సపోటా విత్తన తొలుచు పురుగు-సమగ్ర యాజమాన్యం

సపోటా (మనిల్కారా జపోటా Manilkara zapota) సపోటేసీ (Sapotaceae) కుటుంబానికి చెందిన ముఖ్యమైన ఉష్ణమండల మరియు ఉప ఉష్ణమండల పండ్ల పంట. దీనిని చికు లేదా సపోడిల్లా అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యధికంగా సపోటాను పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. మన దేశంలో గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు సపోటా సాగులో ప్రధానమైనవి. తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాణిజ్య పండ్ల తోటలలో ఒకటి. దీనిని ముఖ్యంగా మధ్య తెలంగాణ మండలంలో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు నల్గొండ జిల్లాలు సపోటా సాగుకు ముఖ్యమైన ప్రాంతాలుగా ఉన్నాయి.

భారతదేశంలో 2024-25 సంవత్సరంలో సపోటా సాగు విస్తీర్ణం 73.39 వేల హెక్టార్లకు పెరిగింది. అయితే, ఉత్పత్తి 887.90 వేల మెట్రిక్ టన్నులకు చేరినప్పటికీ, ఉత్పాదకత హెక్టారుకు 12.10 మెట్రిక్ టన్నులకు స్వల్పంగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 సంవత్సరానికి సపోటా సాగు విస్తీర్ణం 1.10 వేల హెక్టార్లకు, మొత్తం ఉత్పత్తి 19.66 వేల మెట్రిక్ టన్నులకు, ఉత్పాదకత హెక్టారుకు 17.83 మెట్రిక్ టన్నులకు పెరిగింది. జాతీయ సగటు ఉత్పాదకతతో పోలిస్తే తెలంగాణలో హెక్టారుకు సుమారు 5.73 మెట్రిక్ టన్నుల అధిక దిగుబడి నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే దాదాపు 47.4 శాతం ఎక్కువ.

సపోటా ఒక నిత్యహరిత పండ్ల చెట్టు. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో పుష్పించడం, కాయలు ఏర్పడటం నిరంతరంగా కొనసాగుతాయి. సపోటా పండ్లు పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారు 10-11 నెలల సమయం పట్టడం వల్ల, చెట్టుపై వివిధ అభివృద్ధి దశల్లో కాయలు అందుబాటులో ఉంటాయి. పుష్పించడం, కాయధారణ, పండ్ల అభివృద్ధి దశలు వేర్వేరు సమయాల్లో కొనసాగడం కీటకాలు పంటను వివిధ దశల్లో ఆశ్రయించడానికి అనుకూలంగా ఉంటుంది. భారతదేశంలో సపోటా పంటను సుమారు 25 రకాల కీటకాలు ఆశిస్తుండగా, వాటిలో సపోటా విత్తన తొలుచు పురుగు (Trymalitis margarias) అత్యంత ప్రాముఖ్యత కలిగిన హానికర కీటకాల్లో ఒకటిగా గుర్తించబడింది. ముఖ్యంగా కాయల అభివృద్ధి దశలో ఈ పురుగు దాడి చేయడం వల్ల పండు లోపలి గుజ్జు, విత్తన భాగం దెబ్బతిని, పండ్ల నాణ్యత మరియు మార్కెట్ విలువ తగ్గే అవకాశం ఉంది. తీవ్రమైన ఉధృతి పరిస్థితుల్లో ఈ పురుగు వల్ల పండ్ల నష్టం 35 శాతం వరకు నమోదైనట్లు పేర్కొన్నారు. అందువల్ల, ఈ పురుగు సపోటా పండ్ల దిగుబడి, నాణ్యత, రైతుల ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపగల ముఖ్యమైన హానికర కీటకంగా పరిగణించబడుతుంది.

పురుగు గుర్తింపు చిహ్నం
ఈ పురుగు చిన్న పరిమాణంలో ఉండే మైక్రో-లెపిడాప్టెరన్ కీటకం. ఆడ పురుగు చిన్న, మార్బుల్ పరిమాణంలో ఉన్న సపోటా కాయలపై గుడ్లు పెడుతుంది. అనుకూల పరిస్థితుల్లో ఒక ఆడ పురుగు తన జీవితకాలంలో సుమారు 250 గుడ్లు పెట్టగలదు. గుడ్లు పొదిగే కాలం 10-12 రోజులు ఉంటుంది.

