కావలసిన పదార్థాలు పశువుల పేడ : 1 కిలో పశువుల మూత్రం : 1 లీటరు వేప ఆకులు, కానుగ ఆకులు, జిల్లేడు ఆకులు : 1 కిలో (ఒక్కొక్కటి) బెల్లం : 50 గ్రా.
తయారు చేసే విధానం : ఒక కుండ తీసుకొని పైన చెప్పిన చెట్ల ఆకులన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి కుండలో వేసి దానికి పశువుల పేడ, మూత్రం కలిపి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుండను బట్టతో కప్పి ఉంచి వారం రోజుల పాటు నీడలో ఉంచాలి. వారం రోజుల తరువాత దానిలోని మిశ్రమాన్ని వడపోసి దానికి నీటిని కలిపి పంటపై పిచికారి చేసుకోవాలి.
చిన్న మొక్కలకు ఒక భాగం మిశ్రమానికి 60-70 రెట్ల నీటిని కలిపి, పెద్ద మొక్కలకైతే 30-40 రెట్ల నీటిని కలిపి పిచికారి చేసుకోవాలి.
ఈ కషాయాన్ని విత్తనశుద్ధికి కూడా ఉపయోగించవచ్చు.
పురుగులను, తెగుళ్ళను నివారించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
చెదలు సమస్యగా ఉన్నచోట మ్యాజిక్ కంపోస్టు తయారీలో ఆముదం లేదా సీతాఫలం ఆకులు కలిపి తయారు చెయ్యాలి.
పంటల ఎదుగుదలకు మిశ్రమం : పశువుల పేడ : 100 కిలోలు పశువుల మూత్రం : 100 లీటర్లు వేరుశనగ చెక్క (పిండి) : 100 కిలోలు
పై మూడు పదార్థాలను ఒక పాలిథిన్ పట్టాపై వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక ఎకరం పొలానికి సరిపోతుంది. మిశ్రమాన్ని పొలంలో సమంగా పడేలా చల్లుకోవాలి. దీనిని వాడటం వలన పంటలకు కావలసిన పోషక పదార్థాలు లభించి పంటలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. దీనిని అన్ని పంటలలోనూ వాడుకోవచ్చు.
నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.
కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.
కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :
పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
నీరు – 1350-1400 లీ. కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.
పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.
కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.
ఏకవార్షిక లేదా బహువార్షిక మొక్క. ఇది ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది. అనేక ప్రదేశాలలో కలుపు మొక్కగా పెరుగుతుంది. ఉత్తరేణి నిలువుగా 2 మీ. ఎత్తు వరకు పెరిగే మొక్క. దీని కాండం మొదలులో కొయ్యలా తయారవుతుంది. ఆకులు చిన్నకాడలు కలిగి పైవైపు ముదురు ఆకుపచ్చ రంగులోను, క్రిందివైపు లేత ఆకుపచ్చ రంగులోను ఉంటాయి. ఆకులు గుడ్డు ఆకారంలో ఉంటాయి. పూవులు చిన్నవిగా, ఆకుపచ్చ, తెలుపు రంగులో ఉంటాయి. పూలు పెరిగిన కొద్దీ క్రిందికి వంగి కాండానికి దగ్గరగా వత్తుకుంటాయి. కాయలు పదునైన మొనలతో నారింజ రంగు నుండి ఎరుపు ఊదారంగులో ఉంటాయి.
సాధారణ నామం : చాఫ్ ఫ్లవర్ శాస్త్రీయ నామం : అకిరాంథస్ ఆస్పెర కుటుంబం: అమరాంతేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
వినాయక చవితి రోజు జరిపే గణేశ వ్రత పూజలో ఉపయోగించే 21 ఆకులలోఇది ఒకటి. ఈ మొక్క రసాన్ని గోడకు వేసే సున్నంలో ఒక ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు.
ఉత్తరేణి భారతీయ సంస్కృతిలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. దీనిని పూర్వకాలం నుండి ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ప్రజలు దీనిని గర్భస్రావానికి మందుగా ఉపయోగించేవారు.
ఉత్తరేణిని పశువుల వైద్యంలో కూడా ఉపయోగిస్తారు. ఆస్త్మా, దురదలు, హిస్టీరియా, చర్మవ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు.
వేర్లను క్యాన్సర్, గాల్‌బ్లాడర్‌లో రాళ్ళు ఏర్పడినప్పుడు చికిత్సకు ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
ఉత్తరేణి ఇథైల్ ఎసిటేట్ ద్రావణం వంగ పంట నాశించి తీవ్ర నష్టం కలిగించే అక్షింతల పురుగు, హెనోసెపిలాక్నా విజింటియాక్టోపంక్టేటపై అత్యధిక యాంటిఫీడెంట్, కీటకనాశక చర్యలను ప్రదర్శించింది (జయశంకర్, అతని అనుచరులు, 2013).
