తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) ద్వారా కీలక అడుగు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులతో పాటు నాబ్‌కాన్స్ ఉపాధ్యకక్షురాలు శ్రీమతి శిల్పా దేశ్‌పాండేతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్-పియంయు) పథకం మానిటరింగ్ సెల్‌తో విలీనం గురించి చర్చించి, దీని ద్వారా రైతులకు మరింత లాభదాయకమైన విధంగా పథకాలను అమలు చేయడంపై సమగ్ర కార్యాచరణ రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) పథకంలో జాతీయ స్థాయిలో ప్రస్తుతం రెండవ స్థానంలో నిలిచిందని భుజంగరావు తెలిపారు. ఆయన ప్రకారం, గత ఏడాది న్యూ ఢిల్లీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ కు కేంద్రం అవార్డు అందినట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రగతి
తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) పథకంలో ఇప్పటివరకు రూ.3,046 కోట్ల నిధులు పొందింది. ఈ నిధులతో మొత్తం 2,246 మౌలిక సదుపాయాల యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో 1,450 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 785 గిడ్డంగులు, 209 కస్టమ్ హైరింగ్ సెంటర్లు, 101 పోస్ట్-హార్వెస్ట్ సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో ఉంచుకొని, రాష్ట్రం ఇప్పటికే రూ.3,075 కోట్ల లక్ష్యాన్ని పూర్తిగా సాధించిందని, తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం రూ.4,000 కోట్ల లక్ష్యాన్ని కేంద్రం వద్ద అభ్యర్థించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మరియు వ్యవసాయ సహకార శాఖ కమిషనర్ తెలిపారు.
స్కీమ్ ప్రయోజనాలు:
స్కీమ్ కింద రైతులకు 3% వడ్డీ సబ్సిడీ లభిస్తోంది. తద్వారా రైతులు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి తీసుకునే లోన్లపై కేవలం 6% వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. రెండు కోట్ల రుణము వరకు వేరే హామీ అవసరం లేదు.
ఇతర పథకాల సమన్వయం:
నేషనల్ హార్టికల్చర్ మిషన్, అగ్రి మార్కెటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మరియు ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ వంటి ఇతర ప్రభుత్వ పథకాలతో ఈ స్కీమ్ సమన్వయంతో కొనసాగుతుంది. ఈ పథకాల కింద 25% నుండి 33% వరకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి.
ఈ పథకం ప్రధాన లక్ష్యాలు:
- గిడ్డంగులు / సైలోస్ (గాదె) / కోల్డ్ స్టోరేజ్ శుభ్రం చేయటం/ఎండబెట్టడం / సార్టింగ్ / గ్రేడింగ్
- వ్యవసాయప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు (రైస్ / పప్పు విత్తనశుద్ధి ప్రాసెసింగ్ మిల్లు మొదలైనవి)
- అద్దె ప్రాతిపదిక వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రం వ్యవసాయ / పంటలు యాంత్రీకరణ
- స్మార్ట్ మరియు ప్రెసిషన్ వ్యవసాయం, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్- వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రోత్సహించడం
- రైతుల ఆదాయాన్ని పెంపొందించడం
- రైతు నేస్తం ద్వారా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకానికి సంబందించి వివరాలను రైతులకు వివరించాల్సిందిగా వ్యవసాయ అధికారులను మంత్రి ఆదేశించారు.
మంత్రివర్యుల ఉద్ఘాటన:
ఈ నిర్ణయాలు తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి కీలకంగా నిలుస్తాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంలో మరింత విజయాలు సాధించగలమని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.



