పంటకాలం పెరుగుదలకు ‘వండర్ ఆయిల్స్’

ప్రతి మొక్క దాని తరువాత తరం కోసం కావలసిన అన్ని పోషక పదార్థాలను గింజలలో దాచుకుంటుంది. ఆ గింజలో శక్తిని నూనెగా మార్చి అదే మొక్కకు అందిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి చాలా ప్రయోగాలు చేశారు. తక్కువ ఖర్చుతో లభించే నూనెలను నీటిలో కరిగించి మొక్కలకు డ్రిప్ ద్వారా, పిచికారి ద్వారా అందించి ప్రత్తి, చెరకు, బొప్పాయి, అరటి, కూరగాయల పంటలలో అద్భుతమైన దిగుబడులు సాధించారు. ఉదాహరణకు ప్రత్తి పంటకు అర లీటరు ప్రత్తి నూనెలో 50 మి.లీ. ఎమల్షన్ కలిపి ఆ ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి డ్రిప్ ద్వారా లేదా పిచికారి చేసి అందించారు. అపుడు నూనె నీటిలో కలిసిపోయి పాలలా తెల్లగా మారింది. దీనితోపాటు కానుగ నూనె, వేరుశనగ నూనె, ప్రొద్దు తిరుగుడు నూనె, వేప నూనె వంటి రకరకాల నూనెలను మార్చి మార్చి అందించడం వలన మొక్కలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు అందుతాయి. ఇలా వారానికి ఒకసారి నూనెలను అందించడం వలన మొక్కలలో రోగ నిరోధకశక్తి పెరిగి చీడపీడలను తట్టుకుంటాయి. పంటకాలం పెరిగి రైతు అధిక దిగుబడులను పొందే అవకాశం కలుగుతుంది. అంటే 4 నెలలు దిగుబడి వచ్చే పంట 6 నెలల వరకు కూడా దిగుబడులనిస్తుంది. 

ఈ పద్ధతిని ఖమ్మం జిల్లా కోయచలకకు చెందిన రైతు రామారావు అనుసరించి తన కూరగాయల తోటలో రెట్టింపు దిగుబడులు పొందారు. రామారావు స్ఫూర్తితో సక్రూనాయక్, పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ధర్మేందర్, చింతలలంక గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు వంటి రైతులు పుచ్చ, బంతి, బీర, బొప్పాయి పంటలలో నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తున్నారు.

నూనెల మిశ్రమం : నూనెల మిశ్రమం తయారీకి ఎమల్సిఫయర్‌కు బదులు లీటరు నూనెను రెండు కోడిగుడ్ల సొన కలిపి మిక్సీలో వేసి 5 నుంచి 10 నిమిషాలు తిప్పాలి. దీంతో నూనె నీటిలో కరిగేవిధంగా తయారవుతుంది.

Read More

గ్రామీణ ప్రాంతాలలో భద్రంగా డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం

గ్రామీణ ప్రాతాలలోని స్త్రీలు నిరక్షరాస్యత, పేదరికానికి తోడు సరైన పోషకాహారం తీసుకోలేక పోవడం వలన అనారోగ్యానికి గురి అవుతున్నారు. వీటిని అధిగమించాలంటే స్వాలంబనతో పాటు సమతుల్య ఆహారం ఎంతో అవసరం. గ్రామాలలోని ప్రజలు అధికంగా బియ్యంను ప్రధాన ఆహారంగా వాడుతారు. వీటిలో పిండి పదార్ధాలు అధికంగాను, మాంసకృత్తులు అత్యల్పంగానూ ఉంటాయి. అందువల్ల గ్రామాల్లోని ప్రజలు మాంసకృత్తుల లోపం మూలంగా సరైన ఎదుగుదల లేక ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరు సరైన పోషకాహారము తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అయతే ఈ మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు కోడి గ్రుడ్డులో మరియు కోడి మంసములో పుష్కలంగా ఉన్నాయి. పోషకాహార నిపుణుల సూచన మేరకు కనీసం రెండు రోజులకి ఒక గ్రుడ్డు చొప్పున తింటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. అందువల్ల కోళ్ళ ఉత్పత్తులను గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో అందుబాటులోకి తెస్తే అది వారి ఆహారలో ఒక భాగమై వారి ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి దోహద పడుతుందున్న ఉద్దేశ్యముతో అధిక గ్రుడ్లు ఉత్పత్తి మరియు నాటు కోడి మాంసం రుచికి సమానంగా అనిపించే వనరాజ, గిరిరాజ, గ్రామ ప్రియ, రాజశ్రీ, శ్రీనిధి, వనశ్రీ మరియు కడక నాథ్ కోళ్ళ జాతులను పెరటిలో పెంచుకోవడానికి అనువైనవిగా గుర్తించి గ్రామీణ ప్రాంత రైతులకు పరిచయం చెయ్యడం జరిగింది.

గ్రామీణ ప్రాంతంలో నాటు కోళ్ళ పెంపకం సర్వసాధారణము. అయితే నాటు కోళ్ళు తక్కువ కోడి గ్రుడ్లు పెడతాయి అలాగే తక్కువ మాంసం దిగుబడి ఇస్తాయి. అలాగే కుక్కలు, నక్కలు కోళ్ళని ఎత్తికొనిపోయి తినేయడం వలన ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక్కోసారి కోళ్ళని దొంగలించడం వలన కూడా నష్టం జరుగును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ ని ఈ క్రింద తెలియ చేసిన కొలతల ప్రకారము వ్యవసాయ పరిశోధన కేంద్రం, విజయనగరం వారు రూపొందించడం జరిగింది.

డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కొలతలు వివరములు :

  • పొడవు 87 అంగుళములు, వెడల్పు 46 అంగుళములు, మధ్యలో ఎత్తు 66 అంగుళములు, ఒక ప్రక్క ఎత్తు 42 అంగుళములు మరియు ఇంకో ప్రక్క ఎత్తు 54 అంగుళములు.
  • పైన రూఫ్ జింక్ షీట్, బాక్స్ చుట్టు మరియు బాక్స్ క్రింద కూడా జింక్ షీట్ తో తయారు చెయ్యడం జరిగింది.
  • డూప్లెక్స్ బాక్స్ లో క్రింద ఫ్రీగా తిరగడానికి రెండు రకాలైన జింక్ మెష్ లను వేయడం జరిగింది.
  • మిగిలిన రాడ్స్ అన్నీ ఇనుముతో తయారు చేయడము జరిగింది.
  • డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళు క్రింది నుండి బాక్స్ లోనికి వెళ్ళడానికి జింక్ మెస్ మెట్లు లాగ ఏర్పాటు చెయ్యడము జరిగింది.
  • డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ లోనికి కోడి పిల్లలు, మేత, నీరు పెట్టడానికి మరియు తీయడానికి చిన్న తలుపు ఏర్పాటు చెయ్యడం జరిగింది.
  • కోడిపిల్లలను మరియు కోళ్ళను ఎవరు తీయకుండా ఉండుటకు తాళం వేసుకొనే సదుపాయం ఏర్పాటు చెయ్యడం జరిగింది.
  • ఒక డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తయారీ చెయ్యడానికి సుమారుగా 25,000/- (ఇరువైదు వేలు) రూపాయలు అవుతుంది.
  • ఇలా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 16 చదరపు అడుగులు పైన బాక్స్ కోళ్ళు నిద్ర పోవుటకు మరియు గ్రుడ్లు పెట్టటకు ఉపయోగపడుతుంది. ఈ బాక్స్ లో రెండు అంగుళాలు లోతు ఏర్పాటు చేసి బెడ్డింగ్ మెటీరియల్ క్రింద వరి దాన్యం ఊకను రెండు అంగుళాలు నింపాలి.
  • ఇలా తయారీ చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో 32 చదరపు అడుగులు క్రింద బాక్స్ కోళ్ళు ఫ్రీగా తిరగడానికి, మేత టబ్బు, నీళ్ళ టబ్బు పెట్టడానికి ఉపయోగపడుతుంది. పైన తెలిపిన కొలతలతో తయారు అయన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో మొదట్లో 20-25 కోడిపిల్లలు పెంచుకోవచ్చు. పెద్దవైతే 15-20 కోళ్ళను సులువుగా పెంచుకోవచ్చు.
  • ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ కి తాళం వేసుకొని రైతు ఎక్కడికైనా వెళ్లి వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. రోజు ఉదయం మరియు సాయంత్రం కొద్దిగా మేత మరియు నీరు పెట్టుకుంటే సరిపోతుంది.

