ఔషధ మొక్క… తగిరిస్ / తగరిష చెట్టు
ఇది నిటారుగా పెరిగే ఏకవార్షిక మొక్క. సుమారు 80-90 సెం.మీ. ఎత్తులో వ్యాపించే కొమ్మలు కలిగి ఉంటుంది. సంయుక్త పత్రాలు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఆకులు 3 జతలుగా ఏర్పడతాయి. ఇవి కోలగా ఉంటాయి. ఇవి 3-4.5 సెం.మీ. పొడవుంటాయి. పూవులు లేత పసుపు రంగులో ఆకుల మొదళ్ళలో జంటలుగా ఏర్పడతాయి. కాయలు తప్పడిగా లేదా 4 కోణాలు కలిగి ఉంటాయి. కాయలు కొడవలి ఆకారంలో 10-15 సెం.మీ. పొడవుండి లోపల 30-50 గింజలు ఉంటాయి. తప్పడిగా ఉండి నల్లగా మెరుస్తుంటాయి. ఇది మెట్ట భూములలో కలుపు లాగా పెరుగుతుంది.
సాధారణ నామం : సికిల్పాడ్ / టోర సికిల్సెన్న / చాకుండ శాస్త్రీయ నామం : క్యాసియాటోరా కుటుంబం: సీసాల్పినియేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- వేర్లు, ఆకులు మరియు గింజలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఉదర సమస్యలు, రక్త సమస్యలు, మలబద్ధకం, ఊబకాయం, వాపులు, సుఖవ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి. ఆకులు కణుతులు, రక్తలేమి, ఉబ్బసం, వెక్కిళ్ళు నివారణకుపయోగిస్తాయి.
- గింజలు కంటి జబ్బులు, చర్మవ్యాధుల చికిత్సకు మరియు విరేచనకారిగా కూడా ఉపయోగపడతాయి.
వ్యవసాయరంగంలో …
- తగిరిస్ (క్యాసియాటోరా) విత్తనాలను భారతదేశంలో సేంద్రియ క్షేత్రాలలో సహజ పురుగు మందుగా ఉపయోగిస్తారు. తగిరిస్ అనేక పంటలనాశించే పురుగులపై కీటక నాశక లక్షణాలను కలిగి ఉంది. తగిరిస్ గింజల ద్రావణం, దానిలో అధికంగా ఉండే ఆంత్రాక్వీనోన్స్ ఆఫ్రికన్ మలేరియా వెక్టర్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. (ఎమ్బాచౌ, అతని అనుచరులు, 2017).
- క్యాసియానైగ్రికాన్స్ ఆకులలోని ఎమోడిన్ యాంటీమైక్రోబియల్ (అమో, అతనిఅనుచరులు, 2007), తెల్లదోమపెద్ద పురుగులపై కీటకనాశక చర్య, అనోఫెలెస్ గాంబియే పై లార్విసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008), సిట్రియోరోసిన్, ఎమోడిక్యాసిడ్ అనోఫెలెస్ గాంబియేలార్వాలపై మస్క్విటోసైడల్ చర్య (జార్ౙెస్, అతని అనుచరులు, 2008) లను ప్రదర్శించాయి.
- క్యాసియాటోరా మిథనాల్ ఆకుద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్, ఈడెస్ ఈజిప్టి, అనోఫెలెస్ స్టెఫెన్సిపై అత్యధిక అడల్టిసైడల్ చర్యను ప్రదర్శించింది. హెక్సేన్, క్లోరోఫాం, బెంజీన్, అసిటోన్, మిథనాల్ ద్రావణాలను మనిషి ముంజేతిపై రాసినపుడు ఇవి వికర్షణ చర్య ద్వారా దోమల కాట్ల నుండి రక్షణనిచ్చాయి. (అమరేశన్, అతని అనుచరులు, 2012).
- క్యాసియాటోరా జీవనియంత్రణ చర్య ద్వారా పార్థినియం మిస్టిరోఫోరస్ని అరికట్టింది. ఆకు, కాండం నీటి ద్రావణాలు పార్థినియం విత్తనాల మొలకశాతం, లేత మొక్కల పెరుగుదలపై విష ప్రభావాన్ని చూపింది. 20% ఆకుల ద్రావణం, 30% కాండం ద్రావణం 100% పార్థినియం విత్తనాలు మొలకెత్తడాన్ని అరికట్టాయి (సింగ్ అండ్ దేవి, 2017). క్యాసియాటోరా మొక్కలు స్రవించిన రసాయనాలు పార్థినియంపై ఎల్లెలోపతి ప్రభావాన్ని చూపాయి.
- క్యాసియాటోరా (25%) ఆకుల నీటి ద్రావణం సోయాబీన్ పంటనాశించే ఆకుమచ్చ తెగులు కారకం, ఆల్టర్నేరియా ఆల్టర్నేటని పర్యావరణహిత పద్ధతిలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (ఖందారె, 2015)
- క్యాసియాటోర హెక్సేన్ ద్రావణం గోధుమగింజల నిల్వ ధాన్యంలో ఆశించే లెస్సర్ గ్రెయిన్బోరర్, రైజోపెర్తా డామినికా నుండి కాపాడింది (అహద్, అతని అనుచరులు, 2016).
- క్యాసియాటోరా మరియు అరిస్టోలోకియా బ్రాక్టియేట నీటి ద్రావణం మరియు ఇథనాల్ ద్రావణం స్టెఫైలోకోకస్ ఆరియస్, స్టెఫైలోకోకస్ ఆల్బస్, బాసిల్లస్ సబ్టైలిస్, స్ట్రెప్టోకోకస్ ఫీకాలిస్, ఎస్కెరిచియాకోలి, క్లెబ్సియెల్లాఈరోజినెస్, ప్రోటియస్ వుల్గారిస్, సూడోమోనాస్ ఈరూజినోసా, కాండిడా ఆల్బికాన్స్, ఆస్పర్ౙిల్లస్నైగర్లపై యాంటీమైక్రోబియల్ చర్యలను ప్రదర్శించాయి. నీటి ద్రావణాలు, ఇథనాల్ ద్రావణాలలో ఇథనాల్ ద్రావణం బాక్టీరియాపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది (జయసుధ, ఆమె అనుచరులు, 2011).
- క్యాసియాటోరా, గ్లెåరిసిడియా, కానుగ ఆకులను పచ్చిఆకు ఎరువుగా ఉపయోగించవచ్చు. (మురళి, కెవికె, డిడియస్, జహీరాబాద్)
- క్యాసియా టోరా జీవ పురుగు మందు వెల్లుల్లి పంటనాశించే తామర పురుగులు, త్రిప్స్ టబాసిని నివారించింది. వెల్లుల్లి దిగుబడులను కూడా గణనీయంగా పెంచింది (సింగ్, అతని అనుచరులు, 2014)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
























