పాలకల్తీ గుర్తింపు, నివారణ

ఒకప్పుడు పసిపాపలు, రోగులు, వృద్ధులకు అవసరమైన పాలను కల్తీచేయుట మహాపాపమని మన పూర్వీకులు భావించేవారు. కానీ సమాజంలో స్వార్థము, ధనకాంక్ష పెరిగి నైతిక విలువలు క్షీణిస్తున్నకొద్దీ ప్రజల నిత్యావసరమైన పాలను నీరు మరియు వివిధ ఇతర పదార్థాలు, రసాయనాలను కలిపి కల్తీ చేసి విక్రయించే వాణిజ్య విషసంస్కృతి పెరిగిపోతూ ఉంది. వివిధ రకాల కల్తీలను వ్యాపారులు కనిపెడ్తూవుండగా, వాటిని కనుగొని, గుర్తించి నియంత్రించే సాంకేతిక విధానాలను కూడా మన శాస్త్రజ్ఞులు ఆవిష్కరిస్తూనే ఉన్నారు. పాలలోని విలువైన పోషక ఘనపదార్థాలైన వెన్న, వెన్నకాని పదార్థాలను వివిధ మార్గాల ద్వారా తొలగించి, పాల విలువను, నాణ్యతను తగ్గించుట కూడా కల్తీ క్రిందనే భావించబడ్తుంది. అముల్‌, విజయ, విశాఖ వంటి పేరెన్నికగన్న బ్రాండ్ల పాలు, పాల పదార్థాలకు నకిలీ బ్రాండ్లు తయారు చేసి మార్కెట్లో విక్రయించుట ద్వారా ట్రేడ్‌ మార్క్‌ చట్టానికి సైతం తూట్లు పొడుస్తున్న నకిలీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపవలసిన ప్రభుత్వం ఆశించిన స్థాయిలో తనవంతు పాత్రను నిర్వహించకపోవుట దురదృష్టకరము.

పాల కల్తీ వల్ల ముప్పు – ఎలా?

1. వినియోగదారుడు కొనుగోలు చేసిన పాలలో ఉండవలసిన పరిమాణంలో పోషక నపదార్థాలు తగ్గిపోవుట వల్ల ఆర్థికపరమైన నష్టము

2. పాల మీద ఆధారపడే పసిపిల్లలు, వృద్ధులు, రోగులకు అందవలసిన స్థాయిలో పోషకాలు అందనందువల్ల ఎదురయ్యే పోషకాహార లోపాలు

3. అనేక అంటురోగక్రిములు కలిగిన మురుగు-అశుభ్రమైన నీటితో కలుషితమైన నీటితో కల్తీ చేయబడిన పాలు మరియు సీసము, నైట్రేట్‌, మెర్క్యూరీ వంటి పారిశ్రామిక వ్యర్థాలను కలిగిన నీటితో కల్తీ చేయబడిన పాలమీద దీర్ఘకాలం ఆధారపడే వినియోగదారులు తీవ్రమైన అనారోగ్యాలకు గురౌతున్నారు. 

4. పచ్చి పాలను ఎక్కువ గంటలు-రోజులు నిల్వ ఉంచాలనే దురుద్దేశంతో ఫార్మలిన్‌ యాంటీబయోటిక్స్‌, సోడాబైకార్బొనేటు (వంటసోడా), డైక్రొమేట్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, ఫినాయిల్‌, యూరియా, డిటర్జంటు వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలుపుట. కల్తీకి వినియోగించే కొన్ని పదార్థాలు కిడ్నీ, చర్మం, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులే కాక కాన్సర్స్‌ను కలిగించి ప్రాణాలకే ముప్పు తేవచ్చును.

5. వివిధ రకాల అన్యపదార్థాలతో పాలను కల్తీ చేయుట వల్ల పాలు సహజమైన రుచి, వాసన, నాణ్యతలను కోల్పోవటమేకాక ఈపాలతో చేసిన పాలపొడి పెరుగు, మజ్జిగ, కోవా, వెన్న, నెయ్యి వంటి పదార్థాల నాణ్యత కూడా క్షీణిస్తుంది. కొందరు వెన్న తీయగా వచ్చిన ‘వే’ ద్రవాన్ని పాలలో కల్తీ చేసి నీళ్ళు కిసిన పాలలో ఎస్‌.ఎస్‌.ఎఫ్‌ శాతాన్ని పెంచే కుతంత్రాలు కూడా పాల్పడవచ్చు. ఇందువల్ల పాలు విరిగిపోకుండా ఇతర రసాయనాలను కలిపి జాగ్రత్తపడ్తూ ఉంటాయి.

6. వివిధ రుతువుల మధ్య పాల ఉత్పత్తిలో భారీ వ్యత్యాసాలు కనిపించే గేదె పాడి ప్రాంతాలలో, పాల కొరత మరియు గిరాకీలు ఎక్కువగా ఉండే రోజులలో ముఖ్యంగా వేసవిలోనూ, పెళ్ళిళ్లు, జాతరలు, ఇతర పర్వదినాల సందర్భాలలో కల్తీ సమస్య మనకు ఎక్కువగా కనిపిస్తుంది.

వివిధ రకాల కల్తీలు:

నీటితో పాలను కల్తీ చేయుట:  పచ్చి పాలను సన్నని ధారగా గ్లాసు మీదగానీ స్టీల్‌ ప్లేటు మీదగానీ వీలుగా జారవిడిస్తే నీరు కలిసిన పాలలో లోపించిన చిక్కదనం స్పష్టంగా కనిపిస్తుంది. పాలలో సహజంగా ఉండవలసిన కనీస వెన్న (గేదెపాలు 6 శాతం – ఆవుపాలలో 3.0 శాతం) వెన్న కాని పదార్థం (గేదెపాలు 9.0 శాతం – ఆవుపాలలో 8.5శాతం) లేకపోవడాన్ని లాక్టోమీటరు మరియు బ్యుటిరోమీటరు లేదా ఎలక్ట్రానిక్‌ మిల్క్‌ టెస్టింగ్‌ మిషన్ల ద్వారా సులువుగా కనుగొనవచ్చును. అయితే పాలలో అత్యంత తేలికగా ఉండే వెన్నను (క్రొవ్వును) తొలగించి, ఆ తర్వాత అదేపాలను కొంత నీటితో కల్తీ చేస్తే పాల సాంద్రత అంతగా మారకపోవచ్చును. ఇటువంటి ద్విముఖ మోసాల పట్ల కూడా వినియోగదారులు జాగ్రత్తపడాలి. పాల విక్రయస్థాయిలో పాలప్యాకెట్ల నుండి సిరంజిలతో పాలను తస్కరించి నీటితో భర్తీ చేసే సంఘటనలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి.

ఆవుపాలలో, నీటితోపాటు గేదె పాలను కలిపి విక్రయించుట

పర్వదినాలలో ఆవుపాలు అవసరమైన వినియోగదారులకు ఆవుపాలతో, గేదెపాలతోనే కాక నీటితో కొందరు కల్తీ చేసి విక్రయిస్తున్నారు. అనేక డెయిరీలు ఆవుపాల ఉత్పత్తిని ప్రోత్సహించుటకు ఆవుపాలలోని ఘనపదార్థాలకు అదనపు ధరను చెల్లిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఇటువంటి సందర్భాలలో నీళ్లతోపాటు గేదెపాలతో ఆవు పాలను కల్తీ చేయడాన్ని హంసటెస్టు అనే సులువుగా క్షేత్ర స్థాయిలోనే నిముషాలలో జరుపగల సీరం టెస్టింగుతో గుర్తించవచ్చును.

ఇటీవల ఆర్గానిక్‌ దేశీ ఆవుపాలకు గేదె పాలకంటే రెట్టింపు ధర పలుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకొని దేశీఆవుపాలలో విదేశీ ఆవుల పాలను, గేదె పాలను, నీటిని, కొన్ని సందర్భాలలో పసుపు నీటిని కలిపి మోసాలు చేస్తున్నారు. నీరుతోపాటు పశువుల మూత్రం, తెల్ల పెయింట్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌, ఆల్కలీ యూరియా, డిటర్జంట్‌, మెలామిన్‌ వంటి ప్రమాదకరమైన రసాయన పదార్థాలను చక్కెర, వంటనూనెలు, జంతువుల క్రొవ్వులు, నీటితో కలిపి కృత్రిమ పాలుగా చేసి, అసలు పాలతో కలిపి మార్కెట్లో విక్రయిస్తూ అత్యంత ఏహ్యమైన మోసాలకు కూడా కొందరు పాల్పడుతున్నారు. ఇటువంటి పాలకు సహజమైన, రంగు, రుచి, వాసనలు ఉండవు. ఈ పాలు సాధారణ గది ఉష్ణోగ్రతలో సైతం 6-7 గంటలు పులిసిపోకుండా, విరిగి పోకుండా, తోడు పెడితే పెరుగుగా మారకుండా ఉంటాయి. అనుమానించిన వెంటనే ఈ పాల నమూనాలను సంబంధిత కల్తీ నిరోధక శాఖ అధికారులకు పాల నమూనాతో సహా ఫిర్యాదు చేస్తే, వారు కొన్ని రసాయన పరీక్షలు, ఎలీసా, ఫేజ్‌, పి.సి.ఆర్‌. వంటి సీరమ్‌ పరీక్షలు మరియూ లిక్విడ్‌ క్రొమాటోగ్రాపీ వంటి ఆధునిక పరీక్షలు జరిపి కల్తీని నిర్ధారించగల్గుతారు. 

కల్తీలను గుర్తించే విధానాలు: 

పాలలో సహజంగా ఉండవలసిన నీటి శాతం కంటే ఎక్కువ ఉంటే పాలసాంద్రత తగ్గిపోతుంది. దీనిని సాధారణంగా లాక్టోమీటరుతో గుర్తించవచ్చు. ఇప్పుడు చాలా పాల సేకరణ కేంద్రాలలో వెన్న శాతంతో పాటు వెన్నకాని పదార్థాల (ఎస్‌.ఎన్‌.ఎఫ్‌)ను కూడా సులువుగా తెలుసుకునే ఎలక్ట్రానిక్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. సరియైన పద్ధతిలో పాల నమూనా సేకరించి, ఖచ్చితమైన పరిమాణంలో టెస్టింగ్‌లో వాడితే పాలలో వెన్న-వెన్న కాని పదార్థాలను సులువుగా తెలుసుకోగలము.

కాలం వల్ల (ఏజింగ్‌) నాణ్యతను కోల్పోయే పాలను వాసనతో కనుగొనుట సాధ్యమే అయినప్పటికీ, ఎలక్ట్రానిక్‌ ముక్కు అనే పరికరంతో పరిమాణపూర్వకంగా ఖచ్చితంగా తెలుసుకోగలము.

ఆవుపాలలో గేదె పాలను కల్తీ చేయడాన్ని హంస టెస్టు ద్వారా ఒక నిముషంలో గుర్తించవచ్చును. పాలు:డిస్టిల్డ్‌వాటరు 1:10 నిష్పత్తిలో కలిపి, గ్లాసుస్లైడ్‌ మీద ఒక బొట్టు (చుక్క) వేసి, దీనితో హంస టెస్టు రియేజంటును కలిపితే పాల తరకలు అరనిముషంలో ఏర్పడితే ఆవుపాలలో గేదెపాలు కలిసినట్లు నిర్ధారణ అవుతుంది. 

చెక్కెరతో పాల కల్తీ: 5 మిల్లీలీటర్ల పాల నమూనాలో ఒక మిల్లీ లీటరు గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం మరియు 0.1 గ్రాము రిసోర్సినాల్‌ కలిపి, టెస్ట్‌ట్యూబును నీళ్లలో ఉంచితే, పాలనమూనా ఎర్రగామారితే ఈ విధమైన కల్తీ నిర్ధారణ అవుతుంది.

