మర్రి చెట్టు క్రింద మట్టిలో సూక్ష్మజీవులతో పాటు మైకొరైజా కూడా ఉంటాయి. ఈ మట్టిని సేకరించాలి. శ్రీశైలం, తిరుపతి, కాళహస్తి, మహానంది వంటి పుణ్యక్షేత్రాలలోని మట్టిని సేకరించాలి. అటవీ క్షేత్రాల్లో పెరిగే గడ్డి మొక్కలను పీకి వేర్లను కత్తిరించి సేకరించాలి. వీటన్నింటిలో మైకోరైజా ఉంటాయి.
మైకోరైజా తయారు చేసుకోవడానికి ముందుగా మీటరు వెడల్పు, 2 అ. లోతు, వీలుని బట్టి పొడవు నిర్ణయించుకున్న గొయ్యి తవ్వాలి. దానిలో ఒక ప్లాస్టిక్ కవర్ పరచి తవ్విన మట్టికి కొంత పశువుల ఎరువు కలిపి నింపుకోవాలి. స్వయంగా మైకోరైజా (వ్యామ్) స్పోర్లు సేకరించడం సాధ్యం కాకపోతే వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో కిలో ప్యాకెట్లుగా దొరికే వ్యామ్‌ని కల్చర్ (తోడు)గా వాడుకుని మైకోరైజాను తయారు చేసుకోవచ్చు. సేకరించిన మైకోరైజాను సిద్ధం చేసుకున్న గోతిలో మట్టిలో కలుపుకొని అందులో మెంతులు, తృణ ధాన్యాలు, వరి, పెసర, అలసంద, గింజలను చల్లి నీరు పెట్టాలి. గింజలు మొలకెత్తిన వెంటనే వాటి వేర్లకు అతుక్కుని మైకోరైజా వృద్ధి చెందుతుంది. గోతిలో వేసిన మట్టిలో 6వ వంతు మైకోరైజా కల్చర్ ఉండేటట్లు చూడాలి. గింజలను ఒక రోజు నీటిలో నానబెట్టి విత్తుకోవాలి. గింజలను కలగలిపి విత్తి నీరు పెట్టాలి. పెరుగుతున్న మొక్కలలో మూడు నెలల్లో మైకోరైజా వృద్ధి చెందుతుంది. మైకోరైజా వినియోగించుకోవాలనుకున్నపుడు 10 రోజుల ముందు నీరు నిలిపి మొక్కలను కోసి వేసి, మొక్కల వేర్లను పెకిలించి చిన్న ముక్కలుగా కత్తిరించాలి. కత్తిరించిన వేర్లను, మట్టిని పారతో తిరగేసి ప్లాస్టిక్ సంచుల్లో ఎత్తి పెట్టుకోవాలి.
ఏ పంటలకు వాడవచ్చు సిద్ధం చేసుకున్న మైకోరైజాను అన్ని ఉద్యాన పంటల్లో వాడవచ్చు. కూరగాయల నారుమళ్ళలో కలపవచ్చు. మైకోరైజాకు తోడుగా వర్మికంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వాడవచ్చు. మొక్కలు నాటేటప్పుడు లేదా విత్తనం విత్తేటప్పుడు మొదటి పొరగా మట్టి వేసి విత్తనం వేసే ప్రదేశంలో మైకోరైజా పొడిని పోసి, విత్తనం విత్తి, పైభాగంలో మళ్ళీ మట్టి పొరను అమర్చాలి. మొలచిన గింజల్లో అంకురం తొడిగిన వెంటనే మైకోరైజా శిలీంద్రం వేరును అంటిపెట్టుకుని విస్తరించడం మొదలవుతుంది. మొక్కలు నాటాలనుకున్నపుడు వేరుభాగం చుట్టూ మైకోరైజా చల్లి నాటుకుంటే సరిపోతుంది. పాదులలో తొలుత మట్టి నింపి ఒక పార మైకోరైజా మట్టి వేసి పై భాగం మట్టితో నింపాలి. మిరప, ఇతర కూరగాయల మొక్కలు నాటుకునేటప్పుడు వేర్లను తడిపి వాటిని మైకోరైజా పొడిలో అద్ది నాటుకుంటే సరిపోతుంది. మైకోరైజా వాడిన మొక్కలు బలంగా, ఏపుగా పెరగడంతో పాటు బెట్టను తట్టుకుంటాయి.
