శనగ రైతులకు విత్తనాభివృద్ధి సంస్థ శుభవార్త

శనగ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాలుకు 300 రూపాయల సబ్సిడీని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, సంస్థ యం.డి. ఉదయ్‌ కుమార్‌ ప్రకటించారు. సబ్సిడీ రేపటి నుండే అమలు అవుతుందని తెలిపారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, ఐఏఎస్‌, ఈ రోజు హైదరాబాద్‌ హాకాభవన్‌లో గల తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రాంతీయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ యాసంగి సీజన్‌లో రైతులకు కావాల్సిన శనగ జేజి 11, జాకీ రకాల విత్తనాలను 20000 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా శనగ విత్తనాలపై క్వింటాల్‌కి రూ.300 చొప్పున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తరపున రాయితీ ప్రకటించినట్లు తెలియజేశారు. క్వింటాల్‌కి రూ.9000/- ధర ఉండగా, రూ.300 రాయితీతో, రైతులు రూ.8700/- చెల్లించాల్సి ఉంటుంది.
ఇంకా ఈ రబీలో రైతులకు కావాల్సిన వరి విత్తనాలు, 50000 క్వింటాళ్ల వరి కెఎన్‌ఎం1638, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, జెజిఎల్‌ 27356, యంటియు 1010, కెఎన్‌ఎం 118, జెజిఎల్‌ 24423 రకాల విత్తనాలను సకాలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా వీలైనంత త్వరగా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో 3 లక్షల ఎకరాలకు పైగా తెలంగాణ విత్తనాలు ఇవ్వాలని, వచ్చే వానాకాలం సీజన్‌కి 15 లక్షల ఎకరాలకు విత్తనాలు అందించే విధంగా పని చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఆదేశించారు. పాత, మూస పద్ధతులు మానుకొని, కొత్త తరహాలో పద్ధతులు ఉపయోగించి తెలంగాణ సీడ్స్‌ని రైతులకు చేరవేయాలని, ఒకప్పటి బ్రాండ్‌ ఇమేజ్‌ను పునరుద్ధరించే విధంగా పని చేయాలని కోరారు. విత్తనోత్పత్తిలో రైతులను భాగస్వాములను చేస్తూ, సహకార సంఘాల ద్వారా అధిక విత్తనోత్పత్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర మేనేజర్లు మరియు ప్రాంతీయ అధికారులు పాల్గొన్నారు.

Read More

వ్యవసాయ శ్రామికుల కోసం, రైతాంగం కోసం ఎన్‌.జి. రంగా గారు చేసిన కృషి మరువలేనిది

అచ్చెంనాయుడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు

వ్యవసాయ శ్రామికుల కోసం, రైతాంగం కోసం ఎన్‌.జి. రంగా గారు చేసిన కృషి మరువలేనిదని ఎన్జీ రంగా 124వ జయంతి సందర్భంగా రంగా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాంలో జరిగిన జయంతి సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు అన్నారు. రైతుల కోసం పార్లమెంటులో వారు చేసిన ప్రసంగాలు, వారు చేసిన సంస్కరణలు మాకు ఆదర్శమన్నారు. అక్కడ పొలంలో డ్రోన్‌ ద్వారా మందులను పిచికారీ చేసే పద్ధతులను స్వయంగా చూసి అధికారులను అభినందించడం జరిగింది.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రైతుల సాగు ఖర్చులు, పిచికారీ ఖర్చులు, విత్తనాల ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు సగం తగ్గేటట్లు శాస్త్రవేత్తలు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రైతు నాయకులు యలమంచిలి శివాజీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వేంకటేశ్వర రావు, ఎన్జీ రంగా ఫౌండేషన్‌ కిషోర్‌, యూనివర్సిటీ వైస్‌-ఛాన్సలర్‌ డాక్టర్‌ శారదా జయలక్ష్మి దేవి, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ పాలడుగు సత్యనారాయణ, రైతు నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Read More

