‘సంజీవని’ సేంద్రియ ఎరువు

ఎకరం పొలానికి సంజీవని సేంద్రియ ఎరువు తయారీకి కావలసినవి: 2 టన్నుల (ట్రాక్టర్) చివికిన పశువుల ఎరువు. ఆవులు / గేదెలు / ఎద్దుల ఎరువు ఏదైనా పనికొస్తుంది.

4 టన్నుల (2 ట్రాక్టర్ల) మట్టి, 50 కిలోల వేప పిండి, 80 కిలోల వేరుశనగ / ఆముదం / కానుగ చెక్క (కొంచెం నూనె ఉన్నది కావాలి), 50 కిలోల బెల్లం (తక్కువ ధరకు దొరికే బంక / నల్లబెల్లం సరిపోతుంది), అన్నీ కలిపి 18 కిలోల మేరకు 9 రకాల ధాన్యాలు. గింజలో రెండు బద్దలుండే పప్పు జాతి, ఒకటే గింజ ఉండే ధాన్యం రకాలు కలిసి ఉండాలి. కొర్రలు, రాగులు, జొన్నలు, పెసలు, కందులు, బుడ్డ శనగలు, ఉలవలు, మినుములు, సజ్జలు వంటివి వాడొచ్చు.

7-8 టన్నుల ముడిపదార్థాలను వాడితే.. 21 రోజులకు సుమారు 12 టన్నుల సంజీవని ఎరువు తయారవుతుంది. ఏ పంటకైనా ఒకసారి ఈ సంజీవని ఎరువు వేస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు పోషకాలను అందిస్తుంది. ఏ పొలం కోసం ఈ ఎరువును తయారు చేస్తున్నామో.. ఆ పొలంలోని నేల రకానికి భిన్నమైన రకానికి చెందిన మట్టిని ఈ ఎరువు తయారీకి ఉపయోగించడం ముఖ్యం. అంటే.. ఎర్రమట్టి భూములకు నల్లరేగడి మట్టి, నల్లరేగడి భూములకు ఎర్ర మట్టి, ఇసుక నేలలకు బంక మట్టి, బంక నేలలకు ఇసుక (తువ్వ) మట్టి వాడాలి.

సంజీవని ఎరువును తయారు చేసే పద్దతి:
తొమ్మిది మీటర్ల పొడవు, మీటరు వెడల్పుతో నీడన బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్లను ఏర్పాటు చేసేటప్పుడు నేలపై మట్టిని కొద్దిగా తొలగించాలి.

ముందుగా బెల్లం పానకం తయారు చేసుకోవాలి.

సేకరించుకున్న మట్టిని ఒక పొరలాగా వేసుకొని, పానకం చల్లాలి. దానిపై పశువుల ఎరువును 2, 3 అంగుళాల మందాన చల్లాలి. వేరుశనగ / ఆముదం / కానుగ చెక్కను చల్లాలి. దానిపై మళ్లీ బెల్లం పానకం చల్లాలి. ఇలా అనేక దొంతర్లుగా వేస్తూ బెడ్లను ఏర్పాటు చేసుకోవాలి.

బెడ్డుపై రోజుకోసారి తగినంత నీరు చల్లుతుండాలి. ఆరో రోజు బెడ్డులో మట్టిని కలియ తిప్పి. పైన చదునుగా చేయాలి.

నవధాన్యాలను నీళ్లలో ఒక గంటపాటు నానబెట్టి ఆ తరువాత బెడ్లపైన చల్లాలి. గింజలు కనిపించకుండా మట్టిని ఎగదోయాలి. మట్టికి తడి ఉండేలా చూసుకోవాలి.

21 రోజుల వరకు బెడ్లపైన ఉన్న గింజలు / మొలకలను పక్షులు, కోళ్లు తినకుండా దోమతెర లాంటి గుడ్డనుగాని, వలను గాని,షేడ్ నెట్ను గాని ఏర్పాటు చేసుకోవాలి.

22వ రోజుకు నవధాన్యాలు బెడ్లపైన మొలిచి ఏపుగా పెరుగుతాయి. సంజీవని ఎరువు వాడకానికి సిద్ధమవుతుంది. సంజీవని ఎరువు ఎలా వాడాలంటే..

బెడ్లలో తయారైన ఎరువును ఒక వరుస నుంచి కలియబెడుతూ కుప్పగా చేసుకుంటూ, దాన్ని గంపలతో అప్పకటిప్పుడు పంటలకు వేసుకోవాలి. పండ్ల చెట్లకు ఇరువైపులా కొమ్మల కింద భూమిని నులివేర్లు బయటకు కనపడే వరకు తవ్వి ఈ ఎరువును గాడిలో పోసి పైమట్టిని కప్పాలి. కూరగాయల మొక్కల వద్దనే సంజీవని ఎరువు వేసి మట్టితో కప్పాలి.

డ్రిప్ ఉంటే.. డ్రిప్పర్ల దగ్గర వేయాలి. కూరగాయల మొక్కలకు 4 కిలోల చొప్పున వేయాలి. ఏడాది వయసున్న పండ్ల మొక్కలకు 10 కిలోలు వేయాలి. ఆపై ప్రతి ఏడాది వయసుకు 10 కిలోల చొప్పున వేయాలి. ఉదా: రెండేళ్ల మొక్కకు 20 కిలోలు.

వేరుశనగ పంటకైతే.. విత్తనం వేశాక 40 రోజుల్లోపు కలుపు తీసి.. పైరుపై సంజీవని ఎరువును చల్లి నీటి తడి అందిస్తే చాలా చక్కగా పంట ఎదుగుతుంది.

కూరగాయ పంటను తొలగించి మళ్లీ కూరగాయలను పండించాలనుకుంటే.. గతంలో ఉన్న మొక్కల స్థానంలో కాసింత వేప ద్రావణం చల్లి మొక్కను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

వరి పొలంలో దమ్ము చేయడానికి ముందు నల్ల నేలైతే ఎకరానికి 4-5 టన్నులు, ఇతర భూములైతే 5-6 టన్నుల సంజీవని ఎరువు వాడాలి.

పొలానికి వేయగా మిగిలిన సంజీవని ఎరువును బస్తాల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు. బెల్లం పానకం చల్లి, కలియదిప్పి పొలానికి వేసుకోవచ్చు. టన్ను ఎరువులో 5 కిలోల పేడ, 5 కిలోల బెల్లంను 200 లీటర్ల నీటిలో కలిపి చల్లాలి.

Read More

వండని వంట…టొమాటో పచ్చడి

ఈ ‘టొమాటో పచ్చడి చిక్కటి లిక్విడ్ లాగా ఉంటుంది! దోసెలలోకి, మిక్స్‌డ్ మిల్లెట్ దోశలోకి సూపర్‌గా ఉంటుంది. టమాటా, పచ్చి మిరపకాయ, ఎల్లిగడ్డ, అల్లం, ఉప్పు వేసుకుని నూరడమే!

ఇందులో ఉన్నటువంటి ఇంగ్రిడియంట్స్ సింపుల్.

రెసిపీ రోట్లో నూరుకుంటే సూపర్ ఉంటది. లేకుంటే మిక్సీలో మెత్తగా పేస్ట్‌గా కాకుండా, కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. తాలింపు లేదు, నూనె లేదు, పోపు గింజలు లేవు, చింతపండు లేదు, నిమ్మరసం లేదు రుచి మాత్రం అద్భుతం.

Read More

ఆరోగ్యకరమైన లేయర్ పుల్లెట్ కోళ్లు – లాభాల సిరులు

లాభదాయకమైన లేయర్ల పెంపకం నాణ్యమైన పుల్లెట్‌ల పెంపకం నుండే ప్రారంభం అవుతుంది. తక్కువ వయసున్న పుల్లెట్‌లు అండోత్పత్తి దశకు చేరే సమయానికి సరైన శరీర బరువు ఉన్నట్లయితే వాటి జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడానికి వీలు అవుతుంది.

