పిడుగుపాటు నష్టాలను తగ్గించవచ్చు

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎనఆరఎస్సీ), ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మధ్య పిడుగుపాటు మరణాల్ని తగ్గించే దిశగా ఒప్పందం కుదిరింది. ఇందులోభాగంగా రాష్ట్రంలో పిడుగులు ఎక్కువగా పడే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాన్ని అంచనా వేయడంతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆచరణీయమైన నివారణ వ్యూహాలను రూపొందిస్తారు. పిడుగుపాటు సంబంధిత ప్రాణ, ఆస్తినష్టాన్ని తగ్గించడంలో, కమ్యూనిటీల సంసిద్ధతను మెరుగుపరచడం, ప్రతిస్పందన యంత్రాంగాలను బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖరైజైన్ వివరించారు. కార్యక్రమంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రం ఈడీ కె. కౌసర్‌బానో, శాస్త్రవేత్త వెంకటరమణ, అలోక్ తౌరి, సత్యనారాయణ, వెంకటేశ్, విపత్తుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Read More

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ప్రారంభం కానున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ శాతం కొలిచే పరికరాలు, క్లీనింగ్ డ్రైయర్ల వంటి సామగ్రిని సిద్ధం చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఉత్పత్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ యార్డుల్లో అక్రమ వ్యాపారాలు (జీరో బిజినెస్) చేసేవారి లైసెన్స్‌లను రద్దు చేయాలని, దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ సర్వే పూర్తయినందున పనుల కోసం త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. బుధవారం సచివాలయంలో మంత్రి.. మార్కెటింగ్, మార్క్‌ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, మార్కెటింగ్ సంచాలకురాలు లక్ష్మిబాయి, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో మొక్కజొన్నలను విక్రయించే రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తాం. యార్డుల్లో రైతుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనుల కోసం ఇతర శాఖల నుంచి ఇంజినీరింగ్ అధికారులను డిప్యుటేషన్‌పై తీసుకోవాలి’ అని ఆదేశించారు.

Read More

హైడ్రోపోనిక్ విధానంలో క్యాప్సికం సాగు

రాజస్థాన్‌లోని అల్వర్ నగరానికి చెందిన యువ ఐఏఎస్ అధికారి ప్రేమ్ ప్రకాశ్ మీనా పాలీహౌస్‌లో మట్టి లేని సాగు (హైడ్రోపోనిక్) విధానంలో చేపట్టిన క్యాప్సికం సాగు, సాధించిన విజయం ఆ చుట్టుపక్కల రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. మూడేళ్ల కిందట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఓ వీడియో చూసి ప్రేమ్ ప్రకాశ్ ఈ హైటెక్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దిల్లీ, గురుగ్రామ్ వంటి మెట్రోపాలిటన్ నగరాల మార్కెట్లకు దిగుబడులను సరఫరా చేస్తున్నారు. అల్వర్ నగర సమీపంలో ప్రేమ్ ప్రకాశ్ కుటుంబానికి అయిదెకరాల పొలం ఉంది. ప్రస్తుతం సాగు బాధ్యతలను ఆయన తండ్రి కదురాం మీనా పర్యవేక్షిస్తున్నారు. ఒక పాలీహౌస్‌తో ప్రారంభించిన ఈ సాగు డిమాండు పెరడగంతో మూడు పాలీహౌస్‌లకు చేరింది. పాలీహౌస్‌ల మీద ఉద్యాన శాఖ ఇస్తున్న 70 శాతం రాయితీ పెట్టుబడి భారాన్ని తగ్గించింది. జైపుర్ నుంచి నాణ్యమైన ఎరుపు, పసుపు క్యాప్సికం విత్తనాలు తెప్పించారు. మొత్తం 18,000 మొక్కలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గతేడాది 32 టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది 40 టన్నులు అంచనా వేస్తున్నారు.

Read More

పంట వ్యర్థాలతో రోడ్లు

సాధారణంగా రైతులు పంట కోతల తర్వాత మిగిలిన గడ్డిని కాల్చేస్తుంటారు. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం తీవ్రం కావటానికి ఇదీ ఒక కారణమే. సీఎసఐఆర్‌కు చెందిన దిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఆరఆరఐ), దేహ్రాదూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)లు వరి గడ్డిని బయో బిటుమన్‌గా మార్ౘ్టంలో విజయం సాధించాయి. ఇందులో ముందుగా వరిగడ్డిని ఫైరోలిసిస్ ప్రక్రియ సాయంతో బయో ఆయిల్‌గా మారాస్తారు. అనంతరం దీన్ని శుద్ధి చేసి, బిటుమెన్‌ను తయారు చేస్తారు. మున్ముందు పత్తి వ్యర్థాల వంటి ఇతర పంట వ్యర్థాలతోనూ తారు తయారు చేయాలనీ భావిస్తున్నారు.

