నాణ్యమైన గొర్రెలు/మేకల మంద అభివృద్ధి కావాలంటే

ఆరోగ్యమైన మరియు జన్యుపరంగా మంచి నాణ్యత కలిగిన మందను అభివృద్ధి చేయాలంటే గొర్రెల/మేకల పెంపకందార్లు ప్రతి ఏటా “ఏరివేత”ని అవలంబించాలి. నాసిరకం జీవాలని ఎప్పటికప్పుడు గుర్తించి మందనుండి వేరుచేసి, ఆరోగ్యమైన జీవాలని మాత్రమే ఉంచడం వలన పోషణ ఖర్చు తగ్గి, జీవాల పెంపకం లాభదాయకంగా ఉంటుంది.

పుట్టిన ఆడ జీవాల(పిల్లలు)లో ఆరోగ్యంగా, మంచి శరీర బరువు కలిగి ఉండి, జాతి లక్షణాలున్న వాటిని మందలో ఉంచుకోడానికి ఎంపిక చేసుకోవాలి. బలహీనంగా ఉండి, పెరుగుదల లేని, ఆరోగ్యంగా  లేని పిల్లల్ని, తల్లి పాలు సరిగా అందని వాటిని గుర్తించి ఏరివేయాలి. పుట్టిన పిల్లలకి పాలివ్వలేని తలుల్ని  వేరుచేసి, ఆరోగ్యంగా, పాలిచ్చే శక్తి కలిగిఉన్న తల్లుల్ని మాత్రమే మందలో ఉంచాలి. మంద సగటు బరువు కంటే తక్కువ బరువున్న జీవాల్ని, బలహీనంగా ఉన్నవాటిని, ఎదుగుదల లోపాలున్నవాటిని, ముసలివాటిని గుర్తించి ఏరివేయాలి. సకాలంలో ఎదకు రాని, చూలి నిలవని వాటిని, తరచుగా ఈడుసుకుని పోయే జీవాల్ని, పొదుగు వాపు సోకిన జీవాల్ని మందనుండి తీసివేయాలి. 

ఇక మగ జీవాల (పిల్లల) విషయానికొస్తే అధిక శరీర బరువు కలిగివుండి, జాతి లక్షణాలున్న 3-4 మగ జీవాల పిల్లల్ని మందలో ఉంచి, మిగితా వాటిని వేరు చేసి 6-7 మాసాలు పోషించి, మాంసం కొరకు అమ్మివేయాలి. మంచి జాతి లక్షణాలున్న మరికొన్నింటిని 12-18 నెలలు పోషించి పునరుత్పత్తి కోసం (విత్తనపు పొటేళ్లుగా) అమ్మివేయాలి. రెండు సంవత్సరాల పాటు మందలో ఉన్న పొట్టేలు/పోతులను తొలగించివేయాలి. లేనిచో మందలో “ఇన్ బ్రీడింగ” సమస్య  తలెత్తి, మంద నాణ్యత జన్యుపరంగా క్షీనిస్తుంది. కాబట్టి పొట్టేలు / పోతులను ప్రతి రెండేళ్లకోసారి మార్చుకోవాలి.

వంగిపోయిన కాళ్ళు, వెడల్పుగా ఉన్న భుజాలు, దవడ లోపాలు (పెద్దగా లేదా చిన్నగా ఉండడం), పగిలిన నోరు మొదలగు జన్యుపరమైన లోపాలున్న జీవాల్ని ఏరివేయాలి.  మంద పరిమాణం. వసతి, మేత వనరులు మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఏటా 10-20% జీవాల్ని ఏరివేయటం మంచిది.