గంజి-పిండి వంటి పదార్థాలతో పాలు కల్తీ జరిగితే 5 మిల్లీ లీటర్ల పాలనమూనాకు ఒక చుక్క 0.1 శాతం అయొడిన్‌ ద్రావణం కలిపితే నీలంరంగు కనిపిస్తే ఈ రకమైన కల్తీల నిర్ధారణ జరుగుతుంది.

ఫార్మలిన్‌ కలిసిన పాలను గుర్తించుట: టెస్ట్‌ట్యూబ్‌లో 10 మిల్లీలీటర్ల నమూనాను తీసుకుని దానికి 5 మిల్లీలీటర్లు గాఢ సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని, కొంచెం ఫెర్రిక్‌ క్లోరైడ్‌ను కలిపి, కదల్చకుండా ఉంచితే కొంతసేపటికి ఊదారంగు లేదా నీలంరంగు వలయం రెండు ద్రవాల మధ్య కనిపిస్తే అది ఫార్మలిన్‌ కల్తీని నిర్ధారిస్తుంది.

యూరియా గుర్తింపు: టెస్ట్‌ట్యూబ్‌లో 5.0 మిల్లీలీటర్ల నమూనాను తీసుకొని దానికి సమాన పరిమాణంలో పి-డైమిథైల్‌ ఎమైనోబెంజాల్‌డిహైడ్‌ రియేజెంటును కలిపినప్పుడు స్పష్టమైన పసుపురంగుకు మారితే యూరియా ఆ నమూనాలో ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.

బోరిక్‌ పౌడరు, బోరాక్స్‌ గుర్తింపు: టెస్ట్‌ట్యూబ్‌లో 5 మి.లీ. నమూనాకు 1.0 మి.లీ. గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని కలిపి అందులో టర్మరిక్‌ పేపరును ముంచితే, ఆ పేపరురంగు పసుపు నుండి ఎర్రగా మారుతుంది.

డిటర్జంటును గుర్తించుట: టెస్ట్‌ ట్యూబులో 5.0 మి.లీ. పాల నమూనాను తీసుకొని దానికి 0.1 మి.లీ. 0.5% బ్రోయోక్రిసాల్‌ పర్సుల్‌ ద్రావణాన్ని కలిపినప్పుడు ఊదారంగు కనిపిస్తే అది డిటర్జంటు ఉనికిని స్పష్టం చేస్తుంది.

అధిక పాల దిగుబడికి, చేపుకు కొందరు పాలు పిండే ముందు చేపు ఇంజక్షను (ఆక్సిటోసిన్‌) అనే ఇంజక్షను ఇస్తారు. ఈ హార్మోను అవశేషాలు పాలద్వారా ప్రతిరోజూ అదే పాల మీద ఆధారపడే వినియోగదారుల ఆరోగ్యాలను పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇటువంటి అక్రమాలు మన దృష్టికి వస్తే స్థానిక వైద్యశాఖ/ఆహారకల్తీ నివారణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

నాణ్యమైన పాలపొడి, ద్రవరూపంలోని పాలలోని నీటిని, వెన్నను వివిధ శాస్త్రీయ మార్గాల ద్వారా తొలగిస్తేనే తయారవుతుంది. పాలను పొడి రూపంలో దీర్ఘకాలం నిల్వ చేసి, అవసరమైనప్పుడు స్టెరిలైజ్‌ చేసిన నీరు, పాశ్చురైజ్‌ చేసిన పాలు, వెన్ననూనె (బటర్‌ ఆయిల్‌)తో నిర్ణీత ప్రమాణాలలో కలుపుటను కల్తీగా భావించకూడదు. పాలలో సహజంగా ఉండవలసిన వెన్న, వెన్నకాని పదార్థాలు తప్ప, అన్యపదార్థాలు పాలలో కనిపించకూడదు.

పాలలోని వెన్న-వెన్నకాని పదార్థాల శాతాలను బట్టి పాలను స్కిమ్డ్‌మిల్క్‌ (వెన్న లేని పాలు) డబుల్‌ టోన్డ్‌ మిల్క్‌ 1.5 శాతం వెన్న, టోన్డ్‌ మిల్‌ (3.0 శాతం వెన్న) స్టాండర్డ్‌ మిల్క్‌ (4.5 శాతం వెన్న) హోల్‌ మిల్క్‌ (6.0 శాతం వెన్న) గా వివిధ డెయిరీలు వేర్వేరు ధరలకు విక్రయించుటను చట్టప్రకారం అనుమతించబడింది.

పైన పేర్కొన్న వివిధ కల్తీ గుర్తింపు పరీక్షలు మనకు కల్తీ జరిగినట్లు అనుమానించుటకు తప్ప నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు సరిపోవు. అనుమానితులపై జిల్లా కలెక్టరు, స్థానిక సంస్థ (పంచాయతీ-మున్సిపాలటీ, కర్పొరేషన్‌)ల అధికారులకు, రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదును అవసరమైతే తాజా పాలనమూనాతో పాటు సమర్పించి చట్టపరంగా దోషుల్ని కోర్టు ఉత్తర్వుల ద్వారా శిక్షించవచ్చును.  

డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611

Read More

తులసి సాగుతో రైతుకు ‘సువాసన’

మిరప, వరి, చెరకు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు లాంటి పంటలతో పాటు రైతులు ఔషధ మొక్కల సాగు కూడా చేపడుతున్నారు. ఔషధ మొక్కలలో ప్రధానంగా కలబంద, తులసి, దూలగొండి, అశ్వగంధ లాంటి వాటిని రైతుల స్థాయిలో పండించి అమ్ముకుంటున్నారు. ఔషధ మొక్కలు సాగు చేసే రైతులు తప్పనిసరిగా మార్కెటింగ్‌ అవకాశాలను చూసుకొన్న తరువాతనే కొనుగోలుదారులతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాతనే పంటల సాగు మొదలు పెట్టాలేగాని ఏలాంటి కొనుగోలు ఒప్పందాలు లేకుండా సుగంధ మరియు ఔషధ మొక్కల లాంటివి సాగు చేసినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయం రైతుల అనుభవాల సారం. ఈ పంటలు కూడా ఏ నేలలలో పడితే ఆ నేలలలో సరైన దిగుబడులు రావు కాబట్టి పంట లక్షణాన్ని బట్టి నేలలను ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ తమకు సమీపంలో అనుకూలమైన నేల లేనట్లయితే అనుకూలమయిన నేల అందుబాటులో ఉన్న ప్రాంతాలకు వలసపోయి సాగు చేపట్టినట్లయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. కాబట్టి తాము ఉండే ప్రాంతంలో నేల తాము అనుకున్న పంటల సాగుకు ఉపయోగపడదు కాబట్టి ఆ పంట సాగుకు అనుకూలమైన నేల అందుబాటులో ఉన్న ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు చేస్తున్నారు అన్నదమ్ములు శ్రీనివాసరావు మరియు నాగేశ్వరరావు.

వీరిది గుంటూరు సమీపములోని పుల్లడిగుంట ప్రాంతం. ఈ ప్రాంతంలోని నేలలు నల్లరేగడి నేలలు. వీరు తులసి పంటను సాగు చేయాలనుకొని పుల్లడిగుంట ప్రాంతంలోని నల్లరేగడి నేలలు తులసి సాగుకు అనుకూలం కావు అని తెలుసుకున్నారు. తులసి సాగుకు ఇసుక నేలలు, ఎర్రనేలలు అనుకూలం. కాబట్టి అలాంటి నేలలు అందుబాటులో ఉన్న ప్రకాశం జిల్లా ఆకివీడు ప్రాంతానికి వెళ్ళి తులసి పంట సాగు మొదలు పెట్టారు. నల్లరేగడి నేలలో తులసి సాగు చేసినట్లయితే నూనెదిగుబడి తక్కువగా వచ్చి పంట గిట్టుబాటు కాదు. ఇసుక లేదా ఎర్ర నేలల్లో నూనె దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది కాబట్టి తులసి సాగును నల్లరేగడి నేలలలో చేపట్టవచ్చు అని వీరు సూచిస్తున్నారు.

గత సంవత్సరం మే నెలలో తులసి పంట సాగును 30 ఎకరాలలో చేపట్టారు. ఇందుకుగాను అవసరమైన విత్తనాలను హైదరాబాదులో సిఎంఏపి వద్ద కొనుగోలు చేసికుని నారు పోసుకున్నారు.  దుక్కిలో బాగా మాగిన పశువుల ఎరువును అందించారు. 35 నుంచి 40 రోజుల వయస్సు ఉన్న నారుని లైనుకి లైనుకి 27 అంగుళాలు మొక్కకు మొక్కకు 15 నుంచి 16 అంగుళాల దూరం పాటించి నాటించారు.  అవసరాన్ని బట్టి నీటిని అందిస్తూ వస్తున్నారు. తులసి ఔషధగుణాలు ఉన్న మొక్క కాబట్టి ఎలాంటి చీడపీడలు పంటను ఆశించలేదు. ఒకవేళ చీడపీడలు ఆశించినా కూడా ఎలాంటి సస్యరక్షణా చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు అని వీరు వివరిస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే నారు నాటిన 60 రోజులకు మొదటి కోత వస్తుంది. తరువాత 50 రోజులకు ఒక కోత చొప్పున కోసుకోవచ్చు. సంవత్సరానికి 5 నుంచి 6 కోతలు కోయవచ్చు. పంట కోత విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వాతావరణములో తేమ తక్కువగా ఉన్నప్పుడే తులసి పంటను కోయాలి. పంట కోతకు ముందు కనీసం వారం రోజులు నీటితడిని ఆపి మొక్క బాగా వాడుబడిన తరువాత కోత కోయవలసి ఉంటుంది. వర్షాకాలంలో పంట వాడుపడదు కాబట్టి వాడుపడకుండా కోత కోసి నూనెను తీసినట్లయితే నూనె నాణ్యత తగ్గుతుంది కాబట్టి పంట వాడు పట్టిన తరువాతనే కోసి నూనెను తీస్తున్నారు. పంట ఎదుగుతూ పూత పూర్తిగా వచ్చి విత్తనాల తయారీ మొదలు కాకుండానే పంటను కోయాలి. విత్తనాల తయారీ మొదలయితే నూనె శాతం తగ్గుతుంది. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితేనే నాణ్యమయిన నూనె దిగుబడి పొందవచ్చు.

