నోరూరించే వీధి రుచులు – వెంటాడే ప్రజారోగ్య సమస్యలు: ఓ సమగ్ర విశ్లేషణ

సాయంత్రం కాగానే వీధి మూలల్లో ఘుమఘుమలాడే మిర్చి బజ్జీలు, నోరూరించే పానీపూరీలు, వేడి వేడి ఫ్రైడ్ రైస్, చల్లని ఫ్రూట్ జ్యూస్‌లు.. ఇవి చూడగానే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో, ఉద్యోగుల నుండి విద్యార్థుల వరకు అందరికీ "స్ట్రీట్ ఫుడ్" (వీధి ఆహారం) అనేది దైనందిన జీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారిపోయింది. తక్కువ ధరకు దొరకడం, త్వరగా లభించడం, ఇంటి భోజనం కంటే భిన్నమైన రుచిని అందించడం దీనికి ప్రధాన కారణాలు.


అయితే, నాలుకకు రుచినిచ్చే ఈ ఆహారం మన జీర్ణాశయానికి, దీర్ఘకాలంలో మన ప్రాణాలకు ఎంత మేర భద్రతను ఇస్తుందనేది ప్రస్తుత సమాజంలో ఒక అతిపెద్ద ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదికల ప్రకారం, కలుషిత ఆహారం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఏమిటి? వాటిలోని రకాలు, పొంచి ఉన్న ఆరోగ్య ముప్పు, నియంత్రణ చర్యలు, మరియు ఆహార భద్రతా ప్రమాణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నోరూరించే వీధి ఆహారం: చాట్ తయారీ. Source: Leisa Tyler / LightRocket via Getty Images

వీధి ఆహారం (Street Food) అంటే?
వీధి ఆహారం అనగా రోడ్ల పక్కన, బహిరంగ ప్రదేశాల్లో, మార్కెట్లలో లేదా సంతలలో తాత్కాలిక బండ్లు, స్టాళ్లు, లేదా మొబైల్ వ్యాన్ల ద్వారా తయారు చేసి విక్రయించే తక్షణ వినియోగ ఆహారం లేదా పానీయాలు. ఇవి స్థానిక సంస్కృతిని, రుచులను ప్రతిబింబిస్తాయి. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో వీధి ఆహార రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించే అతిపెద్ద అసంఘటిత రంగం.

వీధి ఆహారాల లో రకాలు (Types of Street Foods)
వీధి ఆహారాలను వాటి తయారీ విధానం, పదార్థాలను బట్టి ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు:

  1. నూనెలో వేయించిన ఆహార పదార్థాలు (Deep Fried Snacks): నూనెలో డీప్ ఫ్రై చేసే మిర్చి బజ్జీలు, పునుగులు, సమోసాలు, పకోడీలు, వడలు. ఇవి తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందినవి.
  2. చాట్ మరియు స్నాక్స్ (Chaat Items): పానీపూరి, భేల్ పూరి, ఆలు టిక్కి, పావ్ బాజీ మొదలైనవి. వీటిలో పచ్చి కూరగాయలు, నీరు, పుల్లటి సాస్‌లు ఎక్కువగా వాడతారు.
  3. ఫాస్ట్ ఫుడ్స్ / ఇండో-చైనీస్ (Fast Foods): గోబీ మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడుల్స్, మోమోస్, కబాబ్స్. ఇవి అధిక ఉష్ణోగ్రత వద్ద త్వరగా వండబడే పదార్థాలు.
  4. పానీయాలు (Beverages & Juices): చెరకు రసం, నిమ్మ సోడా, తాజా పండ్ల రసాలు, మజ్జిగ, రోజ్ మిల్క్, మరియు ఐస్ గోలాలు.
  5. సంప్రదాయ భోజనం/టిఫిన్స్ (Traditional Tiffins/Meals): రోడ్డు పక్కన బండ్లపై లభించే ఇడ్లీ, దోశ, పూరీ మరియు మధ్యాహ్న భోజనం (Meals on wheels).

ప్రజారోగ్యానికి పొంచి ఉన్న ముప్పు
వీధి ఆహారాల తయారీలో సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతోంది. వీటి వల్ల కలిగే ముప్పును శాస్త్రీయంగా మూడు రకాలుగా విభజించవచ్చు:

  1. సూక్ష్మజీవుల ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు
    • నీటి కాలుష్యం: స్ట్రీట్ ఫుడ్స్‌లో అతిపెద్ద విలన్ కలుషిత నీరు. పానీపూరి నీళ్లు, జ్యూస్‌లలో వాడే ఐస్ తయారీకి వాడే నీరు సురక్షితమైనది కాకపోతే సాల్మొనెల్లా (Salmonella), ఈ-కోలి (E.coli) లాంటి బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఎ (కామెర్లు), మరియు తీవ్రమైన డయేరియా వస్తాయి.

• వ్యక్తిగత పరిశుభ్రత లేమి: వంట చేసే వారు, వడ్డించే వారు చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం, దగ్గడం, తుమ్మడం వల్ల నేరుగా వ్యాధికారక క్రిములు ఆహారంలోకి చేరుతాయి.

• అపరిశుభ్రమైన పరిసరాలు: మురుగు కాలువల పక్కన, చెత్త కుప్పల సమీపంలో బండ్లు ఉండటం వల్ల ఈగలు, బొద్దింకలు, ఎలుకల ద్వారా ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయి.

  1. రసాయన ప్రమాదాలు మరియు కల్తీ
  • నూనెల పునర్వినియోగం (Reheating of Oil):* ఒకసారి వాడిన నూనెను పదే పదే మరిగించడం వల్ల అందులో ‘టోటల్ పోలార్ కాంపౌండ్స్’ (Total Polar Compounds – TPC) స్థాయిలు పెరుగుతాయి. ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ (Trans fats) మరియు అక్రిలమైడ్ (Acrylamide) అనే క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది గుండెపోటుకు ప్రధాన కారణం.

కలుషిత ఆహారం వల్ల కలిగే ఫుడ్ పాయిజనింగ్ మరియు జీర్ణాశయ సమస్యలు

• కృత్రిమ రంగులు, రసాయనాలు: ఆహారం ఆకర్షణీయంగా కనిపించడానికి రోడమైన్ బి (Rhodamine B – కాటన్ క్యాండీ, మంచూరియాలో వాడే ఎర్ర రంగు), మెటానిల్ ఎల్లో వంటి నిషేధిత రంగులు వాడుతున్నారు. ఇవి కాలేయం, కిడ్నీలను దెబ్బతీస్తాయి. రుచి కోసం అజినోమోటో (Monosodium Glutamate – MSG) మోతాదుకు మించి వాడటం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.

  1. భౌతిక ప్రమాదాలు (Physical Hazards)
    తయారీ సమయంలో అజాగ్రత్త వల్ల ఆహారంలో వెంట్రుకలు, ఇనుప పీచు ముక్కలు (పాత్రలు తోమేవి), రాళ్లు, ప్లాస్టిక్ ముక్కలు కలవడం వల్ల గొంతులో, పేగుల్లో గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.

నియంత్రణ చర్యలు – పరిష్కార మార్గాలు
వీధి ఆహారాన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదు, సరైనది కూడా కాదు. కానీ, కొన్ని పటిష్టమైన నియంత్రణ చర్యల ద్వారా దీనిని సురక్షితంగా మార్చవచ్చు.

• మున్సిపల్ అధికారుల పాత్ర: ప్రతి నగరంలో ఫుడ్ వెండింగ్ జోన్లను (Dedicated Vending Zones) ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, మరియు చెత్త కుప్పతొట్లను మున్సిపాలిటీలు అందించాలి.

• వ్యాపారులకు శిక్షణ: ఆహార భద్రత, వ్యక్తిగత పరిశుభ్రత, సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని నిల్వ చేయడం (ఉదాహరణకు, పచ్చి మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచడం) వంటి అంశాలపై వ్యాపారులకు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించాలి.

• మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వ్యాన్లు: ఆహార భద్రతా అధికారులు తరచుగా ఆకస్మిక తనిఖీలు చేయాలి. ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ (Food Safety on Wheels) ద్వారా అక్కడికక్కడే నూనె నాణ్యత, నీటి స్వచ్ఛతను పరీక్షించాలి.

ఆహార భద్రతా ప్రమాణాలు మరియు చట్టాలు (Food Safety Standards & Regulations)
భారతదేశంలో ఆహార భద్రతను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ ‘FSSAI’ (Food Safety and Standards Authority of India). స్ట్రీట్ ఫుడ్స్ కు సంబంధించి FSSAI విధించిన స్పష్టమైన ప్రమాణాలు ఇవి:

  1. రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ప్రతి వీధి ఆహార వ్యాపారి కచ్చితంగా FSSAI వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆ సర్టిఫికెట్‌ను బండిపై వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలి.
  2. మార్గదర్శకాలు (Schedule 4 of FSS Act):
  • వంట చేసే ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలి. బండికి రూఫ్ (కప్పు) ఉండాలి.
  • వడ్డించేవారు కచ్చితంగా గ్లౌజులు, తలకు క్యాప్, ఆప్రాన్ ధరించాలి.
  • వాడే నూనెలో TPC (Total Polar Compounds) స్థాయి 25% మించకూడదు. మించితే ఆ నూనెను పారబోయాలి లేదా బయోడీజిల్ తయారీకి పంపాలి (RUCO ఇనిషియేటివ్).
  • ప్లేట్లను కడగడానికి ప్రతిరోజూ శుభ్రమైన నీటిని మార్చాలి. న్యూస్ పేపర్లపై ఆహారాన్ని వడ్డించకూడదు (పేపర్ ఇంక్ విషపూరితం).
  1. పరిశుభ్రమైన స్ట్రీట్ ఫుడ్ హబ్ (Clean Street Food Hub): స్థానిక అధికారుల సమన్వయంతో పరిశుభ్రమైన ఆహార వీధులను గుర్తించి, వారికి సర్టిఫికేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని FSSAI దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది.

వినియోగదారులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కేవలం వాసన, రుచికి ఆకర్షితులు కాకుండా కింది జాగ్రత్తలు తీసుకోవాలి:

గౌజులు ధరించి పరిశుభ్రంగా పానీపూరి తయారీ.

  • పరిశీలన ముఖ్యం: బండి ఎక్కడ ఉంది? చెత్తకుప్ప పక్కన ఉందా? వ్యాపారి చేతి గోళ్లు శుభ్రంగా ఉన్నాయా? తలకు క్యాప్ ఉందా? లేదా అనేది గమనించాకే ఆర్డర్ ఇవ్వండి.