ట్రైకోడెర్మా, జీవన ఎరువులు కలిపి సత్తువ కల్గించిన పశువుల ఎరువు ఒక టన్ను బాగా చివికిన పశువుల ఎరువుకు 1కి. ట్రైకోడెర్మా హార్జియానం, 1 కి. అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం, 1 కి. ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బాక్టీరియా, 1 కి. సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్, 1 కి. పెసీలోమైసిస్ కలిపి, కుప్పపై నీరు చల్లి పాలిథిన్ షీట్ లేదా కొబ్బరి మట్టలతో కప్పి 15-20 రోజులుంచాలి. ఈ సత్తువ కలిగించిన పశువుల ఎరువును భూమిలో వేయడానికి ముందు 10 టన్నుల పశువుల ఎరువుతో కలపాలి.
సముద్రపాల అడవిలో ఇతర పొదలపై లేదా చెట్లపై ప్రాకే పెద్ద తీగ. దాదాపు 10-15 మీ. వరకు ప్రాకుతుంది. దాదాపు మొక్కలోని అన్ని భాగాలు తెల్లని రోమాలతో కప్పబడి ఉంటాయి. కొమ్మలు కత్తిరించినపుడు తెల్లని పాలవంటి జిగట పదార్థం వస్తుంది. ఆకులు పెద్దవిగా, హృదయాకారంలో ప్రతికణుపు వద్ద ఒకటి చొప్పున వస్తాయి. ఆకుల అడుగు భాగాన నూగు ఉంటుంది. పూలు పెద్దవిగా, గంట ఆకారంలో లేత వంగపండు రంగు లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి రక్షణ పత్రావళిలో కప్పబడి ఉంటాయి.
సాధారణ నామం : చంద్రపాల / కొక్కిత తీగ / ఎలిఫెంట్ క్రీపర్ శాస్త్రీయ నామం : ఆర్ౙిరీయా నెర్వోసా కుటుంబం: కన్వోల్యులేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వేర్లు, ఆకులు, లేతకాండాలను, గింజలను ఔషధాలుగా ఉపయోగిస్తారు.
గింజలలో అరజైన్, ఐసోఅరజైన్, పెన్నిక్లావైన్ అనే రసాయనాలున్నాయి.
ఆకులు మరియు లేత కాండాలను అజీర్ణం, మలబద్ధకం నివారణలో ఉపయోగిస్తారు.
ఆకుల నుండి తయారు చేసిన మాత్రలను మధుమేహ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో :
సముద్రపాల కాయలలో స్టీరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, ఫినాల్స్, టెర్పినాయిడ్స్ ఉంటాయి. వీటిలో లైసర్గమైడ్, స్టిగ్మాస్టన3, 5డైయిన్, ఎర్గాటమైన్ అనే మొక్కలకు పర్యావరణపరంగా ఉపయోగపడే ముఖ్యమైన జీవ చురుకుదనం గల పదార్థాలుంటాయి. వీటిని ఔషధాలు, డ్రగ్స్ ఫార్ములేషన్‌లో ఉపయోగిస్తారు (ఎకడె అండ్ మానిక్, 2015).
సముద్రపాల ఇథనాల్ ద్రావణాలు టెట్రోసైక్లిన్‌కి సమానంగా యాంటిమైక్రోబియల్ చర్యను ప్రదర్శించాయి. (మోడి, అతని అనుచరులు, 2010).
భారతదేశంలో సముద్ర పాల రసాన్ని, సమాన పరిమాణంలో నువ్వుల నూనె, కొంచం డిల్ గింజల పొడితో కలిపి స్కాబీస్ నివారణకు పైపూతగా పూస్తారు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
మైకోరైజా బహుళ ప్రయోజనకారి. పంటలను వేరుకుళ్ళు, ఎండుతెగులు వంటి తెగుళ్ళనుండి కాపాడటమేగాక, వర్షాభావ పరిస్థితుల్లో సుదూర లోతులో ఉన్న నీరు, పోషకాలను సంగ్రహించి మొక్కల వేర్లకు అందిస్తుంది. మైకోరైజాను రైతు వ్యవసాయ క్షేత్రంలోనే స్వయంగా తయారు చేసుకోవచ్చు.
