ఎల్‌నినో ప్రభావంతో రాయలసీమ మరియు తక్కువ వర్షపాత ప్రాంతాల్లో వర్షపాతం లోటు, వర్షాల మధ్య ఎక్కువ విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు మరియు నేలలో తేమ కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, రైతులు జొన్న సాగులో వాతావరణ అనుకూల (Climate-resilient) యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎల్‌నినో ప్రభావం నుంచి పంటను కొంతవరకు కాపాడుకోవచ్చు.

సెప్టెంబర్‌- అక్టోబర్ మాసాలలో కురిసే వర్షాల ద్వారా లభించే నేల తేమను సద్వినియోగం చేసుకొని జొన్నను సాగు చేయడం రాయలసీమతో పాటు ఇతర మెట్ట ప్రాంతాల రైతులకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. జొన్న పంట తక్కువ నీటి లభ్యతను తట్టుకోవడంతో పాటు, అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతం అనిశ్చిత పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఈ పరిస్థితుల్లో అనుకూలమైన పంటగా నిలుస్తుంది.

అయితే, ఎల్‌నినో పరిస్థితుల్లో జొన్నలో సకాలంలో విత్తడం, స్వల్పకాలిక మరియు కరువు/వర్షాభావాన్ని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవడం, సరైన మొక్కల సాంద్రతను పాటించడం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, సకాలంలో కలుపు నివారణ, నేల తేమ సంరక్షణ మరియు సమగ్ర చీడపీడల యాజమాన్యం వంటి పద్ధతులను తప్పనిసరిగా పాటించడం ద్వారా పంట దిగుబడిని స్థిరంగా పొందే అవకాశం ఉంటుంది.

జొన్న సాగుకు ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు:

  1. నేలలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తాలి: వర్షం పడిన వెంటనే పొడిగా ఉన్న నేలలో విత్తకుండా, నేలలో తగినంత తేమ ఏర్పడిన తరువాత మాత్రమే విత్తాలి. విత్తిన తరువాత ప్రారంభ దశలో తేమ కొనసాగేందుకు అనుకూలమైన వర్షపాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. స్థానిక వాతావరణ సూచనలను పరిశీలించి విత్తే నిర్ణయం తీసుకోవడం మంచిది.
  2. స్వల్పకాలిక, కరువు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి: ఎల్‌నినో పరిస్థితుల్లో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున, స్వల్పకాలికంగా కోతకు వచ్చే, బెట్ట పరిస్థితులను తట్టుకోగల మరియు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన సిఫారసు చేసిన జొన్న రకాలు లేదా సంకరాలను ఎంపిక చేసుకోవాలి. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన ఎన్.టి.జె.-5 (తెల్ల జొన్న) మరియు ఎన్-15 (పచ్చ జొన్న) రకాలు తక్కువ వర్షపాతం గల ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన రకాలుగా గుర్తింపు పొందాయి. రైతులు ధృవీకరించిన, నాణ్యమైన విత్తనాన్ని మాత్రమే వినియోగించి, వర్షపాతం లభ్యత మరియు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సరైన రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
  3. విత్తే సమయం, సరైన విత్తన మోతాదు మరియు మొక్కల సాంద్రత పాటించాలి: జొన్న పంటను సెప్టెంబర్ మొదటి వారం నుండి అక్టోబర్ రెండవ పక్షం వరకు వేసుకోవచ్చు. సాధారణంగా ఎకరాకు 3–4 కిలోల నాణ్యమైన విత్తనం ఉపయోగించాలి. వరుసల మధ్య 45 సెం.మీ., మొక్కల మధ్య 10–15 సెం.మీ. దూరం ఉండేలా విత్తాలి. విత్తనాన్ని సుమారు 2–3 సెం.మీ. లోతులో వేయాలి. ఎల్‌నినో పరిస్థితుల్లో నేల తేమ పరిమితంగా ఉండే అవకాశం ఉన్నందున అధిక మొక్కల సాంద్రతను నివారించాలి.
  4. విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయాలి: విత్తన శుద్ధి పద్ధతులను పాటించడం ద్వారా మొలక దశలో వచ్చే విత్తన, నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించవచ్చు.
  5. సేంద్రియ పదార్థాల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి: బాగా కుళ్లిన పశువుల ఎరువును ఎకరాకు 4–5 టన్నుల వరకు విత్తే ముందు నేలలో కలపాలి. దీనివల్ల నేల భౌతిక లక్షణాలు, తేమ నిల్వ సామర్థ్యం మరియు పోషకాల లభ్యత మెరుగుపడతాయి. పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలపడం లేదా తగిన విధంగా సంరక్షించడం కూడా నేల తేమ పరిరక్షణకు ఉపయోగపడుతుంది.
  6. ప్రారంభ దశలోనే కలుపు నివారణ చేపట్టాలి: జొన్న పంటలో ప్రారంభ దశలో కలుపు మొక్కల సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తిన 15–20 రోజుల్లో మొదటి కలుపు నివారణ, అవసరమైతే 30–35 రోజుల్లో రెండోసారి కలుపు నివారణ చేపట్టాలి. వరుసల మధ్య అంతరకృషి చేయడం ద్వారా కలుపును నియంత్రించడంతో పాటు నేల తేమను సంరక్షించవచ్చు.
  7. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవాలి: ఎల్‌నినో పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్నా, అప్పుడప్పుడు కురిసే వర్షపు నీటిని వృథా కాకుండా పొలంలోనే సాధ్యమైనంత ఎక్కువగా నిలుపుకొని నేలలోకి ఇంకేలా చూసుకోవాలి. ఇందుకోసం వర్షం వచ్చిన వెంటనే పొలంలో నీరు వేగంగా బయటకు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు పొలాన్ని సమతలంగా ఉంచడం, పొలంలో చిన్న చిన్న అడ్డుకట్టలు ఏర్పాటు చేయడం, వరుసల మధ్య అంతరకృషి చేయడం వంటి సులభమైన పద్ధతులను పాటించాలి.

