గుర్తు తెలియని దొంగలకు రైతుల విజ్ఞప్తి

గుర్తుతెలియని దొంగలకు పంజాబ్‌లోని ఫరీద్ కోట్ జిల్లా పఖి కలాన్ గ్రామ రైతులు ఓ విజ్ఞప్తి చేశారు. “వరి సీజను మొదలైంది. దయచేసి, నీటి మోటార్ల జోలికి రాకండి. మీరు బ్యాంకు ఖాతా తెరిచి, ఆ వివరాలు మాకు పంపండి. మా పైర్ల రక్షణ నిధిగా అందులో డబ్బులు జమ చేస్తాం” అంటూ అన్నదాతలు సామూహికంగా చేసిన ఓ వినూత్న వీడియో వైరల్‌గా మారింది. ఈ రైతుల పొలాల నుంచి రెండు నెలల కిందట 15 నీటి మోటార్లు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత పొలాల్లో ఉంచిన 25 ద్విచక్ర వాహనాలు ఒకేరోజు రాత్రి దొంగలపాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో తమకు మరో మార్గం తోచలేదని రైతులు అంటున్నారు.

Read More

నేపాల్ భారత మామిడిపై ఆంక్షలు విధించింది

భారత మామిడి పండ్లలో పురుగుమందులు అధికంగా ఉన్నాయని, సరిహద్దు ప్రాంతాల్లో క్వారంటైన్ సౌకర్యాలు సరిగ్గా లేవని మామిడి పండ్ల దిగుమతిపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత మామిడిపండ్లపై నిషేధం స్థానిక మామిడి రైతులకు ఉపకరించనుందని మధేష్ ప్రావిన్సు భూ నిర్వహణ, వ్యవసాయ సహకార మంత్రిత్వశాఖ సమాచార అధికారి అజయ్ గ్యావాలి చెప్పారు. భారత్ నుంచి అరటి దిగుమతులు నిలిచిపోయిన కారణంగా.. ఇక్కడ అరటిపళ్ల ధర రెట్టింపయింది. ఇప్పుడు మామిడిపై ఆంక్షలతో రానున్న రోజుల్లో స్థానికంగా వాటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. భారత మామిడిపై పూర్తి ఆంక్షలను విధించేందుకు బదులుగా సరిహద్దు క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి వారు సూచిస్తున్నారు.

Read More

విస్తరణ సేవలను పటిష్టం చేస్తున్న కోరమాండల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో గ్రోమోర్ గ్రామ్ పేరుతో వ్యవసాయ విస్తరణ సేవలను మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో, 12 రాష్ట్రాల్లోని 101 గ్రామాలను కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎంపిక చేసింది. ఈ మోడల్ గ్రామాల రైతులు సమతుల్య పోషక పద్ధతులను అవలంబించి, స్థిరమైన దిగుమతులు సాధించేలా వారిని సాధికారులను చేస్తామని కోరమాండల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మాధబ్ అధికారి తెలిపారు. భూసారానికి అనుగుణంగా ఎరువులు వాడటం, ఆధునిక సాంకేతికతతో తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ, రైతులకు కొత్త సాగు పద్దతులపై ప్రత్యక్ష అవగాహన కల్పించడం లాంటివి ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నారు.

Read More

సేంద్రియ ఎరువుల వాడకం క్రమంగా పెరుగుతుంది

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయదారులు 11.17 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు కొన్నారని, ఇది గతం కంటే 3.5 రెట్లు ఎక్కువని, దేశంలో రైతులు క్రమంగా సేంద్రియ ఎరువుల దిశగా మళ్లుతున్నారని కేంద్రం సోమవారం వెల్లడించింది. దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎరువుల అందుబాటు విషయంలో ఎలాంటి సమస్యలూ లేవని స్పష్టం చేసింది. “2026 ఖరీఫ్‌నకు సంబంధించి ఎరువుల అవసరాన్ని వ్యవసాయ శాఖ తిరిగి అంచనా వేసింది. సీజన్‌లో మొత్తం 383.9 లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయశాఖ నిర్ధారించుకుంది. ప్రస్తుతం దేశంలో 197.56 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి” అని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణా ఎస్ శర్మ వెల్లడించారు.

