శీకాయ దాదాపు 10-12 మీ. ఎత్తు వరకు పెరిగే బలమైన ముళ్ళతో కూడిన బహువార్షిక తీగ. కొమ్మలు గోధుమరంగులో వుండి, తెల్లని మచ్చలతో కూడి ఉంటుంది. పుష్పాలు చిన్నగా, కాయలు చిన్న కాడతో పలుచగా, బల్లపరుపుగా ఉండి 6-15 గింజలు కలిగి ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.
సాధారణ నామం : సోప్‌నట్ అకేసియా, శీకాకాయ శాస్త్రీయ నామం : అకేసియా కాన్సిన్నా కుటుంబం: మైమోసేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
కాయలు, బెరడు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. బెరడులో సపానిన్, కాయలో అకేసిన్ అనే రసాయనాలుంటాయి. బెరడును ఉబ్బసవ్యాధి నివారణకు, సబ్బులు మరియు షాంపూల తయారీలో ఉపయోగిస్తారు. మూత్రాన్ని సులువుగా జారీ చేయుటకు, క్రిమిసంహారిణిగా, రక్తస్రావాన్ని అరికట్టుటకు, కుష్టు, బొల్లి వంటి చర్మవ్యాధుల నివారణలో ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలను అతికించడానికి కట్టే కట్టులో, పొడి చేసిన కాయలను సబ్బులకు బదులుగాను ఉపయోగించవచ్చు.
వ్యవసాయరంగంలో …
శీకాయ గింజల మిథనాల్ ద్రావణం మరియు గింజల, ఆకుల ఇథైల్ ఎసిటేట్ ద్రావణాలు హైబ్లేయ ప్యూరియాని అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయలు నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులపై వికర్షక చర్యను ప్రదర్శించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2000).
అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రైస్‌వీవిల్, సైటోఫిలసఒరైజె, మరియు రెడ్‌ఫ్లోర్‌బీటిల్, ట్రైబోలియం కాస్టానియంపై యాంటీఫీడెంట్ చర్యను ప్రదర్శించింది (క్వాద్రి, 1973). అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణాన్ని (2%, 5%) 40 రోజుల వరినారు మొక్కలపై పిచికారి చేస్తే సుడిదోమ, నీల పర్వత లూజెన్స్ గుడ్లు పెట్టడాన్ని తగ్గించింది (రెడ్డి అండ్ అర్స్, 1988)
అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం (50 పిపియం) పొగాకు లద్దెపురుగు, స్పోడోప్టెరా లిటూర లార్వాలను (85.2%) సమర్ధవంతంగా నివారించింది. ఇది సోయాబీన్ పంటనాశించే పొగాకు లద్దె పురుగు పర్యావరణహిత యాజమాన్యానికి సుస్థిర పరిష్కార మివ్వగలదు (పాటిల్ అండ్ చావన్, 2010).
శీకాయ (అకేసియా కాన్సిన్నా) కాయ ఇథనాల్ ద్రావణం (సాపోనిన్ కలిగి ఉన్నవి)తో శుద్ధి చేసిన ఫేసియోలస్ అకానిటిఫోలియస్ గింజలపై కొల్లసోబ్రూకస్ కైనెన్సిస్ గుడ్లు పెట్టడాన్ని, గింజల నుండి వెలువడే పెద్ద పురుగులను గణనీయంగా తగ్గించింది. శీకాయకాయల ఇథనాల్ ద్రావణం జీవపురుగు మందు లక్షణాలు కలిగి పల్స్‌బీటిల్‌ని సమర్ధవంతంగా నివారించగలదు (బజాద్ అండ్ పరదేశి, 2016).
అకేసియా కాన్సిన్నా గింజల మిథనాల్ మరియు ఇథైల్ అసిటేట్ ద్రావణాలు మరియు ఆకుల ఇథైల్ అసిటేట్ ద్రావణం టేకు ఆకులను తినే పురుగు హైబ్లీయప్యూరియా లార్వాలను అత్యంత సమర్ధవంతంగా 100% నివారించాయి (దీప అండ్ రెమాదేవి, 2011).
అకేసియా కాన్సిన్నా గింజల పొడి వరి ధాన్యాన్ని నిల్వ సమయంలో ఆశించే పురుగులను యాంటీఫీడెంట్ చర్య ద్వారా నివారించింది., అకేసియా కాన్సిన్నా క్రూడ్ ద్రావణం చెరకు పంటలో ముఖ్యపురుగైన సెరటోవాక్యునా లానిజెరాని ప్రయోగశాలలో మరియు క్షేత్ర ప్రయోగాలలో అత్యంత సమర్థవంతంగా నివారించింది (పాటిల్ అండ్ చవాన్, 2009).
అకేసియా కాన్సిన్నా గింజల ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానికస్ యుర్టికె జీవిత చక్రాన్ని పొడిగించి, అధిక మరణశాతాన్ని నమోదు చేసింది (ఎల్‌గెపలి, అతని అనుచరులు, 2016).
జీవామృతం తయారీకి కావాల్సిన పదార్థాలు (ఎకరం పొలానికి)
200 లీటర్ల నీరు (ఎకరానికి సరిపోతుంది)
10 కిలోల పేడ (నాటు ఆవు)
5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం
2 కిలోల బెల్లం (నల్లబెల్లం శ్రేష్టమైనది)
2 కిలోల పప్పుధాన్యాల పిండి (ఉదా: ఉలవ, అలసంద, కంది, మినప, పెసర పిండి, ఏదైనా లేక వీటిని కలిపైనా వాడొచ్చు)
పొలం గట్టు మట్టి…పిడికెడు
రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు చక్రాలు, వాటిలో జీవామృతం ఒకటి. మిగతావి… బీజామృతం, అచ్ఛాదన, నీటి యాజమాన్యం.
జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు, వానపాములు ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతాయి. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చైతన్యవంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు నేరుగా వినియోగించుకునే రూపంలోకి మార్చి అందించడంలో వానపాములు, సూక్ష్మజీవుల పాత్ర అసాధారణమైనది. మేలు చేసే కోటాను కోట్ల సూక్ష్మజీవులకు నిలయం పశువుల పేడ, మూత్రం. పేడ, మూత్రంతో పాటు బెల్లం, పప్పుల పిండి, నీటిని కలిపినప్పుడు పేడలోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకు రెట్టింపవుతుంది.
జీవామృతం తయారీ విధానం: ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి. పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు. పంటలపైన పిచికారీ చేయొచ్చు.
పంటలపై జీవామృతం పిచికారీ ఇలా… 3 నెలల్లో (60Ð90 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. రెండోసారి: (21 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (21 రోజుల తర్వాత) 200 లీ. నీటికి 20 లీ. జీవామృతంను కలిపి చల్లాలి. నాలుగోసారి: (గింజ ఏర్పడుతున్న దశలో) 200 లీ. నీటిలో 5 లీ. పుల్లమజ్జిగ కలిపి పిచికారీ చేయాలి (ఈసారి జీవామృతం అక్కర్లేదు). 6 నెలల్లో (150 నుంచి 180 రోజుల్లో) పూర్తయ్యే పంటలకు (ఎకరానికి): మొదటిసారి: (విత్తనం నాటిన నెలకు) 100 లీ. నీటికి 5 లీటర్లు జీవామృతం కలిపి చల్లాలి. రెండోసారి: (30 రోజుల తర్వాత) 150 లీ.నీటికి 10 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. మూడోసారి: (30 రోజుల తర్వాత) 200 లీటర్ల ‘నీమాస్త్రం’ను చల్లుకోవాలి. నాలుగోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి పిచికారీ చేయాలి. ఐదోసారి: (30 రోజుల తర్వాత) 200 లీ. నీటిలో 20 లీ. జీవామృతం కలిపి చల్లాలి. ఆరోసారి: (గింజ ఏర్పడుతున్నప్పుడు) 200 లీ. నీటిలో 6 లీ. పుల్లమజ్జిగ (ఈసారి జీవామృతం అక్కర్లేదు) కలిపి పిచికారీ చేయాలి. జీవామృతం, పంచగవ్య తదితరాల తయారీలో వాడే ఆవు పేడ ఎంత తాజాదైతే అంత మంచిది. వారం రోజుల వరకు పర్వాలేదు. మూత్రం మాత్రం ఎంత పాతదైతే అంత మేలు జరుగుతుంది.
