గోవులలో వ్యాధి నిర్ధారణ ప్రాముఖ్యత

పశువైద్యంలో వ్యాధినిర్ధారణ అత్యంత ముఖ్యమైన, క్లిష్టమైన అంశం.

యజమానిని లేదా సంబంధిత వ్యక్తుల్ని, గోవుకు సోకిన వ్యాధి పూర్తి వివరాలు, పూర్వాపరాలు, వారు గమనించిన లక్షణాలు, మేపిన మేతల వివరాలు, ఇతర ప్రత్యేక అంశాలు, క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలి.

పరిసరాల్ని పరిశీలించాలి. లక్షణాలను స్వయంగా గమనించాలి.

గోవు యొక్క ప్రవర్తన, అవయవాలు అంటే నోరు, నాలుక, ముక్కు, కళ్లు, చెవులు, చర్మం, వెంట్రుకలు, గుండె, నాడి, శ్వాస, పొట్ట, గోవుల్లో అయితే యోని, చూడి గోవు అయితే అవసరాన్ని బట్టి గర్భకోశం, దానిలోని పిండాన్ని, పొదుగును, చన్నుల్ని, వృషభాల్లో అయితే బీర్జాలు, చేరు మొదలైన అవయవాల్ని, నడకను పరీక్షించాలి.

వ్యాధుల భేదాత్మక పరిశీలన (Differencial Diagnosis) ద్వారా ఏ జబ్బు అయి వుంటుందో ఆలోచించి, రోగాన్ని నిర్ధారించాలి.

శరీర ఉష్ణోగ్రత, పేడ, రక్తం, చీమిడి ఇంకా మరికొన్ని పరీక్షలు వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి.

రోగనిర్ధారణ సామర్థ్యం వల్లనే వైద్యుని యొక్క ప్రతిభ ప్రకటితమవుతుంది.

ఇంతకుముందు చేసిన చికిత్సల వివరాలు తెలుసుకోవడం వలన, చికిత్సా ప్రణాళిక సమర్థవంతంగా రూపొందించుకునే వీలు కలుగుతుంది. దాని ఆధారంగా చేసే చికిత్స మెరుగైన సత్ఫలితాలను ఇస్తుంది.
తరువాత చికిత్సా ఫలితాలను సమీక్షించుకోవడం వలన, పశ”వైద్యుని సామర్థ్యం ఇనుమడిస్తుంది.
గోవు యొక్క బరువు ఆధారంగానే మందుల మోతాదులు నిర్ణయించబడతాయి.

గోవు బరువు లెక్కించు సూత్రం:
పొడవు x (చుట్టుకొలత)² / 660 = శరీర బరువు (కిలో గ్రాములలో)

పొడవు… ముందు జబ్బనుంచి వెనుక తొడ వరకు (అంగుళాలలో) ఛాతీ చుట్టు కొలత…(అంగుళాలలో)

మోతాదుల నిర్ణయం: మందుల స్వభావం, వాటి సాంద్రతను బట్టి, బరువు ప్రాతిపదికగా వాడవలసిన మందుల మోతాదులు నిర్ణయించాలి.

గోవు బరువును, మందులో వుండే రసాయన శక్తిని ప్రాతిపదికగా మందు మోతాదును నిర్ణయించాలి.
నిర్దిష్ట మోతాదులను మించి మందు వినియోగించరాదు.

ఏ విధంగా మందును శరీరంలోనికి పంపాలో, అలాగే పంపాలి. అంటే తినిపించవలసినవి, చర్మంపై వాడవలసినవి, కండకు చేసే ఇంజక్షన్లు (।/M), రక్తంలోకి ఎక్కించే ఇంజక్షన్లు (।/V), చర్మం క్రిందకు చేసే ఇంజక్షన్లు (S/C), దేనికవే చేయటంలో బహుజాగ్రత్త వహించాలి. రక్తంలోనికి ఎక్కించే ఇంజక్షన్లు నిదానంగా చేయాలి.

మందు మోతాదు నిర్ణయించటానికి పరిగణనలోనికి తీసుకునే పశువు బరువు షుమారు (కిలోలలో):
లేగదూడ 25 కిలోలు
5-6 నెలల వయస్సున్న దూడ 60 కిలోలు
సంవత్సరం వయస్సున్న దూడ 120-150 కిలోలు
3 సంవత్సరాలు పైబడిన ఆవు 250-300 కిలోలు
గిత్తలు 300-400 కిలోలు
ఆంబోతులు 500 కిలోలు పైగా
……………………………………………………………………………………….
సకాలంలో వ్యాధి నిర్ధారణ – సరైన చికిత్సతో వ్యాధి నివారణ

——————————————————————————————————–
రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ప్రకృతి వ్యవసాయం (సహజ సాగు): ఉద్దేశం, సూత్రాలు, ఆధార స్తంభాలు – ఒక సమగ్ర అవగాహన

భారతదేశంలో వ్యవసాయం అత్యంత కీలకమైన జీవనాధార రంగం. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన, విషరహిత ఆహారాన్ని అందించడం ప్రస్తుత కాలంలో సవాలుగా మారింది. స్వాతంత్య్రం తర్వాత చేపట్టిన జాతీయ వ్యవసాయ విధానాలు, ఆధునిక సాంకేతికతలు మరియు రసాయన వ్యవసాయ పద్ధతులు సాగు రంగంలో విప్లవాత్మక పరిణామాలకు బాటలు వేశాయి. ఈ క్రమంలోనే 1960-70 దశకంలో ‘హరిత విప్లవం’ వచ్చింది. ఇందులో భాగంగా అధిక దిగుబడినిచ్చే వంగడాల సాగును ప్రోత్సహించడంతో పాటు, దిగుబడులను పెంచడానికి రసాయన ఎరువులు, పురుగుమందులు, కలుపునాశకాలు మరియు యంత్రాలపై తీవ్రంగా ఆధారపడవలసి వచ్చింది.

శతాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయం నేడు పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలు, వనరుల క్షీణత మరియు పర్యావరణ సమస్యల కారణంగా రైతులకు ఆశించిన స్థాయిలో లాభదాయకంగా ఉండడం లేదు. హరితవిప్లవ ఉత్పత్తి స్థాయిని నిలబెట్టుకోవడానికి మనం రానురాను ఎక్కువ రసాయన ఎరువులను వాడుతున్నాం, దీని పరిణామంగా చీడపీడలు మరియు వ్యాధులు తీవ్రతరమై 1985 నుండి పురుగుమందులు, శిలీంధ్రనాశకాల వాడకం కూడా పెరిగింది. ఆహార ధాన్యాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం జీవనాధార వ్యవసాయం నుండి వాణిజ్య వ్యవసాయానికి మారి, వేగంగా పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడానికి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అసంపూర్ణ వ్యవస్థ మరియు అధిక వనరులపై ఆధారపడటం వల్ల ఆధునిక వ్యవసాయం పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం భూగర్భ జలాలను, పర్యావరణాన్ని కలుషితం చేయడమే కాకుండా నేల సారాన్ని, జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తోంది. వీటి కోసం చిన్నకారు రైతులు అప్పులు చేసి, సరైన దిగుబడి లేదా లాభాలు రాక తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నారు.

ప్రజా ఆరోగ్యాన్ని, సమాజ శ్రేయస్సును కాపాడటానికి రసాయన రహిత నేల, పంట, ఆహారం మరియు పర్యావరణాన్ని నిర్మించడం నేటి అత్యంత ఆవశ్యకం. స్థానికంగా లభించే వనరులతో సాంప్రదాయ, ప్రకృతి సూత్రాల ఆధారంగా సాగు వ్యయాన్ని తగ్గించి, నేల సారవంతతను మరియు పౌష్టికతను పెంచే విధానమే “ప్రకృతి వ్యవసాయం (సహజ సాగు)”. ఇది రైతులను స్వయంసమృద్ధి గలవారిగా మార్చడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది.

