుడు షీట్ను నేలకు బిగుతుగా అమర్చి అంచులను మట్టితో కప్పాలి.
మొక్క కాండం చుట్టూ మల్చింగ్ పదార్థాన్ని కాండానికి అతిదగ్గరగా నొక్కకూడదు. కొంత ఖాళీ ఉంచడం ద్వారా కాండం వద్ద అధిక తేమ నిల్వ ఉండకుండా చూడాలి.

మల్చింగ్లో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మల్చింగ్ అనేక ప్రయోజనాలను అందించినప్పటికీ సరైన విధంగా ఉపయోగించకపోతే సమస్యలు కూడా ఏర్పడవచ్చు.
• వ్యాధులు లేదా పురుగులు సోకిన పంట అవశేషాలను సేంద్రియ మల్చింగ్గా ఉపయోగించకూడదు.
• ప్లాస్టిక్ మల్చింగ్ను ఉపయోగించిన తర్వాత పొలంలో వదిలిపెట్టకూడదు.
• ప్లాస్టిక్ మల్చింగ్ను సేకరించి, స్థానిక వ్యర్థ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా పునర్వినియోగం లేదా పారవేయడం చేయాలి.
• మల్చింగ్ ఉన్నందున నీటి అవసరం లేదని భావించకూడదు.
• అధిక తేమ ఉండే ప్రాంతాల్లో మల్చింగ్ మందం మరియు నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
• మల్చింగ్ కింద చీడపీడలు లేదా ఎలుకలు ఆశ్రయం పొందుతున్నాయా అనే విషయాన్ని క్రమం తప్పకుండా పరిశీలించాలి.
• పంటకు అనుగుణంగా సరైన మల్చింగ్ పదార్థాన్ని ఎంపిక చేయాలి.

మల్చింగ్ మరియు బిందు సేద్యం
మల్చింగ్ + బిందు సేద్యం కలయిక కూరగాయల సాగులో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడే విధానం. బిందు సేద్యం ద్వారా నీటిని మొక్కల వేర్ల ప్రాంతానికి అందించగా, మల్చింగ్ ద్వారా నేల నుంచి తేమ ఆవిరైపోవడం తగ్గుతుంది.

ఈ రెండు పద్ధతులను సమన్వయంతో ఉపయోగించడం ద్వారా నీటి నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టవచ్చు. అయితే నీటి పొదుపు పరిమాణం పంట, నేల, వాతావరణం మరియు నిర్వహణ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది.

రైతులకు ఆర్థిక ప్రయోజనాలు
మల్చింగ్ వల్ల కలుపు మొక్కల నియంత్రణకు అవసరమయ్యే శ్రమ కొంతవరకు తగ్గవచ్చు. నేలలో తేమ నిల్వ ఉండటం వల్ల నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించవచ్చు. కాయల నాణ్యత మెరుగుపడితే మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉంటుంది.

అయితే ప్లాస్టిక్ మల్చింగ్కు ప్రారంభ పెట్టుబడి అవసరం. కాబట్టి రైతులు పంట ధర, సాగు కాలం, నీటి లభ్యత, కలుపు సమస్య మరియు మల్చింగ్ పదార్థం ఖర్చును పరిగణనలోకి తీసుకుని ఆర్థికంగా అనుకూలమైన పద్ధతిని ఎంచుకోవాలి.

కూరగాయల సాగులో మల్చింగ్ పద్ధతి నేల తేమను సంరక్షించడం, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించడం, నేల ఉష్ణోగ్రతను నియంత్రించడం మరియు పంట నాణ్యతను మెరుగుపరచడంలో ఉపయోగపడే సమర్థవంతమైన పద్ధతి. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో మరియు అధిక విలువ కలిగిన కూరగాయ పంటల్లో దీన్ని శాస్త్రీయంగా ఉపయోగించడం ద్వారా సాగు సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

సేంద్రియ లేదా ప్లాస్టిక్ మల్చింగ్ను పంట, నేల మరియు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలి. బిందు సేద్యంతో మల్చింగ్ను సమన్వయం చేయడం ద్వారా నీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ ఉపయోగించిన రైతులు పంట అనంతరం దానిని సక్రమంగా తొలగించి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి.