ఆధునిక ప్రపంచంలో మానవులు, జంతువులు మరియు పర్యావరణం మధ్య సంబంధాలు మరింత పెరుగుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, అటవీ ప్రాంతాల తగ్గుదల, వాతావరణ మార్పులు మరియు జంతువులతో సన్నిహిత సంబంధాల కారణంగా జూనోటిక్ వ్యాధుల ప్రాముఖ్యత రోజురోజుకూ పెరుగుతోంది.
జంతువుల నుండి మనుషులకు లేదా మనుషుల నుండి జంతువులకు సహజంగా సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు (Zoonotic Diseases) లేదా సంక్రమిత వ్యాధులు అని అంటారు. “జూనోసిస్” అనే పదం గ్రీకు భాషలోని “Zoon” (జంతువు) మరియు “Nosos” (వ్యాధి) అనే పదాల నుండి వచ్చింది. ఈ వ్యాధులు వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు మరియు ఇతర సూక్ష్మజీవుల ద్వారా వ్యాపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం మానవుల్లో కనిపించే అంటువ్యాధులలో 60% కంటే ఎక్కువ జంతు మూలం కలిగినవే. కొత్తగా ఉద్భవించే అంటువ్యాధులలో సుమారు 75% జూనోటిక్ వ్యాధులే.
ప్రముఖ ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ 1885 జూలై 6న మొదటిసారిగా రేబీస్ వ్యాధికి వ్యతిరేకంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను విజయవంతంగా ఒక బాలుడికి అందించారు. రేబీస్ సోకిన కుక్క కాటుకు గురైన ఆ బాలుడు ఆ వ్యాక్సిన్ వల్ల ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఈ సంఘటన వైద్య శాస్త్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించడంలో టీకాల ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జంతువుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం.
జూనోటిక్ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి?
ప్రత్యక్ష సంపర్కం ద్వారా వ్యాధి సోకిన జంతువులను తాకడం, వాటి రక్తం, లాలాజలం, మూత్రం లేదా ఇతర శరీర స్రావాలతో సంపర్కంలోకి రావడం ద్వారా. ఉదాహరణ: రేబీస్, ఆంత్రాక్స్.
పరోక్ష సంపర్కం ద్వారా జంతువులు ఉపయోగించిన పరికరాలు, షెడ్లు, మేత పాత్రలు లేదా కలుషితమైన పరిసరాల ద్వారా.
ఆహారం ద్వారా సరిగా ఉడకని మాంసం, పాశ్చరైజ్ చేయని పాలు లేదా కలుషిత ఆహార పదార్థాల ద్వారా. ఉదాహరణ: బ్రూసెల్లోసిస్, సాల్మొనెల్లోసిస్.
నీటి ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులతో కలుషితమైన నీటిని ఉపయోగించడం వల్ల. ఉదాహరణ: లెప్టోస్పిరోసిస్.
వాహక కీటకాల ద్వారా దోమలు, పేలు, ఈగలు, టిక్స్ వంటి కీటకాల ద్వారా. ఉదాహరణ: కైసానూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD).
గాలి ద్వారా కొన్ని వ్యాధికారకాలు గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చు. ఉదాహరణ: బోవైన్ ట్యూబర్‌క్యులోసిస్.
జూనోసిస్ దినోత్సవం ప్రాముఖ్యత
జంతు-మానవ ఆరోగ్య సంబంధంపై అవగాహన కల్పించడం.
జూనోటిక్ వ్యాధుల నివారణ చర్యలను ప్రజలకు తెలియజేయడం.
పశువైద్యులు, వైద్యులు, ప్రజారోగ్య అధికారులు కలిసి పనిచేసే “వన్ హెల్త్ (One Health)” విధానాన్ని ప్రోత్సహించడం.
వ్యాధుల పర్యవేక్షణ, నివారణ మరియు నియంత్రణ కార్యక్రమాలను బలోపేతం చేయడం.
ఆహార భద్రత మరియు ప్రజారోగ్య పరిరక్షణకు తోడ్పడడం.
ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు
రేబీస్ (Rabies) లేదా పిచ్చికుక్కకాటు వ్యాధి కారకం – రేబీస్ వైరస్ / లిస్సా వైరస్ వ్యాప్తి – కుక్కలు, పిల్లులు, కోతులు, నక్కలు, గబ్బిలాలు వంటి జంతువుల కాటు ద్వారా మరియు లాలాజలం ద్వారా. • కుక్కలు, పిల్లులు మరియు ఇతర జంతువుల కాటు ద్వారా వ్యాపిస్తుంది. లక్షణాలు – జ్వరం, తలనొప్పి, నీటిని చూసి భయపడటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం నియంత్రణ • పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలి. • కాటు జరిగిన వెంటనే సబ్బు మరియు నీటితో గాయాన్ని 15 నిమిషాల పాటు కడగాలి. • వెంటనే టి.టి.ఇంజెక్షన్ వేయాలి. • యాంటీ రేబీస్ టీకా 0, 3, 7, 14, 28 మరియు 90 రోజు తప్పకుండా ఇప్పించాలి. • గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసి వుంచరాదు. సూర్య కాంతి తగిలేలా చూడాలి. • గాయం బాగా లోతుగా వున్నట్లైతే రేబీస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ తో పాటు యాంటీబయాటిక్ మందులు కూడా డాక్టరు సలహా మేరకు వాడాలి.
బ్రూసెల్లోసిస్ (Brucellosis) కారకం : బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా. వ్యాప్తి – కలుషిత పాలు, పాల ఉత్పత్తులు, గర్భస్రావం జరిగిన పశువుల స్రావాలతో సంపర్కం. లక్షణాలు – దీర్ఘకాలిక జ్వరం, కీళ్ల నొప్పులు మరియు బలహీనత నియంత్రణ – పాలను మరిగించి మాత్రమే త్రాగడం, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడం, ఈసుకుపోయిన పశువులను లేదా జీవాలను పరీక్షించేటప్పుడు మాస్కులను మరియు గ్లౌజులను వేసుకోవడం
లెప్టోస్పిరోసిస్ (Leptospirosis) కారకం – లెప్టోస్పైరా అనే బ్యాక్టీరియా. వ్యాప్తి – ఎలుకల మూత్రంతో కలుషితమైన నీరు, వరద నీటిలో నడవడం. లక్షణాలు – జ్వరం, కండరాల నొప్పులు, కళ్ళు ఎర్రబడటం మరియు మూత్రపిండాల సమస్యలు నియంత్రణ – నిల్వ నీటిలో నడిచేటప్పుడు బూట్లు ధరించడం, ఎలుకల నియంత్రణ చేపట్టడం మరియు పరిశుభ్రత పాటించడం.
ట్యూబర్‌క్యులోసిస్ / క్షయ వ్యాధి/ టి.బి. కారకం – మైకోబ్యాక్టీరియం బోవిస్ అనే బ్యాక్టీరియా వ్యాప్తి – కలుషిత పాలు త్రాగడం ద్వారా మరియు వ్యాధి సోకిన పశువుల దగ్గు ద్వారా. లక్షణాలు – దీర్ఘకాలిక దగ్గు, బరువు తగ్గడం మరియు అలసట నియంత్రణ – పాలను పాశ్చరైజ్ చేయడం ద్వారా, పశువులను క్రమం తప్పకుండా పరీక్షించడం ద్వారా మరియు బి.సి.జి.టీకాలు ఇప్పించడం ద్వారా
ఆంత్రాక్స్ (Anthrax) / దొమ్మ వ్యాధి కారకం – బేసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా. • పశువులు, గొర్రెలు, మేకలలో కనిపించే బ్యాక్టీరియా వ్యాధి. వ్యాప్తి – వ్యాధి సోకిన జంతువులతో సంపర్కం మరియు కలుషిత మాంసం లేదా చర్మం. లక్షణాలు – చర్మంపై నల్లటి పుండ్లు, జ్వరం మరియు శ్వాస సమస్యలు నియంత్రణ – పశువులకు టీకాలు వేయడం మరియు చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయాలి.
బర్డ్ ఫ్లూ (Avian Influenza) కారకం – ఇన్‌ఫ్లుయెంజా వైరస్. వ్యాప్తి – వ్యాధి సోకిన పక్షులతో ప్రత్యక్ష సంపర్కం, పక్షుల విసర్జనల ద్వారా. లక్షణాలు – జ్వరం, దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు నియంత్రణ – పౌల్ట్రీ ఫారాల్లో బయోసెక్యూరిటీ పాటించడం, అనారోగ్య పక్షులను వెంటనే వేరుచేయడం మరియు పక్షి ఉత్పత్తులను పూర్తిగా వండుకుని తినడం.