డా. జె. సాయి ప్రసన్న, డా. సరిన్ కున్నత్, సహ ఆచార్యులు, పశు జన్యుశాస్త్ర మరియు ప్రజనన విభాగం, పీవీ నరసింహ రావు తెలంగాణ పశువైద్య విశ్వా విద్యాలయం, హైదరాబాద్. ఫోన్: 8008910925

Read More

పశువులలో నీళ్ళ విరోచనాలు (Watery Diarrhea in Cattle/Buffaloes) – హోమియోపతి చికిత్స

పశువులు నీళ్ళ లాంటి పలుచటి విరోచనాలు చేయడం అంటే, పేగులలో ఇన్‌ఫెక్షన్ లేదా జీర్ణక్రియ లోపం వలన ఆహారం పూర్తిగా జీర్ణం కాక నీరు ఎక్కువగా బయటకు పోవడాన్ని నీళ్ళ విరోచనాలు అని అంటారు.

కారణాలు
• చెడిపోయిన లేదా పాడైన దాణా, పచ్చిక
• నీరు లేదా ఆహారం ద్వారా బ్యాక్టీరియా/వైరస్ సంక్రమణ
• అజీర్ణం
• అధిక దాణాఇవ్వడం
• వాతావరణ మార్పు, ఒత్తిడి
• పురుగులు

లక్షణాలు
• నీళ్ళ లాంటి విరోచనాలు
• విరోచనాల్లో దుర్వాసన
• ఆహారం తినకపోవడం
• నీరు ఎక్కువగా కోల్పోవడం వల్ల బలహీనత
• కళ్ళు లోపలికి పోవడం, చెవులు వంగిపోవడం
• కొన్నిసార్లు జ్వరము కూడా ఉండవచ్చు

4. హోమియోపతి చికిత్స (Homeopathy Treatment)
మందు పేరు వాడే సందర్భం డోసు
Arsenicum Album 30 చెడిపోయిన ఆహారం వల్ల వాంతులు, విరోచనాలు, దుర్వాసన ఉన్న మలం 10 డ్రాప్స్ లేదా 5 పెల్లెట్స్ రోజుకు 3 సార్లు
China (Cinchona) 30 ద్రవ నష్టం వల్ల బలహీనత, నీళ్ళ విరోచనాలు 10 డ్రాప్స్ రోజుకు 2 సార్లు
Veratrum Album 30 తీవ్రమైన నీళ్ళ విరోచనాలు, చల్లగా చెమటలు పట్టడం 10 డ్రాప్స్ రోజుకు 3 సార్లు
Phosphorus 30 పచ్చ లేదా రక్తం కలిసిన విరోచనాలు 10 డ్రాప్స్ రోజుకు 2 సార్లు
Aloe Socotrina 30 విరోచనాలు ఆకస్మికంగా రావడం, ఆహారం తిన్న వెంటనే మల విసర్జన 10 డ్రాప్స్ రోజుకు 3 సార్లు
మందులను నీటిలో (5–10 ml) కలిపి నోటి ద్వారా ఇవ్వాలి.

మంచి కాంబినేషన్లు (Effective Combinations)
Combination – 1 (Acute watery diarrhea)
Arsenicum Album 30 + Veratrum Album 30
5 డ్రాప్స్ చొప్పున కలిపి, 3 గంటలకొకసారి మొదటి రోజు ఇవ్వాలి.
తర్వాత రోజుకు 3 సార్లు 3 రోజుల పాటు ఇవ్వాలి.
Combination – 2 (Weakness after diarrhea)
China 30 + Phosphorus 30
10 డ్రాప్స్ చొప్పున కలిపి, రోజుకు 2 సార్లు 3 రోజులు.
Combination – 3 (Long-standing diarrhea / chronic cases)
Aloe Socotrina 30 + Sulphur 30
రోజుకు 2 సార్లు 5 రోజుల పాటు.