అందువల్ల “తక్కువ నీటితో సమర్థవంతమైన సాగు – తక్కువ కలుపుతో మెరుగైన పంట” అనే లక్ష్యాన్ని సాధించడానికి కూరగాయల సాగులో మల్చింగ్ పద్ధతిని రైతులు శాస్త్రీయ అవగాహనతో స్వీకరించవచ్చు.

డా. టి. థామ్సన్, డా. టి. తేజస్విని, డా. వి. సుధావాణి
డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం
ఫోన్ : 9494963291

Read More

ఔషధమొక్క… మండూకబ్రహ్మి / మండూక్‌బ్రమ్మి

ఇది ఒక నేల మీద ప్రాకే ఔషధ మొక్క. మొక్క కణుపు నుండి వేర్లు ఏర్పడతాయి. ఆకులు మెరుస్తూ వుంటాయి. మూత్రపిండం ఆకారంలో ఉంటాయి. కాడ చిన్నదిగా, అండాకారంలో ఉంటుంది. పూలు తెల్లగా వుంటాయి. ఒక్కొక్క పూ గుచ్ఛంలో 3-6 పూలు ఏర్పాడతాయి. పూలు కాయలు ఏప్రిల్ – జూన్‌లో ఏర్పడతాయి.

సాధారణ నామం : సెంటెల్లా శాస్త్రీయ నామం : సెంటెల్లా ఆసియాటిక కుటుంబం: ఎపియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • సెంటెల్లా మొక్క మొత్తం విటమిన్ బి, సి, కెరోటినాయిడ్ అధికంగా కలిగి ఉంటుంది. ఈ మొక్కని అన్ని పురాతన ఆయుర్వేదగ్రంథాలలో పేర్కొన్నారు. మొత్తం మొక్కని ఔషధ ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. దీనిని జ్ఞాపకశక్తి, స్పష్టత పెంచడానికి ఉపయోగిస్తారు.
  • సెంటెల్లా శరీరంలో రక్తప్రసరణను పెంచి, రక్తంలో తెల్లకణాలను వృద్ధి చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సెంటెల్లా యవ్వనకాలాన్ని పొడిగిస్తుంది. మూత్రవర్ధక స్వభావం వల్ల డిసూరియా చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని హిస్టీరియా, నిద్రలేమి, ఆందోళన, మూర్ఛ రోగం చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని బోదకాలు చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. దీని పేస్టుని బోదకాలుపై పూస్తారు. ఇది మూత్రకోశ సమస్యలలో కూడా ఉపయోగపడుతుంది.
  • చర్మ ఇన్‌ఫెక్షన్లు, చర్మవ్యాధులు, వాపులు, క్రానిక్ అల్సర్లు నయం చేయడానికి ఉపయోగపడుతుంది. సెంటెల్లా జలుబు, దగ్గు, ఆస్త్మా, బొంగురు గొంతుని నయం చేస్తుంది. దీనిని క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. గాయాలను నయం చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.
  • ఆర్థ్రెåటిస్, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో కాలిన గాయాలను నయం చేసి, గాయాల వల్ల కలిగిన మచ్ౘ్లను లేదా అమ్మవారు సోకినపుడు ఏర్పడే మచ్ౘ్లను నయం చేస్తుంది. కాలేయం, మూత్రపిండాల జబ్బుల చికిత్సలో ఉపయోగిస్తారు. గ్యాస్ట్రో ఇంటస్టెåనల్ సమస్యల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. జ్వరం వలన పెరిగిన శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మహిళల్లో వ్యంధ్యత్వాన్ని తగ్గిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • సెంటెల్లా మలేరియా వాహకం, అనోఫెలిస్ స్టెఫెన్సి లార్వాలు, పెద్ద పురుగులపై నాశక చర్యలను ప్రదర్శించింది (సెంథిల్ కుమార్, అతని అనుచరులు, 2009).
  • సెంటెల్లా ఎసెన్షియల్ ఆయిల్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్ (దోమ వాహకం) లార్వాలాను నాశనం చేసింది (రాజ్‌కుమార్ అండ్ జెబనేశన్, 2005).
  • 1కి. సెంటెల్లా ఆకుల రసాన్ని 3 లీ. నీటిలో కలిపి పిచికారి చేసి మాగుడు తెగుళ్ళు, ఆకు ఎండు తెగులు, కాండం మరియు వేరుకుళ్ళు తెగుళ్ళు, ఎండుతెగుళ్ళు, ఎర్లిబ్లెåట్ తెగుళ్ళను కల్గించే ఫ్యుజేరియం, హెల్మింతోస్పోరియం ఆల్గర్నేరియా శిలీంద్రాలను నివారించవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… బూడిద గుమ్మడికాయ ఆవ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • బూడిద గుమ్మడికాయ ముక్కలు – పావు కిలో
  • ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు.
  • జీలకర్ర, మెంతుల పొడి – పావు టీస్పూన్
  • ఉప్పు, కారం – తగిన మోతాదులో
  • పసుపు – చిటికెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు టీ స్పూన్లు,
  • వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15 వరకు,
  • మూడు నిమ్మకాయల రసం
  • జిలకర, మెంతులు, ఆవాలు కొద్దిగా
  • నువ్వుల నూనె – తగిన మోతాదులో

