మొక్కలు నాటడమంటే తంతు కాదు.. అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్షజాతులను పెంచితేనే మంచి ఫలితాలొస్తాయి. కానీ చాలాచోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలను పెంచుతున్నారు. అవి ఫలించి, పుష్పించి, పచ్చగా కనిపించినా పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనవైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరికట్టగలుగుతాం. గతంలో మనం చూసిన చాలా పకక్షులు, ఉడతల వంటి జీవులు. ఇప్పుడు కనిపించట్లేదు. అందమైన సీతాకోకచిలుకలూ కనుమరుగైపోతున్నాయి. దేశీయ మొక్కలు, చెట్లు లేకపోవడం వీటన్నిటికీ కారణం. పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ పచ్చదనం మాయమవుతోంది. పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో వేల మొక్కలు నాటుతున్నా వాటిలో ఎక్కువ స్థానికేతర జాతులే ఉంటున్నాయి. దేశవాళీ వృక్ష సంపద తగ్గిపోయే కొద్దీ జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాదు భూగర్భ జలాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపైనా ఈ ప్రభావం పడుతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.*వలసపోతున్న పక్షులు*స్థానిక వృక్ష జాతుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇవి మన నేలలకు అలవాటు పడ్డ రకాలు. వీటిపైనే పకక్షులు ఎక్కువగా వాలతాయి. గూళ్ళు కట్టుకుంటాయి. మన వృక్షాలు లేకపోవడం వల్ల చాలా పకక్షులు వలసపోతున్నాయి. పకక్షులకు సహజ ఆవాసాలుగా మారే తుమ్మ వంటి చెట్లు లేకపోవడంతో చిలుకలు, మైనా వంటివి తగ్గిపోయాయి. తాటి, ఈత చెట్లు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలకు సహజసిద్ధ అవాసాలు. ఉమ్మడి రాష్ట్ర పక్షిగా గుర్తించిన పాలపిట్ట ఇపుడు అంతరించిపోయే పరిస్థితి ఉంది.సీతాకోక చిలుకలు తేనెటీగలను దేశీజాతి ఫల, పుష్పాలు ఆకర్షిస్తాయి. ఆ చెట్ల సంఖ్య తగ్గేకొద్దీ అవి కనుమరుగవుతాయి. పిచ్చుకల్లో చాలా రకాలు ఉండేవి. ఇప్పుడు ఇందులో కేవలం ఒకటి మాత్రమే కనిపిస్తోంది.*గాలి నాణ్యతకు దోహదం*వేప, మద్ది, రావి, మర్రి, వంటివి క్షామాన్ని తుపాన్లను కూడా తట్టుకుని నిలబడతాయి. ఎక్కువ ప్రాణవాయువును విడుదల చేస్తాయి. నగరాల్లో వాయు కాలుష్యం పరిమితికి మించి పెరిగింది. గాలిలోని ధూళి కణాలను శుద్ధి చేయడంలో ఈ చెట్లు బాగా పనికివస్తాయి. ఈ రకం చెట్లు పడిన వాననీటిని భూగర్భంలో ఇంకేలా చేస్తాయి. వీటి వల్ల భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా. చేయడంలోనూ అవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.*మన పెరట్లో…*బయటే కాకుండా మన ఇళ్లల్లోని పెరట్లో కూడా స్థానిక జాతి మొక్కలు, చెట్లను పెంచుదాం. దీంతో జీవావరణం వృద్ధి చెందుతుంది. జీవవైవిధ్యానికి కూడా మేలు చేసిన వారమవుతాం.కరివేపాకు, జామ, సీతాఫలం, బొప్పాయి, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్ వంటి పండ్ల రకాలను నాటొచ్చు. రూఫ్‌టాప్‌పై సోర, బీర, టమోటా, వంగ, వంటి వాటిని పెంచితే మంచిది. మల్లె, సన్నజాజి, జాజి, బంతి, తదితర దేశీయ పూల మొక్కలను పెంచొచ్చు.*శేషాచలంపైనా….*శేషాచలం కొండల్లో 80వ థకంలో అటవీ ప్రాంత విస్తరణ కోసం పెద్దఎత్తున ఆకాసియా ఔరిక్యలిఫార్మిస్ అనే ఆస్ట్రేలియన్ మొక్కలను భారీగా నాటారు. ఇవి నేలలో క్షార గుణాన్ని పెంచి, స్థానిక మొక్కలను బతకనీయకుండా చేస్తున్నాయి. లాంటానా కామారా అన్న స్థానికేతర జాతి చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవులు, పచ్చిక బయళ్లను ఆక్రమించాయి. వీటిపై పకక్షులు గూళ్ళు కట్టి, ఆహారం సేకరించే అవకాశాలు ఉండడం లేదు. పూలు, ఫలాలు లేకపోవడం వల్ల తేనెటీగలు.. సన్‌బర్డ్, బుల్‌బుల్ వంటి పుప్పొడి రవాణా చేసే పకక్షులు గణనీయంగా తగ్గిపోయాయి. *ఏవి దేశీయ జాతులు?:* మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, మునగ, ఇప్ప, జువ్వి గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది, తదితర రకాలు*ఇవి స్థానికేతర రకాలు :* బూరుగు, కోనోకార్పస్, జామాయిల్, మలేషియా వేప, మహాగని, పుమేరియా, బాటిల్ బ్రష్. *కాపాడాల్సిన బాధ్యత మనదే..*పార్కుల్లో అందం కోసం, లెక్క కోసం స్థానికేతర స్థానిక రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రహదారుల విస్తరణలో చింత చెట్లను విచ్చలవిడిగా కొట్టేస్తున్నారు. వీటిని విస్తారంగా పెంచితే పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకూ ఆసరాగా ఉపయోగపడతాయి.- *ప్రొ.తుమ్మల శ్రీకుమార్,* పర్యావరణవేత్త, విజయవాడ