ఈ విధంగా తయారు చేసిన డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లని ఐ.సి.ఎ.ఆర్. – ఐ.ఐ.యఫ్.యస్.ఆర్. వారి ఆర్ధిక సహాయముతో తయారు చేసి ఉచితముగా సాలూరు మండలంలో గంగాన్నదొరవలస, మెట్టవలస గ్రామాలలో 18 మంది రైతులకు మరియు మక్కువ మండలంలో చిమిడివలస, ఎర్రసామంతులవలస గ్రామాలలో 18 మంది రైతులకు 2020-2021 సంవత్సరములో సరఫరా చేయడం జరిగినది. ఈ డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్ తో పాటు, ఒక మేత పెట్టే టబ్, ఒక నీళ్ళు పెట్టే టబ్ మరియు 10 ఆడ పిల్లలు, 5 మగ పిల్లలు ఇచ్చి పరిశీలించడం జరిగింది. ఇలా రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన టేబుల్లో తెలిపిన విధంగా కోళ్ళు, గ్రుడ్లు విషయములో చాలా లాభాలు నమోదు చెయ్యడం జరిగినది.

రైతులు డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో కోళ్ళ పెంపకం చేపట్టడము వలన 46.67 శాతం కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడటము గమనించడమైనది. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 1247 గ్రుడ్లు పెడితే, సాధారణంగా పెంచే కోళ్ళు 568 గ్రుడ్లను మాత్రమే పెట్టాయి. అలాగే డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో ఉన్న కోళ్ళు 52.50 కిలోలు మాంసం దిగుబడినిస్తే, సాధారణంగా పెంచే కోళ్ళు 22.40 కిలోలు మాంసం దిగుబడినిచ్చాయి. కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన సుమారుగా మొత్తం లాభం రూ. 21,985/- వచ్చింది. సాధారణంగా చేపట్టే కోళ్ళ పెంపకములో సుమారుగా మొత్తం లాభం రూ.9,560/- వచ్చింది. కావున కోళ్ళని డూప్లెక్స్ పౌల్ట్రీ యూనిట్లో పెంచడం వలన కోళ్ళను కుక్కలు, నక్కలు ఎత్తికెల్లి పోకుండా కాపాడుకోవడము కాకుండా అదనంగా 54.45 శాతం గ్రుడ్లు మరియు 57.33 శాతం మాంసం వచ్చినట్లు గమనించడమైనది.

డా.ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా.కె. లక్ష్మణ, ప్రధాన శాస్త్రవేత్త(విస్తరణ), డా.కే. తేజేశ్వర రావు, ప్రధాన శాస్త్రవేత్త(సస్యపోషణ), డా. టి.యస్.యస్.కే. పాత్రో, ప్రధాన శాస్త్రవేత్త(తెగుళ్ళు విభాగం)
ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ పరిశోధన స్థానం, విజయనగరం. మొబైల్ నెంబర్ : 9440123223

Read More

చేప అమైనో ఆమ్లాల ద్రావణం / చేప – బెల్లం ద్రావణం

చేప-బెల్లం ద్రావణంలో ఎన్నో రకాల ‘అమినో యాసిడ్’ లు ఉంటాయి. ఇవి పంటల యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయి.

కావలసిన పదార్థాలు: చేప వ్యర్థాలు : 1 కిలో (ఎముకలు, మొప్పలు, చర్మం మొ॥); బెల్లం : 1 కిలో

తయారు చేయు పద్ధతి (చోహాన్ క్యూ పద్ధతి):

  • ఒక కిలో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించిన చేపల వ్యర్థ పదార్థాలను, ఒక కిలో బెల్లం పొడిని తీసుకొని బాగా కలిపి ఒక కుండలో నిలువ చేయాలి.
  • కుండపై మూతపెట్టి 10-12 రోజుల పాటు ఆ మిశ్రమాన్ని పులియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ కర్రతో బాగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని 10-12 రోజుల తర్వాత వడపోసి, ఒక లీటరు మిశ్రమానికి 100 లీటర్ల నీటిని కలిపి (1 శాతం) ఒక ఎకరం పొలంలో పంటపై గానీ, పొలంలోని భూమిపైగానీ, కంపోస్టు గుట్టపైగానీ పిచికారీ చేయాలి.
    సూచనః
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలో, పండ్ల తోటలలో వాడవచ్చు.
  • ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే ఉపయోగించుకోవాలి. నిల్వ ఉంచరాదు.

రైతునేస్తం ప్రచురణ ‘స్వేద వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

తక్కువ ఖర్చుతో ఏడాది పొడవునా ఆకుకూరల సాగు

భారతీయ వ్యవసాయ రంగంలో నూతన ఒరవడులు సృష్టిస్తూ, మన రైతులు నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు తీస్తున్నారు.

మానవ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఆకుకూరలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. విటమిన్లు, ఖనిజ మూలకాలు, పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలను నిత్యం 125 గ్రాముల చొప్పున తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. కాగా, మార్కెట్లో వీటికి ఉన్న నిరంతర డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, సరైన యాజమాన్య పద్ధతులతో సాగు చేపడితే ఆకుకూరల ద్వారా రైతులకు గరిష్ట లాభాలు లభిస్తాయి.”

ఆకుకూరలు తక్కువ కాలంలో (20-30 రోజులు) మరియు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంటలు. తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర వంటివి నేరుగా విత్తనాలు చల్లి అన్ని కాలాల్లోనూ (వారానికి/పదిహేను రోజులకు ఒకసారి విత్తనాలు వేసుకోవడం ద్వారా) విజయవంతంగా సాగు చేయవచ్చు.

గోంగూర సాగు:
ఆకుకూరలన్నింటి కంటే గోంగూర రుచి ఎక్కువ. నీరు నిల్వ ఉండని తేలికపాటి గరప నేలలు, ఎర్ర నేలలు మరియు ఒండ్రు నేలలు గోంగూర సాగుకు చాలా అనుకూలం. ఇది ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు. ఏఎన్‌జిఆర్ఏయూ1 ఇది ఎర్ర గోంగూర రకం. విత్తనాలు నాటిన 30 నుండి 35 రోజులకే పంట కోతకు వస్తుంది. నీటి వసతి కలిగిన భూముల్లో ఒక ఎకరానికి దాదాపు 4 – 6 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పాలకూర:
పాలకూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. లేత ఆకులను కాండంతో సహా కూరగా వాడుతారు. ఇందులో అధికంగా విటమిన్ ‘ఎ’, ‘సి’, కాల్షియం మరియు ఇనుము వున్నవి. తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో మంచి లాభాలను అందించే ఆకుకూర. అన్ని రకాల నేలల్లో సాగుచేయవచ్చు. కాని ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో అధిక దిగుబడినిస్తుంది. ఆల్ గ్రీన్, పూస, అర్క, అనుపమ, రకాలు అనుకూలం. ఎకరానికి 10 – 12 కిలోల విత్తనం అవసరం. మడుల్లో సాలుకు 10 – 20 సెం.మీ దూరం నాటుకోవాలి. 25 – 30 రోజుల్లో కోతకు వస్తుంది. ఆల్‌గ్రీన్ రకం ఆకులు, కాడలు ఆకుపచ్చ రంగులో వుంటాయి. ప్రతి 15-20 రోజులకొక కోత తీసుకోవచ్చు. ఎకరాకు 6-7 కోతలకు 5 టన్నుల దిగుబడి నిస్తుంది.