తయారుచేయు విధానం: కొద్దిగా బూడిద పోసిన బూడిది గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పైన ఉన్నటువంటి మందంపాటి చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకొని వాటిని ఒక అరగంట సేపు ఆరబెట్టి, ఆరిన తర్వాత ముక్కలకి మిగతా పదార్థాలు అన్నిటినీ కలుపుకొని పొడిగా ఉన్నటువంటి గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ తీసి పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఉపయోగిస్తే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఫ్రిజ్లో పెడితే నెలరోజుల వరకు ముక్క మెత్త పడకుండా బాగుంటుంది.

  • సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క…. దేవదారు

దేవదారు పశ్చిమ హిమాలయ వాలుల్లో పెరిగే అతి సుందరమైన అలంకరణ చెట్టు. ఇది ఒక పెద్ద నిత్యహరిత కోనిఫెర్ జాతికి చెందిన చెట్టు. 40-50 మీ. ఎత్తు పెరుగుతుంది. దీని కాండం 3 మీ. వ్యాసం కలిగి ఉంటుంది. కొమ్మలు సమాంతరంగా పెరుగుతాయి. ఆకులు నీడిల్ లాగా ఉండి 2-5.5 సెం.మీ. పొడవుంటాయి. 20-30 నీడిల్స్ ఒక గుత్తిలో ఏర్పడతాయి. ఇవి కాంతివంతమైన ఆకుపచ్ౘ్రంగు నుండి నీలిఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆడకోన్స్ బ్యారల్ ఆకారంలో 7-13 సెం.మీ. పొడవు, 5-8 సెం.మీ. వెడల్పు కలిగి ఉంటాయి. గింజలు రెక్కలు కలిగి ఉంటాయి. మగకోన్స్ 4-6 సెం.మీ. పొడవుంటాయి.