గుడ్లు: గుడ్లు తెల్లటి రంగులో ఉంటాయి. వాటి పరిమాణం చాలా చిన్నగా ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో గుర్తించడం కష్టం.

లార్వా (పురుగు పిల్ల/ గొంగళి పురుగు): పూర్తిగా ఎదిగిన లార్వా గులాబీ లేదా ఎరుపు ఛాయ కలిగి, శరీరంపై స్పష్టమైన విభాగాలతో ఉంటుంది. శరీరంపై రోమాలు సాధారణంగా కనిపించవు. పూర్తిగా ఎదిగిన లార్వా సుమారు 12-13 మి.మీ. పొడవు ఉండవచ్చు. లార్వా దశే పంటకు ప్రధానంగా నష్టం కలిగిస్తుంది.

ప్యూపా (కోశస్థ దశ): ప్యూపా సాధారణంగా గోధుమ నుంచి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. లార్వా ఆకు ముక్కను మడిచి, పట్టు వంటి పదార్థంతో ఏర్పరిచిన నిర్మాణంలో కోశస్థ దశకు చేరవచ్చు.
రెక్కల పురుగు: ముందు రెక్కలు తెల్లటి లేదా బూడిద ఛాయతో, మచ్చలతో కనిపిస్తాయి. రెక్కల అంచుల్లో చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి.

జీవన చక్రం
పురుగు జీవచక్రం సుమారు 34-42 రోజుల్లో పూర్తవుతుంది. లార్వా దశ 10-12 రోజులు, ప్యూపా దశ 10-11 రోజులు ఉంటుంది. పెద్ద పురుగులో మగది సుమారు 3-4 రోజులు, ఆడది 4-5 రోజులు జీవిస్తుంది. ఈ తక్కువ వ్యవధిలోనే తదుపరి తరాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండటం వల్ల అనుకూల వాతావరణ పరిస్థితుల్లో పురుగు జనాభా వేగంగా పెరిగే అవకాశం ఉంది.

సపోటా విత్తన పురుగు లక్షణాలు

  • వర్షాకాలం చివరి దశలో, విత్తన తొలుచు పురుగు ఆడపురుగులు గోళీ పరిమాణంలో ఉన్న లేత సపోటా పండ్లపై గుడ్లు పెడతాయి.
  • గుడ్ల నుంచి బయటకు వచ్చిన చిన్న లార్వాలు కాయ ఉపరితలంపై రంధ్రం చేసి, కాయ గుజ్జులో సొరంగాలను ఏర్పరుచుకుంటూ చివరకు విత్తనాన్ని చేరుతాయి.
  • విత్తనంలోకి ప్రవేశించిన తరువాత విత్తన పొరను తొలిచి, ప్రధానంగా ఎండోస్పెర్మ్ను తింటూ లార్వా అభివృద్ధి చెందుతుంది.
  • ఈ పురుగు ఆశించిన పండ్లలో ప్రారంభ దశలో ఎటువంటి బాహ్య లక్షణాలు కనిపించవు కాబట్టి, నష్టాన్ని గుర్తించడం కష్టమవుతుంది.
  • పరిపక్వత చెందిన ఎరుపు రంగు లార్వాలు పండులోని విత్తన బీజదళాలను తిని, ఆహారం తీసుకోవడం పూర్తయిన తరువాత పండు నుంచి బయటకు వస్తాయి. ఈ సమయంలో పండుపై సుమారు 2-4 మి.మీ. పరిమాణంలో చిన్న రంధ్రం ఏర్పడుతుంది.
  • ఈ రంధ్రం మాత్రమే పురుగు నష్టాన్ని గుర్తించడానికి కనిపించే ప్రధాన లక్షణం. తరువాత, ఈ రంధ్రాల ద్వారా చీమలు మరియు సూక్ష్మజీవులు పండులోకి ప్రవేశిస్తాయి.
  • ఫలితంగా, ఆశించిన పండ్లు కుళ్లిపోవడం, అసహ్యకరమైన వాసన వెలువడటం, నాణ్యత క్షీణించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. నష్టం తీవ్రతరమైనప్పుడు, సపోటా పండ్లు వినియోగానికి అనర్హంగా మారుతాయి.

