తెలంగాణాలో కూరగాయల రైతులకు సమీపంలోనే విక్రయ కేంద్రాలు

కూరగాయ పంటలు పండించే చోటే స్థానిక మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాలను దీని కోసం గుర్తించింది. కూరగాయల సాగు విస్తీర్ణం పెంపుదల ప్రణాళికలో భాగంగా రైతు సమస్యలపై ఉద్యానశాఖ, ఉద్యానవర్సిటీలు అధ్యయనం చేశాయి. పంటలు పండించిన తర్వాత విక్రయాలు, మార్కెటింగ్ సమస్యగా మారిందని, దీంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారని అధ్యయనంలో తేల్చింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 36 రైతుబజార్లు మాత్రమే ఉన్నాయి. అవీ నగరాలు, పట్టణాల్లోనే ఏర్పాటయ్యాయి. తెల్లవారుజామునే పంటను అక్కడికి తరలించడం రైతులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు తమ గ్రామాల సమీ పంలోనే మార్కెట్లను ఏర్పాటు చేసి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని ఉద్యానశాఖ, వర్సిటీలు సూచించాయి. దీనికి అనుగుణంగా స్థలాలను గుర్తించాలని సర్కారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఇటీవలే ఆదేశించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల రహదారులకు సమీపంలో రవాణా సౌకర్యం ఉన్నవాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని సూచించింది. కలెక్టర్లు మొదటి విడతలో 60 ప్రాంతాలను గుర్తించారు. అక్కడ కూరగాయల నిల్వ, విక్రయాల కోసం మార్కెటింగ్ శాఖ షెడ్లను నిర్మించనుంది. కూరగాయల లభ్యతపై సమీప గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. రవాణా కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులా లకు అక్కడి నుంచే కూరగాయలు పంపిణీ చేయనున్నారు.

Read More

బస్తా నిమ్మకాయల ధర రూ. 4,350/-

హైదరాబాద్ (షరీఫ్) మార్కెట్‌లో గురువారం నిమ్మకాయలు బస్తా ధర రూ.4,350 పలికింది. వేసవి తీవ్రమవడంతో డిమాండ్ పెరగడం, ఖరీఫ్ సీజన్ ముగింపు సమయంలో కురిసిన భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో.. ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో తామెన్నడూ ఇలాంటిది చూడలేదని కనగల్ మండలం మంచినీళ్లబావి గ్రామానికి చెందిన రైతు బోదనపు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంచి ధర దక్కించుకున్న రైతులు మురిసిపోతున్నారు.

Read More

బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో 8

బర్డ్ ఫ్లూ స్వేచ్ఛా ప్రాంతాలు (బర్డ్ ఫ్లూ ఫ్రీ ఏరియా)గా ఆంధ్రరాష్ట్రంలో ఆరు జిల్లాల్లోని 8 ప్రాంతాలను ప్రభుత్వం గురువారం ప్రకటించింది. గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాంతాల్లో ఫ్లూ ప్రబలడంతో ఆ ప్రాంతాలను అప్పట్లో బర్డ్ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించారు. తర్వాత నెలకు రెండుసార్లు చొప్పున ఈ ప్రాంతాల్లోని కోళ్లు / పక్షుల నమూనాలు సేకరించి, భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఐకార్-ఎనఐహెచఎసఏడీ)కు పంపించారు. వరుసగా నెగెటివ్ వస్తుండటంతో ఈ ప్రాంతాలను బర్డ్ ఫ్లూ రహిత ప్రాంతాలుగా ప్రకటించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
కమర్షియల్ పౌల్ట్రీలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం, ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుముల్లంక, ఎ.కోడూరు మండలంలోని కృష్ణారావుపాలెం, కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని 21వ వార్డు, గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామం మరియు బాతులు ప్రభావితమైన ప్రాంతం కర్నూలు జిల్లాలో ఎనఆర్‌పేట, కర్నూలును బర్డ్ ఫ్లూ ఫ్రీ ప్రాంతాలుగా ప్రకటించారు.