ప్రకృతి వ్యవసాయం అనేది రసాయన వ్యవసాయం కంటే అత్యంత శాస్త్రీయమైనది మరియు నైపుణ్యంతో కూడుకున్నది. స్థానిక సాంకేతికతను, సుస్థిర పద్ధతులను ఉపయోగిస్తూ నేల, నీరు మరియు జీవవైవిధ్యం వంటి సహజ వనరులను సంరక్షించడం, వాటి ద్వారా సమర్థవంతంగా ఆహార ఉత్పత్తిని పెంచడమే దీని ప్రధాన ఉద్దేశం.

ప్రకృతి వ్యవసాయం (సహజ సాగు) ఉద్దేశాలు

  1. రసాయన రహిత ఆహారోత్పత్తి: మానవ ఆరోగ్యానికి హాని కలిగించని, విషరహిత ఆహారాన్ని అందించడం.
  2. సాగు ఖర్చులు తగ్గించడం (Zero-Budget Approach): బయటి నుండి కొనుగోలు చేసే ఇన్ పుట్స్ (రసాయనాలు, బయటి విత్తనాలు) లేకుండా, పొలంలో దొరికే వనరులతో సాగు వ్యయాన్ని తగ్గించి రైతు నికర ఆదాయాన్ని పెంచడం.
  3. నేలలో పోషకాల లభ్యత – సహజ ప్రక్రియలు: నత్రజని స్థిరీకరణ, సేంద్రీయ పదార్థాలు కుళ్ళడం, పోషకాలను పట్టి ఉంచడం, వాటి చలనశీలత మరియు లభ్యతను పెంచి మొక్కలకు అవసరమైన పోషకాలను అందించడం.
  4. నేల ఆరోగ్యం & సారాన్ని పునరుద్ధరించడం: నేలలోని సూక్ష్మజీవులను (Microorganisms), వానపాములను పునరుజ్జీవింపజేసి, నేల భౌతిక మరియు జీవ రసాయన గుణాలను మెరుగుపరచడం.
  5. పర్యావరణ సమతుల్యత: జీవవైవిధ్యాన్ని రక్షించడం, భూగర్భ జలాలను శుద్ధిగా ఉంచడం మరియు వాతావరణ మార్పులను తట్టుకునే (Climate Resilience) శక్తిని పంటలకు అందించడం.

ప్రకృతి వ్యవసాయం (సహజ సాగు) ప్రధాన సూత్రాలు:

  1. సహజ వనరుల సంరక్షణ: భూమి, నీరు, వెలుగు, గాలి మరియు వృక్ష సంపదను జీవసంబంధ పద్ధతుల ద్వారా కాపాడుకుంటూ సమర్థవంతంగా వినియోగించడం.
  2. పర్యావరణ హిత చర్యలు: సహజ వనరుల దుర్వినియోగాన్ని అరికడుతూ, వాతావరణ మార్పుల వల్ల వ్యవసాయానికి జరిగే నష్టాన్ని పర్యావరణ అనుకూల పద్ధతులతో నివారించడం.
  3. ఆచ్ఛాదన (మల్చింగ్): ఏడాదిలో ఎక్కువ కాలం నేలను పంట వ్యర్థాలతో కప్పి ఉంచడం.
  4. జీవవైవిధ్యం: పొలంలో రకరకాల పంటలను సాగు చేస్తూ జీవవైవిధ్యాన్ని పెంపొందించడం.
  5. సమగ్ర పాడి-సాగు వ్యవస్థ: పశువులను వ్యవసాయంలో భాగం చేసి సమగ్ర సాగు విధానాన్ని అమలు చేయడం.
  6. నేల సారవంతం: స్థానిక సూక్ష్మజీవులను, సేంద్రీయ పదార్థాన్ని కాపాడుకుంటూ నేల నిరంతర సారవంతతను పెంచడం.
  7. వ్యర్థాల పునర్వినియోగం: పంట, జంతు మరియు ఇతర సహజ వ్యర్థాలను తిరిగి నేలకే అందించి సేంద్రీయ కర్భనాన్ని పెంచడం.
  8. విషరహిత దిగుబడి: సహజ సిద్ధమైన కీటక నాశకాలతో పురుగులు, తెగుళ్లను నివారించి ఆరోగ్యకరమైన, విషరహిత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం.

ప్రకృతి వ్యవసాయం (సహజ సాగు) ఆధార స్తంభాలు

  1. బీజామృతం: విత్తనాలు లేదా నారు నాటే ముందు పంట విత్తనాలను మొదట బీజామృతంతో శుద్ధి చేయాలి. బీజామృతం తయారీకి ఉపయోగించే ఆవు పేడ సిలింధ్రనాశకంగా, ఆవు మూత్రం బాక్టీరియా నాశకంగా పనిచేస్తాయి. ఇది విత్తనం మరియు నేల ద్వారా సంభవించే వ్యాధులను నియంత్రిస్తుంది. ప్రారంభ దశలో బీజామృతం మొక్కలకు పోషకాలను అందిస్తుంది, పంట ప్రేరేపకంగా పనిచేసి విత్తనాలు త్వరగా మొలకెత్తేలా చేస్తుంది.
  2. జీవామృతం: ఇది ప్రకృతి వ్యవసాయానికి ప్రధాన ఆధార స్తంభం. ఇది అత్యధిక సంఖ్యలో సూక్ష్మజీవులతో కూడిన పులియబెట్టిన జీవ ఎరువు రూపం. ఇది మొక్కలకు కావలసిన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా నేలలోని స్థానిక సూక్ష్మజీవుల చర్యలను ఉత్తేజపరిచే ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. జీవామృతం శిలీంధ్ర మరియు బాక్టీరియా నాశకంగా కూడా పనిచేస్తుంది.
  3. ఆచ్ఛాదన (మల్చింగ్): వ్యవసాయంలో లభించే వ్యర్థాలు, కలుపు మొక్కలు మరియు పచ్చిరొట్టను భూమి ఉపరితలంపై ఆచ్ఛాదనగా వేయడం వల్ల నేల సారాన్ని, ఉత్పాదకతను కాపాడుకోవచ్చు. ఆచ్ఛాదన వల్ల నేల భౌతిక, రసాయన మరియు జీవ గుణాలు వృద్ధి చెందుతాయి. నేలలో ఉండే అసంఖ్యాక సూక్ష్మజీవులు మరియు వానపాములను తీవ్రమైన ఎండ, వర్షం, ఈదురుగాలులు మరియు పక్షుల నుండి కాపాడవచ్చు. ముఖ్యంగా నేల ఉష్ణోగ్రత మరియు తేమను కాపాడుకుని ఉత్పాదకతను పెంచవచ్చు.
  4. వాప్సా (నేల సచ్ఛిద్రత / గాలి-తేమ సమతుల్యత): పంటల ఎదుగుదలకు సమతుల్య పోషకాలు అందించడంతో పాటు సరైన తేమ మరియు గాలిని అందించడం కూడా అంతే అవసరం. నేల కణాల మధ్య ఉండే చిన్న మరియు పెద్ద రంధ్రాలలో సమాన నిష్పత్తిలో తేమ మరియు గాలి ఉండే స్థితినే ‘వాప్సా’ అంటారు. ఇది పంటలకు అవసరమైన పోషకాల సరఫరాను మరియు నీటి లభ్యతను పెంచుతుంది.

తెగుళ్ళు & క్రిమి యాజమాన్యం :
ప్రకృతి వ్యవసాయంలో రసాయన పురుగుమందులకు బదులుగా సహజ కషాయాలను ఉపయోగిస్తారు:
• అగ్నాస్త్రం (Agnastra): కాండం తొలిచే పురుగులు, కాయతొలిచే పురుగుల నివారణకు.
• బ్రహ్మాస్త్రం (Brahmastra): రసం పీల్చే పురుగుల నియంత్రణకు.
• నీమాస్త్రం (Neemastra): పేనుబంక, తెల్లదోమ మరియు చిన్న పురుగుల నివారణకు.
• పులిసిన మజ్జిగ ద్రావణం: బూడిద తెగులు, ఆకుమచ్చ తెగుళ్ళ వంటి శిలీంధ్ర వ్యాధుల నివారణకు.