కాలానుగుణంగా పురుగు ఉధృతి
పురుగు ఉనికి సాధారణంగా సెప్టెంబర్ నుంచి ప్రారంభమై అక్టోబర్-డిసెంబర్లో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. జనవరి నుంచి నష్టం కొంత తగ్గినప్పటికీ, మార్చి-ఏప్రిల్లో మళ్లీ పెరుగుతుంది. జూన్ నుంచి కాయల కాలం ముగిసే సమయంలో నష్టం తగ్గుతుంది. వర్షాకాలంలోని జూలై-ఆగస్టు నెలల్లో పురుగు ఉధృతి సాధారణంగా తక్కువగా ఉంటుంది. అందువల్ల సపోటా పంటలో కాయల లభ్యత మరియు పురుగు జీవచక్రం మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు ఈ సమాచారాన్ని బట్టి అర్థమవుతుంది.

రకాలను బట్టి నష్టం
అన్ని సపోటా రకాలు విత్తన తొలుచు పురుగు దాడికి సమానంగా గురికావు. చాల కలెక్షన్-1, చాల కలెక్షన్-3, కో-1, కో-3 మరియు పీకేఎం-4 రకాలలో తక్కువ పండు నష్టం నమోదైంది. దీనికి విరుద్ధంగా కలిపట్టి, కీర్తిభారతి, డీహెచ్ఎస్ -2, కో -2 మరియు క్రికెట్ బాల్ రకాలలో అధిక పండు నష్టం నమోదైంది. అందువల్ల రకానికి సంబంధించిన లక్షణాలు పురుగు దాడి తీవ్రతను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈ సమాచారం సూచిస్తుంది. అయితే తెలంగాణలో ప్రధానంగా కనిపించే రకాలు కలిపట్టి, క్రికెట్ బాల్, పాల సపోటా, పీకేఎం-4 కో-1 వంటి రకాలను పరిశీలించవచ్చు. కలిపట్టి తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఏ రకం ఎక్కువగా దెబ్బతింటుంది అనేది ప్రాంతం, పండ్ల లభ్యత సమయం, తోట యాజమాన్య పద్ధతులు, పురుగు నియంత్రణ పద్ధతులపై ఆధారపడుతుంది.

ఆర్థిక ప్రాముఖ్యత
పెద్ద వయస్సు కలిగిన చెట్లు మరియు ఎక్కువ కాయలను ఇచ్చే చెట్లలో విత్తన తొలుచు పురుగు నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దెబ్బతిన్న పండ్లకు మార్కెట్లో తక్కువ ధర లభించడం వల్ల రైతులకు ప్రత్యక్ష ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. అంతేకాకుండా, పండ్లను రవాణా చేసే సమయంలో లేదా మార్కెట్కు చేరిన తరువాత పెద్ద పురుగులు బయటకు రావడం ద్వారా ఇతర ప్రాంతాలకు పురుగు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది కేవలం పంట దిగుబడిని తగ్గించే పురుగు మాత్రమే కాకుండా, పండ్ల నాణ్యత, మార్కెట్ విలువ మరియు వ్యాప్తి పరంగా కూడా ముఖ్యమైన కీటక సమస్యగా పరిగణించవచ్చు.

యాజమాన్య పద్ధతులు
తోట పరిశుభ్రత: సపోటా తోటను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పురుగు ప్రారంభ జనాభాను తగ్గించవచ్చు. పురుగు ఆశించిన పండ్లు, రాలిపోయిన పండ్లు, ఎండిన ఆకులు మరియు ఇతర మొక్కల అవశేషాలను క్రమం తప్పకుండా సేకరించి, స్థానిక వ్యవసాయ సిఫారసుల ప్రకారం సురక్షితంగా తొలగించాలి.

