పాడి రైతులకు అండగా పశువుల బీమా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అమలు చేస్తున్న పశువుల బీమా పథకం పాడి రైతులను ఆదుకుంటోంది. ఇటీవల అంతుపట్టని వ్యాధులు, విద్యుత్‌ఘాతాలు, చెరువులు, నదీ జలాల్లో పశువులు మునిగి చనిపోవడం వంటి ఘటనల వలన ఆసరాగా ఉంటున్న పాడి పశువు మృతితో పోషకులు జీవనోపాధి కోల్పోతున్నారు. మరో పాడి పశువు కొనుగోలుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయా సమస్యలకు బీమా పథకంలో చేరడం ఒక్కటే పరిష్కార మార్గమని పశువైద్యాధికారి కె. మాధవ రావు సూచిస్తున్నారు.

  • 80 శాతం రాయితీపై గేదెలు, ఆవులకు పథకం అమలు చేస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వర్తిస్తుంది.
  • ఒకసారి బీమా చెల్లిస్తే మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది.
  • పశువుకు చెవి పోగు వేయించి బీమా నమోదు చేసుకోవాలి.
  • పూర్తి వివరాలకు రైతు సేవా కేంద్రం, సమీప పశు వైద్యశాలలో సంప్రదించాలి.
Read More

అగ్రి, హార్టీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలకు 19 నుంచి కౌన్సెలింగ్‌

తెలంగాణాలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో బీఎస్సీ, బీవీఎస్సీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని అగ్రివర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 19 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు అగ్రివర్సిటీ రిజిస్ట్రార్‌ వెల్లడించారు. తొలిరోజు ఉదయం పది గంటల నుంచి టీజీఈఏపీసెట్‌లో 1450 వరకు ర్యాంకులు సాధించినవారికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, ఈ నెల 23 నాటికి 4499 వరకు ర్యాంకులు సాధించిన వారికి కౌన్సెలింగ్‌ జరుగుతుందని తెలిపారు.

Read More

వ్యవసాయ పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలి

వ్యవసాయం వాటి అనుబంధరంగాల పరిశోధనలు రైతులకు ఉపయోగపడాలని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్‌)లో సోమవారం వ్యవసాయ పరిశోధన సర్వీసు (ఏఆర్‌ఎస్‌) 115వ ఫౌండేషన్‌ కోర్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ సభ్యుడు, ఐకార్‌ మాజీ కార్యదర్శి చబిలేంద్రరౌల్‌ అన్నారు. పోషకాహార భద్రత, వాతావరణ మార్పులను ఎదుర్కొనే విధానాలు, సహజ వనరుల పరిరక్షణ తదితర కోణాల్లో నూతన ఆవిష్కరణలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఐకార్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ జయకృష్ణజెనా, మిసైల్‌ సైంటిస్ట్‌ అరుణ్‌ తివారి, నార్మ్‌ డైరెక్టర్‌ గోపాల్‌లాల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 మంది ఏఆర్‌ఎస్‌ ప్రొబేషనర్లకు మూడు నెలల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది.

Read More

వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల కెక్కిన విత్తన బంతుల కార్యక్రమం

ఈ నెల 9న కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ చేపట్టిన విత్తన బంతుల ప్రాజెక్టు.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల కెక్కింది. విద్యార్థులతో కలిసి చేపట్టిన ఈ ప్రాజెక్టును లండన్‌ కేంద్రంగా పని చేసే సంస్థ గుర్తించిందని మేయర్‌ ఆర్య ఎస్‌ రాజేంద్రన్‌ సోమవారం వెల్లడించారు. ఇందులో 6 వేల మంది విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో తిరువనంతపురంలోని పుథరీకందం మైదానంలో 4 లక్షల విత్తన బంతులను విసిరామని తెలిపారు.

Read More

పంటలలో తెగుళ్ల ఉధృతి నమోదు ఏవోలు చేయాలి





ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పంటల్లో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయాధికారులు వారంలో ఒకరోజు పర్యటించి, తెగుళ్ళ వివరాలను యాప్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు సూచించారు. ఈ-పంట, డిజిటల్‌ అప్లికేషన్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ‘ఇప్పటి వరకు 4,41,167 ఎకరాల్లో 1,65,843 మంది రైతులకు సంబంధించి పంటలను ఈ- క్రాప్‌లో నమోదు చేశాం. బహువార్షిక ఉద్యాన పంటలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి’ అని వెల్లడించారు. ఉద్యాన పంటల నమోదు సమయంలో పంటల రకాలను పేర్కొనాలని ఆ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసులు వివరించారు.

Read More

ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న నర్మెట్ట ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ

రూ.300 కోట్ల వ్యయంతో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ పరిశ్రమను ఆగస్టు నెలాఖరుకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం అశ్వారావుపేటలో మాత్రమే ఆయిల్‌పామ్‌ శుద్ధి పరిశ్రమ ఉంది. ఆ తర్వాత మరో 14 పరిశ్రమలు ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నర్మెట్టలో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 62 ఎకరాల్లో చేపట్టిన పనులు తుది థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి పరిశ్రమ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో మూడు వ్యవసాయ ప్రయోగశాలలకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు

ఎన్‌ఏబీఎల్‌ (నేషనల్‌ అక్రెడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ లాబొరేటరీస్‌) గుర్తింపు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోని మూడు ప్రయోగశాలలకు లభించింది. నెల్లూరులోని జీవ, సేంద్రియ ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాల, బాపట్లలోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాల, కర్నూలులోని పురుగుమందుల పరీక్ష కేంద్ర ప్రయోగశాలలకు ఈ గుర్తింపు దక్కింది. వ్యవసాయరంగంలో నాణ్యతా ప్రమాణాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వీటికి ఈ గుర్తింపు లభించిందని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన అభినందించారు. మిగిలిన అన్ని ప్రయోగశాలలకూ ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియచేశారు.

