గార్బేజ్ ఎంజైమ్‌ను థాయ్‌లాండ్‌కి చెందిన డా. రోసుకాన్ ఆవిష్కరించారు.
తయారీవిధానం : కూరగాయలు, పండ్ల తొక్కలు, ముక్కలు, మార్కెట్లో చెత్త కుప్పలో వేసిన మిగలపండిన పండ్లు, కూరగాయల వ్యర్థాలకు కొంచెం నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ పంచదార కలిపి 90 రోజులు మురగబెడితే గార్బేజ్ ఎంజైమ్ తయారవుతుంది.
కావలసిన పదార్థాలు :
మూత బిగుతుగా పెట్టడానికి వీలుపడే గాజు లేదా ప్లాస్టిక్/ఫైబర్ డ్రమ్ము
కూరగాయలు, పండ్ల వ్యర్థాలు (తొక్కలు, మొక్కలు కుళ్ళినవి 3 పాళ్ళు)
నల్లబెల్లం లేదా మొలాసెస్ లేదా సేంద్రియ (బ్రౌన్) సుగర్ – 1 పాలు
నీరు Ð 10 పాళ్ళు
పైవాటినిన్నంటినీ బాగా కలపాలి. దుకాణాల్లో మిగిలిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు, పండ్లను ముక్కలు చేసి కలపవచ్చు. మిగిలిపోయిన అన్నం, కూరలు కూడా కలపవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి గాలిచొరబడకుండా గట్టిగా మూత బిగించాలి. ఎండ తగులకుండా సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచాలి. మొదటి 30 రోజుల పాటు, రోజుకోసారి మూత తీసి వాయువులు బయటికి వెళ్ళాక, మరలా గట్టిగా మూత బిగించాలి. ఆ తర్వాత 60 రోజుల పాటు మూత తీయనక్కర్లేదు. 90 రోజులకు గార్బేజ్ ఎంజైమ్ సిద్ధమవుతుంది. ద్రావణం పులియటం వల్ల తెల్లటి పొర ఏర్పడుతుంది. మొత్తం 90 రోజులు గడిచాక ద్రావణాన్ని వడపోసి నిల్వ చేసుకుని 60 రోజుల వరకు వాడుకోవచ్చు. వడపోతలో వచ్చిన వ్యర్థాలను ఎండబెట్టి మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. లేదా మళ్ళీ గార్బేజ్ ఎంజైమ్ తయారీకి వాడవచ్చు.
ప్రయోజనాలు : దీనిలో ఉన్న సూక్ష్మ జీవరాశులు, ఔషధ గుణాలు నేలను సారవంతం చేస్తాయి. ఇది సహజ ఎరువుగా, కీటకనాశినిగా, శిలీంద్ర, బాక్టీరియా, వైరస్ తెగుళ్ళ నివారణిగా పనిచేస్తుంది. దీనిని వాడితే పంటల్లో నత్రజనిని గ్రహించే శక్తి పెరుగుతుంది. దీనిని నీటిలో తగినపాళ్ళలో కలిపి వాడుకోవాలి.
ఎరువుగా : 1:1000 పాళ్ళలో కలిపి నేలలో పోయవచ్చు. లేదా పంటలపై పిచికారి చేయవచ్చు.
పురుగులు / తెగుళ్ళ నివారణకు : 1:100 పాళ్ళలో కలిపి పిచికారి చేయవచ్చు.
దిగుబడి పెంచడానికి : 1:500 పాళ్ళలో కలిపి పిచికారి చేయాలి.
ప్రతి తేనె పెంపకం పరిశ్రమలో కనీసం ఒకటి లేదా రెండు పట్టులు దూకుడుగా (Aggressive) ఉంటాయి. అనగా కుట్టే స్వభావం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తేనెటీగల పెంపకందారులకు ఈ లక్షణం ఉన్న పట్టులంటే ఇష్టము. ఎందుకనగా ఇలాంటి పట్టులు మంచి తేనెను సేకరించే లక్షణము, వ్యాధి నిరోధక శక్తిని లేక ఇతర విలువైన లక్షణాలను కలిగి ఉంటాయని భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ దూకుడుగా వ్యవహరించే పట్టులకు నెమ్మదిగా ఉండు రాణి ఈగలను రక్షించాలనే మనస్సాక్షి గల తేనెటీగల పెంపకం దారులు ఏ సంకోచం లేకుండా చేస్తారు. తేనెటీగల పట్టులలో దూకుడు గల లక్షణం అనేది వంశపారంపర్యమైన లక్షణం అని చెప్పడానికి ఏ సందేహము లేదు. అంతేకాకుండా పెద్ద పట్టులు ఎప్పుడూ దూకుడుగానే ఉంటాయి. ఎందువలన అనగా ఆ పట్టులో ఎక్కువ సంఖ్యలో తేనెటీగలుంటాయి కాబట్టి ఏది ఏమైనా బలమైన సులువుగా యాజమాన్యం చేయగల పట్టులు అలానే ఉండాలనేది తేనెటీగల పెంపకందారుల లక్ష్యం కూడాను.
సామన్యమైన, సూటిగా రాణి ఈగ ఎంపిక అనేది బాగా స్థిరపడిన విషయమే కాకుండా ఈ ప్రక్రియ ఆ ప్రాంతంలో తేనెటీగల స్వభావమును మార్చుతుంది. సంవత్సరాలుగా తేనెటీగలను నెమ్మదిగా ఉండే, వ్యాధి నిరోధకత కల్గి, తేనె ఉత్పత్తి ఎక్కువగా చేయగల తక్కువ ప్రపోలిస్ ను, ఎక్కువ పుప్పొడిని సేకరించు లక్షణాలు గల పట్టుల ఈగలను (Selection) ఎంపిక చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో గల పట్టులు ఖచ్చితంగా తేనెటీగల స్వభావము మీద ఆ ప్రాంత ప్రభావము ఉంటుంది. ఇంకా పొరుగువారి తేనె పట్టులకు చాలా దగ్గరగా పనిచేసినట్లయితే తరుచుగా ఆ ప్రాంతమంతటి మీద కలిగే ప్రభావముగా ఫలితం ఉంటుంది.
పోతుటీగలు వీటిన్నింటి మీద ఒక కారకము (Factor) ఎందువలన అనగా సగం జన్యు పదార్ధము పోతుటీగల వైపు నుండి వస్తుంది. పోతుటీగల లద్దె పురుగులను, కోశస్థ దశలను దూకుడుగా ఉన్న పట్టులలో నాశనం చేసినపుడు దూకుడు అనే లక్షణాన్ని మోసుకెళ్ళే పోతుటీగల జన్యువులు పట్టులో తగ్గిపోతాయి. ఇది ఒక ఎంపిక మాత్రమే అయినప్పుటికీ సమయం చాలా తీసుకునే (Time consuming) ప్రక్రియ. ఇంకొక ఎంపిక ఏమంటే పోతుటీగల కృత్రిమ మైనపు అట్టను పట్టుకు సరఫరా చేయడం లేదా మంచి పట్టుల నుండి పోతుటీగలున్న లద్దె పురుగుల ఫ్రేములను సరఫరా చేయవలెను.
బాగా కుట్టే స్వభావము గల పట్టులలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలు మనల్ని కుట్టకుండా రాణి ఈగను గుర్తించడం బహుశా అన్నిటికంటే కష్టమైన పని. తరచుగా ఇలాంటి పట్టులన్నింటిలో ఎక్కువ సంఖ్యలో కూలి ఈగలుంటాయి. రాణి ఈగను కనగొనడం చాలా కష్టము. కొన్నిసార్లు అసాధ్యముగా అనిపిస్తుంది. సాధారణంగా బాగా కుట్టే పట్టులకు ఎక్కువ మోతాదులో పొగ ఇచ్చి బాగా కుట్టే స్వభావము గల పట్టులను పరిశీలిస్తుంటాము. రాణి ఈగ పట్టును వదిలి తేనె పెట్టెలో ఏ భాగములోకైనా వెళుతుంది. బాగా పొగబారించినపుడు కూలి ఈగలు పట్టులోను మరియు పట్టుకు వెలపల గుంపులు గుంపులుగా ఏర్పడతాయి, ఒకవేళ రాణి ఈగ ఈ గుంపులలో ఉన్నట్లయితే రాణి ఈగను గుర్తించడం అసాధ్యము.
బాగా కుట్టే పట్టులలో రాణి ఈగను కనుగొనడానికి రెండు పద్దతులున్నాయి. రెండు పద్దతులలో కొంత ఎక్కువ సమయము మరియు కృషి అవసరమవుతుంది. ఈ రెండు పద్దతులను కూడా కూలి ఈగలు ఆహారం సేకరణకు వెళ్ళినపుడు, వెచ్చని వాతావరణములో (Warm days) చేయవలసి ఉంటుంది. పొలములో ఎక్కువ మోతాదు లో పుప్పొడి మరియు మకరందము లభ్యమయ్యేటప్పుడు మంచిది. ఎందుకంటే ఎక్కువ కూలి ఈగలు పొలానికి వెళతాయి కాబట్టి.
మొదటి పద్ధతిలో, మొదటిగా పట్టులో లద్దె పురుగులు, కోశస్థ దశలో ఉన్న (Brood nest) ఫ్రేములను గుర్తించి, పెట్టెతో సహా 50 నుండి 75 అడుగుల దూరం వరకు మోసుకెళ్ళి ఒక పొద చాటున లేక ఇతర అడ్డుగా ఉన్న (Obstrucion) నీడలేని ప్రదేశంలో ఉంచాలి. వయస్సు మళ్ళిన కూలి ఈగలు, పాలంకెళ్ళిన కూలి ఈగలు, కాపలా కాసే ఈగలతో సహా అన్ని తిరిగి వాటి పాత స్థానంలోకి ఎగరి వెళతాయి. కారణం వాటికి తెలిసిన వాటి పాత ఇల్లు అదే అని, దానిని కాపాడుకోవాలని అంతే తప్ప ఈ కొత్త స్థలం కాదు కాబట్టి. పైన చెప్పబడిన చిట్కా కూడ, కుట్టే ఈగల పట్టును తెరచి పరీక్షించునపుడు, మరియు ఇతరులకు చూపేటపుడు (Live demonstration) ఉపయోగపడుతుంది. పట్టును ఎత్తుకొని వేరే చోటుకి వెళ్ళడము ద్వారా ఎదురాడే కూలి ఈగలు ఎగిరి తిరిగి వాటి అసలు స్థానానికి వెళతాయి.