లోతుగా దున్నడం: పురుగు కోశస్థ దశ మట్టిలో లేదా ఎండిన ఆకుల కింద ఉంటుందని నిర్ధారణ అయినప్పుడు, తోటలో తగిన సమయంలో నేలను దున్నడం ద్వారా కోశాలను బయటకు తీసుకురావచ్చు. దీనివల్ల అవి ఎండకు, సహజ శత్రువులకు గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పురుగు కోశస్థ దశ తప్పనిసరిగా మట్టిలోనే ఉంటుందని భావించకూడదు; స్థానిక జీవన చక్ర సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

సరైన సమయంలో పండ్ల కోత: పండ్లు తగిన పరిపక్వతకు చేరినప్పుడు కోత చేపట్టడం వల్ల చెట్లపై పండ్లు ఎక్కువకాలం ఉండటాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల పండ్లపై పురుగు దాడికి గురయ్యే అదనపు అవకాశాలు తగ్గవచ్చు. అయితే, కోత సమయాన్ని మాత్రమే మార్చడం ద్వారా పురుగును పూర్తిగా నియంత్రించలేము; తోట పరిశుభ్రత, క్రమబద్ధమైన పర్యవేక్షణతో కలిపి ఈ పద్ధతిని అమలు చేయాలి.
రాలిపోయిన పండ్ల సేకరణ: సపోటా విత్తన తొలుచు పురుగు లార్వాలు పండ్లలోకి ప్రవేశించి, విత్తన భాగాన్ని ఆశ్రయిస్తూ అభివృద్ధి చెందుతాయి. లార్వా దశ పూర్తయిన తర్వాత పండు నుంచి బయటకు వచ్చి కోశస్థ దశకు చేరుతుంది. అందువల్ల, చెట్ల నుంచి రాలిపోయిన మరియు పురుగు ఆశించిన పండ్లను తరచుగా సేకరించి, తోట నుంచి తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలి. ఈ విధానం ద్వారా పురుగు తదుపరి తరానికి వ్యాప్తి చెందే అవకాశాన్ని తగ్గించవచ్చు.

నివారణ : శాస్త్రవేత్తల సలహాల మేరకు నివారణ చర్యలు చేపట్టాలి

ఎన్. పవన్, ఎం.ఎస్సి. స్కాలర్, కీటక శాస్త్రం (ఎంటమాలజీ)
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్. 9490500640
డా. సి. హెచ్. రాజా గౌడ్, ప్రధాన శాస్త్రవేత్త మరియు హెడ్, కీటక శాస్త్రం (ఎంటమాలజీ) ఉద్యాన పరిశోధనా స్థానం (HRS), కొండమల్లేపల్లి, నల్గొండ జిల్లా. 8374003085

Read More

పశువులకు బీమా ఎందుకు అవసరం?రైతు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

“పశువు రైతుకు కేవలం ఒక జీవి కాదు… అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి.”
ఒక రైతు తన ఇంట్లో రెండు లేదా మూడు పాలిచ్చే పశువులను పెంచుకుంటున్నాడని అనుకుందాం. ప్రతిరోజూ వచ్చే పాల ఆదాయం ఇంటి ఖర్చులకు, పిల్లల చదువులకు, పశువుల మేతకు కొంత అండగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ పశువు అనారోగ్యంతో మరణిస్తే లేదా ప్రమాదానికి గురైతే? పశువును కోల్పోవడంతో పాటు, రైతు కుటుంబానికి వచ్చే రోజువారీ ఆదాయం కూడా ఆగిపోతుంది.

ఇలాంటి అనుకోని ఆర్థిక నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయడానికి పశువుల బీమా (Livestock Insurance) ఎంతో ఉపయోగపడుతుంది.

పశువుల బీమా అంటే ఏమిటి?
సులభంగా చెప్పాలంటే, పశువులకు బీమా అనేది అనుకోని ప్రమాదాల వల్ల పశువును కోల్పోయినప్పుడు రైతుకు ఆర్థిక రక్షణ కల్పించే వ్యవస్థ.

రైతు నిర్ణీత ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకుంటాడు. పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా చేసిన పశువు మరణించినప్పుడు, అవసరమైన ధృవీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీమా సంస్థ రైతుకు పాలసీలో నిర్ణయించిన పరిహారాన్ని అందిస్తుంది.

అంటే, బీమా పశువును తిరిగి తీసుకురాదు. కానీ పశువును కోల్పోయిన తర్వాత రైతు కుటుంబంపై పడే ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది.