• వేడి వేడి ఆహారమే మేలు: కళ్ల ముందే వండిన, పొగలు కక్కుతున్న వేడి ఆహారంలో బ్యాక్టీరియా చనిపోతుంది. కాబట్టి ముందుగా వండి చల్లబడిపోయిన పదార్థాలను, ఈగలు వాలుతున్న స్వీట్లను, ఓపెన్‌గా ఉన్న జ్యూస్‌లను నివారించండి.

• నీటి స్వచ్ఛత: పానీపూరి, జ్యూస్ ల వద్ద వాడే నీరు మినరల్ వాటరో కాదో నిర్ధారించుకోండి. వీలైతే మీ సొంత వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లండి.

• రంగులను రిజెక్ట్ చేయండి: కంటికి మిరుమిట్లు గొలిపేంత ఎర్రగా ఉండే మంచూరియా, ఆరెంజ్ రంగులో ఉండే జ్యూస్‌లు, స్వీట్లు తినకండి. సహజమైన రంగులో ఉన్నవాటినే ఎంచుకోండి.

• ప్లేట్ల పరిశుభ్రత: ప్లాస్టిక్ కవర్లు వేసిన ప్లేట్లలో వేడి ఆహారం తినడం క్యాన్సర్ కారకం. అరటి ఆకు లేదా మందపాటి ఫుడ్ గ్రేడ్ పేపర్ ప్లేట్లను వాడే చోట తినండి.

ముగింపు:
“వీధి ఆహారం అనారోగ్యకరం” అని పూర్తిగా ముద్ర వేయలేం. పరిశుభ్రత పాటిస్తే, అది ఫైవ్ స్టార్ హోటల్ భోజనమంత రుచికరమైనది, సురక్షితమైనది. ఆహార భద్రతా చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయడంతో పాటు, వినియోగదారులలో అవగాహన పెరిగినప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. అపరిశుభ్రంగా ఉన్న బండ్ల వద్ద తినడం మానేసిన రోజు, వ్యాపారులు వారంతటవారే పరిశుభ్రతను పాటించడం మొదలుపెడతారు. రుచిని ఆస్వాదిద్దాం.. అదే సమయంలో మన అమూల్యమైన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

  • ఎస్. శ్యామ్, జెడ్. నవీన్, బి. నాగేశ్వర రెడ్డి
    Ph: 8801879793, 8309793719
Read More

పాడి పశువుల్లో ఈగలు, దోమల నియంత్రణకు సహజ పద్ధతులు

నందిమండలం గ్రామ రైతు సిద్ధారెడ్డి – వెటర్నరీ వైద్యుడు డా. జి. రాంబాబు మధ్య జరిగిన ప్రేరణాత్మక కథనం

పాడి పశుసంవర్ధకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అయితే ఆవులు, గేదెల వద్ద ఈగలు, దోమల బెడద రైతులకు తీవ్రమైన సమస్యగా మారుతోంది. పశువుల శరీరంపై వాలే ఈగలు వాటిని నిరంతరం ఇబ్బంది పెట్టడమే కాకుండా పాల దిగుబడి తగ్గడం, చర్మవ్యాధులు రావడం, మాస్టిటిస్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఈ సమస్యకు సహజ పద్ధతుల ద్వారా పరిష్కారం కనుగొన్న నందిమండలం గ్రామానికి చెందిన పాడి రైతు సిద్ధారెడ్డి అనుభవం, వెటర్నరీ నిపుణుడు డా. జి. రాంబాబు ఇచ్చిన శాస్త్రీయ సూచనలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

నందిమండలం ఫారంలో సమస్య ప్రారంభం

  • నందిమండలం గ్రామంలో సిద్ధారెడ్డి పది సంవత్సరాలుగా పాడి పశుసంవర్ధకం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వద్ద 20 గేదెలు ఉన్నాయి. పాల ఉత్పత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటూ మంచి రైతుగా పేరుపొందారు.
  • అయితే ఇటీవల నెల రోజులుగా గేదెల వద్ద ఈగలు, దోమల సమస్య అధికమైంది. పశువులు ప్రశాంతంగా నిలబడకపోవడం, మేత తినకుండా ఉండడం, తోకతో నిరంతరం ఈగలను తరిమే ప్రయత్నం చేయడం ఆయనను ఆందోళనకు గురి చేసింది.
  • పాల దిగుబడి కూడా రోజురోజుకు తగ్గుతుండటంతో వెంటనే వెటర్నరీ వైద్య నిపుణుడు డా. జి. రాంబాబు గారిని సంప్రదించారు.

ఫారంకు వచ్చిన వెటర్నరీ వైద్యుడు
డా. జి. రాంబాబు ఫారంకు చేరుకుని పశువుల పరిస్థితిని పరిశీలించారు. గేదెల శరీరంపై ఈగలు ఎక్కువగా ఉండటం, పశువులు అసహనంగా కదలడం, కొన్నింటిలో చర్మంపై చిన్న గాయాలు కనిపించడం గమనించారు.

సిద్ధారెడ్డి ఆందోళనగా అడిగాడు

“డాక్టర్ గారు, ఈగలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గేదెలు సరిగా తినడం లేదు. పాల దిగుబడి కూడా తగ్గింది. మార్కెట్‌లో రసాయన మందులు ఉన్నాయి కానీ వాటి వల్ల పశువులకు హాని కలుగుతుందేమోనని భయంగా ఉంది.”

ప్రశాంతంగా సమాధానమిచ్చారు

“మీ ఆందోళన సరైనదే. ఈగలు, దోమలు పశువుల రక్తాన్ని పీల్చి బలహీనత కలిగిస్తాయి. ఒత్తిడి పెరగడం వల్ల పాల ఉత్పత్తి తగ్గుతుంది. చర్మవ్యాధులు, మాస్టిటిస్ ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ రసాయన మందులు మాత్రమే పరిష్కారం కాదు. కొన్ని సహజ పద్ధతులు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.”

రైతు సందేహం – సహజ పద్ధతులు నిజంగా పనిచేస్తాయా?

సిద్ధారెడ్డి ఆసక్తిగా అడిగాడు
“సహజ పద్ధతులు నిజంగా పనిచేస్తాయా డాక్టర్ గారు? ఇవి కేవలం తాత్కాలిక పరిష్కారమా లేక పూర్తిగా ఉపయోగపడతాయా?”

డా. రాంబాబు వివరించారు
“సహజ పద్ధతులు ఈగలను పూర్తిగా నిర్మూలించకపోయినా వాటిని పశువుల దగ్గరకు రాకుండా నిరోధిస్తాయి. సరైన షెడ్ నిర్వహణతో కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది.”

వెనిగర్ – ఉప్పు – కర్పూరం సహజ స్ప్రే
డా. రాంబాబు రైతుకు ఒక సరళమైన గృహచిట్కాను వివరించారు.
మూడు లీటర్ల నీటిలో 50 మిల్లీలీటర్ల వెనిగర్, 50 గ్రాముల ఉప్పు కలిపి నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. చల్లారిన తర్వాత 10 గ్రాముల కర్పూరం పొడి కలిపి వడకట్టి స్ప్రే బాటిల్‌లో నింపాలి.
ఈ ద్రావణాన్ని రోజుకు రెండు సార్లు పశువుల శరీరంపై పిచికారీ చేస్తే ఈగలు దూరంగా ఉంటాయి.
సిద్ధారెడ్డి మళ్లీ ప్రశ్నించాడు
“ఈ స్ప్రే పశువులు నాకితే ప్రమాదమా?”
“సాధారణంగా హానికరం కాదు. కానీ మొదట చిన్న భాగంలో పరీక్షించి వాడటం మంచిది” అని డా. రాంబాబు చెప్పారు.

మరో సందేహం – గర్భిణీ పశువులకు వాడవచ్చా?
రైతు తన ఫారంలోని గర్భిణీ గేదెల గురించి అడిగాడు
“గర్భిణీ పశువులకు కూడా ఈ స్ప్రే వాడవచ్చా?”
వైద్యుడు సమాధానమిచ్చారు
“సాధారణంగా వాడవచ్చు. కానీ అధిక మోతాదు వాడకూడదు. కొత్త పద్ధతి ప్రారంభించే ముందు జాగ్రత్తగా పరిశీలించాలి.”

వెల్లుల్లి ద్వారా ఈగల నియంత్రణ
ఫారంలో తిరుగుతూ డా. రాంబాబు మరో ముఖ్యమైన సూచన ఇచ్చారు.
“వెల్లుల్లి కూడా సహజ కీటక నిరోధకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే అల్లియిన్ అనే పదార్థం శరీరంలో అల్లిసిన్‌గా మారి చెమట ద్వారా బయటకు వస్తుంది. ఈ వాసన ఈగలను దూరం చేస్తుంది.”
సిద్ధారెడ్డి ఆశ్చర్యంగా అడిగాడు
“వెల్లుల్లి ఇస్తే పాలలో వాసన వస్తుందా?”
“సరైన మోతాదులో ఇస్తే పాలలో వాసన రాదు. రోజుకు 2–3 గ్రాముల వెల్లుల్లి పొడి లేదా 5–10 గ్రాముల పచ్చి వెల్లుల్లిని దంచి దానాలో కలిపి ఇవ్వవచ్చు” అని వైద్యుడు వివరించారు.

రైతు మరిన్ని సందేహాలు
సిద్ధారెడ్డి తన అనుభవాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు అడిగాడు.
“ఎంతకాలం వెల్లుల్లి ఇవ్వాలి?”
వైద్యుడు చెప్పారు
“ఈగల కాలానికి పది రోజుల ముందు ప్రారంభించి సమస్య ఉన్నంతకాలం ఇవ్వవచ్చు.”
“వెల్లుల్లి ఎక్కువ ఇస్తే ఏమవుతుంది?”
“అధిక మోతాదులో జీర్ణ సమస్యలు రావచ్చు. సూచించిన మోతాదే ఇవ్వాలి.”
“ఈ పద్ధతులతో పాల దిగుబడి పెరుగుతుందా?”
“పశువులు ప్రశాంతంగా ఉండటం వల్ల పాల ఉత్పత్తి మెరుగుపడే అవకాశం ఉంది.”

షెడ్ నిర్వహణపై కీలక సూచనలు
డా. రాంబాబు ఫారం పరిసరాలను పరిశీలించి ఇలా చెప్పారు
• పేడ నిల్వ ఉండకూడదు
• నీరు నిల్వ కాకుండా చూడాలి
• షెడ్‌లో గాలి ప్రసరణ ఉండాలి
• పశువుల శరీర పరిశుభ్రత పాటించాలి
• ఈగల ట్రాప్స్ ఉపయోగించాలి
“సహజ స్ప్రే మాత్రమే కాదు, పరిశుభ్రత కూడా ఈగల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది” అని ఆయన వివరించారు.

