తెలంగాణలో కూరగాయల సాగుకు ప్రోత్సాహం

తెలంగాణలో కూరగాయల సాగును భారీగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం రూ.215 కోట్లను బడ్జెట్లో కేటాయించిందని, కూరగాయల పందిళ్లు, యంత్ర పరికరాలకు సబ్సిడీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్ బాషా తెలిపారు. రాష్ట్ర ఉద్యానశాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమానికి గురువారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. “తక్కువ ఉత్పత్తి ఖర్చు, అధిక దిగుబడినిచ్చే పద్ధతులు, మల్టీ లేయర్ ఫామింగ్‌ను రైతులు చేపట్టాలి. పామఆయిల్ తోటల్లో అంతరపంటలుగా కూరగాయలు పండించాలి. మొక్కలను రైతులే స్వయంగా తయారు చేసుకునేందుకు అవసరమైన శిక్షణనిస్తాం” అని ఆమె తెలిపారు. ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

Read More

దోమను తట్టుకునే వరి రకం

దోమను తట్టుకునే వరి రకాలను ఎంపిక చేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానం కీటకశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బారియర్ తెర పద్ధతిని వినియోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎంపిక చేసిన వరి రకాలను ముందుగా నాటి, వాటితో పాటే సుడిదోమను ఆకర్షించే టీఎన1 వంటి రకాలనూ నాటుతారు. నాట్లు వేసిన 25 రోజుల తర్వాత 100 సెం.మీ. ఎత్తుండే పాలిథీన్ కవరును తెరలా కట్టి తేమశాతం అధికంగా ఉండేలా చూస్తారు. దోమల ఉద్ధృతిని పెంచే డెల్టా మెత్రిన్‌ను పిచికారీ చేస్తారు. తద్వారా దోమ వ్యాప్తి చెంది పంట ఎండిపోతుంది. ఈ ప్రక్రియను రెండు మూడు దశల్లో నిర్వహించి ఎంపిక చేసిన వరి రకాల్లో ఏదైతే దోమను తట్టుకొని ఆరోగ్యంగా పచ్చగా ఉంటుందో దానిని బ్రీడింగ్‌కు పంపిస్తామని కీటక శాస్త్రవేత్త ఆనందకుమార్ తెలిపారు.

Read More

ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కె.శ్రీనివాసరావు తెలిపారు. విస్సన్నపేట మండలంలోని కొండపర్వలో కృష్ణ సుధ వ్యవసాయ పర్యావరణ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి- భారతీయ నూనె గింజలు పరిశోధనా సంస్థ తెలంగాణ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఆర్కే మాథుర్, భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి- భారతీయ నూనె గింజలుపరిశోధనా సంస్థ, హైదరాబాద్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ హరి ప్రకాష్ మీనా, జాతీయ సేంద్రియ, సహజ వ్యవసాయ కేంద్రం, ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్ మాజీ సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్ యాదవ్, కృష్ణ సుధ వ్యవసాయ పర్యావరణ శాస్త్ర కేంద్రం సంచాలకులు డాక్టర్ సుబ్బా రాయుడు, డాక్టర్ బసవరాజు అతిథులుగా పాల్గొని తమ సందేశాలను అన్నదాతలకు అందించారు. జిల్లాలోని పలు గ్రామాల నుంచి ఆదర్శ, ఉత్తమ రైతులు, పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

యుద్ధం వలన తగ్గిన పసుపు ధర

పశ్చిమాసియాలో యుద్ధం వలన పసుపు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు తగ్గుతూ క్వింటాకు రూ.4 వేలకు పైగా రైతు నష్టపోతున్నాడు. పసుపు విక్రయాలు అత్యధికంగా జరిగే ఆసియాలోని మార్కెట్లలో నిజామాబాద్ ఒకటి. ఇక్కడి యార్డులో కొనుగోలు చేసే పంటను విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఏటా ఫిబ్రవరి నుంచి పంట మార్కెట్‌కు వస్తుంది. 2024లో రూ.171 కోట్ల విలువైన 1.45 లక్షల టన్నుల పసుపును భారత్ ఎగుమతి చేసింది. ఇందులో నిజామాబాద్‌లో కొనుగోలు చేసే నాణ్యమైన సరకు కూడా ఉంది. ఈ ఏడాది యుద్ధ ప్రభావంతో గల్ఫ్, ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచాయి. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ట్రేడర్లు పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.

Read More

వ్యవసాయ పట్టభద్రులకు మెగా ఉద్యోగ మేళా

వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రంలోని వ్యవసాయ పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మెగా ఉద్యోగ మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో సోమవారం ప్రారంభమైన ఉద్యోగ మేళాను ఈ నెల 26 వరకు నిర్వహించనున్నారు. తొలిరోజున వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్, వ్యవసాయ ఇంజినీరింగ్ తొమ్మిది అనుబంధ కళాశాలల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీ.హెచ్.డీ విద్యార్థులు హాజరయ్యారు. 13 సంస్థల ప్రతినిధులు పాల్గొని మౌఖిక పరీక్షలు నిర్వహించి 140 మందిని పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేశారు.

Read More

పశువుల ఆరోగ్యంకు రూ.1.70 కోట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పశు సంపద ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రూ.1.70 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపి, వేరే పథకాలకు ఈ నిధులను మళ్లించరాదని పశు సంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో 4 రోజులు వర్షాలు..!

ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని తెలిపింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Read More

ఎకరా వరకూ.. రైతు భరోసా నిధులు విడుదల

యాసంగి సీజన్‌కు పంటల పెట్టుబడి కోసం తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో 68,89,955 మంది రైతులకు రూ.3,446.94 కోట్లను రైతు భరోసా కింద ఆదివారం నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో ఎకరం వరకు భూమి ఉన్న వారిని పరిగణనలోకి తీసుకొని 57,44,907.19 ఎకరాలకు ఈ సాయం విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎకరాకు రూ. 6 వేల చొప్పున విడుదల చేశారు. నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లు విడుదలయ్యాయి. అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో 24,935 మంది రైతులకు రూ.10.43 కోట్లు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం నుంచి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని… ఆమేరకు బ్యాంకుల నుంచి సందేశాలు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఎకరం వరకు భూమి ఉండి, నిధులు జమ కాని వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలని సూచించారు.

Read More

రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ఆమోదించండి

ఆంధ్ర వర్షాభావ ప్రాంతాలైన రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పథకానికి త్వరగా అనుమతులివ్వాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకుర్‌కు విజ్ఞప్తిచేశారు. ‘కరవు ప్రభావిత పది జిల్లాలను ఉద్యాన పంటల కేంద్రంగా మార్చడానికి రాష్ట్రం రూ.41,352 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే డీపీఆర్ సమర్పించింది. రాష్ట్రం సమర్పించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపండి’ అని ఆయన కేంద్ర అధికారులకు విజ్ఞప్తిచేశారు.

Read More

ప్రకృతి వ్యవసాయ రైతులకు గుర్తింపు కార్డులు

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 ప్రకృతి వ్యవసాయ సమూహాల్లో ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ఇందులో గుర్తింపు కార్డు, క్లాత్ బ్యాగ్, క్షేత్రదర్శిని డైరీ, చిన్న ప్యాకెట్ డైరీ, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను ఉంటాయి. జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు కిట్లను పంపిణీ చేస్తారు. తర్వాత జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రతీ క్టసర్‌కు ఇద్దరు చొప్పున కృషి సఖిలను ఇందుకోసం ఎంపిక చేశారు. వీరి ద్వారా సేంద్రియ సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తారు.

Read More