నూనె తీయడానికి సిద్ధంగా ఉన్న పంటను కట్టెతో సహా కోసి నూనె తీసే యంత్రంలో వేసి నూనె తీస్తున్నారు. అంతా సక్రమంగా ఉంటే మొదటికోతలో ఎకరానికి 9 లీటర్ల నూనె దిగుబడి పొందవచ్చు. రెండవ కోత నుంచి నూనె దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. ప్రస్తుతం తులసి నూనె లీటరు ధర 6700/- నడుస్తుంది. చెన్నై, బెంగుళూరు, బొంబాయిలలో ఈ నూనెకు గిరాకి ఉంది. విత్తనాలు, నారు, కూలీ ఖర్చులు అన్నీ కలిపి మొదటి కోత వరకు ఎకరానికి 30000/- వరకు ఖర్చు అవుతుంది. రెండవ కోత నుంచి కోతకు 10000/- వరకు ఖర్చు అవుతుంది. ఒకసారి నాటుకుంటే 3 సంవత్సరాలలో 15 నుంచి 16 కోతలు కోసుకోవచ్చు అని వీరు వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు 9441928521 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

ఉల్లి సాగులో మెలకువలు

ఉల్లిగడ్డ అలియేసీ కుటుంబానికి చెందిన ద్వి వార్షిక మొక్క అధిక ఔషధ గుణములు మరియు కొన్ని రకాల చికిత్సలకు ఉపయోగ పడుతుంది. ఇది సాధారణంగా సమశీతోష్ణ వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే మొక్క కానీ ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాలలో కూడా పెరుగును. దీర్ఘకాలిక పగటి కాంతి ఉల్లిపాయలో లశునము ఊరడానికి సహకరిస్తుంది కానీ ఉష్ణోగ్రత మొక్క పుష్పించడానికి దోహదపడుతుంది. ఉల్లిపాయను దాదాపు ప్రపంచంలోని అన్ని సంస్కృతుల ప్రజలు వంటలలో నిత్యావసర పదార్థంగా వాడతారు. ఇది వంటకి రుచి, సువాసనని అందిస్తుంది. దీన్ని సలాడ్‌ రూపంలో కూడా తీసుకుంటారు. ఉల్లిపాయలో వివిధ రకాల విశిష్ట రసాయన పదార్థాలున్నాయి. అవి ఫ్లవోనోయిడ్స్‌, ఆంథోసైయానిన్స్‌, ఫ్రక్టో ఒలిగో శకరైడ్‌, ఆర్గానో-సల్ఫర్‌లు ఔషధంగా ఆరోగ్యాన్ని పెంచి రుగ్మతలు, డయాబెటిస్‌ నుండి కాపాడతాయి. భారతదేశం నుండి వివిధ దేశములకు ఎగుమతి అయ్యే ఫలములు, కూరగాయలలో ఉల్లిగడ్డ ద్వారా వచ్చే ఆదాయపు వాటా శాతము 26%. చైనా ప్రపంచంలోనే ఉల్లి సాగులో మొదటి స్థానంలో ఉంటే భారత దేశం రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశంలో ఉల్లిపాయలు అధికంగా పండే రాష్ట్రం మహారాష్ట్ర కాగా తదనంతర స్థానంలో కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణలో ఉండే వాతావరణ పరిస్థితులు ఉల్లి సాగుకు అనుకూలమైనవి. నాణ్యమైన విత్తనం అందుబాటులో లేకపోవడం, తెగుళ్లు, చీడల బెడద, ఉల్లిపాయను సాగుచేసే విస్తీర్ణం తక్కువ ఉండటం ఇలాంటి వివిధ కారణాల వల్ల రాష్ట్రం నుండి ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయ దిగుబడి ఆశించినంత స్థాయిలో లేదు. కానీ ఆధునిక సాంకేతికత, నూతనంగా విడుదల అయిన ఉల్లి వంగడాలు, ఉత్పత్తిలో మెలకువలు సంక్షిప్త కీటక, వ్యాధి నివారణ, సాగులో మెలకువలు పాటించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉల్లి ఉత్పత్తిని గణనీయంగా పెంచవచ్చు.

సాగు చేయు ప్రాంతాలు, సమయం

తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిపాయను ఖరీఫ్‌ (ఆగష్టు – నవంబర్‌) మరియు రబి (ఏప్రిల్‌ – జూన్‌) రెండు కాలములలో సాగు చేస్తారు కాని అధికంగా ఉత్పత్తి అయ్యేది రబీ కాలంలోనే. తెలంగాణలో ఉల్లిని సాగుచేసే ప్రాంతాలు వరుసగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌. ఉల్లిగడ్డ లశుణం సరిగ్గా పెరగకపోవడానికి గల కారణాలు ఉల్లిగడ్డ లశునము సరిగ్గా ఎదగక ముందే పుష్పించడం, దుంప పగుళ్లు వచ్చుట, సరైన ఉల్లిగడ్డ విత్తన రకమును ఎంచుకోవడములో తప్పిదం, నిస్సారమైన భూమి, ప్రతికూల పర్యావరణ కారకములు, ఉల్లిగడ్డ నిల్వచేయడంలో తగిన జాగ్రత్త చర్యలు చేపట్టక పోవడం.

నేలలు, వాతావరణం

భూ సారము అధికంగా ఉండి, సరి అయిన మురుగు నీరు పోయే సౌకర్యం ఉన్న ఇసుక నేలలు మరియు చల్లని వాతావరణము ఉల్లిపాయలో సరయిన పెరుగుదలకు దోహదపడే అంశాలు. దీర్ఘకాలిక కాంతి ఉండి ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు దుంప ఎదుగుదల సరిగ్గా జరుగుతుంది. ఉష్ణమండల తెలంగాణ ప్రాంతాలలో దీర్ఘకాల కాంతి వంగడాలను పెంచుకోవడానికి అనుకూలమైనవి. అధిక ఉష్ణోగ్రత స్వల్ప ఆర్ద్రత ఉండే వాతావరణంలో దుంప త్వరగా ఎదుగుతుంది. ఉల్లిగడ్డ శీతకాలాపు పంట, దుంపల కోసం, ఆకు కోసం సాగు చేస్తారు. 

సరైన వంగడాలు: N 2-4-1, ఆర్కా నికేతన్‌, అగ్రి ఫౌండ్‌ లైట్‌ రెడ్‌, పూస రెడ్‌, భీమా రాజ్‌ మరియు భీమా రెడ్‌ అనేవి రబి సీజన్లో సాగు చేయుటకు అనుకూలమైన రకాలు.

విత్తనం ఎంపిక, నారుమడి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఉల్లిగడ్డను విత్తనము ద్వారా గాని, లేదా చిన్న దుంపల ద్వారా గాని సాగు చెయ్యవచ్చు. నారు మొక్కలు చాలా అనువైనవి నారు మొక్కలను ముందుగా నిర్మించుకున్న నారుమడిలో విత్తనాలను తగినంత దూరములో విత్తుకోవాలి. బెడ్‌లను భూమి నుంచి 10-15 సెం.మీ. ల ఎత్తులో నిర్మించుకోవాలి ప్రతి రెండు బెడ్‌ ల మధ్య కనీస నిడివి 50సెం.మీ. లు ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల అంతరకృషి సులభతరమగును రెండు విత్తన వరసల మధ్య దూరము 4-5 సెం.మీ.లు ఉండేట్లు చూసుకోవాలి. నారుకుళ్లు తెగులును అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకుని 4-6 వారాల వయసున్న నారు మొక్కలను ప్రధాన నాటుకోవాలి. 

నీరు, యాజమాన్యం

ఉల్లిమొక్క నీటి ఎద్దడిని దుంప ఊరే దశ, దుంప అభివృద్ధి చెందే దశలో అస్సలు తట్టుకోలేదు. పంట పరిపక్వత దశకు చేరుకున్న తరవాత అధిక నీరు ఇచ్చినట్లయితే ద్వితీయ వేర్లు వస్తాయి తద్వారా దిగుబడి తగ్గే అవకాశం ఉంది. పంట కోసే రెండు వారాల ముందు నుండి నీటి సరఫరా ఆపి వేయాలి. ఉల్లి సాగులో నీటిని తుంపర సేద్యము, బిందు సేద్యము ద్వారా అందించినచో సంప్రదాయ పద్ధతి లో సాధించే దానికన్నా ఎక్కువ దిగుబడి పొందవచ్చు. బిందు సేద్యము ద్వారా నీటిలో కరిగే పోషకాలను వాడటం సరైన లాభాలను ఆర్జించవచ్చు. పశు సంబంధిత వ్యర్ధాలు, పంట వ్యర్ధాలు, పచ్చి రోట్ట ఎరువులను వాడటం, పంట మార్పిడి, మృత్తికా పరీక్ష అనంతరం సూచించిన మోతాదులో నియమిత ఫర్టిలైజర్‌ ను అందించటం మేలైనది. ఒక హెక్టార్‌ భూమికి సుమారు 40 టన్నుల పశవుల ఎరువు వాడటం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చు. 

కలుపు నివారణ: ఉల్లి మొక్క వేరు వ్యవస్థ చిన్నధి అందువల్ల కలుపు ను అస్సలు తట్టుకోలేదు. సరైన సమయములో కలుపు ను నియంత్రన చర్యలు చేపట్టాలి. 

అంతర పంటల సాగు

ఒకే  సంవత్సరంలో వరసగా కేవలము ఉల్లిగడ్డ ను సాగు చేయకూడదు. దీనివల్ల భూమి యొక్క సారము తగ్గిపోవును, చీడ పీడల ఉధృతి అధికమగును. రసాయనిక ఎరువులు వాడటానికి బదులుగా ఇతర జాతి పంటలను పండించడం ద్వారా నేల సారవంతంగా మారును. ఉల్లి స్వల్పకాలపు పంట కాబట్టి రెండు ఋతువుల మధ్య అంతర పంట సాగు చెయ్యవచ్చు. బెండి, ముల్లంగిల మధ్య అంతర పంటగా ఉల్లిని సాగు చేయడము ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. అన్నిటికంటే బీట్‌రూట్‌తో ఉల్లిని 15 సెం.మీ.ల వ్యవధితో సాగు చేసినప్పుడు అధిక లాభాలు గణించవచ్చు.

పంట పరిపక్వత దశ,  కోయు విధానం

నిల్వ చేసే ఉల్లిపాయలను కోత కోయడానికి మెడ విరుపు దశ,అత్యంత ముఖ్యమైనది. దాదాపుగా 75% పై ఆకులు నేలకు ఒరగడం ఇది మొక్క పూర్తిగా కోతకు వచ్చిందని సూచిస్తుంది. కోతకు 2-3 వారాల సమయం ముందు నీరు అందించడం ఆపాలి. కోత కోసే సమయం లో సమయంలో దుంపలను భూమి నుండి లాగి ఆకుల చివరలను కత్తిరించాలి. కోసిన దుంపలను వ్యవసాయ భూమి లోనే 2-3 వారాలు దుంపల పై ఉన్న పొలుసులు పూర్తిగా పొడిగా అయ్యే అంత వరకు ఆరనివ్వాలి.  ఆకు పచ్చని ఉల్లి పాయల కోసం దుంపలను భూమి నుండి లాగి కాడలను 15 సెం.మీ. లు ఉండే విధంగా కత్తిరించాలి.

చీడ పీడలు, తెగుళ్లు నివారణ

ఉల్లిలో చీడపీడలు, తెగుళ్లు కూడా అధికమే, కేవలం తామర పురుగుల ద్వారా 50% పంట నష్టం జరుగుతుంది. తామర పురుగులు పొడిగా వేడిగా ఉండే వాతావరణంలో అధిక నష్టాన్ని కలుగ చేస్తాయి. ఇవే కాకుండా మొక్కలకు నీరు పెట్టేటప్పుడు, ఆచ్ఛాదన, నాటుపెట్టే సమయం వల్ల  కూడా తామర పురుగుల ఉధృతి పెరుగును. వివిధ రకాల సేంద్రియ కషాయాలు మరియు ద్రావణాలతో తామర పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు బవేరియా బస్సియానా అనబడే శిలీంద్రంను వాడటం ద్వారా అనేక రకాల చీడలను అరికట్ట వచ్చు. అస్పెర్గిల్లస్‌నైజర్‌ మరియు ఫ్యూసేరియం అనే శిలీంద్ర జాతులు విత్తనము ద్వారా దుంపలలో కూడా వ్యాపిస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఆర్థ్రత వున్న పరిస్థితులలో నారుకుళ్ళు తెగులు ద్వారా 75-80 శాతము నష్టం కలుగును. ఎదుగుదల థలో అధిక నీటి వల్ల నారుకుళ్లు, ఊదారంగు మచ్చ  వ్యాధి సోకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తగిన మోతాదులో నీటిని అందించడం వలన అరికట్టవచ్చు.              

డా. బి. అశోక్‌ కుమార్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వెజిటబుల్‌ సైన్స్‌, మల్లారెడ్డి యూనివర్సిటి, బి. గౌతమి, పిహెచ్‌.డి. స్కాలర్‌, ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీ. 