షెడ్ ఏర్పాటుచేసుకోవడం:
పాత బ్యాచ్ తీసి వేసిన తరువాత కొత్త బ్యాచ్ మొదలు పెట్టడానికి కనీసం 3 వారాల విరామ సమయాన్ని పాటించాలి. షెడ్‌ని శుబ్రపరిచే ముందు షెడ్‌లో ఉన్న మేత మరియు కోళ్ల లిట్టర్‌ని తొలగించి, ఎలుకల నియంత్రణ కూడా చేపట్టాలి. షెడ్ మొత్తాన్ని అధిక ప్రెషర్ కలిగిన నీటి జెట్ వాషర్ సహాయంతో కడగాలి. ఇదే సమయంలో షెడ్‌కి కావలసిన మరమ్మతులు చేయించుకుని పెట్టుకోవాలి. పాత బ్యాచ్ కోళ్లను తీసి వేసిన తర్వాత ఆ బ్యాచ్‌లో ఉపయోగించిన ఫీడర్లు, డ్రింకర్లను తీసేసి ముందుగా డిటర్ౙెంట్‌తో బాగా కడిగి, తర్వాత డిస్ ఇంఫెక్టన్ట్ ద్రావణంలో ఒక రాత్రి అంతా నానబెట్టి, మరుసటి రోజు శుభ్రమైన నీటితో కడిగి, ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వలన బాక్టీరియాలు చనిపోతాయి. తరువాత పాత బ్యాచ్ లిట్టర్ అంతా పూర్తిగా తీసేయాలి. కడిగే సమయంలో షెడ్డు పై కప్పు నుంచి మొదలు పెట్టి తర్వాత గోడలు, ఆపై నేలను శుభ్రం చేసుకోవాలి. నేలను ప్రెషర్ వాషెర్ సహాయంతో శుభ్రం చేసి, డిస్ ఇంఫెక్టన్ట్ ద్రావణాన్ని స్ప్రే చేయాలి. నేల మొత్తాన్ని ఫ్లేమ్ గన్ సహాయంతో కాల్చాలి. ఇలా కాల్చటం వలన క్రిములు, కోడి ఈకలు మరియు వాటిపై ఉండే క్రిములు అన్నీ నశిస్తాయి. మట్టి నేల ఐతే పొడి సున్నాన్ని చల్లాలి, కాంక్రీట్ ఫ్లోర్ ఉన్నట్లయితే సున్నంతో వైట్ వాషింగ్ చేయించుకోవాలి. ఇదే సమయంలో వాటర్ ట్యాంక్ మరియు నీటి పరికరాలు అన్నీ శుభ్రం చేసుకోవాలి. వాటర్ లైన్‌లు శుభ్రపరుచుటకు లిదీబీజిరిదిజిరిదీ, ఔ904, ఇతర డిస్ ఇన్ఫిక్టన్ట్ ద్రావణాలు వాడాలి, తర్వాత శుభ్రమైన నీటితో కడగవలెను.

కోడి పిల్లలు రాకముందు:
కోడిపిల్లలు రావడానికి 48 గంటల ముందుగానే షెడ్ రెడీ చేసుకోవాలి. కోడి పిల్లలు షెడ్ కి చేరుకునే సమయానికి షెడ్ ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండేలా, షెడ్ సైజుని బట్టి ముందుగానే లైట్లు ఆన్ చేసుకోవాలి. దీనివలన షెడ్ లోపల వాతావరణం సరైన ఉష్ణోగ్రతకి చేరుకుంటుంది. ఫీడర్లలో దాణా కనిపించేలా వెలుతురు 30 – 35 లక్స్ ఉండేలా చూసుకోవాలి. నాణ్యమైన తాజా చిక్ స్టార్టర్ దాణాని ఫీడర్లలో నింపాలి. అలాగే కోడి పిల్ల తాగడానికి అనువుగా డ్రింకర్లలో నీటిని నింపి తగిన ఎత్తులో అమర్చాలి. ఒత్తిడిని తగ్గించడానికి నీటిలో విటమిన్లు, ఎలెక్ట్రోలైట్స్ కలపాలి.

కోడి పిల్లల నాణ్యతః
కోడిపిల్లలను నాణ్యమైన పేరెంట్స్ / హేచరీ నుండి తీసుకోవాలి. కోడిపిల్లలు మంచి బరువుతో పూర్తిగా ఆరిపోయి మరియు బొడ్డు బాగా నయమై ఉండాలి. కాళ్ళు నిటారుగా ఎలాంటి లోపాలు లేకుండా ఉండాలి. మొదటి రోజునే మారెక్స్ వ్యాధి రాకుండా హెచ్‌వీటి స్ట్రెయిన్ టీకా వేయించాలి.

బ్రూడింగ్ – అతి ప్రధానం:
కోడి పిల్లల జీవితంలో మొదటి రెండు వారాలు క్లిష్టమైనవి.అపుడే పుట్టిన కోడిపిల్లలు వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. కావున వాటికి అనువైన వాతావరణాన్ని అందించాలి. కేజ్‌లో కోడి పిల్లల కాళ్ళు ఇరుక్కోకుండా న్యూస్ పేపర్‌ని పరచాలి. కోడి పిల్లలను కేజ్‌లో పెంచుతున్నట్లు ఐతే న్యూస్ పేపర్ మీద దాణాని చల్లి ఉంచాలి, ఇలా చేయడం ద్వారా కోడి పిల్లలలో దాణా తినడాన్ని ప్రేరేపించవచ్చు. కోడి పిల్లలు ఎంత తొందరగా తినడం మొదలుపెడతాయో అంత వేగంగా వాటి ఎదుగుదల ఉంటుంది. హేచరీ నుండి బయటికి వచ్చాక ఎంత తొందరగా తింటే అంత ఆరోగ్యాంగా ఉంటాయి, లేకపోతే డీహైడ్రేషన్ వలన బలహీనం అవుతాయి. కేజ్‌లలో పిల్లలు నేల మీద పిల్లల లాగా కదల్లేవు కాబట్టి వాటికి కావలసిన ఉష్ణోగ్రత మరియు తేమని అందించాలి.

షెడ్లలో పాటించాల్సిన ఉష్ణోగ్రతలు
వయస్సు (రోజులలో) కావాల్సిన ఉష్ణోగ్రత (డిగ్రీల సెంటీగ్రేడ్)
1-7 32-33
8-14 28-30
15-21 26-28
22-28 23-26
28-35 21-23

సరైన బరువును చేరుకోవడానికి కోడి పిల్లల నిర్వహణః
ఒక క్రమబద్ధమైన సమతుల్యమైన పెరుగుదల రేటును అనుసరిస్తూ కోడి పిల్లలు ఎదుగుతాయి. ఎదిగేటపుడు వాటికి కావలసిన పోషణ, టీకాలు, సరైన నిర్వహణ, లైటింగ్ / వెలుతురు అందించినపుడు, కోళ్లు జాతి / బ్రీడ్ జన్యు సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. ఎదిగే దశలో బ్రీడ్ సామర్థ్యానికి తక్కువ బరువు ఉండే కోళ్ళలో అవయవాలు సరిగా అభివృద్ధి చెందక, దీని ప్రభావం గుడ్లు పెట్టే దశలో కన్పిస్తుంది. దీనివల్ల గుడ్ల సంఖ్య తగ్గిపోవడం, చిన్న గుడ్లు రావడం లేదా దాణా వినియోగం తగ్గిపోవడం జరిగి రైతులు నష్టపోతారు.

ఎదిగే దశను 3 భాగాలుగా విభజించవచ్చు.
0-6 వారాల వయసు వరకు: ఈ సమయంలో జీర్ణ వ్యవస్థ మరియు రోగ నిరోధక వ్యవస్థ బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ సమయంలో ఎలాంటి పోషక లోపమైన, ఫారం నిర్వహణలో జరిగే లోపాలు ఈ రెండు వ్యవస్థలను శాశ్వతంగా దెబ్బ తీస్తాయి. దీని వలన కోళ్లు తేలికగా వ్యాధులకు గురి అవుతాయి.

6-12 వారాల వయసు వరకు: ఈ సమయంలో కోళ్ల కండరాలు, ఎముకలు, ఈకలు వేగంగా వృద్ధి చెందుతాయి. 12-13 వారాలు వచ్చే సరికి 95 % అస్థిపంజరం అభివృద్ధి చెందుతుంది. ఆ తరువాత ఎముకలలో ఎదుగుదల ఉండదు. కోడి అస్థిపంజరం పరిమాణాన్ని బట్టి గుడ్డు పెంకు నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఎదుగుదల సరిగా లేని కోళ్ళ గుడ్డు పెంకు బలహీనంగా ఉండి గుడ్లు తొందరగా పగిలిపోవడం జరిగి రైతుకు నష్టం కలుగుతుంది.