నిఫా వైరస్ వ్యాధి కారకం – నిఫా వైరస్. వ్యాప్తి – గబ్బిలాలు తాకిన పండ్లు, వ్యాధి సోకిన జంతువులు. లక్షణాలు – తీవ్రమైన జ్వరం, మెదడు వాపు మరియు శ్వాస సమస్యలు నియంత్రణ – గబ్బిలాలు తాకిన పండ్లు తినకూడదు మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
జూనోటిక్ వ్యాధుల నివారణచర్యలు
పశువులకు నిర్దిష్ట టీకాలు వేయించడం.
పశువుల షెడ్లలో పరిశుభ్రత పాటించడం.
పాలను మరిగించి లేదా పాశ్చరైజ్ చేసి వినియోగించడం.
మాంసాన్ని పూర్తిగా ఉడికించి తినడం.
చేతులను సబ్బుతో తరచుగా కడుక్కోవడం.
అనారోగ్య జంతువులను వెంటనే వేరుచేయడం.
చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వీర్యం చేయడం.
పశువులలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్య అధికారులను సంప్రదించాలి.
పందులను మానవ పరిసరాల నుండి దూరంగా ఉంచాలి.
ఎలుకలు పరిసరాల్లో లేకుండా చూడాలి.
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం
సురక్షిత ఆహారాన్ని తీసుకోవడం
జంతువులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం
మానవ ఆరోగ్యం, జంతు ఆరోగ్యం మరియు పర్యావరణ ఆరోగ్యం పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఈ మూడు రంగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే జూనోటిక్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించగలం. దీనినే “వన్ హెల్త్” విధానం అంటారు.
రైతులు, పశుపాలకులు, పశువైద్యులు మరియు సాధారణ ప్రజలు కలిసి పనిచేస్తేనే జూనోటిక్ వ్యాధుల నియంత్రణ సాధ్యమవుతుంది.
“జంతు ఆరోగ్యం – మానవ ఆరోగ్యానికి రక్షణ కవచం; జూనోసిస్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత.”
డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి. బి. ఆర్. ఐ., విజయవాడ. Phone: 9121000747
పరాగసంపర్కం అంటే పుప్పొడి రేణువులు మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాలలోని కీలాగ్రానికి బదిలీ కావడం. దీని ఫలితంగా ఫలదీకరణం జరిగి పండ్లు ఏర్పడుతాయి. ఆయిల్ పామ్ ఒక మోనోషియస్ పంట, అనగా ఒకే చెట్టుపై మగ మరియు ఆడ పుష్పగుచ్ఛాలు విడివిడిగా ఏర్పడటమే కాక, వేరు వేరు అభివృద్ధి దశలలో ఉంటాయి. కాబట్టి, కీలాగ్రం గ్రహణ స్థితిలో ఉన్నప్పుడు పుప్పొడి రేణువులు మగ పువ్వుల నుండి ఆడ పువ్వులకు సహజంగా బదిలీ కావు. ఈ తరుణంలో ఆయిల్ పామ్ లో పరాగసంపర్కం కొరకు వీవిల్, ఎలైడోబియస్ కామెరూనికస్ (Elaeidobius kamerunicus) అనే ఒక చిన్న కీటకం దోహదపడుతుంది. ఈ కీటకం పుప్పొడి రేణువులను మగ పుష్పగుచ్ఛాల నుండి ఆడ పుష్పగుచ్ఛాల కీలాగ్రానికి గ్రహణశీల దశలో ఉన్నపుడు తీసుకువెళుతుంది. ఐతే ఆడ పుష్పాల గ్రహణశీలత కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి, ఆయిల్ పామ్ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, ఏ తోటలోనైనా ఆయిల్ పామ్ పరాగసంపర్కం చేసే వీవిల్స్ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలి.
కొత్తగా స్థాపించబడిన తోటలలో విడుదల చేయడానికి, వీవిల్స్ తో కూడిన ఆయిల్ పామ్ మగ పుష్పగుచ్ఛాలను సేకరించడాన్ని సూచించే ఫ్లోచార్ట్
ఏదైనా తోటలో మొక్క బాల్య దశలో (రెండున్నర సంవత్సరాలు తర్వాత) పరాగసంపర్క వీవిల్స్ స్థిరపడితే పామాయిల్ తోట జీవితకాలం పాటు వాటి జనాభా స్వయంపోషకంగా కొనసాగుతుంది. అదేవిధముగా పెద్ద తోటలకు సమీపంలో (సుమారు 1 కి.మీ. దూరంలో) కొత్త తోట ఉంటే, వీవిల్స్ సహజంగానే వచ్చి స్థిరపడతాయి. ఐతే శత్రు జీవాలు అధికంగా ఉండటం లేదా పురుగు మందులు ఎక్కువుగా వాడటం వలన కూడా పరాగసంపర్క వీవిల్ సంఖ్య పడిపోతుంది. అటువంటి పరిస్థితులలో లేదా ఏదైనా పెద్ద తోట నుండి 2 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్న ఏకాంత తోటలకు మరియు రెండున్నర సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి, సహజంగా వీవిల్స్ జనాభా తక్కువగా ఉన్న (ఒక్కో మగ కంకెకు100-120 కంటే తక్కువ వీవిల్స్) తోటలలో వీవిల్స్ ను కృత్రిమంగా విడుదల చేయవలసిన అవసరం ఉంది.
కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేసే సాంకేతిక అంశాలు కావలసిన సామగ్రి: గుడ్డ సంచి, ప్లాస్టిక్ డబ్బా/కంటైనర్ (20 లీటర్ల సామర్థ్యం), పుష్ప గుచ్చాన్ని నరకడానికి కత్తి, హై-టెన్షన్ తాడు, డేటా రికార్డింగ్ షీట్, ఎయిర్ కండిషన్డ్ (28-30°C) వాహనం మరియు పరాగసంపర్క వీవిల్స్‌తో కూడిన మగ పుష్పగుచ్ఛం.
కొత్త తోటలలో పరాగసంపర్క వీవిల్స్‌ను విడుదల చేయడానికి కనీసం ఇద్దరు మనుషుల అవసరం ఉంటుంది. దాత తోటను మరియు గణనీయమైన పరాగసంపర్క పురుగులు ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గుర్తించడానికి, అలాగే గ్రహీత తోటలో విడుదల సమయం మరియు విడుదల ప్రదేశాలను నిర్ణయించడానికి ఒక పర్యవేక్షకుడు. గ్రహీత తోటకు పురుగులను విడుదల చేయడానికి, రవాణా చేయడానికి, ముందు మరియు తర్వాత పర్యవేక్షణ కోసం ఒక క్షేత్ర స్థాయి సాంకేతిక నిపుణుడు. రవాణా రోజున, ఉదయం వేళల్లో (8:00 – 10:30 గంటల మధ్య), దాత తోటలో పుష్పించిన రెండవ రోజున ఉన్న మగ పుష్పగుచ్ఛాన్ని గుర్తించి, అందులో ప్రతి కంకికి కనీసం 200 వీవిల్స్ ఉండేలా చూసుకోవాలి. పుష్పగుచ్ఛం యొక్క కాండం కనిపించేలా దాని అనుబంధ మట్టను కత్తిరించాలి. 10-15 నిమిషాల తర్వాత, కాండం వరకు వీవిల్స్ తో పాటు పుష్పగుచ్ఛాన్ని వేగంగా గుడ్డ సంచి కప్పి, ఒక తాడు సాయంతో సంచి మూతిని కాండంతో పాటు గట్టిగా కట్టాలి. తరువాత పుష్పగుచ్ఛం కాండం యొక్క అడుగు భాగాన్ని నరికి, సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో నిటారుగా జాగ్రత్తగా ఉంచాలి. సంచిలో ఉంచిన పుష్పగుచ్ఛంతో పాటు ప్లాస్టిక్ డబ్బాను జాగ్రత్తగా వాహనంలో ఎక్కించి, అదే రోజున వీవిల్స్ విడుదల చేసే తోటకి రవాణా చేయాలి.