ఒకసారి లద్దె పురుగులున్న పెట్టె మరియు రాణి ఈగ, వేరు స్థానానికి మార్చినపుడు, తక్కువ పొగ అవసరముంటుంది. వెదకే విషయంలో మందుకు వెళ్ళవచ్చును. పొగ ఉపయోగించడం వల్ల తేనెటీగలకు రాణి ఈగతో సహా దిక్కు దిశ తెలియకుండా అవుతుంది. సాధారణ పరిస్థితులలో, నెమ్మదిగా ఉన్న పట్టులో రాణి ఈగ, లద్దెపురుగులున్న ప్రేములపై కనబడుతుంది. ఎక్కువ పొగ పట్టుకు ఇచ్చినపుడు రాణి ఈగ ఎక్కడైనా ఉండవచ్చును. రాణి ఈగను గుర్తించే రెండవ పద్ధతిలో (కుట్టే ఈగలు గల పట్టులలో) తేనె పట్టును విభజించి రాణి ఈగను వేరు పరుచు జల్లెడను ప్రతి భాగము (మీద పిల్లల గది మరియు తేనె గదిపై) పై ఉంచి పట్టు ద్వారమును మూసివేయవలెను. ఈ విధంగా చేయడం వల్ల మనకు రాణి ఈగ ఒక దానిలో ఖచ్చితంగా ఉoటుందని నమ్మవచ్చును. మూడు లేక నాలుగు రోజులు తర్వాత గుడ్లన్నీ రాణి ఈగ లేని భాగములో (Hive Part) పొదగబడతాయి. దేనిలో గుడ్లు ఉంటాయో దానిని (ఆ భాగమును) ఒక ప్రక్క ఉంచి అడుగు బల్ల మరియు పై మూతను పెట్టాలి. తిరిగి వయస్సు మళ్ళిన కూలి ఈగలు వాటి పాత స్థానమునకు తిరిగి వెళతాయి. అదే రోజున గాని, తరువాత రోజు గాని రాణి ఈగ కొరకు తక్కువ సంఖ్యలో ఉన్న కూలి ఈగలు పట్టులో తక్కువగా ఉన్నందువలన సులువుగా రాణి ఈగను కనగొనవచ్చును.
మన లక్ష్యం ఇక్కడ అసలు పట్టులో (Original) రాణి ఈగను తిరిగి ప్రవేశ పెట్టడం (Requeening). పట్టు తనంతట తానుగా రాణి ఈగను తయారు చేసుకోనివ్వకూడదు. అలా కొత్తగా వచ్చిన రాణి ఈగ తన తల్లి నుండి అనవసరమైన లక్షణాలు ఏమైన పొందుకొనవచ్చునని ఆలోచించాలి.
పట్టులో నూతనంగా తిరిగి రాణి ఈగను ఉత్పత్తి చేసుకోనవలయుననుకుంటే తగిన శ్రేష్టమైన మార్గము ఏమంటే ఒక వార్తా పత్రికను (News paper) పాత పట్టుపై ఉంచి పైభాగాన ఉంచే పిల్లల గదిని దానిపై పెట్టుకోవాలి. పై భాగమున ఉన్న పిల్లల గదిలో మంచి లక్షణాలు గల నూతనముగా సంపర్కము చెందిన రాణి ఈగ ఉండేటట్లుగా చూసుకొనవలెను. వార్తా పత్రికను కూలి ఈగలు నెమ్మదిగా నమిలి పట్టులు రెండు నెమ్మదిగా కలిసిపోతాయి. మీ సొంత తేనె పట్టుల సామర్థ్యమును త్వర త్వరగా పెంచుకోవాలనుకుంటే మీరే రాణి ఈగను ఉత్పత్తి చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ నెమ్మదిగా ఉండే ఫలవంతమైన తల్లియైన రాణి ఈగల ద్వారా చేసుకొనవచ్చును.
Smokers- పొగ డబ్బా అనేక సంవత్సరముల వరకు తేనెటీగల పెంపకముదారులు మండే ఎండిన చెక్కను (punk wood), గట్టిగా కట్టిన ఎండుగడ్డిని మరియు ఇతరమైన వాటిని తేనెపట్టులో పొగబారించుటకు వాడేవారు. ఈ పదార్దములు మండి పొగను ఉత్పత్తి చేయుట వలన అట్టలపై అడ్డముగా పొగబారించేవారు. ఇవి కొద్దిమొత్తములోనే పొగ ఉత్పత్తి చేసేవి. కోపముతోవున్న పట్టులను అదుపుచేయుటకు సరిపడునంతగా ఉండేది కాదు
మోజస్ క్విన్బి(Moses Quinby) 1875వ సంవత్సరములో మొట్టమొదటి ఆచరణాత్మకమైన పొగడబ్బాని, ఈ పొగడబ్బాలో మంట మండించే స్తలము (fire pot) మరియు గాలితిత్తులు (bellows), ఒక విధముగా ఆధునిక తేనెటీగల పెంపకము చేపట్టిన తరువాత ఆలస్యముగా కనుగొనబడిన పొగడబ్బానుండి, పొగను గురిపెట్టి అవసరమైనచోటకు పడేలా గొట్టం ద్వారా పొగడబ్బా చివర కొనకు అమర్చబడివుంటుంది.
మండుచున్న పొగడబ్బాల వలన, చుట్టు ప్రక్కల వున్నకట్టెలు, గడ్డి అంటుకొని అనవసరమైన కార్చిచు ప్రారంభమవుతుంది. ఇది పొగడబ్బాలోని నిప్పు సులువుగా అంటుకొనే పదార్ధము లేక వేడినిప్పురవ్వలు పొగ మూతి నుండి వెలువడడము ద్వారా జరుగుతుంది. తేనెటీగల పెంపకముదారులు పొగడబ్బాను మండించిన తరువాత గుప్పెడు పచ్చగడ్డిని మంటపై భాగమున వుంచుతారు. ఎందుకనగా వేడి పొగను చల్లబరచి, మంటనుండి వెలువడు నిప్పురవ్వలను పొగడబ్బా మూతి నుండి (nozzle) వెలువడకుండా ఆపుతుంది. తేనెపట్టులున్న ప్రాంతములో కొన్నిసార్లు వాడిన పొగడబ్బాలో వున్న మంటను ఆర్పకుండా, బయట పడవేయడము వలన మంటల వ్యాప్తికి కారణమవుతంది.
Smoking Honey bee colonies- తేనెపట్టు దూకుడుగాను మరియు పట్టులోని ఈగలు దాడిచేయుటకు ముందుగా నెమ్మదిగా వుంచుటకు పొగబారించుట ముఖ్యము. ఒక్కసారి కాపలాకాయు ఈగలు ప్రమాదమును పసిగట్టి నట్లయితే, హెచ్చరిక వాసనను (alarm odour) బయటకు పంపిస్తాయి. అలాంటి పరిస్థితిలో తరచుగా ఆ పట్టు మరియు చుట్టు ప్రక్కల వున్నపట్టులను నియంత్రించుట కష్టము.
తేనెపట్టులున్న ప్రాంతములోనికి ప్రవేశించుటకు ముందుగానే, పొగడబ్బాను వెలిగించుకొని సరైన స్థితిలో ప్రవేశించవలెను. పని ప్రారంభించుటకు ముందుగానే పట్టులన్నింటికి పొగనివ్వనవసరము లేదు. ఎందువలననగా ఎవైనా కంపనములు (vibrations) మొదటి పట్టునుండి వెలుపడినట్లయితే అవి ఇతర పట్టులను రేపుతాయి. అయినప్పటికిని పట్టులన్నింటికి స్టాండువద్ద పొగ బారించవలెను.
మొదటి పట్టును తెరచునపుడు పొగబారించునపుడు, గుర్తుపెట్టుకొనవలసినదేమనగా అన్ని పట్టులు ద్వారములవద్ద కాపలాకాయు కూలిఈగలుంటాయి. మకరందము లభించనప్పుడు పట్టుద్వారము వద్ద ఎక్కువ సంఖ్యలో కాపలాకాయు ఈగలుంటాయి మరియు కొద్ది సంఖ్యలో బాగా తేనె లభించు కాలములో కాపలా కాయు ఈగలుంటాయి. ఒక అడుగు దూరమునుండి రెండు లేక మూడుసార్లు పట్టుద్వారము వద్ద పొగను పారించిన యెడల, కాపలాకాయు ఈగలను నిరాయుధులుగా (disarm) చేస్తుంది. ఒకవేళ ఒకటికన్నా ఎక్కువ ద్వారములున్నట్లయితే అన్ని ద్వారముల ముందు ఇలాగే పొగబారించవలెను. తరువాత పై మూతను తీసి పట్టుకొని, అలాగే పొగనివ్వవలెను. లోపలిమూతను వాడినపుడు కూడ ఇలానే పొగనివ్వవలెను
తరువాత సూపర్ గదిలోవున్న ఏ ఫ్రేమును తీయవలెనని చూడవలెను. చాల సుళువుగా తీయగల్గిన ఫ్రేము, మొదటి ఫ్రేము. ఈ ఫ్రేముమీదనే అతితక్కువ తేనెటీగలుంటాయి మరియు వికృతరూపము (burr) గల్గిన మైనపు అట్టలుంటాయి. ఈ విధముగా ఏ ఈగలు కూడా నలిగిపోకుండా, ఇతర ఫ్రేములపై వున్న తేనెటీగలకు కోపము రాకుండా చేయడము సులువు. సాధారణముగా ప్రక్కనున్న ఫ్రేమును మొదటిగా తీస్తారు. మొదటి ఫ్రేముల చివరలకు పొగబారించవలెను, ఈ విధముగా దారిలో ఈగలు లేకుండావుండి, చేతి వ్రేళ్ళతో గట్టిగా పట్టుకొనవచ్చును.
మొదటి ఫ్రేమును తీసినపుడు, పట్టుపరిశీలన మధ్యలోవున్నపుడు, అవసరమైనయెడల మరలా ఒకసారి పొగనివ్వవచ్చును. ఫ్రేముల మధ్యలో తేనెటీగలు అలవాటు పడియుండుటను చూడవచ్చును. ఎప్పుడైతే అయిదు నుండి పదిహేను ఈగలు రెండు ఫ్రేముల మధ్యవాటి తలలుంచి చూచుచున్నపుడు, పొగ ఇవ్వవలసిన సమయము అదే అని భావించవలెను. రెండు, మూడు పఫ్ ల పొగను ఫ్రేములపై అడ్డముగా బారించినపుడు నెమ్మదిగా తేనెటీగలన్నియు వెనుకకు వెళ్ళతాయి. రెండు ఫ్రేముల మధ్య తొంగి చూచుచున్న ఈగలు పొగ బారించినను వెళ్ళకపోయినట్లయితే, నెమ్మదిగా వుండకపోతే అవి ఎగిరి కుట్టవచ్చును. పట్టులోని ఈగలు ఒక్కొక్కటి రేపబడి, అన్ని ఈగలు కూడా ఈ విధముగా సహకరించి పనులు చేసుకుంటాయి.