సహాయక చికిత్స (Supportive care)
• పశువుకు పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఇవ్వాలి
• నీరు ఎక్కువగా కోల్పోతే గ్లూకోస్ నీరు లేదా ఎలక్ట్రోలైట్ ద్రావణం ఇవ్వాలి
• ఆహారం తగ్గించాలి; చెడిపోయిన దాణా/పచ్చిక ఆపాలి
• పచ్చిక మెల్లగా ఇవ్వాలి
• రూమెన్ టానిక్ లేదా లివర్ టానిక్ వెటర్నరీ డాక్టర్ సలహాతో వాడవచ్చు

జాగ్రత్తలు (Precautions)
• చెడిపోయిన ఆహారం, ఫంగస్ ఉన్న దాణా ఇవ్వకూడదు
• నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి
• కొత్త దాణా/ పచ్చిక మార్చేటప్పుడు కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి
• తీవ్రస్థితిలో వెటర్నరీ డాక్టర్ను సంప్రదించాలి (IV fluids అవసరం కావచ్చు)

డాక్టర్ జి. రాంబాబు, Phone: 9618499184

Read More

వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత

ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిసాధనలో రసాయనిక ఎరువుల వాడకం ప్రాధాన్యతను సంతరించుకుంది. రసాయనిక ఎరువుల్లో ముఖ్యంగా నత్రజని ఎరువుల వాడకం వల్ల నేలల్లోని పోషకపదార్థాల నిల్వల సమతుల్యత దెబ్బతిని ఉత్పాదకశక్తి కోల్పోడం, అధికంగా చీడపీడలు ఆశించడం, సూక్ష్మపోషకాలు లోపించడం చౌడు తదితర సమస్యలు ఉత్పన్నం కావడంతో దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. పంటల ఉత్పాదకత పెరగడానికి భూభౌతిక స్వరూప స్వభావాల్లో వివిధ మార్పులు తేవడానికి భూసార పరిరక్షణకు గాను రసాయనిక ఎరువులకు తోడుగా సేంద్రియ, జీవన ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ప్రకృతిలో గల సూక్ష్మాతిజీవులు జీవించుటకు స్వతంత్య్రంగా కాని, మొక్కలతో కలసి కాని జరిగే ప్రక్రియలో పంటలకు కావలసిన పోషకాలను వాతావరణం లేదా నేల నుండి గ్రహించి మొక్కలకు అందించే జీవుల సముదాయాన్ని జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువులు అనేవి వాటంతట అవి ఎరువులు కావు. రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువుల మాదిరి వీటిలో పోషకాలు లేవు. అయితే ఇవి మొక్కకు కావలసిన పోషకాలు తీసుకోవడానికి దోహదపడతాయి. దానికనుగుణంగా మార్పులను భూమిలో కలుగచేస్తాయి. జీవన ఎరువులు సహజమైనవి వాడడం సులభం మరియు కాలుష్యం ఉండదు. పంటకు గాని, భూమికి గాని ఎలాంటి హాని కలుగచేయవు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయన ఎరువుల ధరలు అధికంగా ఉన్నందున చాలినంత సేద్రియ ఎరువులు లభ్యం కానందున జీవన ఎరువుల ప్రాధాన్యత రోజు రోజుకూ పెరుగుతుంది. సమగ్ర ఎరువుల వాడకంలో ఇది ఒకభాగమై నేలఆరోగ్యం ఉత్పాదకత కాపాడడంలో దిగుబడి నాణ్యత పెంచడంలోనూ ప్రముఖపాత్ర వహిస్తుంది. 

జీవన ఎరువులు:

  • నత్రజనిని స్థిరీకరించేది
  • భాస్వరాన్ని అందించేది.
  • పొటాషియం మొబిలైజర్స్.
  • జింకు సాల్యుబలైజర్స్
  • మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్.)
  • ద్రవరూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు

నత్రజని స్థిరీకరించే జీవన ఎరువుల వివరాలు:
పంట నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు సగటు దిగుబడి పెరిగే శాతం
కంది 65-80 19
పెసర, మినుము 20 20
అలసంద 34 23
శనగ 34-44 22
బఠాణి 20-28 13
వేరుశనగ 20-24 19
సోయాబీన్ 24-32 35

ఉపయోగించు విధానం: 100 మి.లీ. నీటిలో 10 గ్రా. పంచదార / బెల్లం / గంజి కలిపి 10 ని॥ మరగబెట్టి చల్లార్చి 200 గ్రా. రైజోబియం పొడిని కలిపి 10 కిలోల విత్తనాలపై చల్లి 10 ని॥ నీడలో ఆరబెట్టిన తరువాత పొలంలో నాటుకోవచ్చు.

