ప్రకృతి అంటే పచ్చదనం, పూలు, వాటిపై వాలే అందమైన తేనెటీగలు, సీతాకోక చిలుకలు, కందిరీగలు. ఈ పురుగులు యుగాల తరబడి అభివృద్ధవుతూ, రూపాంతరం చెందుతూ, కొత్త రకాల పురుగులుగా ఆవిర్భవిస్తూ వున్నాయి.
మత గ్రంధాలలో వీటికి ప్రశస్థమైన వర్ణన లభించటం చూస్తే ఇవి పరోక్షంగా మనిషిని ఎంత ఆదుకున్నాయో అర్థమవుతుంది. పట్టుపురుగులు, తేనెటీగలు, లక్క పురుగులు మానవాళికి ఆహారం, ఆరోగ్యం, సౌందర్యం, ఆనందాలతోపాటు ఆదాయాన్ని అందిస్తున్నాయి. సృష్టిలో అన్ని జీవరాశులు పరస్పరం సహాయపడుతూ, జీవాహార గొలుసు, ఖనిజ వలయ వ్యవస్థలను నడిపిస్తున్నాయి. సహజంగా మనకు అవస్థను కలిగించే ఈగలు, చెదలు, బొద్దింకలు లేకుంటే ఈ భూమి వ్యర్ధాలతో, చెత్తతో, మృత కళేబరాలతో నిండి ఉండేది. నిజానికి ఈ కీటకాలన్నిటినీ సమూలంగానాశనం చేస్తే, మానవాళి కేవలం నాలుగు సంవత్సరాలలోనే అంతరించిపోతుందట. మానవుని అవసరాలను బట్టి కీటకాలను మూడు ముఖ్యమైన విభాగాల్లోకి విభజించవచ్చు: వాణిజ్య పురుగులు (తేనె, పట్టు, లక్క పరిశ్రమలు), ఉపయుక్త పురుగులు (పరాగ సంపర్కాన్ని గావించి ఫలాలను కాయించేవి. ఉ: దోస, పుచ్చకాయ, కూరగాయలు, ఉల్లి, దుంపలు, పొద్దు తిరుగుడు, ఆవాలు, కుసుమ వంటి నూనె పంటలు, మొక్క జొన్న, చెఱకు), జీవనియంత్రణ పురుగులు (చీడ పురుగులను హరించే మిత్ర పురుగులు).
పంటమీద దాడి చేసి నష్టం చేసే పురుగులను నియంత్రించే వాటిని మిత్రపురుగులంటారు. వీటినే శాస్త్రవేత్తలు జీవనియంత్రణ పద్ధతుల్లో వినియోగిస్తారు. ఇవి ముఖ్యంగా రెండు రకాలు. మొదటి రకాన్ని ‘పరాన్నజీవులు’ లేక ‘బదనికలు’ అని పిలుస్తారు. ఇవి చీడ పురుగుల్లోకి ప్రవేశించి, వాటి జీవన చర్యలను మందగించేలా చేసి, కొద్దికాలంలోనే వాటిని నాశనం చేసి, పునరుత్పత్తి అవకాశాలను నిర్మూలిస్తాయి. బదనికలు చీడపురుగు కన్నా చిన్నగా ఉంటాయి. రెండవ రకాన్ని ‘పరాన్నభుక్కులు’ లేక ‘వేట పురుగులు’ అంటారు. ఇవి చీడపురుగులకన్నా పెద్దగా ఉండటంవలన హుషారుగా పురుగు ఆవాసాన్ని కనిపెట్టి, పట్టి, ఆరగిస్తాయి. ప్రకృతి సహజమైన ఈ ప్రక్రియలకు ఇవి దోహదపడతాయి కానీ ప్రతి చీడపురుగును గురి పెట్టి నివారించలేవు. అందుచేత శాస్త్రవేత్తలు సమర్థవంతమైన మిత్రపురుగులను ప్రయోగశాలల్లో పెంచి పోషించి, అతి తక్కువ ధరల్లో రైతులకు అందిస్తున్నారు. ఈ పురుగులను పొలాల్లో తగుమోతాదులో వదలటంవలన చీడ పురుగులను లక్ష్యంగా నియంత్రించి పురుగుమందుల వాడకాన్ని కొంతమేరకు తగ్గిస్తాయి. ఇంతటి అమూల్యమైన పురుగులు పొలాల్లో నాశనం కాకుండా వృద్ధి చెందనివ్వాలంటే, వాటి గురించి రైతులు తెలుసుకోవాలి.