మార్పు ప్రారంభమైన ఫారం
డాక్టర్ సూచనల మేరకు సిద్ధారెడ్డి వెంటనే చర్యలు ప్రారంభించాడు. షెడ్ శుభ్రత పెంచాడు. వెనిగర్–కర్పూరం స్ప్రే వాడటం ప్రారంభించాడు. వెల్లుల్లిని మోతాదుగా దానాలో కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు.
రెండు వారాల తరువాత ఫారంలో స్పష్టమైన మార్పు కనిపించింది. గేదెల వద్ద ఈగల సంఖ్య గణనీయంగా తగ్గింది. పశువులు ప్రశాంతంగా మేత తినడం ప్రారంభించాయి. పాల దిగుబడి కూడా క్రమంగా పెరిగింది.
సిద్ధారెడ్డి ఆనందంగా చెప్పాడు
“సహజ పద్ధతులు తక్కువ ఖర్చుతో మంచి ఫలితం ఇచ్చాయి. పశువులు ఆరోగ్యంగా ఉంటే రైతు జీవితం సంతోషంగా ఉంటుంది.”

డా. జి. రాంబాబు సందేశం
డా. రాంబాబు రైతులకు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారు
“పశువుల ఆరోగ్యం కోసం సహజ పద్ధతులు, శాస్త్రీయ నిర్వహణ, సరైన పోషణ అన్నీ కలిసి ఉండాలి. తీవ్రమైన సమస్యల్లో తప్పనిసరిగా వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.”

రైతులకు ఈ కథనం ఇచ్చే పాఠం
నందిమండలం రైతు సిద్ధారెడ్డి అనుభవం పాడి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఖరీదైన రసాయన మందులపై పూర్తిగా ఆధారపడకుండా సహజ పద్ధతులు, పరిశుభ్రత, సరైన నిర్వహణతో ఈగలు, దోమల సమస్యను సమర్ధవంతంగా నియంత్రించవచ్చని ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది.
పశువుల సంరక్షణలో చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యకరమైన పశువులు ఉంటేనే రైతుకు అధిక పాల దిగుబడి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
సహజ పద్ధతులు, శాస్త్రీయ అవగాహన, అనుభవం కలిస్తే పాడి పశుసంవర్ధకంలో విజయాన్ని సాధించవచ్చని ఈ కథనం స్పష్టం చేస్తోంది.

డా. జి. రాంబాబు, పశువైద్యుడు, కడప. Ph:94945 88885

Read More

పశుగ్రాసం కొరత – ప్రత్యామ్నాయ మార్గాలు

పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి మరియు రైతు ఆదాయాన్ని కాపాడుకోవడానికి సమగ్ర మార్గదర్శిని
భారతదేశంలో పశుపోషణ రైతులకు పశుగ్రాసం కొరత ఒక ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో ప్రభావం, తక్కువ వర్షపాతం, వరదలు, పంటల సాగు విధానాల్లో మార్పులు, సాగుభూమి తగ్గడం వంటి కారణాల వల్ల పచ్చిమేత లభ్యత తగ్గుతుంది. పచ్చిమేత కొరత ఏర్పడినప్పుడు పశువులకు సరిపడా పోషకాలు అందకపోవడంతో పాల దిగుబడి తగ్గడం, శరీర బరువు తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం తగ్గడం, వ్యాధుల బారిన పడే అవకాశం పెరగడం జరుగుతుంది.

అయితే పచ్చిమేత అందుబాటులో లేదని పశువులకు కేవలం ఎండుగడ్డి లేదా వరి గడ్డిని మాత్రమే ఎక్కువగా ఇవ్వడం సరైన పద్ధతి కాదు. లభ్యమయ్యే అన్ని స్థానిక వనరులను శాస్త్రీయంగా ఉపయోగించడం, పంట అవశేషాలను పోషక విలువ పెంచి వినియోగించడం, సైలేజ్ తయారు చేయడం, ప్రత్యామ్నాయ పశుగ్రాస పంటలు సాగు చేయడం, సమతుల్య దాణా అందించడం ద్వారా పశుగ్రాస కొరతను గణనీయంగా తగ్గించవచ్చు.

  1. పంట అవశేషాలను పశుగ్రాసంగా ఉపయోగించడం
    పశుగ్రాస కొరత సమయంలో రైతుల వద్ద లభించే ప్రధాన వనరు పంటల అవశేషాలు.
    ఉపయోగించగల పంట అవశేషాలు:
    • వరి గడ్డి, జొన్న కాడలు, మొక్కజొన్న కాడలు, సజ్జ కాడలు, రాగి కాడలు, వేరుశనగ ఎండుగడ్డి,పెసర, మినుము, శనగ పంట అవశేషాలు, కంది కాడలు, గోధుమ గడ్డి, ఇతర పప్పుధాన్యాల ఎండుగడ్డి
    వీటిలో కొన్ని పదార్థాల్లో పీచు ఎక్కువగా ఉండి, జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా చేసి, దాణా మరియు ఇతర పోషక పదార్థాలతో కలిపి ఇవ్వడం మంచిది.
  2. వరి గడ్డిని మెరుగుపరచి వినియోగించడం
    వరి గడ్డి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దాని పోషక విలువ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా లిగ్నిన్ మరియు సిలికా ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణశక్తి పరిమితంగా ఉంటుంది.
    దీనిని మెరుగుపరచడానికి:

యూరియా ట్రీట్మెంట్
వరి గడ్డిని యూరియా ద్రావణంతో శాస్త్రీయంగా ట్రీట్ చేయడం ద్వారా దాని జీర్ణశక్తి మరియు నైట్రోజన్ విలువను పెంచవచ్చు.
సాధారణంగా 100 కిలోల పొడి గడ్డికి సుమారు 4 కిలోల యూరియాను నీటిలో కరిగించి సమంగా చల్లుతూ పొరలుగా అమర్చి, గాలి చొరబడకుండా కప్పి కొన్ని వారాలు ఉంచే పద్ధతి ఉపయోగిస్తారు.
అయితే ఇది పశువులకు నేరుగా యూరియా తినిపించడం కాదు. యూరియా ట్రీట్మెంట్ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలి. ట్రీట్ చేసిన గడ్డిని ఉపయోగించే ముందు తగిన సమయం, వెంటిలేషన్ మరియు సరైన నిర్వహణ అవసరం.