ముగింపు :
ప్రకృతి వ్యవసాయం అనేది కేవలం ఒక ప్రత్యామ్నాయ సాగు పద్ధతి మాత్రమే కాదు; ఇది పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర వ్యవసాయానికి (Sustainable Agriculture) బలమైన మార్గం. ఆధునిక కాలంలో మట్టి సారాన్ని కాపాడుకుంటూ, తక్కువ పెట్టుబడితో అధిక నికర లాభాలు సాధించడానికి మరియు రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భూమిని, ఆహారాన్ని అందించడానికి ప్రకృతి వ్యవసాయం అత్యంత ఆవశ్యకం.

బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) మరియు జి. సతీష్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ (స్టాటిస్టిక్స్), పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

పాల దిగుబడి పెరగాలంటే పశువుల మేతలో ప్రోటీన్ ఎందుకు ముఖ్యం?

పాడి పశువుల పోషణలో మాంసకృత్తుల ప్రాముఖ్యత – ప్రతి రైతు తెలుసుకోవాల్సిన విషయాలు

పరిచయం
మన దేశంలో పాడి పశువుల పెంపకం రైతులకు ముఖ్యమైన జీవనాధారం. పాలు ప్రతిరోజూ ఆదాయాన్ని అందించే పశుసంపద ఉత్పత్తి. అయితే పశువులను పెంచుతున్న ప్రతి రైతు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య పాల దిగుబడి తక్కువగా ఉండటం, దాణా ఖర్చులు పెరగడం, పశువులు ఆశించిన స్థాయిలో పాలు ఇవ్వకపోవడం.

చాలామంది రైతులు పశువులకు ఎక్కువ పచ్చిమేత, ఎండుమేత, దాణా వేస్తే పాల దిగుబడి పెరుగుతుందని భావిస్తారు. కానీ పశువుల పాల ఉత్పత్తి కేవలం మేత పరిమాణంపై మాత్రమే ఆధారపడదు. మేతలో శక్తినిచ్చే పోషకాలు, మాంసకృత్తులు (ప్రోటీన్), ఖనిజ లవణాలు, విటమిన్లు సరైన నిష్పత్తిలో ఉండాలి.
వీటిలో ప్రోటీన్ పశువుల శరీర నిర్మాణానికి, జీర్ణక్రియకు, పాల ఉత్పత్తికి అవసరమైన ముఖ్యమైన పోషకం. పశువులకు సరిపడా ప్రోటీన్ అందకపోతే పాల దిగుబడి తగ్గవచ్చు. అందువల్ల ప్రోటీన్ ప్రాముఖ్యతను ప్రతి పాడి రైతు తెలుసుకోవాలి.

  1. ప్రోటీన్ అంటే ఏమిటి?
    ప్రోటీన్‌ను తెలుగులో మాంసకృత్తులు అంటారు. మనుషులకు శరీర బలం, కండరాల పెరుగుదల, కణజాలాల మరమ్మత్తులకు ప్రోటీన్ ఎంత అవసరమో, పశువులకు కూడా అంతే అవసరం.
    ప్రోటీన్ అనేది అనేక అమైనో ఆమ్లాలతో తయారవుతుంది. ఇవి శరీరంలోని కణజాలాల నిర్మాణం, కండరాల నిర్వహణ, ఎంజైములు, హార్మోన్ల తయారీ వంటి అనేక పనులకు ఉపయోగపడతాయి.
    పాలిచ్చే ఆవులు, గేదెలలో ప్రోటీన్ అవసరం మరింత ముఖ్యమైనది. ఎందుకంటే అవి పాల ద్వారా ప్రతిరోజూ శరీరంలోని పోషకాలను బయటకు విడుదల చేస్తుంటాయి. వాటిని తిరిగి భర్తీ చేయడానికి సమతుల్యమైన ఆహారం అవసరం.
  2. పశువుల పొట్టలో ప్రోటీన్ ఎలా ఉపయోగపడుతుంది?
    పశువులకు ప్రత్యేకమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది. ముఖ్యంగా వాటి రుమెన్ (పూర్వ జీర్ణాశయం)లో కోట్లాది సూక్ష్మజీవులు నివసిస్తాయి. ఈ సూక్ష్మజీవులు పచ్చిమేత, ఎండుమేత వంటి ఆహారాన్ని జీర్ణం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

మేతలోని ప్రోటీన్‌లో కొంత భాగాన్ని రుమెన్ సూక్ష్మజీవులు వినియోగిస్తాయి. వాటి పెరుగుదలకు తగిన నత్రజని, శక్తి అవసరం. సూక్ష్మజీవులు పెరిగి, తరువాత జీర్ణమయ్యే సమయంలో వాటి శరీరంలోని ప్రోటీన్ పశువుకు అమైనో ఆమ్లాలను అందిస్తుంది. దీనిని సూక్ష్మజీవుల ప్రోటీన్ (Microbial Protein) అంటారు.

మేతలోని కొంత ప్రోటీన్ రుమెన్‌లో విచ్ఛిన్నం కాకుండా చిన్న ప్రేగులకు చేరి జీర్ణమవుతుంది. దీనిని రుమెన్‌లో విచ్ఛిన్నం కాని ప్రోటీన్ (Rumen Undegradable Protein – RUP) అంటారు.

ఈ రెండు మార్గాల ద్వారా పశువుకు అవసరమైన అమైనో ఆమ్లాలు అందుతాయి. అందువల్ల కేవలం మేతలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండటం మాత్రమే కాకుండా, అది ఎంతవరకు జీర్ణమవుతుంది, పశువుకు ఎంత ఉపయోగపడుతుంది అనేవి కూడా ముఖ్యమైనవి.

  1. పాల దిగుబడి పెరగడానికి ప్రోటీన్ ఎలా తోడ్పడుతుంది?
    మొదటిది: పాలలోని ప్రోటీన్ తయారీకి అవసరం

పాలలో కేసీన్ (Casein), వే ప్రోటీన్లు (Whey Proteins) ఉంటాయి. ఇవి పాలలోని ముఖ్యమైన ప్రోటీన్లు. వీటి తయారీకి పశువు శరీరానికి తగిన అమైనో ఆమ్లాలు అందాలి.

మేతలో ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు పాలలోని ప్రోటీన్ తయారీకి అవసరమైన పోషకాలు తగ్గవచ్చు. సరైన ప్రోటీన్ పోషణ అందించడం వల్ల పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచవచ్చు.

రెండవది: మేత జీర్ణక్రియకు సహాయపడుతుంది
పశువులు తినే గడ్డి, పంట అవశేషాల్లోని పీచు పదార్థాలను జీర్ణం చేయడంలో రుమెన్ సూక్ష్మజీవులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వీటి పెరుగుదలకు తగినంత ప్రోటీన్, నత్రజని, శక్తి అవసరం.

ప్రోటీన్ లోపం వల్ల సూక్ష్మజీవుల కార్యకలాపాలు తగ్గితే పీచు పదార్థాల జీర్ణక్రియ దెబ్బతినవచ్చు. సరైన పోషణతో మేత వినియోగ సామర్థ్యం మెరుగుపడుతుంది.

మూడవది: పాలిచ్చే పశువుల శరీర బలాన్ని కాపాడుతుంది
పాలు ఎక్కువగా ఇచ్చే పశువులకు పోషకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈనిన తరువాత పాల ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో అవసరమైన పోషకాలు అందకపోతే శరీరంలోని నిల్వ పోషకాలను వినియోగించుకోవాల్సి వస్తుంది.

తగినంత ప్రోటీన్ అందించడం వల్ల కండరాల నిర్వహణ, శరీర కణజాలాల మరమ్మతు, సాధారణ శరీర విధులకు మద్దతు లభిస్తుంది.

నాలుగవది: పాల ఉత్పత్తి సామర్థ్యానికి తోడ్పడుతుంది
ప్రోటీన్ లోపం ఉన్న పశువులకు సమతుల్య దాణా అందించినప్పుడు పాల దిగుబడి మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే పశువుకు ఇప్పటికే సరిపడా ప్రోటీన్ అందుతున్నట్లయితే, అదనంగా ప్రోటీన్ ఇవ్వడం వల్ల తప్పనిసరిగా పాల దిగుబడి పెరుగుతుందని చెప్పలేం.