13-17 వారాల వయసు వరకు: ఈ సమయంలో శరీర ఎదుగుదల తగ్గి జననేంద్రియాలు వృద్ధి పెరిగి అండోత్పత్తికి సిద్దం అవుతాయి. శరీరంలోని కండరాలు మరియు ఫ్యాట్ అభివృద్ధి సాగుతూనే ఉంటుంది. ఈ దశలో శరీర బరువు 17-18 వారాలలో ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే అండోత్పత్తి ఆలస్యం అవుతుంది.

కోళ్లు ఎదిగే వయసులో – ముఖ్య దశలు:

  1. బ్రూడింగ్ – ఉష్ణోగ్రత సరిగ్గా ఉండేలా చూడాలి. కాలాన్ని మరియు వయసును బట్టి ఉష్ణోగ్రతను మారుస్తూ ఉండాలి.
  2. 5వ వారం కనీస శరీర బరువు 350 గ్రా. ఉండేలా చూసుకోవాలి. ప్రతి వారం సాంపిల్ బరువులు నిర్దిష్ట బరువుతో సరిచూసుకోవాలి. ఒకవేళ నిర్దిష్ట బరువు లేనట్లయితే దానికి గల కారణాలను వెంటనే సవరించుకోవాలి. ఉదాహరణకి దాణాలో పోషకాల లోపం, ఫీడర్ల మరియు డ్రింకర్ల సంఖ్య కావాల్సిన దానికన్నా తక్కువగా ఉండడం మరియు వాటి ఎత్తు కోళ్ల ఎత్తుకి ఎప్పటికపుడు సర్దుబాటు చేయడం.
  3. ముక్కు కత్తిరించడం బిక్ ట్రిమ్మింగ్ :
  • కోడి పిల్లల ముక్కు ముందు భాగాన్ని బిక్ ట్రిమ్మర్‌లో పెట్టి, సరైన ఉష్ణోగ్రత అనగా బ్లేడ్ 650 సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత కు చేరుకున్నాక కోడి పిల్ల పరిమాణం బట్టి ఈ సైజు రంద్రాన్ని వాడాలో నిర్ణయించుకోవాలి.
  • ట్రిమ్మింగ్ బ్లేడ్ నారింజ ఎరుపు రంగుకు చేరినట్లయితే అది 650 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగి ఉన్నట్లు గుర్తించాలి.
  • 10 -14 రోజుల వయసులో మొదటి సారి, 14 వారాల లోపు ఇంకొకసారి ముక్కును కత్తిరించుకోవాలి.
  • రెండవసారి ముక్కు కత్తిరించడం 14 వారాల లోపు చేయాలి, తర్వాత చేస్తే అంటే 15 -17 వారాల వయసులో చేయడం వలన నొప్పికి దాణా మరియు నీరు సరిగా తీసుకోక పోషక లోపం జరిగి జననేంద్రియాల అభివృద్ధికి ఒత్తిడి కలిగి గుడ్లు పెట్టడం ఆలస్యమవడమే కాకుండా చిన్న గుడ్లు ఎక్కువ సంఖ్యలో వచ్ౘ్ి రైతులు నష్టపోతారు.
  1. సమయానికి బ్రూడర్ కేజ్ ల నుండి గ్రోవర్ కేజ్ లోకి మార్చాలి.
  2. బ్రూడింగ్ నుండి గ్రోయింగ్ షెడ్లలో ఒకేరకమైన నీటి వ్యవస్థని వాడాలి.

కోళ్లు ఎదిగే వయసులో – ముఖ్య అంశాలు:
శరీర బరువు పర్యవేక్షణ :

  • ఒక వారం వయసు నుండి కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించే వయసు వరకు ప్రతి వారం కోడిపిల్లల బరువు చూడాలి. 4 వారాల వరకు గ్రూప్ బరువు, 4 వారాల నుండి 18 వారాల వరకు విడివిడిగా బరువును చూడాలి. తరువాత రెండు వారాలకు ఒకసారి బరువులు చూసినట్లయితే సరిపోతుంది.
  • కేజ్ లలో కోళ్లను ఒకే దగ్గరనుండి కాకుండా మొదటి కేజ్‌లు, చివరి కేజ్‌లు మరియు మధ్య కేజ్‌లలో నుండి తీసుకోవాలి. అదేవిదంగా పైనుండి, మధ్య కేజ్‌లు మరియు కింద వరస కేజ్‌లలోనుండి కోళ్లను ఎంచుకోవాలి.
  • ఇలా పర్యవేక్షించడం ద్వారా వాటి ఎదుగుదలలో సమస్యలను వెంటనే గుర్తించి దాణాలో మార్పులను సరిచేసుకోవచ్చు. తక్కువ బరువులున్న కోళ్లను గ్రేడింగ్ చేసి షెడ్‌లో ఒకవైపు కేజ్‌లలోకి మార్చి కొన్ని రోజులు వాటికి స్టార్టర్ దాణాని అందించాలి.

శరీర బరువు ఏకరూపతః

  • శరీర బరువు ఏకరూపత అనేది భవిష్యత్తులో వాటి అండోత్పత్తి సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. ఎదిగే వయసులో 85% ఉండాలి, ఇలా ఉంటే అన్ని కోళ్లు ఒకేసారి అండోత్పత్తికి చేరి అధిక గుడ్లు ఉత్పత్తి చేస్తాయి.
  • యూనిఫార్మిటీ అనేది కంపెనీ స్టాండర్డ్‌తో సరిగా ఉంటే గుడ్ల ఉత్ఫత్తి మరియు గుడ్ల బరువులో తేడాలు లేకుండా ఉంటాయి, తద్వారా రైతు మంచి లాభాలను పొందవచ్చు.

లైటింగ్:

  • లైటింగ్ అనేది గుడ్లు పెట్టె కోళ్ళలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సమయానికి లైటింగ్ అనేది ఇవ్వకపోతే గుడ్ల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. లైటింగ్ లో రెండు అంశాలు – లైటింగ్ వ్యవధి మరియు తీవ్రత.
  • మొదటి 3 రోజులు 23 గంటలు, 3 వ రోజు నుండి – 3 వారాల వరకు నెమ్మదిగా 23 గంటల నుండి 16 గంటల లైటింగ్ వ్యవధికి తగ్గిస్తూ రావాలి. 4 వ వారం నుండి 7వ వారం వరకు వారానికి ఒక రోజు చొప్పున 12 గంటల వ్యవధికి తగ్గించాలి. 8 వ వారం నుండి 16 /17 వారం లేదా నిర్ణీత శరీర బరువు వచ్చే వరకు సహజంగా వచ్చే లైటింగ్ మాత్రమే ఇవ్వాలి. నిర్ణీత బరువు చేరుకున్నాక లైట్‌తో ప్రేరేపించాలి.
  • శరీర బరువు నిర్ణీత బరువు కన్నా తక్కువ ఉంటే లైట్‌తో ప్రేరేపించడం ఆలస్యం చేయాలి.

కాంతి తీవ్రతః
వయసు 0-7 రోజులు 1-4 వారాలు 4-17 వారాలు >17 వారాలు గుడ్లు పెట్టే దశలో
Lux Min–20 10 6 10 30-35

  • నిర్ణీత బరువు రాకముందే లైటింగ్ ఇచ్చినా లేదా లైటింగ్ తీవ్రత 30 Lux కన్నా ఎక్కువ ఇస్తే కోళ్ళలో ప్రోలాప్స్ వచ్చే ప్రమాదం ఉంది. కావున లైటింగ్ ఇచ్చే ముందు బరువు సరిచూసుకోవడం చాల ముఖ్యం.
    ఎదిగే దశలో ఎదురయ్యే సమస్యలు దీర్ఘ కాలంలో అండోత్పత్తి దశలో గుడ్ల సంఖ్య, సైజు మరియు గుడ్ల పెంకు యొక్క నాణ్యతపై ప్రభావం చూపుతాయి, కాబట్టి పూర్తి శ్రద్ధతో అన్ని అంశాలను పాటించి సరైన శరీర బరువు చేరుకునేలా పుల్లెట్ కోళ్లను పెంచినట్లయితే అధిక లాభాలను అందుకోవచ్చు.
    పుల్లెట్ కోళ్లను పెంచే క్రమంలో పైన తెలిపిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ అవి గుడ్లు పెట్టడం ప్రారంభించిన తరువాత వచ్చే చాలా సమస్యలను అధిగమిస్తూ, ఆశించిన స్థాయిలో ఫలితాలను చూడవచ్చు.