తోటకూర: తోటకూరను సాగు చేయడానికి ఇసుకతో కూడిన గరప నేలలు అనుకూలంగా ఉంటాయి. వివిధ శీతోష్ణస్థితుల్లో పెంచేందుకు తోటకూర చాలా అనువైంది. నీరు నిలిచే బంకమట్టి, ఇసుక నేలలు దీనికి పనికిరావు. జూన్ నుండి అక్టోబర్ వరకు జనవరి నుండి మే నెల మధ్య విత్తనాలు వేయాలి. అర్క వర్ణ, కో-1, కో-2, కో-3, కో-4, అర్కా సుగుణ వంటి రకాలు ఎంపిక చేయవచ్చు. ఎకరాకు 1 కిలో విత్తనం సరిపోతుంది. విత్తనం వెదజల్లితే ఎకరాకు 2 కిలోల విత్తనం కావాలి. విత్తేటప్పుడు పది రెట్లు ఇసుక కలిపి చల్లాలి. విత్తిన 25 రోజులకు కోత మొదలవుతుంది. మొదటి కోత తర్వాత ప్రతి పది రోజులకు కోత తీయవచ్చు. దిగుబడి 4 నుండి 5 టన్నులు వస్తుంది.

బచ్చలికూర :
బచ్చలిని ఇండియన్ స్పినాచ్ లేదా మలబార్ స్పినాచ్ అని పిలుస్తారు. ఈ పంట భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగవుతోంది. బచ్చలి కూర అధిక మోతాదులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుమును సరఫరా చేస్తుంది. అంతేకాకుండా విటమిన్ ‘ఎ’, ‘సి’ లను కలిగి ఉంటుంది. లేత కాడలలో కూడా విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉంటుంది. బచ్చలి కూరను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. కాని అధిక దిగుబడి కోసం ఇసుకతో కూడిన గరప నేలలు చాలా అనుకూలమైనవి. ఎకరాకు 5 – 6 కిలోల విత్తనం అవసరం. వర్షాకాలంలో జూన్ నుండి జూలై వరకు నాటుకోవచ్చు. . దిగుబడి 4 నుండి 6 టన్నులు వస్తుంది.

చుక్క కూర:
చుక్కకూరలో సమృద్ధిగా ఉండే పీచు పదార్థాలు (ఫైబర్), తిన్న ఆహారం త్వరగా మరియు సులభంగా జీర్ణమవడానికి ఎంతగానో తోడ్పడతాయి. ఏడాది పొడవునా దీన్ని సాగు చేయవచ్చు. నల్లరేగడి భూములు అనుకూలం. ఎకరాకు 6-8 కిలోల విత్తనం అవసరం. విత్తిన నెల తర్వాత కోత కోయవచ్చు. పంటకాలం 3 నుండి 4 నెలలు 20 నుండి 30 – 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

కొత్తిమీర:
కొత్తిమీర ఆకులతో పాటు విత్తనాల (ధనియాలు) ఉత్పత్తి కొరకు సాగయ్యే కొత్తిమీర, వంటల్లో సువాసనను, రుచిని పెంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. పోషక విలువల పరంగా చూస్తే.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, సుగంధ తైలాలు, పీచు పదార్థాలు మరియు విటమిన్-కె, ఎ, సి వంటి కీలక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే విశేష గుణాలు ఉండటం వల్ల, దీనిని జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలకు ఔషధంగానే కాకుండా వివిధ ఆయుర్వేద చికిత్సల్లోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. కొత్తిమీరను దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే, వర్షాధార పంటగా పండించేటప్పుడు మాత్రం మురుగునీటి పారుదల సౌకర్యం ఉన్న బంక నేలలు అత్యంత శ్రేష్ఠమైనవి. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలు అవసరం. సురుచి, సుగుణ, సాధన, సింధు ముఖ్యమైన రకాలు అందుబాటులో ఉంటాయి. విత్తిన నెలకే కోతకు వస్తుంది. ఎకరాకు 15 నుండి 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది.

పుదీన:
పుదీనాను అటు ఆకుకూరగాను, ఇటు సుగంధ తైలం ఉత్పత్తి కొరకు విరివిగా సాగు చేస్తారు. మనదేశంలో జపనీస్ పుదీనాకు ఎక్కువ గిరాకీ ఉంది. దీని నుండి తీసే తైలాన్ని సుగంధ పాన్‌మసాలాల తయారీలోనే కాకుండా.. దగ్గు, జలుబు, నొప్పుల నివారణ ఔషధాలలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉష్ణ వాతావరణంలో బాగా పెరుగుతుంది. చలి, మంచు అనుకూలించవు. ఎర్రనేలలు మరియు నల్ల నేలలు అనుకూలం. జపాన్ పుదీన, కోసి, హిమాలయ, శివాలిక్ రకాలు అందుబాటులో ఉంటాయి. నాటిన నాలుగు నెలలకు కోత ఆరంభమవుతుంది. ఎకరానికి 12-16 టన్నులు దిగుబడి వస్తుంది.

మెంతి కూర:
దీనిని ఆకుకూరగాను, గింజలను పచ్చళ్ళలోను ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్య పంటల్లో ఇదోకటి. ఈ పంట సాగుకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రత మరియు తగినంత తేమ అనుకూలం. వర్షాధారం కింద నల్లరేగడి నేలల్లో, నీటి వసతి కింద గరపనేలలు, ఎర్రనేలలు మరియు ఇతర లేతపాటి నేలల్లో సాగుకు అనుకూలం. విత్తనాల్లో గుజరాత్ మెంతి-1 రకం అనువైనది. ఎకరాకు 6 నుండి 10 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తిన తర్వాత 25 నుండి 30 రోజుల్లో మొదటి కోత తీసుకోవచ్చు. పక్షం రోజులకొకసారి చొప్పున మూడు సార్లు కోత కోయవచ్చు. ఎకరానికి 4-5 టన్నులు దిగుబడి వస్తుంది.

బి. చంద్ర శేఖర్, నేల (మృత్తికా) శాస్త్ర అధ్యాపకులు, పీజీఐహెచ్ఎస్ (PGIHS), ములుగు, సిద్దిపేట,
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTGHU). Ph: 8374275258

Read More

భూమిలో సేంద్రియ కర్బనం పెంపుకు ‘రామబాణం’

విపరీతమైన రపాయనాల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం విపరీతంగా తగ్గిపోయింది. పత్తిపాటి రామయ్య బెంగుళూరు వైదిక విజ్ఞాన వర్సిటీలో పి.హెచ్.డి. చేసి “రామబాణం” అనే వ్యాసాన్ని ప్రచురించారు. అది 40 రోజుల ప్రోగ్రాం. చిత్తూరు జిల్లా రైతు మునిరత్నం నాయుడు రామబాణాన్ని తయారు చేసి తన భూమిలో వేసిన తర్వాత 0.5 ఉండే సేంద్రియ కర్బనం 0.75 కి పెరిగింది.

