తేనెటీగ యొక్క కాటు, కీటకాల కాటుకంటే భిన్నంగా ఉంటుంది. తేనెటీగలను కాలనీల రూపంలో (గుంపు) తరచుగా చూస్తుంటాం. అప్పుడప్పుడు వాటి యొక్క గుంపు చెదిరినప్పుడు సమీపంలో కట్టివేయబడిన మరియు సహజంగా తిరుగుతున్న జంతువులపై దాడి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తేనెటీగ కాటు నుండి వెలబడే స్టింగ్‌ (తేనెటీగ ముల్లు) యొక్క జలం అత్యంత విషపూరితమైన మూలకాలతో రూపొందించబడింది. అవి కుట్టిన తర్వాత గాయం చేసిన స్థానంలో పశువుకు నొప్పి, వాపు, దురద మరియు అలెర్జీ ఉండవచ్చు. లక్షణాలను ముందస్తుగా గుర్తించకుండా, తక్షణ చికిత్స చేయకపోతే, పశువుకు కాటు ప్రాణాంతకంగా మారవచ్చు. తేనెటీగ కాటు యొక్క ప్రతిచర్య తీవ్రత విషం యొక్క మోతాదు మరియు దానికి సంబంధించిన లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.

తేనెటీగ కుట్టడం ద్వారా సాధారణంగా రెండు రకాల ప్రతిచర్యలు గమనించవచ్చు. ఒకటి స్థానిక ప్రతిచర్య మరియు ఇంకొకటి తీవ్రమైన దేహిక ప్రతిచర్య. దేహిక ప్రతిచర్యలో కాటు యొక్క విషం రక్త స్రావణంలోకి చేరుకుని తీవ్రతను పెంచుతుంది. రక్తం గడ్డకట్టడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపిస్తుంది.

తేనెటీగ కుట్టిన జంతువులకు చికిత్స: తేనెటీగ కుట్టినప్పుడు అవి వాటి యొక& విషపు సంచిని మరియు స్టింగ్‌ (తేనెటీగ ముల్లు) జంతువు శరీరంలోకి ప్రవేశింపచేస్తాయి. అంటే అవి కుట్టిన తక్షణమే స్టింగ్‌ని కోల్పోయి చనిపోతాయని అర్థం.  స్టింగ్‌లు ఒక నిమిషం పాటు లేదా దాన్ని తొలగించే వరకు శరీరంలోకి విషాన్ని పంపుతూనే ఉంటుంది. జంతువుపై స్టింగ్‌ను చూడగలిగితే, వాటిని దువ్వెన, కత్తి లేదా వేలిగోరుతో తొలగించవచ్చు. పట్టకార్లు లేదా వేళ్ళతో వాటిని బయటకు తీయవద్దు; ఎందుకంటే దాని వల్ల మరింత విషం లోపలికి చేరుకోబడుతుంది. స్టింగ్‌లను తొలగించి, గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత, మీరు ఈ క్రింద వివరించిన నివారణ చర్యలలో మీకు అందుబాటులో కలిగిన ఏదైనా ఒక పద్ధతిని ఉపయోగించవచ్చు.

ఐస్‌గడ్డ: 20 నిమిషాల పాటు ఐస్‌గడ్డను కుట్టిన స్థానంలో పెట్టాలి. ఇది నొప్పిని తగ్గించి, ఆ ప్రాంతంలోని రక్తప్రసరణను నెమ్మదించి తద్వారా వాపును తగ్గిస్తుంది.

తేనె: గాయానికి ఒక చిన్న చుక్క తేనెను పూసి మరియు 30 నిమిషాల నుండి ఒక గంట వరకు చిన్న గుడ్డతో కప్పాలి.

లావెండర్‌ ఆయిల్‌: గాయమైన (కాటు ప్రదేశం) చోట ఒకటి లేదా రెండు చుక్కల లావెండర్‌ ఆయిల్‌ను వేయాలి. ఇది విషాన్ని వెంటనే తటస్తం చేయడానికి సహాయం చేస్తుంది.

వెల్లుల్లి రసం: ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను రసం వచ్చేల నలిపి గాయం మీద నొక్కాలి. తడిగా ఉన్న గుడ్డతో 20 నుండి 30 నిమిషాల పాటు కప్పి ఉండాలి. 

బేకింగ్‌ సోడా, వెనిగర్‌: రెండింటిని కలిపి పేస్ట్‌ తయారు చేసి గాయం మీద 30 నిమిషాలు ఉంచాలి. ఇది తేనెటీగ ముళ్ళల్లో ఉన్న విషపూరితమైన పదార్థాలను తటస్థీకరించడంలో సహకరిస్తాయి.

టూత్‌ పేస్ట్‌: టూత్‌ పేస్ట్‌ కూడా స్టింగ్‌ యొక్క విష పదార్థాన్ని తటస్తం చేయడంలో సహాయ పడుతుంది. ఎక్కువ తేనెటీగల దాడికి గురైనట్లయితే, పశువైద్యుని ద్వారా అత్యవసర చికిత్సను అందించాలి. తేనెటీగ కాటు లక్షణాల యొక్క తీవ్రత, విషం పరిమాణం, జంతువు శరీర బరువు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. లక్షణాలు తీవ్రంగా ఉన్నట్లయితే యాంటిహిస్టమైన్లు, స్టిరాయిడ్స్‌, యాంటిబయటిక్‌ ద్రవాలు, ఆక్సిజన్‌ థెరపిని సుమారు 24-48 గంటల వరకు ఇవ్వాలి.

తేనెటీగ కాటు నివారణ

   తేనెటీగ కుట్టకుండా ఉండాలంటే వాటి దాడికి దారితీసే కారకాల గురించి తెలుసుకోవాలి.

   చెట్లు, పొదలు, నీటి మీటర్‌ పెట్టెలు వంటి ఎన్నో రకాల ప్రదేశాలలో తేనెటీగలు గూడు కట్టుకుంటాయి.

*    పొదలు మరియు చెట్లను కత్తిరిస్తున్నప్పుడు అనుకోకుండా తేనెటీగ గూడును కొట్టినప్పుడు తరచుగా దాడులు సంభవిస్తాయి.

   తేనెటీగ గూళ్ళకు పశువులను దూరంగా ఉంచాలి.

*    కలుపు తీసేటప్పుడు, ట్రాక్టర్లు, ఇతర పరికరాలు ఉపయోగించేటప్పుడు జంతువులను మేత కోసం బయటకు అనుమతించవద్దు.

*    మీ జంతువులను తేనెటీగ కుట్టినట్లయితే వెంటనే జంతువును తేనెటీగల నుండి విడదీయాలి.

   మీ కుక్కను తేనెటీగ కుట్టినట్లయితే వెంటనే ఇంటి లోపలికి తీసుకురావాలి అది వేరే జంతువులకు హాని కలిగించకుండా ఉంటే, విడుదల చేయవచ్చు. 

   వీలైతే షాంపూ నీటిలో కుక్కను ముంచాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి తగులుకున్న తేనెటీగలను తొలగించవచ్చు. 

డా. మామిడాల లావణ్య (9849756473), ఎం.వి.ఎస్సీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా. నల్లపాటి సాయి అంజన (9573684395), ఎం.వి.ఎస్సీ, పి.జి.డి.ఎ.డబ్ల్యు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా. పోతంశెట్టి ఆదివిష్ణుబాబు (9701963023), బి.వి.ఎస్సీ., హస్సన్‌ వెటర్నరీ కాలేజి,