Read More

వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో  పశువులకు   సంపూర్ణ సమీకృత ఆహార తయారీ

మనదేశంలో వ్యవసాయ సంబంధిత ఆర్థికాభివద్ధికి పశుసంపద పాత్ర చాలా ముఖ్యమైనది. మన దేశంలో పశుసంపద సమృద్ధిగా ఉంది. సన్నకారు రైతులు, భూమిలేని నిరుపేదలు సంవత్సరం పొడవునా ఆదాయం పొందాలంటే, పశువులకు ఆహారం సంవత్సరం పొడవునా లభించాలి. మనదేశంలో పశుగ్రాసాల సాగు 4 శాతం భూవిస్తీర్ణంలో మాత్రమే జరుగుతుంది. దీనివలన సంవత్సరం పొడవు పశుగ్రాసాలు దొరకడం లేదు. మన దేశంలో ఉన్న పశుసంపదకు కావలసిన దానికి 43 శాతం దాణా దినుసులు, 44 శాతం ఎండుమేత, 38 శాతం పచ్చిమేత తక్కువగా లభ్యం అవుతూన్నాయి. దీనికి కారణాలేమిటంటే, దేశ జనాభా పెరగడం, పశువుల సంఖ్య పెరగడం, పంట భూముల విస్తీర్ణం పెరగడం, ఉన్న పంటభూముల మీద ఆహారధాన్యాల ఉత్పత్తి కొరకు వత్తిడి పెరగడం, అధిక లాభం కొరకు వాణిజ్య పంటలు పండించటం మొదలగునవి.

పై కారణాలవల్ల పచ్చిక బయళ్ళ విస్తీర్ణం మరియు పశుగ్రాసాల సాగు తగ్గాయి. అందే సమయంలో ఆహార పంటలు, వాణిజ్య పంటల విస్తీర్ణం పెరగడం వల్ల వ్యవసాయ వ్యర్థ పదార్థాల ఉత్పత్తి ఎక్కువ అయ్యింది. ప్రస్తుతం భారతదేశంలో సుమారుగా 50 కోట్ల టన్నుల వ్యవసాయ వ్యర్థ పదార్థాలు లభ్యమవుతున్నాయి. వీటినే సాంప్రదాయేతర ఆహార పదార్థాలు అని కూడా అంటారు. తగ్గిన పచ్చిక బయళ్ళు, పశుగ్రాసాల సాగు వల్ల సాంప్రదాయేతర ఆహార పదార్థాలను పశువుల మేతగా వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. జొన్నచొప్ప, మొక్కజొన్న చొప్ప, సజ్జ చొప్ప, కంది కట్టె, ప్రత్తి కట్టె, మొక్కజొన్న కండెలు, ప్రొద్దు తిరుగుడు కట్టె, గింజలు తీసిన ప్రొద్దు తిరుగుడు పూలు మొదలగునవి మనకు సాధారణంగా వ్యవసాయంలో లభించే వ్యర్థ పదార్థాలు.

ఈ వ్యవసాయ వ్యర్థ పదార్థాలను పశువుల ఆహారంలో సంపూర్ణ సమీకృత ఆహారంలో నిర్ధిష్ట పరిమాణంలో ఇచ్చి పాలు, మాంసాన్ని చౌకగా ఉత్పత్తి చేయవచ్చు.

వ్యవసాయ వ్యర్థ పదార్థాలను, సాంప్రదాయేతర పదార్థాలను ఒక నిర్దిష్ట పరిమాణంలో మాత్రమే దాణాలో వినియోగించాలి. ఎందుకంటే వాటిలో పీచుపదార్థాన్ని లిగ్నిన్‌ ఎక్కువగా ఉండి పశువు తినడానికి ఇష్టపడదు. వాటిలో పోషక విలువలు కూడా తక్కువగా ఉంటాయి. కొన్నింటిలో విషపదార్థాలు ఉండి వాటి వినియోగాన్ని తగ్గించడం కాకుండా పశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

వాటిని పశువుల ఆహారంగా మార్చడానికి వివిధ పద్ధతులు కలవు. అందులో ముఖ్యంగా వ్యర్థ పదార్థాలను కత్తిరించి మేపడం గాని, పొడి చేయడం ద్వారా గాని, గుళికల రూపంలో అందించవచ్చు. ఈ పద్ధతులే కాకుండా వ్యర్థ పదార్థాలను సుపోషకం చేయడానికి వివిధ పద్ధతులున్నాయి. అందులో భాగంగా సోడియం హైడ్రాక్సైడ్‌ రసాయన ద్రావణంతో పిచికారి చేసి మగ్గనివ్వడం ద్వారా గాని, మరొక పద్ధతిలో 4 శాతం యూరియా ద్రావణంతో పిచికారీ చేసి, 30 రోజులు గాలి చొరబడకుండా మగ్గనివ్వాలి. దీని వల్ల వ్యర్ధపదార్ధాలు సులభంగా జీర్ణమవడమే కాకుండా, నత్రజని శాతం పెరుగుతుంది. ఈ పద్ధతి శాస్త్రీయ పరంగా మంచి పద్ధతి అయినా, అంతగా ప్రాచుర్యం పొందలేదు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యర్ధ పదార్థాలను ఈ పద్ధతిలోని లోపాలను అధిగమిస్తూ, సులభంగా సంపూర్ణ సమీకృత ఆహారంగా మార్చుకోవచ్చు. ఈ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్ధ పదార్థాలను, సాంప్రదాయేతర మరియు సాంప్రదాయ బద్ధంగా శక్తిని మరియు మాంసకృత్తులనిచ్చే దాణా దినుసులను నిర్ణీత పరిమాణంలో లేదా నిష్పత్తిలో కలిపి పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలను చాలినంతగా లభించేటట్లు తయారు చేయవచ్చు.

ఈ ఆహారం తయారీలో, ఎండుమేతతో సహా, అన్ని దాణా దినుసులను పొడిగొట్టే యంత్రంతో పొడిచేసి, మిశ్రమం చేసే యంత్రంలో పంపుతారు. కొద్ది మోతాదులో వాడే దినుసులను ప్రిమిక్సుగా తయారు చేస్తారు. ప్రిమిక్స్‌తో పాటు 70 డిగ్రీ సెంటీగ్రేడ్‌ వరకు వేడి చేసిన మొలాసిస్‌ (బెల్లపు మడ్డి)ను కూడా తగిన మోతాదులో మిశ్రమ యంత్రంలో వేసి 10 నిమిషాల పాటు అన్ని పదార్థాలు బాగా కలియునట్లు కలుపుతారు. ఈ విధంగా తయారు చేసిన మిశ్రమ ఆహారాన్ని సంపూర్ణ సమీకృత ఆహారం అని అంటారు. పొడి రూపంలో తయారైన ఆహారాన్ని పశువులకు పెట్టవచ్చు లేదా గుళికల రూపంలోకి మార్చి కూడా ఆహారంగా అందించవచ్చు.

సంపూర్ణ సమీకృత ఆహారం వల్ల ఉపయోగాలు

  • సాంప్రదాయేతర, వ్యవసాయ వ్యర్థ పదార్థాల వినియోగం పెంచడానికి వీలవుతుంది.
  •  పశువులకు కావలసిన అన్ని పోషక పదార్థాలు సరియైన పాళ్ళలో లభిస్తాయి.
  • మేత వృథా కాదు.
  • మేతను తేలికగా జీర్ణం చేసుకోగలుగుతాయి.
  •  పశువు తీసుకునే ఆహారం 10 నుంచి 20 శాతం పెరుగుతుంది.
  •  రవాణా చేయడం, నిల్వ చేయడం చాలా తేలిక.
  • పశువులు తమంతట తాముగా ఆహారాన్ని వెదికి ఎంపిక చేసుకునే అవకాశం ఉండదు.
  • వేసవి కాలం, వరదలు, అనావృష్టి పరిస్థితుల్లో ఇవి సరైన ప్రత్యామ్నాయ ఆహారం.
  • పాల దిగుబడి రోజుకి పెరుగుతుంది.
  • గొర్రెలలో 10-15 శాతం ఎక్కువ పెరుగుదల వస్తుంది.
  • దాణా ఖర్చు 15-20 శాతం తగ్గుతుంది.
  • గొర్రె పిల్లల్లో 100-140 గ్రా. వరకు ప్రతిరోజు పెరుగుదల పొందవచ్చు.
  • మాంసం నాణ్యత కూడా పెరుగుతుంది.
  • దూడలు రోజుకు సగటున 500 నుండి 700 గ్రాముల వరకు బరువు పెరగవచ్చు.

సంపూర్ణ సమీకృత ఆహారంలో వ్యవసాయ వ్యర్థపదార్థాల పాళ్ళ వివరాలు

  • జొన్నచొప్ప / మొక్కజొన్న 50
  • ప్రొద్దుతిరుగుడు కట్టె 40
  • ప్రొద్దుతిరుగుడు పూలు 50
  • గోధుమ చొప్ప 50
  • ఎండిన చెట్ల ఆకులు 50-70
  • వరిగడ్డి 50
  • ప్రత్తి కట్టె 45
  • సోయా కట్టె 50
  • ఆయిల్‌ పామ్‌ పీచు 30
  • చెరకు పిప్పి 20

పెరిగే దూడలకు సంపూర్ణ ఆహారం

ఆహార పదార్థం                సంపూర్ణ దాణా (కిలోలు)

                                1          2        3        4

మొక్కజొన్న కంకులు40
ప్రొద్దుతిరుగుడు పువ్వులు40
చెరకు పిప్పి40
పత్తి కట్టె40
మొక్కజొన్న గిoజలు15102330
వేరుశనగ గానుగ చెక్క10101014
పత్తి గింజల గానుగ చెక్క5.0
నూనె తీసిన వరి తవుడు22.528.59.0
మొలాసిస్‌1010108
యూరియా1.01.00.5
గోధుమ తవుడు4.5
ఖనిజ లవణాల మిశ్రమం1.01.01.02.0
ఉప్పు0.50.51.01.0
విటమిన్ల మిశ్రమం10గ్రా.10గ్రా.10గ్రా.10గ్రా.
మొత్తం100100100100
     

దూడలు రోజుకు సగటున 500 నుంచి 700 గ్రాముల వరకు బరువు పెరుగుతాయి.

పాడి పశువులకు సంపూర్ణ ఆహారం

ఆహార పదార్థం                సంపూర్ణ దాణా (కిలోలు)

                                          1          2          3          4

మొక్కజొన్న కంకులు28.5
ప్రొద్దుతిరుగుడు పువ్వులు40
 పత్తి కట్టె30
 చెరకు పిప్పి28.5
మొక్కజొన్న గిoజలు19.019.024.024.0
వేరుశనగ గానుగ చెక్క13.013.012.59.0
పత్తి గింజల గానుగ చెక్క5.06.0
నూనె తీసిన వరి తవుడు26.026.08.05.0
మొలాసిస్‌12.012.08.010.0
యూరియా0.50.5
గోధుమ తవుడు9.06.5
ఖనిజ లవణాల మిశ్రమం1.01.02.02.0
ఉప్పు0.50.51.01.0
విటమిన్ల మిశ్రమం10గ్రా.10గ్రా.10గ్రా.10గ్రా.
మొత్తం100100100100
     

పాల దిగుబడి రోజుకు 8 నుంచి 10 లీటర్లు.

పై విధంగా తయారు చేసుకున్న సంపూర్ణ సమీకృత ఆహారాన్ని దూడలకు వాటి శరీర బరువులో 3-4 శాతం మరియు పాడి పశువులకు 2.5-3.0 శాతం మేపినట్లయితే పైన సూచించిన విధంగా వాటి బరువు పెరుగుదల, పాల దిగుబడి పొందవచ్చు. అలాగే రైతులు వ్యవసాయ వ్యర్థాలను వాడుకొని పశుపోషణ ఖర్చు తగ్గించుకోవచ్చు.  