పశువులకు బీమా ఎందుకు అవసరం?

  1. పశువు రైతుకు ఒక పెట్టుబడి
    ఒక మంచి పాలిచ్చే ఆవు లేదా గేదెను కొనుగోలు చేయడానికి రైతు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తాడు. పశువు ద్వారా పాలు, దూడలు, పేడ వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి.
    అందువల్ల పశువు ఒక ఉత్పాదక ఆస్తి. ఈ ఆస్తిని అనుకోని నష్టం నుంచి రక్షించుకోవడానికి బీమా ఒక ఆర్థిక భద్రతగా పనిచేస్తుంది.
  2. అనుకోని ప్రమాదాలకు ఆర్థిక రక్షణ
    పశువులకు వ్యాధులు, ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక ప్రమాదాలు ఎదురవుతాయి. రైతు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ప్రతి ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు.
    ఉదాహరణకు: పశువు మరణం → ఆస్తి నష్టం → పాల ఆదాయం నిలిచిపోవడం → కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి
    ఇలాంటి పరిస్థితుల్లో బీమా పరిహారం రైతుకు కొంత ఆర్థిక ఊరటనిస్తుంది.
  3. చిన్న రైతులకు మరింత ఉపయోగకరం
    పెద్ద రైతు ఒక పశువును కోల్పోయినా ఇతర పశువుల ద్వారా కొంత ఆదాయం పొందగలడు. కానీ ఒకటి లేదా రెండు పశువులపై ఆధారపడే చిన్న రైతు కుటుంబానికి ఒక పశువు నష్టం కూడా పెద్ద ఆర్థిక సమస్యగా మారవచ్చు. అందుకే చిన్న, సన్నకారు రైతులకు పశువుల బీమా ప్రత్యేకంగా ఉపయోగకరం.

ఏ పశువులకు బీమా చేయవచ్చు?
ప్రభుత్వ పథకాల మార్గదర్శకాల ప్రకారం బీమా పరిధిలో పాలు ఇచ్చే దేశీ/క్రాస్బ్రీడ్ పశువులతో పాటు కొన్ని ఇతర పశువులు కూడా ఉండవచ్చు. గొర్రెలు, మేకలు, పందులు, కుందేళ్లు, యాక్, మిథున్ వంటి పశువులు కూడా సంబంధిత నిబంధనల ప్రకారం పరిధిలోకి రావచ్చు. ప్యాక్ యానిమల్స్గా గుర్రాలు, గాడిదలు, మ్యూల్స్, ఒంటెలు, పోనీలు వంటి జంతువులు కూడా పథక పరిధిలో ఉండవచ్చు. అయితే ఏ జంతువుకు, ఏ పరిస్థితుల్లో, ఎంతవరకు బీమా అందుబాటులో ఉందో రాష్ట్రంలో అమలులో ఉన్న తాజా మార్గదర్శకాలు మరియు పాలసీ నిబంధనల ఆధారంగా తెలుసుకోవాలి.

బీమా ఎలా పనిచేస్తుంది?
రైతు ముందుగా బీమా చేయించాలనుకునే పశువును ఎంపిక చేసుకోవాలి. అనంతరం పశువుకు సంబంధించిన గుర్తింపు వివరాలను నమోదు చేసి, దాని విలువను నిర్ణయిస్తారు. ఈ వివరాల ఆధారంగా బీమా పాలసీ తీసుకుని, నిర్ణయించిన ప్రీమియాన్ని చెల్లించాలి. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత, పాలసీ నిబంధనలకు లోబడి పశువుకు అనుకోని నష్టం సంభవించినట్లయితే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ లేదా అధికారికి సమాచారం ఇవ్వాలి. అనంతరం పశువైద్య లేదా బీమా సంస్థ ప్రతినిధులు అవసరమైన పరిశీలన, ధృవీకరణ చేపడతారు. రైతు క్లెయిమ్కు అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత, బీమా సంస్థ క్లెయిమ్ను పరిశీలిస్తుంది. పాలసీ నిబంధనలకు అనుగుణంగా క్లెయిమ్ అర్హత పొందితే, రైతుకు నిర్ణయించిన పరిహారం చెల్లించబడుతుంది. అందువల్ల బీమా తీసుకోవడం మాత్రమే కాదు, పాలసీ నిబంధనలను అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.