అలాగే వర్షం తరువాత నేలపై తేమను ఎక్కువ కాలం నిలుపుకోవడానికి కలుపు మొక్కలను సకాలంలో తొలగించి, అవసరమైతే పంట అవశేషాలను నేలపై ఉంచడం మంచిది. అయితే అధిక వర్షం వచ్చినప్పుడు పొలంలో నీరు నిలిచిపోకుండా అదనపు నీటిని బయటకు పంపేలా చూసుకోవాలి.

  1. కీలక దశల్లో నీటిని సమర్థంగా వినియోగించాలి: నీటి వసతి ఉన్న రైతులు పరిమిత నీటిని పంటకు అత్యంత అవసరమైన పూత మరియు గింజ ఏర్పడే దశల్లో వినియోగించాలి. అధిక నీటిపారుదల చేయకుండా పంట అవసరానికి అనుగుణంగా నీటిని అందించాలి.
  2. చీడపీడలు, తెగుళ్లపై అప్రమత్తత: వర్షాభావం, బెట్ట పరిస్థితుల్లో పంట బలహీనపడే అవకాశం ఉన్నందున కాండం తొలుచు పురుగు, మొవ్వ తొలిచే ఈగ, కాండం తొలుచు పురుగు తదితర చీడపీడలను రైతులు తరచుగా గమనించాలి. అదేవిధంగా ఆకు మచ్చ తెగుళ్లు, కంకి/గింజలకు సంబంధించిన తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి.
  3. కోత మరియు నిల్వ; జొన్న కంకులు పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాత కోత చేపట్టాలి. గింజల్లో అధిక తేమ ఉన్నప్పుడు నిల్వ చేయకుండా, సురక్షితమైన తేమ స్థాయికి బాగా ఎండబెట్టి శుభ్రమైన, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. గోదాములను ముందుగానే శుభ్రపరచి, తేమ లేకుండా ఉంచడం ద్వారా నిల్వలో పురుగు, శిలీంధ్రాల సమస్యలను తగ్గించవచ్చు.

డా. ఎస్. ఇషా పర్వీన్, శాస్త్రవేత్త (వృక్ష ప్రజననం), డా. కె. అరుణ్ కుమార్, శాస్త్రవేత్త (సస్య ఉత్పత్తి),
డా. వి. జయలక్ష్మి, పరిశోధన సహ సంచాలకులు
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల. Ph: 7013020221