‘సదర్’ అనగానే దున్నరాజుల విన్యాసాలు… యాదవులు తమ జీవనాధారమైన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలతో వేడుక జరిగే ప్రాంతానికి వచ్చి చేసే సందడి.. దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం, దున్నలపై నిలబడి హాకీ కర్రతో చేసే నృత్యాలు ప్రధానాకర్షణ. దీపావళి రెండోరోజున హైదరాబాద్‌లో ‘సదర్’ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఐక్యతను చాటుతారు.*మొదలైంది ఇలా…* సుమారు 80 ఏళ్ల క్రితం దివంగత సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ సదర్ వేడుకలను ప్రారంభించారు. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఇది మొదలైంది. ఆ తర్వాత మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని అనుసరించారో దాన్నే నేటికీ పాటిస్తున్నారు. కాచిగూడ, నింబోలిఅడ్డ, ఖైరతాబాద్, సైదాబాద్, మారెడ్‌పల్లి, పాతబస్తీలలో కూడా సదర్ సందడి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు కూడా దున్నరాజు విన్యాసాలు వీక్షించడానికి వస్తుంటారు. పంజాబ్, హరియాణ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నరాజులను తీసుకొస్తారు. ఈసారి హరియాణ నుంచి ముర్రా జాతికి చెందిన 3 వేల కిలోల భారీకాయంతో ఉండే ‘ఘోలు-2’ దున్నరాజు వచ్చాడు. ప్రపంచంలో ఎత్తైన దున్నరాజు బాహుబలి (స్కంద సినిమా ఫేం), చేతక్ మహారాణా ప్రతాప్, వీరా మిల్క్ టీత్ ఛాంపియన్ ఇలా మరెన్నో మేలిమిజాతి దున్నరాజులు కనువిందు చేయనున్నాయి.