డా. కె. ప్రశాంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కోళ్ల శాస్త్ర విభాగం, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్, పివిఎనఆర్‌టివియు, ఫోన్: 7013179181

Read More

చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి – ప్రాముఖ్యత

చేపల పెంపకంలో అధిక ఉత్పత్తి సాధించడానికి నాణ్యమైన చేప పిల్లలు, సమతుల్య ఆహారం, సరైన నీటి నాణ్యత మరియు వ్యాధి నియంత్రణతో పాటు చెరువులో సహజ ఆహార వనరుల లభ్యత కూడా ఎంతో ముఖ్యమైనది. ఈ సహజ ఆహార వనరులలో అత్యంత ప్రాధాన్యత కలిగినవి ప్లవకాలు. చేపల చెరువులో ప్లవకాల ఉత్పత్తి సమృద్ధిగా ఉన్నప్పుడు చేపల పెరుగుదల మెరుగుపడటంతో పాటు అనుబంధ ఆహార వ్యయం కూడా తగ్గుతుంది. అందువల్ల ప్లవకాల ఉత్పత్తి చేపల సాగులో కీలకమైన అంశంగా పరిగణించబడుతుంది.

ప్లవకాలు అంటే ఏమిటి?
నీటిలో స్వేచ్ఛగా తేలియాడే సూక్ష్మ జీవులను ప్లవకాలు అంటారు. ఇవి కంటికి కనిపించని స్థాయిలో చిన్నవిగా ఉండి చెరువు జీవావరణ వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేప పిల్లల నుంచి పెద్ద చేపల వరకు వివిధ దశల్లో ఇవి సహజ ఆహారంగా ఉపయోగపడతాయి.

ప్లవకాల రకాలు
చెరువులలో ప్రధానంగా రెండు రకాల ప్లవకాలు కనిపిస్తాయి

వృక్ష ప్లవకాలు (ఫైటోప్లాంక్టాన్)
సూర్యరశ్మి సహాయంతో కిరణజన్య సంయోగక్రియ జరిపి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే సూక్ష్మ మొక్కల సమూహాన్ని వృక్ష ప్లవకాలు అంటారు.

జంతు ప్లవకాలు (జూప్లాంక్టాన్)
వృక్ష ప్లవకాలపై ఆధారపడి జీవించే సూక్ష్మ జీవులను జంతు ప్లవకాలు అంటారు. ఇవి చేప పిల్లలకు అత్యంత పోషకమైన సహజ ఆహారం.

చేపల చెరువులలో ప్లవకాల ప్రాముఖ్యత
ప్లవకాలు చేపల చెరువులలో ఆహార గొలుసుకు పునాది వంటివి. చేపల పెరుగుదల, జీవన శాతం, ఆరోగ్యం మరియు ఉత్పత్తి స్థాయిని ప్రభావితం చేసే ముఖ్యమైన జీవ వనరులు. చెరువులో తగిన స్థాయిలో ప్లవకాలు ఉంటే చేపల పెరుగుదల వేగవంతమవుతుంది. అదనంగా రైతులు అనుబంధ ఆహారంపై చేసే ఖర్చు కూడా తగ్గుతుంది.

ప్లవకాల ఉత్పత్తికి అవసరమైన పరిస్థితులు
ప్లవకాల ఉత్పత్తి చెరువు నేల సారం, నీటి నాణ్యత, సూర్యరశ్మి లభ్యత మరియు ఎరువుల వినియోగంపై ఆధారపడి ఉంటుంది. చెరువు తయారీ సమయంలో భూసార పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు పోషకాలను అందించడం ద్వారా ప్లవకాల పెరుగుదలను ప్రోత్సహించవచ్చు.

ప్లవకాల ఉత్పత్తిలో ఎరువుల పాత్ర
చేపల చెరువులలో సహజ ఆహారమైన వృక్ష ప్లవకాలు మరియు జంతు ప్లవకాలు ఉత్పత్తిని పెంచడంలో ఎరువులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వృక్ష ప్లవకాల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం వంటి పోషకాలను అందించడం వల్ల ప్లవకాల ఉత్పత్తి వేగంగా ప్రారంభమవుతుంది.
జంతు ప్లవకాల ఉత్పత్తి కోసం పశువుల పేడ, కోళ్ల పెంట వంటి సేంద్రీయ ఎరువులను వినియోగిస్తారు. చెరువు తయారు చేసుకునే సమయంలో హెక్టారుకు 5-10 టన్నుల పశువుల పేడ లేదా 2-3 టన్నుల కోళ్ల పెంట వేయడం ద్వారా సూక్ష్మజీవుల పెరుగుదల ప్రోత్సహించబడి జంతు ప్లవకాల ఉత్పత్తి పెరుగుతుంది. అదనంగా జింక్, మాంగనీస్, కోబాల్ట్, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలు ప్లవకాల వృద్ధిని మెరుగుపరుస్తాయి.
ఎరువులను శాస్త్రీయ మోతాదులో సమతుల్యంగా వినియోగించడం ద్వారా చెరువులో సహజ ఆహార లభ్యత పెరిగి చేపల పెరుగుదల, ఆరోగ్యం మరియు ఉత్పాదకత మెరుగుపడతాయి. అయితే అధిక మోతాదులో ఎరువులు ఉపయోగించడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉన్నందున అవసరానికి అనుగుణంగా మాత్రమే వినియోగించాలి

వృక్ష ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు
వృక్ష ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా నీటిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేస్తాయి. చేపలకు సహజ ఆహారాన్ని అందించడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. నీటిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. హానికరమైన కొన్ని సూక్ష్మజీవుల పెరుగుదలను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి.

జంతు ప్లవకాల వల్ల కలిగే ప్రయోజనాలు
జంతు ప్లవకాలలో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి. చేప పిల్లల ప్రారంభ దశ పెరుగుదలలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చెరువులో సమృద్ధిగా జంతు ప్లవకాలు ఉండటం వల్ల చేపల ఆరోగ్యం మెరుగుపడి మరణాల శాతం తగ్గుతుంది.

నీటి నాణ్యత పై ప్లవకాల ప్రభావం
పగటి సమయంలో ప్లవకాలు కిరణజన్య సంయోగక్రియ జరిపి నీటిలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. దీని వలన చేపలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పి.హెచ్. విలువలను సమతుల్యంగా ఉంచడంలో కూడా ప్లవకాల పాత్ర ఎంతో ముఖ్యమైనది. తగిన స్థాయిలో ప్లవకాలు ఉన్నప్పుడు నీటి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.

ప్లవకాల బ్లూమ్స్ – కారణాలు మరియు ప్రభావాలు
అధిక మోతాదులో ఎరువులు వాడటం, నీటిలో పోషకాలు ఎక్కువగా చేరడం వంటి కారణాల వల్ల ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడతాయి. ఈ సమయంలో నీరు ముదురు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. బ్లూమ్స్ కారణంగా రాత్రి సమయంలో ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోవచ్చు. ఇది చేపల ఆరోగ్యానికి హానికరం.

ప్లవకాల క్రాష్ – కారణాలు మరియు నివారణ చర్యలు
వాతావరణ మార్పులు, అధిక ప్లవకాల సాంద్రత లేదా నీటి నాణ్యతలో ఆకస్మిక మార్పుల వల్ల ప్లవకాల క్రాష్ సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో నీరు తేటగా మారి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. చేపలు ఒత్తిడికి గురై వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందువల్ల చెరువులో నీటి నాణ్యతను నిరంతరం పరిశీలిస్తూ సమతుల్య ఎరువుల నిర్వహణ చేపట్టాలి.