పత్తి కొనుగోలుపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పత్తి కొనుగోళ్లు కార్యకలాపాలపై మార్కెటింగ్‌ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులు జిన్నింగ్‌ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేయాలని, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని, రైతులకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తూ రాష్ట్రంలో మేజర్‌ మార్కెట్‌ కమిటీలను ఆధునీకరించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్‌లో జరిగిన పత్తి కొనుగోళ్లపై సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పత్తి కొనుగోళ్లపై సమగ్ర వివరాలు అందించే విధంగా ఒక వెబ్‌ పోర్టల్‌ తయారు చేయడం జరిగిందని, దీని ద్వారా సీసీఐ వారు ఇప్పటి వరకు ఎంత పత్తిని కొనుగోలు చేశారో, ఎంత పత్తిని రిజెక్ట్‌ చేశారో అన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగిందని మంత్రి అన్నారు. మార్కెటింగ్‌ అధికారులు, ప్రాంతీయ అధికారులు జిన్నింగ్‌ మిల్లులను ఆకస్మిక తనిఖీలు చేసి, రిపోర్టును డైరెక్టర్‌ మార్కెటింగ్‌ శాఖ వారికి అందించాలని ఆదేశించారు. ప్రధాన కార్యదర్శితో మాట్లాడి, వరి కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని తెలిపారు.
మార్కెటింగ్‌ సెంటర్లలో ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని దగ్గరలోని సీసీఐ సెంటర్లలోనే పత్తిని అమ్ముకోవాలని రైతులకు సూచించారు. రైతులు పత్తిలో తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉంచుకున్నట్టయితే అధిక మద్ధతు ధరను పొందవచ్చని, అలాగే పత్తి అమ్ముకోవడంలో ఏమైనా సమస్యలు ఎదురయితే ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్‌ చాట్‌ యాప్‌ (8897281111) ద్వారా తెలియజేయగలరని మంత్రి పేర్కొన్నారు.

Read More

విద్యార్థులకు ఉద్యాన రంగంలో ఉజ్వల భవిష్యత్తు

  • తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దండ రాజిరెడ్డి

విద్యార్థులకు, నిపుణులకు ఉద్యాన రంగంలో అవకాశాలు ఉన్నాయని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దండ రాజిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఉద్యానరంగంపై ఆయన మాట్లాడుతూ… కోవిడ్‌ అనంతరం మానవ శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఉద్యాన ఉత్పత్తులే కీలకమని, ఇటీవల వివిధ అధ్యయన సంస్థలు …. సైతం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సరాసరిన రోజుకు 400 గ్రాములు పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఖనిజలవణాలు, విటమిన్‌లకు కూరగాయలు, పండ్లు పుష్కల వనరులని, రోజురోజుకూ పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం నేపథ్యంలో ఉద్యాన విద్యార్థులకు పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉద్యాన విద్య పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యాన అధికారులుగా నియమితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లఓ్యం ప్రకారం పామ్‌ ఆయిల్‌ తోటల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీలు, పామాయిల్‌ తోటల నిర్వహణ, అలాగే పామాయిల్‌ పరిశ్రమలు వందలాది ఉద్యాన విద్యార్థులను నియమించుకోనున్నట్లు తెలిపారు.
అలాగే ఉద్యాన పంటల ఆధారిత అంకుర సంస్థలు, స్టార్ట్‌ అప్స్‌ భారీగా మార్కెట్లో ఉన్నాయని స్వయం ఉపాధికి సైతం ఈ స్టార్ట్‌ అప్‌లు దోహదం చేస్తున్నాయని అన్నారు. ”వీటి స్థాపనకు సైతం ఉద్యాన విద్యల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. విజయవంతమైన ఎంటర్‌ప్రైన్యూర్‌ కెరీర్‌ ప్రారంభించారని” వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజిరెడ్డి తెలిపారు.
సేంద్రీయ ఉద్యాన పంటల క్షేత్రాలకు కన్సల్టెన్సుగా, హోటల్స్‌, రిసార్ట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగం, ఎయిర్‌పోర్ట్‌ సంస్థల్లో ల్యాండ్‌ స్కేప్‌ నిపుణులుగా, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌లలో ఉద్యాన విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యాన విశ్వవిద్యాలయం, కళాశాలలు, డిప్లమా కాలేజీలు, ఇతర కళాశాలలో శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా అవకాశం సైతం ఉన్నాయి. విత్తన పరిశ్రమ, పురుగుమందుల, తెగుళ్ల మందుల పరిశ్రమలలో సైతం వీరికి అవకాశాలు మెరుగేనని డాక్టర్‌ రాజిరెడ్డి తెలిపారు.