డా|| రమేష్‌బాబు పి., అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, & హెడ్‌, యానిమల్‌ న్యూట్రిషన్‌ విభాగం,

పశువైద్య కళాశాల, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం,

ప్రొద్దటూరు – 516 360.

ఇ-మెయిల్‌:drrameshbabu4u@gmail.com

Read More

గొర్రెల దాణాలలో బైపాస్‌ ప్రొటీన్స్‌ వల్ల లాభాలు

గత నాలుగు థాబ్దాల కాలంలో పాలు – పాడి పశువుల ధరలు పదిరెట్లు, కోడిగ్రుడ్లు, కోడిమాంసాల ధరలు     12-13 రెట్లు మాత్రమే పెరగగా, జీవాలు, జీవాల మాంసం ధరలు మాత్రం ఏకంగా సుమారు 50-60 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం పొట్టేలు మాంసం ధర కిలో 750-800 వరకు పలుకుతూ ఉంది. ఇందుకు జీవాల పోషణ-నిర్వహణ వ్యయాలు కూడా గణనీయంగా పెరగటమేకాక, వాటి నిర్వహణ కూడా అనేక సమస్యలతో కూడుకున్నది కావటం కూడా మరో ముఖ్య కారణం. పూర్వం జీవాల జీవనాధారమైన విశాలమైన పచ్చికబీళ్లు, బీడుభూములు, అటవీభూములు, తోటలు, ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలు, జీవాలమేతకు అందుబాటులో ఉండు మెట్ట సాగు భూములు కాలక్రమంలో మూడు పంటలందించే మాగాణీ భూములుగా మారిపోవటం మరియూ సాంప్రదాయ జీవాల పెంపకం కులాలలో జీవాలతో పాటు సంచార జీవితాల పట్ల ఆసక్తి తగ్గిపోవటం వంటి ఎన్నో కారణాలు కూడా సాంప్రదాయ జీవాల పెంపకానికే అవరోధంగా మారాయి. మారిన ఈ పరిస్థితులలో జీవాల పెంపకం లాభదాయకంతో పాటు నిర్వహణ సులభతరం కావడానికి సాంద్రపద్ధతిలో దాదాపుగా పూర్తి చేతిమేతతో పెంచడమే మంచిదని అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో యజమాని ప్రతి జీవంపై వెచ్చించే ప్రతి రూపాయి పెట్టుబడికి తగినట్లు మాంసం రూపంలో అదనపు రాబడిని పొందే ప్రయత్నం చేయకతప్పదు. శాస్త్రీయ సాంద్ర పద్ధతులలో జీవాల పెంపకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు (ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం) జీవాల పెంపకాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే విధ్యాధికులు, యువత, పదవీ విరమణ చేసిన ఉద్యోగులెందరో కూడా జీవాల పెంపకాన్ని చేపట్టి ఆధునిక శాస్త్రీయ విధానాలను పాటిస్తూ మంచి ఆదాయాలను పొందుచున్నారు. ఈ పరిశ్రమ రాబోయే రోజుల్లో ఒకబలమైన గ్రామీణ ఆర్థికశక్తిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇటీవల హైదరాబాదులోని మెట్టసాగుభూములు పరిశోధనా కేంద్రం (క్రీడా) శాస్త్రజ్ఞులు కొందరు గొర్రెల పోషణపై జరిపిన పరిశోధనల ద్వారా ఎంతో విలువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనకు అందించారు. పాలు విడిచిన తర్వాత అంటే 130 రోజుల వయస్సు నుండి మరో 100 రోజుల వరకు (మాంస కేంద్రాలకు తరలించే థ వరకు) పొట్టేలు పిల్లలకు సాధారణ దాణాలలో జీవానికి 50 గ్రాముల ఉలవల పిండిని కలిపి మేపితే రోజుకు సుమారు 50 గ్రాముల మేరకు అదనంగా శరీర బరువు పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన జొడిపి జాతి గొర్రెల మీదనే జరగటం విశేషం. ప్రస్తుతం జీవాల (జీవన బరువు)కు కిలోకు సుమారు 400 రూపాయల చొప్పున మార్కెట్లో ధర పలుకుతోంది. అంటే ఈ ఉలవలు మేసిన వంద రోజుల్లో ప్రతి జీవం తినే సుమారు 5 కిలోల ఉలవల ఖర్చు రూ. 70þ5 కిలోలు = 350 రూపాయలు కాగా అదనంగా పెరిగే శరీర బరువు 50 గ్రా.þ100 రోజులు = 5 కిలోల నుండి (5þ400) = రూ. 2000/- అదనపు ఆదాయాన్ని ఆశించవచ్చు. అంటే ఒక్కొక్క జీవంపై సగటున సుమారు 1650 రూపాయల వరకు నికరలాభం ఉంటుంది. ఇంతేకాక బలిష్టంగా కండపుష్టితో పెరిగిన ఈ జీవాలకు మార్కెట్‌లో గిరాకి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పోతు గొర్రెల నుండి నికర మాంసం దిగుబడి కూడా 3 నుండి 5 శాతం అధికంగానే ఉండవచ్చు.

గొర్రెలు-మేకలు నెమరువేసే జంతువులని మనందరికీ తెలుసు. మూడు నెలల వయస్సు దాటిన ఈ జీవాల పెద్దపొట్ట (రూమెన్‌)లో సహజంగానే ఉండే అనేక బ్యాక్టీరియా, ఇతర ఏకకణ పరాన్నజీవులు, ఇవి మేసిన మేతల్ని జీర్ణం చేసుకొనడంలో సహాయపడటంతోపాటు, ఆమేతలలో ఉండే కొన్ని నాణ్యమైన, విలువైన మాంసకృత్తుల్ని సంగ్రహించి, అభివృద్ధి చెంది తాము కూడా అంతర్గత ఆహారంగా జీవం చేత జీర్ణం కాబడి జీవాల మనుగడకు, ఉత్పాదకతను ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

అయితే విలువైన, ఖరీదైన పోషక పదార్థాలను ధ్వంసం చేసే రూమెన్‌లోని ఈ బ్యాక్టీరియా ఇతర సూక్ష్మక్రిముల దాడి నుండి తప్పించుకుని నేరుగా చిన్న ప్రేగులలో ప్రవేశించి, జీవానికి పూర్తి సహజ పోషక స్వభావంతో జీర్ణమయ్యే మేతల వల్ల జీవం తన పూర్తి పోషక అవసరాలను ఎక్కువ సమర్ధవంతంగా తక్కువ ఖర్చుతో తీర్చుకోగలదు. ఈ విధంగా రూమెన్‌లోని మార్పులను తప్పించుకుని (బైపాస్‌) ప్రేగులలో ప్రవేశించి జీవానికి ఉపయోగపడే పోషకాలను బైపాస్‌ పోషకాలుగానూ, అందులోని మాంసకృత్తులను బైపాస్‌ ప్రొటీన్లుగానూ వ్యవహరిస్తారు. 

ఉలవ గింజలలో ఉండే టానిన్‌ అనే పదార్థం వల్ల వీటికి, వీటితో కలిసిన ఇతర ముడిపదార్థాలలోని మాంసకృత్తులకు కూడా బైపాస్‌ స్వభావం ఏర్పడుతుంది. ఉలవలలోనే కాక ప్రత్తి చెక్క (కాటన్‌ సీడ్‌ కేక్‌)లో కూడా బైపాస్‌ ప్రొటీన్ల శాతం గణనీయంగానే ఉంటుంది.

ఉలవలలో 17.94 శాతం మాంసకృత్తులు, 14.94 శాతం క్రూడ్‌ ఫైబర్‌, 48.93 శాతం క్రొవ్వు సంబంధిత పదార్థాలు (ఈథర్‌ ఎక్ట్రాక్ట్‌), 14.4 శాతం సెల్యులోజ్‌తో పాటు జీవాలకు అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజ పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి.

ఉలవలలో ఉండే అనేక పోషక విలువలతో పాటు, వీటి వల్ల జీవాల జీర్ణశక్తి పెరగటంతో పాటు, విసర్జితాల ద్వారా జరిగే పోషకాల నష్టం తగ్గుతుందని కూడా కనుగొనబడింది. రోజుకు 31/2 నుండి 4 కిలోల సూపర్‌ నేపియర్‌, హెడ్జ్‌లూసర్న్‌, స్టైలోహమాటో ముఖ్యంగా చిలగడదుంప (స్వీట్‌ పొటాటో) వంటి పచ్చి గ్రాసాలతో పాటు మొక్కజొన్న, వరితవుడు, గోధుమ తవుడు, మినరల్‌ మిక్చర్‌, ఉప్పుతో పాటు ఉలవల పిండిని 25-30 శాతం వరకు కలిపి మేపవచ్చును. ఉలవల ధర ఎక్కువ అనిపిస్తే దానిని 15-20 శాతానికి తగ్గించి ఆ మేరకు చౌకగా లభించే ప్రత్తి చెక్క పిండిని కలిపి, 130 రోజులు దాటిన ప్రతి గొర్రెపోతు పిల్లకు పచ్చి మేతల లబ్యత నాణ్యతను బట్టి 150 నుండి 200 గ్రాముల వరకు మేపి మంచి ఫలితాలను పొందవచ్చును.

ఇటీవల హైదరాబాదు, విజయవాడ, గోదావరి తదితర జిల్లాలో ఉలవచారు తయారీ మంచి లాభదాయక పరిశ్రమగా వృద్ధి చెందుతోంది. అక్కడ ఉపఉత్పత్తిగా చౌకగా లభ్యమయ్యే ఉడికిన ఉలవపప్పును కూడా జీవానికి 150-200 గ్రాముల వరకు (ఉడికినపప్పులో తేమ శాతం 70 వరకు ఉంటుంది కాబట్టి) మేపి కూడా మంచి ఫలితాలు సాధించవచ్చును. ఉలవలు ఉడికించి పని పశువులకు, పందెపు గిత్తలకు అనాదిగా మేపుతూనే ఉన్నారు.

వాణిజ్యపరంగా సాంద్రపద్ధతిలో నిర్వహించే గొర్రెల పెంపకందారులు, బక్రీదు, రంజాన్‌, క్రిస్ట్‌మస్‌, దసరా, సంక్రాంతి వంటి వేట మాంసానికి అత్యధిక డిమాండు వుండే రోజులకు మూడు నెలల ముందు నుంచి ఉలవలు లేదా ప్రత్తి చెక్క కలిపిన దాణాలు మేపి తమ ఆదాయాలను మరింతగా పెంచుకోగలరు.                    

డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611

Read More

యువతకు స్ఫూర్తి

చదువుకున్న వాడికీ ఇతరులకు ఎంత తేడా ఉంటుందంటే బతికి ఉన్నోడికి, చచ్చిన వాడికీ ఉన్నంత తేడా ఉంటుందని అరిస్టాటిల్‌ చెబుతారు. దీనికి సరిగ్గా సరిపోతారు డాక్టర్‌ జీఆర్‌ చింతల. కొందరు తెలివైన వాళ్లు భూమిపై ఎంత ఎత్తు ఉంటారో, భూమి లోపల కూడా అంతే ఉంటారంటుంటారు పెద్దలు. దానికి ప్రత్యక్ష తార్కాణం ఆయన. గురిపెట్టి ఊరుకుంటే చాలదు, తుపాకీ గుండు పేల్చాలన్న సామెతను నిజం చేసి చూపుతాడు. ఉన్న ఆస్తులు ఊడ్చుకుపోయినా, కనిపించని కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని మనస్థత్వంతో ముందడుగు వేశారు. చదువు తప్ప మరేదీ తనను కాపాడలేదని నిర్ణయించుకున్నారు. చదువు, కష్టపడే మనస్తత్వం, చిత్తశుద్ధి, నలుగురికి మేలు చేయాలనే తపనతో నిచ్చెనమెట్ల వ్యవస్థలో పైమెట్టుకు చేరినవారు డాక్టర్‌ చింతల. డాక్టర్‌ కావాలనుకుని వ్యవసాయంలో పట్టా తీసుకుని ఎక్కడైతే చేరారో ఆ సంస్థకే ఛైర్మన్‌ అయిన ఖ్యాతి చింతల గోవిందరాజులుది. పుట్టింది గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు. ఈ ఊరుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు, శక్తులకు వేదిక ఆ ఊరు. ఇక్కడ పుట్టిన ఓ వ్యక్తి పి. కోదండ రామయ్య కాఫీ బోర్డ్‌ ఛైర్మన్‌, టొబాకో బోర్డ్‌ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేశారు. అదే ఊరికి చెందిన జీఆర్‌ చింతల నాబార్డ్‌ చైర్మన్‌ పదవిని అలంకరించడం విశేషం. ఈ ఊరికి చెందినవాళ్లు ఇంటికొకరైనా అమెరికా సహా వివిధదేశాల్లో ఉంటారంటే అతిశయోక్తి కాదు. రామినేని ఫౌండేషన్‌ పేరిట అవార్డులు ఇచ్చే కుటుంబం ఈ ఊరిదే. ఫుడ్‌ టెక్నాలజీలో పేరుగాంచిన మోడరన్‌ ఫుడ్స్‌ చైర్మన్‌గా పని చేసిన ఎం. మురళీకృష్ణ ఈ ఊరివారే. కోదండరామయ్య, మురళీమోహన్‌లు కూడా బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధులు కావటం విశేషం. కమ్యూనిస్టుగా ఉంటూ మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ తరగతుల (ఎంబీసీ) సిద్ధాంతకర్తగా ఎదిగి ఇటీవలే కన్నుమూసిన ఊసా సాంబశివరావు అనే ఉద్యమకారుడు ఈ ఊరి వారే కావడం గర్వకారణం.

బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి ఎదిగివచ్చిన అన్ని ముత్యాలలో మేలయిన ముత్యం జి ఆర్‌ చింతల. ఆయనది అరుదయిన వ్యక్తిత్వం. జీవితంలో ప్రతి అంశమూ ఆయనకు ఒక అవకాశమే. జీవిత వాస్తవాలను అంగీకరిస్తూ ఆ పరిధిలోనే సమాజ వృద్ధికి, తన ఎదుగుదలకు గల అవకాశాలను అన్వేషిస్తూ, పరిమితులను గుర్తిస్తూ, ఆ మార్గాన విజయాలు సాధిస్తూ సాగుతున్న ఆయన జీవన మార్గం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. నాబార్డులో దాదాపు 35 ఏళ్ళు పనిచేసి ప్రతి మలుపును అవకాశంగా మలచుకొని ఆ సంస్థ చైర్మన్‌గా ఎదిగి దేశానికి సేవలందిస్తున్నారు. ఆయన జీవన రేఖలు – క్లుప్తంగా…

గురి పెట్టి కొట్టారు… నాబార్డ్‌ ఛైర్మన్‌ అయ్యారు
నాబార్డ్‌ చైర్మన్‌గా దేశప్రజల మన్ననలు అందుకొంటున్న జి.ఆర్‌ చింతల గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామంలో 1962 సంవత్సరం జులై 15వ తేదీన జన్మించారు. వారి తాత చింతల పుల్లయ్య పెద్ద భూస్వామి, అంతకుమించి వితరణశీలి. ఆయన చేసిన దానధర్మాలకు అంతేలేదు. ఆయనకున్న 100 ఎకరాల మాగాణి భూమిలో దానధర్మాలకు పోయిందిపోగా, సంతానానికి పది ఎకరాలు మాత్రమే మిగిల్చారు.

వారి తండ్రి చింతల బుచ్చయ్య. ఆయన విద్యార్థి థలో మంచి ప్రతిభావంతుడు. ఆయనకు 1940 థకంలోనే గుంటూరు మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ చదివే అవకాశం వచ్చింది. కుటుంబ సమస్యల కారణంగా డాక్టర్‌ చదవలేకపోయారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చేసి విద్యాశాఖలో ఉద్యోగంలో చేరారు. తరువాత అక్కినేని కృష్ణకుమారిని వివాహం చేసుకొన్నారు. వారి కుమారుడు చింతల గోవిందరాజులు. ఆయనే జి ఆర్‌ చింతల.

బ్రాహ్మణకోడూరు గ్రామంలోనే మాగాణి పొలాల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగాడు చింతల. చిన్నతనంలో తాతయ్య, పెదనాన్నలు, బాబాయిలతో తరచుగా పొలం వెళ్ళేవాడు. ఏడేళ్లు వయస్సు వచ్చేవరకు అక్కడే పెరిగాడు. బ్రాహ్మణకోడూరు గ్రామానికి బకింగ్‌హామ్‌ కాలవ ద్వారా 1856 నుంచే సాగు నీటి వసతి వుండేది. ఆ గ్రామంలో100 ఏళ్లకు పూర్వం నుంచే హైస్కూల్‌ ఉండేది. నాలుగోతరగతి వరకు గోవిందరాజులు చదువు అక్కడే సాగింది. వారి తండ్రి చింతల బుచ్చయ్య ఉద్యోగరీత్యా గుంటూరుకు నివాసము మార్చారు. గుంటూరుకు చేరేవరకు గోవిందరాజులు, ఆయన సోదరుడు చదువులోనూ, లోకజ్ఞానంలోనూ బాగా వెనుకబడి ఉండేవారు. వారి తండ్రి బుచ్చయ్య ఆరు నెలలు ఉద్యోగానికి సెలవు పెట్టి పిల్లలకు చదువుచెప్పారు. ఆయన పెద్దబాలశిక్ష, ఇంగ్లీష్‌ అక్షరాలు, ఎక్కాలు నేర్పేవారు. తన తండ్రే తన తొలి గురువని చెబుతారు చింతల. తన తండ్రి నేర్పిన తొలిపాఠాలు ఇప్పటికీ తనకు మార్గదర్శకంగా ఉంటాయంటారు. గుంటూరులోని పానయ్య బడి, కాసు సాయమ్మ హైస్కూల్‌, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో అయన చదువు కొనసాగింది. శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో టెన్త్‌ క్లాస్‌, గుంటూరు జేకేసీ కాలేజీలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసాడు. క్లాసులో ఫస్ట్‌ ర్యాంకర్‌. సహవిద్యార్థులు (ప్రస్తుతం ప్రముఖ సర్జన్లు, న్యూరాలజిస్టులు, అంకాలజిస్టులుగా ఉన్నారు.) మెడిసిన్‌కు వెళ్లినా చింతల అటు వెళ్లాలనుకోలేదు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో చేరారు.

తన జీవితంలో అది ముఖ్యమైన మలుపుగా చెప్తారు చింతల. ఆ కాలేజీ జీవితం, నాటి అనుభవాలు తరచుగా గుర్తు చేసుకొంటుంటారు. బాపట్ల కాలేజీ తల్లిలాగా తనను అక్కున చేర్చుకొన్నదని, సహజీవనం నేర్పిందని, జీవితకాలం కలసిఉండే మంచి మిత్రులను కల్పించిందని అంటారు. నాటి స్నేహితులను వీలయినప్పుడల్లా పలకరిస్తుంటారు. ప్రతిభావంతులయిన అధ్యాపకుల మార్గదర్శకత్యంలో, 168 మంది సహాధ్యాయులు, స్నేహితుల ఆప్యాయత, అనురాగాలతో కోలాహలంగా, ఉత్సాహంగా నాలుగేళ్ల అగ్రికల్చర్‌ కోర్సు అట్టే గడచిపోయింది. ఆ రోజుల్లో గోవిందరాజులుకు అయన సహాధ్యాయి, మిత్రుడు కె ఉదయభాస్కరరెడ్డి అందించిన తోడ్పాటు మరువలేనిది, పాఠ్యాంశాలు, సమకాలీన పరిస్థితులను అర్ధం చేసుకొనేందుకు ఇతరత్రా కూడా ఆయన ఎంతగానో సహకరించారు. అప్పుడు ఉదయ భాస్కరరెడ్డి కళ్ళతో తాను ప్రపంచాన్ని చూచానంటారు చింతల. అంతగా ఉండేది వారి మైత్రీ బంధం. నాలుగేళ్ళ డిగ్రీ పూర్తయ్యాక బాపట్ల అగ్రికల్చరల్‌ కాలేజీలో ఆయేడాదే ప్రారంభమయిన ఎంఎస్‌సి అగ్రానమిలో చేరాడు. కాని తృప్తిగా అనిపించలా. ఏదో అసంతృప్తి. ఇంకేదో చెయ్యాలనే ఆలోచన ఉండేది. ఎందరో శాస్త్రవేత్తలను రూపొందించిన, అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్న, వ్యవసాయ విద్య, పరిశోధనలలో అగ్రగామి అయిన ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వైపు ఆయన మనసు మళ్ళింది. ఇష్టమైన బాపట్ల కాలేజీని, అప్పటికే ఒక సంవత్సరం పూర్తయిన ఎంఎస్‌సి చదువును వొదిలిపెట్టి ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (IARI)లో ఎంఎస్‌సి (Seed Science & Technology) మొదటి సంత్సరంలో చేరారు. ఇది ఆయన జీవితంలో మేలి మలుపు.
(IARI)లో చేరేందుకు ఆయనపడ్డ ఆరాటం, చేసిన యోచన తరువాత కాలంలో గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని ఫలితాలను చేకూర్చింది. IARI ఆయనలోని జిజ్ఞాసను పెంపొందించింది. సృజనాత్మకతను, నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను అలవర్చింది. గొప్పవ్యక్తుల పరిచయాలను కల్పించింది. దేశానికి బహుముఖ ప్రజ్ఞాశాలిని అందించింది. ఆయనకు గొప్ప భవిష్యత్ను కల్పించింది.

ఏంతో ఉత్సాహం, ఉద్వేగంతో IARI లో చింతల ఉన్నత విద్యాభ్యాసం సాగింది. IARI లో ప్రొఫెసర్‌ శ్రీమతి మాళవిక దద్లాని జిఆర్‌ చింతలను ఎంతగానో ప్రోత్సహించారు. ఇప్పటికి చింతల గొప్ప విజయాలు సాధించినపుడు ఆమె భుజంతట్టి అభినందిస్తుంటారు. డాక్టర్‌ చంథ్రేఖర్‌ (సిటిఆర్‌ఐ రాజమండ్రి) డాక్టర్‌ ఎస్‌విఎస్‌ఎస్‌ ప్రసాద్‌ (ఇన్‌కంటాక్స్‌) డాక్టర్‌ అర్జ శ్రీకాంత్‌ తదితరులు మంచి స్నేహితులు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇన్‌సర్వీస్‌ విద్యార్థి యాదగిరినాగ్‌ చింతలకు తోడుగా ఉండేవారు. డాక్టర్‌ అంచా శ్రీనివాసన్‌, అంచా అయ్యేశ్వరరావు చింతల వారి మిత్ర బృందానికి మార్గదర్శకంగా ఉండేవారు. డాక్టర్‌ వేణుగోపాల ముఖోపాధ్యాయ తనకు రోల్‌ మోడల్‌ అని జి ఆర్‌ చింతల చెప్తారు. డాక్టర్‌ వేణుగోపాలముఖోపాధ్యాయ విజ్ఞాన గని లాంటివారు. నిరంతర అధ్యయనశీలి. అయన కూడా నాబార్డ్‌లో చేరి సిజిఎంగా 2017లో రిటైర్‌ అయ్యారు.