ప్లవకాల సాంద్రతను అంచనా వేసే పద్ధతులు
సెచి డిస్క్ మరియు ప్లాంక్టాన్ నెట్ ద్వారా ప్లవకాల సాంద్రతను అంచనా వేయవచ్చు. సాధారణంగా సెచి డిస్క్ దృశ్య లోతు 20-30 సెం.మీ. మధ్య ఉన్నప్పుడు చెరువులో ప్లవకాల స్థాయి అనుకూలంగా ఉందని భావిస్తారు.

ప్లవకాల నిర్వహణ లో చేపల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-చెరువు నేల భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి.

  • ఎరువులను విడతల వారీగా వేయాలి.
  • నీటి రంగు మరియు పారదర్శకతను క్రమం తప్పకుండా పరిశీలించాలి.
  • ప్లవకాల బ్లూమ్స్ ఏర్పడినప్పుడు నీటి మార్పిడి చేపట్టాలి.
  • ఆక్సిజన్ కొరత లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

ముగింపు
చేపల చెరువులలో ప్లవకాల ఉత్పత్తి విజయవంతమైన చేపల పెంపకానికి మూలాధారం. ప్లవకాలు చేపలకు సహజ ఆహారాన్ని అందించడమే కాకుండా నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం మరియు చెరువు జీవావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి చేపల రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ప్లవకాల ఉత్పత్తి మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే అధిక దిగుబడులు, తక్కువ ఉత్పత్తి వ్యయం మరియు మెరుగైన లాభాలను పొందగలరు.

డాక్టర్. జి. గణేష్, మత్స్య శాస్త్రవేత్త
కృషి విజ్ఞాన కేంద్రం, పి. వి. నరసింహ రావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, మామునూర్, వరంగల్ జిల్లా-506 166. ph; 6281836891

Read More

ఔషధ మొక్క… చండ్ర / సండ్ర

చండ్ర / సండ్ర ఒక అతి ప్రసిద్ధి చెందిన చిన్న ఆకులు, ముళ్ళు కలిగిన ప్రయోజనకర ఆయుర్వేద ఔషధ మొక్క. ఈ చెట్టు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో కనబడుతుంది. దీని హార్ట్ ఉడ్ నుండి తీసిన రసాన్ని కదిరసారమంటారు. దీనిని లవంగడవటి వంటి అనేక ఔషధాల్లో ముఖ్య పదార్థంగా ఉపయోగిస్తారు. దీని రసం ఎరుపు రంగులో వుంటుంది. దీనిని దంత ధావనంలో టూత్ బ్రష్‌గా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కొయ్యని యజ్ఞాలు, హోమాలు వంటి ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంధనంగా వాడతారు.

సాధారణ నామం : బ్లాక్ కెటచు / ఖదిర శాస్త్రీయ నామం : అకేసియా కెటచు కుటుంబం: మైమోసేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ప్రసిద్ధిగాంచిన ఆయుర్వేద చర్మ టానిక్ ఖదిరారిష్టను ఈ మొక్కను ప్రధాన పదార్థంగా ఉపయోగించి తయారు చేస్తారు. ఇది రోగాన్ని తగ్గించి శరీరానికి స్థిరత్వమిస్తుంది.
  • చండ్ర ఔషధ గుణాలు : గుణం : లఘు,రూష్ట రసం: వగరు, కషాయం రుచి : కారంగా శక్తి : చల్లదనం కలిగిస్తుంది
  • త్రిదోషాలపై ప్రభావం: కఫ, పిత్త గుణాల సమతుల్యత తెస్తుంది.
  • చర్మ వ్యాధులను నయం చేసే ఔషధ మొక్కలన్నింటిలో చండ్ర అతి గొప్పది. చండ్ర కషాయాన్ని స్నానం చేయడానికి, త్రాగడానికి ఉపయోగిస్తారు.
    ఖదిర కషాయాన్ని డయాబెటిస్, మూత్రాశయ వ్యాధుల నివారణలో ఉపయోగిస్తారు.
  • దంత నాణ్యతను పెంచుతుంది. దురదను తగ్గిస్తుంది. జ్వరం, దగ్గు, జలుబులకు ఉపశమనం కలిగిస్తుంది. ఊబకాయాన్ని తగ్గించడంలో, కడుపులో నులిపురుగుల నివారణలో ఉపయోగపడుతుంది. అజీర్తిని తగ్గిస్తుంది. రక్తస్రావం, వాపులు, కాలేయ వ్యాధుల తొలిదశలలోను, రక్తహీనతను తగ్గిస్తుంది.
  • కత్తాని తమలపాకు, పాన్ తయారీలో ఒక భాగంగా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • కెటచిన్ ఆధారిత పురుగు మందు ఉత్పత్తి నిల్వ ధాన్యంలో ఆశించే ట్రైబోలియం కన్‌ఫ్యూసం, ట్రైబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ కైనెన్పిస్, సైటోఫిలస్ ఒరైజే పురుగులను అరికట్టింది (ఖటున్, అతని అనుచరులు, 2011)
  • బ్లాక్ కెటచు నుండి వేరు చేసిన ఎపికెటచిన్ లెపిడోప్టెరా లార్వాలపై యాంటిఫీడెంట్ చర్యని ప్రదర్శించింది (శ్రీమన్నారాయణ్ అండ్ రావు, 1985).
  • చండ్రచెదలను నివారించే గుణం కలిగి వుంది (హెచ్‌డిఆరఎది ఆర్గానిక్ ఆర్గనైజేషన్, సెలిమ్‌సేన్, అతని అనుచరులు, 2017)
  • చండ్ర బెరడు అసిటోన్ ద్రావణం ఆస్పర్ౙిల్లస్ నైగర్ శిలీంద్ర పెరుగుదలను అరికట్టింది. చండ్ర అసిటోన్ ద్రావణం ఫ్యుజేరియం ఆక్సిస్పోరం, ఆల్టర్నేరియా అల్టర్నేటా, రైజోపస్ స్టొలానిఫర్, మాక్రోఫోమినా ఫాసియోలినా శిలీంద్రాల పెరుగుదల నరికట్టింది (నాగరాజు, అతని అనుచరులు 2008).
Read More

పచ్చిరొట్ట ఎరువులు – ప్రాముఖ్యత

పంటలకు అవసరమయ్యే పోషకాలు సేంద్రియ రూపంలో సమర్ధవంతంగా అందించాలంటే పచ్చిరొట్టను బాగా అందించే పంటలను అదే మడిలో ముందే వేసుకోవాలి. తక్కువ వనరులతో బాగా పెరిగే పంటలను సుమారు 2 నెలల ముందే మడిలో విత్తుకోవాలి, ఆ పంట పూతకువచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి. ఈ పంట భాగాలు నేలలోని తేమ సరిపడినంత ఉన్నప్పుడు త్వరగా కుళ్ళిపోతాయి. దున్నిన 2-3 వారాలకు బాగా కుళ్ళటం వల్ల విడుదలయిన పోషకాలు అప్పుడు మడిలో విత్తిన ముఖ్యపంటకు అందుతాయి. ఉదా: జనుము, పెసర, మినుము, బఠాణి, ఉలవలు.

దబోల్కర్ పద్ధతి
భూసారం పెంచుకోవటానికి మన ప్రక్క రాష్ట్రమైన మహారాష్ట్రకి చెందిన శ్రీపాద దబోల్కర్ అనే శాస్త్రవేత్త కొన్ని సూచనలు చేశారు.
ధాన్యపు గింజలు : 5 కేజీలు (మొక్కజొన్న, జొన్న, సజ్ౙ, తైదలు, రాగులు మొ….)
పప్పు గింజలు : 5 కేజీలు (మినుములు, పెసలు, శనగలు, కంది, అలసంద మొ….)
నూనె గింజలు : 5 కేజీలు (నువ్వులు, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, మొ…)
సుగంధ ద్రవ్యములు : 50 గ్రాములు (ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర మొ…)
పచ్చిరొట్ట పంట విత్తనాలు : 5 కేజీలు (జనుము, జీలుగ, అవిశ, పిల్లిపెసర మొ॥)

దుక్కి దున్ని మండలాగిన తరువాత ఈ విత్తనాలన్నీ కలగలిపి ఎకరానికి 20-25 కిలోలను చల్లుకోవాలి. 45 రోజుల వరకు పెరగనిచ్చి భూమిలో కలియదున్నాలి.