పాల ఉత్పత్తి పెరగాలంటే శక్తి, ప్రోటీన్, పచ్చిమేత, నీరు, ఖనిజ లవణాలు అన్నీ సమతుల్యంగా అందాలి.

  1. ప్రోటీన్ ఎక్కువగా లభించే దాణా పదార్థాలు
    రైతులు తమ ప్రాంతంలో లభించే పదార్థాలను ఉపయోగించి పశువులకు సమతుల్యమైన దాణా అందించవచ్చు.

వేరుశనగ చెక్క లేదా పిండి: పశువుల దాణాలో ఉపయోగించే మంచి ప్రోటీన్ వనరులలో ఇది ఒకటి. అయితే నాణ్యత, నిల్వ పరిస్థితులను పరిశీలించాలి.

సోయాబీన్ మీల్: ప్రోటీన్ సమృద్ధిగా ఉండే దాణా పదార్థం. పశువుల అవసరాలకు అనుగుణంగా సమతుల్య దాణాలో ఉపయోగించవచ్చు.

పత్తి గింజల చెక్క: ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలను కూడా అందిస్తుంది. అయితే దాని నాణ్యత, ప్రాసెసింగ్, పశువు వయస్సు, జాతి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

పొద్దుతిరుగుడు గింజల చెక్క: పశువుల దాణాలో ఉపయోగించే మరో ప్రోటీన్ వనరు. ఇందులోని పోషక విలువలు ప్రాసెసింగ్‌ను బట్టి మారుతాయి.

పప్పుజాతి పచ్చిమేత: లూసర్న్, అలసంద, కౌపీ వంటి పప్పుజాతి మేత పంటలు ప్రోటీన్‌ను అందిస్తాయి. వీటిని ఇతర మేత పదార్థాలతో కలిపి అందించడం మంచిది.

సమతుల్య వాణిజ్య పశుదాణా: పశువు పాల దిగుబడి, శరీర బరువు, దాణా అవసరాలను బట్టి నాణ్యమైన పశుదాణాను ఎంపిక చేసుకోవాలి.

ఏ దాణా పదార్థమైనా బూజు పట్టినది, కుళ్లినది లేదా కలుషితమైనది కాకూడదు. ముఖ్యంగా నూనె గింజల చెక్కలను తేమలో నిల్వ చేయడం వల్ల బూజు పెరిగే ప్రమాదం ఉంటుంది.

  1. ప్రోటీన్‌తో పాటు శక్తి ఎందుకు అవసరం?
    ఇది రైతులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం.
    పశువుల శరీరానికి పని చేయడానికి, మేతను జీర్ణం చేయడానికి, పాల తయారీకి శక్తి అవసరం. పిండి పదార్థాలు, పీచు పదార్థాల నుంచి లభించే శక్తి ఈ అవసరాలకు తోడ్పడుతుంది.

మేతలో ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పటికీ, శక్తి సరిపోకపోతే పశువు ఆ ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోవచ్చు. మరోవైపు, శక్తి ఎక్కువగా ఉండి ప్రోటీన్ తక్కువగా ఉంటే కూడా ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతినవచ్చు.

అందువల్ల పశువులకు పచ్చిమేత, ఎండుమేత, సమతుల్య దాణా సరైన మోతాదుల్లో అందించాలి. కేవలం ప్రోటీన్ పదార్థాలనే ఎక్కువగా వేయడం సరైన పద్ధతి కాదు.

  1. ప్రోటీన్ లోపాన్ని ఎలా గుర్తించాలి?
    ప్రోటీన్ లోపం ఉన్నప్పుడు పశువుల్లో పాల దిగుబడి తగ్గడం, శరీర బరువు తగ్గడం, కండరాలు క్షీణించడం, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అయితే ఇవే లక్షణాలు ఇతర పోషకాల లోపాలు, పరాన్నజీవులు, దీర్ఘకాలిక వ్యాధులు లేదా తక్కువ మేత తీసుకోవడం వల్ల కూడా రావచ్చు.

కాబట్టి పాల దిగుబడి తగ్గిన వెంటనే ప్రోటీన్ లోపమే కారణమని నిర్ణయించకూడదు. పశువు ఆరోగ్యం, మేత తీసుకునే పరిమాణం, పేడ స్థితి, శరీర బరువు, పాల ఉత్పత్తి వివరాలను పరిశీలించాలి. అవసరమైతే పశువైద్యుడి సలహా తీసుకోవాలి.

  1. పశువులకు ప్రోటీన్ ఎంత ఇవ్వాలి?
    ప్రతి పశువుకు ఒకే మోతాదులో ప్రోటీన్ ఇవ్వడం సరైన పద్ధతి కాదు. దాని అవసరం ఈ అంశాలపై ఆధారపడి ఉంటుంది:
    • పశువు ఆవు లేదా గేదె అనే విషయం, దాని జాతి, శరీర బరువు.
    • రోజుకు ఇచ్చే పాల పరిమాణం, పాలలోని కొవ్వు మరియు ఇతర ఘన పదార్థాల శాతం.
    • పశువు ఈనిన తరువాత ఎన్ని రోజులకు ఉంది, గర్భధారణ స్థితి.
    • పచ్చిమేత, ఎండుమేత, దాణా నాణ్యత మరియు పరిమాణం.
    • పశువు ఆరోగ్య పరిస్థితి, శరీర స్థితి.

ఉదాహరణకు, రోజుకు 5 లీటర్ల పాలు ఇచ్చే పశువు, 15 లీటర్ల పాలు ఇచ్చే పశువు పోషక అవసరాలు ఒకేలా ఉండవు. అధిక పాల దిగుబడి ఉన్న పశువులకు సాధారణంగా ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి.
దాణా ప్రణాళికను రూపొందించేటప్పుడు మొత్తం ఆహారంలో ఉన్న ప్రోటీన్, శక్తి, పీచు పదార్థాలు, ఖనిజాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రోటీన్ శాతాన్ని మాత్రమే చూసి దాణా నిర్ణయించకూడదు.

  1. ప్రోటీన్ ఎక్కువగా ఇస్తే పాలు తప్పనిసరిగా పెరుగుతాయా?

లేదు. ఇది రైతులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.

పశువుకు అవసరమైన ప్రోటీన్ ఇప్పటికే అందుతున్నప్పుడు మరింత ప్రోటీన్ ఇవ్వడం వల్ల పాల దిగుబడి తప్పనిసరిగా పెరగదు. అదనపు ప్రోటీన్ శరీరంలో వినియోగించబడటానికి బదులుగా విచ్ఛిన్నమై, దాని నత్రజని భాగం ప్రధానంగా మూత్రం ద్వారా బయటకు వెళ్లవచ్చు. దీనివల్ల దాణా ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
కాబట్టి పాల దిగుబడి పెంచడానికి ఖరీదైన ప్రోటీన్ దాణాను మాత్రమే ఎక్కువగా ఇవ్వడం కంటే, అందుబాటులో ఉన్న మేత పదార్థాలను శాస్త్రీయంగా ఉపయోగించి సమతుల్య దాణా అందించడం ఉత్తమం.

పాడి పశువుల పెంపకంలో అధిక పాల దిగుబడితో పాటు లాభదాయకత కూడా ముఖ్యమైనది. ప్రోటీన్ పాల తయారీకి, రుమెన్ సూక్ష్మజీవుల పెరుగుదలకు, మేత జీర్ణక్రియకు, శరీర కణజాలాల నిర్వహణకు తోడ్పడుతుంది. అయితే పాల ఉత్పత్తి అనేది ఒక్క ప్రోటీన్‌పై ఆధారపడదు. శక్తి, మేత నాణ్యత, నీరు, ఖనిజ లవణాలు, పశువు ఆరోగ్యం, జన్యు సామర్థ్యం, సరైన యాజమాన్యం అన్నీ కలిసి ప్రభావం చూపుతాయి.