రైతు బీమా తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

  1. పశువు విలువను సరిగ్గా నమోదు చేయాలి
    బీమా తీసుకునే సమయంలో పశువు విలువను ఎలా నిర్ణయిస్తున్నారు? ఎవరు విలువను ధృవీకరిస్తారు? పాలసీలో ఎంత మొత్తానికి బీమా చేస్తున్నారు? వంటి విషయాలను రైతు వివరంగా తెలుసుకోవాలి.
  2. పశువు గుర్తింపు చాలా ముఖ్యం
    పశువును ఇతర పశువులతో గందరగోళం కాకుండా గుర్తించడానికి చెవి ట్యాగ్, ప్రత్యేక గుర్తింపు లేదా సంబంధిత అధికారిక గుర్తింపు విధానం ఉపయోగించవచ్చు. గుర్తింపు వివరాలు సరిగ్గా నమోదు చేయడం క్లెయిమ్ సమయంలో ఎంతో ముఖ్యమైనది.
  3. పాలసీ కాలాన్ని తెలుసుకోవాలి
    పాలసీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమలులో ఉంటుంది? ఎప్పుడు పునరుద్ధరించాలి? అనే విషయాలను రైతు గుర్తుంచుకోవాలి. ప్రస్తుత జాతీయ మార్గదర్శకాలు సాధ్యమైన చోట ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలానికి బీమా చేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
  4. ఏ నష్టాలకు పరిహారం వస్తుందో తెలుసుకోవాలి
    “బీమా ఉంది కాబట్టి ఏ కారణంతో పశువు చనిపోయినా డబ్బు వస్తుంది” అనుకోవడం సరికాదు. ప్రతి పాలసీకి కొన్ని నిబంధనలు, మినహాయింపులు (exclusions), క్లెయిమ్ విధానాలు ఉంటాయి.
    అందువల్ల పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు:
    • ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
    • ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు?
    • ఏ పత్రాలు అవసరం?
    • నష్టం జరిగినప్పుడు ఎవరికి సమాచారం ఇవ్వాలి?
    • ఎంత సమయంలోపు సమాచారం ఇవ్వాలి?

పశువు మరణించినప్పుడు రైతు ఏం చేయాలి?
ఇది చాలా ముఖ్యమైన విషయం.
పశువు బీమా చేసిన తర్వాత అనుకోని కారణంతో మరణిస్తే, రైతు వెంటనే సంబంధిత బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి/సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
అవసరమైన గుర్తింపు, పశువైద్య ధృవీకరణ, మరణానికి సంబంధించిన పత్రాలు, పాలసీ వివరాలు వంటి వాటిని నిబంధనల ప్రకారం సమర్పించాలి.
పశువు మరణించిన వెంటనే తొందరపడి మృతదేహాన్ని తొలగించడం లేదా అవసరమైన పరిశీలనకు అవకాశం లేకుండా చేయడం క్లెయిమ్ ప్రక్రియలో సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ముందుగానే సంబంధిత అధికారుల సూచనలు తెలుసుకోవడం మంచిది.

“బీమా అంటే అదనపు ఖర్చు” అనే ఆలోచన సరైనదేనా?
• చాలామంది రైతులు, “పశువుకు బీమా చేయడానికి డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి?” అని అనుకుంటారు. కానీ దీన్ని మరో విధంగా ఆలోచించాలి.
• ప్రీమియం – రక్షణ కోసం చేసే చిన్న ముందస్తు ఖర్చు.
• పశువును పూర్తిగా కోల్పోయినప్పుడు కలిగే ఆర్థిక నష్టంతో పోలిస్తే, బీమా కోసం చెల్లించే రైతు వాటా తక్కువగా ఉండవచ్చు.
• అంతేకాదు, ప్రభుత్వ పథకాల కింద అర్హత ఉన్న రైతులకు ప్రీమియంపై సబ్సిడీ కూడా లభించవచ్చు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో పశుసంపద బీమా National Livestock Mission (NLM) లోని “Research & Development, Livestock Insurance, Extension and Innovation” ఉప-మిషన్లో భాగంగా కొనసాగుతోంది.