మగ పుష్పగుచ్ఛంలో పుష్పించే దశలు A. పుష్పించే ముందు B. మొదటి రోజు C. రెండవ రోజు D. మూడవ రోజు
వీవిల్స్ విడుదల చేసే తోటలో కనీసం 10 శాతం చెట్లు ఆ వారం లో పూతకు సిద్ధంగా ఉన్న మగ పుష్పగుచ్ఛాలను కలిగి ఉండేలా చూసుకోవాలి. సులభంగా గుర్తించడానికి చెట్లకు/మగ పుష్పగుచ్ఛాలకు ట్యాగ్‌లు తగిలించాలి. స్వీకరించే తోటకు చేరుకున్న తర్వాత, వీవిల్స్ తో ఉన్న మగ పుష్పగుచ్ఛాలు గల డబ్బాను 20-30 నిమిషాల పాటు నీడలో ఉంచాలి. ఆ తర్వాత, ట్యాగ్ చేసిన ప్రతి విడుదల స్థానం లో, గుడ్డ సంచి మూతిని మెల్లగా తెరిచి, తట్టడం ద్వారా కొన్ని వీవిల్స్ సంచి నుండి బయటకు వచ్చేలా చేయాలి. పురుగులను పూర్తిగా విడుదల చేసిన తర్వాత, పుష్పగుచ్ఛం నుండి 3-4 కంకులను కత్తిరించి, తదుపరి తరం వీవిల్స్ విడుదల కోసం వాటిని మట్టల మొదలు వద్ద ఉంచాలి. తేదీ, సమయం, GPS కోఆర్డినేట్‌లు, విడుదల కోసం ఉపయోగించిన పుష్పగుచ్ఛాల సంఖ్య మొదలైన వివరాలను నమోదు చేయాలి.
ఈ విధంగా విడుదల చేసిన 15-20 రోజుల తర్వాత, వీవిల్స్ విడుదల చేసిన ప్రదేశాల సమీపంలోని పూత దశలో ఉన్న మగ పుష్పగుచ్ఛాలను గమనించాలి. ఆ పుష్పగుచ్ఛాలమీద వీవిల్స్ కదలిక ఉంటె అక్కడ స్థిరపడ్డాయని నిర్ధారించుకోవచ్చు. అదే విధంగా, మగ పుష్పగుచ్ఛాలపై వీవిల్స్ సంఖ్య నెలవారీగా పర్యవేక్షించాలి. ప్రతిసారి పురుగుల సంఖ్య పెరగడం, అవి తోటలో స్థిరపడ్డాయని నిర్ధారిస్తుంది. వీవిల్స్ సంఖ్య తక్కువగా ఉంటే (ప్రతి కంకికి 50 కంటే తక్కువ పురుగులు) విడుదల ప్రక్రియను పునరావృతం చేయండి. ఐతే ఈ పెరుగుదల వేసవి లేదా వర్షాకాలం లో తక్కువుగా ఉంటుంది.
గుర్తుంచుకోవలసిన విషయాలు • భారీ వర్షాలు లేదా తీవ్ర వేసవి కాలంలో వీవిల్స్ సేకరించడం, విడుదల చేయడం మరియు విడుదల తర్వాత పర్యవేక్షించడం వంటివి చేయకూడదు. శీతాకాలం ప్రారంభంలో విడుదల చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. • మగ పుష్పగుచ్ఛాలను ఉదయం వేళల్లో (8.00-10.30 గంటల మధ్య) సేకరించడం మంచిది మరియు అదే రోజున వీవిల్స్ విడుదల చేయడం ఉత్తమం. ఒక రోజు కంటే ఎక్కువ ఉండే ప్రయాణాలకు, సాపేక్ష ఆర్ద్రత మరియు ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ప్లాస్టిక్ డబ్బాను గోనె సంచితో అవసరాన్నిబట్టి మూసివేయవచ్చు. సుమారు 28-30°C ఉష్ణోగ్రత ఉన్న ఎయిర్ కండిషన్డ్ వాహనాన్ని ఉపయోగించాలి. • వీవిల్స్ సేకరించే సంచి లేదా ప్లాస్టిక్ కంటైనర్ లోపల అధిక సాపేక్ష ఆర్ద్రత లేదా నీటి బిందువులు ఏర్పడటం వల్ల వీవిల్స్ చనిపోతాయి. • వీవిల్స్ పై ఒత్తిడిని తగ్గించడానికి, వాటిని తెల్లవారుజామున (07:30-10:00 గంటల మధ్య) లేదా సాయంత్రం (15:00-17:00 గంటల మధ్య) విడుదల చేయాలి. • విడుదల చేసిన మొక్కల మధ్య మరియు చుట్టుపక్కల కనీసం రెండు నెలల పాటు రసాయన పురుగుమందులు వాడకూడదు. • రెండు నెలల తర్వాత కూడా తదుపరి పర్యవేక్షణలో వీవిల్స్ కనిపించకపోతే, వాటిని తిరిగి విడుదల చేయాలి. ఐతే వీవిల్స్ సంఖ్య తగ్గడానికి కారణాలు ఐనటువంటి, పురుగుమందుల వాడకం, తీవ్రమైన ఉష్ణోగ్రత లేదా ఇతర వాతావరణ పరిస్థితులు, మగ పుష్పగుచ్ఛాల కొరత, వేటాడే జీవుల (చీమలు, సాలీడులు, బల్లులు మొదలైనవి) వంటి వాటిని తనిఖీ చేసి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలి. • వీవిల్స్ సంఖ్య పెరుగుదలకు సాలీడు గూళ్లు ప్రధాన అవరోధంగా ఉండి వాటి ప్రత్యక్ష మరణానికి కారణమవుతాయి. అందువలన తోట నుండి అన్ని సాలీడు గూళ్లను తొలగించాలి. • వీవిల్స్ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ గెలలో పళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే, పోషకాల లోపం (ముఖ్యంగా బోరాన్) లేదా నీటి ఒత్తిడి వంటి ఇతర కారణాలను గుర్తించి, వాటిని సరి చేసుకోవాలి. • అధిక లింగ నిష్పత్తి (high sex ratio) గల తోటలలో (కేవలం ఆడ పుష్పగుచ్ఛాలను మాత్రమే ఉత్పత్తి చేసే చెట్లు) ఉన్న తోటలలో, మగ పుష్పగుచ్ఛాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి 10% చెట్లకు నీటిపారుదలని నిలిపివేయాలి. ఈ విధంగా చేయడం వలన ఆ చెట్లలో మగ పొత్తులు వేస్తాయి.
ఆడ పువ్వుల రంగు తెలుపు నుండి గులాబీ రంగులోకి మారడం ద్వారా వీవిల్స్ ద్వారా పరాగసంపర్కం జరిగిందని నిర్ధారించవచ్చు. అదేవిధంగా, ఒక గెలలో పండ్ల సంఖ్య పెరగడం అనేది, ఆ తోటలో వీవిల్స్ స్థిరపడ్డాయని సూచిస్తుంది.
ఏ ఆర్ ఎన్ ఎస్ సుబ్బన్న, సి హెచ్ గిరీష్, టి. ఫణి కుమార్ భా. వ్య. ప. మ. – భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ, పెదవేగి – 534435 ప్రీ యునిక్యూ (ఇండియా) Pvt Ltd, ప్లాట్ No. 26, గ్రీన్ ల్యాండ్ కాలనీ, మాధవ రెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ- 500032. Phone: 96391 75431, 7300788301
ఆధునిక వ్యవసాయంలో యాంత్రీకరణకు అత్యంత ప్రాధాన్యత ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ‘ఎర్త్‌కాన్ ఎక్స్‌పో-2026’ ఎక్సిబిషన్లో ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించిన మంత్రి తుమ్మల, స్టాల్‌లో ప్రదర్శించిన లోడర్, ఎక్సవేటర్ యంత్రాల పనితీరును స్వయంగా పరిశీలించి మాట్లాడుతూ, లోడర్, ఎక్సవేటర్ వంటి యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి యంత్రాలు రైతులకు పెద్ద ఎత్తున ఉపయుక్తమవుతాయని, తక్కువ సమయంలో వ్యవసాయ పనులను పూర్తి చేసుకునేందుకు తోడ్పడతాయని తెలిపారు. రైతులకు పొలంలో సులభంగా ఉపయోగపడే పోర్టబుల్ యంత్రాలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఎక్స్‌సీఏ (XCA) సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. వ్యవసాయ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ తరహా వినూత్న యంత్రాలకు మార్కెట్లో మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చితే 40 శాతం సబ్సిడీ ఈ యంత్రాలను వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చేర్చినట్లయితే రైతులకు 40 శాతం సబ్సిడీతో అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ యంత్రాలకు ప్రత్యామ్నాయంగా బ్యాటరీతో పనిచేసే నమూనాలను కూడా త్వరలో మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యాజమాన్యానికి సూచించారు. బ్యాటరీ ఆధారిత యంత్రాలు కనీసం 6 నుంచి 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసే విధంగా రూపకల్పన చేయాలని కోరగా, త్వరలోనే అలాంటి యంత్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
2027 నాటికి ఈవీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ లక్ష్యం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1.5 టన్నుల సామర్థ్యం గల మినీ హైడ్రాలిక్ ఎక్సవేటర్ ఈవీ మోడల్‌ను 2027 నాటికి మార్కెట్‌లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అలాగే వినియోగదారుల కోసం ప్రత్యేక డెమో జోన్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఇది దాదాపు 10 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. పత్రాలు సంయుక్తమై ఉంటాయి. పత్రకాలు దాదాపు 20 -40 వరకు వుండి దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. పుష్పాలు లేత గులాబి రంగులో గాని, తెల్లగా గాని ఉండి నారింజ పసుపు రంగులోకి మారతాయి. ఫలాలు చిన్న చిక్కుడు కాయల వలే ఉంటాయి. గింజలు అండాకారంలో కోలగా, ఎర్రగా లేదా తెల్లగా ఒక చివర నల్లని మచ్చ కలిగి ఉంటాయి. తెల్లపూలు వచ్చే తీగలకు గింజలు తెల్లగా ఉంటాయి, ఈ గింజలు ఫిబ్రవరి నుండి జూన్ వరకు లభిస్తాయి. గురివింద విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. పొదల మీద ప్రాకుతూ కన్పిస్తుంది.