Read More

పోలవరం ప్రాజెక్టులో నాణ్యత చాలా ముఖ్యం

ఎదురయ్యే అన్ని సమస్యలను అధిగమిస్తూ… 2028 మార్చి నాటికల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేయడమే కాదు… నాణ్యత కూడా చాలా ముఖ్యం అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మంగళవారం వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష జరిపిన సందర్భంలో చంద్రబాబు అన్నారు. ఇటీవలవరకూ పోలవరం ఎడమకాలువ పనులు 77 శాతం పూర్తయ్యాయని, రూ. 960 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, అధికారులు చెప్పారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌, సీఎంఓ కార్యదర్శి రాజమౌళి, ఈఎన్‌సి ఎం. వెంకటేశ్వరరావు, బావర్‌, మేఘా ప్రతినిధులు, ఇంజనీరింగు అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Read More

మన బియ్యానికి విదేశాల్లోనూ డిమాండ్‌ ఉంది

తెలంగాణా రాష్ట్రంలో పండించే బియ్యానికి డిమాండ్‌ పెరుగుతుందని…. మన దేశంలోని బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలతో పాటు రెండు, మూడు దేశాలు మన తెలంగాణా రైతులు పండించే బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమకుమార్‌ రెడ్డి అన్నారు. మంత్రులు ఉత్తమకుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమకుమార్‌ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమీషనర్‌ డీ.ఎస్‌. చౌహాన్‌ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా ప్రజాప్రతినిధులు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా చూడాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఉత్తమకుమార్‌ రెడ్డి అన్నారు

Read More

రాష్ట్ర పామాయిల్‌ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాసిన లేఖకు స్పందించిన కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌

ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణ ప్రభుత్వ కృషిని అభినందించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో సహజ మరియు సేంద్రియ వ్యవసాయం కొరకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఏర్పాటుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
పామాయిల్‌ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేసి కొత్త రైతులను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో, ముడిపామ్‌ ఆయిల్‌ పై దిగుమతి సుంకాన్ని తిరిగి విధించి దేశీయ పామ్‌ ఆయిల్‌ రైతులను ఆదుకొనేవిధంగా చర్యలను తీసుకోవాలని ఇటీవల మంత్రి తుమ్మల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ గారిని కోరిన విషయం తెలిసిందే.
దీనిపై 04.11.2024 నాడు లేఖ ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ గారు ఎన్‌.ఎమ్‌.ఈ.ఒ.పి పథకంలో భాగంగా 64,040 హెక్టార్లలో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ అత్యున్నత ప్రగతి సాధించినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకంలో జాతీయ స్థాయిలో లక్ష్యాన్ని సాధించేందుకు తోడ్పడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందించారు. 2024-25 సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని, ఇప్పటివరకు 24,581 ఎకరాలలో ప్లాంటేషన్‌ పూర్తిచేసినందుకు మంత్రికి అభినందనలు తెలపారు. మంత్రి సమర్థ నాయకత్వంలో కొత్తగా పామాయిల్‌ సాగు చేయడానికి ముందుకువస్తున్న రైతులను ప్రొత్సహిస్తున్నందున తెలంగాణా ప్రభుత్వం తప్పకుండా తమ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుందని కేంద్ర మంత్రివర్యులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పామాయిల్‌ గెలల ధరల విధానం విషయంలో కేంద్ర అధికారుల బృందం త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి, రాష్ట్ర ప్రభుత్వంతో మరియు పామాయిల్‌ రైతులతో సంప్రదింపులు జరుపుతుందని కేంద్ర మంత్రివర్యులు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కోరిన విధంగా దేశంలోని పామాయిల్‌ రైతుల సంక్షేమం కోసం మరియు పామాయిల్‌ గెలల ధర పెరుగుదల కోసం ముడి పామాయిల్‌ పై ఎఫెక్టివ్‌ డ్యూటీని 27.5 శాతానికి పెంచడం జరిగిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.
అదేవిధంగా ఎన్‌.ఎమ్‌.ఈ.ఒ.పి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రివర్యులు విజ్ఞప్తి చేయడం జరిగింది. పామాయిల్‌ సాగులో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న సహాయ సహాకారాలకు కేంద్ర మంత్రి వర్యులు అభినందనలు తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్‌ గెలల ధరల విషయంలో పామాయిల్‌ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఇటీవలన కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర పర్యటనకి వచ్చిన సందర్భంలో కూడా వివరించడం జరిగింది. మంత్రి వర్యుల కృషి వల కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని పెంచడం జరిగింది. దీని వలన పామాయిల్‌ రైతులకు అధిక ధర రావడంతో పాటు, కొత్తగా పామాయిల్‌ సాగు చేయాలనుకుంటున్న రైతులకు ప్రోత్సాహకరంగా మారింది. దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా సరాసరి క్రూడ్‌ పామాయిల్‌ ధరలు అక్టోబర్‌ నెలలో రూ.1,19,000 చేరి పామాయిల్‌ గెలల ప్రస్తుత ధర రూ. 19,144లకు చేరడం జరిగింది. ఈ నవంబర్‌ నెల మాసంలో క్రూడ్‌ పామాయిల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో రూ.1,25,000లుగా నమోదు కావడం జరుగుతున్నది. కావున క్రూడ్‌ పామాయిల్‌ ధరలు ఇదేవిధంగా కొనసాగితే పామాయిల్‌ గెలల ధర రూ. 20,000లకు పైన ఉండే అవకాశం ఉందని మంత్రి వర్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం క్రూడ్‌ పామాయిల్‌ ధరలను రూ. 1,25,000లు తగ్గకుండా ఉండేందుకు దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, గతంలో దిగుమతి సుంకం 44 శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గుర్తుచేశారు.
పెరిగిన ధరల నేపథ్యంలో రాష్ట్రంలో చాలా మంది రైతులు పామాయిల్‌ సాగు వైపు చూసే అవకాశం ఉందని, కావున ఆయిల్‌ పాం కంపెనీలు ఇందుకోసం సన్నద్ధం కావాలని మంత్రి కోరారు. పామ్‌ ఆయిల్‌ సాగు చేయాలనుకునే రైతుల కోసం పామాయిల్‌ మొక్కలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పామాయిల్‌ రైతుల సంక్షేమం, ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎళ్లవేలలా కృషి చేస్తుందని, ఈ సందర్భంగా మంత్రివర్యులు పేర్కొన్నారు.
అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం కొరకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌కు (సిఓఇఎస్‌) రూ. 10 కోట్లు ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి 18.09.2024 నాడు లేఖ రాయడం జరిగింది. దీనికి కేంద్ర మంత్రివర్యులు స్పందిస్తూ, భారత ప్రభుత్వం మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హర్టీకల్చర్‌ (ఎం.ఐ.డి.హెచ్‌) పథకంలో భాగంగా సహజ మరియు సేంద్రీయ వ్యవసాయం కొరకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సులను ప్రమోట్‌ చేయడం జరుగుతుందన్నారు. నిర్ధేశించిన విధానాల ప్రకారం ధ్వైపాక్షిక సహాకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ మంజూరు చేయబడుతుందన్నారు. అయితే ఈ రంగంలో అందుబాటులో ఉన్న నూతన మరియు అత్యాధునిక సాంకేతికతను అందించడానికి ప్రైవేట్‌ వ్యవస్థాపకులకు వారి స్వంత నిధులతో ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించడం జరుగుతుందని తెలిపారు. ఎంఐడిహెచ్‌ నిబంధనల ప్రకారం ఈ కేంద్రాలలో ఉధ్యానవన పంటలు చేపట్టే రైతులకు శిక్షణ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో నిబద్ధతతో కూడిన సహాయసహకారాలు అందించడం జరుగుతుందన్నారు.

Read More

పశువులు, కోళ్ళ వైద్యానికి ప్రామాణిక మార్గదర్శకాలు

పశువులు, కోళ్ళ వైద్యానికి సంబంధించి సరికొత్త ప్రామాణిక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. యాంటిబయాటిక్‌ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించడం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలపై దృష్టి పెట్టి, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులకు పెద్దపీట వేసింది. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్‌ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికిమాటికి యాంటిబయోటిక్స్‌ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయడం వలన పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో మోతాదుకు మించి మిగిలిపోతున్నాయి. సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులలో రైతులే స్వయంగా తయారు చేసుకుని వాడుకునేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులకు పెద్ద పీట వేశారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్‌ ఎన్‌. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులకు చోటు కల్పించారు. ముఖ్యమైన ఈ 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్‌ వాడనవసరం లేకుండా) రైతుల ఇళ్ళలో పోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందులను రైతులే స్వయంగా తయారు చేసుకుని వాడుకోగలిగే పద్ధతులనుపొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషలలో రూపొందించి ఎన్‌డిడిబి యూట్యూబ్‌ ఛానల్‌లో అందుబాటులో ఉంచారు.

