వరి ధాన్య సేకరణ, తరలింపు, నిల్వలో ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్ హౌసింగ్ కార్పోరేషన్ ఇంఛార్జి ఎండీ ఉదయ్ కుమార్ మరియు ఆగ్రోస్ ఎండీ రాములుతో సమావేశం నిర్వహించి, వరి కొనుగోళ్ళు, వరి సేకరణ, తరలింపు మరియు నిల్వలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టవలసిన తక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో వడ్ల సేకరణకు ఏర్పాటు చేసిన అన్ని కొనుగోలు కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని, కోతలు మరియు సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి పౌరసరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ రైతులకు కొనుగోళ్ళలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆగ్రోస్ ఎండీ రాములుని ఆదేశించారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని గోదాముల నిల్వ సామర్థ్యము, ప్రస్తుతం ప్రాంతాల వారీగా అందుబాటులో ఉన్న గోదాముల నిల్వ సామర్ధ్యం, వెంటవెంటనే కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలింపుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్కెటింగ్ మరియు వేర్ హౌసింగ్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తరుచూ సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకొంటూ వారికి వివరాలు అందచేస్తూ ధాన్యం తరలింపులో వారికి సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతము 29.537 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యము అందుబాటులో ఉందని, కొనుగోళ్ళకు తగ్గట్లుగా నిల్వ సామర్ధ్యాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.