సాధారణనామం : ఇండియన్ లిఖోరిస్ శాస్త్రీయ నామం: ఆబ్రస్ ప్రికటోరియస్ కుటుంబం: ఫాబేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
గింజలు, వేర్లు, ఆకులు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వేర్లు, ఆకులలో గ్లైకోరైజిన్ అనే రసాయనముంటుంది. గింజలలో యాబ్రిన్, ఇండోల్ అనే ఆల్కలాయిడ్లు, ఆంథోసయనిన్ ఉంటాయి. యాబ్రిన్ విషపూరితం.
గ్లైకోరైజిన్ కఫాన్ని తొలగించడమే గాకుండా వాపులను, అలర్జీలను తగ్గిస్తుంది. గురివింద గింజ విషతుల్యం. క్రిమిసంహారక, గర్భనిరోధక శక్తి కలిగి ఉంది. కేశ వృద్ధికరం.
ఆకులు, వేర్లు వీర్యవృద్ధికరం. మూత్ర విసర్జనకు, వాపులకు, గాయాలకు, ఉబ్బసం, బొల్లి తదితర చర్మవ్యాధులు, తీవ్ర దాహార్తి నివారణకు ఉపయోగపడుతుంది.
వేర్లను ఆవు పాలలో కలిపి మిశ్రమం తయారు చేసి అతిసారం మరియు రక్తవిరేచనాల నివారణకుపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
గురివింద ఆకులు, గింజల నీటి, మిథనాల్ ఆధారిత ద్రావణాలు కోపోటెర్మెస్ జెస్ట్రాయ్ మరణశాతాన్ని గణనీయంగా పెంచాయి (ప్రసాద్,అతని అనుచరులు, 2016)
గురివింద గింజలలోని అబ్రిన్ అనే రసాయనం పిండినల్లి, మాకోనెల్లికోకస్ హిర్సూటస్‌లో సుగర్స్ పరిమాణాన్ని తగ్గించింది. ప్రోటీన్ పరిమాణాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. సుగర్స్, ప్రోటీన్, లిపిడ్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా అబ్రిన్ పిండి నల్లుల సంఖ్యపై తీవ్ర ప్రభావాన్ని చూపింది (అనిత, ఆమె అనుచరులు, 1998).
గురివింద నీటి ద్రావణాన్ని వర్మ్స్ నివారణలో ఉపయోగిస్తారు. ఉగాండ రైతులు గురివింద ఆకులు, కాండాలను పురుగుల నివారణలో ఉపయోగిస్తారు (నువగచి, 2016)
గురివింద గింజ మిథనాల్ ద్రావణం రాల్‌స్టోనియా సొలనేసియారం, స్ట్రెప్టోమెసిస్ స్కాబీస్‌పై కన్నా పెక్టోబాక్టీరియం కరటోవోరంపై అధిక శక్తివంతమైన ప్రభావాన్ని చూపింది. గురివింద గింజలోని ఫ్లేవనాయిడ్స్, ఆల్కలాయిడ్స్, రెసిన్స్, ఫినాల్స్, గ్లైకోసైడ్స్, స్టిరాల్స్, ట్రైటెర్పిన్స్ యాంటి బాక్టీరియల్ ప్రభావాన్ని చూపించవచ్చు. ఇథైల్ ఎసిటేట్ఇథనాల్ మిశ్రమ (80:20) ద్రావణం స్ట్రెప్టోమైసిన్ స్కాబీస్‌పై అధిక శక్తివంతమైన ప్రభావాలను చూపుతుంది. గింజల ద్రావణంలో ఉన్న డై (2ఇథైల్ హెక్సైల్) ఫ్తాలేట్ స్ట్రెప్టోమైసిస్ స్కాబీస్‌పై అధిక బాక్టీరియా నాశక చర్యను ప్రదర్శించింది (అబ్బాసి, అతని అనుచరులు, 2016).
గురివింద గింజల నీటి ద్రావణం, ఇథైల్ ఆల్కహాల్ ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి, టెట్రానైకస్ ఉర్టికె పెద్ద ఆడ పురుగులను అత్యంత సమర్ధవంతంగా నివారించాయి. పెట్రోలియం ఈథర్ ద్రావణం గుడ్డు దశపై సమర్థవంతంగా పనిచేస్తుంది (అమర్, అతని అనుచరులు, 1989).
గురువింద ఆకులు, కాండాలు కీటకనాశక లక్షణాలు కలిగి వున్నాయి (ఓక్యుటె, 2012). గురువింద గింజల క్రూడ్ ద్రావణం ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. ఈ ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను కూడా అరికట్టింది (యాస్మిన్, ఆమె అనుచరులు, 2015).
గురివింద పెట్రోలియం ఈథర్ ద్రావణాలు మానవుల తలలోని పేలు, పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్‌ని సమర్ధవంతంగా నివారించాయి (ఉపాధ్యాయ్, అతని అనుచరులు, 2011).
గురివింద మిథనాల్ ద్రావణాలు స్పోడోప్టెరా లిటూర గుడ్లపై 100% గుడ్లనాశక చర్యను ప్రదర్శించాయి. మిథనాల్ ద్రావణం (500 పిపియం) గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (ఎలుమలైకుప్పుసామి, అతని అనుచరులు, 2015), బోడయ్య, అతని అనుచరులు, 2016).
ఈడిస్ ఈజిప్టి చికెన్‌గునియా, యెల్లో మరియు డెంగ్యు జ్వరాల ముఖ్య వాహకం. గురివింద గింజల ద్రావణం ఈడెస్ ఈజిప్టి లార్వాలపై అదిక లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది (అడెబాజొ, అతని అనుచరులు, 2014).
పర్యావరణానికి, వినియోగదారుల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగించని పద్థతుల్లో పంటల సాగు ఇప్పటి అవసరం. అంతేకాదు.. పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా కలిగిన అధిక దిగుబడులు సాధించాలి! రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలగాలి!! ఈ లక్ష్యాల సాధనకు రైతులకు దారి చూపేదే ‘అమృత మట్టి’తో పర్యావరణ అనుకూల (నేచ్యు-ఎకో) సేద్యం. సేంద్రియ సేద్యాన్ని మరో మెట్టుపైన నిలబెడుతుంది ఈ సేద్య పద్ధతి.
పర్యావరణానికి హాని లేకుండా, వినియోగదారుల ఆరోగ్యానికి మేలు చేకూర్చే విధంగా సాగు చేయటమే నేచ్యు-ఎకో పద్ధతి ప్రత్యేకత. ‘అమృత మట్టి’ ద్వారా ఈ పద్ధతిలో పండించిన ఆహారోత్పత్తుల్లో పోషకాల సాంద్రత చాలా ఎక్కువగా ఉందని పరీక్షల్లో నిరూపితమైంది. సంప్రదాయ (రసాయనిక) పద్ధతుల్లో పండించే కూరగాయలతో పోల్చితే అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయలు అధికంగా పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇవి ఐదు రెట్ల మాంసకృత్తులు, 20 శాతం కాల్షియంను అదనంగా కలిగి ఉంటాయి. సాధారణంగా మాంసాహారంలోనే లభించే విటమిన్ బి-12 ఉనికిని అమృతమట్టి ఉపయోగించి పండించిన కూరగాయల్లో కనుగొనడం విశేషం.
ఉత్పాదకాలను డబ్బు పోసి కొని వాడడానికి బదులుగా.. పొలాల చుట్టు పక్కల్లో లభించే వనరులను ఉపయోగించుకోవటం, సాగు భూమికి ఎలాంటి నష్టం జరగకుండా మంచి దిగుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ పద్ధతికి రూపకల్పన చేశారు ప్రొఫెసర్ శ్రీపాద్ ఎ.దబోల్కర్.