  1. సైలేజ్ తయారీ – పచ్చిమేత కొరతకు ఉత్తమ ప్రత్యామ్నాయం
    పచ్చిమేత సమృద్ధిగా లభించే సమయంలో దానిని భద్రపరచుకోవడానికి సైలేజ్ చాలా ఉపయోగకరమైన పద్ధతి.
    సైలేజ్‌కు అనుకూలమైన పంటలు:
    మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఓట్స్, ఇతర అనుకూలమైన పచ్చిమేత పంటలు
    మొక్కజొన్న సైలేజ్ ముఖ్యంగా పాల పశువులకు మంచి శక్తి వనరుగా ఉపయోగపడుతుంది.
    సైలేజ్ తయారీలో ముఖ్యమైన అంశాలు:
  2. పంటను సరైన దశలో కోయాలి.
  3. సుమారు 1–2 సెం.మీ. పరిమాణంలో చాప్ చేయాలి.
  4. సైలేజ్ గుంత/బంకర్/సీలో బ్యాగ్‌లో పొరలుగా వేయాలి.
  5. ప్రతి పొరను బాగా తొక్కి గాలిని బయటకు పంపాలి.
  6. గాలి చొరబడకుండా పూర్తిగా మూసివేయాలి.
  7. కిణ్వ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలి.
    సరైన సైలేజ్ తయారీ ద్వారా పచ్చిమేత లభించని వేసవి లేదా కరువు కాలంలో కూడా నాణ్యమైన పశుగ్రాసాన్ని అందించవచ్చు.
  8. ఎండుగడ్డి నిల్వ చేసుకోవడం
    రైతులు పచ్చిమేత ఉన్న సమయంలోనే భవిష్యత్తు అవసరాల కోసం ఎండుగడ్డిని నిల్వ చేసుకోవాలి.
    మంచి ఎండుగడ్డి లక్షణాలు:
    • బూజు లేకుండా ఉండాలి
    • అధిక తేమ లేకుండా ఉండాలి
    • దుర్వాసన ఉండకూడదు
    • పురుగులు లేకుండా ఉండాలి
    • వర్షానికి తడవకూడదు
    ఎండుగడ్డిని నేలపై నేరుగా కాకుండా ప్యాలెట్లు లేదా ఎత్తైన ప్రదేశంలో నిల్వ చేయడం మంచిది.
  9. పప్పుధాన్యాల ఎండుగడ్డి వినియోగం
    పచ్చిమేత కొరత సమయంలో పప్పుధాన్యాల ఎండుగడ్డి మంచి ప్రత్యామ్నాయం.
    ఉదాహరణకు:
    • వేరుశనగ ఎండుగడ్డి
    • శనగ కాడలు
    • పెసర అవశేషాలు
    • మినుము అవశేషాలు
    • కంది కాడలు
    వీటిలో సాధారణ వరి గడ్డితో పోలిస్తే పోషక విలువ మెరుగ్గా ఉండవచ్చు.
    ప్రత్యేకంగా వేరుశనగ ఎండుగడ్డి రైతులకు మంచి ప్రత్యామ్నాయ పశుగ్రాస వనరుగా ఉపయోగపడుతుంది. అయితే బూజు పట్టిన లేదా అఫ్లాటాక్సిన్ ప్రమాదం ఉన్న పదార్థాలను పశువులకు ఇవ్వకూడదు.
  10. ఉప ఉత్పత్తులను పశుగ్రాసంలో ఉపయోగించడం
    వ్యవసాయ మరియు ఆహార పరిశ్రమలలో లభించే కొన్ని ఉప ఉత్పత్తులను శాస్త్రీయంగా ఉపయోగించవచ్చు.
    ఉదాహరణలు:
    • బియ్యం తవుడు,గోధుమ తవుడు,మొక్కజొన్న, జొన్న,సజ్జ, శనగ చూర్ణం, పప్పుధాన్యాల ఉప ఉత్పత్తులు, వేరుశనగ పిండి/కేక్, సోయాబీన్ మీల్, నువ్వుల కేక్, పొద్దుతిరుగుడు కేక్, కొబ్బరి కేక్
    వీటిని పశువుల శక్తి మరియు ప్రోటీన్ అవసరాలకు అనుగుణంగా సమతుల్య దాణాలో ఉపయోగించాలి.
  11. చెట్ల ఆకులను ప్రత్యామ్నాయ పశుగ్రాసంగా ఉపయోగించడం
    పశుగ్రాస కొరత సమయంలో కొన్ని చెట్ల ఆకులు కూడా ఉపయోగపడతాయి.
    ఉదాహరణకు:
    సుబాబుల్, గ్లైరిసిడియా, మునగ, కొన్ని స్థానికంగా ఉపయోగించే పశుగ్రాస చెట్ల ఆకులు
    అయితే ప్రతి చెట్టు ఆకును పశువులకు ఇవ్వడం సురక్షితం కాదు. కొన్ని మొక్కల్లో విషపదార్థాలు లేదా యాంటీ-న్యూట్రిషనల్ ఫ్యాక్టర్లు ఉండవచ్చు.
    అందువల్ల తెలిసిన, పశుగ్రాసంగా సురక్షితంగా ఉపయోగించే మొక్కలనే ఎంచుకోవాలి.
  12. సుబాబుల్ ఆకుల వినియోగం
    సుబాబుల్ మంచి ప్రోటీన్ వనరుగా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మిమోసిన్ అనే యాంటీ-న్యూట్రిషనల్ పదార్థం ఉంటుంది.
    కాబట్టి:
    • అధిక మొత్తంలో ఇవ్వకూడదు.
    • ఇతర పశుగ్రాసాలతో కలిపి ఇవ్వాలి.
    • ఆకులను మాత్రమే ఆధారంగా చేసుకుని పూర్తి దాణాగా ఉపయోగించకూడదు.
    సుబాబుల్‌ను మిశ్రమ పశుగ్రాసంలో పరిమితంగా ఉపయోగించడం ఉత్తమం.
  13. మునగ ఆకుల వినియోగం
    మునగ ఆకుల్లో ప్రోటీన్ మరియు కొన్ని ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. పశుగ్రాస కొరత సమయంలో పరిమితంగా ఇతర పశుగ్రాసాలతో కలిపి ఉపయోగించవచ్చు.
    అయితే మునగ ఆకులు కూడా మొత్తం రేషన్‌కు ప్రత్యామ్నాయం కావు.
  14. హైడ్రోపోనిక్ పశుగ్రాసం
    తక్కువ స్థలంలో పశుగ్రాసం ఉత్పత్తి చేయడానికి హైడ్రోపోనిక్ ఫాడర్ గురించి ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది.
    సాధారణంగా:
    మొక్కజొన్న, బార్లీ, ఓట్స్, ఇతర ధాన్య విత్తనాలను
    నీరు మరియు నియంత్రిత పరిస్థితుల్లో మొలకెత్తించి పశుగ్రాసంగా ఉపయోగిస్తారు.
    ప్రయోజనాలు:
    • తక్కువ స్థలం
    • తక్కువ సమయంలో ఉత్పత్తి
    • సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేసే అవకాశం
    • నీటి వినియోగాన్ని నియంత్రించవచ్చు
    అయితే విత్తనం, షెడ్, నీరు, కార్మిక వ్యయం మరియు ఫంగస్ నియంత్రణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మాత్రమే రైతు ఆర్థికంగా అనుకూలమా కాదా నిర్ణయించాలి.
  15. పశుగ్రాస పంటల సాగు
    పశుగ్రాస కొరతను శాశ్వతంగా తగ్గించడానికి రైతులు తమ భూమిలో కొంత భాగాన్ని పశుగ్రాస పంటలకు కేటాయించడం ఉత్తమ మార్గం. స్థానిక వాతావరణం, నీటి లభ్యత మరియు నేల స్వభావాన్ని బట్టి పంటను ఎంచుకోవాలి.
  16. మిశ్రమ పశుగ్రాస సాగు
    ఒకే పంటపై ఆధారపడకుండా గడ్డి + పప్పుజాతి పశుగ్రాసం కలిపి సాగు చేయడం మంచిది.
    ఉదాహరణకు:
    సూపర్ నేపియర్ + లెగ్యూమ్ ఫోడర్
    లేదా
    జొన్న + లెగ్యూమ్
    ఇలా చేస్తే పశువులకు శక్తి మరియు ప్రోటీన్ రెండింటినీ సమతుల్యంగా అందించే అవకాశం ఉంటుంది.
  17. పశువుల రేషన్‌ను శాస్త్రీయంగా నిర్వహించడం
    పశుగ్రాసం కొరత సమయంలో అందుబాటులో ఉన్న గడ్డిని విచక్షణ లేకుండా ఎక్కువగా ఇవ్వడం కంటే రేషన్ బ్యాలెన్సింగ్ చాలా ముఖ్యమైనది. ప్రత్యేకంగా అధిక పాలిచ్చే పశువులకు కేవలం గడ్డి ఆధారిత ఆహారం సరిపోకపోవచ్చు. అవసరానికి అనుగుణంగా సమతుల్య దాణా ఇవ్వాలి.
  18. మినరల్ మిక్చర్ ప్రాముఖ్యత
    పశుగ్రాసం తగ్గినప్పుడు పశువులకు లభించే మొత్తం పోషకాల్లో మాత్రమే కాకుండా ఖనిజాల లోపం కూడా ఏర్పడవచ్చు.
    అందువల్ల పశువు వయస్సు, శరీర స్థితి, పాల ఉత్పత్తి మరియు గర్భస్థితిని బట్టి సరైన మినరల్ మిక్చర్ ఇవ్వాలి.
  19. నీటి నిర్వహణ
    పశుగ్రాసం కొరత సమయంలో నీటి కొరత మరింత తీవ్రమైన సమస్య.
    పాలు ఉత్పత్తి చేసే పశువులకు తగినంత స్వచ్ఛమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి.
    నీటి కొరత ఉంటే పశువు ఆహారం తీసుకోవడం మరియు పాల ఉత్పత్తి రెండూ తగ్గే అవకాశం ఉంది.
  20. పశుగ్రాసాన్ని వృథా కాకుండా చూడాలి
    పశువులకు గడ్డి పెట్టే విధానం కూడా చాలా ముఖ్యం.
    చాలా పొడవైన గడ్డిని నేలపై ఎక్కువగా వేసినప్పుడు పశువులు కొంత భాగాన్ని తొక్కి వృథా చేస్తాయి.
    అందువల్ల:
    చాఫ్ కట్టర్ → చిన్న ముక్కలు → సరైన ఫీడ్ ట్రఫ్ → నియంత్రిత పరిమాణం
    అనే విధానాన్ని పాటిస్తే పశుగ్రాస వృథాను తగ్గించవచ్చు.
  21. పశుగ్రాస బ్యాంకులు
    గ్రామ స్థాయిలో Fodder Banks ఏర్పాటు చేయడం కరువు పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
    వర్షాకాలంలో అధికంగా లభించే:
    • ఎండుగడ్డి, సైలేజ్, పశుగ్రాస విత్తనాలు, పంట అవశేషాలు
    సేకరించి నిల్వ చేసి, కరువు సమయంలో రైతులకు అందించవచ్చు.
    రైతు సంఘాలు, సహకార సంఘాలు, పశుసంవర్ధక శాఖ మరియు స్థానిక సంస్థలు కలిసి పనిచేస్తే ఇది మరింత సమర్థవంతంగా ఉంటుంది.
  22. పశుగ్రాస కొరత సమయంలో పశువుల సంఖ్యను నియంత్రించడం
    దీర్ఘకాలిక పశుగ్రాస కొరత ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న పశుగ్రాసాన్ని పశువుల సంఖ్యతో పోల్చుకోవాలి.
    తక్కువ ఉత్పాదకత కలిగిన, వృద్ధ, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న లేదా ఆర్థికంగా నిర్వహించడం కష్టమైన జంతువులను కొనసాగించడం రైతుకు భారంగా మారవచ్చు.
    అందువల్ల రైతు ఉత్పాదకత ఆధారంగా మంద నిర్వహణ చేయడం ద్వారా పశుగ్రాస అవసరాన్ని తగ్గించుకోవచ్చు.
  23. పశుగ్రాస కొరత సమయంలో తప్పించుకోవాల్సినవి
    ❌ బూజు పట్టిన గడ్డి
    ❌ కుళ్లిన సైలేజ్
    ❌ తెలియని విషపూరిత మొక్కలు
    ❌ అధికంగా యూరియా కలిగిన పదార్థాలు
    ❌ అకస్మాత్తుగా అధిక ధాన్యాలు
    ❌ ఒక్కసారిగా రేషన్‌లో భారీ మార్పులు
    ❌ కలుషితమైన వ్యవసాయ వ్యర్థాలు
    ❌ పురుగుమందు అవశేషాలు ఉన్న పంట అవశేషాలు
    వీటివల్ల జీర్ణకోశ సమస్యలు, విషపూరిత పరిస్థితులు, అజీర్ణం, ఆమ్లత్వం మరియు ఇతర ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

పశుగ్రాస కొరత అనేది కేవలం పచ్చిమేత కొరత సమస్య కాదు; అది పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, సంతానోత్పత్తి మరియు రైతు ఆదాయంపై ప్రభావం చూపే సమస్య. అందువల్ల పచ్చిమేత కోసం వర్షంపై మాత్రమే ఆధారపడకుండా ముందుగానే పశుగ్రాస ప్రణాళిక రూపొందించుకోవాలి.
“పచ్చిమేత ఉన్నప్పుడు నిల్వ – పంట అవశేషాల శాస్త్రీయ వినియోగం – సైలేజ్ – ఎండుగడ్డి – ప్రత్యామ్నాయ పశుగ్రాసాలు – సమతుల్య దాణా – సరిపడా నీరు” అనే ఏడు అంశాలను రైతులు పాటిస్తే పశుగ్రాస కొరత ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

ప్రతి రైతు తన భూమిలో కొంత భాగాన్ని శాశ్వత పశుగ్రాసం కోసం కేటాయించడం, పంట అవశేషాలను కాల్చకుండా పశుగ్రాసంగా మార్చడం, పచ్చిమేతను సైలేజ్/హే రూపంలో నిల్వ చేయడం అలవాటు చేసుకోవాలి.

పశుగ్రాస భద్రత = పశుసంపద భద్రత = రైతు ఆదాయ భద్రత.