రైతులు తమ పశువుల అవసరాలకు తగిన సమతుల్య దాణాను అందిస్తే, పోషకాహార లోపాలను తగ్గించి, పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు దాణా ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

జి. రాంబాబు, పశువైద్యాధికారి, కడప. Ph: 9494588885

Read More

గోపోషణ… అనారోగ్యంగా వున్న గోవు ప్రవర్తన

ఏ మాత్రం హుషారు లేక, యజమానిని, తోటి గోవులను పట్టించుకోకుండా వుంటుంది. బాధతో వున్నప్పుడు తల వాల్చి, చెవులు వేళ్ళాడవేసి, కాంతి లేని కళ్ళతో, కన్నీరు కారుస్తూ, కనుగుంటలు వదిలి, ముట్టె తడి ఆరిపోయి వుంటుంది.

వెంట్రుకలు నిక్కపొడిచి, రోమాలు నల్ల కప్పు వేసి, ముణగదీసుకొని, డొక్కలో తల పెట్టుకొని పడుకుంటుంది.

చలాకీతనంలేక స్తబ్ధుగా వున్నట్లుగా, ప్రశాంతత లేక అస్థిరంగా కదులుతున్నట్లుగా, హుషారుగా లేక దుఃఖంతో బాధపడుతున్నట్లుగా అసాధారణ చర్యలు, నడక, నిలబడే పడుకునే విధానాలు, ముఖకవళికలు, ప్రవర్తనను బట్టి గోవును చూడగానే, అనారోగ్యంతో వున్నట్లు తేలికగా గ్రహించగలిగే వీలుంటుంది.

ఇంకా ముట్టెవిరుస్తూ, ముక్కుల వెంట నీరు, చీమిడి కారుస్తూ, శ్వాస దుర్వాసనతో వుండి, ఆయాస పడుతూ, మలుగుతూ, మందకొడిగా వుంటుంది.

ఎంతో జాలిగా అరుస్తూ, అలసటగా, అసౌకర్యంగా కదులుతూ, వణుకుతూ, కాళ్ళు తడబడుతూ, నిలబడలేక పోతుంది. 

నోటి వెంట చొంగ కారుస్తూ, చిక్కని నురుగు వేస్తూ, పళ్ళు నూరుతూ, నాలుక ఆడించలేకుండా వుంటుంది.

ఆకలి మందగించి, మేత మేయక లేదా అరమేత మేస్తూ, నీరు త్రాగక, నెమరు వేయక, చర్మంపై, ముఖంపై వాలిన ఈగలను తోలుకోలేక, నిస్త్రాణంగా వుంటుంది.

జాలిగా, దిగాలుగా, బాధవున్న భాగాన్ని తరచూ చూస్తూ, నాకుతూ, కాళ్లతో తన్నుతూ వుంటుంది.

జ్వరం వుండవచ్చు, గురక వుండవచ్చు, కంతులు ఏర్పడవచ్చు, కుంటవచ్చు.

మలమత్రాలు రాకపోవచ్చు లేదా తక్కువ, ఎక్కువ పరిమాణంలో, ముక్కుతూ, బాధ పడుతూ, రంగు మారి, దుర్వాసనతో, పలుచగా, గట్టిగా చీము, రక్తంతో కూడి వుండవచ్చు.

దూడను కుడవనివ్వకపోవచ్చు. పాలు ఇవ్వకపోవచ్చు లేదా తగ్గవచ్చు, పొదుగు పట్టుకోనివ్వకపోవచ్చు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఎల్‌నినో పరిస్థితుల్లో జొన్న సాగుకు అనుకూలమైన యాజమాన్య పద్ధతులు


ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమ మరియు తక్కువ వర్షపాత ప్రాంతాల్లో వర్షపాతం లోటు, వర్షాల మధ్య ఎక్కువ విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు మరియు నేలలో తేమ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు జొన్న సాగులో వాతావరణ అనుకూల (Climate-resilient) యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎల్‌నినో ప్రభావం నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు.

సెప్టెంబర్‌- అక్టోబర్ మాసాలలో కురిసే వర్షాల ద్వారా లభించే నేల తేమను సద్వినియోగం చేసుకొని జొన్నను సాగు చేయడం రాయలసీమతో పాటు ఇతర మెట్ట ప్రాంతాల రైతులకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. జొన్న పంట తక్కువ నీటి లభ్యతను తట్టుకోవడంతో పాటు, అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతం అనిశ్చిత పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఈ పరిస్థితుల్లో అనుకూలమైన పంటగా నిలుస్తుంది.

అయితే, ఎల్‌నినో పరిస్థితుల్లో జొన్నలో సకాలంలో విత్తడం, స్వల్పకాలిక మరియు కరువు/వర్షాభావాన్ని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం, సరైన మొక్కల సాంద్రతను పాటించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, సకాలంలో కలుపు నివారణ, నేల తేమ సంరక్షణ మరియు సమగ్ర చీడపీడల యాజమాన్యం వంటి పద్ధతులను తప్పనిసరిగా పాటించడం ద్వారా పంట దిగుబడిని స్థిరంగా పొందే అవకాశం ఉంటుంది.

జొన్న సాగుకు ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు:

  1. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తాలి: వర్షం పడిన వెంటనే పొడిగా ఉన్న నేలలో విత్తకుండా, నేలలో తగినంత తేమ ఏర్పడిన తరువాత మాత్రమే విత్తాలి. విత్తిన తరువాత ప్రారంభ దశలో తేమ కొనసాగేందుకు అనుకూలమైన వర్షపాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. స్థానిక వాతావరణ సూచనలను పరిశీలించి విత్తే నిర్ణయం తీసుకోవడం మంచిది.
  2. స్వల్పకాలిక, కరువు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి: ఎల్‌నినో పరిస్థితుల్లో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున, స్వల్పకాలికంగా కోతకు వచ్చే, బెట్ట పరిస్థితులను తట్టుకోగల మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన సిఫారసు చేసిన జొన్న రకాలు లేదా సంకరాలను ఎంపిక చేసుకోవాలి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఎన్.టి.జె.-5 (తెల్ల జొన్న) మరియు ఎన్-15 (పచ్చ జొన్న) రకాలు తక్కువ వర్షపాతం గల ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలుగా గుర్తింపు పొందాయి. రైతులు ధృవీకరించిన, నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే వినియోగించి, వర్షపాతం లభ్యత మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
  3. విత్తే సమయం, సరైన విత్తన మోతాదు మరియు మొక్కల సాంద్రత పాటించాలి: జొన్న పంటను సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ రెండవ పక్షం వరకు వేసుకోవచ్చు. సాధారణంగా ఎకరాకు 3–4 కిలోల నాణ్యమైన విత్తనం ఉపయోగించాలి. వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 10–15 సెం.మీ. దూరం ఉండేలా విత్తాలి. విత్తనాన్ని సుమారు 2–3 సెం.మీ. లోతులో వేయాలి. ఎల్‌నినో పరిస్థితుల్లో నేల తేమ పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున అధిక మొక్కల సాంద్రతను నివారించాలి.
  4. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి: విత్తన శుద్ధి పద్ధతులను పాటించడం ద్వారా మొలక దశలో వచ్చే విత్తన, నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.
  5. సేంద్రియ పదార్థాల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి: బాగా కుళ్లిన పశువుల ఎరువును ఎకరాకు 4–5 టన్నుల వరకు విత్తే ముందు నేలలో కలపాలి. దీనివల్ల నేల భౌతిక లక్షణాలు, తేమ నిల్వ సామర్థ్యం మరియు పోషకాల లభ్యత మెరుగుపడతాయి. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం లేదా తగిన విధంగా సంరక్షించడం కూడా నేల తేమ పరిరక్షణకు ఉపయోగపడుతుంది.
  6. ప్రారంభ దశలోనే కలుపు నివారణ చేపట్టాలి: జొన్న పంటలో ప్రారంభ దశలో కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తిన 15–20 రోజుల్లో మొదటి కలుపు నివారణ, అవసరమైతే 30–35 రోజుల్లో రెండోసారి కలుపు నివారణ చేపట్టాలి. వరుసల మధ్య అంతరకృషి చేయడం ద్వారా కలుపును నియంత్రించడంతో పాటు నేల తేమను సంరక్షించవచ్చు.
  7. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి: ఎల్‌నినో పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్నా, అప్పుడప్పుడు కురిసే వర్షపు నీటిని వృథా కాకుండా పొలంలోనే సాధ్యమైనంత ఎక్కువగా నిలుపుకొని నేలలోకి ఇంకేలా చూసుకోవాలి. ఇందుకోసం వర్షం వచ్చిన వెంటనే పొలంలో నీరు వేగంగా బయటకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు పొలాన్ని సమతలంగా ఉంచడం, పొలంలో చిన్న చిన్న అడ్డుకట్టలు ఏర్పాటు చేయడం, వరుసల మధ్య అంతరకృషి చేయడం వంటి సులభమైన పద్ధతులను పాటించాలి.