తయారీ విధానం : 4 మీ. పొడవు, వెడుల్పు, అరగజం లోతులో గొయ్యి తీసుకోవాలి. అందులో మట్టి మృదువుగా ఉంటే అదే మట్టిని వాడుకోవచ్చు లేదా బయట నుండి మెత్తని మన్ను సేకరించి ఎండబెట్టి శుద్ధి చేసుకుని గోతిలో నింపాలి. దానిలో మెత్తని పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టు కలుపుకోవాలి. గోతిలో ప్లాస్టిక్ షీట్ పరవాలి. అందులో ఎరువు కలిపిన మట్టిని వేసి దానిలో 100 గ్రా. మైకోరైజా కల్చర్ ని కలిపి దానిలో వివిధ రకాల పప్పుధాన్యపు గింజలు, తృణధాన్యపు గింజలు, కూరగాయల గింజలు వరుసల వారీగా విత్తుకుని 40 రోజుల వరకు పెంచాలి. పెరిగిన పైరుకు వారం రోజుల పాటు నీటి తడిని ఆపి మట్టి పొడిబారిన తర్వాత మొక్కలపై కాండాలను కోసి వేయాలి. వేర్లను మట్టితో పాటు పెకలించి పొడి చేసుకుని సంచుల్లో నింపుకోవాలి. క్వింటాళ్ల కొద్ది మైకోరైజా వేర్లు అందుబాటులోకి వస్తాయి. వీటిని మెత్తగా దంచి అన్ని రకాల పైర్ల సాగులో, నారు మడుల పెంపకంలో వినియోగించుకోవచ్చు.
సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.
తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.
తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్‌ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.
వాటి మదర్ కల్చర్లను వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్‌ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.
పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ: (1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.
తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.
నేల ఆరోగ్యంపై ప్రభావం
పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మృత్తిక స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.
చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ.
దిగుబడి, ఆర్థిక అంశాలు మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయ ఆధారిత మొక్కజొన్న పంట దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన పొషకాల యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.
వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయం పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత హెర్బిసైడ్ ప్రయోగం వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.
చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది
సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.
ముగింపు పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.
చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³* ¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు, భారతదేశం.
ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.
మోతాదు : ఎకరానికి 50 లీటర్లు
కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.
తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.
అడవి సీతాఫలం అనోనేసి కుటుంబంలోని ఒక పూల మొక్క. ఈ మొక్కని సెనెగల్ నుండి సేకరించారు. ఇది ఒక పొద లేదా చిన్న చెట్టు. ఈ మొక్క 2 నుండి 6 మీ. ఎత్తు పెరుగుతుంది. బెరడు నున్నగా లేదా గరుకుగా గ్రే సిల్వర్ లేదా గ్రే బ్రౌన్ రంగులో ఉంటుంది. కొత్త కొమ్మలు మందమైన గ్రే, గోధుమ రంగు లేదా పసుపు రంగుతొడుగు కలిగి ఉంటుంది. తర్వాత వయసుతో పాటు ఊడిపోతుంది. ఆకులు ఆకుపచ్చ లేదా నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఆకుపై వైపున నూగు ఉండదు. అడుగువైపున నూగు ఉంటుంది. పూవ్వు 3 సెం.మీ. వ్యాసం కలిగి ఉండి 2 సెం.మీ. కాడపై ఏర్పడతాయి. కాయలు అనేక కలిసిపోయిన మెత్తని, ఉబ్బెత్తు 2.5-5.0 సెం.మీ. అండాకారం లేదా గుండ్రని పుష్పపు గర్భకోశాలు కలిగి ఉంటాయి.
సాధారణ నామం : వన్యసీతాఫలం / ఆఫ్రికన్ సీతాఫలం శాస్త్రీయ నామం : అనోనాసెనెగలెన్సిస్ కుటుంబం: అనోనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
పండులోని తెల్లని గుజ్జు ఆహ్లాదకరమైన అనాస పండు వాసనలో ఆప్రికాట్ రుచి కలిగి ఉంటుంది.
ఆకులను కొన్నిసార్లు కూరగా వండుకుని తింటారు. పూలను సుగంధద్రవ్యంగా ఉపయోగిస్తారు.
విచ్చుకోని పూల మొగ్గలను సూపులో ఉపయోగించుతారు.
మొక్క బెరడుని డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్, పాముకాటు, పళ్ళనొప్పి, శ్వాసకోశ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
అనేక మొక్క భాగాలను కలిపి చర్మ వ్యాధులు, క్షయ వల్ల కలిగే సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
అడవి సీతాఫలం గింజలు, బెరడుని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు.
రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌లో వన్య సీతాఫలం తాజా ఆకులను కోళ్ళగూళ్ళలో పరచి అవి ఎండే వరకు ఉంచుతారు. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేసి ఫ్లీస్, నల్లులను నివారిస్తారు.