Read More

సెన్సర్ సహాయంతో పంటల నీటి అవసరం తీర్చవచ్చు

ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలోని పొగాకు పరిశోధన కేంద్రంలో సెన్సర్ ఆధారిత పొగాకును 8 ఎకరాల్లో భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్)- జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ నేతృత్వంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. ఈ విధానంలో మొక్కల వేర్ల దగ్గర మట్టిలో సెన్సర్లను ఏర్పాటు చేశారు. ఇవి నేలలో ఉన్న నీటి పరిమాణాన్ని నిరంతరం కొలుస్తూ సమాచారాన్ని గేట్‌వే టవర్ ద్వారా క్లౌడ్ సిస్టమ్‌తో పంచుకుంటాయి. దానిని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాంకేతికత విశ్లేషిస్తుంది. నేలలో తేమ స్థాయి తగ్గితే ఆటోమేటిక్‌గా మోటారు ఆన్ అయ్యి నీరు పారుతుంది. సెల్‌ఫోన్‌లో కల్టివేట్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఈ ప్రక్రియను రైతు గమనించవచ్చు. సంప్రదాయ పద్ధతిలో హెక్టారుకు సుమారు 4,500 ఘనపు మీటర్ల నీరు అవసరం కాగా.. ఈ విధానంలో అది 1700 ఘనపు మీటర్లకు తగ్గింది అని పంటల నిర్వహణ హెచఓడీ, ప్రాజెక్టు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ కొరడా రాజశేఖరరావు తెలిపారు.

Read More

నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం

భూమి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ దిగుబడిని పొందడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి. కాబట్టి తెలంగాణలోని రైతులందరికీ నేల ఆరోగ్య కార్డుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. బుధవారం ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నేల ఆరోగ్య వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లను నియమించాం, ఒక్కో వాలంటీరు 10 మంది రైతులకు నేల ఆరోగ్యంపై అవగాహన కల్పించి భూసార పరీక్షలు చేస్తారు’ అని తెలిపారు. సమావేశానికి అగ్రివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య అధ్యక్షత వహించగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి పాల్గొన్నారు.

Read More

ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

రాష్ట్ర విభజన తర్వాత అత్యధికంగా ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. 7.83 లక్షల మంది రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించగా ప్రభుత్వం రూ.11,557 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసింది. అధికశాతం రైతులకు 48 గంటల్లోపే ఈ చెల్లింపులు పూర్తిచేశారు. 2025 ఖరీఫ్‌లో 43.37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 94 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్చి 31 కి 48.70 లక్షల టన్నులు సేకరించారు.

Read More

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుతో ఆయిల్‌పామ్‌లో మంచి ఫలితాలు

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగులో ఆధునిక సాంకేతికతను, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఇక్రిశాట్‌లో 100 ఎకరాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేసి ఆయిల్‌పామ్‌లో నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి రకాల వృద్ధి, హైబ్రిడ్ సృష్టికి ఇందులో పరిశోధనలు జరగనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ, కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయాలను ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కోసం భారత్ ఆయిల్‌పామ్ పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్) ని సైతం భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దాంతో సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్రంలో 2.91 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది. ఏటా రెండు లక్షల ఎకరాల పెంపుదలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ రంగంలో ఆయిల్‌ఫెడ్, ప్రైవేటు రంగంలో 14 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయిల్‌పామ్ సాగుకు సబ్సిడీలను ఇస్తోంది. ఇంత చేస్తున్నా ఆశించిన స్థాయిలో సాగు పెరగడంలేదు. ఈ నేపథ్యంలో ఆయిల్షామ్ సాగుకు ఏర్పడుతున్న అడ్డంకులను ప్రభుత్వం అధ్యయనం చేయించి, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

Read More

నేల ఆరోగ్యంతోనే పౌష్టికాహారం

నేల ఆరోగ్యంగా ఉంటేనే పౌష్టికాహారం అందుతుంది కాబట్టి రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ, అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్)ల ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో భూసార ఆరోగ్య వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ‘పిల్లి పెసర, జీలుగ లాంటి పచ్చిరొట్ట పైర్ల ద్వారా నేల సారాన్ని పెంచాలి. పంట అవశేషాలు తగల బెట్టకుండా వాటిని ఎరువులుగా ఉపయోగించాలి. నేల ఆరోగ్య పరిరక్షణను ఉద్యమంలా నిర్వహించేందుకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ముగ్గురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నాం. వారు రైతులకు నేల యాజమాన్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నైపుణ్యాలను వృద్ధి చేస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించే రైతు ఉత్సవాల్లో రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలి” అని మంత్రి సూచించారు. అంతకుముందు మంత్రి ఇక్రిశాట్‌లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) హిమాన్ష్ పాఠక్, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉద్యాన శాఖ సంచాలకురాలు యాస్మిన్ బాషా, అగ్రివర్సిటీ వీసీ రాజిరెడ్డి, అగ్రివర్సిటీ పరిశోధన సంచాలకుడు బలరాం తదితరులు పాల్గొన్నారు.