Read More

వ్యవసాయ కోర్సుల నిర్వహణలో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఏ ప్రైవేట్‌ సంస్థతో అనుబంధం గానీ భాగస్వామ్యం గాని లేదు:* ఉపకులపతి ప్రొఫెసర్‌ జానయ్య

2022 జూలై వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కొన్ని ప్రైవేట్‌ సంస్థలు చేసుకున్న అవగాహన ఒప్పందాలను పునః పరిశీలన జరిపిన తర్వాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున ఈ అవగాహన ఒప్పందాలను రద్దు చేయడం జరిగిందని ఉపకులపతి ప్రొఫెసర్‌ ఆల్థాస్‌ జానయ్య తెలిపారు. పిజెటిఏయుతో భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్‌ సంస్థల ఒప్పందాలను నేడు రద్దు చేశారు. ప్రైవేట్‌ సంస్థలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాన్య ప్రజలు గమనించాలని సూచించారు. పిజెటిఏయు ఎలాంటి ప్రైవేట్‌ సంస్థలతో వ్యవసాయ విద్య కోర్సుల కోసం భాగస్వామ్యంగానీ, గుర్తింపు ఇవ్వడంతో గాని సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు సంస్థలు పిజెటిఏయు పేరును వాడుకొని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా మరియు బ్రోకర్ల ద్వారా సీట్లు ఇప్పిస్తామని, అలాగే పిజెటిఏయుతో అనుబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, ఈ విషయాలను నమ్మవద్దని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాహిత ప్రకటన జారీ చేయడం జరిగింది.

Read More

మత్స్య ఉత్పత్తిలో ఏపీ టాప్‌

ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో భారీ పెరుగుదలను నమోదు చేసి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర గణాంకశాఖ నివేదిక వెల్లడి చేసింది. ఆక్వారంగంలో గత పన్నెండేళ్లుగా మొత్తం స్థూల ఉత్పత్తి విలువలో ఏపీ ఎక్కడా తగ్గలేదు. క్రమంగా ఉత్పత్తి పెరుగుతూనే ఉంది.
చేపలు, రొయ్యల ఉత్పత్తిలో వాటా (శాతంలో)
రాష్ట్రం 2011-12 2022-23
ఆంధ్రప్రదేశ్‌ 17.7 40.9
పశ్చిమబెంగాల్‌ 24.6 14.4
ఒడిశా 3.9 4.9
బీహార్‌ 4.5 4.5
అస్సాం 5.5 4.1

‘ఉద్యాన’ ఉత్పత్తులలో వృద్ధి
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీ ఐదో స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో పశ్చిమబెంగాల్‌, తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, యూపీ, మహారాష్ట్ర ఉన్నాయి. గత 12 ఏళ్ళల్లో మధ్యప్రదేశ్‌ వాటా 6.3% నుంచి 10.9 శాతానికి, యూపీ 7.2 నుంచి 10.5కి చేరగా, మహారాష్ట్ర వాటా 10.4 నుంచి 9.9 శాతానికి తగ్గింది. ఏపీ వాటా 5.8 నుంచి 8.2 శాతానికి పెరిగింది.
పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఏపీ వాటా
సంవత్సరం వాటా (శాతంలో)
2011-12 5.8
2022-23 8.2

పశుగణ ఉత్పత్తిలో నాలుగో స్థానం
మరోవైపు పశుగణ ఉత్పత్తిలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్‌ తొలి స్థానంలో ఉండగా, యూపీ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్ర ఐదో స్థానం దక్కించుకుంది. జాతీయ స్థాయిలో పశుగణ ఉత్పత్తి విలువలో ఏపీ వాటా 2011-12 నుంచి 2022-23కు 7.0% నుంచి 7.8% మాత్రమే పెరిగింది.

Read More