Read More

ఆశ’ కంది రకంలో చిగురు ముడత తెగులును నిరోధించే జన్యువు!

కంది, పెసర, మినుములు, చిక్కుడు వంటి పప్పు జాతి పంటల్లో ఆశించే చిగురు ముడత తెగులు(స్టెరిలిటీ మెజాయిక్‌ డిసీజ్‌)ను నిరోధించే జన్యువును ‘ఆశ’ కందిలో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగులు సోకితే మొక్కలలో ఆకులు కుంచించుకుపోయి కాత, పూత ఉండదు. దీనిపై సీనియర్‌ శాస్త్రవేత్త మనీశ్‌ పాండే నేతృత్వంలో గంగశెట్టి ప్రకాశ్‌, ఇతర శాస్త్రవేత్తలు విస్తృతస్థాయిలో పరిశోధనలు చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పల్సెస్‌ రీసెర్చ్‌ (యూపీ), డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(బిహార్‌), ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(అస్సాం)ల సహకారంతో కంది సంప్రదాయ రకాలైన ‘ఆశ, మారుతి’లపై ప్రయోగాలు జరిపి… చివరికి ‘ఆశ’ రకంలో ఈ తెగులును నిరోధించే జన్యువును గుర్తించి దానికి సీసీఎస్‌ఎండీ 04 అని పేరు పెట్టారు. మరోవైపు మారుతి రకంలో ఈ జన్యువు లేక పోవడంతో అది తెగులు బారిన పడుతుందని గ్రహించారు. దీంతో సీసీఎస్‌ఎండీ 04 జన్యువుపై మరిన్ని పరిశోధనలు చేసి తక్కువ కాలంలో సాగయ్యే సరికొత్త వంగడాన్ని రూపొందించాలని భావిస్తున్నారు.

Read More

దేశ ఆహార భద్రతను స్వామినాథన్‌ తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు

మన వ్యవసాయ రంగం పోషకాహార భద్రత, పంటల్లో భిన్నత్వం, వాతావరణాన్ని తట్టు కునే పంటలు, టెక్నాలజీలు ఈ నాలుగు చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ శత జయంతి సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామినాథన్‌కు నివాళిగా ప్రత్యేక నాణేన్ని, పోస్టల్‌ స్టాంపును విడుదల చేశారు. ‘వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధను, మెషీన్‌ లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కరవును, వేడిని, వరదలను తట్టుకునే పంటలను అభివృద్ధి చేయాలి. రియల్‌ టైమ్‌లో నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. దీనిని ప్రతి జిల్లాలో అందుబాటులోకి తేవాలి. తద్వారా పంటల దిగుబడిని, తెగుళ్ల నివారణను, సాగు విధానాలను పర్యవేక్షించాలి. భూములకు సరిపడే పంటలను నిర్ణయించాలి. పంటల మార్పిడిపై పరిశోధనలు జరగాలి. సౌర విద్యుత్తు ఆధారిత మైక్రో ఇరిగేషన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ రంగానికి దివంగత స్వామినాథన్‌ చేసిన కృషిని ప్రధాని కొనియాడారు. ఆయన మన దేశానికి ఓ రత్నం లాంటి వారని పేర్కొన్నారు. దేశ ఆహార భద్రతను తన జీవిత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన ఆలోచనలు నేటి వ్యవసాయ రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తు న్నాయి’ అని పేర్కొన్నారు.

ఎం.ఎస్‌.స్వామినాథన్‌ శత జయంతి అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీతో ఎంఎస్‌ఎస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ ఛైర్పర్సన్‌ సౌమ్యా స్వామినాథన్‌, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తదితరులు

Read More

తెలంగాణ బియ్యం నాణ్యతను అభినందించిన ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ మంత్రి

20 లక్షల టన్నుల బియ్యం, వడ్లు రాబోయే సంవత్సరంలో ఫిలిప్పీన్స్‌కి అవసరమని, సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఫిలిప్పీన్స్‌ వ్యవసాయశాఖ మంత్రి ఫ్రాన్సిస్కో పి. టియు లారెల్‌ జూనియర్‌ బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని కోరారు. తెలంగాణ బియ్యం నాణ్యత బాగున్నాయని, అక్కడి నుంచి బియ్యం, వడ్లను దిగుమతి చేసుకోవాలని ఆసక్తితో ఉన్నామని ఫ్రాన్సిస్కో పేర్కొన్నారు. అందుకు ఉత్తమ్‌ సుముఖత వ్యక్తం చేశారు. తెలంగాణ బియ్యం నాణ్యతను అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఫిలిప్పీన్స్‌ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణ నుంచి మొక్కజొన్న దిగుమతి చేసుకోవడానికీ ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ మంత్రి ఆసక్తి చూపారని ఉత్తమకుమార్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Read More