సాధారణ నామం : దేవ్‌దార్ శాస్త్రీయ నామం : సెడ్రస్ డియోడెరా కుటుంబం: పైనేసీ

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • గాయాలను శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. కడుపులో నులి పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. చర్మవ్యాధుల చికిత్సకి ఉపయోగిస్తుంది.
  • నరాల బలహీనత నదుపు చేస్తుంది. దగ్గు, జలుబులను నివారిస్తుంది. అజీర్తిని తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది.
  • మూత్రకోశ వ్యాధులు, డయాబెటిస్ చికిత్సలో ఉపయోగకరం. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపుబ్బరాన్ని, వాయువులను తగ్గిస్తుంది. అధిక దురదలను తగ్గిస్తుంది. వాపు, ఎడిమ, నొప్పులను తగ్గిస్తుంది. రక్త సమస్యలను నివారిస్తుంది.
  • ముక్కు కారడం, సైనొసైటిస్ చికిత్సలో ఉపయోగిస్తుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మంచి మందు. ఊబకాయం చికిత్సలో ఉపయోగిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • దేవదారు ఎసెన్షియల్ ఆయిల్, దానిలోని వివిధ రసాయనాలు క్యాబేజి డైమండ్ బ్యాక్‌మాత్ లార్వాలపై వాటిని చంపే ప్రభావం చూపింది. దీనిని పురుగుల యాజమాన్యంలో వృక్ష సంబంధ లార్విసైడ్‌గా ఉపయోగించవచ్చు. (చౌధరి, అతని అనుచరులు, 2011).
  • వస, దేవదారు, మారేడు, బంతి, కరివేపాకు ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రభావాన్ని డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై పరీక్షించారు. వస ఎసెన్షియల్ ఆయిల్ డైమండ్ బ్యాక్ మాత్ లార్వాలపై అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది. దీని తర్వాత దేవదారు ద్రావణం అధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (ఈశ్వరరెడ్డి, అతని అనుచరులు, 2015).
  • దేవదారు అనేక పురుగులను సమర్ధవంతంగా నివారించింది (రఘురామన్ అండ్ సింగ్, 1997; రహమాన్, అతని అనుచరులు, 2009, రావ్ అండ్ సింగ్, 2009, డెల్బెకె, అతని అనుచరులు, 1997).
  • దేవదారు ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి, క్యూలెక్స్ క్వింక్విఫేసియాటిస్ దోమలను 2.5% ఎల్‌సి 50 వద్ద ఒక గంట తర్వాత సమర్ధవంతంగా చంపింది (మకాయిక్, అతని అనుచరులు, 2005).
  • దేవదారు క్రూడ్ ఆయిల్‌ని మీల్‌వర్మ్స్ (టెనెబ్రయొమా లిటర్) ఆఖరి దశ లార్వాలపై ఉపయోగించి ఎల్‌సి50 ని 3.4% గా గుర్తించారు. 12% క్రూడ్ ఆయిల్ 87% లార్వాలను చంపింది. దేవదారు క్రూడ్ ఆయిల్‌తోపాటు రసాయన పురుగు మందులు కార్బోసల్ఫాన్, ఇమిడాక్లోప్రిడ్‌లను కూడా ఉపయోగించారు. కార్బోసల్ఫాన్ యల్‌సి500.086%. కార్బోసల్ఫాన్ (0.5%) 92% లార్వాలను చంపింది. ఇమిడాక్లోప్రిడ్ ఎల్‌సి 500.23% ఇమిడాక్లోప్రిడ్ అత్యంత సమర్ధవంతంగా మీల్‌వర్మ్స్‌ని చంపింది. దేవదారు ఆయిల్‌ని ఉపయోగించిన లార్వాలలో ప్రోటీన్ పరిమాణం అత్యధికం (4.14 మి.