కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.
పురుగు మందుల వాడకం పెరగడం వల్ల అంతరించిపోతన్న గొల్లభామ (మిడత) అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కనిపించింది. దీని శాస్త్రీయనామం మాంటెడ అని.. దాని ముందరి కాళ్లు ప్రార్థన చేస్తున్నట్లు ఉండటంతో ‘ప్రేయింగ్ మాంటిస’ అని పిలుస్తారని అనకాపల్లి వ్యవసాయ సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు. పంటలకు చీడపీడలు కలిగించే పురుగులను తినడం ద్వారా పరోక్షంగా అన్నదాతలకు సాయపడతాయన్నారు. గొల్లభామలు సాధారణంగా పచ్ౘ్రంగులో ఉంటాయని, ఇవి మాత్రం పరిసరాలు ఎలా ఉంటే ఆ రంగులో కలిసిపోతాయన్నారు.
ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.
పురుగుల మందుల, ఎరువుల వాడకాన్ని తగ్గే విధంగా 'ఏఐ' సాంకేతికతను వినియోగించాలి
తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్ లా కాకూడదు
నాణ్యమైన ఉత్పత్తులు తీసే విధంగా తెలంగాణ వ్యవసాయ విధానములో సమూలంగా మార్పులు తెచ్చే దిశలో యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం
శాటిలైట్ డేటాతో నేలలో పోషకాల లభ్యతను పరీక్షించే సాంకేతికతను వివరించిన జర్మనీ ప్రతినిధులు
నేడు సెక్రటేరియట్‌లో ACRAT ప్రతినిధులతో సమావేశమై చర్చించిన మంత్రి తుమ్మల డిజిటల్ అగ్రికల్చర్‌తో తెలంగాణ వ్యవసాయరంగంలో నూతన ఒరవడి తేవాలని, పర్యావరణానికి మేలు చేసే స్మార్ట్ వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయంలో జర్మనీకి చెందిన ACRAT ప్రతినిధులతో జరిగిన సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు ”డిజిటల్ అగ్రికల్చర్ తెలంగాణ రోడ్‌మ్యాప్” పత్రాన్ని మంత్రివర్యులకు అందజేశారు. మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ.. AI, IoT ఆధారిత డిజిటల్ వ్యవసాయ సేవలతో ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించాలి. పంజాబ్‌లా మరో క్యాన్సర్ బెల్ట్‌గా తెలంగాణ మారకూడదు. నేల ఆరోగ్యాన్ని కాపాడే, రైతు ఆదాయాన్ని పెంచే, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయం మన లక్ష్యం కావాలి” అన్నారు. జర్మనీ – భారత్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ప్రపంచంలోని తొలి ITU ప్రమాణిత డిజిటల్ వ్యవసాయ యూజ్‌కేస్‌ను వేములవాడలో విజయవంతంగా అమలు చేసినట్లు ప్రతినిధులు వివరించారు. ఉపగ్రహ, డ్రోన్, మరియు సెన్సర్ ఆధారిత ఈ మోడల్ ద్వారా నేలలోని N,P,K మరియు సూక్ష్మ పోషకాల లభ్యత విశ్లేషణ చేసి, అవసరమైన ఎరువుల పరిమాణాన్ని మాత్రమే సిఫారసు చేస్తున్నామని, AI ఆధారిత పంట గుర్తింపు మోడల్, ఉపగ్రహ డేటాతో సబ్సిడీలు, బీమా, రుణాల పారదర్శక పంపిణీ వంటి అంశాలను కూడా మంత్రికి వివరించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ ప్లాట్‌ఫార్మ్‌ను రూపొందించి, రైతులు, పరిశోధకులు మరియు విద్యార్థులు, అందరూ ఉపయోగించుకోగల వేదికగా అభివృద్ధి చేయాలని మంత్రి గారు సూచించారు. ”ఈ సాంకేతికత రైతుల వ్యయాన్ని తగ్గించేలా, నేల ఆరోగ్యాన్ని కాపాడేలా మరియు పంట నాణ్యతను పెంచేలా ఉండాలన్నారు. ”రైతు ఆలోచన దిశగా వ్యవసాయ విధానాలు రూపకల్పన చేస్తేనే స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది” అని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డా. గోపి డైరెక్టర్, వ్యవసాయ శాఖ, డా రఘు చాలిగంటి (ITU-T SG20), డా. సెబాస్టియన్ బోసె (ఫ్రాన్హోఫర్ హెచెచ్ఐ), శ్రీ యాన్-క్రిస్టియన్ రెడ్‌లిచ్ (బాండ్ కన్సల్టింగ్ GmbH), ప్రొఫెసర్ జానయ్య గారు (వైస్ ఛాన్సలర్, పీజేటీఎస్‌ఏయూ), మరియు రమేశ్ రెడ్డి (చైర్మన్, పర్యాటక శాఖ) పాల్గొన్నారు.