బదనికలు
వీటిని చిన్న పరిమాణపు కందిరీగలు అని వర్ణించవచ్చు. ఇవి పంటకు నష్టం కలుగచేసే చీడపురుగుల గుడ్లు, పిల్లలు, కోశస్థ థలను ఆశించి క్రమేపీ వాటిపై జీవిస్తాయి. తద్వారా పురుగు సంతతి తగ్గి ఈ పరాన్నజీవుల సంతతి పెరిగి చీడపురుగులు నియంత్రించబడతాయి. కొన్ని బదనికలు పురుగు గుడ్లపై తమ గుడ్లు పెట్టడంవలన, వాటినుంచి కందిరీగలే తయారయ్యి ఇతర పురుగు గుడ్లను వెతికి వాటిపై కూడా గుడ్లు పెడతాయి. గుడ్డు అట్టల (ట్రైకో కార్డ్స్) రూపంలో వరి, చెఱకు పంటల్లో ప్రాచుర్యం పొందిన ట్రైకోగ్రామా కందిరీగలు ఈ కోవకు చెందినవే. టెలినోమస్ అనే మరో బదనిక పొగాకు లద్దె పురుగు గుడ్లని ఆశిస్తుంది.
ఇంకొన్ని లార్వా (గొంగళి పురుగు) పైన గుడ్లు పెడతాయి. పుట్టిన బదనిక పిల్లలు గొంగళిపురుగు శరీరం లోపల పరాన్నజీవులుగా ఎదిగి బయటకు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. ఈ చిత్రంలో చూపిన విధంగా అనేక చిన్న బదనిక కోశస్థ థలు (గూళ్ళు/ప్యూపాలు) గొంగళి పురుగుల పైన దర్శనమిస్తాయి. బ్రాకాన్ కందిరీగలు ఈ విధంగా గొంగళిపురుగు నుంచి గుంపులు గుంపులుగా వెలికి వచ్చి దానిని హతమారుస్తాయి. శనగపచ్చ పురుగులను క్యాంపోలేటిస్ కందిరీగలు వెతికి వాటిపై తమ గుడ్లను పెడతాయి.
మరి కొన్ని బదనికలు లార్వా థలో ఆశించి, ప్యూపా థలో వెలికి వస్తాయి. ఐసోటిమా కందిరీగ ఇదే విధంగా చెఱకులో మొవ్వు పురుగులపై దాడి చేస్తుంది. ఇంకొన్ని బదనికలు ప్యూపానే గురిపెడతాయి.
కొన్ని పరాన్నజీవులు పూర్తిగా ఎదిగిన ప్రౌఢ పురుగులపై కూడా గుడ్లు పెట్టకలవు. రసంపీల్చే పురుగులను కొన్ని కందిరీగలు సులువుగా ఆశించి నియంత్రిస్తాయి. ఈమధ్య కొబ్బరిచెట్లపైన రుగోస్ తెల్లదోమను నియంత్రించడానికి ఇటువంటి ఎన్కార్సియా బదనికను విరివిగా తోటల్లో విడుదల చేశారు.