తయారు చేసే విధానం

  • మొదటి రోజు రెండున్నర కిలోల అల్లం, రెండున్నర లీటర్ల నీటితో కలిపి బాగా రుబ్బి ఒక కుండలో పోయాలి. పోసిన తరువాత గుడ్డతో కుండని కట్టాలి. కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి.
  • ఆరవ రోజు ఉదయం 4 కి. ఆవుపేడ, 4 లీ. నీటితో కలిపి కుండకి గుడ్డకట్టి గుంతలో పెట్టాలి.
  • మొదటి రోజు పూడ్చిన అల్లం ద్రావణం కుండను 6వ రోజు సాయంత్రం 4 గంటలకు గుంతనుండి బయటకు తీసి అల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 11వ రోజు సాయంత్రం 6వ రోజు గుంతలో ఉంచిన ఆవుపేడ ద్రావణాన్ని బయటకు తీసి 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 16వ రోజు 8 కి. బెల్లం 8 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. అదే రోజు 3 లీ. ఆవుమూత్రాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 21వ రోజు 21/4 కి. ముడి ఇంగువ 21/4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పెట్టి మట్టి కప్పాలి. 16వ రోజు గుంతలో పెట్టిన బెల్లం ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 26 వ రోజు 4 కి. శనగపిండి 4 లీ. నీటిలో కలిపి కుండను గుంతలో పాతిపెట్టి మట్టి కప్పాలి. 21వ రోజు గుంతలో పెట్టిన ఇంగువ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 31వ రోజు ఒకటిన్నర కిలోల ఆవుపెరుగు ఒకటిన్నర లీటర్ల నీటిలో కలిపి కుండను గుంతలో పాతి పెట్టి మట్టి కప్పాలి. 26వ రోజు పాతిపెట్టిన శనగ పిండిద్రావణాన్ని 200 లీ. నీటితో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • 36వ రోజున 31వ రోజున కుండలో ఉంచిన ఆవు పెరుగు ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి ఎకరం పొలంలోని భూమిపై పిచికారి చేయాలి.
  • అప్పటికి రామ బాణం ప్రయోగం పూర్తవుతుంది. తరువాత పొలాన్ని నాగలితో దున్నుకుని పైరు పెట్టుకుంటే సేంద్రియ కర్బనం 0.5 నుండి 0.75కి పెరిగి ఉంటుంది.
Read More

జంతువులలో గాలికుంటు వ్యాధిని పోలి ఉండే వ్యాధులు మరియు వాటి భేదాత్మక నిర్ధారణ

జంతువులలో కనిపించే అంటువ్యాధులలో గాలికుంటు వ్యాధి ఒక అత్యంత ప్రమాదకరమైన వైరల్ వ్యాధి. ఇది ముఖ్యంగా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులలో కనిపిస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు నోటిలో పుండ్లు, కాళ్ల వద్ద గాయాలు, జ్వరం మరియు ఆహారం తినకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే గాలికుంటు వ్యాధి లాంటి లక్షణాలు మరికొన్ని వ్యాధులలో కూడా కనిపిస్తాయి. అందువల్ల సరైన చికిత్స మరియు నియంత్రణ చర్యల కోసం భేదాత్మక నిర్ధారణ చాలా అవసరం.

ఒక నిర్దిష్ట వ్యాధి లేదా పరిస్థితిని, అదే విధమైన లక్షణాలు చూపించే ఇతర వ్యాధుల నుంచి వేరు చేసి గుర్తించడాన్నే భేద నిర్ధారణ లేదా భేదాత్మక నిర్ధారణ అంటారు. ఇందులో మొదట సంభావ్య వ్యాధుల జాబితా తయారు చేసి, తరువాత పరీక్షలు లేదా మూల్యాంకనాలు చేసి ఒక్కో అవకాశాన్ని తొలగిస్తూ చివరికి అత్యంత సంభావ్యమైన నిర్ధారణకు చేరుకుంటారు. జంతువులలో ఒకే విధమైన లక్షణాలు అనేక వ్యాధులలో కనిపిస్తాయి. ఉదాహరణకు గాలికుంటు వ్యాధి, వెసిక్యులర్ స్టొమటైటిస్, నీలినాలుక వ్యాధి వంటి వ్యాధులలో నోటిలో పుండ్లు మరియు కాళ్ల వద్ద గాయాలు కనిపించవచ్చు. అందువల్ల సరైన వ్యాధిని ఖచ్చితంగా గుర్తించడం చాలా అవసరం. 

సాధారణంగా భేదాత్మక నిర్ధారణ కోసం చరిత్ర తెలుసుకోవడం (అంటే ఇతర జంతువులకు వ్యాపించిందా, ఇటీవల కొత్త జంతువులు తీసుకొచ్చారా, టీకాలు వేయించారా), క్లినికల్ పరిశీలన (జంతువులో కనిపించే లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించడం) మరియు ప్రయోగశాల పరీక్షలు (ఎలైసా & పి.సి.ఆర్)  వంటి పద్ధతులను పాటిస్తారు.

భేదాత్మక నిర్ధారణ యొక్క ప్రాముఖ్యత

  • సరైన వ్యాధి గుర్తింపు – లక్షణాలు ఒకేలా ఉన్నా నిజమైన వ్యాధిని గుర్తించడంలో సహాయపడుతుంది.
  • సరైన చికిత్స అందించడం – వ్యాధిని సరిగ్గా గుర్తిస్తే తగిన మందులు మరియు చికిత్స ఇవ్వవచ్చు.
  • వ్యాధి వ్యాప్తి నియంత్రణ – అంటువ్యాధులను త్వరగా గుర్తించి ఇతర జంతువులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
  • ఆర్థిక నష్టాన్ని తగ్గించడం – పాల ఉత్పత్తి తగ్గడం, జంతువుల మరణాలు వంటి నష్టాలను తగ్గించవచ్చు. .
  • అనవసర చికిత్స నివారణ – తప్పు నిర్ధారణ వల్ల అవసరం లేని మందులు వాడకుండా ఉంటుంది.
  • టీకాలు మరియు నివారణ చర్యలకు సహాయం – సరైన వ్యాధి తెలిసిన తర్వాత తగిన టీకాలు మరియు నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు.
  • పశుసంపద రక్షణ – రైతుల పశుసంపదను ఆరోగ్యంగా కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
  • ప్రయోగశాల పరీక్షల అవసరాన్ని నిర్ణయించడం – ఏ పరీక్షలు చేయాలో నిర్ణయించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాసంలో గాలికుంటు వ్యాధిలో ఉండే లక్షణాలు ఏంటి మరియు దానిని పోలిఉండే ఇతర వ్యాధులు, వాటి లక్షణాలు, సరైన వ్యాధిని గుర్తించడం ఎలా అనే వాటి గురించి తెలుసుకుందాము.

గాలికుంటు వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు

  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు మరియు బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల గిట్టల వద్ద పుండ్లు
  • ఎక్కువగా లాలాజలం కారడం
  • కుంటుతూ నడవడం
  • పాల ఉత్పత్తి తగ్గడం వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు పందులు
    గాలికుంటు వ్యాధి ని పోలిఉండే ఇతర వ్యాధులు:
  1. వెసిక్యులర్ స్టొమటైటిస్:
    కారణం : రేబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్ వల్ల వచ్చే వ్యాధి.