డా.జి.రాంబాబు, పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు, నందిమండలం, వై.యస్.ఆర్. కడప జిల్లా. Ph:94945 88885

Read More

కాళ్ళు మెలికలు తిరిగి, లిగమెంట్స్ బిగుసుకుపోయి దూడ పుట్టటం

కొన్ని దూడలు పుట్టేటపుడు కాళ్ళ లిగమెంట్స్ బిగుసుకుపోయి, కాళ్ళు మెలికలు తిరిగి, మడతలతో పుట్టటం అప్పుడప్పుడు జరుగుతుంది.
తల్లిగోవు చూడిగా వున్నప్పుడు, మాంగనీస్ అను ఖనిజ లవణం లభ్యం కానందున, ఈ విధంగా జరుగుతుంది.
కాళ్ళ ఎముకలు విరగలేదని నిర్ధారించుకోవాలి

గృహవైద్యం:

  1. బిగుసుకుపోయిన లిగమెంట్స్ సరిచేసి, కాళ్ళు సాఫు చేసి, పచ్చి వెదురు బద్దలు చెక్కి, చర్మానికి గాయం కాకుండా బద్దల చివళ్ళకు దూది చుట్టి కాళ్ళకు కట్టాలి. వారం రోజులలోపుగానే కాళ్ళ వంకరలు తగ్గిపోతాయి.
  2. కాళ్ళకు గుంటకలగరాకు పసరు రాయాలి.
    పుట్టిన దూడ లిగమెంట్స్ బిగుసుకుపోయి వున్నా, లేదా అంగవైకల్యాలు వున్నా వెంటనే పశువైద్యుని సంప్రదిస్తే, వారు తగు శస్త్రచికిత్స చేస్తారు.
    ఈ స్థితి రాకుండా ఉండాలంటే సల్ఫర్ 200 ఒక మోతాదు, 3 నెలల చూడిగా ఉన్నప్పుడు మరొక మోతాదు 6 మరియు 8వ నెల చూడిగా ఉన్నప్పుడు తల్లికి తినిపించాలి.

అల్లోపతి: పుట్టిన దూడకు కాళ్ళ లిగమెంట్స్ బిగుసుకుపోయి వున్నా, అంగవైకల్యాలు వున్నా, దూడ పుట్టిన వెంటనే ఆలస్యం చేయకుండా పశువైద్యుని సంప్రదిస్తే వారు తగిన శస్త్ర చికిత్స చేస్తారు.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఔషధ మొక్క… కస్తూరి పసుపు

సాధారణ నామం : వైల్డ్ టర్మరిక్, ఎల్లో జడోరీ
శాస్త్రీయ నామం : కర్కుమా ఆరోమాటికా
కుటుంబం: జింజిబెరేసి

ఇది 75 సెం.మీ. ఎత్తు పెరిగే దుంప కొమ్ము (రైజోమ్) గల మొక్క. మొక్క వేర్లు చేమగడ్డలవలె ఉంటాయి. పత్రాలు పెద్దవిగా, పొడవుగా, వెడల్పుగా, కుంభకటకాకారంలో ఉండి కింది భాగంలో కాడవలె సన్నబడి ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో పుష్పపుచ్ఛాలతో కూడిన కంకివలె వస్తాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చెందిస్తారు. దుంప సువాసనతో, చేదుగా ఉంటుంది. దుంప లోపలి భాగం నారింజ ఎరుపు రంగులోను, బయటివైపు పసుపు రంగులోను ఉంటుంది.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • దుంప కొమ్ములు “కుర్కుమిన్” అనుబడు రసాయనం కలిగి ఉండి ఔషధములలో వాడబడుతున్నాయి.
  • కస్తూరి పసుపు వీర్యపుష్టికి, క్రిమిహరము, సర్ప విషము, వాతమునకు ఉపయోగపడుతుంది. ఒంటికి పూసిన యెడల గజ్జి, స్ఫోటక పొక్కులు నయమవుతాయి. దీనిని ఎక్కువగా అలంకారపు వస్తువులలో ఉపయోగిస్తారు. కుష్ఠు, శ్వాసకోశవ్యాదులు, బొల్లి, ఒళ్ళునొప్పులు, తల నొప్పి మరియు చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో

  • కస్తూరి పసుపు ద్రావణాన్ని పురుగు వికర్షక ఉత్పత్తిగా ఉపయోగిస్తారు (ముస్తాఫాడెబ్బేన్, అతని అనుచరులు, 2006)
  • కస్తూరి పసుపు ఇథనాల్ ద్రావణం యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ చర్యలనుకలిగి ఉంది (హరిత్, అతని అనుచరులు, 2013).
  • కస్తూరి పసుపు దోమలపై వికర్షక చర్యను ప్రదర్శించింది (దాస్, అతని అనుచరులు, 2000)
  • కస్తూరి పసుపు హెక్సేన్ ద్రావణం గ్రామ్ పాజిటివ్ బాక్టీరియాపై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. కాని గ్రామ్ నెగటివి˜ బాక్టీరియాపై చూపలేదు (రేవతి అండ్ మాలతి, 2013).
  • కస్తూరి పసుపు ఇథైల్ ఎసిటేట్ ద్రావణం క్యూలెక్స్ విష్ణుయ్ గ్రూప్‌పై మంచి లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. కస్తూరి పసుపు దుంప ద్రావణాలను క్యూలెక్స్ విష్ణుయ్ గ్రూప్ లార్వాలపై ప్రత్యామ్నాయ లార్విసైడ్‌గా ఉపయోగించవచ్చు (మాల్లిక్, అతని అనుచరులు, 2014).
  • కస్తూరి పసుపు ఎసెన్షియల్ ఆయిల్ అనేక పురుగులపై కీటక నాశక చర్యను ప్రదర్శించింది (రావ్, 1976).
  • ఆవాలు, కొబ్బరి నూనెల ఆధారిత దుంప ద్రావణం దోమల నుండి రక్షణనిచ్చింది. కస్తూరి పసుపు ఇథనాల్ ద్రావణం ఆర్మిజెరెస్ సబాల్బాటస్, క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్, క్యూలెక్స్ ట్రైటీనియోరింకస్‌ల నుండి రక్షణ ప్రభావాన్ని చూపింది. ఈ ద్రావణాన్ని శరీర భాగాలపై పూసుకుని దోమ కాట్ల నుండి సమర్ధవంతంగా రక్షించుకోవచ్చు. (దాస్, అతని అనుచరులు, 1999)
  • దుంప ద్రావణం ఈడెస్ టుగాయ్‌ని సమర్థవంతంగా నివారించింది (పిటసావట్, అతని అనుచరులు, 2003).
  • ఆకులలోని ఎసెన్షియల్ ఆయిల్ చెరకు తోటల నాశించే తెల్ల చెదలు, ఒడొంటోటెర్మెస్ ఒబెసస్‌ని సమర్ధవంతంగా నివారించింది (గుర్దీప్, అతని అనుచరులు, 2004).
  • దుంప ద్రావణం, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 4వ దశ లార్వాలపై గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (చూకోట్, అతని అనుచరులు, 2005).
  • దుంప ద్రావణం నుండి వేరు చేసిన 9 ఆక్సోనియో ప్రోకర్కుమినాల్, నియోప్రోకర్కుమినాల్ కంటే అధికంగా క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (మధు, అతని అనుచరులు, 2010)
  • దుంపల నీటి ద్రావణం బాసిల్లస్ సబ్‌టైలిస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది (స్మిత, అతని అనుచరులు 2010)
  • కస్తూరి దుంపల హెక్సేన్, క్లోరోఫాం, ఇథైల్ అసిటేట్, మిథనాల్, పెట్రోలియం ఈథర్ ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, లిస్టీరియా మోనోసైటోజెనెస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, ఎస్కెరిచియా కోలి, సాల్మొనెల్లా ట్రైఫిమ్యారియంపై యాంటీబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. కనుక ఈ ద్రావణాన్ని ఆహార పదార్థాల నాశించి వ్యాధులు కలిగించే బాక్టీరియా నుండి సహజ ప్రిజర్వేటివ్‌గా ఉపయోగించవచ్చు. (ఆల్‌రెజా, అతని అనుచరులు, 2004).
  • కస్తూరి దుంప ఎసెన్షియల్ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫాల్కేటం, ఆస్పర్ౙిల్లస్ టెర్రియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, కర్వులేరియా పాల్లెసెన్స్‌పై యాంటీఫంగల్ చర్యను ప్రదర్శించింది (గుర్దీప్, అతని అనుచరులు, 2004).
  • కస్తూరి దుంప ఇథనాల్ ద్రావణం రైజోపస్ స్టొలానిఫర్, బోట్రెåటిస్ సినరియా, కొల్లేటోట్రైకం కోకోడెస్‌లను సమర్థవంతంగా అరికట్టింది (భగవత్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

ఎల్ నినో వేళ ఖరీఫ్ పంట అమ్మకానికి సూత్రాలు

ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వానాకాలం (ఖరీఫ్) వర్షాలు తగ్గాయి. తెలంగాణలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు సుమారు 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇలాంటి సంవత్సరంలో దిగుబడి కొంత తగ్గినప్పటికీ, పంటను జాగ్రత్తగా ఆరబెట్టి, శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసి నాణ్యతను కాపాడుకుని సరైన మార్గంలో అమ్ముకుంటే మంచి ధర పొందవచ్చు. అందుకే చేతికి వచ్చిన పంటకు మంచి ధర పొందాలంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా అమ్మాలో ముందుగానే ఆలోచించుకోవడం చాలా ముఖ్యం.

మొదట కనీస మద్దతు ధర (MSP) తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఖరీఫ్ సీజన్ కు ప్రకటించిన కనీస మద్దతు ధరలు ఇవి. మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఇది రైతుకు రక్షణగా ఉంటుంది.
పంట MSP (రూ. / క్వింటాల్)
వరి (సాధారణ రకం) 2,441
వరి (గ్రేడ్ ఎ) 2,461
పత్తి (మధ్యస్థ పింజ) 8,267
పత్తి (పొడవు పింజ) 8,667
మొక్కజొన్న 2,410
కంది 8,450
పెసర 8,780
మినుము 8,200
వేరుశనగ 7,517
సోయాచిక్కుడు (పసుపు) 5,708
జొన్న (హైబ్రిడ్) 4,023

MSP కేవలం కనీస ధర మాత్రమే. ఈ ధర రావాలంటే పంటలో తేమ, శుభ్రత నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి (ఉదాహరణకు వరిలో తేమ సుమారు 17 శాతం లోపు, పత్తిలో 8 నుంచి 12 శాతం లోపు). కాబట్టి పంటను బాగా ఆరబెట్టి, శుభ్రం చేసి తీసుకెళ్లండి.