అలాగే వర్షం తరువాత నేలపై తేమను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి కలుపు మొక్కలను సకాలంలో తొలగించి, అవసరమైతే పంట అవశేషాలను నేలపై ఉంచడం మంచిది. అయితే అధిక వర్షం వచ్చినప్పుడు పొలంలో నీరు నిలిచిపోకుండా అదనపు నీటిని బయటకు పంపేలా చూసుకోవాలి.

  1. కీలక దశల్లో నీటిని సమర్థంగా వినియోగించాలి: నీటి వసతి ఉన్న రైతులు పరిమిత నీటిని పంటకు అత్యంత అవసరమైన పూత మరియు గింజ ఏర్పడే దశల్లో వినియోగించాలి. అధిక నీటిపారుదల చేయకుండా పంట అవసరానికి అనుగుణంగా నీటిని అందించాలి.
  2. చీడపీడలు, తెగుళ్లపై అప్రమత్తత: వర్షాభావం, బెట్ట పరిస్థితుల్లో పంట బలహీనపడే అవకాశం ఉన్నందున కాండం తొలుచు పురుగు, మొవ్వ తొలిచే ఈగ, కాండం తొలుచు పురుగు తదితర చీడపీడలను రైతులు తరచుగా గమనించాలి. అదేవిధంగా ఆకు మచ్చ తెగుళ్లు, కంకి/గింజలకు సంబంధించిన తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.
  3. కోత మరియు నిల్వ; జొన్న కంకులు పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాత కోత చేపట్టాలి. గింజల్లో అధిక తేమ ఉన్నప్పుడు నిల్వ చేయకుండా, సురక్షితమైన తేమ స్థాయికి బాగా ఎండబెట్టి శుభ్రమైన, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. గోదాములను ముందుగానే శుభ్రపరచి, తేమ లేకుండా ఉంచడం ద్వారా నిల్వలో పురుగు, శిలీంధ్రాల సమస్యలను తగ్గించవచ్చు.

డా. ఎస్. ఇషా పర్వీన్, శాస్త్రవేత్త (వృక్ష ప్రజననం), డా. కె. అరుణ్ కుమార్, శాస్త్రవేత్త (సస్య ఉత్పత్తి),
డా. వి. జయలక్ష్మి, పరిశోధన సహ సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల. Ph: 7013020221

Read More

ఔషధ మొక్క…. మామిడి అల్లం

ఇది ఒక చిన్న బహువార్షికపు మొక్క, కాండము భూమిలోపలే ఉంటుంది. దీని ఆకులు లేతగా, బల్లెం ఆకారములో చిన్నవిగా ఉంటాయి. పసుపు పచ్చ పువ్వులు పూస్తాయి. ఫలాలు, విత్తనములు నల్లగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. సన్నగా సుమారు 10 సెం.మీ. పొడవు దుంపలుంటాయి. ఇది దుంపల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సాధారణ నామం : మ్యాంగో జింజర్, ఆమ్ అద్రక్ శాస్త్రీయ నామం : కర్కుమా అమాడ కుటుంబం: జింజిబెరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మామిడి అల్లం దుంప, కొమ్ములు ఆవిరయ్యే తైలం మరియు కొన్ని ఘాటైన రసాయనాలు కలిగి ఉండి ఔషధములలో వాడబడుతుంది. తైలం (1.1%) నందు లినాలూల్, మిర్సిన్, ఆసిమిన్, శాఫ్రోల్ మరియు లినాలైల్ ఎసిటేట్ అనబడు రసాయనాలు ఉంటాయి.
  • మామిడి అల్లం చలవ చేయుటకు, జీర్ణశక్తిని పెంచుటకు, వంటలలో ఉపయోగిస్తారు. దీని దుంపలను నూరి అందులో సారాయిని, కోడిగుడ్డు సొనను వేసి కలిపి తట్టువేసిన, కనబడని దెబ్బలు, గాయాలు, నొప్పులు హరించును. దీని దుంపలు సెగరోగం, నీళ్ళవేరచనాలను అరికడతాయి. కామ ప్రవృద్ధికి, మూత్రమును సులువుగా జారీచేయుటకు, కడుపులో పుండ్లకు, చర్మవ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, మలబద్ధకం నివారణకు, చెవినొప్పిని తగ్గించుటకు దీనిని ఉపయోగించెదరు. దుంప కొమ్ములతో చట్నీచేసి ఉపయోగించిన ఆకలి వృద్ధి చేస్తుంది.

వ్యవసాయరంగంలో

  • మామిడి అల్లం ఆకుద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సీరియస్, ప్రోటియస్ మిరాబిలిస్, ప్రోటియస్ వుల్గారిస్, సెర్రేషియా మార్సెసెన్స్, ఎస్కెరిచియా కోలి, క్లెబ్సియెల్లా న్యుమోనియే, బాసిల్లస్ సబ్‌టైలిస్, ఎంటరోబాక్టర్ ఈరూజినెస్, సూడోమోనాస్ ఈరూజినోసా, విబ్రియో కలరా, స్ట్రెప్టోకోకస్ న్యుమోనియే, సాల్మొనెల్లా పారాటైఫిలపై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (జార్ౙి అండ్ బ్రిట్టో, 2016).
  • మామిడి అల్లం దుంపపొడి గోధుమ నిల్వ ధాన్యంలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని అత్యంత సమర్ధవంతంగా ఎక్కువ పురుగులను చంపి, పెద్ద పురుగుల విడుదలను తగ్గించింది (పటేల్, 2006).
  • మామిడి అల్లం ఇథనాల్ ద్రావణం యాంటీబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించింది (హారిట్, అతని అనుచరులు, 2013).
  • మామిడి అల్లం దుంపలో శక్తివంతమైన కీటకనాశక చర్య ప్రదర్శించే రసాయనాలున్నాయి (జగజీవన్‌రామ్, అతని అనుచరులు, 2014).
  • మామిడి అల్లం ఎసెన్షియల్ ఆయిల్ హౌస్‌ఫ్లెå, మస్కాడొమెస్టికపై 100% వికర్షక చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 1991)
  • మామిడి అల్లం ఎసెన్షియల్ ఆయిల్ చెరకు పంట నాశించే ఒడొంటో టెర్మెస్ ఒబెసస్‌పై కీటకనాశక చర్యను ప్రదర్శించింది (గుర్దీప్‌సింగ్, అతని అనుచరులు, 2002).
  • మామిడి అల్లం ద్రావణం యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉందని ఋజువు చేయబడింది. పర్యావరణహిత పురుగు మందు, కర్కుమా అమడక్రూడ్ ఎక్స్‌ట్రాక్ట్స్ (సియెసిఇ) ఆపిల్ మరియు పియర్ పంటలలో ఫైర్ బ్లెåట్ బాక్టీరియా తెగులు కలిగించే ఎర్వినియా ఎమైలోవోర పై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది.
  • మామిడి అల్లం దుంప క్లోరోఫాం ద్రావణం నుండి మొట్టమొదటిసారి వేరు చేసిన లాబ్డేన్ డైటెర్పీన్ డయాల్డిహైడ్ మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌పై యాంటి ట్యూబర్‌క్యులార్ చర్యను ప్రదర్శించింది (శైలేంద్రసింగ్, అతని అనుచరులు, 2010).
  • మామిడి అల్లం ఎసెన్షియల్ ఆయిల్ మోనోటెర్పెనాయిడ్ కాంపౌండ్స్‌ని అధికంగా కలిగి ఉండి మంచి యాంటిఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది (జార్జి, అతని అనుచరులు, 2015).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

గోపోషణ… ఆరోగ్యంగా ఉన్న గోవు ప్రవర్తన ఎలా ఉంటుంది?