లక్షణాలు

  • నోటిలో బుడగలు
  • నాలుకపై గాయాలు
  • కాళ్ల వద్ద పుండ్లు
  • అధిక లాలాజలం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – ఇది ముఖ్యంగా గుర్రాలలో కూడా కనిపిస్తుంది, కానీ గాలికుంటు వ్యాధి గుర్రాలలో సాధారణంగా రాదు.
  1. బోవైన్ వైరల్ డయేరియా:
    కారణం – ఫ్లేవి విరిడే కుటుంబానికి చెందిన పెస్టి వైరస్ వల్ల వచ్చే వ్యాధి

లక్షణాలు

  • నోటిలో గాయాలు
  • విరేచనాలు
  • బలహీనత
  • జ్వరం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గుర్రాలు, ఆవులు, పందులు, గొర్రెలు, మేకలు మరియు అడవి జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద బుడగలు సాధారణంగా ఉండవు మరియు విరేచనాలు ఎక్కువగా కనిపిస్తాయి.
  1. రిండర్పెస్ట్ పశువుల్లో పారుడు వ్యాధి:
    కారణం – పేరామిక్సో విరిడే కుటుంబానికి చెందిన మోర్బిలి వైరస్.
    లక్షణాలు
  • అధిక జ్వరం
  • నోటిలో పుండ్లు
  • విరేచనాలు
  • నీరసం
    వ్యాధికి గురయ్యే జంతువులు ఆవులు, గేదెలు
    గాలికుంటు వ్యాధితో తేడా – తీవ్రమైన విరేచనాలు ప్రధాన లక్షణం. కాళ్ల గాయాలు తక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి ఇండియాలో అధికారికంగా నిర్మూలించబడింది.
  1. నీలినాలుక వ్యాధి :
    కారణం – రియో విరిడే కుటుంబానికి చెందిన ఆర్బి వైరస్
    లక్షణాలు
  • నోటి వాపు
  • నాలుక నీలం రంగులో మారడం
  • జ్వరం
  • కుంటడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – గొర్రెలు, మేకలు, ఆవులు మరియు జింకలు
    గాలికుంటు వ్యాధితో తేడా – గొర్రెలలో ఎక్కువగా కనిపిస్తుంది మరియు మరియునాలుక నీలం రంగులో ఉండటం ప్రత్యేక లక్షణం.
  1. కాంటాక్ట్ డెర్మటైటిస్:
    కారణం – రసాయనాలు లేదా విషపదార్థాల వల్ల చర్మం దెబ్బతినడం.
    లక్షణాలు
  • కాళ్ల వద్ద గాయాలు
  • చర్మ వాపు
  • నడవడంలో ఇబ్బంది
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఏ జంతువైనా రసాయనాలు మరియు విషపూరిత పదార్థాలను తాకడం లేదా తినడం వల్ల
    గాలికుంటు వ్యాధితో తేడా – నోటిలో పుండ్లు ఉండవు. ఇది అంటువ్యాధి కాదు.
  1. ఫుట్ రాట్:
    కారణం – ఫ్యూజోబ్యాక్టీరియం నెక్రోఫోరం మరియు డైకిలోబ్యాక్టార్ నొడోసస్ వంటి బ్యాక్టీరియా.
    లక్షణాలు:
  • కాళ్లలో వాపు
  • నడవడంలో ఇబ్బంది లేదా కుంటడం
  • గిట్టల మధ్య దుర్వాసనతో కూడిన పుండ్లు
  • తీవ్రమైన నొప్పి మరియు ఇన్ఫెక్షన్
    వ్యాధికి గురయ్యే జంతువులు: గొర్రెలు, మేకలు, పశువులు మరియు ఇతర గిట్టలున్న జంతువులు
    గాలికుంటు వ్యాధితో తేడా – గాలికుంటు వ్యాధి వల్ల నోటిలో మరియు గిట్టలపై బొబ్బలు ఏర్పడతాయి. కాగా ఫుట్రాట్ ప్రధానంగా గిట్టల ప్రాంతానికే పరిమితమై, కుంటడం మరియు గిట్టలు దెబ్బతినడం కలిగిస్తుంది, గిట్టల మధ్య భాగంలో దుర్వాసనతో కూడిన కుళ్లిన కణజాలాన్ని కలిగిస్తుంది. ఇందులో సాధారణంగా నోటిలో పుండ్లు కనిపించవు.
  1. మౌత్ రాట్:
    కారణం – అవకాశవాద బ్యాక్టీరియా లైన ఏరోమోనాస్, సూడోమోనాస్ మరియు సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా
    లక్షణాలు
  • నోటిలో దుర్వాసన
  • పుండ్లు
  • తినకపోవడం
    వ్యాధికి గురయ్యే జంతువులు – ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పక్షులు మరియు వేరే ఏ జంతువైనా పైన పేర్కొన్న బ్యాక్టీరియా సోకినప్పుడు
    గాలికుంటు వ్యాధితో తేడా – కాళ్ల వద్ద గాయాలు ఉండవు. ప్రధానంగా నోటిలోనే సమస్య ఉంటుంది.

ముగింపు
గాలికుంటు వ్యాధిని పోలి కనిపించే అనేక వ్యాధులు జంతువులలో కనిపిస్తాయి. భేద నిర్ధారణ అనేది పశువైద్యంలో చాలా ముఖ్యమైన ప్రక్రియ. సరైన భేద నిర్ధారణ లేకపోతే తప్పు చికిత్స జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల క్లినికల్ లక్షణాలు, ప్రయోగశాల పరీక్షలు మరియు జంతువు చరిత్ర ఆధారంగా ఖచ్చితమైన నిర్ధారణ చేయాలి. రైతులు మరియు పశువైద్యులు అప్రమత్తంగా ఉండి సమయానికి చర్యలు తీసుకుంటే పశుసంపదను రక్షించవచ్చు. దీని ద్వారా జంతువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థిక రక్షణ లభిస్తుంది.

డా.తనూజ నాదెళ్ళ, సహాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ గాలికుంటు వ్యాధి సహకార కేంద్రం, వి.బి.ఆర్.ఐ., విజయవాడ. ఫోన్: 9121000747

Read More

తులసి – కలబంద ద్రావణం

తులసి కలబంద ద్రావణం శక్తివంతమైన ద్రావణ ఎరువేకాకుండా బ్యాక్టీరియా, వైరస్ నిరోధకంగా పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలిక కూడా. మన పొలంలోనే లభించే తులసి ఆకులు మూడు నాలుగు కిలోలు, కలబంద మూడు నాలుగు కిలోలు సేకిరించి చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని ఒక తొట్టెలో లేదా డ్రమ్ములో వేసి దానికి పది కిలోల కోళ్ల ఎరువు, పది కిలోల పేడ, పదిలీటర్ల మూత్రం కలపాలి. ఈ విశ్రమానికి ఒక కిలో బెల్లం చేర్చాలి. రోజూ కలుపుతూ పోతే వారం రోజుల్లో తులసి, కలబంద నీటిలో పూర్తిగా కలిసి ద్రావణంగా మారుతుంది. దీన్ని పైరుకు పైపాటుగా పిచికారి చేయడంతో పాటు నేల తడిలో కలిపి కూడా ఇవ్వవచ్చు. పై పాటు పిచికారికి లీటరుకు 50 మిల్లీ లీటర్ల ద్రావణం కలుపుకోవాలి. ఈ ద్రావణం శక్తివంతమైన ద్రవ ఎరువే కాకుండా శిలీంద్ర, బ్యాక్టిరియా, వైరల్ సమస్యలను అడ్డుకుంటుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ స్వేద వేదం ’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