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మకం
• వరి: ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో (సహకార సంఘాలు, ఐకేపీ కేంద్రాలు) MSPకి అమ్మవచ్చు.
• పత్తి: భారత పత్తి సంస్థ (CCI) మద్దతు ధరకు కొంటుంది. సీసీఐ నిర్ణయించే నమోదు, స్లాట్ విధానం ఉంటే ముందుగానే నమోదు చేసుకోండి.
• పప్పుధాన్యాలు, నూనెగింజలు: కంది, పెసర, మినుము, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి పంటల కొనుగోలుకు మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రాలు తెరిచినప్పుడు అక్కడ అమ్మవచ్చు.
• కావలసిన పత్రాలు: పట్టాదార్ పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, పంట నమోదు రుజువు దగ్గర ఉంచుకోండి. కేంద్రాల వివరాలను మీ మండల వ్యవసాయ అధికారి (AEO/MAO) ద్వారా తెలుసుకోండి.

మార్కెట్ కమిటీ (APMC) యార్డులో అమ్మకం
పంటను వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుకు తెచ్చి బహిరంగ వేలంలో అమ్మడం మన రాష్ట్రంలో సాధారణ పద్ధతి. ఇక్కడ ఈ జాగ్రత్తలు పాటించండి:
• అమ్మే ముందు రెండు మూడు యార్డుల ధరలను పోల్చి చూడండి. దగ్గరి యార్డులో ధర తక్కువగా ఉంటే కొంచెం దూరమైనా మెరుగైన యార్డుకు వెళ్లడం లాభమో కాదో రవాణా ఖర్చుతో లెక్కించండి.
• లైసెన్స్ ఉన్న కమీషన్ ఏజెంట్ (అడీదారు) ద్వారానే అమ్మండి. తూకం, తరుగు, కమీషన్, ధర వివరాలు ఉన్న రసీదు (సేల్ బిల్లు) తప్పనిసరిగా తీసుకోండి.
• చెల్లింపు ఎప్పుడు, ఎలా వస్తుందో అమ్మే ముందే అడిగి తెలుసుకోండి. బ్యాంక్ ఖాతాకు నేరుగా చెల్లింపు పొందడం మంచిది.
• యార్డులో రద్దీ పెరిగే రోజుల్లో ధర తగ్గే అవకాశం ఉంటుంది. వీలైతే పంటను విడతలుగా తెచ్చి అమ్మండి.

ఆన్ లైన్ అమ్మకం: ఈ-నామ్ (e-NAM)
• ఈ-నామ్ అనేది మార్కెట్ యార్డులోనే జరిగే ఆన్ లైన్ వేలం. ఇక్కడ ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా పాల్గొనడం వల్ల పోటీ పెరిగి మంచి ధర రావచ్చు.
• ముందుగా మీ యార్డులో ఈ-నామ్ కింద రైతుగా నమోదు చేసుకోండి (ఆధార్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ అవసరం).
• ఈ-నామ్ యాప్, అగ్ మార్క్ నెట్ (Agmarknet) వెబ్ సైట్లలో రోజువారీ మార్కెట్ ధరలు చూసి, ధర బాగున్న రోజు అమ్మకానికి తీసుకెళ్లండి.
• పంట నాణ్యతను పరీక్షించి గ్రేడ్ ఇస్తారు. శుభ్రంగా, ఒకే రకంగా ఉన్న పంటకు ఎక్కువ ధర వస్తుంది.
• ఎఫ్.పి.ఓలు (రైతు ఉత్పత్తిదారుల సంఘాలు) ఈ-నామ్ వంటి వేదికల ద్వారా కూడా పంటను అమ్మే అవకాశం ఉంది.

నేరుగా అమ్మకం (డైరెక్ట్ మార్కెటింగ్)
• సంఘంగా అమ్మడం: రైతు ఉత్పత్తిదారుల సంఘం (FPO) లేదా రైతు గ్రూపు ద్వారా అందరి పంటను కలిపి పెద్ద మొత్తంలో అమ్మితే వ్యాపారులు, మిల్లర్లతో బేరం చేసే శక్తి పెరుగుతుంది. రవాణా, తూకం ఖర్చులు కూడా తగ్గుతాయి.
• మిల్లర్లు, ప్రాసెసర్లకు నేరుగా అమ్మడం: రైస్ మిల్లర్లు, జిన్నింగ్ మిల్లులు, మిరప, పసుపు ప్రాసెసింగ్ సంస్థలతో ముందుగానే ధర, నాణ్యత, చెల్లింపు తేదీ రాతపూర్వకంగా నిర్ణయించుకోండి.
• రైతు బజార్లు, నేరుగా వినియోగదారులకు కూరగాయలు, పండ్లు, తక్కువ మొత్తంలో ధాన్యం, పప్పులను రైతు బజార్ లేదా గ్రామ, పట్టణ సంతల్లో నేరుగా అమ్మితే మధ్యవర్తుల వాటా తగ్గుతుంది.

నిల్వ చేసి అమ్మడం
కోత సమయంలో ఒకేసారి అందరూ అమ్మడం వల్ల ధరలు తగ్గుతాయి. ఆర్థికంగా వీలైతే పంటను గోదాములో నిల్వ చేసి తర్వాత అమ్మవచ్చు. గోదాము రసీదు (e-NWR) పై రుణం తీసుకునే సౌకర్యం ఉన్న గోదాముల గురించి మీ ప్రాంత అధికారులను అడగండి. అయితే ధర తర్వాత తప్పకుండా పెరుగుతుందనే హామీ లేదు. తేమ, పురుగుల వల్ల నష్టం కూడా జరగవచ్చు. కాబట్టి అప్పు తీర్చడం వంటి అత్యవసర అవసరాలకు కావలసినంత మాత్రమే ముందుగా అమ్మి, మిగిలినది విడతలుగా అమ్మడం మంచిది.

ఎల్ నినో సంవత్సరంలో ప్రత్యేక జాగ్రత్తలు
• దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున ధర తప్పకుండా పెరుగుతుందని అనుకోకండి. దేశవ్యాప్తంగా సరఫరా, ప్రభుత్వ నిల్వలు, దిగుమతులు ధరను ప్రభావితం చేస్తాయి. రోజూ మార్కెట్ ధరలను గమనించండి.
• అప్పు తీర్చడానికో, అత్యవసరానికో తక్కువ ధరకు తొందరపడి అమ్మకండి. ముందుగా MSP, యార్డు ధరను పోల్చి చూడండి.
• వర్షాభావంతో గింజ సన్నబడటం, రంగు మారడం, గింజ పొట్టిగా ఉండటం జరగవచ్చు. పంటను శుభ్రం చేసి, గ్రేడింగ్ చేసి అమ్మితే నాణ్యత తక్కువ వల్ల కలిగే నష్టం కొంత తగ్గుతుంది.
• యార్డులో లైసెన్స్ ఉన్న ఏజెంటు ద్వారానే అమ్మి, రసీదు తీసుకోండి. చెల్లింపు నేరుగా బ్యాంక్ ఖాతాకు పొందండి.
• ప్రభుత్వం నీటి నిల్వలు, యాసంగి సాగు గురించి ఇచ్చే సూచనలను గమనించి, తర్వాతి పంట నిర్ణయం తీసుకోండి.

డా. డి. ఎ. రజిని దేవి మరియు డా. కే. శేఖర్
అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. Ph: 9032128124

Read More

పెరటి కోళ్ల పెంపకంలో ప్రశ్నోత్తరాలు

  1. పెరటి కోళ్లు అంటే ఏమిటి? ఇతర వాణిజ్య కోళ్లతో పోలిస్తే వీటి ప్రత్యేకత ఏమిటి?
    పెరటి కోళ్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న స్థాయిలో, ఇంటి పరిసరాల్లో లేదా పొలం వద్ద పెంచుకునే కోళ్లు. వీటిని సాధారణంగా గుడ్లు, మాంసం మరియు ఇంటి అవసరాల కోసం పెంచుతారు.

పెరటి కోళ్లలో స్థానిక దేశీ కోళ్లు, మెరుగుపరచిన గ్రామీణ రకాలు మరియు కొన్ని మెరుగుపరచిన రకాలైన రాజశ్రీ, గ్రామప్రియ, వనరాజ, గాగస్, శ్రీనిధి అను పలురకాల పెరటి కోళ్లు ఉంటాయి.

వీటి ముఖ్యమైన ప్రత్యేకతలు:
• స్థానిక వాతావరణానికి సాధారణంగా బాగా అలవాటు పడతాయి.
• బయట తిరిగి కొంత ఆహారాన్ని స్వయంగా వెతుక్కుంటాయి.
• ఇంటి వద్ద లభించే కొన్ని ధాన్యాలు, పురుగులు, ఆకులు, వంటగదిలో మిగిలే ఉప ఉత్పత్తులను కూడా ఉపయోగించుకోవచ్చు.
• గుడ్లు మరియు మాంసం రెండింటినీ పొందవచ్చు.
• దేశీ కోడి మాంసానికి కొన్ని ప్రాంతాల్లో మంచి వినియోగదారుల డిమాండ్ ఉంటుంది.
• చిన్న రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడవచ్చు.
అయితే పెరటి కోళ్లను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయడం మాత్రమే సరిపోదు. సరైన మేత, నీరు, టీకాలు మరియు వ్యాధి నియంత్రణ కూడా అవసరం.

  1. పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలనుకునే రైతులు ముందుగా ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి?
    మీ ప్రాంతంలో ముందుగా మార్కెట్‌ను తెలుసుకోవాలి :

• కోళ్లకు కొనుగోలుదారులు ఉన్నారా?
• గుడ్లకు ఎంత ధర వస్తోంది?
• మాంసం కోళ్లకు ఎంత ధర వస్తోంది?
• ఏ వయసు లేదా బరువులో అమ్మితే మంచి ధర వస్తుంది? అనే విషయాలు తెలుసుకోవాలి.

అలాగే పిల్లల లభ్యత మరియు నాణ్యత, మేత ఖర్చు, షెడ్ ఖర్చు, నీటి లభ్యత, టీకాలు మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చు, కూలీల ఖర్చు, మరణాల శాతం, అమ్మకపు ధర, మొత్తం పెట్టుబడి మరియు అంచనా ఆదాయం ఇవన్నీ ముందుగానే లెక్కించాలి.