ఇలా చేయడం వల్ల పంటకాలం నష్టపోతామని భావించినట్లయితే రైతులు తమ పొలాన్ని కొన్ని భాగాలుగా విభజించుకొని, ఏటా ఒక భాగంలో ఈ పద్ధతి పాటిస్తూ కొద్ది సంవత్సరాలలో మొత్తం పొలాన్ని సారవంతంగా చేసుకోవచ్చు.

పచ్చి ఆకు ఎరువులు
పచ్చిరొట్ట పంట వేసుకోవటం కుదరని పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న చెట్ల ఆకులను, లేత కొమ్మలను తీసుకువచ్చి పొలంలో కలుపుకోవచ్చు. ఇది పచ్చి ఆకుల ద్వారా నేలకు ఎరువులు అందించే పద్ధతి.
పచ్చి ఆకు ఎరువుగా ఉపయోగపడే మొక్కలు గ్లైరిసీడియా, కానుగ, మోదుగ, సీతాఫలం, వెంపలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గట్ల మీద ఈ మొక్కలను నాటుకుంటే సాగు భూమికి ఎరువు అవసరాలు సులువుగా అందించవచ్చు.

వరిపొలాలలో వేసుకునేందుకు అనువైన పప్పుధాన్యాలు – పెసర, అలసంద, శనగ, సోయాచిక్కుడు, వేరుశనగ, కంది.

వరి పొలాలలో అనువైన పశుగ్రాస పంటలు – సిరట్రో, క్లైటోరియా, టెస్మాంథస్, జనుము, చిక్కుడు. వరి పొలాలలో సాగుకు అనువైన పచ్చిరొట్టనిచ్చే పంటలు – జీలుగ, జనుము.

Read More

వండని వంట… తీపి రాగి పిండి

పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు, పచ్చళ్ళు… ఆహారంగా తయారు చేసుకోవడం వండని వంటలు. వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని ‘అమృతాహారం’ తినడం మంచిది. రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తి పూరితమైన ‘వండని వంట’ తీపి రాగిపిండి తయారీ ఇలా….

అరకిలో రాగులు, అరకిలో పెసలు లేదా మినుముల పిండి ప్రధానంగా అవసరం ఉంటుంది. రాగులను పెసలను పచ్చి వాటినే పిండి పట్టించాలి. వేపకూడదు (మర పట్టించడం కంటే, విసుర్రాయితో విసురుకోవడం మంచిది.పిండిని మర పట్టిస్తే, అధిక ఉష్ణోగ్రతకు గురౌతుంది)

పచ్చి వాసనే, జీవశక్తికి నిదర్శనం!

మొత్తం కిలో రాగులు, పెసలు (మినుములు) పొడిలో, సుమారు వంద గ్రాముల నెయ్యిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి.

ఆ పిండి మిశ్రమంలో ఎండుకొబ్బరి పొడి, వేరుశనగ పొడి, నువ్వుల పొడి (ఒక్కొక్కటి వంద గ్రాములు-పచ్చిపొడులు)

జీడిపప్పు, బాదాంపప్పు కూడా కాస్తా చేర్చుకోవచ్చు. వాటిని కూడా పొడి చేసుకుని కలపాలి. చివరికి ఎండుద్రాక్ష పండ్లను కూడా తగినన్ని కలుపుకోవాలి.

ఈ మొత్తం పొడుల మిశ్రమానికి సమానంగా, ముడిచక్కెర పొడిని లేదా ముడిబెల్లపు తురుమును కలిపి, యాలకుల పొడిని కూడా కలపాలి. ఖర్ౙూర పండ్లను చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవచ్చు. అన్ని రకాల ఎండుపండ్ల ముక్కలను కూడా కలుపుకోవచ్చు.

అంతే! రుచికరమైన బలవర్ధకమైన సువాసనభరితమైన జీవశక్తిపూరితమైన ‘వండని వంట’ సిద్దం అవుతుంది.
నెయ్యి కలుపుతాం కనుక, బయట కూడా నిల్వ ఉంటుంది.

ప్రతీ పదిహేను రోజులకు ఒకసారి తగినంత తయారు చేసుకోవచ్చు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రధాన ఆహారంగా కూడా తినవచ్చు.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More

గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణకు ఉచిత టీకాల కార్యక్రమం

గొర్రెల పెంపకదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు గొర్రెలలో చిటుకు వ్యాధి (Enterotoxaemia) నివారణ కోసం ఉచిత టీకాల కార్యక్రమం నిర్వహిస్తోంది.

చిటుకు వ్యాధి గొర్రెలలో ఆకస్మిక మరణాలకు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ వ్యాధి సోకినప్పుడు గొర్రెలు మేత తినకపోవడం, నీరసం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి.

అందువల్ల ఈ వ్యాధి నివారణకు టీకా వేయించడం అత్యంత అవసరం. టీకా ద్వారా గొర్రెలను చిటుకు వ్యాధి నుండి రక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొనే ఆర్థిక నష్టాలను కూడా తగ్గించవచ్చు.

కావున అన్ని గొర్రెల కాపరులు, పెంపకదారులు తమ గ్రామాలలో నిర్వహించే ఉచిత టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి గొర్రెకు తప్పనిసరిగా టీకా వేయించాలి.

గొర్రెల ఆరోగ్యం – రైతు అభివృద్ధికి పునాది.
చిటుకు వ్యాధికి టీకానే రక్షణ!

Read More

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

నెలకు ప్రాణం… పంటకు బలం ‘బయోచార్’

వ్యవసాయ రంగంలో బయోచార్ (Biochar) అనేది ఇప్పుడు ఒక కొత్త సంచలన పదం. ఒకే రకమైన పంటలు సాగు, వ్యర్థాలను పొలాల్లోనే కాల్చడం మరియు పరిమితికి మించి రసాయన ఎరువుల వాడకంతో భూముల్లో సేంద్రియ కర్బనం అడుగంటుతోంది. ఇదే కొనసాగితే భూములు సాగుకు పనికిరావు. దీనికి పరిష్కారంగా పంట వ్యర్థాలతో తయారుచేసే బయోచార్ (జీవ బొగ్గు) నేలలో సేంద్రియ కార్బన్ ను పెంచుతుంది.

సాధారణంగా పంట కోతలు పూర్తయ్యాక రైతులు పంట వ్యర్ధాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరగడమే కాకుండా, నేలలో ఉండే మిత్రపురుగులు, మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఫలితంగా భూసారం క్షీణించి, సేంద్రియ కార్బన్ (Organic Carbon) శాతం పడిపోతోంది. అయితే, ఈ సమస్యకు పంట వ్యర్థాలతోనే అద్భుతమైన పరిష్కారం కనుగొనవచ్చు. పత్తి, కంది, మిరప, ఆముదం మరియు మొక్కజొన్న వంటి పంటల సేంద్రియ వ్యర్థాలను తగలబెట్టకుండా, ఒక ప్రత్యేక పద్ధతిలో ‘బయోచార్’ (జీవ బొగ్గు) గా మార్చవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతి ద్వారా నేలకు అధిక మొత్తంలో సేంద్రియ కార్బన్ను అందించి, భూసారాన్ని మళ్లీ పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం సాగుచేసే పంటలలో ఎక్కువగా రసాయన ఎరువుల వాడకం వల్ల నేల ఆరోగ్యం క్రమంగా దెబ్బతింటోంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు నేల సారాన్ని పెంచడానికి బయోచార్ ఉపయోగకరంగా ఉంటుంది.

బయోచార్: బయోచార్ అనేది ప్రాథమికంగా ‘కాల్చిన’ వ్యవసాయ వ్యర్థం. బయోమాస్ అనే సేంద్రియ పదార్థాలను తక్కువ ఆక్సిజన్ పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత వద్ద నిదానంగా మండించడం (పైరోలైసిస్) ద్వారా తయారయ్యే నల్లటి కార్బన్ పదార్థాన్ని బయోచార్ అంటారు. ఇది రంధ్రాలు (సచ్చిద్రత) కలిగి ఉన్న, అత్యధిక కార్బన్ గల ఒక స్థిరమైన పదార్థాన్ని సృష్టిస్తుంది, దీనిని నేల లక్షణాలను మెరుగుపరచడానికి మట్టిలో కలపవచ్చు.