బహుళ ప్రయోజనాలుగల ఔషధ మొక్క…. ఉల్లి

ఉల్లి ఒక ఏకదళ, ద్వైవార్షిక లేదా బహువార్షిక మొక్క అయినప్పటికీ, సాధారణంగా దీనిని ఏకవార్షిక మొక్కగా సాగు చేస్తారు. ఉల్లి మొక్క అనేక గొట్టంలాంటి నీలిఆకుపచ్చ రంగు నుండి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. మొక్క క్రింది భాగం చిన్న గడ్డ కలిగి ఉండి ఊరిన తర్వాత ఉల్లిగడ్డగా మారుతుంది. గడ్డలు కురచబడిన, భూమిలోపల అణచబడిన కాండముల చుట్టూ మెత్తని మార్పు చెందిన పొలుసులు (ఆకులు) కాండం చివర మధ్యలో ఉన్న మొగ్గను కప్పి ఉంచుతాయి. వసంతకాలంలో ఆకులు ఎండి చనిపోయి గడ్డ పైపొరలు ఎండి పెళుసుగా మారతాయి. ఉల్లి ప్రతి సంవత్సరం గడ్డలను, రెండు సంవత్సరాలకొకసారి గింజలను ఉత్పత్తి చేస్తుంది. పూలకాడ గట్టిగా, గొట్టంలా ఉండి మైనపు పొరతో 1 మీ. ఎత్తు పెరుగుతుంది. పూగుచ్ఛం గొడుగు ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. పూలు తెల్లని రంగులో ఉంటాయి. కాయ ఒక కాప్సూల్. పునరుత్పత్తి విత్తనాల ద్వారా జరుగుతుంది.

సాధారణ నామం: ఆనియన్ శాస్త్రీయ నామం: అల్లియంసెపా కుటుంబం: అమారిల్లిడేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • ఉల్లి కాడలు, గడ్డలు, గింజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
  • ఉల్లి యాంటి ఆక్సిడెంట్, రోగనిరోధకశక్తి, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉండి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఉల్లిని ఊబకాయం కలిగి ఉన్న వారికి బరువు తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు.ఆహారంగా ఉల్లి శరీరానికి అనేక పోషకాలనందిస్తుంది.
  • ఔషధంగా ఉల్లి అధిక కొలెస్టరాల్, మధుమేహం, కీళ్ళ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఆకలి మందగించడం, అధిక రక్తపోటు, గొంతు నొప్పి, ఆస్త్మా, బ్రోంకైటిస్, దగ్గు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో నులిపురుగుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • ఉల్లిలో కీంప్‌ఫెరాల్, మిరిస్టిన్, క్వెర్సెటిన్, క్వెర్సిట్రిన్, అల్లెåల్‌సల్ఫైడ్ అనే రసాయనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్. ఇది మంచి యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకొక ముఖ్య రసాయనం, అల్లెåల్ సల్ఫైడ్, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉంటుంది.
  • ఉల్లి యాంటి ఆక్సిడెంట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటికొలెస్టరాల్, యాంటీహైపర్ సెన్సిటివ్, యాంటిక్యాన్సర్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిబాక్టీరియల్ లేదా యాంటిబయాటిక్, బ్రాంకోడైలేటర్, ఎక్స్‌పెక్టొరెంట్, యాంటిస్పాస్మోడిక్, యాంటిసెప్టిక్, కార్మినేటల్, పైబ్రినోలైటిక్, యాంథెల్మిటిక్, యాంటికోయాగ్యులెంట్ ఔషధ గుణాలు కలిగి ఉంది.
  • ఉల్లి శరీరంపై మచ్చలు తొలగించడానికి, కాల్పులు, గాయాలు, కేశనష్టం, మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, ఆస్త్మా, సాధారణ జలుబు, పొడి దగ్గు, గొంతునొప్పి, బ్రాంక్రైటిస్, ఆకలి లేకపోవడం, కడుపులో కలవరం, కంటిచూపు, శుక్లాలు, గుండెనొప్పి వంటి సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.

వ్యవసాయరంగంలో …

  • క్యాబేజి పంటలో ఉల్లి, వెల్లుల్లి పంటలను పురుగు నివారణ అంతర పంటలుగా సాగు చేస్తారు. ఈ అంతర పంటలు అల్లిసిన్ ఉత్పత్తి ద్వారా పురుగులను వికర్షిస్తాయి. వీటి వేర్ల నుండి స్రవించే ద్రవాలు వాటి వాసన ద్వారా పురుగులను వికర్షిస్తాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి క్షేత్రంలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా లార్వాలు, ప్యూపాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతర పంటలు సాగు చేసిన క్యాబేజి క్షేత్రంలో అధిక సంఖ్యలో క్యాబేజి మొక్కలు బతికి ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి యాంటిఫీడెంట్ చర్య ద్వారా ఆకుతినే పురుగులను పారదోలాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి పంటలో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. సన్న, చిన్న కారు రైతులు క్యాబేజిలో ఉల్లి, వెల్లుల్లిలను అంతర పంటలుగా సాగు చేసి అధిక దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని ఫలితాలు వెల్లడించాయి (దేబ్ర అండ్ మిషెక్, 2014).
  • పైన్ మొక్కల మీద అల్లం, వెల్లుల్లి ద్రావణాలను పిచికారి చేసి మిడతలను వికర్షింపజేశారు. మిడతలు అల్లం, వెల్లుల్లి ద్రావణాల వాసనను అసహ్యించుకుని దూరంగా పారిపోయాయి.
  • ఉల్లి, వెల్లుల్లి, అల్లం ద్రావణాలు ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదల నరికట్టాయి. అందువలన వీటిని సహజ శిలీంద్ర నాశినులుగా ఉపయోగించవచ్చు. (ముడ్యివ, అతని అనుచరులు, 2016).
  • ఉల్లి ద్రావణం నుండి తయారు చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లాన్యుమోనియే, ఎస్కరిచియాకోలి, బాసిల్లస్ ఎంటరోబాక్టర్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ (శిలీంద్రాలు)లపై గణనీయమైన యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (బాలమణికందన్, అతని అనుచరులు, 2015).
  • ఉల్లిగడ్డను సన్నగా తరిగి రెండు చెంచాల నూనెలో ఒక రోజు నానబెట్టాలి. తర్వాతి -ఒక అర లీటరు సబ్బు నీటిలో కలిపి వడపోయాలి. ఈ ద్రావణాన్ని 1:20 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • నివారించబడే తెగుళ్ళు : సెర్కోస్పొరా ఆకుబూజు, ఆకుమచ్చ, ఎర్లీబ్లెåట్, కప్పకన్ను తెగులు, కొల్లెటోట్రైకం ఆకుమచ్చ, ఆంత్రాక్నోస్, కాయకుళ్ళు, స్మడ్ౙి, కర్వులేరియా ఆకుమచ్చ, ఆకుమాడు
  • ఎరుపు రంగు పొరలున్న ఉల్లిపాయలలో కెటచాల్ అనే ఫినాలిక్ కాంపౌండ్ స్మడ్ౙి తెగులు కలిగించే శిలీంద్రం, కొల్లెటోట్రైకం సిర్సినాన్స్, సోకకుండా వ్యాది నిరోధక శక్తిని సమకూరుస్తుంది (లింక్ అండ్ వాకర్, 1933).
  • ఉల్లి బోట్రైటిస్ సినరియా ఆశించినపుడు సైక్లోపెంటోన్‌క్లాస్‌కి చెందిన సిబ్యులిన్స్ అనే ఫైటోఎలక్సిన్‌ని ఉత్పత్తి చేసి శిలీంద్రబీజం మొలకెత్తడాన్ని, జెర్మ్‌ట్యూబ్ పెరగడాన్ని అరికడుతుంది (డిమత్రీన్, అతని అనుచరులు, 1990).
  • కంద దుంప నిల్వ సమయంలో ఆశించే మాత్ డాసిసెస్ రుగోసెల్లాని మిరప (కాప్సికం యాన్యువమ్, కాప్సికం ఫ్రూటెసెన్స్) పొడులు అతి సమర్ధవంతంగా 24 గంటలలోపే 100% మాత్ పురుగులను చంపాయి. సిడియంగ్వినీన్స్, ఉల్లి, వెల్లుల్లి పొడులనుపయోగించిన 3 రోజులలో సమర్దవంతంగా నివారించాయి (అషామొ, 2010).
  • ఉల్లిని అన్ని పురుగుల (పిండినల్లితో సహా)ను సమర్ధవంతంగా అరికట్టి, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, దిగుబడులను అదికం చేసే గోమూత్ర జంతునాశక ద్రావణం తయారీలో ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్థానికంగా లభిస్తాయి. దీని తయారీ విధానం సులభం. అంతేగాక ఇది పర్యావరణహిత పద్దతి. కూరగాయల పంటలలో దీనినుపయోగిస్తే కూరగాయల రుచి, వాసన పెరుగుతాయి.
  • ఉల్లిలో ఉండే ఆల్కలాయిడ్లు చాలా రకాల తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడతాయి. ఉల్లి కషాయం వ్యాదికారకాల పెరుగుదలను నిలిపివేయడంలోను, తెగులు కారకాల బీజాలు మొలకెత్తడాన్ని నియంత్రించడంలోను ఉపయోగపడుతుంది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… చెంగల్వకోష్టం