వన్యసీతాఫలంలో టానిన్లు, ఫ్లేవనాయిడ్స్, సపానిన్స్, ఆల్కలాయిడ్స్, గ్లెåకోసైడ్లు, స్టీరాయిడ్లు, ఆవిరైపోయే నూనెలు, యాంథోసయనిన్స్ వంటి రసాయనాలు ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్, మాంగనీస్, ప్లాటినం, క్రోమియం వంటి ఖనిజాలతో పాటు ఆస్కార్బిక్ యాసిడ్, అమినో యాసిడ్లు కూడా ఉంటాయి. అందువలన అది ఒక ముఖ్య పోషక మూలం. దీని కాండం బెరడులో ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఉంటుంది. కాంగో అనే శాస్త్రవేత్త ఈ మొక్క ఆకులు, కాండం బెరడు, వేరు బెరడు, ఎపికార్ప్, మీసోకార్ప్‌లో ఎసెన్షియల్ ఆయిల్‌ని కనుగొన్నారు. దీని భాగాల నుండి వేరు చేసిన రసాయనాలు యాంటి మైక్రోబియల్ లక్షణాలు కూడా కలిగి ఉన్నాయి.
వన్య సీతాఫలం బెరడు, ఆకు పొడి, ద్రావణం మిరియాల పంటనాశించే వేరు బుడిపె నులి పురుగు (మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట)ల సంఖ్యను తగ్గించాయి (అగాఒ, ఫావోల్, 2015).
వన్య సీతాఫలం ఎండు ఆకులను ధాన్యం గింజలకు కలిపి నిల్వ సమయంలో ఆశించే పురుగులను నివారించవచ్చు. (థాకర్, 2002).
వన్యసీతాఫలం ద్రావణం కొన్ని జీవ చర్య మిశ్రమాలను కలిగి ఉండి, కీటక నాశక మరియు యాంటీ ఫీడెంట్ చర్యలతో నిల్వ ధాన్యంలో ఆశించే రెడ్ ఫ్లోర్ బీటిల్ (ట్రైబోలియం కాస్టానియం)ని అరికట్టింది (ఒసెని, అతని అనుచరులు, 2013).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ఇది నేలసారాన్ని మెరుగుపరచి, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను వృద్ధిచేస్తుంది. మొక్కలు బలంగా, ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడుతుంది. సేంద్రియ మరియు సహజ వ్యవసాయానికి ఇది చాలా అనువైనది.
మోతాదు: ఎకరాకు 200 లీటర్లు సాగు నీరు ద్వారా గానీ, భూమిపైన గాని చల్లాలి.
కావలసిన పదార్థాలు : ఆవుపేడ: 10 కేజీలు; ఆవు నెయ్యి : 250 గ్రాములు; తేనె / నల్లబెల్లం : 500 గ్రాములు.
తయారు చేయు విధానం: ముందుగా ఆవుపేడ మట్టి కుండలో వేసి పావుకిలో ఆవునెయ్యి వేసి సుమారు 2 గంటలు బాగా కలిపి తర్వాత తేనె లేక బెల్లపు నీరు (అరకేజి బెల్లంకు అర లీటరు నీరు) పోసి 2 గంటలు ఆవుపేడను బాగా పిసుకుతూ కలపాలి. తర్వాత నీటిలో కళ్ళాపిలాజేసి 200 లీటర్ల డ్రమ్ములో పోసి డ్రమ్మునిండా నీరు పోస్తూ కలుపుతుండాలి. డ్రమ్ము నింపిన తర్వాత మిశ్రమాన్ని సుమారు 3 లేక 4 గంటలు కర్రతో త్రిప్పి ఆ తర్వాత ఎకరం పొలంలో కళ్ళాపిలా చిమ్మడం గాని లేక పారుతున్న నీటిలో పోస్తూ గాని భూమికివ్వాలి.
సాధారణ నామం : కింగ్ బిట్టర్స్ శాస్త్రీయ నామం : ఏండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా కుటుంబం: అకాన్థేసి
కొన్ని ప్రాంతాలలో ‘కాల్‌మేఘ’ అని కూడా పిలువబడే మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. అనేక శాఖలున్న ఈ మొక్కల ఆకులు కణుపుకి రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పూలు జనవరి-అక్టోబర్ మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్లో (నవంబర్-జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్న భూములలోను, తేలికపాటి నేలల్లోను అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవడం జరుగుతుంది..
ఉపయోగాలు : వ్యవసాయరంగంలో
నేలవేము మొక్కల్లో ఉన్న ‘ఆండ్రోగ్రాఫోలిడ’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో “కషాయం”గా కానీ, “పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు.