తంగేడు, గన్నేరు, ఉమ్మెత్త, ఈశ్వర వేరు, అరిస్టొలోకియా బ్రాక్టియేట, అడవి ఆముదం (జట్రోఫాకర్కాస్), వేప, ఐలాంతాస్ ఎక్సెల్సా,తుమ్మి (ల్యూకాస్ ఆస్పెరా), జిల్లేడు ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన సహజ హెర్బల్ పురుగు మందు పంటలలో పురుగులు, తెగుళ్ళను నివారిస్తుంది. ఈ హెర్బల్ మొక్కలన్నిటినీ ఎండబెట్టి పొడిచేసి ఆవుపేడ, ఆవు మూత్రంతో కలిపి 20 రోజులు పులియబెట్టాలి. 1 లీ. పులిసిన ద్రావణాన్ని 20 లీ. నీటిలో కలిపి పంటలపై పిచికారి చేయాలి. దీనినుపయోగించడం వలన మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.
సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.
బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.
నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.
అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.
బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు
నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు : బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుతుంది.
నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల : బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా పరీక్షించాలి.
నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల : బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది.
బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది : బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure) బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction) నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం
(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.
కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration) బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.
జాగ్రత్తలు
నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి
సిఫార్సు మోతాదు
ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.
డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258
విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.
పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు బయోచార్ (జీవబొగ్గు) విధానాన్ని అమలు చేయాలని కొండాలక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు దహనం జరుగుతున్న నేపథ్యంలో.. వ్యవసాయానుబంధ శాఖలు, వర్సిటీలతో అధ్యయనం చేయించి, నివేదిక సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి తమ శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. పంట వ్యర్థాలతో రూపొందించే బయోచార్ విధానం దీనికి సరైన పరిష్కారమని చర్చించారు. పొలంలో గొయ్యి తీసి దానిలో పంట వ్యర్థాలను వేసి దహనం చేసి బొగ్గుగా మార్చి ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీనిపై హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో బయోచార్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించారు.
పంట వ్యర్థాలు… నేలకు జీవం. పొలంలో కలిపితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. పంట దిగుబడులూ పెరుగుతాయి. తగలబెడితే నేలకు నష్టం, భూమి వేడెక్కుతుంది. అందులోని సూక్ష్మజీవులూ చనిపోతాయి. పైగా కాలుష్యం మరో అతి పెద్ద సమస్య. టన్ను వరి గడ్డిని నేలలో కలిపేస్తే… 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం, 1.2 కిలోల గంధకంతోపాటు సేంద్రియ కర్బనం లభిస్తుంది. టన్ను మొక్కజొన్న గడ్డిలో 9.16 కిలోల నత్రజని, 2.08 కిలోల ఫాస్పరస్, 15.78 కిలోల పొటాషియంతోపాటు 5.17 కిలోల కాల్షియం, 3.62 కిలోల మెగ్నీషియం, 1.54 కిలోల సల్ఫర్ ఉంటుంది.
గతంలో వరి కోతల తర్వాత నూర్పిడి చేసి గడ్డిని పశువుల మేతగా ఉపయోగించేవారు.. మిరప, పత్తి, కంది తదితర పంటలు వ్యర్థాల్ని మండెలుగా పేర్చి వంట చెరకుగా వినియోగించేవారు. ఇప్పుడు అధికశాతం రైతులు యంత్రాలతోనే వరి కోయిస్తున్నారు. ఎల్పీజీ అందుబాటులోకి రావడంతో వంట చెరకు అవసరమూ తగ్గిపోయింది. దీంతో పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేస్తుండటంతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోంది. మొక్కజొన్న గడ్డి తగలబెట్టే సమయంలో మంటలు అంటుకుని నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తెలంగాణలోని హన్మ కొండ, ఏపీలోని పల్నాడు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి. వ్యర్థాల్ని కాల్ౘ్డం కంటే నేలలో కలిపి దున్నేయడం వల్ల పంట దిగుబడులు పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది.
మొక్కజొన్న సాగు బాగా పెరిగింది దేశంలో ఏటా 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% వాటా.. వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలకు సంబంధించినవే. ఒక్క వరి పంట వ్యర్థాలే 34% ఉన్నాయి.. ఈ ఏడాది రబీలో ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 12.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకు 4.2 టన్నుల నుంచి 6.2 టన్నుల పంట వ్యర్థాలు వస్తాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున చూసినా.. ఒక్క మొక్కజొన్న నుంచే 62.75 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తాయి. తెలంగాణలోనూ 2024 సంవత్సరంతో పోలిస్తే 5 లక్షల ఎకరాలు పెరిగింది. రబీలో 17.72 లక్షల ఎకరాల్లో సాగైంది. పంట వ్యర్థాల్ని బయోమాస్ ప్లాంట్లకు తరలించవచ్చు. బయోచార్, ఇతర ఉత్పత్తులకు వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.