ఇతర వివరాలు: వేర్వేరు పైర్లకు వేర్వేరు రైజోబియం కల్చరు వాడాలి.

అజటోబాక్టర్:
పంటః పప్పుజాతి మినహాయించి అన్ని పంటలు
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-16
సగటు దిగుబడి పెరిగే శాతం: 10
ఉపయోగించు విధానం: కిలోల కల్చరు ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటిన సమయంలో ఒక ఎకరంపై చల్లాలి.
ఇతర వివరాలు: సేంద్రియ పదార్థం ఉన్నప్పుడు సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తక్కువగా ఉన్న నేలల్లో కూడా పనిచేయును.

అజస్పైరిల్లమ్:
పంటః వరి, పత్తి, మిరప,జొన్న, అరటి
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-16
సగటు దిగుబడి పెరిగే శాతం: 15
ఉపయోగించు విధానం: 2 కిలోల కల్చరును 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో పోయాలి.
ఇతర వివరాలు: సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా పనిచేయును.

నీలి ఆకుపచ్చ నాచు :
పంటః వరి
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-12
సగటు దిగుబడి పెరిగే శాతం: 15
ఉపయోగించు విధానం: ఒక ఎకరం పొలంలో వరినాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో 4-6 కిలోలు. 40-50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లాలి.
ఇతర వివరాలు: రైతులే తయారు చేసుకోవచ్చు. నాచు సేంద్రియ పదార్ధంగా ఉపయోగపడును.

అసిటోబాక్టరు:
పంటః చెరకు
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 40-72
సగటు దిగుబడి పెరిగే శాతం: 10
ఉపయోగించు విధానం: ఒక ఎకరం పంటకు 4 కిలోల జీవన ఎరువును ముచ్చలు నాటేటప్పుడు 2 కిలోలు, మోకాలు లోతు పంటయినప్పుడు 2 కిలోలు 100 కిలోల సేంద్రియ ఎరువుతో వాడాలి.
ఇతర వివరాలు: చెక్కెర శాతం 0.5-1.0 పెరుగుతుంది.

అజొల్లా:
పంటః వరి
నత్రజని స్థిరీకరణ కిలోలు / ఎకరాకు: 8-12
సగటు దిగుబడి పెరిగే శాతం: 15
ఉపయోగించు విధానం: వరి నాటిన వారం తరువాత 200 కిలోల అజొల్లా ఒక ఎకరంలో వెదజల్లి 15-20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.
ఇతర వివరాలు: ఎండబెట్టి పొడిగా చేసి పశువులకు తినిపించడం వల్ల పాలఉత్పత్తి పెరుగును.

భాస్వరం అందించే జీవన ఎరువులు: పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి లభ్యం కాని భాస్వరం రూపంలో మారిపోవును. భాస్వరం అందించే జీవన ఎరువులు, సూక్ష్మజీవులు, శిలీంద్రాల ద్వారా భూమిలో నిల్వ ఉంచి లభ్యం కాని భాస్వరాన్ని మొక్కలకు అందుబాటులోకి తీసుకువస్తాయి. భాస్వరం వేసిన ఆమ్లనేలల్లో ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్‌గాను మారి మొక్కకు లభ్యం కాదు.
ముఖ్యంగా వాడుకలో ఉన్నవి…

  • ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బాక్టీరియా (ఫాస్ఫో బాక్టీరియా)
  • ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఫంగై (ఫాస్పో ఫంగై)
  • ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా (వి.ఎ.ఎం)