Fuel for smokers – పొగడబ్బాలో వాడు ఇంధనము పొగడబ్బాలో వాడవలసిన శ్రేష్ఠమైన ఇంధనము ఏది అనునది తేనెటీగల పెంపకదారుల మధ్య జరిగే తీవ్ర చర్చయైయున్నది. పొగ ఎందుకు తేనెటీగలను నెమ్మది పరుస్తుంది అను విషయమైన దానిలో తక్కువ పరిశోధన జరిగినది. ఆధునిక ఆలోచన ఏమనగా పట్టును తెరవగానే కూలిఈగలు హెచ్చరిక ఫిరమోనును స్పర్శకముల మీదవున్న స్పర్శగ్రాహకములు గ్రహించకపోవుట వలన అని. ఇది నిజమైనట్లయితే, ఏ ఇంధనమైనను ఎక్కువ పరిమాణములో పొగను ఉత్పత్తి చేయునదైతే తేనెటీగలను నెమ్మది పరుస్తుంది. పొగడబ్బాలో వాడు ఇంధనము విషయమైన ముఖ్య సమస్య ఏమనగా ఎక్కువ సేపు మండకపోవుట, అనగా త్వరగా కాలిపోవుట మరియు పొగడబ్బాను నిరంతరముగా మండునట్లుగా రీచార్జి (recharge) చేయుట. తేనెటీగల పెంపకదారులు ఆకులను, గడ్డిని, గోనెసంచి గుడ్డలు లేక ఇతర పాతగుడ్డలు, అరిగిపోయిన త్రాళ్ళు, చెక్కపొట్టు, చెక్కముక్కలు ఒక అంగుళము సైజుగలవి (బ్లాక్స్ రూపములో తయారుచేసి) వాడుదురు. ఇవి ఎక్కువ సమయము మండుతాయి మరియు కొంతమంది తేనెటీగల పెంపకము దారులు వాడుచున్నారు.
డా. కె. మోహన్ రావు, ప్రధాన శాస్త్రవేత్త (కీటక విభాగము) మరియు అధిపతి అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి- 534475, ఏలూరు జిల్లా. Phone: 9493304643
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.
వర్మి వాష్ తయారీ విధానం: 200 లీ. డ్రమ్ముని తీసుకుని, దాని అడుగు భాగం నుండి కొంచెం పైన కుళాయి బిగించాలి. డ్రమ్ములోపల 15 సెం.మీ. వరకు ఇసుకపోసి, ఇసుకపై డ్రమ్ముపై వరకు ఎర్రమట్టి పోయాలి. దానిపైన పేడ, కూరగాయల వ్యర్థాలను వేసి వానపాములను వదలాలి. ప్రతిరోజూ డ్రమ్ములో 2 లీ. నీటిని పోస్తూ ఉండాలి. ఇలా 15 రోజులు చేసిన తర్వాత డ్రమ్ములోని నీటిని కుళాయి ద్వారా పాత్రలో సేకరించి 15 రోజుల కొకసారి మొక్కలపై పిచికారి చేయాలి. డ్రిప్ ద్వారా వారానికొకసారి పంపించాలి. దీనివలన మొక్కలు ఆరోగ్యవంతంగా పురుగులు, తెగుళ్ళు సోకకుండా పెరుగుతాయి.
మామిడి చెట్టుకు కాయల్ని వుండనీయవు, కూరగాయల్ని దక్కనీయవు. మొక్కజొన్న కంకుల్ని మిగలనీయవు. నాటిన వరి నారు మొక్కల్ని పీకి వేస్తున్నాయి. ఎండబెట్టిన వడియాలు, అప్పడాలకు రక్షణ లేదు. గుళ్లో భగవంతుని స్మరించుకోనివ్వవు. మందలుగా ఇళ్ళలోకి చొరబడి ఖంగాళీ చేస్తున్నాయి. వెంటబడి రక్కుతాయి. ఉరికించి ఉరికించి ప్రాణాలు తీస్తున్నాయి. రేబీసు లాంటి రోగాల్ని అంటించి చంపుతున్నాయి. అడవుల్లో, తోటల్లో నాటిన మొక్కల్ని బ్రతకనీయవు. ఉయ్యాలలో ఉన్న పసిపాపల్ని ఎత్తుకు పోయి చెట్ల మీద కూర్చున్న కోతుల సంఘటల్ని కూడా మనం చూశాము. కొన్ని సంవత్సరాల క్రితం ఒక జిల్లా ప్రభుత్వ కార్యాలయం పైన వాటర్ ట్యాంక్‌లో 23 కోతులు ప్రవేశించి బైటకు రాలేక నీళ్ళలో మునిగి చనిపోయిన విషయం తెలియక అదే నీటిని కొన్ని రోజుల పాటు త్రాగిన ఉద్యోగులు చెందిన భయాందోళనల సంగతి మనలో చాలామందికి గుర్తు వుండే ఉంటుంది. ఇలా కోతుల వల్ల మన రైతులు, పంటలు, ఆస్తులు, ప్రాణాలకు జరుగుచున్న ముప్పు సమస్య నానాటికీ తీవ్రమౌతూ వుంది. అడవుల్లో వాటి సహజ ఆవాసాలు, ఆహారాల లభ్యత క్షీణించుట వల్ల మరియు అదుపులేని సంతానోత్పత్తి వల్ల మనుగడ కోసం అవి పంట పొలాలు, జనావాసాలలోకి చొరబడి అనేక విధాలుగా మనకు ఇబ్బందుల్ని, నష్టాలను కలిగిస్తున్నాయి. మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు, మానవతా దృష్టి, జంతు హింసా నివారణా చట్టాల వల్ల, వాటిపై ప్రత్యక్ష పోరాటం చేయలేని పరిస్థితి మన భారతీయులది!
కోతుల వల్ల నానాటికీ మన ఆస్తులకు, ప్రాణాలకు జరుగుచున్న నష్టాల నివారణకు మనతోపాటు మన ప్రభుత్వాలు కూడా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. అయినా ఈ క్రింద పేర్కొన్న మార్గాలతో కొంతవరకు ఈ సమస్యలకు దూరం కావచ్చు. వీటి గురించి చర్చిద్దాము.
మనదేశీ కోతుల జీవన కాలం 16 నుండి 20 సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు యుక్తవయస్సుకు వచ్ౘ్ే కోతుల చూడి కాలం 165 నుండి 175 రోజులు. ఋతుచక్రం 28 నుండి 30 రోజులు.
కోతులు కారం, వెల్లుల్లి, వెనిగార్, మిరియాల వంటి ఘాటైన వాసనల్ని భరించలేక దూరంగా తరలి పోతాయి. నిమ్మ చెట్ల ముళ్ళు, నిమ్మకాయల వాసనలకు దూరంగా వైదొలగుతాయి. గర్ౙనలు, ప్రేలుళ్లు, టపాకాయల శబ్దాలకు బెదిరి పారిపోతాయి. చింపాజీలు, కొండముచ్చులు, ఇతర వన్య మృగాలంటే కోతులు భయపడ్తాయి.
కేంద్ర ప్రభుత్వం వారి టోల్ ఫ్రీ నెంబరు 1091 కి ఫోను చేసి కోతుల నుండి ఎదుర్కొంటున్న ముప్పుపై ఫిర్యాదు చేసి ప్రభుత్వం వారి నుండి సహాయం, రక్షణ పొందే అవకాశం ఉంది.
పంటలు, తోటల చుట్టూ స్వల్ప స్థాయిలో షాకునిచ్చే విద్యుత్ కంచెల్ని ఏర్పాటు చేసుకోవచ్చును.. ఖరీదైన పంటలు, పూల మొక్కలు, నర్సరీలను పటిష్టమైన గ్రీన్‌హౌస్‌లలో ఏర్పాటు చేసుకుంటే మంచిది.
చెట్ల మొదళ్లు, గోడల మీద, ప్రవేశ ద్వారాలు, గుమ్మాలు, ఆస్తుల అంచుల మీద కారం, వెల్లుల్లి వంటి పొడులు లేదా స్ప్రేలను చల్లాలి. గోడల మీద ముళ్ల తీగల్ని, గాజు పెంకుల్ని అతికించుకోవాలి.
ఒక కోతిని పట్టుకుని, వాటి శరీరమంతా ఎర్రటి రంగును పూస్తే ఇదేదో కొత్త జంతువని భయంతో మిగిలిన కోతులు దూరంగా పారిపోయే అవకాశం ఉంది. కొండముచ్చును పెంచినా, అది కోతుల్ని దూరంగా తరిమివేయగలదు. అయితే కొండముచ్చుల వల్ల ఇతర సమస్యలు కూడా ఎదురయ్యే ముప్పు ఉండవచ్చు.
ప్రత్యక్షంగా టపాకాయల్ని పేల్ౘ్డం లేదా టపాకాయల శబ్దాలు, భయంకరమైన శబ్ధాలను ఇచ్చే టేప్‌రికార్డుల్ని ముఖ్యమైన ప్రదేశాలలో అమర్చటం వల్ల కూడా కొంత ప్రయోజనం ఉంటుంది.
కాపలాదారులు ఎలుగుబంటి లేదా పులి వేషాలతో తోటలలో సంచరిస్తూ కూడా కోతుల్ని బెదిరిస్తూ దూరంగా తరిమివేయవచ్చు.
మామిడి, మునగ, జామ, కొబ్బరి వంటి చెట్ల ప్రధాన కాండాల మొదళ్ళ చుట్టూ గొడుగు ఆకారం రేకును ఇనుప సూదుల వైర్లను అమర్ౘ్ి కోతులు చెట్ల మీదకు ఎక్కకుండా చూడవచ్చు.
కోతుల సంతాన నియంత్రణః కోతుల్ని సంహరించలేము. కనీసం హింసించడం కూడా చేయలేము. అయితే వేగంగా పెరిగిపోతున్న వాటి సంతతిని నియంత్రించవచ్చు. శస్త్రచికిత్స ద్వారా కోతుల జనన నియంత్రణ అమలు చేయటం అంత సులువుకాదు. “కోతిపుండు బ్రహ్మరాక్షసి” అనే నానుడి వుండనే వుంది. శస్త్రచికిత్స గాయం ఎంత చిన్నదైనా దానిని కెలికి బ్రహ్మపుండుగా చేసుకొని భయానకం కలిగించడం శ్రేయస్కరం కాదు. ఇది కూడా తీవ్రమైన హింసతో కూడుకొన్నది.