అమృతమట్టిని ఉపయోగించి… భూమిలో జీవన ద్రవ్యం, సేంద్రియ కర్బనాలను పెంచటం ద్వారా రసాయనిక వ్యవసాయంలో కన్నా తొలి ఏడాదే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని ప్రొ. దబోల్కర్ నిరూపించారు. చీడ పీడల బారి నుంచి పంటలను రక్షించుకునేందుకు దబోల్కర్ వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనిక కీటక నాశనులు, క్రిమి సంహారకాల పిచికారీ అవసరం లేదు. పోషకాలను అందించేందుకు రసాయనిక ఎరువులను వాడాల్సినవసరం లేదు. పొలం అంతటా మట్టి పరుపులను (రైజ్డ్ బెడ్స్) తయారుచేసుకుని అమృత జలాన్ని, అమృత మట్టిని వినియోగించి పంటలు పండిస్తారు.
అమృతమట్టి తయారుచేసే పద్ధతి…. అమృతమట్టి తయారీ వివిధ దశలతో కూడుకున్న ప్రక్రియ. దీనికోసం ముందుగా అమృత జలాన్ని తయారు చేసుకోవాలి.
అమృత జలం తయారీ విధానం: ఒక లీటరు గోమూత్రం, ఒక కిలో తాజా ఆవు పేడ, 50 గ్రా.బెల్లాన్ని, 10 లీటర్ల నీటిని ఒక తొట్టెలో కలపాలి. మూడు రోజులు నిల్వ ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు మూడుసార్లు కలపాలి. మూడురోజుల తర్వాత పదిపాళ్లు నీటికి ఒక పాలు అమృత జలాన్ని కలిపి పంటలకు వాడుకోవచ్చు.
అమృతమట్టి తయారీ విధానం: తగినంత అమృత జలం పోసిన పాత్రలో పచ్చి, ఎండిన ఆకులు కలిపి వేసి 24 గంటలపాటు ఉంచాలి. బెడ్‌ల తయారీ: 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు ఉండేలా బెడ్‌ను నిర్మించుకోవాలి. బెడ్‌లో మె°దటి పొరగా ఆకులు నానబెట్టిన అమృత జలాన్ని పోయాలి. దీనిపైన నేలపై పొర నుంచి సేకరించిన మట్టిని ముందు నేలపై పొరలాగా పరవాలి. దీనిపైన మళ్లీ అమృత జలాన్ని పోయటం, పైన మట్టిని పరవటం ఇలా… బెడ్‌ను పొరలు పొరలుగా పేర్చుకుంటూ రావాలి. తర్వాత పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన కల్పించాలి. ప్రతి వారం రోజులకు బెడ్‌లో ఉన్న కంపోస్టును కలపాలి. సూక్ష్మజీవుల చర్యలు జరిపేందుకు తగినంత తేమ ఉండేలా అమృత జలంతో బెడ్‌ను తడుపుతుండాలి. ఈ మిశ్రమం పూర్తిస్థాయి కంపోస్టుగా మారేందుకు 30 రోజుల సమయం పడుతుంది.
విభిన్న రకాల పంటలకు చెందిన విత్తనాలను ఎంచుకొని బెడ్‌పై నాటుకోవాలి. ఎంపిక చేసుకున్న విత్తనాలను అమృత జలంలో ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత బెడ్‌లోఉన్న కంపోస్టుపై విత్తుకోవాలి. విత్తిన తర్వాత ఆకులతో ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పై అమృత జలాన్ని పిచికారీ చేయటం ద్వారా విత్తనాలు మొలకెత్తేందుకు అవసరమైన తేమను అందించాలి.
21 రోజుల పాటు ఇలా చేయటం ద్వారా అన్ని విత్తనాలు మొలకెత్తేలా చూడాలి. ఆ తరువాత వివిధ దశల్లో పెరిగే మొక్కలకు కత్తిరింపులు చేపట్టాలి. మొలకెత్తిన 21 రోజులకు మొక్కల్లో పావు వంతు భాగాన్ని కత్తిరించాలి. 42వ రోజు రెండోసారి, 63వ రోజు పూత దశలో మూడోసారి కత్తిరించాలి. మూడో కత్తిరింపులో బెడ్‌పైన మొక్కలను అర అంగుళం వదిలి పైభాగం మొత్తం కత్తిరించాలి. ఇలా కత్తిరించిన భాగాలను అమృత జలంలో 8 గంటలు నానబెట్టి అమృత మట్టిలో కలపాలి. బెడ్స్‌పైన ఆచ్ఛాదన కల్పించాలి. బెడ్‌పైన అలా తయారైన కంపోస్టును వారానికి ఒకసారి కలపాలి. నాలుగు వారాలపాటు ఇలా చేస్తే… అమృత మట్టి సిద్ధమైనట్టే.
ఓ అరకిలో సేంద్రీయ టొమాటో పండ్లను – కాస్తా దోర పండ్లు అయితే మంచిది – తీసుకుని, శుభ్రమైన గుడ్డతో తుడిచి, చిన్న ముక్కలుగా కోసి, తగినంత ఉప్పు కారం పసుపు వేసి కలుపుకోవాలి.
తగినన్ని ఆవాలు, జీలకర్ర రోట్లో వేసి మెత్తగా నూరి, టొమాటో ముక్కలకు కలపాలి. తగినన్ని వెల్లుల్లి పాయలు కూడా కచ్చా పచ్చాగా దంచి టొమాటో ముక్కల్లో కలపాలి.
ఉప్పు కారం తగినంత ఉన్నదీ లేనిదీ చూసుకుని, అవసరాన్ని బట్టి చేర్చుకోవాలి. అందుకని ముందుగానే టొమాటో ముక్కల మోతాదును బట్టి, కొంత తక్కువ ఉప్పూ, కారం, కలుపుకోవాలి.
ఈ ఉప్పు కూడా రాక్ సాల్ట్ అయితే ఉత్తమం. అలాగే కారం కూడా సేంద్రీయ వ్యవసాయ మిరపకాయల కారం అయితే బాగుంటుంది.
టొమాటో ముక్కల్లో అన్నిటినీ కలిపి, స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెలో కానీ, పింగాణీ గిన్నెలో కానీ వేసుకోవాలి. రోజుకు రెండు సార్లు నెమ్మదిగా గరిటెతో కలుపుకోవాలి. తరువాత తగిన సీసాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం అవసరం లేదు.
ఇంకా అదనంగా ఏమైనా పదార్థాలను చేర్చాలని అనుకునే వారు చేర్చుకోవచ్చు. అల్లం ఇంగువ వగైరా. వేడి వేడి అన్నంలో పచ్చడి కలుపుకుని తినవచ్చు. అవసరం అనుకున్న వారు కాస్తా నెయ్యి లేదా గానుగ నూనె వేసి కలుపుకుని కూడా తినవచ్చు. ఆవ ఘాటుతో రుచి బాగుంటుంది.
నూనె వాడకం తగ్గించాలి.
నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కనుక, నీడపట్టు పనులు చేసేవారు తక్కువ తినడం ఉత్తమం. బయటి వాతావరణంలో ఉన్నా పచ్చడి బాగానే ఉంటుంది. కాకపోతే పచ్చడి పైన కాస్తా గానుగ సేంద్రీయ నువ్వుల నూనె పొయ్యడం బెటర్.
పండు దోస పండ్లతో కూడా ఇలాగే నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. . కాకపోతే పులుపు కోసం నిమ్మరసం లేదా మామిడి వరుగు పొడి వాడవచ్చు.
తేనెపట్టుల ప్రవాసము (Migration of Bee Honeycolonies)
సంవత్సరం పొడవునా సాధారణంగా ఏ ప్రాంతంలోకూడా పుష్పించే మొక్కలు ఉండవు, అయినప్పటి తేనెటీగలు వాటి రోజూవారి అవసరములకొరకు పుప్పాడిని, మకరంధమును సేకరించుకొని తేనెను ఉత్పత్తిచేస్తాయి. ఒకవేళ పుప్పొడి మరియు మకరందము లభ్యము కాని పక్షంలో అనుబంధ ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. క్యాలెండరును బట్టి తేనెటీగలకు పుష్పజాతులు లభ్యమయ్యే ప్రాంతాలకు తేనెపట్టులను తీసుకుని పోవలసియుంటుంది. దీనినే తేనెపట్టుల ప్రవాసము (Migration) అంటారు. పెద్ద ఎత్తున దీనిని అవలంభించినప్పుడు తేనెటీగల పెంపకంలో తేనెపట్టుల ప్రవాసము (Migratory Bee keeping) అంటారు.