  1. పిల్లలను కొనుగోలు చేసేటప్పుడు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరోగ్యకరమైన పిల్లలను ఎలా గుర్తించాలి?
    విశ్వసనీయమైన హ్యాచరీ, ప్రభుత్వ సంస్థ లేదా గుర్తింపు ఉన్న సరఫరాదారు నుంచి పిల్లలను కొనుగోలు చేయడం మంచిది.
    ఆరోగ్యకరమైన పిల్లల్లో సాధారణంగా చురుకుదనం ఎక్కువగా ఉంటుంది, కళ్లు స్పష్టంగా, మెరుస్తూ ఉంటాయి, నాభి సరిగ్గా మూసి ఉండాలి, కాళ్లు బలంగా ఉండాలి, శరీరంపై డౌన్ ఫెదర్స్ సక్రమంగా ఉండాలి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండకూడదు, విరేచనాలు ఉండకూడదు, బలహీనంగా ఒక మూలలో కూర్చుని ఉండకూడదు.
  2. పెరటి కోళ్ల కోసం షెడ్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? గాలి, వెలుతురు, ఉష్ణోగ్రత ఎలా ఉండాలి?
  • పెరటి కోళ్ల కోసం ఖరీదైన షెడ్ తప్పనిసరి కాదు. కానీ షెడ్ వర్షం నుంచి రక్షణ కల్పించాలి, ఎండ నుంచి రక్షణ కల్పించాలి, చలి గాలి నేరుగా తగలకుండా ఉండాలి, మంచి వెంటిలేషన్ ఉండాలి, లిట్టర్ పొడిగా ఉండాలి, రాత్రి సమయంలో భద్రత ఉండాలి, పాములు, ఎలుకలు, కుక్కలు వంటి మృగాల నుంచి రక్షణ ఉండాలి.
  • చిన్న పిల్లలకు ప్రత్యేకంగా బ్రూడింగ్ సౌకర్యం కల్పించాలి.
  • మొదటి వారంలో పిల్లల స్థాయిలో సుమారు 33–35°C ఉష్ణోగ్రత అవసరం ఉండవచ్చు. తరువాత వయసు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించాలి.
  • పిల్లల ప్రవర్తన ద్వారా కూడా ఉష్ణోగ్రతను అంచనా వేయవచ్చు: హీటర్ కింద గుంపుగా ఉంటే → చలి, హీటర్‌కు దూరంగా వెళ్లి నోరు తెరిచి ఉంటే → వేడి, సమానంగా విస్తరించి ఉంటే → ఉష్ణోగ్రత సాధారణంగా అనుకూలంగా ఉంది.
  1. చిన్న వయసులో ఉన్న కోళ్ల పిల్లలకు చలి, వేడి నుంచి రక్షణ కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మొదటి కొన్ని వారాలు చాలా ముఖ్యమైనవి.
  • చలి సమయంలో బ్రూడర్ లేదా హీట్ ల్యాంప్ ఉపయోగించాలి, చల్లని గాలి నేరుగా పిల్లలకు తగలకుండా చూడాలి, లిట్టర్ పొడిగా ఉంచాలి, పిల్లలు గుంపుగా చేరుతున్నాయా అని గమనించాలి.
  • వేడి సమయంలో గాలి ప్రసరణ పెంచాలి, తగినంత స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి, అధిక సాంద్రతను నివారించాలి, అవసరమైతే వెటర్నరీ నిపుణుల సలహాతో ఎలక్ట్రోలైట్లు ఉపయోగించవచ్చు.
  1. పెరటి కోళ్లకు ఏ రకమైన మేత ఇవ్వాలి? వయసును బట్టి మేతలో ఎలాంటి మార్పులు చేయాలి?
    పెరటి కోళ్లకు కేవలం ఇంటి వ్యర్థాలు లేదా బయట దొరికే ఆహారం మాత్రమే ఇవ్వడం సరిపోదు.
    వయసును బట్టి సమతుల్యమైన మేత ఇవ్వాలి.
  • చిక్/స్టార్టర్ ఫీడ్ (0–7/8 వారాలు): ఇందులో ప్రోటీన్, శక్తి, అమినో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు తగిన స్థాయిలో ఉండాలి.
  • తరువాత గ్రోవర్/డెవలపర్ ఫీడ్ ఇవ్వవచ్చు.
  • పెద్ద కోళ్లు గుడ్లు పెట్టే దశకు వచ్చినప్పుడు గుడ్ల కోళ్ల దాణా అవసరానికి అనుగుణంగా ఇవ్వాలి.
    పెరటి కోళ్లను బయట మేత కోసం వదిలినా, సప్లిమెంటరీ ఫీడ్ ఇవ్వడం అవసరం.
  1. మేతతో పాటు స్వచ్ఛమైన తాగునీటి విషయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    స్వచ్ఛమైన నీరు 24 గంటలు అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.
    రైతులు నీటి పాత్రలను ప్రతిరోజూ శుభ్రం చేయాలి, నీటిలో మలమూత్రాలు పడకుండా చూడాలి, వేసవిలో తగినంత నీరు అందుబాటులో ఉంచాలి, నీటి పాత్రలను నీడలో ఉంచడం మంచిది, నీటి పాత్రలు పగిలిపోయినవి లేదా మురికిగా ఉన్నవి ఉపయోగించకూడదు, నీటి నాణ్యతపై అనుమానం ఉంటే పరీక్ష చేయించాలి, మందులు, విటమిన్లు లేదా ఎలక్ట్రోలైట్లు నీటిలో కలపాల్సి వస్తే వెటర్నరీ డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.
  2. పెరటి కోళ్లకు అవసరమైన ముఖ్యమైన టీకాలు ఏవి? టీకాల షెడ్యూల్‌ను పాటించడం ఎందుకు ముఖ్యం?
    తమ ప్రాంతంలో వ్యాధుల పరిస్థితి, కోళ్ల వయసు మరియు స్థానిక పశువైద్య అధికారుల సలహా ఆధారంగా టీకా కార్యక్రమాన్ని రూపొందించాలి. సాధారణంగా పరిగణించే ముఖ్యమైన టీకాలు: కొక్కెర తెగులు, గంబోరో వ్యాధి, కోళ్ల అమ్మవారు (ఫౌల్ పాక్స్) వ్యాధి. అవసరాన్ని బట్టి ఇతర టీకాలు ఉపయోగించాలి. టీకా షెడ్యూల్ ప్రాంతానుసారం మారవచ్చు. కాబట్టి స్థానిక వెటర్నరీ డాక్టర్ లేదా పశువైద్య అధికారుల సూచనను పాటించడం మంచిది.
  3. కోళ్లలో అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తే రైతులు వెంటనే ఏ చర్యలు తీసుకోవాలి? స్వయంగా మందులు వాడటం ఎంతవరకు సరైనది?
    అకస్మాత్తుగా మరణాలు వస్తే : అనారోగ్య కోళ్లను వీలైనంత వరకు వేరుచేయాలి, చనిపోయిన కోళ్లను సురక్షితంగా తొలగించాలి, ఇతర ఫారాలకు కోళ్లు లేదా పరికరాలు తరలించకూడదు, సందర్శకుల రాకపోకలను తగ్గించాలి. మేత, నీరు, లిట్టర్ మరియు మరణాల వివరాలు నమోదు చేయాలి, వెంటనే వెటర్నరీ డాక్టర్ లేదా పశువైద్య అధికారిని సంప్రదించాలి, అవసరమైతే పోస్టుమార్టం లేదా ల్యాబ్ పరీక్ష చేయించాలి.
    స్వయంగా యాంటీబయాటిక్స్ లేదా ఇతర మందులు ఇవ్వడం మంచిది కాదు.
  4. షెడ్ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి?
    పెరటి కోళ్లలో కూడా పరిశుభ్రత చాలా ముఖ్యం.
    • లిట్టర్‌ను పొడిగా ఉంచాలి, తడి లిట్టర్‌ను వెంటనే తొలగించాలి, నీటి లీకేజీలను వెంటనే సరిచేయాలి, ఫీడర్లు, డ్రింకర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి, మేత చిందకుండా చూడాలి, షెడ్ చుట్టూ చెత్త పేరుకుపోకుండా చూడాలి, ఎలుకలు, ఈగలు వంటి వాటిని నియంత్రించాలి, చనిపోయిన కోళ్లను బహిరంగంగా పడేయకూడదు, స్థానిక నిబంధనలకు అనుగుణంగా చనిపోయిన కోళ్లను సురక్షితంగా పారవేయడం (dead birds disposal) చేయాలి, కొత్త బ్యాచ్‌ను తీసుకురావడానికి ముందు షెడ్‌ను శుభ్రపరచి, క్రిమిసంహారం చేయడం (disinfect) చేయడం మంచిది.
  5. మార్కెట్‌లో పెరటి కోళ్లకు మంచి ధర లభించేందుకు రైతులు ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?
    పెరటి కోళ్లకు కొన్ని ప్రాంతాల్లో దేశీ కోడి రూపం, మాంస లక్షణాలు మరియు స్థానిక వినియోగదారుల అభిరుచుల కారణంగా మంచి డిమాండ్ ఉండవచ్చు.
    రైతులు: ఆరోగ్యకరమైన కోళ్లను పెంచాలి, సాధ్యమైనంత వరకు ఏకరూపత ఉన్న కోళ్లు (uniform birds) ఉత్పత్తి చేయాలి, మార్కెట్‌కు సరైన బరువు వచ్చినప్పుడు అమ్మాలి, స్థానిక మార్కెట్ ధరలను ముందుగానే తెలుసుకోవాలి, ప్రత్యక్ష కొనుగోలుదారులను పరిశీలించాలి, చికెన్ షాపులు, హోటళ్లు మరియు స్థానిక వినియోగదారులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు, ఒకేసారి ఎక్కువ కోళ్లు అమ్మే ముందు ధరలను పోల్చుకోవాలి, ప్రతి కోడికి వచ్చే నిజమైన ఉత్పత్తి ఖర్చు (production cost) తెలుసుకోవాలి, మంచి ధర మాత్రమే లాభానికి కారణం కాదు, మేత ఖర్చు తగ్గించడం, మరణాల రేటు (mortality) తగ్గించడం, ఆరోగ్యాన్ని కాపాడటం మరియు సరైన సమయంలో అమ్మడం కూడా ముఖ్యమే.
  6. చివరిగా, పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలనుకునే రైతులకు ముఖ్యమైన సూచనలు ఏమిటి?
    నా ముఖ్యమైన సూచన: “పెరటి కోళ్లను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయడం కాకుండా, మంచి నిర్వహణ పద్ధతులతో పెంచితే ఉత్పత్తి మరియు ఆదాయం మెరుగుపడే అవకాశం ఉంటుంది.”
    రైతులు ముఖ్యంగా ఈ 7 విషయాలు గుర్తుంచుకోవాలి:
  7. నాణ్యమైన పిల్లలు, 2. సరైన బ్రూడింగ్, 3. సమతుల్యమైన మేత, 4. స్వచ్ఛమైన నీరు, 5. సకాలంలో టీకాలు, 6. బయోసెక్యూరిటీ మరియు పరిశుభ్రత, 7. సరైన మార్కెటింగ్. ముఖ్యంగా ఫారం ప్రారంభించే ముందు చిన్న స్థాయిలో ప్రయోగాత్మక బ్యాచ్ (pilot batch) నిర్వహించడం మంచిది. చిన్న స్థాయిలో ప్రారంభించండి → ఖర్చులు నమోదు చేయండి → నిర్వహణను మెరుగుపరచండి → మార్కెట్‌ను అర్థం చేసుకోండి → ఆ తర్వాత విస్తరించండి.