భాస్వరం అందించే జీవన ఎరువుల వివరాలను కింద పొందుపరచినాము..
ఫాస్ఫో బాక్టీరియా: ముఖ్యంగా బాసిల్లస్ మెగథీరియంతో గాని, సూడోమోనాస్‌తో గాని ఉపయోగించి తయారుచేయబడును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. సేంద్రియ ఎరువును వాడాలి. మొక్కలకు హార్మోన్లు సరఫరా చేసి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
వాడే విధానం: ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబాక్టర్‌ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో గాని సాళ్ళలో గాని వేసుకోవలయును. వరినాట్లు వేసిన 3-7 రోజుల వ్యవధిలో వేసుకోవాలి.
ఫాస్పో ఫంగై: ఆస్పర్ౙిల్లస్ అవమోరి లేదా పెనిసీలియం డిజిటోటమ్ ఉపయోగించి తయారు చేయబడును. అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఫాస్ఫో బాక్టీరియా కన్నా శక్తివంతమైన జీవన ఎరువు.
వాడే విధానం: 2.0 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి ఒక ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి.
ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా: శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. భాస్వరంతో పాటు జింకు, కాపర్, సల్ఫర్, మాంగనీసు, ఇనుము మొదలగు వాటిని కూడా మొక్కకు అందించును. మొక్కల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తి పెరగడం గమనించవచ్చు.
వాడే విధానం: 5 కిలోలు / ఒక ఎకరానికి వేయవలసి ఉంటుంది. తప్పనిసరిగా విత్తనం / మొక్క కింద మాత్రమే పడేటట్లు వాడాలి.
పొటాషియం మొబిలైజర్స్: మొక్కకు అందుబాటులో లేని పొటాషియం అందుబాటులోకి తెచ్చును. ముఖ్యంగా ప్రటూరియా అర్షానియా అనే బ్యాక్టీరియా పొటాషియంను మొబిలైజర్స్‌గా ఇవ్వబడుతుంది. 100 కిలోల సేంద్రీయ ఎరువులో 2.0 కిలోల జీవన ఎరువును కలిపి ఒక ఎకరం భూమిపై వెదజల్లవలెను. నూనె పంటలలో దీని ప్రభావం బాగా కనబడుతుంది.
జింకు సాల్యుబలైజర్స్: కొన్ని బాసిల్లస్ స్పీసిస్ ఉపయోగించి జీవన ఎరువును కొన్ని ప్రైవేటు సంస్థలు తయారుచేయబడుచున్నవి. వరి, మొక్కజొన్న వంటి పంటల్లో దీని ప్రభావం కొంత మేరకు చూడవచ్చు.
మొక్క పెరుగుదలను అభివృద్ధి పరచే జీవన ఎరువు (పి.జి.పి.ఆర్): మిశ్రమ సముదాయంతో కూడుకున్న జీవన ఎరువు. బాసిల్లస్ మరియు సూడోమోనాస్ జాతి బ్యాక్టీరియాలను మిశ్రమంగా తయారు చేసి పి.జి.పి.ఆర్‌గా అందించనున్నారు. పోషకాలు అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించును. భూమిలోని మొక్కలకు తెగుళ్ళు కలుగచేసే శిలీంద్రాలను పెరగకుండా అరికట్టును. ఒక ఎకరాకు రెండు కిలోలు జీవన ఎరువును 100 కిలోల పశువుల ఎరువుతో గాని, వానపాముల ఎరువుతో గాని విత్తనం నాటుకునే సమయంలో వెదజల్లాలి. అవసరమైనప్పుడు పైరుపై సాయంత్రం వేళ పిచికారి కూడా చేయవచ్చు.
ద్రవరూపంలో రూపొందించబడిన జీవన ఎరువులు: ఆచార్య యన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి అమరావతి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు రూపొందించిన ద్రవరూప జీవన ఎరువులు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఒక ఎకరం పొలానికి 300 మి.లీ. నుండి 500 మి.లీ. వరకు ప్రతి ఒక్కొక్క రకపు జీవన ఎరువును మిశ్రమ ద్రావణంగా చేసి వాడాలి. వీటిని విత్తనానికి గాని, భూమిలో గాని, నారును ముంచే పద్ధతి, డ్రిప్ పద్ధతిలో గాని వాడవచ్చు.

