వర్మీవాష్: రైతుల పాలిట జీవామృతం
ప్రస్తుత వ్యవసాయంలో పెరుగుతున్న సాగు ఖర్చులు, రసాయనిక ఎరువులు పురుగు మందులపై అధికంగా ఆధారపడటం, నేలలో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం, నేల జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి సమస్యలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, పంటల పెరుగుదలకు తోడ్పడే పర్యావరణహిత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్న రైతులకు ‘వర్మీవాష్’ (Vermiwash) ఒక అద్భుతమైన ద్రవ సేంద్రీయ ఎరువుగా, సంజీవనిలా ఉపయోగపడుతోంది. తక్కువ ఖర్చుతో, ఇంట్లోనే లేదా పొలం గట్టునే సులభంగా తయారుచేసుకోగలిగే ఈ సిసలైన ‘జీవామృతం’ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వానపాములు రైతుల మిత్రులుగా ప్రసిద్ధి చెందాయి. సేంద్రీయ వ్యవసాయంలో వానపాముల ద్వారా సేంద్రియ వ్యర్థాలను విలువైన ఎరువుగా మార్చే వర్మీకంపోస్టు తయారీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ప్రక్రియలో ప్రత్యేకంగా నిర్వహించిన వానపాముల బెడ్ల నుంచి సేకరించే ద్రవాన్ని వర్మీవాష్ అంటారు. వర్మీవాష్ అనేది వానపాముల ద్వారా తయారయ్యే అత్యంత ముఖ్యమైన ఉత్పత్తి.
వానపాముల శరీరం నుండి తయారయ్యే వర్మీవాష్లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, హార్మోన్లు, ఎంజైములు, సూక్ష్మజీవుల నిరోధక అంశాలు, పెరుగుదల నియంత్రణ అంశాలు (ఆక్సిన్ మరియు సైటోకైనిన్) అలాగే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది నేలసారాన్ని పెంచడానికి మరియు పంటలలో రోగాలు, పురుగుల బెడదను అణచివేయడానికి సహాయపడుతుంది. వానపాముల శరీర పైభాగంలోని రంధ్రాల నుండి వచ్చే కోలోమిక్ ద్రవం శిలీంద్ర నాశక, సూక్ష్మజీవ నాశక మరియు పురుగుమందుల లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రైతుల పంటలను రోగాలు మరియు కీటకాల నుండి దూరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

వానపాములు సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకొని జీర్ణక్రియ ద్వారా వాటిని సూక్ష్మ కణాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియలో వాటి విసర్జన పదార్థాలు, సూక్ష్మజీవుల కార్యకలాపాలు సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నానికి తోడ్పడతాయి. వానపాముల బెడ్లో తగిన తేమను నిర్వహిస్తూ నీరు నెమ్మదిగా ప్రవహించేలా చేసినప్పుడు, ఆ బెడ్లోని కొన్ని కరిగే పదార్థాలు నీటితో కలిసి బయటకు వస్తాయి. ఈ ద్రవాన్ని తగిన విధంగా సేకరించి వడపోసినప్పుడు వర్మీవాష్ లభిస్తుంది.
వర్మీవాష్ తయారీ విధానం
- సుమారు 100 లీటర్ల డ్రమ్ము/ బ్యారెల్ ను తీసుకొని, దాని క్రింది భాగంలో ఒక కుళాయిని (నల్లా) బిగించాలి.
- పెద్ద డ్రమ్ము లోపల 10 లీటర్ల బకెట్‌ను తలక్రిందులుగా చేసి ఉంచాలి.
- బిగించిన కుళాయి డ్రమ్ము మరియు బకెట్ రెండింటికీ సరిపోయేలా ఉండాలి.
- డ్రమ్ము క్రింది భాగంలో సుమారు 25 నుండి 30 సెంటీమీటర్ల వరకు రాతి గులకరాళ్లతో నింపాలి.
- ఈ పొరపై 25 సెంటీమీటర్ల మేర ఇసుకను పోయాలి.
- ఇసుక పొరపై మిగిలిన భాగంలో 60 శాతం వరకు పంట వ్యర్థాలను (పంట అవశేషాలు) నింపాలి.
- ఆ తర్వాత నీటిని పిచికారీ చేయాలి.
- ఈ పొరపై, 25 శాతం భాగంలో పశువుల పేడను నింపాలి.
- పేడ పైభాగంలో సుమారు 1 నుండి 5 కిలోల వరకు వానపాములను వదలాలి.
- ఈ పొరపై పంట వ్యర్థాలను నింపి ప్రతిరోజూ 1 నుండి 5 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
- డ్రమ్ము లోపల వానపాములు ఒత్తిడికి గురై కోలోమిక్ ద్రవాన్ని బయటకు విడుదల చేస్తాయి.
- పిచికారీ చేసిన నీరు ఈ ద్రవంతో పాటు వానపాము విసర్జక పదార్థం ద్వారా అన్ని పొరల గుండా ప్రవహించి క్రింది భాగంలో అమర్చిన బకెట్లో సేకరించబడి వర్మీవాష్గా కుళాయి ద్వారా బయటకు వస్తుంది.
- వర్మీవాష్ యూనిట్ ఏర్పాటు చేసిన 15 నుండి 20 రోజుల తర్వాత ప్రతిరోజూ 5 నుండి 10 లీటర్ల వర్మీవాష్‌ను పొందవచ్చు.

వర్మీవాష్లో ఉండే పోషకాలు, ఉపయోగకర పదార్థాలు : వర్మీవాష్లోని పోషకాల పరిమాణం తయారీ విధానం, సేంద్రియ పదార్థాల రకం, నీటి పరిమాణం, సేకరణ సమయంపై ఆధారపడి ఉంటుంది.
- ప్రధాన పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు కొంతమేర కరిగిన రూపంలో ఉండవచ్చు. అయితే వాటి సాంద్రత స్థిరంగా ఉండదు.
- ద్వితీయ పోషకాలు, సూక్ష్మపోషకాలు: కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటి మూలకాలు ముడి పదార్థాలపై ఆధారపడి ఉండవచ్చు.
- సేంద్రియ సమ్మేళనాలు: సేంద్రియ ఆమ్లాలు, కరిగే సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవుల జీవక్రియకు సంబంధించిన కొన్ని సమ్మేళనాలు ఉండవచ్చు.
- సూక్ష్మజీవులు: తయారీ, నిల్వ పరిస్థితులను బట్టి వివిధ సూక్ష్మజీవులు ఉండవచ్చు. అయితే అన్ని వర్మీవాష్ నమూనాల్లో ప్రయోజనకర సూక్ష్మజీవులు సమానంగా ఉంటాయని చెప్పలేం.
- మొక్కల పెరుగుదలకు సంబంధించిన సమ్మేళనాలు: కొన్ని వర్మీవాష్ నమూనాల్లో మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపగల జీవక్రియ సంబంధిత పదార్థాలు ఉంటాయి. వీటి ఉనికి, సాంద్రత, పంటపై ప్రభావం తయారీ విధానాన్ని బట్టి మారుతుంది.

వర్మీవాష్‌ను ఉపయోగించే విధానం
వర్మీవాష్కు అన్ని పంటలకు వర్తించే ఒకే ప్రామాణిక మోతాదు లేదు. తయారీ విధానం, ద్రవంలో పోషకాల సాంద్రత, పంట దశ, ఉపయోగించే విధానం ఆధారంగా మోతాదును నిర్ణయించాలి. సాధారణంగా 1:10 నిష్పత్తిలో నీటిని కలిపి పంట ఆకులపై పిచికారీ చేయాలి.
- పిచికారీకి: 1 లీటరు వర్మీవాష్‌ను 10 లీటర్ల నీటిలో కలిపి (1:10 నిష్పత్తిలో) పంట ఆకులపై పిచికారీ చేయాలి. ఇది అద్భుతమైన ఫోలియర్ స్ప్రే (Foliar spray) లా పనిచేస్తుంది.
- డ్రిప్ ద్వారా వర్మీవాష్ వాడాలనుకుంటే ఎకరానికి 10-15 లీటర్లు వాడాలి.
- వర్మీవాష్‌ను నీటితో కలిపి మొక్కల మొదళ్ళ చుట్టూ గల నేల బాగా తడిచేలా పోసుకోవాలి. దీనివలన నేల ద్వారా సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చు.
- ఒక ఎకరం పండ్ల తోటలో మొక్కల ఎదుగుదలకు 2-4 లీటర్ల వర్మీవాష్‌ను ఉపయోగించవచ్చు.
- ఆకు కూరల పంటల్లో, తొలి దశలో రెండు లీటర్ల నుంచి ప్రారంభించి తర్వాత కాలంలో మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు వర్మీవాష్‌ను పిచికారీ చేసుకోవచ్చు.
- పాదుల్లో ఇవ్వడానికి: నేరుగా నీటితో కలిపి మొక్కల పాదుల్లోకి కూడా వదలవచ్చు.
- ఉత్తమ ఫలితాల కోసం ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం మంచిది.
వర్మీవాష్ యొక్క ఉపయోగాలు
• వర్మీవాష్లో అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, హార్మోన్లు, ఆక్సిన్ మరియు సైటోకైనిన్లు ఉండి మొక్కల పెరుగుదలకు సహాయపడతాయి.
• ఇది కేవలం ఎరువు మాత్రమే కాదు, అద్భుతమైన వృద్ధి ఉత్ప్రేరకం (Growth Promoter).
• పంటలలో రోగ మరియు కీటక నిరోధక శక్తిని పెంచుతుంది.
• నేల యొక్క భౌతిక మరియు రసాయన గుణాలను అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది.
ముగింపు
వర్మీవాష్ సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించదగిన ఒక ద్రవరూప ఉప ఉత్పత్తి. సేంద్రియ వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం, వర్మీకంపోస్టు తయారీ ప్రక్రియకు అదనపు విలువ కల్పించడం, పంటల పోషక యాజమాన్యంలో అనుబంధ వనరుగా ఉపయోగించడం వంటి అంశాల్లో దీనికి ప్రాధాన్యం ఉంది.
అయితే వర్మీవాష్‌ను అన్ని పోషక లోపాలకు పరిష్కారంగా లేదా రసాయనిక ఎరువులకు సంపూర్ణ ప్రత్యామ్నాయంగా పరిగణించరాదు. దాని నాణ్యతను గుర్తించి, తగిన మోతాదులో, సరైన పద్ధతిలో వినియోగించాలి. నేల పరీక్ష, సేంద్రియ ఎరువుల సమతుల్య వినియోగం, పంట మార్పిడి, పంట అవశేషాల నిర్వహణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యంతో కలిపి వర్మీవాష్‌ను ఉపయోగించినప్పుడే స్థిరమైన వ్యవసాయానికి మెరుగైన తోడ్పాటు అందించవచ్చు. వర్మీవాష్‌ను నేల ఆరోగ్య పరిరక్షణకు, సమగ్ర సేంద్రీయ పోషక యాజమాన్యానికి తోడ్పడే అనుబంధ వనరుగా గుర్తించి శాస్త్రీయంగా వినియోగించాలి.
బి. చంద్ర శేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ (మృత్తికా శాస్త్రం) పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU), M. No. 8374278258



