ఐలాంతస్ ఒక ఆకులు రాల్చే వేగంగా పెరిగే చెట్టు. పెద్ద చెట్లు 80 అడుగుల ఎత్తు పెరుగుతాయి. ఇది నున్నని కాండం, పాలిపోయిన బూడిద రంగుబెెరడు కలిగి ఉంటుంది. కాడలు లేత చెస్ట్‌నట్ గోధుమ రంగులో వుంటాయి. పెద్ద కాంపౌండ్ ఆకులు 1-4 అడుగుల పొడవుండి, ఒక దాని తర్వాత ఒకటి ఏర్పడుతుంది. ప్రతి పెద్ద ఆకు 10-41 చిన్న అకులు కలిగి వుంటుంది. ప్రతి చిన్న ఆకు అడుగు అంచున ఎక్కువ గ్రంథులు గల పళ్ళను కలిగి ఉంటుంది. ఆకుల అంచులు పూర్తిగా పళ్ళు లేకుండా ఉంటాయి. ఐలాంతస్‌లో మగ, ఆడ పూలు వేర్వేరు చెట్లలో ఏర్పడతాయి. పూలు పెద్ద గుత్తులలో ఏర్పడతాయి. పూలు చిన్నవిగా, పాలిపోయిన పసుపు నుండి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. బల్లపరుపు, మెలి తిరిగిన రెక్కలున్న కాయలు ఆడ చెట్లపై ఏర్పడతాయి ప్రతి కాయ ఒకే గింజను కలిగి ఉంటుంది. ఇవి చెట్లపై చాలా కాలముంటాయి. కొయ్య మొత్తగా, బలహీనంగా, క్రీంతో కూడిన తెలుపు నుండి లేత గోధుమ రంగులో ఉంటుంది. చెట్టు అన్ని భాగాలు ప్రత్యేకంగా ఆకులు, పూలు కాల్చిన గింజ వాసన కలిగి ఉంటాయి.

సాధారణ నామం : ఐలాంతస్ / గ్రీఆఫ్ హోవెన్ శాస్త్రీయ నామం : ఐలాంతస్ ఆల్టిస్సిమ కుటుంబం: సీమరూబేసి

ఉపయోగాలు : ఔషధ రంగంలో ….

  • కాండం, వేరు ఎండిన బెరడుని ఔషధంగా ఉపయోగిస్తారు. ఐలాంతస్ చెట్టుని డయేరియా, ఆస్త్మా, మూర్ఛ రోగం, పోట్లు, వేగంగా గుండె కొట్టుకోవడం, గనోరియా, మలేరియా, టేప్ వర్మ్స్ చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని టానిక్‌గా కూడా ఉపయోగిస్తారు.
  • చైనాలో ఈచెట్టు బెరడుని డిసెంట్రి, ఇతర కడుపులో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఈ హెర్బల్ ద్రావణాన్ని త్రాగటం వలన 82 డిసెంట్రిరోగులలో 81 మందిలో డిసెంట్రి నివారించబడింది.
  • వేరు బెరడు టింక్ౘ్రుని కార్డియక్ పాల్పిటేషన్స్, ఆస్త్మా, మూర్ఛరోగం నివారణలో విజయవంతంగా ఉపయోగిస్తారు. ఆకులు, కాండం బెరడు, వేర్లను అల్సర్లు, దురదల చికిత్సలకు ఉపయోగిస్తారు. కొరియాలో వేరు బెరడుని దగ్గు, గ్యాస్ట్రిక్, ప్రేవులలో సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు.కాయలను డిసెంట్రి చికిత్సలో ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • ఐలాంతస్ నుండి తయారు చేసిన ద్రావణాలు అకారిసైడల్ చర్యలను కలిగి వుండి టెట్రానికస్ టెలోరియస్‌ని సమర్థవంతంగా చంపాయి (కోవ్‌టనెంకో, అతని అనుచరులు)
  • ఐలాంతస్ వేరు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ బఠాణి పంటనాశించే పేనుబంక, అనిర్టోనిఫాస్ పైసంని అత్యధికంగా చంపింది (డిఫియో, అతని అనుచరులు, 2009)
  • ఐలాంతస్ ఆకు ద్రావణం నుండి వేరుచేసిన ఐలాంతోన్ హెర్బిసైడల్ చర్యను ప్రదర్శించి ఆల్ఫాల్సా (మెడికాగోసటైన) విత్తనాలను మొలకెత్తకుండా చేసింది. భవిష్యత్తులో ఐలాంతోస్‌ని ఒక సహజ ఉత్పత్తి కలుపుమందుగా ఉపయోగించవచ్చు. (బార్బారాస్లాడోంజ, అతని అనుచరులు, 2014).
  • ఐలాంతస్ ద్రావణం నుండి వేరు చేసిన క్వాసినాయిడ్స్ (అలియాంతోన్, చపార్రినోన్, గ్లాకారూబినోన్, 13 (18) డిహైడ్రోగ్లాకారూబినోస్, షినుజాలాక్టోన్ హెచ్ స్పోడోప్టెరా లిట్టొరాలిస్‌పై తీవ్ర విషప్రభావం, ఆహారాన్ని తీసుకోవడాన్ని అరికట్టడం ద్వారా అధిక సమర్ధవంతంగా చంపాయి. ఐలాంతస్ ఆకుల మిథనాల్ ద్రావణాలను సీతాకోకచిలుక జాతుల లార్వాలను నివారించే వృక్షసంబంధ పురుగుమందులను వృద్ధి చేయడానికి ఉపయోగించవచ్చని ఫలితాలు వెల్లడించాయి (పవేల, అతని అనుచరులు, 2014).
  • ఐలాంతస్ క్యూలెక్స్ క్వింక్విఫాసియేటస్‌పై లార్విసైడల్ ప్రభావాన్ని చూపింది. (పవేల, 2009, జేబ్రి అండ్ బాలియోఅమర్, 2014). ఐలాంతస్ బెరడు నూనె ట్రైబోలియం కాస్టానియం, ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజే, లైపోసెలిస్ పీట పెద్ద పురుగులను గణనీయంగా వికర్షించింది.
  • ఐలాంతస్ బెరడు నూనె సైటోఫిలస్ ఒరైజెపై బలమైన స్పర్శ, విషపూరిత చర్యను కూడా ప్రదర్శించింది. అంతేగాక, ఐలాంతస్ బెరడునూనె ఒరైజీఫిలస్ సురినామెన్సిస్, సైటోఫిలస్ ఒరైజెలపై ఫ్యూమిగెంట్ చర్యను కూడా ప్రదర్శించింది (లు అండ్ ఉ, 2009).
  • ఐలాంతస్ ముదిరిన చెట్లు ఒకటి లేదా ఎక్కువ విత్తనాలు మొలకెత్తడం, మొక్కలు పెరగడాన్ని అరికట్టే శక్తివంతమైన కాంపౌండ్స్‌ని ఉత్పత్తి చేస్తాయి. అరికట్టే చర్య వేర్ల బెరడులో ఎక్కువగాను, ఆకులలో మధ్యమంగాను, కొయ్యలో తక్కువగాను ఉంటుంది. వేరు బెరడులోని అరికట్టే పదార్థాలు మొక్కలు మొలవక ముందు, మొలచిన తర్వాత పిచికారి చేసినపుడు బలమైన హెర్బిసైడల్ ప్రభావాలను చూపాయి. మొక్కలు మొలిచిన తర్వాత పిచికారి చేస్తే ప్రభావాలు గణనీయంగా ఉంటాయి. ఐలాంతస్‌లోని అల్లెలో కెమికల్స్ శక్తివంతమైన సహజ ఉత్పత్తి కలుపు మందులను అభివృద్ధి చేయగల సామర్థ్యమున్నవని ఫలితాలు వెల్లడించాయి (హెల్సె, 1990)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