జీవన ఎరువుల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు:

  1. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడు వాడుకోవాలి.
  2. రసాయనిక ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు.
  3. ప్యాకెట్‌పై ఉన్న గడువు (షెల్ఫ్ పిరియడ్) దాటిన ఎరువులు వాడరాదు
  4. చల్లని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి.
  5. పైరుకు నిర్ధేశించిన జీవన ఎరువునే వాడాలి.
  6. విత్తనశుద్ధి చేయదలచినప్పుడు మొదటగా శిలీంద్రనాశినులతో శుద్ధి చేసి 24 గం॥ తరువాత జీవన ఎరువులను పట్టించాలి.
  7. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి.

జీవన ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. నత్రజని స్థిరీకరిస్తాయి. నేలలోని భాస్వరాన్ని అందుబాటులోకి తెస్తాయి.
  2. భూసార నిల్వలు పరిరక్షించబడతాయి. సూక్ష్మజీవులు పెరుగుతాయి.
  3. 20-25 శాతం నత్రజని, భాస్వరం ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. 10-20 శాతం దిగుబడులు పెరుగుతాయి.
  4. నేల నుండి సంక్రమించే తెగుళ్ళు కొంతమేర నిరోధించబడతాయి.
  5. హార్మోన్లు, విటమిన్లు, ఎంజైములు లభ్యమై మొక్క పెరుగుదల చురుకుగా ఉంటుంది.
  6. కాలుష్యం ఉండదు. నేలకు, పంటకు ఎటువంటి హానికలగదు.
  7. చవుడు నేలల్లో సోడియం కరిగించి నేలను సారవంతం చేస్తాయి.
  8. క్రమం తప్పకుండా 3-4 కాలాలు వాడిన ఎడల దిగుబడులు గణనీయంగా పెరిగి నేలసారవంతమై ఉత్పాదక శక్తి పరిరక్షింపబడుతుంది.

ఎం. మల్లికార్జున్ (9491238885) (సేద్య విభాగం), ఇ. శిరీష (కీటక విభాగం), కె. బాలాజీ నాయక్ (విస్తరణ విభాగం), వి. యుగంధర్ (ఉద్యాన విభాగం), ఎం. హరని (పశు విభాగం), ఇ. చండ్రాయుడు (సమన్వయ కర్త), శ్రీమతి లక్ష్మీ దేవి కృషి విజ్ఞాన కేంద్రం, కళ్యాణదుర్గం, ఆంధ్రప్రదేశ్, 515761

Read More

మూడు సంస్థల నుంచి వ్యవసాయ అంకురాలకు ప్రోత్సాహం

బయోనెస్ట్ కో ఇంక్యుబేషన్ కార్యక్రమం కింద వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ (నార్మ్) లో మూడు సంస్థల మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. నార్మ్, ఎ-ఐడియా, భారత నూనె గింజల పరిశోధన సంస్థ(ఐఐవోఆర్)ల ప్రతినిధులు దీనిపై సంతకం చేశారు. దీని కింద ఎంపికైన అంకురాలకు ఈ 3 సంస్థలు సాయం అందిస్తాయి. నార్మ్ సంచాలకుడు, ఎ-ఐడియా అధ్యక్షుడు ఆరఎం సుందరం, ఐఐవోఆర్ సంచాలకుడు ఆర్‌కె మాథూర్, అంకుర సంస్థల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

