పంట ఉత్పత్తుల విలువ పెంపుపై దృష్టి
తెలంగాణలో వరి, పత్తి వంటి ప్రధాన పంటల స్థానంలో చిరు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, నూనె గింజల అధికోత్పత్తిని సాధించడం, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ఎగుమతి అవకాశాల పెంపుదలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ పేర్కొంది. వ్యవసాయంలో కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతకు పెద్దపీట వేస్తామని తెలిపింది. కలెక్టర్ల సదస్సులో ఆ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్ౘ్ారు. “వరి ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. పత్తి సాగు అధికమే. కేంద్రీకృత పంటల విధానం సమస్యాత్మకంగా ఉంది. దాని స్థానంలో వైవిధ్యీకరణను, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తాం. బియ్యం, నూనెగింజలు, పండ్లు, కూరగాయల శుద్ధి ద్వారా పంట ఉత్పత్తులకు విలువల పెంపుపై దృష్టి పెట్టాం. ఫార్మ్ టు ఫోర్క్ నినాదంతో బియ్యం, మాంసం, చేపలు, మామిడి పండ్ల ఎగుమతులకు ఊతమిస్తాం. సహజ సాగు విస్తీర్ణం పెంచుతాం. 99 రోజుల ప్రణాళికలో.. రాబోయే 30 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలు, విత్తన నిల్వల పంపిణీ పూర్తి చేస్తాం. 60 రోజులలోపు సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులను విస్తరిస్తాం. మూడు నెలల లోపు ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు పూర్తి చేస్తాం” అని వివరించారు.