అయితే రెండేళ్ల వయస్సు దాటిన ఆడకోతుల్ని పట్టుకుని అతి స్వల్ప గాయంతో దీర్ఘకాలం పనిచేసే హార్మోను సాధనాన్ని (ఇన్‌ప్లాంటు) చర్మం క్రింద అమర్చితే 5-6 సంవత్సరాల వరకు అవి గర్భం దాల్ౘ్కుండా చేసే అవకాశం ఉంది. మహిళల్లో గర్భ నియంత్రణకు అమలు చేసే ఈ విధానాన్ని ఆడ కోతులలో అమలు చేయడానికి మన పశువైద్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేపట్టవలసిన అవసరం వుంది. ఇందుకు వినియోగించే ఒక్కొక్క హార్మోను సాధనం (ఇన్‌ప్లాంటు) ఖరీదు 500Ð600 రూపాయలు ఉండవచ్చు. ఈ విషయమై మన పశువైద్య పరిశోధనా కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు, ప్రజారోగ్య శాఖవారు, అటవీశాఖవారు, జంతు ప్రేమికులు, స్థానిక సంస్థలు సమన్వయంతో కార్యాచరణను చేపట్టాలి. ఈ పథకంలో అవినీతికి, అక్రమాలకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
అడవులలోపల పండ్లను ఇచ్చే మామిడి, మారేడు, నేరేడు, వెలగ, మర్రి రావి వంటి మొక్కల్ని పెంచి కోతులకు త్రాగునీటి వనరుల్ని కూడా అక్కడే అందుబాటులో ఉంచగల్గితే కోతులు జనావాసాలకు, పంటల మీదకు వచ్చే అవకాశాలు వుండవు. కోతులలో పునరుత్పాదక శక్తిని తగ్గించే ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కలిగిన మొక్కల్ని ఆయుర్వేద నిపుణుల సూచనలతో పెంచే ఆలోచన చేయుట కూడా మంచిదే!
అయినా ఈ సూచనపై శాస్త్రీయ పరిశోధనలు, అధ్యయనాలను చేపట్టవలసిన అవసరం ఉంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహ సహకారాలు కూడా చాలా అవసరం.
పంట భూముల్ని, ఉద్యాన వన పైర్లు, పెరటి తోటల్ని ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్న కోతుల బెడదపై మన ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.
ఆయిల్‌పామ్ పంటలో ఆశించిన స్థాయిలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించాలంటే సరైన పోషకాలు, నీటి యాజమాన్యంతో పాటు ఆకుల యాజమాన్యం (Frond Management) అత్యంత కీలకమైనది. తోటలోని చెట్లకు ఉండే ఆకుల సంఖ్య, వాటిని కత్తిరించే విధానం మరియు కత్తిరించిన ఆకులను సర్దే పద్ధతులపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ఆయిల్‌పామ్ రైతులకు ఉపయోగపడే పూర్తి స్థాయి ఆకుల యాజమాన్య పద్ధతులు మరియు అనుసరించే విధానం
చెట్టుకు ఉండవలసిన ఆకుల సంఖ్య (Optimum Leaf Count) ఆయిల్‌పామ్ చెట్టు సూర్యరశ్మిని గ్రహించి పిండిపదార్థాలను తయారుచేసుకోవడానికి ఆకులు ఎంతో అవసరం. అవసరానికి మించి ఆకులను కత్తిరించడం (Over-pruning) వల్ల దిగుబడి క్రమంగా తగ్గుతుంది. • చిన్న వయసు తోటలు (1-3 సంవత్సరాలు): చెట్టుకు ఉన్న అన్ని పచ్చని ఆకులను అలాగే ఉంచాలి. కేవలం ఎండిపోయిన ఆకులను మాత్రమే తీసివేయాలి. • దిగుబడినిచ్చే తోటలు (4-10 సంవత్సరాలు): ప్రతి చెట్టుకు కనీసం 40 నుండి 48 పచ్చని ఆకులు ఉండేలా చూసుకోవాలి. అంటే గెల కింద కనీసం రెండు వరసల ఆకులు ఉంచాలి. • పెద్ద వయసు తోటలు (10 సంవత్సరాలు పైబడినవి): ప్రతి చెట్టుకు కనీసం 32 నుండి 40 ఆకులు ఉండాలి. గెల కింద ఒక వరస ఆకును తప్పనిసరిగా ఉంచాలి.
ఆకులను కత్తిరించే సరైన పద్ధతి (Pruning Technique) ఆయిల్‌పామ్ తోటల్లో ఆకుల యాజమాన్యానికి సంబంధించి అంతర్జాతీయంగా మరియు శాస్త్రవేత్తలచే సిఫార్సు చేయబడిన ఒక అద్భుతమైన సూత్రం “9-3 క్లాక్ రూల్” (9-3 Clock Rule). సాధారణంగా రైతులు ఏ ఆకులను ఉంచాలి, వేటిని కత్తిరించాలి అనే విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్లాక్ రూల్ (గడియార నియమం) ద్వారా ఆకుల కత్తిరింపు చాలా సులువుగా నిర్వహించవచ్చు.
గడియార నియమం (9-3 Clock Rule) అంటే ఏమిటి? మనం గడియారాన్ని చూసినప్పుడు 9 గంటల ముల్లు ఎడమవైపు సమాంతరంగా, 3 గంటల ముల్లు కుడివైపు సమాంతరంగా ఉంటాయి. ఆయిల్‌పామ్ చెట్టును కూడా ఒక పెద్ద గడియారంగా ఊహించుకుంటే, చెట్టు మధ్య భాగం నుండి సమాంతరంగా ఇరువైపులా విస్తరించి ఉండే ఆకులను ఈ సమయాలతో పోలుస్తారు. • నియమం యొక్క ముఖ్య ఉద్దేశం: చెట్టు కాండం నుండి భూమికి సమాంతరంగా (Horizontal) ఇరువైపులా ఉండే ఆకుల కంటే క్రింది భాగంలో ఉన్న ఆకులను మాత్రమే కత్తిరించాలి. • 9 మరియు 3 గంటల స్థానం: గడియారంలో 9 నుండి 3 గంటల రేఖకు పైభాగంలో ఉండే ఆకులను ఎట్టిపరిస్థితుల్లోనూ కత్తిరించకూడదు.
ఈ నియమాన్ని ఎలా పాటించాలి?
సమాంతర రేఖను గుర్తించడం: చెట్టు వద్ద నిలబడి, కంటిచూపు మేర సమాంతరంగా (horizontal) ఉండే ఆకులను (9 మరియు 3 గంటల స్థానాలు) గుర్తించండి.
గెలల కింద ఆకులు: సాధారణంగా ఆయిల్‌పామ్ చెట్టులో గెలలు ఈ సమాంతర రేఖకు పైభాగంలో లేదా రేఖకు సరిగ్గా ఆనుకుని ఉంటాయి.
కత్తిరింపు పరిమితి: కేవలం 9 గంటల మార్కు మరియు 3 గంటల మార్కు కంటే క్రిందికి వేలాడుతున్న, లేదా ఎండిపోయిన ఆకులను మాత్రమే నరకాలి.
రెండు వరుసల సూత్రం: గెల బరువును మోయడానికి మరియు దానికి సరైన పోషకాలు అందడానికి, గెల ఉన్న మట్ట కింద కనీసం 1 నుండి 2 వరుసల పచ్చని ఆకులు (సమాంతర రేఖ పరిధిలో ఉన్నవి) ఖచ్చితంగా మిగిలి ఉండాలి.
9-3 క్లాక్ రూల్ పాటించడం వల్ల కలిగే లాభాలు • అధిక దిగుబడి (High Yield): చెట్టుకు కావలసినన్ని పచ్చని ఆకులు (సుమారు 40-48) లభించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి, గెలలు పెద్ద పరిమాణంలో ఊరుతాయి. • ఆడ పూల సంఖ్య పెరుగుదల: అవసరానికి మించి ఆకులు కత్తిరిస్తే (Over-pruning) చెట్టు ఒత్తిడికి లోనై మగ పూలు ఎక్కువగా వస్తాయి. ఈ రూల్ పాటించడం వల్ల ఆడ పూల సంఖ్య పెరిగి దిగుబడి స్థిరంగా ఉంటుంది. • గెలల రక్షణ: గెలల కింద ఉండే ఆకులు గెలలకు ఒక సపోర్టులా పనిచేస్తాయి. గెలలు కిందపడిపోకుండా లేదా కాండం నుండి విడిపోకుండా ఇవి కాపాడతాయి. • సులువైన కోత: ఏ ఆకులను ఉంచాలో కార్మికులకు సులభంగా అర్థమవుతుంది. దీనివల్ల తోట పని వేగంగా జరుగుతుంది.
గెలలు కోసే సమయంలో మరియు ఆకులను కత్తిరించేటప్పుడు (Pruning) కొన్ని జాగ్రత్తలు పాటించాలి: • మట్టను దగ్గరగా నరకడం: ఆకులను కత్తిరించేటప్పుడు కాండానికి వీలైనంత దగ్గరగా, నిలువుగా కాకుండా వాలుగా కత్తిరించాలి. • పంగలు మిగల్చకూడదు: కాండంపై ఎక్కువ పొడవు మట్టలను (Frond butts) వదిలేయకూడదు. అలా వదిలేస్తే, ఆ పంగలలో వర్షపు నీరు చేరి కుళ్లిపోవడం లేదా ఎలుకలు, పురుగులు ఆశ్రయం పొందడం జరుగుతుంది. • వ్యాధి సోకిన ఆకులు: పొడి తెగులు (Leaf blight) లేదా ఇతర వ్యాధులు సోకి పూర్తిగా ఎండిపోయిన ఆకులను వెంటనే తొలగించి తోట బయట పడేయాలి.