గ్రా. / మి.లీ.) గా నమోదయింది. ఇమిడాక్లోప్రిడ్, కార్బోసల్ఫాన్ ఉపయోగించిన లార్వాలలో ప్రోటీన్ పరిమాణాలు 2.80, 2.68 మి.గ్రా / మి.లీ. గా నమోదయ్యాయి. దేవదారు ఆయిల్ లార్వాలపై అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (బునేరి, అతని అనుచరులు, 2017).
  • సిడార్ ఉడ్ ఆయిల్ పల్స్‌బీటిల్, కాల్లసోబ్రూకస్ అనాలిస్, ఈగలపై శక్తివంతమైన కీటకనాశక చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ అగర్వాల్, 1988). అనోఫెలిస్‌స్టెఫెన్సి (దోమ) పై కూడా కీటకనాశక శక్తిని చూపింది. (సింగ్, అతని అనుచరులు, 1984).
  • జమ్ముప్రావ్సిలో డోడా జిల్లాలో రైతులు దేవదారు కొయ్యతో చేసిన స్టోరేజ్‌బిన్స్‌లో ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ఇందులో నిల్వ చేసిన ధాన్యాన్ని పురుగులు, శిలీంద్రాలు నష్టపరచవు.
  • దేవదారు కొమ్మలు, ఆకులను వరి పంటలో కలుపు మందుగా ఉపయోగిస్తారు. కొమ్మలు, రెమ్మలు, ఆకులను వరి పొలంలో సమంగా వెదజల్లుతారు. సిడార్ ఉడ్ ఆయిల్ కలుపు మందు లక్షణాల వల్ల కలుపు మొక్కలు వీటిని తాకితే చనిపోతాయి.
  • మొక్కజొన్న విత్తనాలను విత్తేముందు సిడార్ ఉడ్ ఆయిల్‌తో శుద్ధి చేస్తే పురుగుల బారి నుండి కాపాడుతుంది. ఈ పద్ధతి చాలా సమర్ధవంతంగా పని చేస్తుంది.
  • సిడార్ ఉడ్ ఆయిల్ కీటకనాశక చర్యవల్ల లద్దె పురుగు నివారింపబడుతుంది.
  • వరి పండించే ప్రాంతాల్లో పురుగుల నివారణకు వరి నారు మడికి నీరు అధికంగా ఇస్తారు. దీని వలన నీటి స్థాయి పెరిగి లద్దె పురుగు మొక్కలపై ఆకుల మీదకు ప్రాకుతుంది. ఒక కర్ర చివరలో గుడ్డ కట్టి ఆయిల్‌లో ముంచి ఆకులపై చల్లాలి. ఆకులపై కొచ్చిన లార్వాలు ఆయిల్ కీటకనాశక చర్యల వల్ల చనిపోతాయి.
  • టిక్స్ ఆశించిన పెంపుడు జంతువులపై సిడార్ ఉడ్ ఆయిల్ కలిపిన నీటిని చల్లితే పురుగులు చనిపోతాయి. (స్లాతియా, అతని అనుచరులు, 2007).
    దేవదారు కొయ్య/గుజ్జుకి చెదలను తట్టుకునే శక్తి ఉంది.
  • సిడార్ ఉడ్‌తో తయారు చేసిన కతార్, కొత్తి, బార, డొబ్లి వంటివి సంప్రదాయకంగా ధాన్యాన్ని నిల్వ చేసే నిర్మాణాలు (ఠాకూర్ అండ్ ప్రితి, 2011).
  • సిడార్ ఉడ్ ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) మినుము నిల్వ గింజలలో ఆశించే ఆస్పర్ౙిల్లస్ నైగర్, కర్వులేరియా ఒవాయిడియా శిలీంద్రాల పెరుగుదల నరికట్టాయి (సింగ్ అండ్ త్రిపాఠీ, 1999).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వర్తులాకార ఆర్థిక వ్యవస్థ – ఎన్‌డిడిబి వారి మృదా