సాంకేతికతను సాగుకు అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు

వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని సాగుకు సాంకేతికతను అనుసంధానించడం ద్వారా రైతుకు మేలు చేయాలని నాబార్డ్ మాజీ చైర్మన్, ఐఐఎఫఎల్ సంస్థ ఫైనాన్స్ చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఆంగ్రూ) 63వ వ్యవస్థాపక దినోత్సవాలు గుంటూరు సమీపంలోని లాంఫాం ఆడిటోరియంలో శుక్రవారం జరిగాయి. వాతావరణ మార్పు అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్రూ అభివృద్ధికి రూ.3 లక్షలు విరాళం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రచురించిన ‘మారనున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులకు సుస్థిర వరి వ్యవసాయం’, గుంటూరు జిల్లాలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ప్రచురించిన ‘కంది సాగు సమగ్ర యాజమాన్యం, మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, అపరాల సాగులో సమగ్ర కలుపు యాజమాన్యం’ పుస్తకాలను ఆవిష్కరించారు.

Read More

స్థానిక విత్తన రకాలకు పటిష్ఠ సంరక్షణ

అస్థిర వర్షపాతం, పెరుగుతున్న ఉష్ణోగ్రత వంటి వాతావరణ మార్పులు వ్యవసాయానికి ముప్పుగా మారుతున్న తరుణంలో కరవును తట్టుకునే శక్తి, వ్యాధి నిరోధకత, అధిక పోషక విలువలున్న స్థానిక విత్తనాల సంరక్షణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ఇందుకు సామాజిక విత్తన బ్యాంకులు అవసరమని భావించి, సామాజిక విత్తన బ్యాంకుల నిర్వహణకు భారత ప్రమాణాల బ్యూరో (బీఎస్ఐ) రూపొందించిన నూతన మార్గ దర్శకాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ సమాచారం ఇచ్చింది.

Read More

యువత సాగు వైపు అడుగులేయాలి

విషతుల్యమైన సాగు పద్ధతుల వైపు మొగ్గుచూపడం భవిష్యత్తుకు అత్యంత ప్రమాదకరమని, సహజసిద్ధ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారానే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షును పొందగలడని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ స్పష్టం చేశారు. అమృతం వంటి సేంద్రియ విధానాలను అందిపుచ్చుకొనేందుకు యువత సాగు రంగంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుభాష్ పాలేకర్ కృషి విజ్ఞాన కేంద్రం’, ‘రైతునేస్తం ఫౌండేషన్, తిరుపతి భూలక్ష్మి నేచురల్ ఎఫ్‌పిసి, అక్రాన్ గ్రూప్-హైదరాబాద్, గ్రామీణ అభివృద్ధి సంక్షేమ సంస్థ – WORD, సేవ్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో తిరుపతిలో ఐదురోజుల జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఈ సదస్సులో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. తొలిరోజు శిక్షణకు 12 రాష్ట్రాల నుంచి సుమారు 892 మంది ప్రతినిధులు హాజరైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More

పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని, “భారత హరిత విప్లవానికి దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ అద్భుత సేవలు” అనే అంశంపై విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జాతీయ సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1964లో స్థాపించబడిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయ పరిశోధన, విద్య, విస్తరణ సేవల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయ భవనాలను 1966లో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ప్రారంభించడం విశ్వవిద్యాలయ చరిత్రలో గర్వకారణమని పేర్కొన్నారు.

1960లలో దేశం ఎదుర్కొన్న తీవ్ర ఆహార సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీమతి ఇందిరా గాంధీ రాజకీయ నాయకత్వం, డా. ఎం.ఎస్. స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తల కృషి కలిసి హరిత విప్లవానికి దారితీశాయని మంత్రి కొనియాడారు. ఆ విప్లవ ఫలితంగానే భారత్ నేడు ప్రపంచంలో అగ్రగామి ఆహార ధాన్య ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు.

గత 62 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయం 525 పంట రకాలను అభివృద్ధి చేసిందని, తెలంగాణ సోనా, బీపీటీ-5204, ఎంటీయూ-1010 వంటి వరి రకాలు, డీహెచఎం సిరీస్ మొక్కజొన్న సంకర రకాలు దేశవ్యాప్తంగా రైతుల ఆదరణ పొందాయని తెలిపారు. వేలాది మంది వ్యవసాయ పట్టభద్రులు, పరిశోధకులను తయారు చేసి వ్యవసాయ రంగానికి విశేష సేవలందించిందన్నారు.