Read More

2-3 రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రానికి రాక

    నిన్న కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, కొమొరిన్ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు ఇవి విస్తరించినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా మూడురోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రెండు, మూడు రోజుల్లో గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత భాగానికి రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు రుతుపవనాల సీజన్‌లో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కేరళను తాకిన రుతుపవనాలు.. ఈ నెల 15 నాటికి ఆంధ్ర రాష్ట్రమంతటా విస్తరిస్తాయని విశాఖ తుపాను హెచ్ౘ్రికల కేంద్రం శాస్త్రవేత్త జగన్నాథకుమార్ తెలిపారు.

Read More

వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి

వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడిని తట్టుకొని, తక్కువ నీటితో సాగుచేయగల పంటలపై ఈ నెల 6, 8, 10వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి ప్రచారం చేయాలన్నారు. గురువారం సచివాలయంలో వానాకాలం సీజన్‌పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే వ్యవసాయశాఖ జిల్లాలవారీగా పంటల ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని గ్రామసభల ద్వారా రైతులకు వివరించాలి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపికచేసేలా సిబ్బంది క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు.

Read More

రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలి

విదేశీ పప్పులు, నూనెల దిగుమతులపై సుంకాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వాణిజ్య విధానాల వల్లే రైతులు నష్టపోతున్నారని తెలగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర రైతులు పండించిన వరి, మక్కలు కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని దుయ్యబట్టారు. గిట్టుబాటు, ఆదాయం, డిమాండుకు అనుగుణంగా పప్పులు, కూరగాయలు, ఆయిల్‌పాం వంటి ఉద్యాన పంటలు సాగుచేయాలని కర్షకులకు పిలుపునిచ్చారు. వ్యవసాయ ప్రణాళికపై ఖమ్మం కలెక్టరేట్‌లో మంత్రి బుధవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘మన మామిడిపండ్లకు జపాన్ లో డిమాండ్ ఉన్నా.. రసాయన అవశేషాల పేరిట ఆ దేశం తిరస్కరించింది. ఇకనైనా రైతులు అధిక రసాయనాల వాడకం తగ్గించాలి. ఈసారి ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు మొగ్గుచూపాలి’ అని పేర్కొన్నారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, మట్టా రాగమయి, కలెక్టర్ దివాకర, సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ పాల్గొన్నారు.

Read More

ప్రకృతిసాగుకు ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026’

ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ పురస్కారంగా భావించే ప్రతిష్ఠాత్మక ‘ఫుడ్‌ప్లానెట్ ప్రైజ్ 2026 ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎనఎఫ్‌కు దక్కింది. ఈ అవార్డును స్వీడన్‌కు చెందిన కర్ట్ బెర్గ్‌ఫోర్స్ ఫౌండేషన్ అందిస్తోంది. జూన్ 2న స్వీడన్‌లోని బస్టాడ్‌లో జరిగిన కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక వైస్ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి. విజయ్ కుమార్, వ్యవసాయశాఖ ఎక్సఅఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ ఈ అవార్డు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,000 నామినేషన్లు రాగా.. అందులో ఏపీసీఎనఎఫ్ ఎంపికైంది. అవార్డు కింద ఏపీసీఎనఎఫ్‌కు 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.14కోట్లు) అందజేశారు. ఫైనల్‌కు చేరిన కాన్షియస్ కిచెన్ (అమెరికా), నోపామ్ ఇంగ్రేడియంట్స్ (నెదర్లాండ్స్), సవన్నా ఇన్‌స్టిట్యూట్(అమెరికా) కు 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.4 కోట్ల) చొప్పున అందించారు. అవార్డు ద్వారా లభించే మొత్తంతో ప్రకృతి వ్యవసాయంపై ప్రదర్శనా క్షేత్రాలు, ప్రత్యేక లీడర్‌షిప్ కోర్సు, రైతు శాస్త్రవేత్తలతో డాక్యుమెంట్ రూపొందించనున్నట్లు రైతు సాధికార సంస్థ తెలిపింది. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితోనే ఈ అవార్డు సాధ్యమైంది. ఏపీలో 18 లక్షల రైతు కుటుంబాలు, 7లక్షల రైతు కూలీల కుటుంబాలు, మార్పునకు కారణమైన 3.4 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళల తరపున ఈ అవార్డును అందుకోవడం గర్వకారణం’ అని విజయ్‌కుమార్, రాజ శేఖర్ పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబు ప్రోత్సాహంతో
రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేళ్ల కిందట ప్రారంభించారు. అదిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా ఎదిగింది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన గ్రామీణ మహిళల్ని ఇందులో భాగస్వాములుగా చేశారు. తమ కుటుంబాలు ప్రకృతి వ్యవసాయం చేసేలా మార్పు తీసుకురావడంలో వీరు కీలకపాత్ర పోషించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)ల ద్వారా రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. 1,000 మందికి పైగా రైతు శాస్త్రవేత్తలు, మెంటార్లు, 700 మందికి పైగా రైతు పరిశోధకులు ప్రత్యేక సేవలందిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వశాఖ, కేఎఫ్ డబ్ల్యూ బ్యాంక్, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నాయి.

Read More

దేశంలో విత్తనరంగానికి కేంద్రంగా తెలంగాణ : మంత్రి

తుమ్మలతెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఆ అనుభవాన్ని నైజీరియాలోని టరాబా రాష్ట్ర యువతతో పంచుకోవడం సంతోషకరమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (IPE) లో నిర్వహించిన “అంతర్జాతీయ విత్తన విద్య మరియు పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం” ముగింపు కార్యక్రమానికి మరో మంత్రి వివేక్‌తో కలిసి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణ ద్వారా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రాయోగిక పరిజ్ఞానం పొందారని మంత్రి తెలిపారు.టరాబా రాష్ట్ర ప్రభుత్వం తమ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కల్పించేందుకు చూపుతున్న చొరవ అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా టరాబా రాష్ట్రంతో వ్యవసాయం, విత్తన సాంకేతికత, రైతు శిక్షణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.తెలంగాణ మరియు టరాబా రాష్ట్రాల మధ్య “సిస్టర్ స్టేట” భాగస్వామ్యానికి సంబంధించి చర్ౘ్లు కొనసాగుతున్నాయని, ఇది ఇరు ప్రాంతాల మధ్య పరస్పర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. టరాబా రాష్ట్ర యువత ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను తమ ప్రాంత అభివృద్ధికి వినియోగించి వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నైజీరియాలోని టరాబా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అగ్బు కెఫాస్, టరాబా సీడ్స్ లిమిటెడ్, ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధులు, శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు.

Read More

రైతులకు, మహిళా స్వయం సహాయ సభ్యులకు పాడిరంగంపై శిక్షణ

పశు సంవర్ధక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలో పాడిపరిశ్రమ, విస్తరణ, అభివృద్ధి, దాని ఉత్పత్తుల తయారీ, పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాలు నిర్వహించాలని పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాడి రైతులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లకు శిక్షణనిచ్చేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా రాజేంద్రనగర్ పశువైద్య కళాళాలలోని పశుగణన క్షేత్ర సముదాయంలో మంగళవారం పాడి రైతులకు శాస్త్రీయ పద్దతిలో పాడి పశువుల పెంపకంపై శిక్షణ శిబిరాన్ని నిర్వహించింది. పశుపోషణ, వ్యాపార సరళిలో డెయిరీ ఉత్పత్తుల తయారీపై శిక్షణనిచ్చారు. త్వరలో స్వయం సహాయక సంఘాల శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు విస్తరణ విభాగం అధిపతి సత్యనారాయణ తెలిపారు.

Read More