ప్రభుత్వ సహాయం గురించి రైతు తెలుసుకోవాల్సింది
ప్రస్తుత కేంద్ర మార్గదర్శకాల ప్రకారం పశుసంపద బీమాలో రైతు ప్రీమియం వాటాను తగ్గించే విధంగా ప్రభుత్వ సహాయం అందించే విధానం ఉంది. 2025–26 వార్షిక నివేదిక ప్రకారం, రైతు వాటా 15 శాతానికి తగ్గించబడింది, మిగిలిన 85 శాతం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్దిష్ట నిష్పత్తిలో భరించే విధానం అమలులో ఉంది. అయితే పథకం అమలు, అర్హత, రాష్ట్ర స్థాయి ప్రక్రియలు మారవచ్చు కాబట్టి రైతులు తమ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వద్ద తాజా వివరాలు తెలుసుకోవాలి.
ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం సబ్సిడీ ప్రయోజనం నిర్దిష్ట పరిమితిలోని పశువులకు వర్తిస్తుంది; ఆ పరిమితికి మించి పశువులకు బీమా చేయాలనుకుంటే కొన్ని సందర్భాల్లో పూర్తి ప్రీమియం చెల్లించి బీమా చేసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల “ప్రభుత్వం మొత్తం బీమా డబ్బు చెల్లిస్తుంది” అని భావించకూడదు.

బీమా తీసుకునే ముందు రైతు చెక్లిస్ట్
బీమా పాలసీ తీసుకునే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి:
• నా పశువుకు బీమా అర్హత ఉందా?
• పశువు విలువ ఎలా నిర్ణయించారు?
• బీమా మొత్తం ఎంత?
• నేను చెల్లించాల్సిన ప్రీమియం ఎంత?
• ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందా?
• పాలసీ కాలం ఎంత?
• ఏ ప్రమాదాలు కవర్ అవుతాయి?
• ఏ పరిస్థితుల్లో క్లెయిమ్ రాదు?
• పశువు మరణిస్తే ఎవరికి సమాచారం ఇవ్వాలి?
• ఏ పత్రాలు అవసరం?
• క్లెయిమ్ ఎన్ని రోజుల్లో నమోదు చేయాలి?
• బీమా సంస్థ/అధికారిక ప్రతినిధి సంప్రదింపు నంబర్ ఏమిటి?

బీమా ఒక్కటే రక్షణ కాదు
పశువులకు బీమా చేయడం మంచిదే. కానీ బీమా అనేది మంచి పశుపోషణకు ప్రత్యామ్నాయం కాదు.
పశువులను వ్యాధుల నుంచి రక్షించడానికి సమయానికి టీకాలు, సరైన పోషణ, పరిశుభ్రమైన నీరు, మంచి గాలి ప్రసరణ, సరైన మేత, శాస్త్రీయ ప్రజనన నిర్వహణ, సమయానుకూల పశువైద్యం అన్నీ అవసరం.
అదే విధంగా పశువుల ఆరోగ్య రికార్డులు, టీకాల వివరాలు, చికిత్స వివరాలు, కొనుగోలు వివరాలు వంటి వాటిని సురక్షితంగా భద్రపరచడం కూడా మంచిది.
ముగింపు
రైతు పశువును కేవలం “పశువు”గా చూడకూడదు. అది కుటుంబానికి ఆదాయం ఇచ్చే ఆస్తి. అది రైతు శ్రమకు ప్రతిఫలం. అది గ్రామీణ కుటుంబ ఆర్థిక భద్రతలో ఒక భాగం. అందుకే పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్థిక రక్షణ కూడా అవసరం. అనుకోని ప్రమాదాన్ని మనం ఎప్పుడూ ఆపలేకపోవచ్చు. కానీ దాని వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
“పశువును కాపాడటం బాధ్యత…పశువు విలువను కాపాడటం తెలివైన ఆర్థిక నిర్ణయం.”
కాబట్టి రైతు సోదరులు తమ ప్రాంతంలో అమలులో ఉన్న పశుసంపద బీమా పథకాల గురించి సమీప పశువైద్య కేంద్రం, పశుసంవర్ధక శాఖ కార్యాలయం లేదా అధికారిక బీమా ప్రతినిధి వద్ద వివరాలు తెలుసుకుని, అర్హత ఉన్న పశువులకు బీమా రక్షణను పరిశీలించడం మంచిది.