రసాయన ఎరువులు- మందులు వినియోగించకుండా.. సహజ పద్ధతుల్లో సేద్యంతో పర్యావరణానికి, రైతులకు, ఆయా ఉత్పత్తుల వినియోగంతో ప్రజలకూ ప్రయోజనం కలుగుతుందని గుర్తించిన విజయవాడకు చెందిన వైద్య దంపతులు డాక్టర్ చదలవాడ సుధ, డాక్టర్ నాగేశ్వరరావులు ఈ విధానాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు తమవంతు సేవలు అందించాలని, 11 ఏళ్ల క్రితం ఏపీలోని నూజివీడు సమీప కొండపర్వ గ్రామంలో శ్రీపద్మావతి వేంకటేశ్వర ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అక్కడ 38 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా వేర్వేరు పంటలు పండిస్తున్నారు. రసాయనాలు విని యోగించకుండా సాగుచేయడం, ప్రకృతి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై శాస్త్రవేత్తలతో పరిశోధనలు చేయిస్తున్నారు. దేశవిదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందుకు సాగుతున్నారు. విషపూరిత రసాయనాలతో వ్యవసాయం చేయకూడదన్న ప్రధాన లక్ష్యంతో ఈ దంపతులు మూడేళ్ల క్రితం ఫౌండేషన్‌కు అనుబంధంగా కృష్ణసుధా అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీని స్థాపించారు. కొండపర్వలోనే అకాడమీ కార్యకలాపాలు ప్రారంభించి పరిశోధనలకు అత్యాధునిక ప్రయోగశా లను అందుబాటులోకి తెచ్చారు. ”సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై పరిశోధనలకు, రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఇప్పటివరకు సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ రీసెర్చ్, ఆగ్రో ఫారెస్ట్రీ, ట్రీ-హబ్, స్విట్జర్లాండ్‌లోని ది రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ సంస్థలతో.. సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాం” అని చదలవాడ సుధ తెలిపారు. శిక్షణ కోసం 85002 83300 నంబరులో సంప్రదించాలని సూచించారు. https://Krishnasudha academy.org / లోనూ సంప్రదించవచ్చు.
ఉద్యానపంటలు, కూరగాయలు, ఆకుకూరల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో నానో బయోటెక్నాలజీతో పోషక విలువలు పెంచవచ్చని, అధిక దిగుబడి సాధించవచ్చని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, బయోఫాక్టర్ సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులకు నానో బయోటెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిచయం చేసి కూరగాయలు పండించారు. ఆయా కూరగాయల మొక్కలకు 40 శాతం పోషకాలు పెరగడంతోపాటు 15శాతం అధికంగా దిగుబడి వచ్చింది. ఈ ప్రయోగ ఫలితాలను ధ్రువీకరించేందుకు ఇక్రిశాట్‌లోనిని వరల్డ్ వెజిటెబుల్ సెంటర్ ఆసియా శాఖకు తాజాగా హెచ్‌సీయూ, బయోఫాక్టర్ ప్రతినిధులు నమూనాలు పంపించారు. ధ్రువీకరణ లభించిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని రైతులను సేంద్రీయ సాగు వైపు ప్రోత్సహించనున్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని ఉద్యాన పంటల్లో 20-30 శాతం తగ్గించేందుకు హెచ్ సీయూ ఆచార్యులు డా. దివాకర్‌దాస్, బయోఫాక్టర్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. సేంద్రీయ సాగులో ఫాలియర్ పిచికారీతో మొక్కలకు పోషకాలు అందుతాయి. పంటల ఉత్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో కూరగాయలు రుచి పెరుగుతుంది. నానో బయోటెక్నాలజీ పరిజ్ఞానంపై మూడేళ్లపాటు హెచ్‌సీయూ విద్యార్థులు, బయోఫాక్టర్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. భవిష్యత్తులో కోళ్ల పరిశ్రమ, మత్స్యసంపద పరిరక్షణపై పరిశోధనలు చేసే అవకాశాలున్నాయి. నానో బయోటెక్నాలజీ ఆకుకూరలు, కాయగూరలపై ప్రయోగించడం ద్వారా ఉద్యానపంటలకు ప్రయోజనం. యూరియా, రసాయన ఎరువులు వినియోగించినప్పుడు వర్షాలు కురిస్తే మొక్కలకు అవి ఎక్కువగా అందవు. భూమిలోకి వెళ్తాయి. నానోటెక్నాలజీతో నేరుగా మొక్కల్లోకే పోషకాలు వెళ్తాయి. రైతులకు ఈ సాంకేతికతో రైతులకు ప్రయోజనకరం కలుగుతుందని డా.శ్రీనివాసరెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ఇక్రిశాట్ అన్నారు. ఉద్యాన పంటల్లో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, పిచికారీ మందులను వినియోగిస్తున్నందువలన రసాయన అవశేషాలు మన శరీరంలోకి వెళ్తున్నాయి. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించాలి. ఇందుకు నానో బయోటెక్నాలజీ అవసరం. తద్వారా భూసారం పెరుగుతుంది. ప్రస్తుతం పొలాల్లో ఎక్కడా కనిపించని వానపాములు ఉనికి పెరుగుతుందని డాక్టర్ లక్ష్మీనారాయణరెడ్డి, సీఈవో, బయోఫాక్టర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎండీఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, కిచెన్ గార్డెన్, బీఆర్సీ సెంటర్ వంటి నమూనాలను కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో ఏఎన్ఆర్ఎయూ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సీటీ, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సోమవారం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే 9 రకాల సార్వతిక సూత్రాలను శాస్త్రవేత్తలకు చూపించారు.