భారతదేశంలో పాడి పరిశ్రమ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నాడు డా. వర్గీస్ కురియన్- రైతుల భాగస్వామ్యం, సహకార సంఘాల ఏర్పాటు ద్వారా సుస్థిర భారత దేశ అభివృద్ధికి బీజం నాటారు. రైతుల సాధికారిత లక్ష్యంగా ప్రతి అడుగులో రైతుకు మార్గదర్శిలా నిలబడేలా జాతీయ పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డిడిబి) గుజరాత్‌లోని ఆనంద్ కేంద్రంగా పనిచేస్తోంది. దీని ప్రభావంతోనే రైతు సాధికారిత, ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉండగలగడం, బలీయమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పోషకాల పూరిత పాలను అందించడం, భావితరాలకు సుస్థిర భవిష్యత్తు ఇవ్వగలగడం సాధ్యమైంది.




ఎన్‌డిడిబి పాడిపరిశ్రమ అభివృద్ధిపరంగా 6 సంస్థలను ఏర్పాటు చేసింది.
  1. 1974లో మదర్ డెయిరీ ఏర్పరిచి, శుద్ధీకరించిన పాలను వినియోగదారులకు చేరుస్తోంది.
  2. ఇండియన్ ఇమ్యునోజికల్స్‌ను 1982లో పశువుల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాలను ఉత్పత్తి చేయడం, అంతేకాక, హెపటైటిస్‌లాంటి టీకాల ఉత్పత్తి చేయడం ద్వారా అటు పశువుల ఆరోగ్యం, ఇటు ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసింది.
  3. 1978లో ఐడిఎంసి ని ఏర్పరిచి, దేశీయ పరిజ్ఞానంతో పాడి పరిశ్రమ పరికరాల ఉత్పత్తి ప్రారంభించింది. దీనివలన భారత్, డెయిరీ ఇంజనీరింగ్ రంగంలో స్వయం సమృద్ధత సాధించగలిగింది.
  4. 2010లో ఎన్‌డిఎస్ (ఎన్‌డిడిబి డెయిరీ సర్వీసెస్) స్థాపించి, సంస్థాగత నిర్మాణం ద్వారా పాడి పరిశ్రమల్లో పాల ఉత్పాదకత పెంపుదలకు కృషి చేస్తోంది. ఇప్పటికే దేశంలో 210 పైగా పాల ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పడినాయి.
  5. 2022లో CALF (Centre for Analysis and Learning in Livestock and Food) ని ఏర్పరిచి, పాల నాణ్యతా పరీక్షలతో పాలనాణ్యతకు పెద్దపీట వేసింది.
  6. 2022లో MRIDA అనే సంస్థ ద్వారా పాడిపరిశ్రమలో వ్యర్థాలను పునరుపయోగంలో తెచ్చి పాడిరైతుకు వర్తులాకార ఆర్థిక వ్యవస్థవైపు అడుగులు వేసేలా చేసింది. దీనిద్వారా పశువుల మల, మూత్రాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, సేంద్రియ ఎరువులు ‘సుధన’ పేర తెచ్చి పాడిపరిశ్రమలో కొత్త అధ్యాయం సృష్టించింది. పశువుల పేడ, పర్యావరణానికి పీడగా భావిస్తున్న తరుణంలో ఎన్‌డిడిబి, దీని పునరుపయోగం ద్వారా పాడిరైతులను సుస్థిర అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్ళాలో ఆలోచించగా, వెలిగిన ఆశాకిరణం ‘మృదా’. మార్చి 2025లో సుజుకి R & D సెంటర్‌తో చేతులు కలిపి భారత దేశంలో వీలైనన్ని బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు ధ్యేయంగా ప్రయాణం ప్రారంభించింది. తొలుత పశువుల పాకలు, గోశాలల వద్ద బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, గుజరాత్‌లోని వాసనాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రోజకు 65-70 మెట్రిక్ టన్నుల పేడ సేకరించి, దానికి గాను రైతులకు రూ. 150 లక్షలు చెల్లించగలిగారు. దీనిద్వారా దగ్గరలోని డెయిరీలకు బాయిలర్లకు ఇంధన సరఫరా, సుమారు 250 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి చూపించారు. రూట్‌గార్డ్, గ్రోమాక్స్ లాంటి పశువు…పేడ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి ‘సుధన’ పేర రైతులకు అందజేసారు. ‘గోబర్ సే సమృద్ధి’ ని సాకారం చేసి ‘కార్బన్ క్రెడిట్స్’ పొందగలిగేలా ఎన్‌డిడిబి కృషి చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌డిడిబి, సస్టెయిన్ ప్లస్ అనే సంస్థ సహకారంతో 10000 ఇళ్ళలో 2 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకరిస్తోంది. వివరాలకు జయేష్ చవాన్ – ఫోన్: 9405716326 ని సంప్రదించవచ్చు. దీని ధన లబ్ధిదారుని వాటాగా రూ. 11,262/-గా నిర్ధారించారు. ఏది ఏమైనా, దేశంలోనే అగ్రగామి సంస్థగా ఎన్‌డిడిబి వివిధ సేవల ద్వారా పాడి రైతుల అభివృద్ధికి అవిరళ కృషి చేస్తోంది. ఆనంద్‌లోని ఎన్‌డిడిబి సంస్థను ప్రతి ఒక్కరూ సందర్శిస్తే, పాడిరైతుల కోసం సంస్థ చేస్తోన్న కృషి తెలిసి వస్తుంది. ఇప్పటికే ఎన్‌డిడిబి సహకారంతో విజయ తెలంగాణ డెయిరీ ERP సేవలను కొనసాగిస్తోంది. ఇంకెన్నో ఆవిష్కరణలతో ఎన్‌డిడిబి అగ్రగామిగా ఉండాలని ఆశిద్దాం!
  • మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ డెయిరీ, హైదరాబాద్. ఫోన్: 9121160553