Read More

వృథా నీటితో వరి పంటకు జీవం

నిర్మల్ జిల్లా మామడ మండలం పరి మండల్‌కు చెందిన రైతు సంతోష్ రెండెకరాల వరి చేతికొచ్చే పరిస్థితిలో బోరులో నీరు అడుగంటింది. గట్టెక్కడం ఎలా అని మధనపడుతుంటే… ఎగువ పొలాలు తడవగా.. పొర్లి దిగువకు వృథాగా పోతున్న నీరు కనిపించింది. దాన్ని కల్వర్టు దగ్గరే ఆపి మళ్లించాలనుకున్నారు సంతోష్. ఇసుక బస్తాలు, టార్పాలిన్‌తో అడ్డుకట్ట వేసి.. చిన్న బావిలా మార్చారు. మోటారు, పైపుల సాయంతో ఆ నీటిని 300 మీటర్ల దూరంలోని తన పొలానికి అందిస్తున్నారు.

Read More

సేంద్రియ రైతుల కోసం ‘ఏలూరు రైతు సంపద’

‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌ను ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉంచేందుకు ఈ ప్రత్యేక ప్లాట్‌ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతులతో మాట్లాడి తీసుకోవచ్చు.
సృజనాత్మక ఆలోచనలో భాగంగా…

సృజనాత్మక ఆలోచనలో భాగంగా…
వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందు బాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందినవారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్‌పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.
ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని సోమవారం పీజీఆర్ఎస్‌కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

Read More

మొక్కజొన్నను ధరల మద్దతు పథకంలో చేర్చాలి

కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నను ధరల మద్దతు పథకం (ప్రైజ్ సపోర్ట్ స్కీమ్)లో చేర్చి, సగం పంటను కొనుగోలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సోమవారం లేఖ రాశారు. ప్రస్తుత సీజన్‌లో సుమారు 11,21,494 ఎకరాల్లో పంట సాగు కాగా.. దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి రానుంది.
మార్కెట్ యార్డుల్లో మొక్కజొన్న ప్రస్తుతం క్వింటాలు సగటు ధర రూ.1,759 పలుకుతుండగా.. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400తో పోలిస్తే ఇది రూ. 641 తక్కువ. రైతులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం 92 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటివరకు 65వేల టన్నులు కొనుగోలు చేసింది. మార్కెట్లో అనిశ్చితి వల్ల ధరలు పడిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మొక్కజొన్నను పీఎసఎస్ కింద చేర్చి, మొత్తం ఉత్పత్తిలో 50% కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు.

Read More

4 మేక పిల్లలు…. ఒకే ఈతలో

సాధారణంగా మేకలు రెండు, మూడు పిల్లలకు జన్మనిస్తాయి. కానీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తూర్పు వీధికి చెందిన అన్వర్ పెంచుకుంటున్న మేక ఒకే ఈతలో నాలుగు పిల్లలను ఈనింది. దీంతో చుట్టుపక్కల వారు ఆసక్తిగా వచ్చి చూస్తున్నారు. ‘చాలా అరుదుగా మాత్రమే ఇలా నాలుగు పిల్లలను పెడతాయి’ అని పశువైద్యాధికారి వెంకటేశ్వర్లురెడ్డి తెలిపారు. అందులో ఏదైనా మేక పిల్ల బలహీనంగా ఉంటే జాగ్రత్తగా పెంచాల్సి ఉంటుందన్నారు.

Read More

ఏప్రిల్ 16 వరకు పాడి పశువుల పథకం దరఖాస్తు చేసుకోవాలి

ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాక, ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ‘రెండు పాడి పశువుల పథకం దరఖాస్తు గడువు ఏప్రిల్ 16 వరకు పొడిగించినట్లు తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ఎండీ హన్మంతునాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు ఫొటో, ఆధార్, రేషన్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు, భూమి పట్టా పాస్‌బుక్‌లు కాపీ (జిరాక్స్)లతో ఒక సెట్ మండల పరిషత్ లేదా మున్సిపాలిటీ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.

Read More

ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవు కడుపులో నుంచి బయటకు తీసిన పశువైద్యలు

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పట్టణంలో పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు ఇటీవల అస్వస్థతకు గురైంది. కడుపు బాగా ఉబ్బిపోయి, ఇబ్బందిపడుతుండటంతో పశువైద్యులకు చూపించారు. వైద్యులు పరీక్షించి ఆవు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని గుర్తించారు. శుక్రవారం కోవెలకుంట్ల పశుసంవర్ధకశాఖ ఏడీ డా. కిశోర్ ఆధ్వర్యంలో వైద్యులు డా. నవీన్, డా. విజయానాయక్ శస్త్రచికిత్స చేసి దాని కడుపులోంచి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించారు.

Read More