డా. డి. రాజేష్ బాబు , కోళ్ల పరిశోధనా స్థానం, మామునూరు, వరంగల్.
Ph: 9030398775.

Read More

ఆవు దూడలలో అవయవ లోపాలు

వికృతాకారంతో, అవయవ లోపాలతో, అదనపు అవయవాలతో దూడలు పుట్టడం అప్పుడప్పుడు జరుగుతుంది.

ఇలాంటి దూడల్ని ఈనటం సాధారణంగా, చాలా కష్టంగానే వుంటుంది. గోవు ఈనలేక కష్టపడుతున్నప్పుడు, అనుభవం వున్న పశువైద్యుని సంప్రదించాలి. వారు నేర్పుతో, వీలును బట్టి, అవసరం మేరకు దూడను సరిచేసి లేదా అవయవాల్ని వేరుచేసి, తల్లి ప్రాణానికి ముప్పురాని విధంగా దూడను బయటకు తీస్తారు.

మలద్వారం లేకుండా దూడ జన్మించడం
మలరంధ్రం లేకుండా జన్మించిన దూడకు పశువైద్యనిపుణులు శస్త్రచికిత్స చేసి లోపాన్ని సరిచేస్తారు.
కాబట్టి, ఆలస్యం చేయకుండా నిపుణత గల పశువైద్యుని సంప్రదిస్తే శస్త్రచికిత్స చేసి, మలద్వారం ఏర్పరచి, విసర్జన జరిగేట్లుగా చేస్తారు.

హోమియో:
ఆపరేషన్ తరువాత హైపరికం 200 ఉదయం 10 మాత్రలు, స్టాఫీసగ్రియ 200, సాయంత్రం 10 మాత్రలు చొప్పున 20 రోజులు తినిపించాలి.
కుట్ల గాయాలు మానటానికి కాలెండుల 30 రోజుకు 5 మాత్రలు తినిపించాలి.

లేగదూడ బొడ్డు నుండి మూత్రవిసర్జన

లేగదూడల్లో ఆనువంశిక జన్యు లోపాల వల్ల బొడ్డు నుంచి మూత్రవిసర్జన జరుగుతుంది.

మత్రాశయం నుండి మూత్ర విసర్జన నాళం (URETHRA) ద్వారా సర్వసాధారణంగా జరుగుతుంది.

పిండోత్పత్తి క్రమంలో మూత్రాశయం నుండి బొడ్డుకు గల సంబంధిత విసర్జన నాళం మూసుకుపోవాలి.

కాని జన్యుపరమైన కారణాల వల్ల బొడ్డు దగ్గర వుండే మూత్రాశయ విసర్జన నాళం మసుకుపోదు.

ఈ కారణంగా బొడ్డు నుంచి మూత్రం వస్తుంది.

జన్యు లోప కారణంగా కలిగే పరిస్థితిని సరిదిద్దడానికి శస్త్ర చికిత్సే ఏకైక మార్గం.

కాబట్టి దూడ పుట్టినపుడు ఇలాంటి స్థితిని గమనించినట్లయితే, వెంటనే పశువైద్యనిపుణుని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More

ఆయిల్ పామ్ తోటల్లో గానోడెర్మా వేరు కుళ్ళు తెగులు- నివారణ మరియు సమగ్ర యాజమాన్య పద్ధతులు

ఆయిల్ పామ్ తోటల్లో గానోడెర్మా వేరు కుళ్ళు / కాండం కుళ్ళు (Ganoderma Basal Stem Rot – BSR) అనేది అత్యంత ప్రమాదకరమైన శిలీంధ్ర (Fungal) వ్యాధి. ఇది గానోడెర్మా లూసిడమ్ (Ganoderma lucidum) అనే ఫంగస్ వల్ల వస్తుంది.
నివారణ మరియు యాజమాన్య పద్ధతులు:

తెగులు సోకినప్పుడు మట్టలు కిందికి వేలాడటం

  1. తెగులు లక్షణాలు
    • ఆకుల మార్పులు: తోటలో చెట్టు ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతాయి. ఆకులు వాలిపోయి కాండం చుట్టూ గొడుగు ఆకారంలో వేలాడుతుంటాయి.
    • మొవ్వు పడిపోవడం: చెట్టు పైభాగంలో ఉన్న కొత్త మొవ్వులు సరిగ్గా విచ్చుకోవు, క్రమంగా ఎండిపోయి విరిగిపోతాయి.
    • గాయం మరియు రసం కారడం: కాండం అడుగు భాగంలో (మొదలు వద్ద) నల్లటి/గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, అక్కడి నుండి జిగురు లాంటి ఎర్రటి ద్రవం కారుతుంది.
    • పుట్టగొడుగుల ఎదుగుదల (Brackets): వర్షాకాలంలో చెట్టు మొదలు భాగంలో లేదా వేర్ల దగ్గర విసనకర్ర ఆకారంలో గట్టి పుట్టగొడుగులు (Ganoderma brackets) పెరుగుతాయి.
    • దిగుబడి తగ్గడం: గెలల సైజు తగ్గిపోవడం, గెలలు సరిగ్గా ఊరకపోవడం మరియు చివరికి చెట్టు కూలిపోవడం జరుగుతుంది.
  2. తెగులు వ్యాప్తి (Mode of Spread)
    • వేర్ల స్పర్శ ద్వారా: ఆరోగ్యవంతమైన చెట్టు వేర్లు వ్యాధి సోకిన పాత చెట్టు వేర్లతో తాకినప్పుడు ఈ ఫంగస్ ఒక చెట్టు నుండి మరొక చెట్టుకు వ్యాపిస్తుంది.
    • మట్టి ద్వారా: నేలలో మిగిలిపోయిన పాత కుళ్ళిన వేర్లు మరియు కాండం అవశేషాల ద్వారా ఫంగస్ చాలా సంవత్సరాలు జీవించి ఉంటుంది.
  3. సమగ్ర నివారణ చర్యలు
    తోట పరిశుభ్రత & నివారణ చర్యలు (Cultural Management)
  4. వ్యాధి సోకిన చెట్ల తొలగింపు: తీవ్రంగా వ్యాధి బారిన పడి ఎండిపోయిన చెట్లను వేర్లతో సహా పెకలించి తోట బయట తగలబెట్టాలి.
  5. కాలువ తవ్వకం: వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి వ్యాధి సోకిన చెట్టు చుట్టూ 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతుతో కాలువ తవ్వాలి. ఇది వేర్ల ద్వారా పక్క చెట్లకు ఫంగస్ వ్యాపించకుండా నిరోధిస్తుంది.
  6. చెట్లకు గాయాలు కాకుండా చూసుకోవడం: దిగుబడి కోసేటప్పుడు లేదా ఆకులు నరికేటప్పుడు కాండానికి గాయాలు కాకుండా జాగ్రత్త వహించాలి.

కాండం అడుగు భాగంలో పుట్టగొడుగులు (బూజు/ఫంగస్ ఫలదేహాలు) పెరగడం.

జైవిక నివారణ (Biological Control)

  1. ట్రైకోడెర్మా విరిడే (Trichoderma viride): ప్రతి చెట్టుకు సంవత్సరానికి 50 కిలోల పశువుల ఎరువు లేదా వేపపిండితో 200 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే లేదా సూడోమోనాస్ ఫ్లోరొసెన్స్ కలిపి చెట్టు మొదల్లో వేయాలి.
  2. వేప పిండి: చెట్టుకి 5 కిలోల వేప పిండి చొప్పున సంవత్సరానికి రెండుసార్లు అందిస్తే నేలలో ఉండే హానికర ఫంగస్ అదుపులోకి వస్తుంది.

ముఖ్యమైన సూచన
ఆయిల్ పామ్ తోటలో ఈ వ్యాధి కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా చుట్టుపక్కల ఉన్న చెట్లకు కూడా ముందస్తు జాగ్రత్తగా జైవిక ఎరువులు (ట్రైకోడెర్మా) మరియు నీటి యాజమాన్యం సరిగ్గా నిర్వహించాలి.

డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, డా. బి. శివ, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301
Ph: 8184929874

Read More

నెలలు నిండక ముందే పుట్టిన ఆవు దూడ పోషణ

నెలలు తక్కువగా పుట్టిన దూడకు చలిగాలుల నుండి రక్షణ కల్పించాలి. బాగా వెచ్ౘ్గా వుండే విధంగా గడ్డి, గోనె సంచులతో పడక ఏర్పాటు చేయాలి. జున్నుపాలు మితంగా రోజుకు 4 పర్యాయాలు త్రాగించాలి.

హోమియో: 1. ముందుగా ఫైవ్ ఫాస్ 30, తదుపరి కార్బో వెజ్ 30 రోజుకు 10 మాత్రలు, ఓపియం 30 మడు రోజులకొక పర్యాయం చొప్పున 10 రోజుల తినిపించాలి. 2. ఆల్ఫాల్ఫా 30, జిన్సెంగ్ 30 కలిపిన మందు ఒక చెంచా, కొద్దిపాటి నీళ్ళలో కలిపి, రోజుకు 3 సార్లు చొప్పున 20 రోజులు త్రాగించాలి. అల్లోపతి : 1. విటామిక్స్ లిక్విడ్ (VITAMIX LIQUID) వంటి మందు రోజుకు ఒక పర్యాయం వారం రోజులు త్రాగించాలి. 2. టెట్‌వ్యాక్ (TETVAC) ఇంజక్షన్ 1 మి.లీ. కండకు (IMగా) ఒకసారి మాత్రమే చేయించాలి. 3. సూచించిన ఫెర్రిటాస్ (FERRITAS) ఇంజక్షన్ 2 మి.లీ. (IM) కండకు 3వ రోజున, అవసరాన్నిబట్టి పదవ రోజున చేయించాలి.

రైతునేస్తం ప్రచురణ ‘గో-సంజీవని’ పుస్తకం కొరకు సంప్రదించండి: 96 76 79 77 77కు సంప్రదించండి.

Read More