Read More

వండని వంట…. కొబ్బరి కారం

కావాల్సిన పదార్థాలు

  • ఎండుకొబ్బరి
  • ఉప్పు
  • గొడ్డుకారం (ఎండు మిర్చితో కొట్టిన కారం)
  • వెల్లుల్లి
  • జీలకర్ర
  • కరివేపాకు

తయారుచేయు విధానం:
కొబ్బరిని ముందుగా ముక్కలుగా కోసి, కోర్స్‌గా మిక్సీ వేయాలి, లేదా తురుము పీఠ మీద తురుము కోవచ్చు. కోరిన కొబ్బరి తురుము, కారం, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ కలిపి మిక్సీలో ఒకసారి తిప్పితే (రోట్లో కూడా దంచుకోవచ్చు.) కొబ్బరికారం రెడీ!

ఇడ్లీ, దోసె, ఊతప్పం, వేడివేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది.
  • ఫణీంద్ర లక్ష్మీ అప్పసాని,* తక్కెళ్ళపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

తెగుళ్ళ శిలీంద్రనాశిని… మారేడు పత్రం 10 శాతం కషాయం

మారేడు పత్రం 10 కేజీలు తీసుకొని బాగా ఉడకబెట్టి చల్లార్చి వడబోసి, కొంత కుంకుడుకాయ రసం కలిపి పిచికారీ చేసిన, వరిలో వచ్చు అగ్గి తెగులు, దాని దశ అయిన మెడవిరుపును నివారించవచ్చు. దీనిని 100-150 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. ఇది అగ్గి తెగులుకే కాకుండా చాలా రకాల తెగుళ్ళకు శిలీంద్రనాశనిగా పనిచేస్తుంది.

ఆకుల కషాయం : 10 కిలోల యూకలిప్టస్ (జామాయిలు), లేదా అత్తాకోడలు ఆకులను తీసుకొని 15 లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయాన్ని రాత్రంతా నిల్వచేసి వడబోసిన ద్రావణాన్ని 150 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ కషాయంలో 1 కిలో బెల్లం కలిపినచో 15 రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఈ కషాయాన్ని అన్ని రకాల తెగుళ్ళ నివారణలో ఉపయోగించవచ్చు.

సీతాఫలం ఆకు కషాయం : 5 కి. సీతాఫలం ఆకులను 20 లీ. నీటిలో 10 లీ. ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 100 లీ. నీటిలో కలిపి ఎకరం పంటలో మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేయాలి. నివారించబడే పురుగులు: పేనుబంక – సుడిదోమ – గొంగళి పురుగులు – డైమండ్ బ్యాక్‌మాత్ – పచ్చదోమ – పచ్చనల్లి.

Read More

వండని వంట… కాకరకాయ ఆవ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • కాకరకాయలు – పావు కేజీ,
  • ఆవపిండి – మూడు టేబుల్ స్పూన్లు
  • కారం – సరిపడేంత
  • ఉప్పు – తగిన మోతాదులో
  • పసుపు చిటికెడు
  • మూడు కాయల నిమ్మరసం
  • అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15
  • బెల్లం తురుము నాలుగు టీ స్పూన్లు
  • జిలకర, మెంతులు, ఆవాలు – కొద్దిగా
  • సరిపడునంత నువ్వుల నూనె

తయారుచేయు విధానం: కాకరకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని, ఇష్టమైన రీతిలో ముక్కలుగా కోసిపెట్టుకొని, వాటికి తగిన మోతాదులలో తమ తమ రుచులకు అనుగుణంగా కారం, ఆవపిండి, ఉప్పు, జీలకర్ర ఆవాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం తురుము, నువ్వుల నూనె, నిమ్మరసం చేర్చి చేతితో మంచిగా కలుపుకొని, పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసి పెట్టుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అయిదారు నెలలు లేదా బయట పెట్టుకుంటే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.

  • రచన : సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More