వేటాడే పురుగులు
తూనీగలు: ముసురు పట్టినప్పుడు బాగా కనిపించే వీటితో పిల్లలు ఆటలాడుకుంటారు. తెలంగాణలో వీటిని బూగలు అంటారు. ఇవి దోమలు, సుడిదోమలు, ఈగలు మొదలగువాటిని తింటాయి. వీటి పిల్లలు నీటిలో పెరుగుతూ ఇతర చిన్నజలచరాలను, దోమల సంతతిని హరిస్తాయి.ఈగలు: ఇళ్ళల్లో కనిపించే ఈగల కన్నా పెద్దగా ఉండి, చీడ పురుగులను సమర్థవంతంగా ఆరగిస్తాయి. సహజంగా వీటి పిల్లపురుగులు చిత్తడి నేలల్లో లేక బురుద నీళ్ళల్లో నివసిస్తూ క్రిములు, నాచు పై జీవిస్తాయి. నూగురహితంగా పసుపు నలుపు చారలతో తేనెటీగల్లా ఉంటాయి సిర్ఫిడ్ ఈగలు. వాటి పిల్లలు పొడవుగా పచ్చగా ఉండి సన్నని కోరలతో పేనుబంకను నిర్విరామంగా తిని పంటకు మేలు చేస్తాయి.
గొల్లభామ: పచ్చని మిడతల్లాగా ఉండే ఈ పురుగులు చిన్న తల పెద్ద కళ్లుకలిగి ముందు కాళ్ళను ముడుచుకుని నేలమీదున్నాకూడా మునివేళ్ళపైన గాల్లో ఊగుతున్నట్టు ఉంటాయి. వీటికి పదునైన పళ్ళు, ముందుకాళ్ళల్లో ముల్లు ఉండటం వలన అనూహ్యంగా ఆహారాన్ని ముందు కాళ్లతో పట్టుకుని చంపి తింటాయి.
క్రైసోఫెరా: పచ్చని శరీరంతో మెరిసే కళ్ళు, పొడవాటి మీసాలు, సున్నితమైన రెక్కలు కలిగిన వీటిని అల్లిక రెక్కల పురుగులు అంటారు. ఇవి గుడ్లు పెట్టే విధానం బహుముచ్చటగా ఉంటుంది. పిల్లలు ఆడుకునే బూరల తాళ్ళన్నీ కలిపి పట్టుకుంటే ఎలా ఉంటాయో, వీటి గుడ్లు ఇలా సన్నని కాడలపైన తెల్లగా ఉంటాయి. వీటి పిల్లలు గోధుమరంగుతో పొడవుగా ఉండి మొసళ్ళ శరీరాకృతితో సన్నని ముల్లు కలిగి ఉంటాయి. తల ముందు ఉన్న పెద్ద కోరపళ్ళతో పేనుబంకను ఇతర చిన్న కీటకాలను దాడి చేసి ఆరగిస్తాయి. కృత్రిమంగా వీటిని పెంచి రైతులకు గుడ్లు, పిల్లల రూపేణా అమ్ముతున్నారు. తల్లిపురుగు శాఖాహారి, కేవలం మకరందాన్నే తాగుతుంది.
అక్షింతల పురుగులు: ఇవి ఎరుపు లేక పసుపు రంగు రెక్కలపై నల్లటి మచ్చలు, చారలుండే గుండ్రటి పురుగులు. ఇవి వేగంగా కదిలినా ఎక్కువ దూరం నడవలేవు, అందుకే అలికిడికి పడిపోయి ఎగిరి పోతుంటాయి. పేనుబంక, తెల్ల దోమ, ఇతరాత్రా చీడపురుగులను స్వాహా చేసే వీటి పిల్లలు పసుపు, నలుపు రంగులతో పొడవుగా ఉంటాయి. వీటి చర్మం మొసళ్ల వలె మందంగా ఉండి పదును లేని ముల్లు కలిగిఉంటాయి. వీటికి అల్లికరెక్కల పురుగు పిల్లల్లా కోర పళ్ళు ఉండవు. ఇవి రెక్కలు తెచ్చుకొని ప్రౌఢ పురుగులవటానికి కోశస్థథకు వెళతాయి. అక్షింతల పురుగులు, వాటి పిల్లలు రసం పీల్చే పురుగులను విపరీతంగా ఆరగించి వాటిని నాశనం చేస్తాయి.