రైతు నేస్తం, డ్రోన్ అకాడమీ, అగ్రిహబ్, డిజిటల్ అగ్రికల్చర్, కృత్రిమ మేధస్సు ఆధారిత పరిశోధనలతో విశ్వవిద్యాలయం భవిష్యత్ వ్యవసాయానికి కేంద్రబిందువుగా మారుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ వ్యవసాయం ప్రస్తుతం ఏఐ, రోబోటిక్స్, డ్రోన్లు, ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపు వేగంగా అడుగులు వేస్తోందని, తెలంగాణ కూడా ఆ దిశగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపై కేవలం ఉత్పత్తి పెంపుపై కాకుండా పంటలకు విలువ పెంచడం, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఎగుమతులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. రైతు ఆదాయం పెరగాలంటే విలువ ఆధారిత వ్యవసాయం, మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పారు.

అలాగే భవిష్యత్తులో కార్బన్ క్రెడిట్స్, బయో ఎకానమీ, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి రంగాలు రైతులకు కొత్త ఆదాయ వనరులుగా మారనున్నాయని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కూడా రైతుకు ఆదాయ వనరుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

తెలంగాణ వ్యవసాయం ఉత్పత్తి కేంద్రిత వ్యవసాయం నుంచి విలువ ఆధారిత, సాంకేతిక ఆధారిత, మార్కెట్ ఆధారిత వ్యవసాయంగా రూపాంతరం చెందాలని, ఆ మార్పుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాయకత్వం వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మరియు కమిషన్ సభ్యులు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్ౙి బి సుదర్శన్ రెడ్డి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్, మధుర స్వామినాథన్, మాజీ పార్లమెంట్ సభ్యుడు, పాలసీ అనలిస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ మరియు ప్రస్తుత వైస్ ఛాన్సలర్లు జానయ్య, రాజిరెడ్డి, జ్ఞానేందర్, విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు మరియు విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More

అయిదుగురి జీవితాలకు వెలుగునిచ్చిన రైతు అవయవదానం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం నిజాంపేటకి చెందిన రైతు భూమా గౌడ్(64) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ నెల 7న ఇంట్లో ఉన్న సమయంలో అధిక రక్తపోటు వల్ల కిందపడిపోయారు. కుటుంబీకులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యం అందించిన డాక్టర్లు.. భూమాగౌడ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ వైద్య బృందం భూమాగౌడ్ కుమారుడు సాయికుమార్ ఇతర కుటుంబీకులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో రెండు కిడ్నీలు, కాలేయం సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. రెండు కంటి కార్నియాలనూ సేకరించి చూపు లేనివారికి అమర్చినట్లు నోడల్ అధికారి శ్రీభూషణరాజు పేర్కొన్నారు.

Read More

బయోచార్‌గా పంట వ్యర్థాలు

పంట వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు బయోచార్ (జీవబొగ్గు) విధానాన్ని అమలు చేయాలని కొండాలక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల నివేదిక సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థాలు దహనం జరుగుతున్న నేపథ్యంలో.. వ్యవసాయానుబంధ శాఖలు, వర్సిటీలతో అధ్యయనం చేయించి, నివేదిక సమర్పించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. దీనికి అనుగుణంగా ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి తమ శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. పంట వ్యర్థాలతో రూపొందించే బయోచార్ విధానం దీనికి సరైన పరిష్కారమని చర్చించారు. పొలంలో గొయ్యి తీసి దానిలో పంట వ్యర్థాలను వేసి దహనం చేసి బొగ్గుగా మార్చి ఎరువుగా ఉపయోగిస్తున్నారు. దీనిపై హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో బయోచార్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించగా.. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించారు.

Read More