కత్తిరించిన మట్టల పునరుద్ధరణ / సర్దడం కత్తిరించిన ఆయిల్‌పామ్ మట్టలను తోటలోనే సరైన పద్ధతిలో అమర్చడం ద్వారా భూమికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఫ్రాండ్ స్టాకింగ్ అంటారు. • ఎల్-షేప్ (L-Shape) లేదా యూ-షేప్ (U-Shape) పద్ధతి: రెండు చెట్ల మధ్య వరుసలలో లేదా చెట్ల చుట్టూ పాదులకు ఇబ్బంది లేకుండా మట్టలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి. • మల్చింగ్ (మట్టి తేమ సంరక్షణ): ఈ మట్టలను చెట్ల మధ్య వరుసల్లో వేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిపై పడక తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. • సేంద్రీయ ఎరువుగా మార్పిడి: కాలక్రమేణా ఈ ఆకులు కుళ్లిపోయి భూమికి అవసరమైన హ్యూమస్ (సేంద్రీయ కర్బనం) మరియు పొటాషియం వంటి పోషకాలను అందిస్తాయి. దీనివల్ల ఎరువుల ఖర్చు తగ్గుతుంది. • కలుపు నివారణ: మట్టలు పరిచిన చోట కలుపు మొక్కలు మొలకెత్తవు.
ముఖ్యమైన సూచనలు:
వేసవి కాలంలో ఆకులను ఎక్కువగా కత్తిరించకూడదు. ఇది చెట్టుపై ఒత్తిడిని పెంచుతుంది.
మట్టలు కత్తిరించడానికి ఉపయోగించే కత్తులు లేదా చిక్కం (Chisel/Sickle) బాగా పదునుగా ఉండాలి, తద్వారా కాండం దెబ్బతినకుండా ఉంటుంది.
మట్టలను ఎట్టిపరిస్థితుల్లోనూ తోటలో పెట్టి తగులబెట్టకూడదు. దీనివల్ల మిత్రపురుగులు చనిపోవడమే కాకుండా చెట్లకు నష్టం జరుగుతుంది.
రైతులకు గమనిక: గెలలు కోయడం సులువుగా ఉంటుందని చాలామంది రైతులు ఆకులను ఎక్కువగా కత్తిరిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఆకులు తగ్గితే చెట్టు తక్కువ ఆహారాన్ని తయారుచేసుకుని, మగ పూత ఎక్కువగా వచ్చి గెలల సంఖ్య తగ్గిపోతుంది.
డా. పి. నీలిమ, డా. డి. స్రవంతి, డా. బి. దీపక్ రెడ్డి, డా. ఎన్. జమీమా, డా. ఆర్. రమేష్, డా. ఐ. కృష్ణ తేజ, డా. ఐ. వి. శ్రీనివాస రెడ్డి మరియు డా. జె. హేమంత కుమార్, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, భ. కొత్తగూడెం జిల్లా- 507 301
వర్షాకాలం వచ్చింది. భారతదేశంలో పశుపోషణ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది, అయితే తొలకరిజల్లులు కురుస్తూ మనసుకు ఆహ్లాదకరంగా అనిపించే ఈ వర్షాకాలం వేసవి వేడిని తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ, అధిక తేమ, బురద, నీటి నిల్వలు వంటి పరిస్థితులు పశువుల ఆరోగ్యానికి సవాళ్లను సృష్టిస్తాయి. ఈ పరిస్థితులు వ్యాధికారక సూక్ష్మజీవులు, పరాన్నజీవులు మరియు వ్యాధి వ్యాప్తి చేసే కీటకాలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆశ్రయం, పోషణ మరియు ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పశువుల షెడ్ మరియు నివాస నిర్వహణ: వర్షాకాలంలో పశువుల ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడుకోవడానికి శాస్త్రీయమైన షెడ్ మరియు నివాస నిర్వహణ అత్యంత కీలకం.
వర్షాకాలంలో పశువుల షెడ్ చుట్టూ డ్రైనేజీ కాలువలను శుభ్రంగా ఉంచి నీరు నిల్వ ఉండకుండా చూడాలి, ఎందుకంటే నిల్వ నీటిలో దోమలు, ఈగలు పెరిగి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. షెడ్ నేలను పొడిగా ఉంచడం చాలా ముఖ్యం; బురదగా లేదా తడిగా ఉన్న నేల వల్ల ఫుట్ రాట్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల పొడి గడ్డి, వరి పొట్టు లేదా సా డస్ట్ పరచి వాటిని తరచూ మార్చాలి. నేలపై సున్నం (లైమ్ పౌడర్) చల్లడం ద్వారా తేమ తగ్గడమే కాకుండా క్రిముల సంఖ్య కూడా తగ్గుతుంది. వర్షాలు ప్రారంభమయ్యే ముందు పైకప్పు లీకేజీలను సరిచేసి షెడ్‌లోకి నీరు రాకుండా జాగ్రత్తపడాలి, ఎందుకంటే తడి వాతావరణం ముఖ్యంగా పిల్ల దూడలు, గొర్రె పిల్లలు మరియు మేక పిల్లల్లో న్యుమోనియా వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే షెడ్‌లో తగినంత గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి; పూర్తిగా మూసివేయకుండా ఉండటం వల్ల మూత్రం నుంచి విడుదలయ్యే అమోనియా వాయువు పేరుకుపోకుండా ఉండి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
మేత మరియు పోషకాహార నిర్వహణ: మేత మరియు పోషకాహార నిర్వహణ విషయానికి వస్తే, వర్షాకాలంలో లభించే లేత పచ్చి మేతను పశువులకు ఒక్కసారిగా కాకుండా క్రమంగా పరిచయం చేయాలి. పచ్చి గడ్డిలో నీటి శాతం, సులభంగా పులిసే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పశువుల్లో ‘బ్లోట్’ (కడుపుబ్బరం) మరియు తీవ్రమైన విరేచనాలు (Diarrhea) వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిని పొడి గడ్డి (Hay/Straw) తో కలిపి సమతుల్యంగా అందించాలి. ముఖ్యంగా, చిన్న వయస్సు లేదా తక్కువ ఎత్తు ఉన్న జొన్న (Sorghum) మొక్కల్లో ‘హైడ్రోసయానిక్ యాసిడ్’ (HCN / Prussic acid) అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు కనీసం 3–4 అడుగుల ఎత్తు వచ్చే వరకు వాటిని మేపకూడదు. అధిక తేమ కారణంగా పశుగ్రాసం, పిండి పదార్థాలు త్వరగా బూజు పడతాయి. ఇటువంటి బూజు పట్టిన ఆహారం ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశించే మైకోటాక్సిన్లు ‘అఫ్లాటాక్సికోసిస్’ (Aflatoxicosis) అనే కాలేయ సంబంధిత విష ప్రభావానికి దారితీస్తాయి, కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. వర్షాల వల్ల నేలలోని ఖనిజ లవణాలు కొట్టుకుపోయి మేతలో వాటి శాతం తగ్గుతుంది కాబట్టి, పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి మినరల్ మిక్స్చర్ లేదా మినరల్ బ్లాక్ లను శాస్త్రీయంగా అందించాలి.
ఆరోగ్య సంరక్షణ మరియు వ్యాధి నివారణ వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి ముందస్తు రోగనిరోధక చర్యలు మరియు వ్యాధి నివారణ అత్యవసరం. వర్షాలు పడటానికి ముందే పశువైద్యుల సలహా మేరకు ఖచ్చితంగా టీకాలు వేయించాలి. ఆవులు, గేదెలకు గొంతువాపు (Hemorrhagic Septicemia – HS), జబ్బవాపు (Black Quarter – BQ), మరియు గాలికుంటు వ్యాధి (Foot and Mouth Disease – FMD) నివారణ టీకాలు వేయించాలి. అలాగే గొర్రెలు, మేకలకు బొబ్బరోగం లేదా ఇ.టి (Enterotoxemia – ET), పి.పి.ఆర్ (Peste des Petits Ruminants) మరియు నీలి నాలుక వ్యాధి (Blue Tongue) వంటి వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి కారక కీటకాలైన దోమలు, ఈగలు మరియు పేల నియంత్రణకు షెడ్ లోపల, గోడలకు అనువైన క్రిమిసంహారక మందులను క్రమం తప్పకుండా స్ప్రే చేయడం ద్వారా బాహ్య పరాన్నజీవుల జనాభాను అదుపులో ఉంచవచ్చు.
పరాన్నజీవుల (Worms) నియంత్రణ: పశువులలో అంతర్గత మరియు బాహ్య పరాన్నజీవుల (Parasites) నియంత్రణ చేయడం వల్ల పశువు యొక్క ఉత్పాదకతను పెంచడానికి తోడ్పడుతుంది. వర్షాకాల వాతావరణం పరాన్నజీవుల గుడ్లు, లార్వాలు వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి, పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం సరైన డోసేజ్‌తో డీ-వార్మింగ్ (నట్టల నివారణ) మందులు ఇప్పించాలి. పేలు (Ticks), మైట్స్, మరియు లైస్ వంటి బాహ్య పరాన్నజీవులు పశువుల రక్తాన్ని పీల్చడమే కాకుండా, రక్తం ద్వారా వ్యాపించే ప్రాణాంతక ప్రోటోజోవా వ్యాధులైన ‘బేబిసియోసిస్’ (Babesiosis) మరియు ‘అనాప్లాస్మోసిస్’ (Anaplasmosis) వంటి వాటికి కారణమవుతాయి కాబట్టి వీటి నిర్మూలన అవసరం.
మాస్టిటిస్ మరియు కాళ్ల సంరక్షణ: చివరగా, పాడి పశువులలో మాస్టిటిస్ (పొదుగు వాపు వ్యాధి) మరియు కాళ్ల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు పొదుగును పొటాషియం పర్మాంగనేట్ లేదా శుభ్రమైన నీటితో కడిగి ఆరనివ్వాలి. పాలు పితికిన వెంటనే బాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ‘టీట్ డిప్’ పద్ధతిలో ఐడోఫోర్ (Iodophor) ద్రావణాన్ని ఉపయోగించడం ద్వారా మాస్టిటిస్ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు. పశువుల గిట్టలను తరచూ పరిశీలిస్తూ, ఏవైనా గాయాలు లేదా ఫుట్ రాట్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయాలి. గిట్టల ఇన్ఫెక్షన్లను నివారించడానికి పశువులను 5% కాపర్ సల్ఫేట్ ద్రావణంతో కూడిన ‘ఫుట్ బాత్’ (Foot Bath) గుండా నడిపించడం అత్యంత శాస్త్రీయమైన మరియు ప్రభావవంతమైన పద్ధతి.
Dr. Vaishnavi Polapelli, MVSc Scholar Department of Veterinary Surgery and Radiology, Ph: 9100725211
నాడెప్ కంపోస్ట్ పద్ధతిని నారాయణ్ డియోరావ్ పండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేశారు. నాడెప్ కంపోస్టు పద్ధతి ప్రత్యేకంగా పశువులు లేని రైతులకు మంచి ప్రత్యామ్నాయం.
కంపోస్ట్ పిట్ పరిమాణం: పొడవు: 10 అడుగులు, వెడల్పు: 6 అడుగులు, ఎత్తు : 3 అడుగులు. ఒక అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్య ఎటువంటి ఖాళీలు ఉండకూడదు. తర్వాత ఒక్కో ఇటుకకు మధ్య 6 అంగుళాల ఖాళీ ఉండాలి.
కంపోస్టు తయారీకి కావలసిన పదార్థాలు :
పంట అవశేషాలు లేదా ఎండు / పచ్చి ఆకులు – 1350-1400 కి.
పశువుల పేడ లేదా బయోగ్యాస్ / గోబర్ గ్యాస్ స్లర్రీ – 98-100 కి.
జల్లెడ పట్టిన మట్టి – 1675 కి.
నీరు – 1350-1400 లీ. కంపోస్ట్ తయారు చేసే పదార్థాలను పిట్‌లో నింపే ముందు గోడలను పేడతో అలకాలి. నాడెప్ కంపోస్ట్ తయారీలో ముఖ్య అంశం పిట్‌ని కావలసిన పదార్థాలతో 24 గంటలలోపు ఒకేసారి నింపడం.
మొదటి పొరః 6 నుంచి 10 అంగుళాల వరకు పంట అవశేషాలు, ఆకులు మొదలైనవి.
రెండవ పొర : 4 కిలోల పేడను 100 లీ. నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి.
మూడవ పొర : 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాలి.
పై విధంగా 10Ð12 పొరలుగా కంపోస్ట్ పిట్ నింపడం పూర్తి చేయాలి. అలా నింపిన తర్వాత, జీవ పదార్థాన్ని 3 అంగుళాల మందంగల మట్టితో కప్పి పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి.
కంపోస్ట్ పిట్‌ని నింపిన 15-20 రోజుల తర్వాత నాడెప్ కంపోస్ట్ పిట్ 2 అడుగులు కుంగడం జరుగుతుంది. కుంగిన పిట్‌ని పైన పేర్కొన్న విధంగా 2-3 పొరలు నింపి మరలా పేడ మరియు మట్టి పేస్టుతో అలకాలి. తర్వాత 3 నెలల వరకు, 10-15 రోజులకొకసారి నీరు చిలకరించడానికి తప్ప కదిలించరాదు. మొత్తం కంపోస్ట్ పిట్‌ని తాటాకులతో కప్పాలి. ఎటువంటి పరిస్థితులలోను బీటలు ఏర్పడకుండా చూడాలి. ఒకవేళ ఏర్పడితే వెంటనే వాటిని స్లర్రీతో నింపాలి. 90-120 రోజుల తర్వాత సుమారు 2.5 టన్నుల కంపోస్టు తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో నత్రజని 1.0 శాతం, భాస్వరం 0.5 శాతం, పొటాష్ 1.2 శాతం ఉంటాయి. సాధారణ కంపోస్టు పద్ధతిలో తయారైన కంపోస్టు కంటే 3-4 రెట్లు పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు : రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. పంట దిగుబడి పెరుగుతుంది. సేంద్రియ పంటల సాగుకు దోహదపడుతుంది. బయట ఉత్పాదకాలపై ఆధారపడటం తగ్గుతుంది.
ప్రస్తుతం 2026లో ఎల్ నినో (El Niño) అధికారికంగా ప్రారంభమైందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), అమెరికాకు చెందిన నోవా (NOAA) శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఇది రాబోయే శరదృతువు (Autumn) నాటికి మరింత బలపడి, ప్రమాదకరమైన “సూపర్ ఎల్ నినో” (Super El Niño) స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.
ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean) యొక్క మధ్య మరియు తూర్పు భాగాలలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రత సాధారణం కంటే పెరగడం అనే ఒక వాతావరణ దృగ్విషయం. ఇది సాధారణంగా ప్రతి 2 నుండి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తుంది మరియు 9-12 నెలల నుండి కొన్నిసార్లు 2 సంవత్సరాల వరకు కొనసాగవచ్చు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం, ఉష్ణోగ్రత మరియు గాలుల నమూనాలను మారుస్తుంది. ఇది El Niño–Southern Oscillation (ENSO) అనే పెద్ద వాతావరణ వ్యవస్థలో ఒక దశ. ENSO లో మూడు దశలు ఉన్నాయి:
El Niño (వేడి దశ),
La Niña (చల్లని దశ) మరియు
Neutral (సాధారణ స్థితి).
ఎల్ నినో లక్షణాలు: • సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుదల (+0.5°C లేదా అంతకంటే ఎక్కువ) • గాలుల నమూనాలలో మార్పులు • వర్షపాత నమూనాలలో మార్పులు • దక్షిణ అమెరికా ప్రాంతంలో భారీ వర్షాలు • ఆస్ట్రేలియా మరియు భారతదేశంలో కరవు పరిస్థితులు
ముఖ్య గమనిక: ఎల్ నినో మాత్రమే వర్షపాతాన్ని నిర్ణయించదు. ఇండియన్ ఓషన్ డైపోల్ (IOD), స్థానిక వాతావరణ వ్యవస్థలు వంటి ఇతర అంశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అందువల్ల, కొన్నిసార్లు ఎల్ నినో ఉన్నప్పటికీ మంచి వర్షాలు కురవవచ్చు (IOD పాజిటివ్‌గా ఉంటే). భారతదేశంలో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావాలు
భారతదేశ వ్యవసాయం వర్షంపై చాలా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా నైరుతి రుతుపవనాలపై (south-west monsoon). ఎల్ నినో సంభవించిన సంవత్సరాల్లో రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం మరియు కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఉదాహరణకు 2002, 2009 మరియు 2015 లలో ఎల్ నినో కారణంగా వర్షపాత కొరత ఏర్పడింది.
వర్షపాత కొరత (Drought): ఎల్ నినో సమయంలో వర్షపాతం తగ్గడం వల్ల కరవు పరిస్థితులు ఏర్పడతాయి. దీనివల్ల నీటి కొరత ఏర్పడి పంటలు ఎండిపోయే అవకాశం ఉంది.
పంట ఉత్పత్తి తగ్గడం: వరి, జొన్నలు, గోధుమలు, పప్పుధాన్యాలు మొదలైన ముఖ్యమైన పంటల ఉత్పత్తి తగ్గుతుంది. దీనివల్ల రైతులకు నష్టం వాటిల్లుతుంది.
నీటిపారుదల సమస్య: జలాశయాలు (రిజర్వాయర్లు) మరియు భూగర్భ జలాల మట్టాలు తగ్గిపోతాయి. దీనివల్ల పంటలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం కష్టమవుతుంది.
కీటకాలు మరియు తెగుళ్ల పెరుగుదల: వాతావరణ మార్పుల కారణంగా కొన్ని రకాల కీటకాలు మరియు వ్యాధులు/తెగుళ్లు పెరుగుతాయి. ఇది పంటల నాణ్యతను మరియు ఉత్పత్తిని దెబ్బతీస్తుంది.
నివారణ చర్యలు
కరవు తట్టుకునే పంటలు: రాగులు, జొన్నలు, సజ్జలు మొదలైన తక్కువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం ఉత్తమం.
నీటి సంరక్షణ: వర్షపు నీటి నిల్వ (వాటర్ హార్వెస్టింగ్), వ్యవసాయ కుంటల నిర్మాణం చేయడం.
సరైన పంట ప్రణాళిక: వాతావరణ సమాచారం ఆధారంగా పంట ఎంపిక మరియు విత్తే సమయాన్ని నిర్ణయించడం.
సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత: బిందు (డ్రిప్) మరియు తుంపర (స్ప్రింక్లర్) నీటిపారుదల పద్ధతులను ఉపయోగించడం నీటి పొదుపునకు సహాయపడుతుంది.
పంట బీమా (Crop Insurance): పంట నష్టం నుండి రక్షణ పొందడానికి బీమాను ఉపయోగించుకోవడం.
రైతులకు వ్యవసాయ సలహాలు మరియు ముందస్తు జాగ్రత్తలు జూన్ నెల ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కీలకమైన సమయం. భారత వాతావరణ శాఖ (IMD) మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయాల ముందస్తు అంచనాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నెల వాతావరణం మరియు రైతులు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తల సంక్షిప్త సమాచారం:
వ్యవసాయ భూమి సిద్ధం చేయడం మరియు విత్తడం • నేలను సిద్ధం చేయడం: తొలకరి జల్లులు మరియు ప్రారంభంలో కురిసే వర్షాలను ఉపయోగించుకుని భూమిని లోతుగా దుక్కి దున్ని సిద్ధం చేసుకోండి. ఇది మట్టిలో తేమను పట్టి ఉంచడానికి సహాయపడుతుంది. • విత్తడానికి తొందరపడవద్దు: కనీసం 50 నుండి 60 మి.మీ. మేర మంచి వర్షం పడి, మట్టిలో తగినంత పదును (తేమ) ఏర్పడే వరకు విత్తే కార్యక్రమాన్ని ప్రారంభించవద్దు. • కరవును తట్టుకునే రకాల ఎంపిక: వర్షపాత కొరత సూచనలు ఉన్నందున, తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే మరియు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు మరియు రకాలను (ఉదాహరణకు: జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది మొదలైనవి) ఎంపిక చేసుకోవడం ఉత్తమం. • భూగర్భ జలాల సద్వినియోగం: వర్షాల అస్థిరత ఉన్నందున వ్యవసాయ కుంటలు (ఫార్మ్ పాండ్స్), బోర్‌వెల్ మరియు బిందు సేద్యం (Drip Irrigation) పద్ధతిని ఉపయోగించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి.
సారాంశం ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా ఎల్ నినో పరిణామాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు ఒక ముఖ్యమైన సూచిక. “2026 లో పూర్తి కరవు లేదా పూర్తిగా మంచి వర్షాలు కురుస్తాయని ఖచ్చితంగా చెప్పలేం – కానీ ‘అస్థిర వాతావరణం’ అనేది మాత్రం నిజం.” ఎల్ నినో అనేది ఒక సహజ వాతావరణ ప్రక్రియ అయినప్పటికీ, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యవసాయం మరియు ఆహార భద్రతపై ఇది పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, విజ్ఞాన ఆధారిత వ్యవసాయం, వాతావరణ సమాచారం మరియు సరైన ప్రణాళికల ద్వారా మనం దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.
“ఎల్ నినోను నిరోధించడం సాధ్యం కాదు, కానీ దాని ప్రభావాలను తగ్గించడం మన చేతుల్లోనే ఉంది”
డా. బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU)
భారతదేశంలో పాడి పరిశ్రమ వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటి. చిన్న, సన్నకారు రైతుల నుంచి పెద్ద స్థాయి డెయిరీ రైతుల వరకు లక్షలాది కుటుంబాలు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే పశువుల నుంచి అధిక పాల దిగుబడి పొందాలంటే వాటి ఆరోగ్యం, పోషణ, నివాస వాతావరణం మరియు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వేసవి కాలంలో ఉష్ణోగ్రతల ప్రభావం గురించి రైతులకు బాగా అవగాహన ఉంటుంది. కానీ వర్షాకాలంలో కూడా పశువులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతాయని చాలా మంది రైతులు గుర్తించరు. అధిక తేమ, బురద, నీటి నిల్వలు, తక్కువ సూర్యకాంతి, మేత నాణ్యతలో మార్పులు మరియు వ్యాధుల వ్యాప్తి వంటి అంశాలు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా పాల ఉత్పత్తి తగ్గడం, పునరుత్పత్తి సమస్యలు పెరగడం, చికిత్స ఖర్చులు అధికమవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
వర్షాకాలంలో పాల దిగుబడి ఎందుకు తగ్గుతుంది?
అధిక తేమ ప్రభావం వర్షాకాలంలో గాలిలో తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పశువులు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి చెమట ద్వారా వేడిని బయటకు పంపుతాయి. కానీ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు చెమట ఆవిరైపోవడం కష్టమవుతుంది. దీంతో శరీరంలో వేడి నిల్వ ఉంటుంది, శక్తి వినియోగం పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది మరియు పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక తేమ ఉన్న రోజుల్లో పాల దిగుబడి 5–15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
మేత వినియోగం తగ్గడం పాల ఉత్పత్తికి అవసరమైన శక్తి ప్రధానంగా మేత ద్వారా లభిస్తుంది. వర్షాకాలంలో పశువులు తక్కువ మేత తింటాయి, ఆకలి తగ్గుతుంది మరియు మేత నాణ్యత మారుతుంది. పశువు తినే ఆహారం తగ్గితే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
తడి మరియు బురద వాతావరణం బురదతో కూడిన ప్రదేశాల్లో పశువులు నడవడానికి ఇబ్బంది పడతాయి. దీంతో ఎక్కువ శక్తి ఖర్చవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది మరియు విశ్రాంతి తగ్గుతుంది. విశ్రాంతి సరిగా లేకపోతే పాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
వ్యాధుల పెరుగుదల వర్షాకాలం అనేక వ్యాధులకు అనుకూలమైన కాలం. ప్రధానంగా పొదుగు వాపు వ్యాధి, కాలిపుండ్ల వ్యాధి (Foot Rot), జ్వరాలు, చర్మ వ్యాధులు మరియు పరాన్నజీవుల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన పశువు పాల ఉత్పత్తి సహజంగానే తగ్గుతుంది.
పొదుగు వాపు వ్యాధి ప్రభావం వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే సమస్య పొదుగు వాపు వ్యాధి. పొదుగు వాపు వ్యాధి వల్ల పాలు తగ్గుతాయి, పాల నాణ్యత పడిపోతుంది పొదుగు వాపు వ్యాధి మరియు చికిత్స ఖర్చు పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో పాల ఉత్పత్తి 30 శాతం వరకు తగ్గవచ్చు.
పరాన్నజీవుల దాడి వర్షాకాలంలో పేలు, ఈగలు, పురుగులు మరియు అంతర్గత పరాన్నజీవులు వేగంగా పెరుగుతాయి. ఇవి రక్తహీనత, బలహీనత మరియు ఆకలి మందగించడం వంటి సమస్యలకు కారణమవుతాయి.
కలుషితమైన మేత వర్షాల కారణంగా మేతలో శిలీంధ్రం (ఫంగస్/ బూజు) పెరిగే అవకాశం ఉంటుంది. ఫంగస్ కలిగిన మేత విషపూరిత పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది మరియు పాల దిగుబడిని తగ్గిస్తుంది.
తాగునీటి సమస్య వర్షాకాలంలో నీరు ఎక్కువగా ఉన్నప్పటికీ స్వచ్ఛమైన నీరు లభించకపోవచ్చు. కలుషిత నీటి వల్ల కడుపు సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు మరియు ఆకలి తగ్గడం జరుగుతాయి.
వర్షాకాల ఒత్తిడి లక్షణాలు రైతులు గమనించాల్సిన ముఖ్య లక్షణాలు: • పాల ఉత్పత్తి తగ్గడం • మేత తక్కువగా తినడం • నీరసం • ఎక్కువసేపు నిలబడటం • బరువు తగ్గడం • పొదుగు సమస్యలు • జ్వరాలు • తరచుగా వ్యాధులు రావడం
రైతులు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు
షెడ్ నిర్వహణ వర్షాకాలంలో మంచి షెడ్ నిర్వహణ అత్యంత కీలకం. నీరు నిల్వ కాకుండా చూడాలి, డ్రైనేజీ (పారుదల) ఏర్పాటు చేయాలి, నేలను ఎత్తుగా ఉంచాలి మరియు గాలి ప్రసరణ ఉండాలి
పొడి పరుపు ఏర్పాటు పశువులు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఎప్పుడూ పొడిగా ఉండాలి. వరి పొట్టు, పొడి గడ్డి మరియు చెక్క పొట్టు ఉపయోగించవచ్చు.
పరిశుభ్రత పాటించాలి రోజువారీగా పేడ తొలగించాలి, నేలను శుభ్రపరచాలి మరియు క్రిమిసంహారకాలు ఉపయోగించాలి
పొదుగు వాపు వ్యాధి నివారణ పాలు పితికే ముందు పొదుగులను శుభ్రం చేయాలి మరియు పాలు పితికిన తర్వాత టీట్ డిప్పింగ్ చేయాలి. పశువుల పొదుగు పరిశుభ్రతకు మరియు మాస్టిటిస్ (పొదుగు వాపు) వ్యాధిని నివారించడానికి పాలు పితికే ముందు మరియు తరువాత పొదుగును క్రిమిసంహారక ద్రావణంలో ముంచడాన్ని టీట్ డిప్పింగ్ (Teat dipping) అంటారు.ఇది బ్యాక్టీరియాను నాశనం చేసి, పాల నాణ్యతను పెంచుతుంది。
నాణ్యమైన మేత మరియు శుభ్రమైన తాగునీరు అందించాలి వర్షాకాలంలో సైలేజ్ (Silage), ఎండుగడ్డి మరియు సమతుల్య దాణా అందించాలి. సైలేజ్ అనేది పాడి పశువులకు పెట్టే ఒక రకమైన పచ్చటి, రసవంతమైన పశుగ్రాసం. పచ్చి మేత పుష్కలంగా లభించే సమయంలో దానిని సేకరించి, చిన్న ముక్కలుగా కత్తిరించి, గాలి చొరబడని గుంతల్లో భద్రపరుస్తారు. పశువులకు రోజుకు అనేకసార్లు నీరు ఇవ్వాలి, నీటి తొట్లను శుభ్రంగా ఉంచాలి
ఖనిజ మిశ్రమాలు పాలిచ్చే పశువులకు కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు జింక్ అవసరం. ఖనిజ మిశ్రమాలను క్రమం తప్పకుండా ఇవ్వాలి.
పరాన్నజీవుల నియంత్రణ క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ (Deworming), పేలు నివారణ, ఈగల నియంత్రణ చేయాలి.
టీకాలు వేయించాలి వర్షాకాలానికి ముందు గాలికుంటు వ్యాధి (Foot and Mouth disease), గురక వ్యాధి (Hemorrhagic Septicemia), జబ్బవాపు రోగం (Black Quarter) వంటి వ్యాధుల టీకాలు వేయించాలి.
ముగింపు వర్షాకాలంలో అధిక తేమ, బురద, వ్యాధులు, పరాన్నజీవులు మరియు మేత నాణ్యతలో మార్పులు పశువులపై ఒత్తిడిని పెంచి పాల దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఈ ఒత్తిడిని ముందుగానే గుర్తించి సరైన నిర్వహణ చర్యలు తీసుకుంటే రైతులు నష్టాలను నివారించగలరు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే – “ఆరోగ్యకరమైన పశువు మాత్రమే అధిక పాలు ఇస్తుంది.” వర్షాకాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రైతు మాత్రమే స్థిరమైన ఆదాయం మరియు అధిక పాల దిగుబడిని సాధించగలడు.
డా. అలియా తహ్సీన్, ఎం.వి.ఎస్.సి., పీహెచ్.డి పశుసంవర్ధక ఉత్పత్తుల సాంకేతిక శాస్త్రం పశువైద్య శాస్త్ర కళాశాల, కోరుట్ల. 8885189834
తేనెటీగలు పుప్పొడిని సేకరించుకొనుట తేనెటీగలు పుప్పొడిని సేకరించుకోవాలనే ప్రేరణ తేనెపట్టు అవసరం మీద ఆధారపడి ఒక క్రమబద్ధీకరణ ద్వారా జరుగుతుంది. తేనెటీగలు పొలం వెళ్ళి సేకరించే పుప్పొడి పరిమాణం మీద ఆధారపడి పట్టులో పిల్లల అభివృద్ది ఉంటుంది. పట్టులో పిల్లల ఫ్రేములు రెండింతలు చేసినట్లయితే, సేకరించే పుప్పొడి పరిమాణం ఒకరోజులో రెండితలు పెరుగుతుంది. దీనికి తోడుగా రాణి ఈగ ఎక్కువగా గ్రుడ్లు పెట్టినట్లయితే ఇది పుప్పొడి సేకరణను పెంచుతుంది. ఈ పరిణామాలన్నీ ఫిరమోనుల ద్వారా జరిగించబడుతాయని సూచిస్తుంది.
తేనెటీగలు పుప్పొడిని ఎలా సేకరించి ప్యాక్ చేసుకుంటాయి? కూలి ఈగ ఆహారము సేకరించుకొనే సమయములో దాని శరీరమంతా పుప్పొడి రేణువులతో ధూళిలాగ నింపబడుతుంది (dusted with pollen) తరువాత తేనెటీగ తన నాలుకను చాపి ఒక చుక్క మకరందమును లేక తేనెను ఉమ్ముతుంది, ముందు కాళ్ళు ఈ మకరందము లేక తేనెతో తడపబడతాయి. ఈ ముందు కాళ్ళు తల మీద స్పర్శకముల మీద మరియు మొండెము (thorax) ఎదుట వున్న పరాగ రేణువులను బ్రష్ చేస్తాయి. మొండెము వెనుక భాగమున ఉన్న పరాగ రేణువులను మద్య కాళ్ళు (middle legs) తొలగించి వేస్తాయి (combed off) మరియు ఉదరము మీద ఉన్న పరాగ రేణువులు వెనుక కాళ్ళ (hind legs) కదలికల ద్వారా సేకరించబడతాయి. చివరికి పుప్పొడి అంతా వెనుక కాళ్ళకు బదలీ చేయబడుతుంది. మధ్య కాళ్ళు, పుప్పొడిని మలచడానికి (mold) ప్యాక్ చెయ్యడానికి (pack) మరియు పుప్పొడి గుళికలు మూత్ర పిండాకారము (kidney shape) నకు మలచబడుతుంది.
పట్టులో పుప్పొడిని నిల్వ ఉంచుట పుప్పొడి, తేనె పట్టులోనికి రాగానే, పుప్పొడిని సేకరించిన కూలిఈగ సాధారణంగా తన వద్ద వున్న పుప్పొడి ముద్దను విడిపించుకుంటుంది (grooms herself). తరువాత సరియైన ఏ మైనపు గదిలో ఈ పుప్పొడిని వుంచవలెనో ఆ గది కొరకు వెదకుతుంది. ఈ గది ఒకవేళ ఖాళీ గది కావచ్చును. సాధారణముగా లద్దె పురుగులు ఎదిగే ప్రాంతమై యుంటుంది లేదా ఇంతకు ముందే పుప్పొడి ఉన్న గది అయి కూడ వుండవచ్చును. కూలిఈగ మైనపు గదిని ఎంచుకున్నపుడు తన ఉదరమును గదిలో పూర్తిగాను, కాళ్ళను పాక్షికముగాను ముంచి, తన మధ్య కాళ్ళనుపయోగించి రహస్యముగా (pry) తన పుప్పొడి ముద్దను గదిలో పడునట్లుగా అనుమతిస్తుంది. పుప్పొడి తిత్తిలో (pollen basket) మిగిలియున్న చిన్న చిన్న పుప్పొడి ముద్దలు ఏవైనావున్నట్లయితే వాటినికూడా గదిలో వదిలించుకుంటుంది మరియు ఇంకొక కూలిఈగ వచ్చి పుప్పొడిని గది అడుగులోనికి త్రోసి తన దంతములు మరియు ముందు కాళ్ళతో అదిమి ప్యాక్ చేయటకు వీలుగా పొలం నుండి వచ్చిన ఈగ గదిని విడిచిపెడుతుంది.వెళ్ళిన కూలి ఈగ తను తీసుకొచ్చిన పుప్పొడిని మైనపుగదిలో వుంచిన తరువాత ఇంకొక కూలి ఈగ ఉండి సాధారణముగా కొంత తేనెను ఇమ్మని కోరుతుంది. మరియు తరువాత అహారం సేకరించుటకు పొలము వెళుతుంది.
పుప్పొడికి అనుబంధమైనవి మరియు పుప్పొడికి ప్రత్యామ్నాయ పదార్ధములు (Pollen supplements and substitutes) పుప్పొడి అనుబంధ పదార్ధము అనగా, ఏ పదార్ధమునైతే, సహజ పుప్పొడికి (natural pollen) తేనెటీగలు సేకరించిన పుప్పొడికి (bee collected pollen) కలుపుతారో దానిని పుప్పొడి అనుంధ పదార్ధమని అంటారు. పుప్పొడి ప్రత్యామ్నాయ పదార్ధము అనగా అసలు అందులో పుప్పొడి వుండదు. అనుబంధ పదార్ధములలో సాధారముగా పదినుండి ఇరవై శాతము సహజ పుప్పొడిని కల్గియుంటుంది. ఈ పదార్థము ప్రాధమికముగా తేనెటీగలకు అనువుగా (రుచిగా) మరియు ఆకర్షనీయముగా వుంటుంది. పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములు తేనెటీగలకు ఎక్కువ ఆకర్షనీయముగా వుండటకు గాను పంచదార పాకమును లేదా తేనెను కలుపుతారు.తేనెను కలిపినట్లయితే అది ఆపాయకరముగా వుండవచ్చును, కారణము, రోగమును/ వ్యాధికారక బాక్టీరియా లేక స్పోరులను కల్గియుండవచ్చును. పుప్పొడి అనుబంధ పదార్ధములకు చాక్ బ్రూడ్ లేక యూరోపియన్ ఫౌల్ బ్రూడ్ వ్యాధితో కలుషితమైన పుప్పొడిని కలిపినట్లయితే వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
సోయా చిక్కుడు పిండిని మరియు బ్రూయర్స్ ఈస్ట్ ఈ రెండిటిని తరచుగా పుప్పొడి అనుబంధ పదార్ధములలో మరియు ప్రత్యామ్నాయ పదార్ధములలో వాడతారు. ఎక్కువమంది తేనెటీగల పెంపకముదారులు వారి సొంత పుప్పొడి అనుబంధ మరియు ప్రత్యామ్నాయ పదార్ధములను తయారు చేసుకుంటారు. ఒక పేరుగాంచిన సూత్రములో 3 పాళ్ళు సోయా చిక్కుడు పిండి, ఒక భాగము పుప్పొడి, రెండు పాళ్ళు చక్కెర (పంచదార) మరియు ఒక పాలు నీరు కల్గియున్నది. ఒక వేళ పుప్పొడిని ఉపయోగించకపోయినట్లయితే బ్రూయర్స్ ఈస్ట్ ను ప్రత్యామ్నాయంగా వాడుకొనవచ్చును. ఈ పదార్ధములన్నింటిని, కలిపి గట్టి ముద్దగా ఒక పౌoడు బరువుగలదిగా చేసికొని, దీనిని మైనపు పేపరుపై ముక్కలుగా ఉంచుకొనవలెను అడుగున మైనపు పేపరుతో ఈ ముక్కలను (patties) చేసినట్లు ఫ్రేములపై (top bars) వసంత కాలములో ఉంచుకొనవలెను. ఒక్కసారి పుప్పొడి అనుబంధ పదార్థమును పట్టుకు ఇవ్వడము ఆరంభిస్తే సహజ సిద్దమైన పుప్పొడి పొలములో సేకరించుట ఆరంభించు వరకు ఇవ్వవలెను మాంసకృత్తులు లభ్యముకాని సమయంలో ఉపయోగించుకొనుటకు గాను ఈ కృత్రిమ ఆహారమును మధ్యలో ఆపివేసినట్లయితే, పెరిగిన పట్టుకు ఎంతో ప్రమాదకరముగా పరిణమిస్తుంది. అంతేకాకుండా పట్టు కూడా చనిపోవచ్చు.
Pollen Traps – పుప్పొడిని సేకరించు బోనులు పొలముకెళ్ళి పుప్పొడిని సేకరించుకొని పట్టుకు తిరిగివచ్చు ఈగల కాళ్ళకున్న పుప్పొడి ముద్దలను పుప్పొడిని సేకరించుబోనులను పట్టు ద్వారమువద్ద బిగించి, పుష్పాడిని సేకరించుకొనుటకు సాధ్యమే. పుప్పొడిని సేకరించుబోను అనుపరికరమును పట్టు ద్వారమువద్ద బిగించుకొని, పట్టులోపలికి (pollen loads), బలవంతముగా నడచివెళ్ళు ఈగల కాళ్ళకు వున్న పుప్పొడిని సేకరించవచ్చును. కూలిఈగలు సన్నని రంధ్రముల ద్వారా వెళ్ళునపుడు వాటి వెనుక కాళ్ళు వెనుకకు నెట్టబడి, వైరు ద్వారా లాగ బడి, పుప్పొడి గుళికలు (pollen balls) తొలగించబడతాయి. తొలగించబడిన పుప్పొడి గుళికలు బోనులోని పెట్టెలో పడతాయి. ఎనిమిది మెష్ వైరును పెట్టెపై వాడటమువలన, తేనెటీగలు అడుగుకు ప్రవేశించి సేకరించబడిన పుప్పొడిని తొలగించలేవు. వివిధ కవర్లను పుప్పొడిని సేకరించుబోనులకు వాడుటవలన, వర్షము వచ్చినప్పుడు పుప్పొడి తడవకుండా వుంటుంది. పుప్పాడిని సేకరించు బోనులను ఎక్కువగా చెక్కతో తయారుచేస్తారు కాని, లోహపు బోనులు ఎక్కువ కాలము మన్నుతాయి. నీటిని తొలగించుకుంటాయి, బహుశ ఎక్కువ ఖర్చయినప్పటికిని విలువైనవి.
Pollination-పరాగ సంపర్కము పుష్పములోని పురుష భాగమైన పరాగకోశము (anther) నుండి స్త్రీ భాగమైన కీలాగ్రము (stigma) మీదకు పరాగ రేణువు (pollen) చేరుటను పరాగసంపర్కము అని పిలుస్తారు. కొన్ని మొక్కలు స్వపరాగ సంపర్కము చెందుతాయి, కాని ఎక్కువ సందర్భములలో గాలి, నీరు, కీటకములు ప్రత్యేకముగా తేనెటీగలు పరాగరేణువుల బదిలీకి కారణమవుతాయి. కొన్ని మొక్కలలో పరాగ సంపర్కము జరుగదు, కాబట్టి వానిలో విత్తనములు ఏర్పడవు. కీటకములలో తేనెటీగలు అనేవాటిలో అనేక జాతులున్నవి. ప్రత్యేకముగా పరాగ సంపర్కము జరుపుటకు అనువైనవి. వీటి శరీరము మీద చీలికలుగా వున్న వెంట్రుకలుండుట వలన, పుప్పొడి సుళువుగా వీటి మధ్య చిక్కుకుంటుంది మరియు ఈ పుప్పొడి ఒక పుష్పము నుండి ఇంకొక పుష్పమునకు సులువుగా మోసికొని పోబడుతుంది.
జి.అలేఖ్య, యంగ్ ప్రొఫెషనల్ -1, అఖిల భారత సమన్వయ తేనెటీగలు మరియు పరాగ సంపర్కము జరుపు కీటకముల పరిశోధన పథకము, వ్యవసాయ పరిశోధన స్థానము, విజయరాయి -534475, ఏలూరు జిల్లా.