ఐఎఆర్‌ఐలో ఎంఎస్‌సి చివరి సంవత్సరంలో ఉండగానే నాబార్డ్‌వారు క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌కు వచ్చారు. క్యాంపస్‌ రిక్రూట్మెంట్‌ అనేది ఐఎఆర్‌ఐలో గతంలో ఎన్నడూ లేదు, ఆఏడాదే కొత్తగా మొదలయింది. చింతల ఆప్లికేషన్‌ని అయన క్లాసుమేట్‌ రవీందర్‌సింగ్‌ (ప్రస్తుతం హూస్టన్‌లో ఉంటున్నారు) నింపి సబ్మిట్‌ చేశారు. విద్యార్థులంతా వేడుకగా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. నాబార్డ్‌ అధికారులు దాదాపు నాలుగొందలమంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి జిఆర్‌ చింతలతో సహా పదమూడు మందిని ఎంపిక చేసారు.

బొంబాయిలోని నాబార్డ్‌ కేంద్ర కార్యాలయంలో 1985 అక్టోబర్‌ ఒకటో తేదీన జిఆర్‌ చింతల రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ విభాగంలో ఉద్యోగంలో చేరారు. అలా చేరిన వాడు 2020 మే 27వ తేదీన ఆ సంస్థకు చైర్మను అయ్యాడు. కోవిడ్‌ మహమ్మారి సర్వత్రా వ్యాపించి ఉన్న కష్టకాలంలో కూడా దేశమంతా పర్యటిస్తూ సంస్థ, దేశాభివృద్ధికి కృషిచేస్తున్నారు. 2020లోనే ఎపిఆర్‌ఎసిఎ అధ్యకక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాబార్డ్‌లో ఆయన సుదీర్ఘ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. సమున్నత ప్రమాణాలతో, సంతోషకరమైన జీవనం ఆయన విధానం. సామాజిక బాధ్యతలు నిర్యహిస్తూ, పనిచేసే సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ అందులోనే తానుఎదుగుతూ సాగిన జిఆర్‌ చింతల జీవితం ఈనాటి యువతకు ఆదర్శం. ఏపదవిలోఉన్నా ఎలాంటి భాద్యత నిర్వర్తించాల్సి వచ్చినా దీక్షగా, మనస్ఫూర్తిగా చేయటం ఆయన నైజం. ప్రతి బాధ్యతను ఒక అవకాశంగా మార్చుకొనే నేర్పరి. వృత్తి, ఉద్యోగంపట్ల ఆయనకున్న నిబద్ధత కర్తవ్య నిర్వహణలో కనపరచే అకుంఠిత దీక్ష, సమయస్పూర్తి, నిర్ణయాలు తీసుకోవడంలో కనపరచే వొడుపు, పనిలో వేగం, నిర్దిష్టత ఆయన్ను ఉన్నత శిఖరాలకు చేర్చాయి.

నాబార్డులో చేరినవెంటనే నేషనల్‌ కెమికల్‌ లాబొలేటరీ వంటి ప్రముఖ సంస్థలతో జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం వచ్చింది.
సిఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన డాక్టరు మషేల్కర్‌ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చించే అవకాశం కలిగింది. 1987లో స్వయం సహాయక గ్రూపుల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక విధానాలను రూపకల్పన చేసేందుకు నాబార్డ్‌ ఏర్పాటు చేసిన అధికారుల బృందంలో జి.ఆర్‌ చింతల పనిచేశారు. ఆ తరువాతి కాలంలో స్వయం సహాయక గ్రూపులు (సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూపులు) దేశ వ్యాప్తంగా విజయవంతమయ్యాయి. 2001లో దేశంలో స్వయం సహాయక గ్రూపులు పదిలక్షలు దాటిన సందర్భంగా నాబార్డ్‌కు ఐరాస అవార్డు లభించింది.

ఐదేళ్ళు నాబార్డ్‌ కేంద్ర కార్యాలయంలో పనిచేసాక జిఆర్‌ చింతల హైద్రాబాదుకు బదిలీ అయ్యారు. హైద్రాబాదులో ఉద్యోగం ఆయన జీవితంలో అనేక సానుకూల మార్పులకు అవకాశం కల్పించింది. 23 జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. రైతులను, అధికారులను తరచుగా కలిసి మాట్లాడేవారు. ఇదే కాలంలో నాబార్డులో సహోద్యోగి సుశీలతో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నాబార్డ్‌ అనుబంధ సంస్థ అయిన NAB KISAN సిఇఒ & మేనేజింగ్‌ డైరెక్టరుగా పనిచేస్తున్నారు. హైద్రాబాద్‌లోనే వారికి ఒక పాప కూడా పుట్టింది.

అదేకాలంలో బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులలో చాలామందిని మళ్ళీ కలుసుకున్నారు చింతల. వారిలో దయాకర్‌, ఎస్‌వి ఎస్‌ఎస్‌, జె సత్యన్నారాయణ, వై వి ఆర్‌, మురళి, మైనర్‌ రమణ, వలేటి గోపీచంద్‌ (రమణ, గోపీచంద్‌ కాలేజీలో ఆయనకు జూనియర్లు అయితే వారు చూపే ఆప్యాయత మరువలేనిదని, తన సోదరుడు సివివి సాగర్‌తోపాటు వారు సోదర సమానులని చింతల పేర్కొంటారు) తదితరులున్నారు. పాత స్నేహాలు చిగురించాయి. ఆ ఆప్యాయతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
దాదాపు ఎనిమిది సంవత్సరాలు హైద్రాబాదులో పనిచేసాక డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొంది ఛండీగడ్‌కు బదిలీఅయ్యారు. అక్కడ నాబార్డ్‌ ప్రాంతీయ కార్యాలయంలో పనిచేస్తూ పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. బ్యాంక్‌ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. కాంట్రాక్టు వ్యవసాయ పద్దతులను, గ్రామీణ సహకార బ్యాంకుల పనితీరును అధ్యయనం చేశారు.

ఆ తరువాత లక్నోలోని బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (BIRD)లో ఫ్యాకల్టీ సభ్యునిగా పనిచేసే అవకాశం కలిగింది. ఐదేళ్లు అక్కడ పనిచేయడం వల్ల వివిధ రంగాలలో నైపుణ్యం పెంపొందించుకొన్నారు. మంచి వక్తగా, కన్సల్టెంటుగా ఎదిగారు. తరువాతకాలంలో అదే సంస్థకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. BIRDలో వున్నపుడు దేశంలోని అన్ని రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఇండోనేషియా, బంగ్లాదేశ్‌, కెన్యా, పెరూ, బొలివీయా బ్రెజిల్‌, నేపాల్‌, యూకే, అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ జర్మనీ, సౌత్‌ఆఫ్రికా, తదితర దేశాలలో పర్యటించారు. Swarna Jayani Swarojgar Yojana పథకానికి కన్సల్టెంట్‌గా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలలో దాదాపు లక్షమంది లబ్దిదారులను ఇంటర్వ్యూ చేశారు. దీనివల్ల ప్రభుత్వ పధకాల అమలు తీరుతెన్నులు, దేశంలో పేదిరికం స్థాయి తదితర అంశాలపై విస్తృతమైన అవగాహన కలిగింది.

తరువాత జనరల్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌ పొంది అండమాన్‌దీవులలో రెండేళ్లు పనిచేశారు. ఇలాంటిచోట పనిచేయడానికి చాలామంది ఇష్టపడరు. కాని జిఆర్‌ చింతల ఎలాంటి సంకోచము లేకుండా పనిచేశారు. దేశంలోని వేరే ప్రాంతాలనుంచి వ్యవసాయం, ప్రాసెసింగ్‌ రంగాలకు అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రప్పించారు. పోర్టుబ్లెయర్‌లో నాబార్డ్‌ కార్యాలయం, సిబ్బంది నివాసగృహాల నిర్మాణం చేపట్టారు.

అండమాన్‌లో అయన చూపిన చొరవ, ఉత్సాహం గమనించిన నాబార్డ్‌ యాజమాన్యం ఆయనకు ఢిల్లీ కార్యాలయ బాధ్యతలను అప్పగించింది. కేంద్రప్రభుత్వంతో లైజాన్‌ నిర్వహించడమే ఢిల్లీ కార్యాలయం ప్రధాన బాధ్యత. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌లతోపాటు సంబంధిత అధికారులతో సత్సంబంధాలు నెరపుతూ నాబార్డ్‌ పనులు చక్కబెట్టడం ద్వారా అటు ప్రభుత్వంలోనూ ఇటు నాబార్డ్‌లోను మంచి పేరు, గుర్తింపు పొందారు.

ఆతరువాత లక్నోలోని బ్యాంకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (BIRD) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆసంస్థ డైరెక్టర్లుగా పనిచేసిన వారిలో జిఆర్‌ చింతల పిన్న వయస్కులు. ఆయనకు 50 ఏళ్లకే ఆ పదవి దక్కింది. అక్కడనుంచి బెంగళూరు వెళ్లారు. కర్ణాటకలో నాబార్డ్‌ కార్యకలాపాల ఇంఛార్జిగా. రెండేళ్లలో కర్ణాటకలో నాబార్డ్‌ లావాదేవీలను ఏడువేలకోట్ల రూపాయలనుంచి 18000 కోట్ల రూపాయలకుపెంచారు.

బెంగళూరు నుంచి నాబార్డ్‌ కేంద్ర కార్యాలయానికి 24 ఏళ్ళ తరువాత మళ్ళీ వెళ్లారు. ఈసారి మైక్రో ఫైనాన్స్‌ విభాగాధిపతి. 25 ఏళ్ళ క్రితం దేశంలో రూపుదిద్దుకున్న స్వయం సహాయక గ్రూపులు ఇప్పుడు పరివర్తన థకు చేరుకొన్నాయి. ఆనాడు స్వయం సహాయక గ్రూపుల విధివిధానాల రూపకల్పనలో పనిచేసిన జిఆర్‌ చింతల ఇప్పుడా గ్రూపుల వివరాలు డిజిటైజ్‌ చేసేపని చేపట్టారు. దీనివల్ల స్వయం సహాయక గ్రూపుల పరపతి విధానం మెరుగవుతుంది. మూడేళ్లు తలమునకలుగా ఆ బాధ్యత నిర్వహించారు. ఆ కాలంలో దేశంలోని 100 జిల్లాలలో డిజిటైజేషన్‌ కార్యక్రమం సాగింది.

అక్కడనుంచి నాబార్డ్‌లో ప్రధాన విభాగమైన రీఫైనాన్సుకు ఆయన అధిపతి అయ్యారు. అదేసంస్థలో 25 ఏళ్ళు వివిధ విభాగాల్లో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించిన తరువాతనే ఆయనకు ఆ విభాగంలో పనిచేసే అవకాశం లభించింది. ఆవిభాగంలో అప్పటిదాకా 10 నుంచి 15 శాతం వరకు ఏటా వృద్ధి ఉండేది. దాన్ని నూరుశాతానికి పెంచుదామని మొదటి సమావేశంలోనే జిఆర్‌ చింతల చెప్పగా సిబ్బంది నివ్వెరపోయారు. సాధ్యం కాదని అన్నారు కూడా. కాని కార్యసాధకుడైన చింతల ఎలా సాధ్యమో వారికి వివరించి, అందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పది నెలల్లో లక్ష్యం సాధించారు. 50,000 కోట్ల రూపాయలు ఉన్న వ్యాపారం పదినెలల్లో 98,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఆయన ఆపదవిలో ఉన్నంతవరకు కొనసాగింది.
ఆ తరువాత నాబార్డ్‌ అనుబంధ సంస్థ NABFINS (Micro Finance)కు సిఇఓగా బెంగళూరు వెళ్లారు. అక్కడ బాధ్యతలు స్వీకరించిన రోజునే నాబార్డ్‌ డిఎండి పదవికి నోటిఫికేషన్‌ వచ్చింది. ఆపదవికి జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఎంపికయ్యారు. బెంగళూరు వెళ్లిన 55 రోజులకే నాబార్డ్‌ డిఎండిగా పదోన్నతి పొందారు. ఆ ఫలితాలు వెలువడ్డ ఆరు రోజులకే నాబార్డ్‌ చైర్మన్‌ పదవికి నోటిఫికేషన్‌ వెలువడింది. మూడు రోజులు, మూడు ప్యానెళ్లు జరిపిన ఇంటర్వ్యూలలో జిఆర్‌ చింతల తీవ్రమైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచారు. నాబార్డ్‌ ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. కరోనా మహమ్మారి విశ్వవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కూడా దేశమంతటా పర్యటిస్తూ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు.