డా. బద్దం అఖిల (ఎం.వి.ఎస్సి.),
డా. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్,
పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం,
పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 9703121088

Read More

ఇ.యం. టెక్నాలజీ

యాక్టివేటెడ్ ఇ.యం. (ఎ.ఇ.యం.) ద్రావణం

కావలసిన పదార్థాలు : 20 లీ. ప్లాస్టిక్ క్యాన్ (మూతతో సహా), ఇ.యం. స్టాకు ద్రావణం 1 లీ. 1-2కి బెల్లం. 20 లీ. నీరు.
తయారీ విధానం : ప్లాస్టిక్ క్యాన్‌లో 20 లీ. నీరు నింపి 1-2 కి. బెల్లాన్ని కలపాలి. దీనికి 1 లీ. ఇ.యం. స్టాకు ద్రావణం కలపాలి. క్యాన్‌పై మూత పెట్టి 8-10 రోజులు చల్లటి, చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఉదజని సూచిక 3.5కి వస్తుంది. తయారైన యాక్టివేటెడ్ ఇ.యం. ద్రావణం నుండి తీయని, పుల్లటి వాసన వస్తుంది.

ఉపయోగించే విధానాలు :

  1. నేరుగా ఉపయోగించడం :
  • పంటపై పిచికారి : 1 మి.లీ. / 1 లీ. నీరు
  • భూమి / పంట అవశేషాలపై పిచికారి : 5 మి.లీ. / 1 లీ. నీరు
  • కంపోస్టు కుప్పపై పిచికారి : యాక్టివేటెడ్ ఇ.యం.ని 60 రోజుల వరకు ఉపయోగించకపోతే 0.5% ద్రావణాన్ని కంపోస్టు కుప్పపై పిచికారి చేయాలి.
  • యాక్టివేటెడ్ ఇ.యం.ని. 60 రోజులలోపు ఉపయోగించాలి.
  • 8 రోజులు చల్లని, చీకటి ప్రదేశంలో పులియబెట్టాలి.
  • శుభ్రమైన, ఎటువంటి దుర్వాసనలేని ద్రవాన్ని గుడ్డతో వడపోయాలి.
    తయారు చేసిన 60-70 రోజులలోపు వాడాలి
  1. యాక్టివేటెడ్ ఇ.యం.తో సత్తువ కల్గించిన మూత్రం
  • పశువుల మూత్రాన్ని సేకరించి 8 రోజులు ఎనరోబిక్ పద్ధతిలో పులియ బెట్టాలి.
  • ఒక లీటరు మూత్రానికి 50 మి.లీ. ఎ.ఇ.యం. ద్రావణం, 100 గ్రా. బెల్లం కలపాలి.
  • ఒక లీటరు నీటికి 1 మి.లీ. సత్తువ కలిగించిన మూత్రాన్ని కలిపి పంటపై పిచికారి చేయాలి. పంటకాలంలో 3-4 సార్లు పిచికారి చేయాలి.
    తయారు చేసిన 60-70 రోజులలోపు వాడాలి
  1. ఇ.యం. పులిసిన మొక్కల రసం
  • 10 కి. కలుపు మొక్కలను సూర్యోదయం వేళ సేకరించి 2 అంగుళాల ముక్కలుగా కత్తిరించాలి.
  • వీటిని ప్లాస్టిక్ క్యాన్‌లోని నీటిలో 500 మి.లీ. యాక్టివేటెడ్ ఇ.యం. మరియు 500 మి.లీ. బెల్లం ద్రావణంతోపాటు కలపాలి.
  • మూతని క్యాన్‌లో ఏర్పడిన వాయువులు బయటకుపోవడానికి కొంచెం వదులుగా మూయాలి.
  • 1 మి.లీ. ఇ.యం. పులిసిన ద్రావణాన్ని 1 లీ. నీటిలో కలిపి పంటపై 3-4 సార్లు పిచికారి చేయాలి.
    తయారు చేసిన 60-70 రోజులలోపు వాడాలి.
Read More