చాలా నష్టం
నేల పైభాగం నుంచి 15 సెం.మీ. లోతు వరకు వేర్లు అభివృద్ధి చెందుతాయి. అక్కడుండే నత్రజని, కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఈ పోషకాలు తగ్గిపోతాయి. మొక్క ఎదుగుదలపై ప్రభావం పడుతుంది.
పంట వ్యర్థాల్ని తగలబెడితే.. అందులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రసఆక్సైడ్, ఇతర హైడ్రోకార్బన్లు అందులో ఉంటాయి.
వరిగడ్డిని కాల్ౘ్ివేస్తే అందులో 70% కార్బన్‌డైఆక్సైడ్, 7% కార్బన్ మోనాక్సైడ్, 0.66% మీథేన్ విడుదలవుతాయి. గడ్డిలోని నత్రజని నైట్రస్ ఆక్సైడ్‌గా వెలువడుతుంది.
పొగ నుంచి వెలువడే కాలుష్యం ద్వారా క్యాన్సర్ కారకాలు వెలువడుతున్నాయని అనుమానిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ప్రోత్సాహం తప్పనిసరి
2021 సంవత్సరంలో ఏర్పాటైన ‘వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ కాలుష్య నివారణకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక లక్ష్యాలతో సమగ్ర విధానాన్ని పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో చిన్న, సన్నకారు రైతులకు పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను ఉచితంగా అందుబాటులో ఉంచాలని గతేడాది ఈ కమిషన్ ఆదేశించింది.
విద్యుత్ కేంద్రాలు పంట వ్యర్థాలతో చేసిన గుళికలను కనీసం 5% వాడాలని స్పష్టం చేసింది. అలా చేయ కుంటే.. అవి ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ విద్యుత్తుపై పర్యావరణ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
మరోవైపు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేసే ఘటనలను కేంద్రం ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ ద్వారా పర్యవేక్షిస్తోంది. పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను రాయితీ ద్వారా అన్నదాతలకు అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పంట వ్యర్థాల నిర్వహణపై రైతులను చైత న్యపరచాలి. పలు ప్రోత్సాహకాలు అందిస్తే వారు మొగ్గుచూపుతారు.
ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ రైతు మునగాల ద్వారకానాథ రెడ్డికి చెందిన 17 ఎకరాల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి శాఖల మంత్రి లోకేశ్ సందర్శించారు. 17 ఎకరాల్లో సమీకృత పండ్ల తోటలు, నాటుకోళ్లు, పొట్టేళ్లు, చేపల పెంపకం చేపడుతూ స్థిరమైన ఆదాయం ఆర్ౙిస్తున్న రైతు కుటుంబాన్ని ఆయన అభినందించారు. సేంద్రియ పద్ధతిలో పండిన మామిడి పండ్లను మంత్రి రుచి చూశారు.
2030 నాటికి రసాయన ఎరువుల్లో తప్పనిసరిగా 10% పులియబెట్టిన సేంద్రియ ఎరువుల (ఎఫ్ఓఎం)ను కలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ (ఐబీఏ) పిలుపునిచ్చింది. ఇందువల్ల ఏటా ఎరువుల దిగుమతులపై 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు) ఆదా చేయొచ్చని పేర్కొంది. ‘ఎఫ్ఎం నేలకు పోషణనిస్తుంది ఇందువల్ల సుస్థిరతకు నేల పోషణనిస్తుంది’ అనే శ్వేతపత్రాన్ని ఐబీఏ సమర్పించింది. కేంద్ర కొత్త, పునరుత్పాదక ఇంధన కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారని ఐబీఏ తెలిపింది. దేశంలో క్షీణిస్తున్న నేల సారాన్ని పునరుద్ధరించడానికి, సుస్థిర వ్యవసాయం వైపు పరివర్తనను వేగవంతం చేయడానికి సూచనలు చేసినట్లు వివరించింది. 2030 నాటికి రసాయన ఎరువుల్లో ఎఫఎంను 10% మేర కలపడాన్ని దశల వారీగా సాదించాలని శ్వేతప్రతం ప్రతిపాదించింది. 2026-27లో 1%, 2027-28లో 3%, 2028-29లో 5%, మేర ఎఫఎఎంను రసాయన ఎరువుల్లో కలపడం తప్పనిసరి చేసి, 2030కి 10 శాతానికి చేర్చాలని ప్రతిపాదించింది. బయోగ్యాస్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి ఎఫఎంను సమీకరించాలని తెలిపింది.
నేల ఆరోగ్యం ఉద్యాన పంటల ద్వారానే పరిరక్షించబడుతుంది. కాబట్టి తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానవన పంటలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో ‘నేల ఆరోగ్య పరిరక్షణ- ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మృత్తిక శాస్త్రవేత్త, ఐకార్ ప్రదర్శన శాస్త్రవేత్త బ్రజేంద్ర పర్మార్ ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.