తిమ్మిర్లు లేదా రిళ్ళలు అనేది మోకాలి ఎముకల సంబంధిత వ్యాధి. ఎక్కువగా ఆవు జాతి, గేదె జాతి పశువులలో వస్తుంది. ఈ వ్యాధి వెనుకకాళ్ళలో వస్తుంది. అందువల్ల పశువులు సరిగ్గా నిలబడలేవు. నేలమీద కూర్చోలేవు. నడవలేవు, వెనకకాళ్ళను దేకుతూ నడుస్తాయి. అందువల్ల రైతు వాటిని పొలం దున్నడానికి వాడలేడు. పాల దిగుబడి కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. రైతు ఈ వ్యాధి మూలంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అంతగా లేదు కాని, పశువులు మానసికంగా ఒత్తిడికి గురై సరిగ్గా పనిచేయలేవు.

ఈ వ్యాధి అంటువ్యాధి కాని, ప్రాణాంతకమైనది కాని కాదు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.

కారణాలు: 

1. ఈ వ్యాధి వంశపారంపర్య కారణాల వల్ల ఒక తరం నుండి మరొక తరంకు సంక్రమిస్తుంది.

2. మోకాలి చిప్ప అరగటం వల్ల మోకాలి చిప్ప తొంటి ఎముక పైభాగాన అంటిపెట్టుకుంటుంది, దీని వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు.

3. మోకాలి ఎముకలు దృఢంగా లేకపోవడం మరియు జాయింట్‌ చుట్టూ ఉన్న స్నాయువులు బలంగా లేకపోవడం

4. ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వినియోగించడం.

5. సరియైన వ్యాయామం లేకపోవడం వల్ల జాయింట్‌ చుట్టూ ఉన్న కండరాలు బలంగా లేక మోకాలి చిప్ప పటుత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు. 

6. సరియైన పోషణ లేకపోవడం వల్ల తొంటి ఎముక క్రింది భాగం (మోకాలి చిప్ప అతుక్కొనే చోట) బలహీనపడి మోకాలి చిప్ప తేలికగా కదలకుండా జాయింట్‌ మీద అంటిపెట్టుకోవడం వల్ల రిల్లలు రావచ్చు. 

7. విరామం లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల రావచ్చు.

8. అధికంగా పాలు ఇచ్చే పశువులలో కూడా ఈ తిమ్మిర్లు/రిల్లలు రావచ్చు.

లక్షణాలు

1. తిమ్మిరి ఉన్న కాలు యొక్క మోకాలు ముడుచుకోదు. దాని వల్ల కాలు సాగదీసినట్టు ఉండి సరిగ్గా నిలబడలేదు.

2. నడిపించినప్పుడు తిమ్మిరి ఉన్న కాలు గెంటుతుంది లేదా దాని గిట్టలు నేలకు రాకుతూ నడుస్తుంది.

3. కొన్నిసార్లు విశ్రాంతి సమయంలో బాగానే ఉండి కాస్త పొలంలో నడవగానే తిమ్మిర్లు వస్తాయి.

4. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు చూడవచ్చు (ఉంటాయి). మళ్లీ సాధారణంగా అవుతుంది. ఇలా ఉంటే తిరిగి మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

5. కొన్నిసార్లు ఒక కాలు కాని రెండు వెనుక కాళ్లు ఒకేసారి కాని తిమ్మిర్లు రావచ్చు.

చికిత్స మరియు నివారణ చర్యలు

1. తిమ్మిర్లు వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యాధికారి వద్దకు తీసుకెళ్ళాలి, పశువైద్యాధికారులు మోకాలికి సర్జరీ చేసి తిమ్మిర్లు తీస్తారు.

2. ప్రథమ చికిత్సగా మోకాలిని తడిమి చూసి మోకాలి చిప్ప పెద్ద కనుక స్థిరపడినట్లు ఉంటే వెంటనే మోకాలి చిప్పను క్రిందకు జారే విధంగా తాడాలి. అలా చేస్తే మోకాలి చిప్ప ఎద స్థానానికి వచ్చి ఎప్పటి లాగానే సాధారణ స్థితికి వస్తుంది. 

నివారణ చర్యలు

1. ముఖ్యంగా కొండప్రాంతాలు, ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఏమిటంటే ఆవు జాతి, గేదె జాతి పశువులకు నిర్ణీత శారీరక శ్రమ మరియు విశ్రాంతి అవసరం.

2. ఎక్కువగా ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాలలో పశవులకు తక్కువ బరువు వేయాలి.

3. సరియైన పోషణ ఉండాలి. ముఖ్యంగా లవణాలు ఉన్న సమీకృత దాణాను వాడాలి.

4. సమాంతరంగా ఉన్న దారిలోనే పశువులను నడిపించాలి.

5. తిమ్మిర్లు రాకుండా మోకాలికి పటుత్వాన్ని పెంచే పట్టీలు (మమోకాలు పట్టీలు) వాడాలి.

డా. ఎన్‌. వేణుమాధవ్‌ (7989846261, 9490448540), (ఎం.వీ.ఎస్సీ), టీచింగ్‌ ఫ్యాకల్టీ, డా. ఎన్‌. రమ్య, ఎం.వీ.ఎస్సీ., అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, కోరుట్ల