వాణిజ్యపరంగా తేనెటీగల పెంపకమును చేపట్టినపుడు తేనెపట్టుల ప్రవాసము అనునది చాలా ముఖ్యమైనది. దీని ముఖ్యఉద్దేశ్యము
తేనె ఉత్పత్తిని పెంచుట కొరకు
తేనెపట్టులను బలపరచుకొని, విభజించుకొనడానికి
అనుబంధ పోషణ ఖర్చు తగ్గించుకొనడానికి మరియు తేనెటీగల పరాగ సంపర్కము ద్వారా పంటల ఉత్పత్తి పెంచుకొనడానికి
అడవి మరియు వ్యవసాయ మొక్కలలో జీవవైవిద్యమును పరపరాగ సంపర్కము ద్వారా కాపాడుకొనుటకు గాను తేనెపట్టుల ప్రవాసము ఉపయోగపడును.
గుర్తించకొనదగిన విషయాలు (Points to consider) తేనెటీగల పెంపకము యొక్క ముఖ్యవుద్దేశ్యము ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకొని తేనె దిగుబడిని పెంచుకొనడము. అందుకనే తేనెటీగల పెంపకముదారులు తేనెటీగలకు ఆహారమును సరఫరా చేయు మొక్కలను మొదటిగా గుర్తించవలెను. తేనెపట్టులను మార్చుటకు (Migration) లేదా ప్రవాసము కొరకు అగు ఖర్చును తెలుసుకొనాలి మరియు సరైన శాస్త్రీయ పరిజ్ఞానము మరియు నిపుణత, పట్టులను ప్రవాసము చేయుటకు ఉండాలి. తేనెపట్టులను ప్రవాసము కొరకు ప్రణాళిక వేయునపుడు (Migration) ఈ క్రింది సూచనలు పాటించాలి.
ప్రవాసము చేయు స్థలము ఎంపిక
తేనెపట్టులు మార్చుకునే ప్రదేశములో లభ్యమయ్యే మొక్కలు, చెట్లు, వృక్షములు ఏరకమునకు చెందినవో, ఏ సీజనులో ఎంతకాలం పుష్పిస్తాయో ఎంత విస్తీర్ణములో ఉన్నవో, ప్రస్తుతం తేనెపట్టులున్న ప్రదేశం కంటే కొత్తగా పట్టులు పెట్టుకొను ప్రాంతములో ఎంత తేనెదిగుబడి వస్తుందో అంచనా వేసుకొనాలి.
తేనెపట్టులకు లభ్యమయ్యే పుష్పజాతుల పంటల మీద పురుగుమందులు పిచికారీ చేస్తారేమోనన్న విషయాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులను గూర్చిన వివరణను సంపాదించాలి.
ప్రకృతి సిద్ధముగా తేనెపట్టులపై దాడిచేయు శత్రువుల విషయమైన సమాచారాన్ని సేకరించి, శత్రువుల దాడి తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొనాలి.
తేనెటీగల పట్టుల ప్రవాసము కొరకు ఎంత లాభము, ఎంత నష్టము ఉంటుందో విశ్లేషణ చేసుకొనాలి.
తేనెపట్టుల ఎంపిక మరియు ప్రవాసము కొరకు తేనెపట్టులను సిద్ధపరచుట
బలమైన, ఆరోగ్యకరమైన మరియు తేనెను సేకరించగల పట్టులను మాత్రమే ప్రవాసం (Migration) కొరకు ఎంపిక చేసికొనాలి.
తేనెపట్టులను ప్రవాసము తీసుకొని వెళ్ళడానికి ముందు కనీసం రెండు నెలలు నుండి బలవరచుకొనాలి. కావలసిన వస్తువులు, పరికరములన్నీ ఉదాహరణకు తేనె అరలు, ఫ్రేములు, కృత్రిమ మైనపు అట్టలు, తేనె యంత్రము మరియు తేనెను సేకరించి నిల్వవుంచుకొనుటకు కావలసిన పాత్రలు సిద్ధపరచుకొనవలెను.
తేనెపట్టుల ప్రవాసము కొరకు తగిన సమయము (Timing of Migration) తేనెటీగలకు పుప్పొడిని, మకరందమును అందించే ఎక్కువ మొక్కలు పుష్పించేదశలో ఉన్నపుడు తేనెపట్టులను ప్రవాసము తీసుకువెళ్ళవలెను (కనీసం 5 శాతం పుష్పములు ఉన్నపుడు).
తేనెపట్టులను సిద్దపరచుట (Preparation of Bee colonies) తేనెపట్టులను చాల జాగ్రత్తగా ప్రవాసముకొరకు సిద్ధపరచుకొనవలెను. ఈ సిద్దపరచడం సరిగా చేయకపోయినట్లుయితే కొన్ని ఈగలు వెనుక వదిలి పెట్టబడి లేక ప్రవాసం చేయునపుడు చనిపోతాయి.
తేనేపెట్టెలను క్రింద చెప్పబడిన విధముగా సిద్ధపరచుకొనాలి
తేనెపట్టులను శుభ్రపరచాలి.
అధికముగా ఉన్న తేనెను, తేనెయంత్రంతో తీసుకొనాలి మరియు తేనెగదిని తీసివేయాలి. తేనెతో నింపబడిన ఫ్రేములతో పాటుగా ప్రవాసము చేసినట్లయితే తేనెటీగలు చనిపోతాయి. ఫ్రేములను పట్టులలో గట్టిగా బిగించుకోనాలి.
తేనెపట్టుల ప్రవాసము సుదీర్ఘమైనదైనట్లయితే (Long distance) అనుబంధ ఆహారాన్ని (Supplementary feeding) ఏర్పాటు చేసుకొనాలి.
చెక్కలతో (Wooden reapers) పై నుండి క్రిందివరకు అడుగుబల్లను, తేనెగదిని, పిల్లలగదితో బిగించుకొనాలి. ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉన్నసమయంలో పట్టులను ప్రవాసం తీసుకొని వెళ్ళునపుడు వైరుల వలతో ఉన్న లోపలిమూతను వాడుకొనాలి.
సుదీర్ఘప్రవాసం అయితే, వేడిగా ఉన్న సమయంలో పైమూతను (Outer cover) తీసివేసుకొనాలి.
వైరుతోగాని, పెట్టె బెల్టుతో గాని లేక త్రాడుతోగాని పట్టును బయట కవరును తీయకుండానే కొద్ది దూరపుప్రవాసముల విషయమంలో కట్టుకొనాలి.
కూలిఈగలన్నీ సాయంత్రమునకు పట్టుకు చేరుకున్న తరువాత వైరునెట్ తోగాని, గుడ్డముక్కతో గాని పట్టుద్వారమును మూసివేయాలి. ద్వారము వద్ద ఈగలన్నీ గుమికూడి గుంపుగా ఉన్నట్లయితే నీరుచల్లిగాని, లేక పొగబారించుట ద్వారా గాని ఈగలు పట్టులోనికి వెళ్లునట్లుగా ప్రాత్సాహించాలి.
తేనెపట్టుల ప్రవాసము (Bee colonies migration)
తేనెపట్టులను, ట్రక్కు లేక ట్రాక్టరు లేక ఆటోరిక్షా, కూలికి మనుష్యులను పెట్టుకొనిగాని ఒకచోట నుండి మరొకచోటికి మార్చుకొనవచ్చును లేక వివిధ పద్దతులను కలిపిగాని, తేనెపట్టులు మొదటిస్థానం నుండి తేనెటీగలకు ఆహారం లభించే స్థలానికి మార్చుకొనవచ్చును.
సాధ్యమయినట్లయితే పట్టుల ప్రవాసమును రాత్రిపూట (శీతాకాలం సా||గం.5.00ల నుండి ఉ॥ గం.10.00లు, ఎండాకాలం అయితే సా||గం. 7.00ల నుండి ఉగం. 7.00ల మధ్య) చేపట్టాలి.
తేనెపట్టుల మధ్య గాలి ప్రవహించేలా ఉండాలి.
తేనెపట్టులను జాగ్రత్తగా ట్రక్కులలో భద్రంగా చేర్చుకొనాలి.
వాహనము నెమ్మదిగా సాధ్యమైనంతవరకు ఏవిధమైన ఒడిదుడుకులు లేకుండా నడపాలి.