నేలలో బయోచార్ (ప్రత్యేక పద్ధతిలో తయారుచేసిన బొగ్గు) ఉపయోగించడం వల్ల భూసారం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది నేలలో మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా, నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, మరియు సేంద్రియ కార్బన్ లోపించిన భూముల్లో బయోచార్ వాడకం వల్ల ఆశించిన దానికంటే మంచి ఫలితాలు వస్తాయి.

అంతేకాదు, ఇది నేలలో గాలి ప్రసరణను మెరుగుపరిచి, పంటల వేర్లు లోతుగా, బలంగా పెరగడానికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రసాయన లేదా సేంద్రియ ఎరువుల ద్వారా అందించే పోషకాలు త్వరగా కరిగి వృథా కాకుండా, మొక్కకు అవసరమైనప్పుడు అందేలా ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో బయోచార్ కీలక పాత్ర పోషిస్తుంది.

బయోచార్ వల్ల కలిగే ప్రయోజనాలు

  1. నేల ఉదజని సూచిక (pH) సర్దుబాటు :
    బయోచార్ క్షార గుణాన్ని (alkaline) కలిగి ఉంటుంది మరియు ఆమ్ల నేలల్లో నేల ఉదజని సూచిక స్థాయిని పెంచుతుంది. ఇది పోషకాలు మరియు ఖనిజ లవణాలల లభ్యతను, వాటి వినియోగ సామర్థ్యాన్ని
    పెంచుతుంది.
  2. నేల కాటయాన్ ఎక్స్ఛేంజ్ యజ్ కెపాసిటీ (CEC) పెరుగుదల :
    బయోచార్ తక్కువ పరిమాణంలో ఎక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది అత్యధిక నెగటివ్ ఛార్జ్ (negatively charged) కలిగి ఉంటుంది. ఇది నేలలోని పాజిటివ్ ఛార్జ్ కలిగిన కాటయాన్లను (positively charged cations) పట్టి ఉంచుతుంది, తద్వారా కాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ (CEC) ని మరియు నేల సారాన్ని పెంచుతుంది.
  3. బయోచార్ నేలకు పోషకాలను జోడిస్తుంది
    ఇది బయోచార్ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల లోని పోషకాల పరిమాణం మరియు దానిని తయారు చేయడానికి ఉపయోగించిన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. పశువుల ఎరువు మరియు కంపోస్ట్ లాగే, బయోచార్ను నేలలో వేయడానికి ముందు దానిలోని పోషకాల పరిమాణాన్ని పరీక్షించాలి, ఎందుకంటే పోషకాల పరిమాణం చాలా భిన్నంగా ఉంటుంది మరియు బయోచార్ అప్లికేషన్లు పెద్ద మొత్తంలో (bulky) ఉంటాయి. బయోచార్లో ఏవైనా విషపూరిత అయాన్లు (toxic ions) ఉన్నాయా అనేదానిని కూడా
    పరీక్షించాలి.
  4. నేలలో కార్బన్ పరిమాణం పెరుగుదల :
    బయోచార్లో 80% వరకు కార్బన్ బ్లాక్ (carbon black) ఉంటుంది. దీనిని మట్టిలో కలపడం వల్ల కార్బన్ పరిమాణం మరియు C:N నిష్పత్తి (కార్బన్-నైట్రోజన్ నిష్పత్తి) పెరుగుతాయి. బయోచార్లోని కార్బన్ శాతం
    అనేది ప్రధానంగా పైరోలైసిస్ ప్రక్రియ మరియు ఉపయోగించిన ముడి పదార్థాల కార్బన్ పరిమాణంపై
    ఆధారపడి ఉంటుంది.
  5. బయోచార్ నేలలో సూక్ష్మజీవుల క్రియాశీలతను మరియు వైవిధ్యాన్ని పెంచుతుంది :
    బయోచార్లో ఉండే అధిక రంధ్రాల గుణం, దాని నీటి మరియు పోషకాలను నిల్వ ఉంచుకునే సామర్థ్యంతో కలిసి నేలలోని సూక్ష్మజీవులకు సురక్షితమైన ఆవాసాన్ని కల్పిస్తుంది. ఇది పొలాన్ని ఖాళీగా విడిచిపెట్టినప్పుడు (fallow) మరియు కరవు కాలంలో కూడా సూక్ష్మజీవులు మనుగడ సాగించేలా చేస్తుంది. బయోచార్ కొన్ని సూక్ష్మజీవులకు తగిన శక్తి వనరును కూడా అందిస్తుంది. సూక్ష్మజీవుల క్రియాశీలత పెరగడం వల్ల మొక్కలకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాల పునరుత్పత్తి (nutrient re-cycling) పెరగడం, పోషకాలు కొట్టుకుపోవడం తగ్గడం, మొక్కలకు పోషకాలు మరింత సులభంగా లభించేలా చేయడం, గాలి నుండి నైట్రోజన్ ను గ్రహించడం, నేలలో కార్బన్ను నిలిపి ఉంచడం మరియు జోడించడం, తెగుళ్లు మరియు వ్యాధులను తగ్గించడం. ఇది కృత్రిమ ఎరువులు మరియు పురుగుమందుల అవసరాన్ని సాధారణంగా తగ్గిస్తుంది, తద్వారా వాణిజ్యపరమైన మరియు పర్యావరణపరమైన అదనపు ప్రయోజనాలు చేకూరుతాయి.
  6. నేలలోని విషపూరిత పదార్థాలను తగ్గించడం ద్వారా బయోరెమిడియేషన్ (Bioremediation) పెరిగిన సూక్ష్మజీవుల క్రియాశీలత నేలలోని విషపూరిత పదార్థాలను మరియు పురుగుమందుల అవశేషాలను విచ్చిన్నం చేస్తుంది. బయోచార్ కొన్ని పురుగుమందులను ‘చీలేట్స్’ (chelates) చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని నిష్క్రియం చేస్తుంది, తద్వారా సూక్ష్మజీవులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి.
  7. నేల ఆకృతి మెరుగుపడటం (Improvement of soil structure)
    బయోచార్ చేర్చిన నేలలో పెరిగే CEC (కాటయాన్ ఎక్స్ఛేంజ్ కెపాసిటీ), సూక్ష్మజీవుల మరియు వేర్ల క్రియాశీలత.. నేల కణాలు ఒకదానితో ఒకటి అతుక్కుని (soil aggregates) మరింత స్థిరమైన, నీరు చొరబడగలిగే భౌతిక ఆకృతిని ఏర్పరచడంలో సహాయపడతాయి. ఇది నేలలోకి నీరు ఇంకడాన్ని మరియు నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. రంధ్రాలు (porous) కలిగిన నేల మెరుగైన వాయు మార్పిడికి తోడ్పడుతుంది; దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లడం, ఆక్సిజన్ లోపలికి రావడం మరియు మెరుగైన నైట్రోజన్ మార్పిడి జరిగి వేర్ల ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
  8. వ్యవసాయ కాలుష్యం తగ్గింపు (Agricultural pollution reduction)
    నేలలో పోషకాలను నిలిపి ఉంచే సామర్ధ్యం పెరగడం వల్ల, కరిగిపోయే ఎరువులు మరియు రసాయనాలు భూగర్భ జలాల్లోకి కొట్టుకుపోవడం (leaching) తగ్గుతుంది. పెరిగిన సూక్ష్మ జీవుల క్రియాశీలత మరియు చెలేషన్ ప్రక్రియ పురుగుమందులను నిష్క్రియం చేస్తాయి. భౌతిక ఆకృతి మెరుగుపడటం వల్ల నీటి ప్రవాహం

(runoff) మరియు నేలకోత (erosion) తగ్గుతాయి. సాధారణంగా ఎరువులు మరియు రసాయనాల వాడకం తగ్గడం వల్ల వ్యవసాయ కాలుష్య ముప్పు చాలా వరకు తగ్గుతుంది.