పశుపోషణలో మునగ ప్రాముఖ్యత

మన దేశంలో ప్రాచీనకాలం నుండి ప్రకృతిలో సహజంగా లభించే అనేక రకాలయిన చెట్లకు, వాటి ఆకులు, కాయలు, వేర్లు మరియు ఇతర భాగాలకు వైద్యపరంగా చాలా ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కొన్ని రకాల మొక్కలకు ప్రత్యేక ఔషధ గుణాలు ఉండట, మరికొన్ని రకాల మొక్కల్లో మాంసకృత్తులు, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో ఉండటం వలన వీటి వినియోగం ఇటు మానవ మనుగడలోనే గాక, అటు పశువైద్యంలో కూడా గణనీయంగా పెరిగింది. నేటి కాలంలో పూల మొక్కల నుండి అటవీ వృక్షాల వరకు, వాటిలో ఉండే ఔషధ విలువలు మరియు ఆరోగ్యానికి అవి చేసే మేలు, వాటి ఇతర భాగాల్లో ఇమిడి ఉండే పోషక పదార్థాల గురించి అన్ని కోణాల్లో అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలు ఉన్న మొక్క ‘మునగ’. ‘పోషకాల గని’గా పేరొందిన మునగ అటు మానవ మనుగడలోనేగాక, పశుపోషణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మునగ చెట్టు యొక్క ఆకులు, కాయలు, విత్తనాలు మరియు ఇతర భాగాల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు మరియు విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి.

మునగ సాగు – వివరాలు:
మునగ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. జులై మొదటి వారం నుండి అక్టోబర్, చివరి వారం వరకు మునగను విత్తుకోవచ్చు. పి.కే.యం-1, పి.కే.యం.2 వంటి రకాలను పెంచుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుంది. కావున పశువుల మేతకు ఈ రకాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మునగ ఏపుగా పెరుగుతుంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువగా పెరగకపోవచ్చు. కావున దిగుబడి అధికంగా ఉన్నప్పుడు మునగ ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని ఎండాకాలంలో ఇతర ప్రశుగ్రాసాలతో కలిపి ఇవ్వవచ్చు.
ప్రత్యేకంగా పశుగ్రాసం కోసం మాత్రమే మునగను సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మునగ విత్తనాలను సాళ్ళల్లో 3-5 సెం.మీ. లోతులో నాటుకోవాలి. రెండు సాళ్ల మధ్య దూరం 30 సెం.మీ. మరియు రెండు మొక్కల మధ్య దూరం 20 సెం.మీ. ఉండేవిధంగా చూసుకోవాలి. ఈ విధానంలో ఎకరాకు 25-35 కిలోల విత్తనం సరిపోతుంది. నాటిన రెండు వారాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలు ఎక్కువగా లేనప్పుడు మునగ కొమ్మలను కత్తిరించి కూడా నాటుకోవచ్చు. నాటిన తరువాత 3 నెలలకు మొదటి కోతను తీసుకోవచ్చు.

పోషక విలువలు:
పచ్చి మునగ ఆకుల్లో 16% మాంసకృత్తులు, 18% పీచుపదార్థాలు ఉంటాయి. ఎండిన ఆకులు లేదా పొడిలో 28% వరకు మాంసకృత్తులు, 15% పీచు పదార్థాలు, 3.65% కాల్షియం, 0.3% ఫాస్ఫరస్, 0.5% మెగ్నీషియం, 1.5% పొటాషియం, 8.25% కాపర్ ఉంటాయి. అంతేగాక జింక్, మాంగనీస్, ఐరన్ వంటి మూలకాలు అధిక మోతాదులో ఉంటాయి. పచ్చి మునగ ఆకుల్లో కొద్ది మొత్తంలో ‘సపోనిన’ అనే పదార్థాలు ఉండటం వల్ల కొద్దిగా చేదుగా ఉంటాయి. పచ్చి మునగ ఆకులను పాడి పశువులకు ప్రతీరోజు 5-10 కిలోల వరకు, దూడలకు 1-2 కిలోల వరకు ఇవ్వవచ్చు. ఎండిన మునగ ఆకులను లేదా మునగ పొడిని పాడి పశువులకు రోజుకు 200 గ్రాముల వరకు మరియు దూడలకు 50 గ్రాముల వరకు ఇవ్వవచ్చు.

ప్రయోజనాలు:

  • పశులు జీర్ణవ్యవస్థలో మీథేన్ అనే గ్యాస్ వెలువడుతుంది. పశువుల కడుపులో ఉండే మిథనోజెనిర్ బ్యాక్టీరియా ఈ గ్యాస్‌ని విడుదల చేస్తాయి. ఈ మీథేన్ గ్యాస్ పరిమాణం అనేది పశువులు తీసుకునే ఆహారాన్ని బట్టి విడుదలవుతుంది. పశువుల మేతలో మునగ ఆకును లేదా పొడిని ఇచ్చినట్లయితే ఈ బ్యాక్టీరియా సంఖ్య తగ్గి మీథేన్ గ్యాస్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల వాతావరణంలో కొంతమేర మీథేన్ గ్యాస్ విడుదల తగ్గి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
  • పాడి పశువుల్లో పాల దిగుబడి పెరగడమే కాకుండా, పాలల్లో వెన్నశాతం పెరుగుతుంది.
  • పశువులు, దూడల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పాడిపశువులు ఈనిని తరువాత మళ్ళీ త్వరగా ఎదకు రావడం మరియు చూడికట్టడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • కాల్షియం అధికంగా ఉండటం వలన ఎదిగే దూడల్లో ఎముకలు పటిష్టంగా తయారవుతాయి.
  • అనేక పోషకాలు ఉండటం వల్ల పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు రాకుండా ఉంటాయి.

డా.డి. వెంకటేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశుగణ సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల, ఫోన్: 9951534076

Read More