కందిరీగలు: ఇళ్ళ ఆవరణల్లో కందిరీగలు మట్టి గూళ్లను కడుతుంటాయి. గొంగళి పురుగులని ఆ గూళ్లలోకి తీసుకువచ్చి వాటిపై తమ గుడ్లను పెడతాయి. పుట్టిన పిల్లపురుగు గొంగళిలోపల ఎదిగి దాన్ని చీల్చుకుని బయటకు వచ్చి ఆ మట్టి గూళ్లలోనే ప్యూపా లేక కోశస్థథకు వెళుతుంది. విచిత్రం ఏంటంటే ఆ గొంగళి ఏమాత్రం కుళ్లిపోకుండా కేవలం పక్షవాత గ్రస్తమవుతుంది.
కీటకాలు కాని మిత్రపురుగులు
సాలె పురుగులు: సహజంగా అన్ని చెట్లు, మొక్కలపై కనిపించే సాలీళ్ళు చీడపురుగు నిర్మూలనకు దోహదపడే అత్యుత్తమ మిత్రపురుగులు. ఇతర పురుగులకు ఆరు కాళ్ళుంటే వీటికి ఎనిమిది ఉంటాయి. వీటిని కృత్రిమంగా పెంచడం కష్టం కాబట్టి వీటిని పంటపొలాల్లోనే సంరక్షించాలి. పక్షిస్థావరాలను ఏర్పాటు చేస్తే, చీడపురుగులను తినే పకక్షులకు ఆలవాలంగా ఉండటమే కాకుండా, ఆ కర్రలు సాలీళ్ళు గూళ్ళు కట్టుకొని నివసించడానికి కూడా ఉపయోగపడతాయి.
గాజు పురుగులు, కాళ్ల జెర్రిలు: గాజు పురుగులు, రోకలిబండలు వంటివి పంట పొలాల్లో చెత్తను గ్రహించి నేల సారాన్ని పెంచడానికి దోహదపడతాయి. కాళ్లజెర్రిలు పంట కోతకొచ్చే సమయంలో భూమిలోని చీడ పురుగులను వాటి కోశస్థ థలను నాశనం చేస్తాయి. పాములు ఎలుకలను నియంత్రించిన విధంగా ఈ శత సహస్ర పాదులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి.
వానపాములు రైతుకు నేస్తాలు అనేది నానుడి. చీడపురుగులను ఆరగించే కప్పలు, తొండలు, పకక్షులకు ఆహారంగా ఉపయోగపడే వీటినే చేపలు పట్టడానికి ఎరలుగా కూడా వినియోగిస్తుంటారు. ఇవి చిత్తడి నేల, కుళ్ళుతున్న జీవపదార్ధాలు, బంకమట్టి లేదా ఇసుక నేలల్లో బొరియలు చేసుకొని నివసిస్తుంటాయి. వానపాములు వివిధ కూరగాయ తోటల్లో మట్టి ద్వారా సంక్రమించే తెగుళ్లను దాదాపు 50 – 70% వరకు అణిచివేస్తాయని అంచనా. భూమినుంచి వెలికివచ్చి సన్నని గుళికల రూపంలో వదిలే వీటి విసర్జితాలు మంచి జీవన ఎరువులు. పేడ, ఇతరాత్రా వ్యవసాయ, వంటింటి వ్యర్థాలకు సరిపడా తేమను అందించగా ఈ వానపాముల విసర్జితాలతో మిళితమై తయారైన అతి శ్రేష్ఠమైన సేంద్రీయ పదార్థం వర్మి కంపోస్టు. ఈ సేంద్రీయ పదార్ధం గుండా నీటిని పారించగా సమకూరిన హార్మోన్, ఖనిజ, పోషకభరిత నీటిని వర్మి వాష్ అంటారు. వర్మికంపోస్ట్ యూనిట్లకు ప్రభుత్వం కూడా సబ్సిడిని అందించి ప్రొత్సహిస్తుంది. ఈ ఎరువు నీటి నిల్వ సామర్థ్యం, పోషక లభ్యతను మెరుగుపరిచి, నేలను సారవంతం చేసి వ్యవ సాయానికి సహాయపడుతుంది.
