వండని వంట… పచ్చి మునక్కాయల నిల్వ పచ్చడి
నిల్వ పచ్చళ్ళ మూల సూత్రం ఒకటి ఉంది. ఉప్పు, పులుపు తగినంత ఉంటే, పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మొదట తక్కువ కాయలతో నిల్వ పచ్చడి పెట్టుకుని, బాగుంది అని అనిపిస్తే, ఆ అనుభవంతో ఎక్కువ కాయలతో చేసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం తగినంత ఉన్నదీ లేనిదీ, రుచి చూస్తే తెలుస్తుంది. మొదట ఉప్పు పులుపు కారం తక్కువ తక్కువ కలుపుకోవాలి. రుచి చూస్తూ సరిచేసుకోవాలి.
ముదురు కాకుండా లేత కాకుండా, మధ్యస్తంగా ఉండే మునక్కాయలు నాలుగో అయిదో తీసుకుని, పొడి గుడ్డతో తుడిచి, పైపైన కాస్తా పొట్టు తీసి, రెండు అంగుళాల పొడవున ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలను కాసేపు నీడకు ఆరనివ్వాలి. తరువాత ఆ ముక్కలకు తగినంత ఉప్పు, నిమ్మ రసం, ఆవపిండి, మెంతి పిండి, జీలకర్ర పొడి, కారం వేసి కలుపుకోవాలి. రెండు మూడు రోజుల పాటు అలాగే స్టీల్ గిన్నెలో ఉండనిచ్చి మూత పెట్టి, ఉదయం సాయంత్రం ఒకసారి అంతా కలిసేలా గరిటెతో కలుపుకోవాలి.
ముక్కల్లో కాస్తా నీరు ఊరుతుంది. ఉప్పు కారం పులుపు ఘాటు తగినట్లుగా ఉన్నది లేనిది రుచి చూసి సరిచేసుకోవాలి. చివరికి పచ్చడిలో కాస్తా గానుగ నూనె పోసుకుని కలపాలి. అంతే! పచ్చి మునక్కాయల నిల్వ పచ్చడి సిద్దం!
బయటి వాతావరణంలో కూడా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలో, మునక్కాయ పచ్చడి కలుపుకుని తింటే రుచికరంగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
- మునక్కాయలు
- నిమ్మ రసం
- ఉప్పు * కారం
- ఆవపిండి
- మెంతిపిండి
- జీలకర్ర పొడి
- గానుగ నూనె
(ఏ నూనె వాడితే అదే)
రచనః తుమ్మేటి రఘోత్తమరెడ్డి
………………………………………………………………………………………………………………………………….
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