వాహనాన్ని ఎక్కువసేపు ఆపి ఉంచకూడదు. ఒకవేళ రోజంతా లేక ఇంకా ఎక్కువసమయము ఆపివేయాల్సివస్తే పట్టులను వాహనంనుండి దింపి, పట్టుల ద్వారములను తెరచి, ఈగలు ఆహర సేకరణ కొరకు వదలాలి. రాత్రి అయిన తర్వాత తిరిగి ప్యాకింగ్ చేసి తిరిగి వాహనములోనికి లోడు చేసుకొనాలి.
గమ్యస్థానము చేరుకున్న తరువాత వాహనమునుండి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా పట్టులను దించుకొనాలి.
ఒక గ్రూపుగా పట్టులను పెట్టుకొనాలి. కనీసం పట్టుకు పట్టుకు మధ్య 5 అడుగులు (1.5మీ) వుండునట్లుగా అమర్చుకొనవలెను.
పట్టులను ఆ ప్రాంతంలో పెట్టుకున్న తరువాత పట్టులద్వారాలకున్న గుడ్డ లేక వైరుజల్లెడను ఒకదాని తర్వాత ఒకటి ఒకవైపు ప్రారంభించి రెండవవైపుకు వెళుతూ తీసివేయాలి.
ద్వారాల్ని తెరచిన 30నిమిషముల తర్వాత లేక ప్రొద్దుపొడవగానే, ఈగలు బయటకు ఎగురు చున్నవో లేదో గమనించుకోవాలి. ఒకవేళ రెండురోజుల వరకు ఒకపట్టులోని ఈగలు బయటకు ఎగరని పక్షంలో (ఒకవేళ ఈగలు తేనెతోతడిసి చనిపోయిన ఈగలు లేక నేలమీద పారాడుతున్న ఈగలు) ఏమైనప్పటికీ వెంటనే పట్టును పరిశీలించుకొని తగిన చర్యలు చేపట్టాలి.
పట్టులను కొన్ని రోజులకు ప్రతిసారి పరిశీలించుకొనాలి. పిల్లలగది ఈగలతో నిండిపోయిన వెంటనే తేనె అరను ఏర్పాటుచేసికొనాలి. తేనె అరలో పాతమైనపుఅట్టలు లేక కృత్రిమ మైనపు అట్టలను పెట్టుకొనాలి.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Ph: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
సాధారణ నామం: గమ్ అరాబిక్ శాస్త్రీయ నామం: అకేసియా నిలోటికా కుటుంబం: ఫాబేసి
నల్లతుమ్మ వతైన క్యానపి, ముదురు నలుపు కాండం, కొమ్మలతో 5-20 మీ. ఎత్తు పెరిగే చెట్టు. బెరడు నుండి తక్కువ నాణ్యతగల ఎర్రటి బంకకారుతుంది. పలుచని, నిలువాటి, లేతబూడిద రంగు 3-12 జతల ముళ్ళుకలిగి ఉంటుంది. చిన్న చెట్లలో 5-7.5 సెం.మీ. పొడవుముళ్ళుంటాయి. పెరిగిన చెట్లలో సాధారణంగా ముళ్ళుండవు. పెద్ద ఆకుతో 10-30 చిన్న ఆకుల జతలుంటాయి. ఆకుకాడ చివరి జత ఆకుల క్రింద ఒక గ్రంథి ఉంటుంది.పూలు 1.2-1.5 సెం.మీ. వ్యాసం గల బంగారు పసుపురంగు గుండ్రని గుత్తులలో ఏర్పడతాయి. కాయలుగట్టిగా అణచబడి, నూగుతో కప్పబడి, మందంగా, మెత్తగా ఉంటాయి. ఒక కిలోకి సుమారు 8000 గింజలు తూగుతాయి.
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
నల్లతుమ్మ కాండం బెరడు, కాయ, బంక, విత్తనాలు ఔషధ రంగంలో ఉపయోగిస్తారు. బంక రెసిన్ పిత్త, వాత దోషాలను తగ్గిస్తుంది. ఇది గర్భసంచి వాపుని తగ్గించడానికి సహాయపడుతుంది.
కాండం బెరడు, కాయలు జీర్ణకోశంలోని పురుగులను నివారించడం, రక్తం గడ్డకట్టకుండా చేయడానికి సహాయ పడతాయి.
బెరడు, కాయలు 12-20% టానిన్ కలిగి ఉంటాయి. బెరడు, కాయల నుండి అనేక పోలీఫినాలిక్ మిశ్రమాలను వేరు చేశారు.
బంక రెసిన్‌లో గాలక్టోస్, ఆల్ఫాబయో యురోనిక్‌యాసిడ్, అరాబినో బయోసెస్ ఉంటాయి. 52% కాల్షియం, 20% మెగ్నీషియం కూడా ఉంటాయి.
పూలలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.
మోతాదు :
కషాయం తయారు చేయడానికి 20-30 గ్రా. విత్తన పొడి అవసరం. రోజుకి 50-100 మి.లీ. కషాయాన్ని 3-6 గ్రా. విడి మోతాదుల్లో తీసుకోవాలి.
రక్తస్రావాన్ని ఆపడానికి తాజా పుండ్లపై ఎండిన ఆకుల పొడి చల్లాలి., నోటి అల్సర్, పళ్ళచిగుళ్ళ నుండి రక్తస్రావం ఆగడానికి బెరడు కషాయంతో పుక్కిలించాలి. నిప్పు వల్ల కలిగిన గాయం, పుండు మానడానికి ఆకుల నుండి తయారు చేసిన పేస్టుని పూయాలి.
డయేరియా, జీర్ణాశయ నులిపురుగుల చికిత్సకు 40-50 మి.లీ. కషాయం యివ్వాలి. కాయల నుండి తయారు చేసిన కషాయాన్ని రుతుస్రావం సమయంలో రక్తస్రావాన్ని ఆపటానికి సేవించాలి. 45-50 మి.లీ. కాయలు, బెరడు కషాయాన్ని మొలల చికిత్సలో ఉపయోగిస్తారు.
2-3 గ్రా. ఆకులను నూరి ఒక చెంచా పంచదారతో కలిపి రోజుకి ఒకటి లేదా 2 సార్లు సేవించడం ద్వారా స్పెర్మటోరియా / ధాతు సిండ్రోమ్ నివారించబడుతుంది.
ఒక కప్పు నీటికి 3 గ్రా. తుమ్మ బంక పొడి కలిపి 2-3 ని. వేడిచేసి రోజుకొకసారి సేవిస్తే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
వ్యవసాయరంగంలో …
నల్లతుమ్మ కలపను నాగలి, కాడివంటి భూమిని దున్నే పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
నల్లతుమ్మ నీటి ద్రావణం ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్‌పై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (తుల్సి భరద్వాజ్, అతని అనుచరులు, 2015).
నల్లతుమ్మ మిథనాల్ మరియు ఇథనాల్ ద్రావణాలు పలు పంటలలో తెగుళ్ళు కలిగించే బాక్టీరియా క్సన్తోమోనాస్ కాంపెస్ట్రిస్ వెసికటోరియా, క్ౙాంతోమోనాస్ ఆక్సొనోపోడిస్ మాల్వేసియారం, క్సన్తోమోనాస్ ఒరైజె ఒరైజె, ఎర్వినియా కెరటొవొరాల పెరుగుదలను గణనీయంగా అరికట్టాయి (కవిత అండ్ సతీష్, 2011).
నల్లతుమ్మ కొయ్య / గుజ్ౙు పురుగు నివారణ లక్షణాలను కలిగి ఉన్నాయి. (హెచ్‌డిఆర్ఎ ది ఆర్గానిక్ ఆర్గనైజేషన్) నల్లతుమ్మ ద్రావణాలు నిల్వ సమయంలో గింజలనాశించే ఆస్పర్ౙిల్లస్ స్పీసిస్ పెరుగుదలనరికట్టాయి. ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్ పెరుగుదల గణనీయంగా అరికట్టబడింది (సతీష్, అతని అనుచరులు, 2006).
నల్లతుమ్మ ఆకు ద్రావణం (25%) ప్రొద్దు తిరుగుడు గింజల నుండి వేరు చేసిన ఆస్పర్ౙిల్లస్‌నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఫ్యుజేరియం మొనిలిఫార్మె, రైజోక్టోనియా బటాటికోలా, కర్వులేరియా లునేట, మ్యూకార్, క్లాడోస్పోరియం, ఆల్టర్నేరియా హీలియాంతి, రైజోపస్ నైగ్రికాన్స్ శిలీంద్రాల పెరుగుదల నరికట్టింది. (ముంతాజ్‌బెయిగ్ అండ్ సుమియాఫాతిమ, 2017)