ఇన్ని రకాల పురుగులు మనకు ఉపయుక్తంగా ఉంటే, వాటిని మనం చీడగా భావించి నాశనం చేస్తున్నాం. ఇంతటి జీవ వైవిధ్యాన్ని హరించడం వలన అసమతుల్యత ఉత్పన్నమై సహజ జీవనియంత్రణ విధానం తగ్గి చీడ పురుగులు వేగంగా పెరుగుతాయి. అందుకే కనిపించిన ప్రతి పురుగుని చంపకుండా, వాటిని గమనించి, పంటకు నష్టం చేకూరుస్తుంటేనే వాటి నియంత్రణపై దృష్టిపెట్టటం తెలివైన పని. కనుక మిత్రపురుగులను సంరక్షించడానికి క్రింద వివరించిన విధంగా జాగ్రత్తలు పాటించాలి.
పంటకు హాని చేస్తున్న పురుగుకు సూచించిన క్రిమిసంహారకాన్నే వినియోగించాలి. విస్తృత&శ్రేణి పురుగుమందులను ఉపయోగించకూడదు.
ఆముదం, బంతి వంటి ఎర పంటలను పురుగులు పునరుత్పత్తికి ఎంచుకుంటాయి. వాటి పై ఉన్న పురుగు గుడ్లు, లార్వాలను ఏరి నాశనం చేయొచ్చు, లేకుంటే వేప కషాయం, వేప నూనె, బెవేరియా, వంటి బయోపెస్టిసైడ్స్ను పిచికారీ చెయ్యొచ్చు.
పురుగు తాకిడి ఉన్న చోట మాత్రమే పిచికారి చేయటం ఇతర జీవరాశులకు శ్రేయస్కరం.
అది వీలుకాకుంటే పొలంలో పురుగుల్లేని కొన్ని మొక్కలను స్ప్రే చేయకుండా వదిలేయటం వలన మిత్రపురుగులు అక్కడ సురక్షితంగా ఉంటాయి.
అంతరపంటలపైన ముఖ్య పంటకు హాని చేయని పురుగులు ఉంటాయి, వాటిపైన అనేక రకాల మిత్రపురుగులు పెరుగుతాయి. కాబట్టి అంతరపంటలు వేసుకోగలిగితే మిత్రలాభంతో పాటు కొంత ఆదాయం కూడా వస్తుంది.
పొలం గట్లపై బంతి వంటి పూలమొక్కలను పెంచడం వలన, పొలంలో పిచికారి చేస్తున్నప్పుడు తల్లి బదనికలు, పరాన్నభుక్కులు వీటిపై ఆవాసం ఏర్పరచుకుంటాయి.
పొలంగట్లపైన గడ్డి చామంతి, అడవి బఠానీ తీగ వంటి పూల మొక్కలను పీకకుండా ఉండనిస్తే అనేక మిత్రపురుగులు, తేనెటీగలు వాటిని సందర్శించి మనకు కూడా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
శ్రీమతి బి. శైలజ జయశేఖరన్, డా. యు. శ్రీధర్, డా. వి. వెంకటేశ్వర్లు, శ్రీ డి.వి. శ్రావణ్ కుమార్,
కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజమండ్రి – 533105. ఫోన్: 0883-2448995