  1. కార్బన్ నిక్షిప్తం (Carbon Sequestration)
    బయోమాస్ కార్బన్ ను బయోచార్గా మార్చడం ద్వారా అసలు కార్బన్లో 50% వరకు కుళ్ళిపోవడానికి నిరోధకత కలిగిన ఒక స్థిరమైన రూపంలో నిక్షిప్తం చేయవచ్చు. ఇది శతాబ్దాల పాటు నేలలోనే ఉండిపోతుంది, మిగిలిన 50% ఆహారం మరియు శక్తి కోసం ఉపయోగించవచ్చు. దీనికి భిన్నంగా, వ్యర్థాలను కాల్చడం ద్వారా కేవలం 3% కార్బన్ మాత్రమే, మరియు జీవసంబంధమైన కుళ్ళిపోవడం (biological decomposition) ద్వారా 20% కంటే తక్కువ కార్బన్ మాత్రమే నిక్షిప్తమవుతుంది. కాబట్టి వ్యవసాయ నేలల్లో కార్బన్ ను నిక్షిప్తం చేయడానికి మరియు నేలలపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి భారీ అవకాశం ఉంది. గమనిక: పునరుత్పాదక కార్బన్ పదార్థం నుండి బయోచార్ను తెలివిగా మరియు స్థిరమైన పద్ధతిలో ఉపయోగించాలి. బయోదార్ను నేల సవరణగా చేర్చేటప్పుడు రైతు బయోదార్ యొక్క లక్షణాలను మరియు నేల యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బయోచార్ స్వయంగా ఒక కాలుష్య కారకంగా మారకుండా ఉండటానికి దానిని మట్టిలో బాగా కలపాలి.

జాగ్రత్తలు

  1. నేరుగా ఎక్కువ మోతాదులో వేయకూడదు
  2. కంపోస్ట్ లేదా పశువుల ఎరువుతో కలిపి వేయడం మంచిది
  3. పొడి రూపంలో వాడేటప్పుడు గాలి ద్వారా వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
  4. నేల పరీక్ష ఆధారంగా మోతాదు నిర్ణయించాలి

సిఫార్సు మోతాదు

  • ఎకరానికి 4 నుండి 6 క్వింటాళ్లు వరకు వేసుకోవచ్చు
  • సేంద్రియ ఎరువులతో కలిపి వేయాలి
    బయోచారును సేంద్రియ ఎరువులు, జీవామృతం, ఘన జీవామృతం, వర్మీకంపోస్ట్ వంటి వాటితో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రస్తుతం సహజ వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయంలో బయోచారుకు మంచి ప్రాధాన్యత లభిస్తోంది. బయోచార్ వినియోగం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడి, స్థిరమైన వ్యవసాయం సాధ్యమవుతుంది.

డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258

Read More

వండని వంట… పండు మిర్చి పచ్చడి

వండని వంటలు అంటే, పదార్థాలను వేపకుండా, ఉడికించకుండా, మాడ్చకుండా, పచ్చి వాటినే కూరలు పచ్చళ్ళు ఆహారంగా తయారు చేసుకోవడం.

ధాన్యం, పప్పులు, నూనె గింజలు, కూరగాయలు మొదలగునవి ఉడికించినా, వేపినా, ఫ్రై చేసినా, వాటిలో ఉన్న జీవశక్తి నాశనం అవుతుంది, మృతాహారాన్ని తినవలసి వస్తుంది. మృత ఆహారం అంటే చనిపోయిన ఆహారం అని అర్థం.

మృతాహారం తింటే, మన శరీరానికి జీవశక్తి లభించదు. మనలో జీవశక్తి లోపిస్తే, వ్యాధి కారక శక్తులు ప్రవేశిస్తాయి. కోవిడ్ వైరస్ చెప్పిన పాఠాల్లో, అది ముఖ్యమైన పాఠం కద!

అమృతాహారాన్ని తినవలసిన మనుషులు, మృతాహారం తినడం వైపు పయనించారు! మృతాహారం, వ్యాధి కారకం!

వీలైనంత వరకు పచ్చి పదార్థాలను, మనకు నచ్చిన విధంగా ప్రిపేర్ చేసుకుని తినడం మంచిది.
అమృతాహారాన్ని తయారు చేసుకుని భుజిస్తే, మన ఆయురారోగ్యాలు పదిలంగా ఉంటాయి!

అమృతాహారం అంటే, చనిపోని ఆహారం అని అర్థం!

మిద్దెతోట, పెరటితోటల్లో మిర్చి ఉత్పత్తి ఎక్కువ వస్తున్నప్పుడు, మధ్య మధ్య పండు మిరపకాయలతో రోటి పచ్చడి తయారు చేసుకోవాలి. అది బయటి ఉష్ణోగ్రతల వద్ద కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిజ్ అవసరం లేదు.
పెరటితోట మిద్దెతోట అంటే, పురుగుమందుల వాడకం లేని, సహజ ఉత్పత్తి అని కద! అప్పుడే అది అమృతాహారం అవుతుంది.

కాసిన్ని పండు మిరపకాయలను తెంపుకుని, క్లాత్‌తో శుభ్రంగా తుడిచి, తొడిమలు తీసేసి ముక్కలు ముక్కలుగా కోసి, ఆ పండుమిరపకాయలకు తగినంత కొత్త చింతపండు, తగినంత ఉప్పు (రాక్ సాల్ట్ అయితే బెటర్), వెల్లుల్లి పాయలను, కొద్దిగా పసుపు, జీలకర్రను వేసుకొని, రోటిలో వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ పచ్చడి బయట వాతావరణంలో కూడా, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కాకపోతే ఉప్పు తగినంత కలుపుకోవాలి. ఈ పచ్చడి తయారీలో నీటి తేమ తగలకుండా తయారు చేసుకోవాలి.

పచ్చడిలో నూనె పోపు అవసరం లేదు. పోపు పెట్టడం అంటే, కాలిన నూనెను తినడం అవుతుంది. కాకపోతే అన్నం తినేటప్పుడు పచ్చి నూనెను – అదీ చెక్క గానుగ నూనెను కొద్దిగా వేసుకొని తినవచ్చు.
పాతకాలపు పండుమిరపకాయల పచ్చడినే, నూనె తాలింపు పెట్టకుండా వాడుకోవచ్చును!
నిల్వ పచ్చడి అంటేనే, ఉప్పు ఎక్కువగా ఉంటుంది.

శారీరక శ్రమ చేసేవారు కాస్తా ఎక్కువ సార్లు తిన్నా పరవాలేదు కానీ, నీడపట్టున పనులు చేసేవారు రుచి కోసం అప్పుడప్పుడు తినడం మంచిది.

పండుమిరపకాయల్లో చింతపండుకు బదులుగా టొమాటో పండ్లను కూడా వేసుకొని పచ్చడి తయారు చేసుకోవచ్చు కానీ, ఎప్పటికప్పుడు తయారు చేసుకుని వాడుకోవచ్చు. బయట నిల్వ ఉండదు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండు మూడు రోజుల పాటు వాడుకోవచ్చు.

మొదటిసారిగా చేసుకునేవారు, కొద్ది మొత్తంలో చేసుకుని, ఉప్పు, కారం, పులుపు సరిగా ఉన్నాయో లేదో చూసుకుని, తరువాత మార్పులు చేర్పులు చేసుకోవడం మంచిది. రోలు రోకలి లేనివారు మిక్సీలో వేసి తిప్పుకోవాలి.

మిక్సీలో వేసి తిప్పితే, పదార్ధం ఉష్ణోగ్రతకు గురౌతుంది, ఆ కారణంగా పదార్ధంలో ఎంతో కొంత జీవశక్తి లాస్ అవుతుంది. కనుక రోలు రోకలి వాడటం బెటర్. రోళ్ళు, రోకళ్ళు పట్టణాలలో అక్కడక్కడ రోడ్ల పక్కన పెట్టి అమ్ముతున్నారు. కొనుక్కుని తెచ్చి పెట్టుకోవాలి. ఎప్పటికీ ఉపయోగపడుతుంది.

  • తుమ్మేటి రఘోత్తమరెడ్డి
Read More