Read More

విత్తనోత్పత్తిలో రైతులు

తెలంగాణాలో చాలామంది రైతులు ఇటీవల విత్తనోత్పత్తి చేపడుతున్నారు. పొలాస, కూనారం, వరంగల్, రుద్రూరు, రాజేంద్రనగర్, మారుటేరు, నెల్లూరు తదితర పరిశోధన స్థానాల నుంచి తెచ్చిన బ్రీడర్, ఫౌండేషన్, ట్రూత్‌ఫుల్ లేబుల్ విత్తనాలను సాగుచేసి పండిన పంటను తిరిగి విత్తనంగా విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తూ తోటి రైతులకు నాణ్యమైన వంగడాలను చేరవేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖ ద్వారా గత వానాకాలానికి ముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో వరి, పెసర, మినుము, కంది, వేరుసెనగ, నువ్వులు తదితర పంటల విత్తనాలిచ్చారు. వీటిని సాగు చేసినవారు తోటి రైతులకు సైతం విత్తనాలను చేరవేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ యాసంగిలో 9.59 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు ప్రస్తుతం గొలక దశ నుంచి నూర్పిడి దశ వరకు శాస్త్రవేత్తలు విత్తన ప్రాధాన్యతను రైతులకు వివరిస్తున్నారు. పొలంలో కల్తీ కర్రలు, బెరకు కేళీలను ఏరివేసి పంటను వేరుగా నూర్పిడి చేసుకొని రైతు విత్తనంగా వాడుకోవచ్చు. దీంతో కల్తీలు, నకిలీల బెడద ఉండదు. మన నేలల్లోనే పండించిన పంట కాబట్టి స్థిరమైన దిగుబడి వస్తుంది. ప్రైవేటుగా విత్తనాలను కొంటే హెక్టారుకు రూ. 3 వేల నుంచి రూ. 6 వేల వరకు విత్తనానికి వెచ్చించాల్సి వస్తోంది. అదే రైతు విత్తనమైతే సగం ఖర్చుతోనే సరిపోతుంది. వచ్చే వానాకాలం సీజన్‌లో సన్నాలను అధికంగా సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నందున ఇప్పటినుంచే రైతులు మేలైన సన్న గింజ రకాలను సేకరించుకోవాలి. మక్క, పత్తి తదితర హైబ్రిడ్స్ మినహా వరి నువ్వులు, పెసర, మినుము, అలసంద తదితర సూటి రకాల్లో ప్రతి పంటకు నూతన విత్తనం కొనకుండా రైతు విత్తనాన్ని వినియోగించాలని ఏడీఆర్ డా. హరీశ్ కుమార్ శర్మ సూచించారు.

Read More

23 వేల రూపాయలకు చేరువలో పామాయిల్ ధర

కరోనా సమయంలో పామాయిల్ గెలలకు గరిష్ఠంగా టన్నుకు రూ.23 వేల పైచిలుకు ధర లభించింది. అప్పటివరకు గోదావరి జిల్లాల్లో పూర్తి స్థాయిలో, ఎన్‌టిఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ కనిపించిన సాగు ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నర్సరీల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడమేగాక, మొక్కలు ఉచితంగా అందిస్తుండటంతో ఏటా సాగు పెరుగుతూ వస్తోంది. గతేడాది వరకు ఎన్‌టిఆర్ జిల్లా వ్యాప్తంగా కేవలం 7,500 ఎకరాల్లో సాగవగా, గడిచిన ఒక్క ఏడాదిలోనే 6,150 ఎకరాల్లో విస్తీర్ణం పెరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. *మళ్లీ దూకుడు:* తొలుత రూ.12 వేలు ఉన్న టన్ను 2022లో గరిష్ఠంగా రూ.23,467 పలికింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు రూ.15 వేల లోపే ఉంది. గతేడాది మళ్లీ రూ.20 వేలు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 20 వేల దిగువనుండగా, గడిచిన మూడు నెలలుగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణాలో ఇప్పటికే రూ.23 వేలు దాటింది.పెరుగుదల (టన్నుకు రూ.ల్లో)

జనవరిలో : 19,850

ఫిబ్రవరి మొదట్లో : 20,180

ఫిబ్రవరి చివరిలో : 21,546

మార్చిలో : 22,936

Read More