ఔషధ మొక్క…. నేలవేము
సాధారణ నామం : కింగ్ బిట్టర్స్ శాస్త్రీయ నామం : ఏండ్రోగ్రాఫిస్ పెనిక్యులేటా కుటుంబం: అకాన్థేసి
కొన్ని ప్రాంతాలలో ‘కాల్‌మేఘ’ అని కూడా పిలువబడే మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. అనేక శాఖలున్న ఈ మొక్కల ఆకులు కణుపుకి రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పూలు జనవరి-అక్టోబర్ మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క రబీ సీజన్‌లో (నవంబర్-జనవరి) ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉన్న భూములలోను, తేలికపాటి నేలల్లోను అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుత కాలంలో ఈ మొక్కను వైద్యం కోసం గృహాలలో కూడా పెంచుకోవడం జరుగుతుంది..
ఉపయోగాలు : వ్యవసాయరంగంలో
- నేలవేము మొక్కల్లో ఉన్న ‘ఆండ్రోగ్రాఫోలిడ’ అనే రసాయనం కీటకాలకు అభివృద్ధి నిరోధకంగా, భక్షక నిరోధకంగా, క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందువల్ల ఆకులను సస్యరక్షణలో “కషాయం”గా కానీ, “పంచపత్ర కషాయం (వివిధ ఆకుల ద్రావణం)”లో గానీ రైతులు ఉపయోగించుకోవచ్చు.
- నేల వేము కషాయంలో ఉన్న రసాయనాలు ఎంతో శక్తివంతమైనవి, ఈ కషాయాన్ని పంటలనాశించే రసం పీల్చే పురుగులు, ఆకులను తినే గొంగళి పురుగులు, కాండం తొలిచే పురుగులపైన వాడి, సమర్ధవంతంగా నివారించవచ్చని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
నేలవేము కషాయం తయారీ విధానం
- ఒక ఎకరం పొలంలోని పంటకవసరమయే కషాయం తయారు చేయడానికి సుమారు 5 కిలోల నేలవేము ఆకులవసరమవుతాయి. ఈ ఆకులను 10 లీటర్ల నీటిలో ఒక గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు 5 లీటర్ల వరకు ఉంటుంది. ఈ కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. వడపోసిన కషాయానికి 100 గ్రా. సబ్బుపొడిని లేదా 50 గ్రా. కుంకుడు కాయరసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి ఒక ఎకరం పొలంలో సాయంత్రం వేళ పిచికారి చేయాలి. కషాయం బాగా ఉడుకుతున్నపుడు ద్రావణాన్ని మధ్యమధ్యలో ఒక కర్రతో బాగా కలుపుతూ ఉండాలి. నేల వేము కషాయాన్ని కనీసం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు ఉపయోగించి వరిలో కాండం తొలుచు పురుగు (తెల్లకంకి)ని నివారించవచ్చు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి













