తయారుచేయు విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, బెల్లం కలిపి మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని పక్కుకు పెట్టుకోవాలి. అదే జార్లో ముందుగా చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని కలిపి ఆ మిశ్రమాన్ని పల్చటి క్లాత్‌తో గట్టిగా పిండాలి. ఆ జ్యూస్‌ని బీట్రూట్ జ్యూస్‌గా వాడుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఆ ముద్దకి పైన పేర్కొన్న పల్లీలు నువ్వుల బెల్లం పొడిని మరియు కొద్దిగా ఇలాచీ పొడిని చిన్నచిన్నగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు బాదం ముక్కలను కలిపి అవసరాన్ని బట్టి తేనెను కలుపుతూ గుండ్రటి లడ్డూలు కట్టుకోవాలి.
ఇవి ఏరోజుకారోజు చేసుకుని తింటే బాగుంటాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు, పార్టీలకు అప్పటికప్పుడు పిల్లలకి రుచికరమైన, బలవర్ధకరమైన ఆహారంగా చేసి ఇవ్వవచ్చు.
ఒకేరోజు మనము బీట్రూట్ లడ్డూలను, బీట్రూట్ జ్యూస్‌ను తయారు చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తాగే అలవాటు ఉన్నవాళ్లు చాలా నీటిని పోసి పిప్పి కదా అని దాన్ని వ్యర్థం చేస్తుంటారు. కాకపోతే తక్కువ నీటిని ఉపయోగించి క్యారెట్, బీట్రూట్ లడ్డూలుగా దాన్ని ఉపయోగించుకోవచ్చు.
సముద్రాల రమణ, హన్మకొండ, తెలంగాణ
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
పరిచయం పెరుగుతున్న జనాభా, నేల క్షీణత, అస్థిర వాతావరణం ఈ మూడు ఒత్తిళ్లు నేటి ప్రపంచ వ్యవసాయాన్ని చుట్టుముట్టాయి. లోతైన నాగలి దుక్కి మీద ఆధారపడిన సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నేల కోతకు, పోషకాల నష్టానికి కారణమవుతున్నాయని దశాబ్దాలుగా గుర్తించబడింది. ఈ నేపథ్యంలో, 1970లలో అమెరికాలో మొదలై బ్రెజిల్, అర్జెంటీనా, కెనడా వంటి దేశాలకు విస్తరించిన పరిరక్షణ వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. 1970లో కేవలం 10 లక్షల హెక్టార్లలో ఉన్న పరిరక్షణ వ్యవసాయం విస్తీర్ణం, 2019 నాటికి 102 దేశాల్లో సుమారు 20.5 కోట్ల హెక్టార్లకు (ప్రపంచ సాగుభూమిలో దాదాపు 15%) పెరిగింది.
పరిరక్షణ వ్యవసాయం అనేది ఒకే ఒక్క పద్ధతి కాదు ఇది మూడు అంశాల సమీకృత వ్యవస్థ: (1) కనీస యాంత్రిక నేల కదలిక, (2) పంట అవశేషాలు లేదా కవర్ పంటల ద్వారా నేలపై శాశ్వత సేంద్రియ కవచం, (3) పంట మార్పిడి లేదా అంతర పంటల ద్వారా జీవవైవిధ్యం.
తక్కువ కదలిక నేల కణాల నిర్మాణాన్ని కాపాడితే, ఉపరితల అవశేషాలు వర్షపు దెబ్బ నుండి, తేమ నష్టం నుండి ఆ నిర్మాణాన్ని కాపాడతాయి. పంట మార్పిడి జీవ కార్యకలాపాలను పునరుద్ధరించి, చీడపీడల చక్రాలను విచ్ఛిన్నం చేస్తుంది.
చిత్రం 1: పరిరక్షణ వ్యవసాయపు మూడు మూలస్తంభాలు పరస్పరం బలపరుచుకునే ఒక సమీకృత వ్యవస్థ
నేల ఆరోగ్యంపై ప్రభావం పరిరక్షణ వ్యవసాయం వల్ల కలిగే జీవశాస్త్రపరమైన మార్పులు అత్యంత స్థిరంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ ప్రకారం, అవశేషాల నిలుపుదలతో కూడిన సున్నా-దుక్కి పద్ధతి పై 20 సెం.మీ నేలలో సూక్ష్మజీవుల జీవద్రవ్యరాశిని 37% పెంచుతుంది (శిలీంధ్రాలలో 31%, బ్యాక్టీరియాలో 11% పెరుగుదల). ఇండో-గంగా మైదానాల్లో ఆరేళ్ల అధ్యయనంలో సున్నా-దుక్కి పద్ధతి ఎగువ 15 సెం.మీ నేలలో హెక్టారుకు సుమారు 2 టన్నుల సేంద్రియ కర్బనాన్ని నిల్వ చేసినట్లు తేలింది. అయితే ఈ కర్బన నిల్వ లోతును బట్టి మారుతుంది 60 సెం.మీ లోతు వరకు కొలిచినప్పుడు సాంప్రదాయ, సున్నా-దుక్కి పద్ధతుల మధ్య తేడా గణనీయంగా తగ్గిపోతుందని మరో అధ్యయనం హెచ్చరిస్తోంది. మట్టి స్థూల సాంద్రత విషయంలో మాత్రం సాహిత్యంలో నిజమైన భిన్నాభిప్రాయం ఉంది కొన్ని అధ్యయనాలు స్వల్ప పెరుగుదలను, మరికొన్ని తగ్గుదలను నివేదిస్తున్నాయి.
దిగుబడి, ఆర్థిక అంశాలు మెటా-విశ్లేషణ ప్రకారం, సున్నా-దుక్కి పద్ధతి సగటున 5.1% దిగుబడి తగ్గుదలకు దారితీస్తుంది. కానీ ఇది పంట, వాతావరణం మేరకు చాలా తేడాగా ఉంటుంది నూనెగింజలు, పత్తి, పప్పుధాన్యాలలో తగ్గుదల లేదు; మొక్కజొన్న, వరిలో ఎక్కువ తగ్గుదల (సుమారు 7.5%) కనిపించింది. పొడి వాతావరణాలలో వర్షాధార పంటలకు సున్నా-దుక్కి పద్ధతి సాంప్రదాయ పద్ధతితో సమానంగా లేదా మెరుగ్గా పనిచేస్తుంది. మలావిలో జరిగిన క్షేత్ర అధ్యయనాల్లో పరిరక్షణ వ్యవసాయం ఆధారిత మొక్కజొన్న పంటలు దిగుబడిని 22 – 31%, రైతు ఆదాయాన్ని 50 – 83% పెంచడంతో పాటు హెక్టారుకు 28–39 పని దినాల శ్రమను తగ్గించాయి. పంట మార్పిడి, సరైన నత్రజని యాజమాన్యం లేకుండా పరిరక్షణ వ్యవసాయం పూర్తి ప్రయోజనాలు అందించదని గమనించాలి.
వాతావరణ స్థితిస్థాపకత, కర్బన నిల్వ ఉత్తర చైనా మైదానంలో జరిగిన ఎనిమిదేళ్ల వేడెక్కింపు ప్రయోగంలో, పరిరక్షణ వ్యవసాయ పద్ధతిలో నేల చల్లగా, తేమగా ఉండి, శీతాకాల గోధుమ దిగుబడి వేడెక్కింపు వల్ల 9.3% పెరిగింది. ఈ ప్రయోజనం సంవత్సరాలు గడిచేకొద్దీ మరింత బలపడటం గమనార్హం ఇది స్థిరమైన, కాలానుగుణంగా పెరిగే ప్రయోజనమని సూచిస్తుంది. అదేవిధంగా, నో-టిల్ మరియు తగ్గిన దుక్కి పద్ధతులు నత్రజని ఆక్సైడ్ ఉద్గారాలను సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే సుమారు 11% తగ్గిస్తాయని ప్రపంచవ్యాప్త మెటా-విశ్లేషణ తెలిపింది, ముఖ్యంగా తేమతో కూడిన వాతావరణాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కలుపు యాజమాన్యం, ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికత నేల కదలిక తగ్గించడం వల్ల దుక్కి ఆధారిత కలుపు నియంత్రణ తొలగిపోతుంది కాబట్టి, విత్తడం, ఎరువులు, కలుపు/చీడ నియంత్రణ వంటి పనులను మరింత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడే జిపిఎస్-ఆధారిత యంత్రాలు, రిమోట్ సెన్సింగ్, డ్రోన్లు , జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వేరియబుల్-రేట్ టెక్నాలజీ వంటి ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయి. అవశేషాల కవచం వల్ల నేలపై కలుపు మొక్కలను గుర్తించడం కష్టతరం కావడంతో, డ్రోన్ చిత్రాల ఆధారంగా కృతిమ మేధస్సు (ఏ ఐ/ఎం ఎల్/డి ఎల్) సాయంతో కలుపు మ్యాపింగ్, స్థల-ఆధారిత కలుపు నివారణ వంటి పద్ధతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే యంత్రాలు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం చిన్న, సన్నకారు రైతులకు ఈ సాంకేతికతలను చేరువ చేయడంలో పెద్ద అడ్డంకిగా మిగిలిపోయింది.
చిత్రం 2: ఖచ్చితమైన వ్యవసాయం మరియు కలుపు యాజమాన్యం. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ మరియు కృతిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించడం, మ్యాపింగ్ చేయడం మరియు లక్షిత ప్రాంతాల్లో మాత్రమే నియంత్రణ చర్యలను చేపట్టే విధానాన్ని ఈ వైజ్ఞానిక చిత్రపటం వివరిస్తుంది. ఇది చిన్న రైతులు ఎదుర్కొంటున్న పెట్టుబడి మరియు సాంకేతిక సవాళ్లను కూడా సూచిస్తుంది
సవాళ్లు, స్వీకరణలో అడ్డంకులు పంట అవశేషాలను పశువుల మేతకు వాడాల్సిన అవసరం, యంత్రాలు-రుణాల లభ్యత, లింగ ఆధారిత అసమానతలు, విస్తరణ సేవల కొరత ఇవన్నీ ముఖ్యంగా చిన్నకారు, వర్షాధార రైతాంగంలో పరిరక్షణ వ్యవసాయం స్వీకరణను నెమ్మదిస్తున్నాయి. అదేవిధంగా, నేల కర్బన కొలత లోతు, నత్రజని ఆక్సైడ్ కొలత విధానాలలో ప్రామాణికత లేకపోవడం వంటి పద్దతిపరమైన అసమానతలు ఈ రంగంలో పరిష్కరించాల్సిన ముఖ్యమైన పరిశోధన అంతరాలుగా మిగిలాయి.
ముగింపు పరిరక్షణ వ్యవసాయం నేల సూక్ష్మజీవుల ఆరోగ్యం, ఇంధన-శ్రమ ఆదా, నిర్దిష్ట పరిస్థితులలో దిగుబడి స్థిరత్వం వంటి నిజమైన ప్రయోజనాలను అందిస్తుందని ఈ సమీక్ష స్పష్టం చేస్తుంది. అయితే బల్క్ డెన్సిటీ, పరాగసంపర్క కీటకాలపై ప్రభావం వంటి అంశాల్లో సాహిత్యంలో ఇప్పటికీ నిజమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భవిష్యత్తులో పరిరక్షణ వ్యవసాయం ను కేవలం ఒక స్థిర ప్యాకేజీగా కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమర్చుకోగల సమీకృత వ్యవస్థగా, ఖచ్చితమైన సాంకేతికతతో మేళవించి అభివృద్ధి చేయడం ద్వారానే స్థిరమైన వ్యవసాయ లక్ష్యాలను చేరుకోవచ్చు.
ఇతర వివరముల కొరకు , ఈమెయిల్ మరియు ఫోన్: jcharleswesley@gmail.com, +91 8331816872, చార్లెస్ వెస్లీ జె., పిహెచ్.డి స్కాలర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. తిరుమలైకుమార్ ఆర్., అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రోనమి, వి.ఐ.టి, వెల్లూరు, డా. సరవణన్ ఎస్., ప్రొఫెసర్, వి.ఐ.టి, వెల్లూరు.
చార్లెస్ వెస్లీ జె¹, తిరుమలైకుమార్ ఆర్², సరవణన్ ఎస్³* ¹, ²&³ వి ఐ టి స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెర్నింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రోనమీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT), వెల్లూరు, తమిళనాడు.
సీతాఫలం కషాయంతో బోల్వార్మ్తో పాటు పలు రకాల పురుగులను అరికట్టవచ్చు. సీతాఫలం దొరికే కాలంలో చక్కగా ముదిరిన కాయలను మధ్యకు పగలచీల్చి నీడకు ఎండించి పొడిచేసి పెట్టు కోవాలి. అవసరమైనప్పుడు లీటరు నీటికి వంద గ్రాముల చొప్పున పొడి వేసి మరిగించి కషాయం తీసుకోవాలి. మరిగించినప్పుడు సగం వరకు మిగిలిన కషాయం వడకట్టి పెట్టుకొని 5 శాతం చొప్పున పిచికారి చేసుకుంటే కాయతొలుచు పురుగుతో పాటు అన్ని రకాల పురుగుల మీద చక్కగా పనిచేస్తుంది.
అడ్డసరం ఆకులు, కానుగాకుల కషాయం ఈ రెండు రకాల ఆకులను సేకరించి శుభ్రపరచుకోవాలి. ఆకుల బరువుకు 16 రెట్ల నీరు తీసుకోవాలి. ఆకులను సన్నగా తరిగి ఒక కుండలో పోసి మరగకాయాలి. పాత్రలో ద్రావణం సగం అయ్యేవరకు సన్నని సెగమీద మరిగించి దించి వడకట్టి ఉంచుకోవాలి. ఈ ద్రావణం లీటరు నీటికి 10 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
తుమ్మికూర కషాయం వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ఉండ్రాళ్లతోపాటు తుమ్మికూర తినడం ఆచారం. తుమ్మికూర, తిమ్మికూరగా పిలిచే దీని శాస్త్రీయ నామం లూకాసఅస్పెరా. ఇది భారతీయ ఆయుర్వేద విధానంలో ప్రాధాన్యత కలిగిన మొక్క. ఈ తుమ్మికూరను సేకరించి ఆవు మూత్రంతో కషాయం చేసి పిచికారి చేస్తే అన్ని రకాల లద్దెపురుగులు, పాకుడు పురుగులు నశిస్తాయి.
విషముష్టి కషాయం అటవీ ప్రాంతానికి దగ్గరి ప్రాంతాల్లో విషముష్టి మొక్క విస్త్రృతంగా లభిస్తుంది. విషముష్టి పళ్లు, ఆకులు, బెరడుల నుంచి తీసిన కషాయం పత్తి కాయతొలుచు పురుగును దరిదాపులకు రాకుండా తరిమేస్తుంది. అటవీ పరిసర గ్రామాలకు చెందిన వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో రైతులు దీన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.
నల్లేరు పొదలు, చెట్ల మీద దాదాపు 10 మీ. ఎత్తు పెరిగే బహు వార్షిక తీగ. దీని శాఖలు నాలుగు పలకల కాడల్లా ఉంటాయి. ఈ మొక్క కణుపులు కలిగి ఉండి ప్రతి కణుపు వద్ద హృదయాకారంలో గానీ, గుండ్రంగా గానీ పెళుసైన పత్రాలు కలిగి ఉంటుంది. ఈ కణుపుల వద్ద సన్నని తీగలు కూడా వస్తాయి. పూలు వంగ పండు రంగులోను, ఫలాలు సన్నగా, ఎరుపు రంగులో ఉంటాయి. నల్లేరు కాడ అంతా నారతో కూడి ఉండి చేతితో నలిపితే చేయి దురద పెడుతుంది. కాండం గుండ్రంగాను, బల్ల పరుపుగాను ఉండే మొక్కలు కూడా అక్కడక్కడ అరుదుగా కనిపిస్తాయి.
సాధారణ నామం : అడమెంట్ క్రీపర్ / ఎడిబుల్ స్టెమ్డ్లైన్ / హడ్జోడ్ శాస్త్రీయ నామం : సిస్సస్ క్వాడ్వాంగ్యులారిస్ కుటుంబం: వైటేసి²
ఉపయోగాలు : ఔషధరంగంలో …
నల్లేరు కాడలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. ఈ మొక్కల నుండి టెట్రాసైక్లిన్ ట్రైటెర్పినాయిడ్లు మరియు స్టెరాయిడ్లు లభిస్తాయి. నల్లేరు లేత కాడలను దంచి ఉప్పు, కారం, జీలకర్ర, మిరియాలు చేర్చి తింటే జీర్ణ శక్తి పెరుగుదలకు, కీళ్లనొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
బాగా ముదిరి లావుగా ఉన్న నల్లేరు కాడల్ని ఎండబెట్టి చూర్ణం చేసి పిప్పిళ్ళ చూర్ణం కలిపి తేనెతో సేవిస్తే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. నల్లేరు చూర్ణం మూలవ్యాధికి, బహిష్టు క్రమబద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. నల్లేరు రసం చెవి నుంచి చీము కారడం తగ్గిస్తుంది. నల్లేరుకి విరిగిన ఎముకలను అతికించే గుణం కూడా ఉంది.
వ్యవసాయరంగంలో
నల్లేరు కాండం పెట్రోలియం ఈదర్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను, ప్యూపాలను అత్యంత సమర్ధవంతంగా నివారించింది (రమేష్ కుమార్ అండ్ నట్టుతురాయ్, 2012).
నల్లేరు తాజా మరియు ఎండిన కాండాల ఇథైల్ అసిటేట్ ద్రావణం మరియు మిథనాల్ ద్రావణాలు బాసిల్లస్ సబ్‌టైలిస్, బాసిల్లస్ సీరియస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, స్ట్రెప్టోకోకస్ స్పీసీస్‌పై యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి (చిదంబర మూర్తి, అతని అనుచరులు, 2004).
వేప ఆకులు, నల్లేరు ఆకులు సమపాళ్ళలో కలిపి నూరి ఆవుమూత్రంలో ఒక వారం నానబెట్టి వడపోసి, 1:9 నిష్పత్తిలో నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసి వరిలో పురుగులను నివారించవచ్చు (పిఒపి, తమిళనాడు)
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
పై పదార్థాలన్నీ మిక్సీలో వేసి గిర్ర గిర్ర నాలుగు తిప్పులు తిప్పితే, కొబ్బరి వెల్లుల్లి పొడి రె’ఢీ’. వేడి అన్నంలో ఈ కొబ్బరి వెల్లుల్లి పొడి నేతితో కలిపి తింటే, ఆహా… ఓహో… అనక తప్పదు.
శాంతాజీదత్, రామ్‌నగర్, హైదరాబాద్.
రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
దాల్చిన చెక్క ఒక నిత్యహరిత చెట్టు. కాండం బలంగా 30-60 సెం.మీ. వ్యాసం కలిగి ఉంటుంది. బెరడు సుమారు 10 మి.మీ. మందంగా బూడిద రంగులో ఉంటుంది. సాధారణంగా ఇది ఒక దట్టమైన పొద. లేత కొమ్మలపై బెరడు నునుపుదనం కలిగి పాలిపోయిన గోధుమరంగు లేదా గోధుమబూడిద రంగులో ఉంటుంది. ఆకులు ఎదురెదురుగా ఏర్పడి వాసననిస్తాయి. ఆకు కాడ 1-2 సెం.మీ. పొడవుంటుంది. పూలు చిన్నవిగా 3 మి.మీ. వ్యాసం, పాలిపోయన పసుపు రంగులో ఉంటాయి. కాయ అండాకారంలో 1-2 సెం.మీ. పొడవుండి పండినపుడు నలుపు రంగులో ఉంటాయి.
సాధారణ నామం : సిన్నమోమ్ శాస్త్రీయ నామం : సిన్నమోమం వెరమ్/సిన్నమోమం జీలానికం కుటుంబం: లారేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
సంప్రదాయ ఔషధాలలో దీర్ఘకాలంగా దాల్చిన చెక్కను ఇతర హెర్బల్ మొక్కలతో కలిపి ఉపయోగిస్తున్నారు. దీనిని కీళ్ళనొప్పులు, గుండెదడ, డిస్మెనోరియా చికిత్సలో ఉపయోగిస్తారు. పురాతన ఈజిప్షియన్లు దాల్చిన చెక్క కలిపిన పరిమళ ద్రవ్యంలో మార్పుకు గురికాకుండా వస్తువులను నిల్వ చేసేవారు.
దీనిని పళ్ళునొప్పులు తగ్గించడానికి, నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తారు. ఆరోగ్యాన్ని పెంచే టానిక్‌గా ఉపయోగిస్తారు. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫ్లుయెంజ, గొంతు నొప్పులను తగ్గిస్తుంది. స్త్రీలలో బహిష్టు సమయంలో కలిగే అసౌకర్యాలకు ఉపశమనం కలిగిస్తుంది.
భారతదేశంలో ఆయుర్వేద ఔషధాలలో మొలలు, డయేరియా, పళ్ళనొప్పి, అమీబియాసిస్, గుండె జబ్బులు, జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి అనేక సమస్యలను తీరుస్తుంది.
దాల్చిన చెక్కలో యాంటి ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ప్రతిరోజు దాల్చిన చెక్క టీని త్రాగితే మానవులలో ఒత్తిడి తగ్గుతుంది. మూత్రం స్రవించడానికి, విసర్ౙనానికి దోహదపడుతుంది. సెక్స్ కోరికలను పెంచుతుంది. బాలింతలలో చనుబాల ఉత్పత్తిని పెంచుతుంది.
దాల్చిన చెక్కను అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. డోనట్స్, యాపిల్‌పై, బన్స్, క్యాండీస్, టీ, వేడికోకో, లిక్కర్లలో ఉపయోగిస్తారు. చిక్కని సూపులు, డ్రింక్స్, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.
ఆయుర్వేద ఔషధం దాల్చిన చెక్క శ్వాసకోశ, జీర్ణాశయ, గర్భాశయ సమస్యలకు మంచి మందు. ఈ చెట్టు బెరడు, ఆకులు, పూలు, కాయలు, వేర్లు ఔషధ లేదా వంటకాల విలువలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు బెరడుని ఎండబెట్టి భారతదేశంలో అన్ని వంటకాలలో సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తారు.
ఈ మొక్కని, దాని కషాయాలను అనేక జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ద్రావణాలను గాస్ట్రో ఇంటస్టెåనల్ సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. జీర్ణాశయంలో ఏర్పడిన వాయువు విడుదలవడానికి సహాయపడుతుంది. అధికంగా వాయువు ఏర్పడటం వలన పొట్టలో కలిగే నొప్పులకు ఉపశమనం కల్గిస్తుంది.
మూత్రకోశాన్ని శుభ్రపరచి జబ్బులను తగ్గిస్తుంది. మధుమేహాన్ని నివారించి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. జలుబు, ఫ్లూజ్వరాన్ని తగ్గిస్తుంది. నోటి దుర్వాసన పోగొట్టడానికి ఉపయోగిస్తారు. తీవ్ర తలనొప్పిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క, తాజా నిమ్మరసంతో పేస్టు తయారు చేసి మొటిమలపై పూసి వాటిని నయం చేయవచ్చు.
వ్యవసాయరంగంలో
దాల్చిన చెక్క ఆకునూనె దోమల లార్వాలను సమర్దవంతంగా చంపుతుంది. దీనిని పురుగు వికర్షిణిగా సిఫారసు చేశారు. దాల్చిన చెక్కను ఇతర సుగంధ ద్రవ్యాలతో కలిపి జీవ పురుగు మందు తయారీలో ఉపయోగిస్తారు. దీనిని పాటింగ్ మట్టితో కలిపి లేదా పంటలపై చల్లి పురుగులను నివారించవచ్చు (డోటి, 2012).
దాల్చిన చెక్కలో ఉన్న యూజినాల్ కీటకనాశన చర్య కలిగి ఉంది. మాటన్, అతని అనుచరులు సిన్నమోమ్ ఆయిల్ సహజ యాంటి మైక్రోబియల్ ఏజెంట్ అని రిపోర్టు చేశారు. ఇది వివిధ బాక్టీరియా (పీడియోకోకస్ హాలోఫిలస్, స్టెఫైలోకోకస్ ఆరియస్), శిలీంద్రాల (ఆస్పర్ౙిల్లస్ఫ్లేవస్, మ్యూకార్ ప్లంబియస్, పెనిసిలియం రాక్విఫోర్టి, యూరోషియం స్పీ.) పెరుగుదలనరికడుతుంది (విశ్వేశ్వరరావు అండ్ హుయాగాన్, 2014).
దాల్చిన చెక్క (సిన్నమోమమ్ జీలానికం) ఎసెన్షియల్ ఆయిల్ టమాట లీఫ్ మైనర్, టుట ఆబ్సల్యూట లార్వాలను 100% చనిపోయేలా చేసింది (అడిల్, అతని అనుచరులు, 2015).
దాల్చిన చెక్క (సిన్నమోమమ్ జీలానికం) ఎసెన్షియల్ ఆయిల్ ధాన్యం నిల్వలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజెలను 98% మరియు 80% చంపగలిగింది (జ్యోతిక బ్రారి అండ్ ఠాకూర్, 2015).
దాల్చిన చెక్క (సిన్నమోమమ్వెరమ్) నీటి ద్రావణం ఆహారాన్ని పాడు చేసే 3 గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా (స్టెఫైలోకోకస్ ఆరియస్, బాసిల్లస్ సెరియస్, ఎంటరోకోకస్ ఫీకాలి), 2 గ్రామ్ నెగటివ్ బాక్టీరియా (ఎస్కెరిచియాకోలి, ప్రోటియస్ మిరాబిలిస్)లపై యాంటి బాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. దీనిని సహజ ఆహార సంరక్షిణిగా ఉపయోగించవచ్చు (మధుమిత రక్షిత్ అండ్, రామలింగం, 2011).
దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ (33.3%) నిమ్మ, మాండరిన్ కాయల తోటల్లో తొక్కలపై మచ్ౘ్లు కలిగించి మార్కెట్ విలువ తగ్గించే శిలీంద్రం గ్విగ్నార్డియా సిట్రికార్ప పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. షేడ్హౌస్లో జరిపిన ప్రయోగాల్లో లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపిన ద్రావణం టమాట మొక్కల నాశించే ఎర్లీబ్లెåట్ ఆకుమచ్చ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (ఇయోల్, అతని అనుచరులు, 2014).
దాల్చిన చెక్క చెట్టు ఆకుల ఇథనాల్ ద్రావణం ఆర్టెమియా సరిన లార్వాలపై లార్విసైడల్ చర్యను, సైటోఫిలస్ ఒరైజెపై పురుగు మందు ప్రభావాన్ని చూపింది. (ఉదయ ప్రకాష్, అతని అనుచరులు, 2014).
సిన్నమాల్డిహైడఅల్లిసిన్ ఫార్ములేషన్ పంటలను నులిపురుగులు, శిలీంద్ర తెగుళ్ళు, పురుగులు, నల్లుల నుండి కాపాడుతుంది. దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ పిచికారి చేసిన 4 గంటలలో టమాట పంటనాశించే లీఫ్‌మైనర్, టుట ఆబ్సల్యూట లార్వాలు 100% చనిపోయాయి. ఎసెన్షియల్ ఆయిల్ లీఫ్‌మైనర్ లార్వాలపై శక్తివంతమైన వికర్షక మరియు కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (అడిల్, అతని అనుచరులు, 2015).
దాల్చిన చెక్క (సిన్నమోమం ఇంప్రెస్సినర్వియం) ఎసెన్షియల్ ఆయిల్ (1000 పిపియం) కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, ఆల్టర్నేరియా ఆల్టర్నేటలపై బలమైన శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (80%). ఫ్యుజేరియం ఆక్సిస్పోరంపై 78.6% శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (భూయాన్, అతని అనుచరులు, 2015).
దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజాలపై స్పర్శ, ఫ్యూమిగెంట్ విషచర్యలను ప్రదర్శించింది (జ్యోతిక అండ్ ఠాకూర్, 2015).
దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఫ్యూమిగేటస్‌పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (కార్మొ, అతని అనుచరులు, 2008).
దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ కంది వీవిల్‌ని 24 గంటల తర్వాత 100% చంపింది. ఎసెన్షియల్ ఆయిల్ అధిక కీటకనాశక, వికర్షక లక్షణాల వల్ల దీనిని నిల్వ ధాన్యంలో ఆశించే పురుగుల నివారణకు ఉపయోగించవచ్చు (గ్రేస్, ఆమె అనుచరులు, 2017).
దాల్చిన చెక్క హెక్సేన్ మరియు మిథనాల్ ద్రావణాలు (3 మి.లీ./లీ. నీరు) టమాట ఎర్లీబ్లెåట్ శిలీంద్రం ఆల్టర్నేరియా సొలాని పెరుగుదలను పూర్తిగా అరికట్టింది. దాల్చిన చెక్క ద్రావణం (2 మి.లీ./లీ.) టమాట మొక్కలనాశించే ఎర్లీబ్లెåట్ తెగులుని సమర్ధవంతంగా నివారించింది (ఇయోల్, అతని అనుచరులు, 2014).
దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్ (1%) అలసంద బీటిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను వికర్షించింది. ఎసెన్షియల్ ఆయిల్‌ని అలసంద బీటిల్ సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమంలో విజయవంతంగా ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (ఫౌయాజ్, 2013). భవిష్యత్ సమగ్ర పురుగు యాజమాన్య కార్యక్రమాలలో దాల్చిన చెక్క ఎసెన్షియల్ ఆయిల్‌తో సహా అనేక ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. (కౌల్, 2008).
దాల్చిన చెక్క, నిమ్మగడ్డి ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమంతో తయారు చేసిన కెయొలిన్ టాబ్లెట్లు వరి నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగు సైటోఫిలసఒరైజే పురుగులను గణనీయంగా తగ్గించాయి. 6 నెలల కాలంలో గింజలకు కలిగే నష్టం గణనీయంగా తగ్గింది. 6 నెలల తర్వాత కేవలం 5% కెయొలిన్ టాబ్లెట్ల బరువు నష్టం గమనించబడింది. వరి రకం సువండల్లో ఎసెన్షియల్ ఆయిల్ మిశ్రమం కీటక నాశక చర్యను అత్యధికంగా గమనించడం జరిగింది (పరనగమ అండ్ మదువంతి, 2015).
విశిష్ట చర్యలు గల పదార్థాలు కలిగిన సహజ వనరులను ఉపయోగించి రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా కొత్త పురుగు మందు ఫార్ములేషన్స్‌ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజ్మేరి, దాల్చిన చెక్క, మెంతి ఎసెన్షియల్ ఆయిల్స్‌లోని టెర్పిన్స్ను ఉపయోగించి ఇకోస్మార్ట్ టెక్నాలజీస్ బొటానికల్పెస్టిసైడ్ ఫార్ములేషన్‌ని వృద్ధి చేస్తున్నారు. (గ్రెచెన్ పాలుచ్, 2010).
లవంగం, నల్లమిరియాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు, నట్మెగ్, నల్ల జీలకర్ర, పసుపు, ఎర్రకారం, జీలకర్ర, ఆకుపచ్చ యాలకులు, పొడులు మినుముల నిల్వ సమయంలో ఆశించే కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పురుగులను 100% చంపి మినుము గింజలను కాపాడాయి. లవంగం, నల్లమిరియాలు అధిక సమర్ధవంతంగా చంపాయి (మహది అండ్ రహమాన్, 2008).
దాల్చిన చెక్క ఆకుల నుండి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ కుందేళ్ళనాశించే మేంజినల్లి, సోరోప్టెస్ కునికులిని సమర్ధవంతంగా చంపాయి. నల్లులాశించిన కుందేళ్ళపై ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణాన్ని పిచికారి చేసి నల్లులను సమర్ధవంతంగా నివారించవచ్చు (ఫిచి, అతని అనుచరులు, 2007).
ఫార్ములేషన్ తయారీ సిన్నమాల్డిహైడ్{అల్లిసిన్ (10%) – 30% నుండి 50% సోయాబీన్ ఆయిల్ – 50% నుండి 80% ఎమల్సిఫయర్ – 3% నుండి 12% ఆర్గానోఫిలిక్హెక్టొరైట్క్లే – 0.8% నుండి 2.0% ప్రొపిలిన్కార్బొనేట్ – 0.5% నుండి 3.0% నానఅయానిక్ సర్ఫెక్టంట్ – 0.5% నెండి 2.0%
నులి పురుగుల నివారణకు ఈ ఫార్ములేషన్‌ని భూమికి లేదా మొక్కల పై పిచికారి చేయాలి.
కెయొలిన్ పెల్లెట్స్‌ని దాల్చిన చెక్క (సిన్నమోమం జీలానికం) { సిట్రొనెల్లా (సింబోపోగాన్నార్డస్) ఆకుల ఎసెన్షియల్ ఆయిల్స్ మిశ్రమంతో శుద్ధి చేసి దీని ప్రభావాన్ని వరి ధాన్యం నిల్వపై పరీక్షించారు. ఈ మిశ్రమంలోని ప్రధాన రసాయనాలైన యూజినాల్, సిట్రొనెల్లాల్, జరానియాల్ సైటోఫిలస్ ఒరైజె పెద్ద పురుగుల సంఖ్యను 6 నెలల నిల్వ కాలమంతటా గణనీయంగా తగ్గించాయి (పరనగమ అండ్ మధువంతి, 2017).
దాల్చిన చెక్క (సిన్నమోమం జీలానికం) ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ (2.5 మి.లీ. 10% నుండి 0.03% వరకు పారాఫిన్ ఆయిల్లోకుందేళ్ళనాశించే మేంజి నల్లిప్సోరోప్టెస్ కునికులిపై వీటి ప్రభావాన్ని పరీక్షించారు. 24 గంటల తర్వాత 0.10-10% మధ్యగాఢతలో మంచి నల్లి నాశక చర్యను ప్రదర్శించాయి. కుందేళ్ళపై 0.16-10% మధ్య గాఢతలు కుందేళ్ళ నాశించిన నల్లులను సమర్ధవంతంగా నివారించాయి (ఫిచి, అతని అనుచరులు, 2007).
దాల్చిన చెక్క (సిన్నమోమంజీలానికం) బెరడు ఎసెన్షియల్ ఆయిల్ ప్రభావాన్ని మానవుల తలలో పేలు (పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటస్), వాటి గుడ్లపై పరీక్షించారు. ఎసెన్షియల్ ఆయిల్, దానిలోని మిశ్రమాలు మానవుల తలలోని పేలను నివారించే శక్తి కలిగి ఉన్నాయి (యాంగ్, అతని అనుచరులు, 2005).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
శనగ పంట సాధారణంగా తక్కువ నీటితో సాగు చేయగలిగినప్పటికీ పూత మరియు కాయల అభివృద్ధి దశల్లో ఏర్పడే తేమ లోటు దిగుబడిపై గణనీయంగా ప్రభావాన్ని చూపుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఈ క్రింది చర్యలను చేపట్టాలి.
నేల తేమ సంరక్షణ
పొలంలో అందుబాటులో ఉన్న వర్షపు నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కట్టలను బలోపేతం చేయాలి.
కలుపు మొక్కలను తొలగించి నేలలోని తేమను పంటలకు అందుబాటులో ఉంచాలి.
పంట అవశేషాలతో మల్చింగ్ చేయడం ద్వారా నేల నుండి నీటి ఆవిరిని తగ్గించాలి.
అవసరానికి తగ్గట్టుగా అంతరకృషి చేసి నేల తేమను సంరక్షించాలి.
పంట దశను బట్టి చర్యలు
ఎ) విత్తిన తర్వాత 30 రోజులు:
మొలకలు సక్రమంగా వచ్చినట్లు పరిశీలించాలి.
ఖాళీ ప్రదేశాలలో అవసరమైతే మొక్కలను భర్తీ చెయ్యాలి.
ప్రారంభ దశలో కలుపు నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలి.
బి) 30-45 రోజులు:
నేల తేమను కాపాడాలి. అవసరమైతే ఒక నీటి తడిని కొమ్మలు వేసే దశలో ఇవ్వాలి.
కలుపు పోటీని పూర్తిగా తగ్గించాలి.
పంట ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ పురుగు, తెగుళ్ళను పర్యవేక్షించాలి.
సి) పూత దశ (45-60 రోజులు):
ఇది శనగలో అత్యంత కీలకమైన దశ.
నీటి వనరులు అందుబాటులో ఉంటే ఒక జీవనాధార తడిని ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
నీరు అందుబాటులో లేనప్పుడు నేల తేమ సంరక్షణ మరియు మొక్కలపై పైపాటుగా పోషక నిర్వహణపై దృష్టి సారించాలి. శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి.
డి) కాయల అభివృద్ధి దశః
కాయ తొలుచు పురుగు మరియు ఇతర పురుగు, తెగుళ్లను క్రమం తప్పకుండా గమనించాలి. నివారణ చర్యలు చేపట్టాలి.
ఫోలియర్ పోషక నిర్వహణ
తీవ్రమైన తేమ ఒత్తిడి ఉన్నప్పుడు వేర్ల ద్వారా పోషకాల సంగ్రహణం తగ్గవచ్చు. ఈ దశలో శాస్త్రవేత్తల సలహాల మేరకు ఆకుల ద్వారా పోషకాలను అందించడం వలన పోషకాలను త్వరితగతిన మొక్కలకు అందించవచ్చు.
రైతులకు ముఖ్య సందేశం నేల తేమను కాపాడండి – కలుపును నియంత్రించండి. పూత దశలో నీటికి ప్రాధాన్యత ఇవ్వండి – కాయల దశను రక్షించండి పురుగు, తెగుళ్లను పర్యవేక్షించండి.
ఎస్. నీలిమ, జె. మంజునాథ్, బి.హెచ్. చైతన్య, వి. జయలక్ష్మీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, నంద్యాల. ఫోన్: 8247444303
వేపాకు – 2 కి., కానుగ – 2 కి., పాలకొడిశ – 2 కి., యూకలిప్టస్ – 2 కి., లాంటానా – 2 కి., పిచ్చితులసి – 2 కి., పుదీనా – అరకిలో, కొత్తిమీర – అరకిలో, విషముష్టి – అరకిలో, నేలవేము – అరకిలో, సీతాఫలం – అరకిలో. వీటిలో ఏవైనా 5 రకాల ఆకులను 10 లీ. నీటిలో వేసి అరగంట నుండి గంటసేపు బాగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన కషాయం 5 లీ. వరకు ఉంటుంది. దీనిని బాగా చల్లార్చి వడపోసి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు కాయ రసం కలిపి తర్వాత 100 లీ. నీటిలో కలిపి ఎకరా పొలంలో పిచికారి చేయాలి.
పంచపత్ర కషాయం వాడిన 5 రోజుల తర్వాత పశువుల పేడ – మూత్రం ద్రావణం పిచికారి చేయాలి. దీని తయారీకి 5 కి. పేడ, 5 లీ. మూత్రం 5 లీ. నీటికి కలిపి తొట్టెలో నిల్వ చేసి 4 రోజులు మురగబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజూ కర్రతో కలియ తిప్ప్రాలి. 4 రోజుల తర్వాత కొంచెం నీరు కలిపి వడపోసి 150 గ్రా. సున్నం కలపాలి. ఈ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరం పొలంలో పిచికారి చేయాలి.
ఎండలు ముదురుతున్న కొద్దీ మనుషులకే కాదు, పశువులు-కోళ్లకు కూడా వేడి ఒత్తిడి పెరుగుతుంది. దీనికి తోడు మేత, తాగునీటి లభ్యత తగ్గితే పశువుల ఆరోగ్యం, పాలు, మాంస ఉత్పత్తి, కోళ్లలో గుడ్లు, మాంస ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం రండి.
మన పశువులు ఎంత వేడిని తట్టుకోగలవు? • సంకర జాతి (క్రాస్‌బ్రీడ్) ఆవులు: 27°C వరకు మాత్రమే హాయిగా ఉంటాయి • మన దేశీ ఆవులు (ఒంగోలు లాంటివి): 33°C వరకు తట్టుకుంటాయి • గేదెలు: 36°C వరకు తట్టుకుంటాయి అంటే ఒంగోలు, పుంగనూరు లాంటి మన స్థానిక జాతులు ఎండను ఎక్కువగా తట్టుకుంటాయి. అందుకే వీటిని పూర్తిగా వదిలేయకుండా పెంచుకోవడం మంచిది.
ఉష్ణ ఒత్తిడి (ఎండదెబ్బ/ వేసవితాపం) – గుర్తించడం, వెంటనే చేయాల్సినవి లక్షణాలు: మేత మానేయడం, నోరు తెరిచి రొప్పుతూ ఊపిరి తీయడం, నాలుక వేలాడేసి చొంగ కార్చడం, పాలు దిగుబడి తగ్గడం, పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోవడాన్ని మనం చూడవచ్చును. చిన్న దూడలు, చూడి పశువులు, గేదెలపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
వెంటనే చేయాల్సినవి: • జ్వరం తగ్గించే మందులు ఈ సమయమునందు ఉపయోగపడవు – చల్లటి నీళ్లతోనే చికిత్స. • తడి గోనె సంచి లేదా గుడ్డను పశువు శరీరంపై కప్పి, తరచూ చల్లటి నీటితో తడపాలి. • ఫ్యాన్/స్ప్రింక్లర్లను ప్రతి అరగంటకోసారి 5 నుండి 10 నిమిషాలు వేయడం మంచిది. • ఎలక్ట్రోలైట్ ద్రావణాన్ని పశువులకి తాగించాలి. ఇంటి వద్దనే ఎలక్ట్రోలైట్ ద్రావణం తయారి: పెద్ద పశువులకు, 20 లీటర్ల నీళ్లలో 160 గ్రా ఉప్పు + పొటాషియం క్లోరైడ్ 20 గ్రా (4 స్పూన్లు) + కాల్షియం క్లోరైడ్ 10 గ్రా + ప్రొపైలిన్ గ్లైకాల్ 300 మి.లీ కలిపి తాగించాలి. • పశువు యొక్క ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణిస్తే పశువైద్యుడిని వెంటనే సంప్రదించాలి.
షెడ్డు మరియు నీళ్ల ఏర్పాట్లు • పైకప్పుకు తెల్ల సున్నం వేస్తే లోపలి వేడి 2°C వరకు తగ్గుతుంది – చాలా చౌక ఉపాయం. • షెడ్డు గోడలకు తడి గోనె సంచులు కట్టి రోజుకు 3-5 సార్లు తడపాలి. • వరిగడ్డి లేదా కొబ్బరాకులతో పైకప్పు కప్పితే వేడి తగ్గుతుంది. • ప్రతి పశువుకు రోజుకు 40 నుండి 60 లీటర్ల నీళ్లు కావాలి – నీళ్ల తొట్టెలు నీడలో పెట్టాలి. • మేతకు ఉదయం 6 – 11, సాయంత్రం 4 – 6 గంటల మధ్యే పంపాలి. మధ్యాహ్నం షెడ్డులోనే ఉంచాలి.
గ్రాసం మరియు దాణా ఏర్పాట్లు కరువును తట్టుకునే మేత రకాలు (APBN-1, CO-4, CO-5, తెలంగాణ జొన్న CSV-41 వంటివి) ఇప్పుడే వేసుకోవాలి.
మిగిలిన మేతను నిల్వ చేసుకునే 2 పద్ధతులు:
సైలేజి (మాగుడు గడ్డి): పచ్చిమేతను చిన్న ముక్కలుగా కోసి, గాలి చొరబడకుండా గుంతలో లేదా సైలేజ్ బంకర్లో బాగా నొక్కి కుదించి, పైభాగాన్ని ప్లాస్టిక్ లేదా టార్పాలిన్‌తో గట్టిగా మూసివేయాలి. సుమారు 3 నుండి 4 వారాలు పులియబెట్టిన తర్వాత సైలేజ్‌గా ఉపయోగించుకోవచ్చు. గాలి, నీరు లోపలికి చొరబడకుండా చూడటం మంచి నాణ్యమైన సైలేజ్‌కు అత్యంత ముఖ్యం.
యూరియా గడ్డి: 100 కిలోల వరిగడ్డికి 4 కిలోల యూరియా 50 నుండి 60 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి, గాలి తగలకుండా 3 వారాలు మూసి ఉంచాలి. మేత దొరకనప్పుడు: వేరుశనగ పొట్టు, పత్తి లేదా మొక్కజొన్న కాడలు, రావి-మర్రి-మామిడి-వేప ఆకులు, కూరగాయల మార్కెట్ వ్యర్థాలు వాడుకోవచ్చు.
రైతులు మర్చిపోకూడని విషయం – పునరుత్పత్తి ఎండ వేడికి ఆవులు/గేదెల్లో ఎద లక్షణాలు సరిగ్గా కనిపించవు (సైలెంట్ హీట్), గర్భం ఆలస్యమవుతుంది, పదే పదే కట్టు సూది వేయించినా కట్టు నిలవదు (రిపీట్ బ్రీడింగ్). దీనికి పరిష్కారాలు: • రోజుకు 2 సార్లు (తెల్లవారుజామున, సాయంత్రం) ఎద లక్షణాల కోసం పశువును జాగ్రత్తగా గమనించాలి. • పదేపదే ఎదకు వచ్చినా గర్భం దాల్చని పశువులను పశువైద్యుడితో పరీక్షించించి, ఆయన సూచన మేరకు PGF2 వంటి హార్మోన్ చికిత్సను చేయించాలి. • పశువు ఈనిన తేదీ, మరలా కట్టిన తేదీ వంటి ముఖ్యమైన వివరాలను రాసి పెట్టుకోవాలి.
వ్యాధులు మరియు పురుగుల నియంత్రణ వేసవికాలంలో గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు వంటి వ్యాధుల ముప్పు పెరిగే అవకాశం ఉన్నందున, పశువులకు అవసరమైన టీకాలను పశువైద్యుల సూచన మేరకు సకాలంలో వేయించాలి.
కాలేయ పురుగులు, గోమార్లు, పేలు వంటి పరాన్నజీవుల నియంత్రణకై: • దవడ కింద వాపు, కళ్లు లేదా చిగుళ్లు తెల్లగా కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. • పశువైద్యుల సూచన లేకుండా ఒకే రకం డీవార్మింగ్ మందును పదేపదే ఉపయోగించకూడదు. • పశువుల పేడ, మురుగునీరు షెడ్ పరిసరాల్లో నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
కోళ్ల పెంపకందారులకు జాగ్రత్తలు కోళ్లకు చెమట గ్రంథులు ఉండవు కాబట్టి వేసవి వేడిని తట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేసవిలో నీటి అవసరం 3 నుండి 4 రెట్లు పెరిగే అవకాశం ఉన్నందున, ఎప్పుడూ చల్లటి, పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ట్యాంకులో వేడెక్కిన నీటిని ముందుగా తొలగించి కొత్త నీరు పెట్టాలి. ఈ వేసవి సమయంలో కోళ్లు తగినంత నీరు తాగేలా 0.2% ఉప్పు కలిపిన నీటిని అందించవచ్చు. • షెడ్ పైకప్పుకు సున్నం పూత వేయడం, తడి గోనె సంచులు ఏర్పాటు చేయడం ద్వారా లోపలి వేడిని తగ్గించాలి. • వేడి తక్కువగా ఉండే సమయాల్లోనే మేతను అందించడం మంచిది; ముఖ్యంగా తెల్లవారుజామున 4-5 గంటల మధ్య, రాత్రి 12-1 గంటల మధ్య మేత ఇవ్వవచ్చు. • ఇంటి వద్ద దాణా తయారు చేసేటప్పుడు 5 భాగాల మొక్కజొన్న + 2 భాగాల జొన్న/సజ్జలు + 2 భాగాల వేరుశనగ/సోయా పిండి + గుడ్డు పెంకుల పొడి మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. • వేసవి కాలంలో షెడ్లోని కోళ్ల సంఖ్యను సుమారు 10% తగ్గించి, వాటికి తగినంత స్థలం కల్పించాలి. • న్యూకాజిల్ (రాణిఖేత్), గంబోరో వంటి వ్యాధులకు సంబంధించిన టీకాలను నిర్ణీత సమయంలో వేయించాలి.
ప్రభుత్వ పథకాల సాయం • జాతీయ పశుసంపద మిషన్ (NLM): పశుగ్రాస యూనిట్లు, సైలేజ్/హే యూనిట్లకు 50% సబ్సిడీ (గరిష్టం రూ.50 లక్షలు) కోసం ఈ nlm.udyamimitra.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. • అన్నదాత సుఖీభవ పథకం: అర్హులైన రైతు కుటుంబాలకు ఏటా ఈ పధకం ద్వారా ఆర్థిక సాయం. దీన్ని మేత కొనుగోలు, షెడ్డు మరమ్మతులకు వాడుకోవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు
పశువులకు తగినంత నీరు తరచుగా అందించాలి.
నీడ, గాలి ప్రసరణ ఉండేలా చూడటం మరియు తడి గోనె సంచులతో వేడి తగ్గించడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి ఉంచాలి.
ముందుగానే మేత పండించి, అవసరమైనంత నిల్వ చేసుకోవాలి. తీవ్ర ఎండలో పశువులను కట్టివేయడం మానివేయ్యాలి. ఎద లక్షణాలను జాగ్రతగా గమనించుకోవాలి.
కోళ్లకు చల్లటి నీరు, అవసరమైన ఎలక్ట్రోలైట్లు అందించి వేడి ఒత్తిడిని తగ్గించాలి.
నష్టభయంతో పశువులను తొందరపడి అమ్మకుండా, ప్రభుత్వ సహాయ పథకాలను వినియోగించుకోవాలి. స్థానిక పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ అధికారుల సలహాలు తీసుకుంటూ ఈ జాగ్రత్తలు పాటిస్తే మన పశు సంపదపై ఎల్‌నినో ప్రభావాన్ని బాగా తగ్గించుకోవచ్చు.
డా. జి. మిథున్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (CTF), పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్యా విభాగము, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల, గరివిడి. మొబైల్: 7799804000.
కర్పూరం 3-5 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక వృక్షం. లేత ఆకులు ఎర్రగా ఉంటాయి. ముదిరిన కొద్దీ ఆకులు పచ్చగా మారతాయి. పసుపుపచ్చ పూలు సువాసన కలిగి ఉంటాయి. కాయలు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదివిత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ మొక్కలోని ఆకులు, కొమ్మలు, వేర్లు, ఇతర భాగాల నుండి వెలికి తీయబడు పదార్థాన్నే కర్పూరం అంటారు.
సాధారణ నామం క్యాంఫర్‌ట్రీ / పచ్చ కర్పూరం / కర్పూర్ శాస్త్రీయ నామం సిన్నమోమం కాంఫొర కుటుంబం: లారేసి²
ఉపయోగాలు : ఔషధ రంగంలో …
ఆకులు, కొమ్మలు, వేర్లు, చెక్క ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఆవిరయ్యేనూనె, కాంఫర్, శాప్రోల్, యూజినాల్, టర్పినియోల్, సిన్నమిక్ ఆల్డిహైడ్, కౌమారిన్ అనబడు రసాయనాలు ఉంటాయి.
దీనిని జ్వరాలు, కురుపులు, పొంగులు, కోరింతదగ్గు, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు నివారించుటకు ఉపయోగిస్తారు.
ఈ మొక్క నుంచి తయారు చేసిన కర్పూరాన్ని హారతి ఇచ్చుటకు, చర్మ సమస్యలకు కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో
కర్పూరం మొక్క ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ సిగరెట్ బీటిల్, లాసియోడెర్మా సెర్రికోర్నె పై బలమైన ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యలను ప్రదర్శించింది. ఈ ఎసెన్షియల్ ఆయిల్లో డిక్యామ్ఫర్ (40.54%), వినలూల్ (22.92%), సినియోల్ (11.26%), 3, 7, 11 ట్రైమిథైల3హైడ్రాక్సి6, 10డోడికాడియెన1ఐలఎసిటేట్ (4.50%) ఉంటాయి. సిన్నమోమం క్యామ్ఫర్ ఎసెన్షియల్ ఆయిల్, దాని రసాయనాలను లాసియోడెర్మా సెర్రికార్నె నివారణకు సహజ ఫ్యూమిగెంట్స్ మరియు కీటకనాశనులుగా వృద్ధి చేయవచ్చు (చెన్, అతని అనుచరులు, 2014).
కర్పూరం మొక్క ఎసెన్షియల్ ఆయిల్లో 36.61% క్యామ్ఫర్ మరియు 30.05% సినియోల్ ఉంటాయి. కర్పూర్ ఎసెన్షియల్ ఆయిల్ రెడ్ ఇంపోర్టెడ్ ఎర్రచీమ (ఆరఐయఫఎ) మైనర్ మరియు మేజర్ వర్కర్స్‌పై ఫ్యూమిగెంట్ విషచర్యను, బలమైన వికర్షక చర్యను ప్రదర్శించాయి. (ఫు, అతని అనుచరులు, 2015).
సిన్నమోమం జీలానికిం ఎసెన్షియల్ ఆయిల్ మరియు నానోఎమల్షన్ మీల్‌వర్మ్, ఆల్ఫిటోబియస్ డయాపెరినస్‌ని నివారించాయి (వోల్పటొ, అతని అనుచరులు, 2016).
ఆర్టెమిసియా ప్రిన్సెప్స్ ఆకులు, సిన్నమోమం క్యాంఫొరా గింజల నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్స్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు, సైటోఫిలస్ ఒరైజె, బ్రూకస్ రూజిమానస్‌లపై మంచి వికర్షక చర్యలను ప్రదర్శించాయి. కాని వాటి మిశ్రమం (1:1) అత్యధిక వికర్షక చర్యను ప్రదర్శించింది (లియు, అతని అనుచరులు, 2005). ఈ రెండు ఆయిల్స్‌ని విడివిడిగా ఉపయోగించినపుడు గోధుమ విత్తనాల మొలక శాతాన్ని తగ్గించాయి. కాని రెండింటిని కలిపి ఉపయోగించినపుడు మొలకశాతం పెరిగింది.
రసాయన ఎరువులు, పురుగు మందులనుపయోగిస్తే ఆహార గొలుసులో విషపూరిత అవశేషాలు, జీవ అసమతుల్యత, వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు రావచ్చు. వృక్ష సంబంధ పురుగు మందులను రసాయన పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడితే ఈ సమస్యలను అదిగమించవచ్చు. పేనుబంక ఆశించిన గ్రీన్ ఆల్ఫాల్ఫ నారు మొక్కలను మలైఫాస్ మరియు సహజ ఆయిల్ ద్రావణాల (ఒరిగానో, తైమ్.వేప, కానుగ, కర్పూర్, తేయాకు చెట్టు)తో శుద్ధి చేసినపుడు పేనుబంక పురుగులు నివారింపబడ్డాయి (కస్పిమి, అతని అనుచరులు, 2016).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.