నేల వేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ కషాయాన్ని పంటలనాశించే రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులపైన వాడి, సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
నేలవేము కషాయం తయారీ విధానం
ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కిలోల నేలవేము ఆకులవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 50 గ్రా. కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నపుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో బాగా కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ని నివారించవచ్చు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి
ప్రస్తుత కాలంలో రైతులు, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. రసాయన రహిత ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా పండించిన పంటలను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
సేంద్రియ వ్యవసాయం అనేది కృత్రిమ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా, కేవలం ప్రకృతి సిద్ధమైన వనరులతో పంటలు పండించే ఒక సాంప్రదాయ మరియు సుస్థిర సాగు పద్ధతి. దీనిని జీవ వ్యవసాయం లేదా పర్యావరణ వ్యవసాయం అని కూడా పిలుస్తారు.
సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటి? కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి విత్తనాలు, పురుగుమందుల వాడకాన్ని పూర్తిగా తొలగించి, ప్రకృతిలో లభించే సేంద్రియ పదార్థాల సహాయంతో చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. ఇందులో ఆవుపేడ, గోమూత్రం, శనగపిండి, బెల్లం, చెట్ల ఆకులు మొదలైన వాటితో ఎరువులను, పురుగుమందులను తయారు చేస్తారు. ఈ విధంగా పండించిన పంటల వల్ల కేవలం ఆరోగ్యానికి మేలు జరగడమే కాకుండా, భూమి సారాన్ని కూడా కాపాడుతుంది.
ప్రధాన సాగు పద్ధతులు
పంటల మార్పిడి: ఒకే రకమైన పంటను పదే పదే వేయకుండా, పంటను మార్చిమార్చి వేయడం ద్వారా భూమిలో నత్రజని శాతం పెరిగి నేల సారవంతమవుతుంది.
పచ్చిరొట్ట పైర్లు: జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి అవి పూతకు రాకముందే భూమిలో కలియదున్నడం.
వర్మికంపోస్ట్: వానపాముల సహాయంతో సేంద్రియ వ్యర్థాలను నాణ్యమైన ఎరువుగా మార్ౘ్ి పొలానికి అందించడం.
జీవామృతం: ఇది నేల సారాన్ని పెంచడానికి మరియు పంటలకు అవసరమైన సూక్ష్మజీవులను అందించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తయారు చేయడానికి ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములో 200 లీటర్లు నీటికి, 10 కిలోల ఆవుపేడ, 10 లీటర్ల గోమూత్రాన్ని వేసి బాగా కలపాలి. తరువాత 2 కిలోల బెల్లం, 2 కిలోల పప్పు దినుసుల పిండిని, పుట్టమట్టి లేదా గట్టు మట్టిని ఒక గుప్పెడు నీటిలో వేర్వేరుగా గడ్డలు రాకుండా కలుపుకొని గోనె సంచి లేదా కాటన్ గుడ్డను కప్పాలి. తయారైన రోజు నుండి 10 నుండి 12 రోజుల లోపు దీనిని సాగు నీటితో కలిపి గాని, లేదా వడకట్టి పంటలపై నేరుగా పిచికారి చేయడానికి ఉపయోగించవచ్చు.
సహజ తెగుళ్ల నివారణః వేప కషాయం, బ్రహ్మాస్త్రం వంటి సహజ కషాయాలను వాడి చీడపీడలను అరికడతారు.
కలిగే ప్రయోజనాలు రసాయన సాగు నుండి సేంద్రియ సాగుకు మారిన మొదటి రెండు, మూడేళ్లు దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉంది. మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు మంచి ధర లభించాలంటే ఖచ్చితమైన ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందడం రైతులకు కొంత ఖర్చుతో, ప్రక్రియతో కూడుకున్న పని. పండించిన పంటను సరైన ప్రీమియం ధరకు అమ్ముకోవడానికి కోల్డ్ స్టోరేజ్, రవాణా సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి. పేడ, బయోÐఫర్టిలైజర్స్ వంటి సహజ ఎరువుల తయారీకి, కలుపు తీయడానికి ఎక్కువ మందే కూలీలు అవసరమవుతారు.
ముగింపు: మొదట్లో దిగుబడి కొంత తక్కువగా ఉన్నప్పటికీ, రెండు లేదా మూడు పంటల తర్వాత స్థిరమైన మరియు మెరుగైన దిగుబడులను సాధించవచ్చు. నేటి తరానికి విషరహిత ఆహారాన్ని అందించాలన్నా, రేపటి తరానికి జీవమున్న భూమిని వారసత్వంగా ఇవ్వాలన్నా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఎంతైనా అవసరం.
డా. వై. చైతన్య, పిహెచ్.డి. స్కాలర్, హైదరాబాద్, ఫోన్: 9949804951