గోసంతతి తగ్గిపోతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోన్న వేళ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గోశాలల నిర్వాహకుల కృషి, ఆ ఆందోళనను దూరం చేస్తోందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్తె, లంగాణ వ్యాప్తంగా వందల కొద్దీ దేశీయ గోశాలలు ఉన్నాయి. వాటిలో అనేక రకాల దేశీయ ఆవుల పోషణ, సంరక్షణ జరుగుతోంది. వారి ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తోంది. గోవుల సంతతి అభివృద్ధి చెందుతోంది. గోశాలల నిర్వహణ మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలతో కీలకమైన సమాచారం ప్రతి రైతు, గోశాల నిర్వాహకులకి తెలియాలి. అప్పుడే మరింత సమర్థంగా గోశాలలను నిర్వహణ చేపట్టి, ఇంకా మెరుగైన ఫలితాలు సాదించగలరు. అటువంటి సమాచారాన్ని రైతునేస్తం గోపోషకులకు నిరంతరం అందజేసేందుకు నడుం కట్టింది.

ఆరోగ్యంగా ఉన్న గోవుల ప్రవర్తన ఎలా ఉంటుంది?

ఆరోగ్యంగా వుండే పశుగణాలన్నీ హుషారుగా, రంకెలు వేస్తూ, అంబారావాలు చేస్తూ… పరిసరాల్ని, యజమానిని, తోటి పశువుల్ని నిశితంగా గమనిస్తూ, అటూయిటూ చలాకీగా కదులుతూ, చక్కగా స్పందిస్తూ, మేతపై ఎక్కువ దృష్టిపెట్టి వుంటాయి.

ఇష్టంగా మేత మేస్తాయి. నీళ్ళు త్రాగుతాయి, నెమరు వేస్తాయి.

ముక్కు గోళాలు తరచూ నాకుతూ వుంటాయి. ముట్టె చెమాయింపుతో వుంటుంది.
తేట కళ్ళతో, ఠీవిగా ప్రవర్తిస్తూ, ముఖంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, చకచక అంగలు వేస్తూ, ఉరకలు వేస్తూ, చూసే మనకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.

చెవులు నిక్కించి చూస్తూ, తోక ఆడిస్తూ, పని చేసేటప్పుడు తీరైన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, అటూ యిటూ తల ఊపుతూ, హుషారుగా వుంటాయి.

చర్మం మృదువుగా వుంటుంది. చర్మం మీద నాలికతో నాకినప్పుడు, ఏర్పడే రోమం గుర్తులు వుంటాయి. చర్మాన్ని ఎప్పుడూ కదిలించటం, జలదరించటం చేస్తాయి. వెంట్రుకలు మెత్తగా జారిపోతూ వుంటాయి.

సమయానుసారంగా, బాధ లేకుండా, పూర్తి పరిమాణంలో మల మూత్ర విసర్జన చేస్తాయి. పేడ మరీ గట్టిగా గాని, మరీ పలచగా గానీ కాకుండా, మామలు రంగులో వుంటుంది.

పాలిచ్చే ఆవులు, పాలు తగ్గకుండా ఇస్తాయి.

గోవులు తాము పూర్తి ఆరోగ్యంగా వున్నట్లుగా, తమ ప్రవర్తన ద్వారా సంకేతాలనిస్తాయి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని ‘ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

సేంద్రీయ వరి సాగులో చీడపీడల యాజమాన్యం

సేంద్రీయ వ్యవసాయం అనేది కృత్రిమ ఎరువులు, పురుగుమందులు, జన్యుపరంగా మార్పు చెందిన విత్తనాలు వంటి రసాయనాలను వాడకుండా, సేంద్రీయ పదార్థాలు, జీవ -ఎరువులు (కంపోస్ట్, పచ్చిరొట్ట), జీవ-నియంత్రణ పద్ధతులను ఉపయోగించి నేల సారవంతాన్ని, పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక సుస్థిర వ్యవసాయ పద్ధతి. 1956-60 మధ్య కాలంలో రసాయన ఎరువుల వాడకం ప్రారంభమై, క్రమేపి వాటి వాడకం పెరిగి, కేవలం రసాయనిక ఎరువులు మాత్రమే వాడే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. రసాయనిక ఎరువులు మాత్రమే కాకుండా పురుగు మందులు, తెగులు మందులు, కలుపు మందులు, పంటలు ఏపుగా పెరగటానికి కృత్రిమ హార్మోన్ల వాడకం పెరిగింది. రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను, పంట అవశేషాలను నేలకు అందించమని చెపుతున్నప్పటికీ సమగ్ర పంట విధానాలను పక్కన పెట్టి కేవలం రసాయనాలతో మాత్రమే మొక్కకు పోషణ అందిస్తూ నేల ఆరోగ్యాన్ని పక్కన పెట్టేయడంతో నేలలో నీటిలో, పంట ఉత్పత్తులలో అనేక హానికర రసాయన అవశేషాలు చేరడం అనేది చాలా ఆందోళన చెందవలసిన అంశం. అయితే ప్రస్తుతం నెలకొన్న తీవ్ర పరిణామాలు చూసినట్లయితే ముఖ్యంగా నేల, నీరు, వాతావరణం కలుషితమవ్వడంతో పాటు తినే ఆహార పదార్ధాలలోనికి విషపూరిత పదార్ధాలు చేరడం, మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావం పడడం వంటి అంశాలను ప్రతి రైతు గ్రహించి తన సేద్య విధానాలను మెరుగు పర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక క్రమ పద్ధతిలో, ప్రణాళికాబద్ధంగా, దశల వారీగా రైతు సేంద్రియ సాగు విధానాలను అలవాటు చేసుకుంటూ రసాయనిక సేద్యాన్ని తగ్గించుకోవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. వరి సాగులో అనేక రకాల చీడపీడలు ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. వీటి నివారణకు సేంద్రీయ పద్ధతులను అవలంభించడం వలన సాగు ఖర్చు తగ్గి నాణ్యమైన పంట ఉత్పత్తులను పొందవచ్చు.

వరిని ఆశించు చీడపురుగులు

కాండం తొలుచు పురుగు

  • నారు కొనలను త్రుంచి నాటుకొన్నట్లైతే గుడ్ల సముదాయాన్ని నివారించడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చును. అధికంగా ఉన్న నారును నేలలో కలిపి వేయాలి.
  • పురుగు ఉధృతి తెలుసుకోవడానికి మరియు నివారణకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలు, 8 చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి.
  • పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
  • ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గ్రుడ్ల సముదాయం ఉన్నకార్డులను మూడు దఫాలుగా నాటిన 20 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లైతే కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును
  • పశువుల పేడ (5 కిలోలు), పశువుల మూత్రం (5 లీటర్లు) 4 రోజులు మురగ బెట్టిన తర్వాత 150 గ్రాముల సున్నం కలుపుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవాలి (లేదా)
  • ఆవుమూత్రం, పచ్చిమిర్చి మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 3-4 లీటర్ల కషాయం 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించవచ్చును (10 లీటర్ల మూత్రానికి, ఒక కిలో పచ్చి మిరప కాయల ముద్ద 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).

ఆకు ముడత

  • వేసవి దుక్కులు చేయడం ద్వారా సుప్తావస్థలో ఉన్న పురుగు గ్రుడ్ల సముదాయాన్ని మరియు కలుపు విత్తనాలను నిర్మూలించవచ్చు.
  • వేపనూనె (1500 పి.పి యం) లీటరు నీటికి 5 మి.లీ. కలుపుకొని నాటిన 20 మరియు 30 రోజులకు పిచికారి చేసుకోవాలి (లేదా)
  • ఆవుమూత్రం, సీతాఫలం ఆకులు మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 2-3 లీటర్లు, 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా ఆకు ముడత నివారించవచ్చును (10 లీటర్ల మూత్రానికి, 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).
  • బాసిల్లస్ తురంజెన్సిస్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలుపుకొని నాటిన 30-40 రోజుల మధ్యలో పిచికారీ చేసుకొన్నట్లైతే ఆకు ముడతను నివారించుకోవచ్చును.
  • ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 15 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లైతే ఆకు ముడతను సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.