వినూత్న రీతిలో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. పంట కాలువల్లో విపరీతంగా పెరిగే ఈ గుర్రపు డెక్కతో సాగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఏళ్లుగా అన్నదాతలను పట్టిపీడిస్తున్న సమస్యల్లో ఇదొకటి. మరోవైపు, గుర్రపుడెక్క తొలగింపునకు ప్రభుత్వం ఏటా భారీగా ఖర్చు చేస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకు పశ్చిమగోదావరి కలెక్టర్ చదలవాడ నాగరాణి వినూత్నంగా ఆలోచించారు. ‘గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీకి శ్రీకారం చుట్టారు. డీఆర్‌డిఏ పీడీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆకివీడు మండలం సిద్ధాపురంలోని సంపద తయారీ కేంద్రంలో కుండీల్లో గుర్రపుడెక్కతో సేంద్రియ ఎరువు తయారీని ప్రయోగాత్మంగా చేపట్టారు. ఫలితంగా అన్నదాతల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు.. మహిళల ఉపాధికి అవకాశం ఏర్పడినట్లైంది. గుర్రపు డెక్క ముక్కలు, ఆవుపేడ, మైక్రోబియల్ కల్చర్‌తో ఇలా చేశారు. 3-9 అడుగుల కుండీల్లో కింద గడ్డిని పొరగా వేసి, ఆపైన ముక్కలుగా చేసిన గుర్రపుడెక్క, దానిపైన రెండు అంగుళాల మందంలో ఆవుపేడను ఏడు నుంచి ఎనిమిది పొరలుగా వేశారు. 21 రోజుల పాటు అలా వదిలేశారు. అనంతరం మైక్రోబయల్ కల్చర్‌ను వాడి త్వరగా కంపోస్టింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా చేశారు. ఆ మిశ్రమాన్ని ఏడు వారాల తర్వాత గుళికలుగా తయారుచేశారు. ఎరువు తయారీ ప్రాంతాన్ని క్రిమికీటకాలు ఆకర్షించే ప్రమాదం ఉండడంతో ఇళ్లకు, గోదాములకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు.*నాణ్యమైన సేంద్రియ ఎరువు… తక్కువ సమయంలో…* గుర్రపుడెక్క ఎరువు సాధారణ సేంద్రియ ఎరువు కంటే రెండు నుంచి మూడు రెట్లు నాణ్యంగా ఉన్నట్లు ప్రయోగ పరీక్షల్లో తేలింది. ఈ తీగ కుళ్లడానికి తక్కువ సమయం పడుతోంది. పశువుల వ్యర్థాల కన్నా ఇందులో నత్రజని, భాస్వరం, పొటాషియం, సేంద్రియ కర్బనం, కాపర్, మాంగనీస్, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ సేంద్రియ ఎరువు 6 నెలలపాటు నిల్వ ఉంటుంది. మిద్దె పంటలు, కొబ్బరి, మామిడి, సపోటా, కూరగాయలు, ఆయిల్‌పామ్, పూలమొక్కలు, కూరగాయలు, వరి, ఉద్యాన పంటలన్నింటికీ గుర్రపుడెక్కతో తయారుచేసిన ఎరువును ఉపయోగించుకోవచ్చు.*స్వయం ఉపాధి మార్గం* ఎరువు తయారీని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో ఆర్థికాభివృద్ధి సాధించడంతో పాటు రైతులకు తక్కువ ధరకే నాణ్యమైన సేంద్రియ ఎరువు దొరుకుతోంది. గుర్రపుడెక్కతో తయారుచేసిన సేంద్రియ ఎరువు ధర కిలో రూ.12 నుంచి రూ.15గా, టన్ను రూ.12 వేలుగా నిర్ణయించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పటికే 100 యూనిట్లు నెలకొల్పేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎరువు తయారు కావడానికి ఒక్కో యూనిట్లో 20 మందికి 50 రోజుల పాటు ఉపాధి లభిస్తుంది. దీనిని రైతులే స్వయంగా తయారు చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.