వరి కొయ్యలు తగలబెట్టొద్దు: తుమ్మల

వరి కొయ్యలను తగలబెట్టొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. అలా తగలబెడితే కలిగే అనర్థాలపై ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖమ్మం వెళ్తూ సూర్యాపేట జిల్లాలో రైతులు వరి కొయ్యలను తగులబెట్టడం చూసి మంత్రి ఆందోళన చెంది వ్యవసాయశాఖ సంచాలకుడితో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం టేకుమట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా… రేషన్‌ షాపుల ద్వారా నాణ్యమైన బియ్యం అందించడానికే కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం తేమ నిబంధనను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రైతుల నుంచి రూ.2,851 కోట్ల విలువైన 12.29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. శనివారం ఒక్క రోజే 1.48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటి వరకు 1,64,191 టన్నుల పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.
ఈరోజు సూర్యాపేట జిల్లా ఐకేపి కేంద్రాన్ని మంత్రి సందర్శించి అక్కడ రైతులతో మాట్లాడి, రైతులకు అవసరమైన ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంచి ధర లభించడానికి రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. అలాగే, తూకం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన సమయంలో చెల్లింపులు జరిపేలా పర్యవేక్షణ నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.

Read More

ధాన్యం ఎప్పుడు అమ్మాలో రైతులే నిర్ణయించుకునే వెసులుబాటు

రైతులు ధాన్యాన్ని ఎప్పుడు, ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకొనేలా మొబైల్‌ ద్వారా కూపన్‌ సృష్టించుకునే ఏర్పాటును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ధాన్యం అమ్మకంలో రైతులకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలనూ సులభతరం చేస్తున్నామని పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ వివరించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‌ సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ ఫార్మింగ్‌ విధానంలో భాగంగా ఏఐ ద్వారా ప్రత్యేక వాయిస్‌ సేవల పైనా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు.
వాట్సప్‌లోనే కూపన్‌
మొబైల్‌ ద్వారా కూపన్‌ తయారు చేసేందుకు పౌరసరఫరాలశాఖ 7337359375 అనే వాట్సప్‌ నంబరును కేటాయించింది.

  • ఈ నంబరుకు హాయ్‌ అని సందేశం పంపిస్తే.. ‘పౌరసరఫరాల సంస్థకు సుస్వాగతం.. ధాన్యం అమ్మడానికి షెడ్యూల్‌ బుక్‌ చేసుకోండి’ అని వస్తుంది. షెడ్యూల్‌ ఎంపిక చేసుకున్నాక… ఆధార్‌ నంబరును నమోదు చేయాలి.
  • రైతు పేరును ధృవీకరించాక.. కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి. అమ్మాల్సిన తేదీకి మూడు ఆప్షన్లు ఇస్తారు. అందులో ఒక తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. ధాన్యం రకం, ఎన్ని బస్తాలో తెలియజేయాలి. తర్వాత ధాన్యం అమ్మకానికి స్లాట్‌ బుక్‌ అయినట్లు మొబైల్‌ ఫోన్‌కు సందేశం వస్తుంది.
Read More

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ కంపెనీల పురోగతిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష

ఆయిల్‌ పామ్‌ సాగులో తెలంగాణా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచాలని, పురోగతి చూపించని కంపెనీలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు.
తీరుమార్చుకొని కంపెనీల అనుమతులు రద్దు చేసి, టిజి ఆయిల్‌ ఫెడ్‌కు కేటాయిస్తామని, వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ వారికి కేటాయించిన జోన్లలో ప్రాసెసింగ్‌ కంపెనీలు ఏర్పాటు చేయాల్సిందే అని, ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఆయిల్‌ పామ్‌ సాగుకు కొత్త రైతులు ముందుకు రావాలని మంత్రి అన్నారు.
పలు జిల్లా కలెక్టర్లతో మాట్లాడిన తుమ్మల పామాయిల్‌ రైతులకు అధిక ధరలను అందించి, రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును లాభసాటిగా చేయడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అని తెలియజేశారు. 
ఇప్పటికే 64,040 హెక్టార్లలో ఆయిల్‌ పాం ప్లాంటేషన్‌ చేశామని, అలాగే ప్రతి సంవత్సరం 40000 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగుచేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని, దానిని సాధించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించాలని అధికారులకు సూచించారు.  
2024-25 సంవత్సరంలో 1,00,000 ఎకరాలకు ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోగా, ఇప్పటివరకు 25,470 ఎకరాలలో ప్లాంటేషన్‌ పూర్తిచేసుకున్నామన్నారు. ఈ సంవత్సరం కేటాయించిన లక్ష్యంలో  వాల్యూ ఆయిల్‌ కంపెనీ 36 %, పతాంజలి 33%, టిజి ఆయిల్‌ ఫెడ్‌ 31%, ఎకోపామ్‌ 28.5%, గోద్రెజ్‌ 26%, ప్రి యునిక్‌ 22%, మాట్రిక్స్‌ 21%, కె.ఎన్‌ బయో 19.72%, తిరుమల 16.4%, సువెన్‌ అగ్రో 16.2%, రాంచరణ్‌ 15.6%, లివ్‌ పామ్‌ 13%, విశ్వతేజ 11.5%, లోహియ 10.40 % ప్రగతిని సాధించాయని, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి కల్లా లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. 
ఆయిల్‌ పామ్‌ కంపెనీలు వారికి కేటాయించిన ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి కంపెనీ తమ యొక్క ఫ్యాక్టరీ జోన్లలో ఆయిల్‌ పామ్‌ గెలల ప్రాసెసింగ్‌ కర్మాగారాల ఏర్పాటు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి ఆయిల్‌ పామ్‌ కంపెనీ నర్సరీని కలిగిఉండాలని, లక్ష్యానికి అనుగుణంగా నాణ్యమైన ఆయిల్‌ పామ్‌ మొక్కలు ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని, నర్సరీ స్థాయిలోనే జన్యుపరమైన సమస్యలు ఉన్న మొక్కలను తొలగించి, నాణ్యమైన మొక్కలు మాత్రమే రైతులకు సరఫరా చేయాలని ఆదేశించారు. అత్యధిక గెలల దిగుబడి మరియు నూనె శాతాన్ని ఇచ్చే వంగడాలను, గ్యానో డెర్మలాంటి వ్యాధులను తట్టుకొనే వంగడాలను, తక్కువ ఎత్తు పెరిగే పొట్టి రకాలకు సంబంధించిన నాణ్యమైన మొలకలను  తెప్పించుకొని నర్సరీలలో పెంచి రైతులకు సరఫరా చేయాలన్నారు. 
ఇదివరకే నాటిన తోటలలో మొదటినుంచే కాండంతడి తెగులు (గ్యానో డెర్మ) సోకకుండా, తెగుళ్ళ నివారణకు అవసరమైన సాంకేతికత శిక్షణను రైతులకు ఆయిల్‌ పామ్‌ కంపెనీలు అందించాలని ఆదేశించారు. 
రాష్ట్ర ప్రభుత్వ కృషి వలన ప్రస్తుతం ఆయిల్‌ పామ్‌ గెలల ధర టన్నుకు రూ. 19,144 కు పెరగడం జరిగిందని, ఈ సంవత్సర కాలంలోనే టన్నుకు పామ్‌ ఆయిల్‌ గెలల ధర రూ.6000 కు పైగా పెరిగిందని, త్వరలోనే టన్ను ధర రూ. 20,000 దాటే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు. ఆయిల్‌ పామ్‌ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయిల్‌ పామ్‌ గెలల ధర కనీసం టన్నుకు 20,000 కు తగ్గకుండా ఉండేలా ధరల స్థరీకరణ కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 
ఈ సమీక్షాసమావేశంలో ఉద్యానశాఖ డైరెక్టర్‌ శ్రీమతి యాస్మిన్‌ భాషా, ఐ.ఎ.ఎస్‌, మరియు ఆయిల్‌ ఫెడ్‌ అధికారులు పాల్గొన్నారు. 

*వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ...*
నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, జిల్లా అధికారులు కొనుగోలు కేంద్రాలను విధిగా సందర్శించాలన్నారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారం తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు.
Read More

మునగకు మహర్దశ

కిశోర బాలికలు, మహిళల్లో చాలామంది ఇప్పటికీ రక్తహీనతతో బాధపడుతున్నారు. ఐరన్‌ ఎక్కువగా ఉండే మునగ ఆకులను నేరుగా లేదంటే పొడిరూపంలో ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్య దరిచేరదు. ఈ నేపథ్యంలో సదరు విటమిన్‌ పుష్కలంగా ఉండే మునగపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. మేలైన మునగ జాతి మొక్కల సాగు పెంపునకు చర్యలు చేపట్టింది. అందుకు ప్రకాశం జిల్లా దర్శిలోని ఉద్యాన పరిశోధనా స్థానంలో చేసే పరిశోధనలకు తోడ్పాటు అందించనుంది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దర్శి పరిశోధనా స్థానం నడుస్తుంది. మునగ మొక్కల్లో ‘జీవన వైవిధ్యం, పంటల అభివృద్ధి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ’ అనే అంశంపై 2023లోనే ఇక్కడ పరిశోధనలు మొదలయ్యాయి. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 102 కోట్లు కేటాయించింది. దీంతో మునగపై పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి.

తమిళనాడులో వాడకం, సాగు అధికం
తమిళనాడులో మునగ ఆకులతోపాటు పొడిని పప్పులు, ఇతర కూరల్లో విరివిగా వాడతారు. బిస్కెట్ల రూపంలోనూ తింటారు. ఆ రాష్ట్రంలోని పెరియాకులం ఉద్యాన కళాశాల వారు 90ల లోనే పరిశోధనలు ప్రారంభించారు. పీకేఎం1, పీకేఎం2 అనే మునగ వంగడాలను ఉత్పత్తి చేయగా.. అక్కడ సాగు విస్తీర్ణం పెరిగింది. ఆ విత్తనాలనే తెలుగురాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని రైతులూ సాగు చేస్తున్నారు.

ఇప్పటికే 44 జన్యు రకాల పరిశీలన
తమిళనాడు, కర్ణాటకతో పాటు వేర్వేరు ప్రాంతాల నుంచి 44 జన్యురకాల మునగ మొక్కలను తెచ్చి దర్శిలో నాటారు. వాటి ఆకులు, కాయలపై పరిశోధన చేస్తున్నారు. అవసరం మేరకు సంకరణం చేసి నాణ్యమైన, అధిక దిగుబడి వచ్చే ఆకులను ఉత్పత్తి చేసే వంగడాలను సృష్టిస్తారు. వీటిని రైతులకు పంపిణీ చేస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. తొలుత మేలుజాతి మునగ వంగడాల సృష్టి, తర్వాత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, చివరిథలో ఆయా ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయంలో తయారు చేసిన మునగ ఆకు పొడి, మాత్రలను ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అక్కడి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే పంపిణీ చేశారు. ‘మునగ పొడిని ధనియాల్లా రోజూ కూరల్లో వాడినా బాలికలు, మహిళలకు సరిపడా ఐరన్‌ సమకూరుతుంది’ అని దర్శి ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త రవీంద్రబాబు తెలిపారు.

Read More

సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ

తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సన్న బియ్య పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సంక్షేమ హాస్టళ్ళలో ఉండే విద్యార్థులకు కూడా సన్నబియ్యం ఆహారాన్ని అందిస్తామన్నారు. గత ఏడాది 25 లక్షల ఎకరాలుగా ఉన్న సన్న వరి సాగు, ఈ ఏడాది 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. సన్న రకాల ధాన్యానికి రూ. 500 బోనస్‌ ప్రకటించడమే దీనికి కారణమని మంత్రి తెలిపారు.

Read More

ప్రాణహిత పనులు త్వరలో ప్రారంభానికి తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రణాళికలు

తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రాణహిత-చేవెళ్ళ సుజల స్రవంతి ఎత్తిపోతలను తిరిగి నిర్మించాలని నిర్ణయించింది. నాటి కాలువలను వినియోగించి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మొదలుకొని 7 ఉమ్మడి జిల్లాలలోని 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందివ్వాలని ఈ ఎత్తిపోతలను చేపట్టారు. వివిధ కారణాలతో ప్రాజెక్టు పునరాకృతిలో భాగంగా కాళేశ్వరం ఎత్తిపోతలగా మారిన విషయం తెలిసిందే. పాత ప్రాజెక్టుకు బదులుగా డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ వార్థా ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్‌ జిల్లాకు నీరందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

పత్తి రైతులకు మద్దతు ధర ఇవ్వాలి

సీసీఐని కోరిన ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు

పత్తి కొనుగోళ్ళలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రైతులకు కనీస మద్దతు ధర అందించాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి సచివాలయంలో సీసీఐ, మార్కెటింగ్‌ శాఖ అధికారులతో పత్తి కొనుగోళ్ళపై గురువారం జరిపిన సమీక్షలో సీసీఐని కోరారు. ప్రభుత్వం నిర్ణయించిన 11 యార్డులు, 60 జిన్నింగ్‌ మిల్లుల్లో విధిగా పత్తి కొనుగోళ్ళు జరిగేలా చూడాలని, తేమ శాతం విషయంలో సరళీకృతంగా వ్యవహించాలని అధికారులను ఆదేశించారు. పత్తిని ఆరబెట్టి, నాణ్యత ఉండేలా చూసుకుని, ప్లాస్టిక్‌ సంచుల్లో కాకుండా గన్నీ బ్యాగ్స్‌లో తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీఐ సీజీఎం పాణిగ్రహీ, జీఎం అమరనాథ్‌రెడ్డి, మార్కెటింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More

పంట పొలాల్లో సౌరవిద్యుత్‌ కేంద్రాలు

పంటల సాగుతోనే కాకుండా వ్యవసాయ భూముల్లో విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులే సొంతంగా లేదా ఏదైనా సహకార, స్వయం సహాయక సంఘం, కంపెనీ భాగస్వామ్యంతో పొలంలో సౌరవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ‘ప్రధాన మంత్రి కిసాన్‌ ఊర్జ సురక్ష ఏవం ఉత్థాన్‌ మహాభియాన్‌’ (పీఎం కుసుమ్‌) పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినట్లు ఈ ఉత్తర్వుల్లో ప్రకటించింది. పొలాల్లో 4 వేలమెగావాట్ల స్థాపిత సామర్థ్యమున్న సౌరవిద్యుత్‌ కేంద్రాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే (వచ్చే మార్చి) లోగా ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ పథకం అమలుకు ‘తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ’ (టీజీరెడ్కో)ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఈ విద్యుత్‌ను కొనేందుకు నిర్ణీత ధరను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయిస్తుంది. కేంద్ర నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. డిస్కంల సమన్వయంతో ఆసక్తిగల రైతుల ఎంపికకు టీజీరెడ్కో దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Read More

వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో ఇంధన ఉత్పత్తి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 65 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 500 కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ (సీబీజీ) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యర్థాలతో బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయడం దాని లక్ష్యం. ఇది అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 57 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడను ఇంధన ఉత్పత్తికి ఉపయోగిస్తారు కాబట్టి రైతులకు అదనపు ఆదాయ మార్గం కాగలదు.

Read More

పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ

వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార మరియు చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేయాలని తేది. 13.11.2024 నాడు కేంద్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు అనేది పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర పసుపు రైతుల ప్రయోజనాలపై సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో పసుపు బోర్డు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పసుపు పండించే జిల్లాలలో నిజామాబాద్‌ ప్రధానమైనది. నిజామాబాద్‌ పసుపు రైతులు గత 10 సంవత్సరాల నుంచి పసుపు మద్ధతు ధర కోసం మరియు జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతునే ఉన్నారని మంత్రి చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పసుపు రైతులను బలోపేతం చేయడం కొరకు, పసుపు సాగు విస్తీర్ణం పెంచడానికి మరియు పసుపు అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి అవకాశాలు పెంచడానికి, పసుపు రైతులు కోరుకుంటున్నట్లుగా రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లాలో ఏర్పాటు చేసినట్లయితే పసుపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో 3,300 ఎకరాలలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయని, అందులో అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (1757 ఎకరాలలో) మరియు ఖమ్మం జిల్లా (696 ఎకరాలలో)ల నుండే 75 శాతం కొబ్బరితోటలు సాగులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఈ జిల్లాలలోని కొబ్బరి రైతులు కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, అక్కడ కొబ్బరితోటల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అందుకోసం భద్రాద్రి కొత్తగూడెంలో ప్రత్యేకంగా రీజనల్‌ కోకోనట్‌ డెవలప్‌ మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని లేఖ ద్వారా కోరడం జరిగింది.
కోకోనట్‌ బోర్డు ద్వారా రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు అంతరపంటలు, మిశ్రమ పంటల విషయంలో, చీడ పీడల నివారణలో తగిన సాంకేతిక సలహాలు అందించడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా కొబ్బరి రైతులలో నిర్వహణపరమైన మెళుకువలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా విలువ ఆధారిత ఉత్పత్తులు, నాణ్యమైన కొబ్బరి మొలకలను మరియు నూతన వంగడాలను రైతులకు అందించడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.
అలాగే తెలంగాణలో ఇప్పటివరకు 91,200 హెక్టార్లలో పామ్‌ ఆయిల్‌ సాగు చేస్తున్నారని, ప్రతి సంవత్సరం 40,000 హెక్టార్లలో సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి చెప్పారు. త్వరలోనే పామ్‌ ఆయిల్‌ సాగులో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయిల్‌ పామ్‌ రిసెర్చీ అనేది మాత్రమే దేశంలో ఆయిల్‌ పామ్‌ పై పరిశోధనలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల పామ్‌ ఆయిల్‌ రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్‌ పామ్‌ తోటల విస్తీర్ణం పెరుగుతున్నందున, తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రాంతీయ ఆయిల్‌ పామ్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పామ్‌ ఆయిల్‌ రంగంలో రైతులకు అవసరమైన శాస్త్రీయ, సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ ద్వారా కేంద్రాన్ని కోరారు.

Read More