దోమ పోటు

  • తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, కృష్ణవేణి, భావపురి సన్నాలు మరియు శ్రీధృతి రకాలను ఎంచుకోవాలి.
  • దోమపోటు నివారణకు కాలి బాటలు తీయడం (ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తీసుకోవాలి)
  • పొలానికి వైకల్పికంగా నీరు కట్టడం మరియు ఆరబెట్టడం చేయాలి.
  • మెటారైజియం లేదా బవేరియా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని రెండు సార్లు పిచికారి చేసుకోవాలి మరియు వేపనూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకొన్నట్లైతే నివారించుకోవచ్చును.
  • ఉదయం పూట వరి తవుడుతో (5-10 కి.) పాటు వేపనూనె ఒక లీటరు కలుపుకొని పొలంపై చల్లుకున్నట్లైతే దోమను కొంత వరకు తగ్గించుకోవచ్చును.
  • ఆవుమూత్రం మరియు తూటికాడల కషాయం ఎకరానికి 100 లీటర్లు మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చును (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చును).
    ఆకు నల్లి/ కంకి నల్లి, కంపు నల్లి
    ܀ ఆవుమూత్రం మరియు తూటికాడల కషాయం ఎకరానికి 100 లీటర్లు మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చును (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తర్వాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చును).

వరిని ఆశించు తెగుళ్లు

  1. అగ్గితెగులు, పొడ తెగులు, దుబ్బు కుళ్ళు, గోధుమ రంగు మచ్చ
  • తట్టుకొనే రకాలను ఎంచుకోవాలి.
  • పొలంలో మరియు పొలం గట్ల పై కలుపు లేకుండా చూసుకోవాలి.
  • సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కిలో విత్తనానికి 10 గ్రాములు చొప్పున లేదా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున కలుపుకొని లేదా లీటరు నీటికి 30 మి.లీ పంచగవ్య ద్రావణాన్ని కలుపుకొని 20 నిముషాలు పాటు విత్తనాన్ని లేదా నారును శుద్ధి చేసుకోవాలి.
  • లీటరు నీటికి 30 మి.లీ. పశువుల మూత్రాన్ని కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
  • ఎకరానికి 2 కిలోల చొప్పున సూడోమోనాస్ ప్లోరసెన్స్ నేలకు వేసుకోవాలి.
  • పచ్చిరొట్ట పంటలనునేలలో కలియ దున్నుకోవాలి.
  • మజ్జిగ (1 లీటరు) మరియు పశువుల మూత్రం (1 లీటరు) 8 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.
  • వరిలో వచ్చే చాలా రకాల తెగుళ్ళను మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో కొంతవరకు తగ్గించవచ్చును (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి).
  1. కాండం కుళ్ళు లేదా దుబ్బు కుళ్ళు తెగులు
  • నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసివేయడంతో పాటు మురుగునీరు పొలంలో లేకుండా చూసుకోవాలి.
  • సేంద్రియ ఎరువులను నేలకు అందించడం ద్వారా తెగులు ఉధృతి తగ్గించవచ్చును. * మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో తగ్గించవచ్చును (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి).
  1. ఆకు ఎండు తెగులు
  • తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, పుష్యమి, స్వర్ణ. అక్షయ వంటి రకాలను ఎంచుకోవాలి.
  • 10 లీటర్ల నీటికి 100 మి.లీ. వర్మీవాష్ మరియు 50 మి.లీ. పశువుల మూత్రం కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి లేదా పశువుల పేడ మరియు ఇంగువ ద్రావణాలను (10 శాతం) పిచికారీ చేయడం ద్వారా ఎండు తెగులును నివారించవచ్చును (5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రంతో పాటు 500 గ్రాముల బెల్లాన్ని కుండలోనికి తీసుకొని 5 రోజుల పాటు కలుపుకుంటూ 5వ రోజు 100 గ్రాముల ఇంగువను కలపాలి, 10 లీటర్ల కు 100 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి).
  • ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి.
  • పొలంగట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.

డా. కె. రేవతి (సస్యరక్షణ శాస్త్రవేత్త) మరియు డా డి సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి)
కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణా జిల్లా – 521 133. Ph: 8008201253

Read More

ఔషధ మొక్క…. నేలతాడి

సాధారణ నామం
కాలీముస్లి, నల్లముస్లి,
నేలతాడి గడ్డలు, నల్లనేలతాడి
శాస్త్రీయ నామం
కర్కులిగో ఆర్కియాయిడెస్
కుటుంబం: హైపోక్సిడేసి

ఇది ఒక చిన్న బహువార్షిక మొక్క, కాండము భూమిలోపలే ఉంటుంది. దీని ఆకులు లేతగా, బల్లెం ఆకారములో చిన్నవిగా ఉంటాయి. పసుపు పచ్చ పువ్వులు పూస్తాయి. ఫలాలు, విత్తనములు నల్లగా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. సన్నగా సుమారు 10 సెం.మీ. పొడవు దుంపలుంటాయి. ఇది దుంపల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • నేల తాడి దుంపలకు ఔషధ గుణములున్నాయి. ఈ దుంపల నుండి కర్కులిగోసాపోనిన్స్, ట్రైటెర్పిన్ ఆల్కహాల్ మొదలైన ఔషదీయ రసాయనాలు లభిస్తాయి.
  • దీని దుంపల చూర్ణం లేక కషాయం తీసుకొనిన క్షయ రోగం, మూలశంక, పచ్చకామెర్లు, చర్మరోగములు, బహిష్టు దోషములు, ఉబ్బసములను నివారిస్తుంది. పిప్పళ్ళ రసముతో పుచ్చుకొనిన పిచ్చికుక్క విషప్రభావాన్ని తగ్గిస్తుంది.
  • వేడినీళ్ళతో త్రాగి కడుపునొప్పి తగ్గించుటకు, ఆవుపాలతో త్రాగి ధాతుపుష్టి, వీర్యపుష్టి పెంచుటకు, ప్లీహమునకు సంబంధించిన జబ్బులకు నేలతాడిని ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • నేలతాడి మిథనాల్ దుంప ద్రావణంలో ఉన్న స్టీరాయిడ్ మిశ్రమం, ఇథైల్ ఐసోయాల్లోకోలేట్ యాంటిమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంది (డాస్ఫోడిల్, అతని అనుచరులు, 2012; బ్రింతా, అతని అనుచరులు, 2017).
  • గింజల నుండి వేరు చేసిన నూనెని పురుగు మందుగా ఉపయోగిస్తారు.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… నువ్వుల కారం పిండి

కావాల్సిన పదార్థాలు

  • తెల్లనువ్వులు
  • జీలకర్ర – కొంచెం
  • ఎండుమిర్చి – సరిపడా
  • ఉప్పు – రుచికి సరిపడా

తయారుచేయు విధానం:
తెల్ల నువ్వులు శుభ్రం చేసుకుని, ఎండలో పెట్టి, కొంచం సేపు ఎండగానే, తెచ్చి పక్కన పెట్టుకోవాలి, (ఎక్కువ సేపు ఎండలో పెడితే నూనె వస్తుంది) నువ్వులతోపాటు మిర్చి, జీలకర్ర కూడా ఎండబెట్టుకోవాలి. తరువాత అన్ని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ పట్టకూడదు.. నూనె వస్తుంది… అలానే రోట్లో దంచుకోవచ్చు కూడా.. తరువాత ఉప్పు కలిపి వాడుకోవడమే… నువ్వుల కారపు పిండిని నేరుగా అన్నంలో వేసుకుని, పచ్చి నూనె వేసుకొని తినవచ్చు. లేదా కూరలు, పులుసులో కూడా కలిపి వాడుకోవచ్చు.

రచన: సంధ్య శశికాంత్, వాకలపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More