మన రాష్ట్రంలోకి నైరుతి ఋతు పవనాలు జూన్ మొదటి వారంలోనే సరైన సమయానికే ప్రవేశించాయి. భారత వాతావరణ విభాగం వారు కూడా ఈ 2021వ సంవత్సరంలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపారు. సాధారణంగా చాలా మంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను, ఒకే నేలలో వేసుకోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనపుడు పంట పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. అంతే కాకుండా ఏక పంట విధానం వలన కలుపు తీవ్రత పెరగడమే గాక, చీడ పీడల ఉదృతి అధికం అవుతుంది. భూమిలో ముడి పోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారం అవుతుంది. వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవాలి. రెండు పంటలను ఒకే నేలలో, ఒకే సమయంలో నిర్దిష్ట వరుసలలో కలిపి పండించడాన్నే అంతర పంటలు అంటారు.
అంతర పంటల ఆవశ్యకత
మన రాష్ట్రంలో వర్షాధారంగా ఖరీఫ్‌లో ముఖ్యంగా ప్రత్తి, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కంది మరియు ఇతర అపరాలను పండిస్తున్నారు. సాధారణంగా చాలా మంది రైతులు ఈ పంటలను ఏక పంటగా పండిస్తూ ఉంటారు. సహజ వనరులైన సూర్యరశ్మి, వర్షపు నీరు, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలంటే అంతర పంటలు వేసుకోవడం తప్పనిసరి. కొందరు రైతులు అంతర పంటల వల్ల ప్రధాన పంట దిగుబడి తగ్గుతుందని, అంతర కృషి వీలు కాదని, కలుపు తీయుటకు కూలీల ఖర్చు పెరుగుతుందని అపోహపడుతుంటారు. కానీ, మనం సరియైన అంతర పంటను ఎన్నుకున్నట్లైతే, అవసరాన్ని బట్టి సాళ్ళ మధ్య దూరం మార్చుకున్నట్లైతే, ముఖ్య పంట దిగుబడి తగ్గకుండా ఉండటమే కాకుండా అంతర పంటల వల్ల అదనపు దిగుబడి వస్తుంది.
అంతరపంటలను ఎంచుకునేటపుడు పాటించాల్సిన సూత్రాలు
* ధాన్యపు పంటలు / చిరు ధాన్యాల పంటలతో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి.
* ప్రధాన పంట దీర్ఘ కాలిక పరిమితి కలది అయితే, అంతర పంట స్వల్పకాల పరిమితి కలిగి ఉండాలి.
* ఒకపంట మరోపంటతో వనరులకోసం పోటీపడేలా ఉండకూడదు.
* ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే, అంతర పంట పొట్టిగా, గుబురుగా పెరిగే దానిని ఎంచుకోవాలి.
* ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే, మరొక పంట తక్కువ లోతు వేరు వ్యవస్థ కలిగి ఉండాలి.
* ఒకే జాతి / ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు.
* ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే, ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకొనే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి.
* రెండు పంటలను సాగు చేసే యాజమాన్య పద్దతులు ఒకే విధంగా ఉంటే, సాగు చేయడం సులువుగా ఉంటుంది.
అంతర పంటల వలన కలిగే ప్రయోజనాలు :
* వాతావరణ పరిస్థితులు అనుకూలించినపుడు అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల (బెట్ట /కరువు) ఒక పైరు దెబ్బ తిన్నపుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు.
ఉదా: వేరుశనగలో కందిని అంతర పంటగా సాగు చేస్తే, వేరుశనగ పంట కాలంలో మంచి వర్షం వస్తే వేరుశనగ దిగుబడి బాగా వస్తుంది. అలా కాకుండా, వేరుశనగ పంట కాలంలో బెట్ట వచ్చి, పంట చివరిలో వర్షం వస్తే, వేరుశనగ దిగుబడి తగ్గినప్పటికీ, చివర పడిన వర్షం కంది పంటకు ఉపయోగపడి (పూత/కాయ థలో) అధిక దిగుబడిని ఇస్తుంది.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగపడును. స్థలమే కాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు మరియు పోషకాలు కూడా సమర్ధంగా వినియోగించుకోబడతాయి. ఉదా: కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లైతే, సజ్జ స్వల్ప కాలిక పంట (80-90 రోజులు) త్వరగా కోతకు వస్తుంది.ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది కాబట్టి ఈ రెండు పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా నేల కోత తగ్గడమే గాక, భూమి పైన సారవంతమైన పొర కొట్టుకొని పోకుండా భూసారం పరిరక్షింపబడుతుంది. ఉదా: మొక్కజొన్న మరియు అలసంద పంటలను కలిపి సాగు చేసినపుడు, అలసంద పంట గుబురుగా పెరగడం వలన నేల కోతను నిరోధించే పంటగా వ్యవహరించి నేల కోతను నివారించడమే గాక, నీటి ఒరవడిని 20-30 శాతం వరకు తగ్గించి భూమిలోనికి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షిస్తుందని వివిధ పరిశోధనల్లో తేలింది.
* ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లైతే, ప్రధాన పంటకు కొంతమేరకు నత్రజనిని అందించడమే గాక, భూసారం వృద్ధి చెందుతుంది. ఉదా: సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లు అయితే, కంది వేర్లలో ఉండే రైజోబియం బాక్టీరియా వాతావరణం లోని నత్రజనిని స్థాపించి, ప్రధాన పంటకు అందిస్తుంది.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా ఎత్తుగా పెరిగే మొక్క, పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన, చుట్టు పక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదా: టమోటా ను జొన్న పంటలో సాగు చేసినట్లు అయితే , జొన్న పంట టమోటా పంటకు నీడను ఇవ్వడం ద్వారా చుట్టు పక్కల ఉష్ణోగ్రత తగ్గి, సూక్ష్మ వాతావరణం ఏర్పడుతుంది.
* గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో, పొడవుగా మరియు దృడంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ ఇస్తుంది. ఉదా: టమోటా పంటను, మొక్క జొన్న / జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే, అధిక గాలి వేగం ఉన్నపుడు, ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమోటా పంటకు రక్షణ ఇస్తాయి.
* అంతర పంటలను సాగు చేయడం వలన చాలా వరకు కీటకాలు మరియు తెగుళ్ళు ఉధృతి తగ్గుతుంది.ఉదా: టమోటాను అలసంద పంటతో కలిపి సాగుచేసినపుడు, టమోటాలో బాక్టీరియా విల్ట్ తెగులు తగ్గిందని పరిశోధనల్లో తేలింది.
* అంతర పంటలను సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించవచ్చు. ఉదా: ప్రొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన (అల్లీలోపతి ప్రభావం) కలుపు నివారించబడుతుంది.
ఎర పంటలు / రక్షణ పంటలు:
ఈ ఎర పంటలు పొలం మధ్యలో కానీ, చుట్టూ కానీ వరుసలలో వేసి పండించడం వలన చీడ పీడలు ముఖ్య పంటను కాకుండా ఎర పంట వైపు ఆకర్షింపబడతాయి. తద్వారా చీడ పీడలు పలుచబడి ముఖ్య పంటపై వాటి ఉధృతి తగ్గుతుంది. అంతే గాకుండా, ఈ ఎర పంటపై చీడను గమనించిన వెంటనే ఇతర పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో నివారించుకోవచ్చు. ఇక రక్షణ పంటలను పొలం చుట్టూ ఒకటి / రెండు వరుసలలో వేయడం వలన, వైరస్ తెగుళ్ళను వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగులు ముఖ్య పంటను ఆశించకుండా రక్షిస్తాయి. అంతే గాకుండా, గాలి ద్వారా వ్యాప్తి చెందే పురుగులు పైరును ఆశించడం తగ్గుతుంది.
కొన్ని ముఖ్యమైన ఎర పంటలు-ఉపయోగాలు :
* ప్రత్తితో పాటు బెండను ఒకటి /రెండు వరుసలలో వేయడం వలన దీపపు పురుగులు మరియు కాయ తొలుచు పురుగు ప్రత్తి నుండి బెండ వైపు మరిలేటట్లు చేయవచ్చు.
* ప్రత్తిలో కంది పంటను కలిపి వేయడం వలన, బూడిద రంగు ముక్కు పురుగు కంది వైపు ఆకర్షించబడి చీడ ఉధృతి తగ్గుతుంది.
* ప్రత్తిలో అలసంద / సోయాచిక్కుడు పంటలను సాగు చేయడం వలన రసం పీల్చే పురుగుల ఉదృతి తగ్గుతుంది.
* వేరుశనగలో సోయాచిక్కుడు పండించడం వలన ఆకు ముడుత ఉదృతి తగ్గుతుంది.
* వేరుశనగలో ఆముదం/ ప్రొద్దుతిరుగుడు మొక్కలు అక్కడక్కడా వేయడం వలన పొగాకు లద్దె పురుగు గుడ్లు పెట్టడానికి ఆకర్షింపచేయవచ్చు.
* తీగ కాయ గూరల్లో మధ్యలో మినుము పంటను వేయడం వలన పండు ఈగ ఆశించకుండా తగ్గించవచ్చు.
* కూరగాయల్లో బంతి మొక్కలను సాగు చేయడం వలన భూమిలో ఉన్న నులి పురుగులు నశిస్తాయి.

ఎ. మల్లీశ్వర రెడ్డి, శాస్త్రవేత్త (సేద్య విభాగం) ఫోన్: 99892 08210; బి. సహదేవ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త (మెట్ట వ్యవసాయం) & అధిపతి, వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం.