తల్లితండ్రులు: చింతల బుచ్చయ్య, అక్కినేని కృష్ణకుమారి.
పుట్టిన స్థలం / తేదీ: 1962 జూలై 15, బ్రాహ్మణ కోడూరు, గుంటూరు జిల్లా
విద్యాబుద్ధులు: బ్రాహ్మణ కోడూరులో ప్రాధమిక విద్య, పాటిబండ్ల సీతారామయ్య హైస్కూలులో ఉన్నత విద్య, జేకేసీ కళాశాలలో ఇంటర్మీడియేట్‌. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ, ఎమ్మెస్సీ (అగ్రీ). భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ, న్యూఢిల్లీ.
గత, వర్తమాన హోదాలు: నాబార్డ్‌ ఛైర్మన్‌, 1985లో నాబార్డ్‌ చేరి అదే సంస్థకు ఛైర్మన్‌ అయిన ఖ్యాతి
ప్రస్తుత నివాసం/ చిరునామా: ముంబయి
సకుటుంబ సపరివార సమేత: భార్య సుశీల (నాబార్డ్‌ సహోద్యోగి కూడా), ఓ కుమార్తె.
ఇ-మెయిల్‌: grchintala@gmail.com
ఫోన్‌ నెంబర్‌: 9739150762

Read More

‘మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డు’ అందుకున్న ‘రైతునేస్తం’ వెంకటేశ్వరరావు

‘రైతునేస్తం’ వ్యవసాయ మాస పత్రికతో రైతు సేవలోకి అడుగుపెట్టి వ్యవసాయ మాస పత్రికలలో మార్పుకు శ్రీకారం చుట్టడంలో వేంకటేశ్వరరావు ముందువరుసలో ఉన్నారు. అప్పటి వరకు ఉన్న వ్యవసాయ మాసపత్రికలు శాస్త్రవేత్తల, అధికారుల సమాచారానికి చాలా ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ ఉండేవారు. అలాంటి సందర్భంలో ‘రైతునేస్తం’ పేరుతో కొత్తగా వ్యవసాయ మాస పత్రికను మొదలుపెట్టి రైతుల క్షేత్రస్థాయి అనుభవాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ అందుకు సంబంధించిన వ్యాసాలకు తగిన ప్రాముఖ్యతను ఇవ్వడం ప్రారంభించారు పాఠకులు ఈ మార్పును స్వాగతించి రైతునేస్తం పత్రికను ఆదరించడం జరిగింది. మిగతా వ్యవసాయ మాసపత్రికలు కూడా ఈ మార్పును గమనించి ఆయా మాసపత్రికలలో రైతుల క్షేత్ర స్థాయి అనుభవాలకు ప్రాముఖ్యతను పెంచడం జరిగింది. 2005వ సంవత్సరం నుండి రైతునేస్తం పత్రికను కొనసాగిస్తూ వస్తూ సేంద్రియ సాగు యొక్క ప్రాముఖ్యతను ఊహించి 2016వ సంవత్సరములో ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ స్థాపించి సేంద్రియ సాగుపై శిక్షణా తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. వ్యవసాయ రంగానికి వేంకటేశ్వరరావు అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019వ సంవత్సరంలో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ‘రైతునేస్తం ఫౌండేషన్‌’లో శిక్షణ పొందిన అనేకమంది రైతులు తమ రసాయన సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చారు. రెండు తెలుగు రాష్ట్రాలలో సేంద్రియ సేద్యానికి రైతునేస్తం వేంకటేశ్వరరావు అందించిన సేవలు ఎనలేనివి. ‘రైతునేస్తం ఫౌండేషన్‌’ యడ్లపల్లి వేంకటేశ్వరరావు సేంద్రియ సాగుకు అందించిన సేవలకు గుర్తింపుగా మహాన్యూస్‌ ఛానల్‌ వారు ‘మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డు’తో సత్కరించారు.


మహాన్యూస్‌ ఛానల్‌ వారు ఈ సంవత్సరం నుంచి ‘మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డు’లను ప్రారంభించారు. మొదటి అవార్డుల కార్యక్రమం జనవరి 9వ తేదీన హైదరాబాదు నగరంలోని దసపల్లా హోటల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్‌ రెడ్డి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, మహాన్యూస్‌ ఎండి మారెళ్ళ వంశీకృష్ణ పాల్గొన్నారు. సేంద్రియ సాగు అభివృద్ధికి వేంకటేశ్వరరావు చేస్తున్న కృషిని అభినందిస్తూ మహాన్యూస్‌ ఆర్గానిక్‌ అవార్డుతో ప్రముఖులు సత్కరించడం జరిగింది. సేంద్రియ సాగుకు తాము చేస్తున్న సేవలు గుర్తించి సత్కరించినందుకు మహాన్యూస్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ అవార్డు నా బాధ్యతను ఇంకా పెంచింది. సేంద్రియసాగు అభివృద్ధికి ఇంకా వేగంగా ముందుకు నడుస్తానని వేంకటేశ్వరరావు ఈ సందర్భంగా వాగ్దానం చేశారు.

Read More

రికార్డు దిశగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు

2021-22 సంవత్సరంలో భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటాయని అంచనాలు వెలువడుతున్నాయి. 2021 ఏప్రిల్‌ నుండి నవంబరు వరకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 31.05 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయనీ, గత సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఎగుమతులతో పోలిస్తే 23.21 శాతం ఎక్కువనీ అధికారికంగా ప్రకటించారు. మిగిలిన నాలుగు నెలల్లో మరో 19 బిలియన్‌ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగవచ్చని ఆశిస్తున్నారు. 2020-21 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 41.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ సంవత్సరం చివరి వరకు 20 శాతం వృద్ధి కొనసాగితే వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్‌ డాలర్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. 2017-18, 2018-19 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 38 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉండగా, 2019-20లో అవి 35.16 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. 2020-21 సంవత్సరంలో కరోనా ప్రభావం ఉన్నా వ్యవసాయ ఎగుమతులు 17.34 శాతం వృద్ధిని సాధించాయి. 2021-22లో వ్యవసాయ ఎగుమతుల వృద్ధి మరింత వేగం పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి.


తొమ్మిదో స్థానంలో భారత్‌
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 2019లో అమెరికా సంయుక్త రాష్ట్రాలు 118.3 బిలియన్‌ డాలర్ల ఆర్జనతో అగ్రస్థానంలో నిలిచింది. పువ్వులు, మొక్కల వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆధిక్యం కలిగిన నెదర్లాండ్స్‌ 79 బిలియన్‌ డాలర్లు ఆర్జించి ద్వితీయ స్థానంలో ఉంది. జర్మనీ (70.8 బిలియన్‌ డాలర్లు), ఫ్రాన్స్‌ (68 బిలియన్‌ డాలర్లు), బ్రెజిల్‌ (55.4 బిలియన్‌ డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చైనా, మెక్సికో, మలేషియాల తర్వాత భారత్‌ తొమ్మిదో స్థానంలో నిలిచినట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కలు చెబుతున్నాయి. ఈ సంవత్సరం భారత్‌ తన స్థానాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019లో యూరోపియన్‌ యూనియన్‌ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో 16.1 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 13.8 శాతం వాటాతోనూ, బ్రెజిల్‌ 7.8 శాతం వాటాతోనూ, చైనా 5.4 శాతం వాటాతోనూ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


2019లో భారతదేశపు వాటా 3.1 శాతంగా ఉంది. 2020-21లో అది 3.6 శాతానికి పెరిగినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడినప్పుడు భారతదేశపు వాటా 1.5 శాతం మాత్రమే. గత 25 సంవత్సరాల్లో ఈ వాటా రెట్టింపైంది. ప్రపంచ జనాభాలో ఆరవవంతు ప్రజలు కలిగి, వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయమైన వాటా కలిగిన భారతదేశపు వాటా మరింత పెరగాల్సిన అవసరం ఉంది. 2021-22 సంవత్సరంలో భారతదేశం 21 మిలియన్‌ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసి ప్రథమ స్థానంలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం సముద్ర ఉత్పత్తులైన చేపలు, రొయ్యలు, పీతలు వంటి ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్‌ డాలర్ల విలువను అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. సోయాచిక్కుడు, మొక్కజొన్న, గోధుమల ఎగుమతుల్లో అమెరికాకు, పామాయిల్‌ ఎగుమతిలో ఇండోనేషియాకు అగ్రస్థానం ఉన్నట్లుగా బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానాన్ని, చేపల ఎగుమతిలో ద్వితీయ స్థానాన్ని, పత్తి ఎగుమతుల్లో మూడవ స్థానాన్ని సాధించటం గర్వకారణం. పశుమాంసం, పంచదార, నూనె తీసిన చెక్క, ఆముదం, వేరుశనగ, తాజాపండ్లు, తాజా కూరగాయలు, ప్రాసెస్‌ చేసిన పండ్ల రసాలు, ప్రాసెస్‌ చేసిన ఆహారం మొదలైన ఇతర ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా ఉన్నాయి. వ్యవసాయ ఎగుమతుల్లాగానే వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతుల్లో కూడా మంచి వృద్ధి కనిపిస్తుంది. గత 15 సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులు ఏడు రెట్లు పెరగ్గా, దిగుమతులు ఎనిమిదిరెట్లు పెరిగాయి. దిగుమతుల్లో వంటనూనెలు 54 శాతం ఆక్రమించగా, తాజా పండ్లు, అపరాలు, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు కలిపి మరో 26 శాతం విలువ కలిగి ఉన్నాయి. అయినా 2019-20లో వ్యవసాయ ఎగుమతుల ద్వారా 2.52 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించగా, దిగుమతుల ద్వారా 1.47 లక్షల కోట్లు ఖర్చయ్యాయి. 2019-20లో 1.05 లక్షల కోట్ల రూపాయల వ్యాపార మిగులుండగా, 2020-21లో అది 1.33 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. మొత్తం దేశంలో ఉత్పత్తయిన వ్యవసాయ ఉత్పత్తుల విలువలో ఎనిమిది శాతంగానూ, నికర వ్యాపార మిగులు నాలుగు శాతంగానూ ఉన్నాయి. వ్యవసాయ ఎగుమతులు దిగుమతులకన్నా ఎక్కువగా ఉండి, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం వ్యాపార మిగులుని కలిగి ఉండటం అభినందనీయం.


మొత్తం ఎగుమతుల్లో తగ్గుతున్న వాటా
2000-01 సంవత్సరం నాటికి మొత్తం దేశపు ఎగుమతుల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 20 శాతంగా ఉండేది. 2019-20లో అది 11 శాతానికి తగ్గింది. మొత్తం దేశపు ఎగుమతులు 2019-20లో 313.3 బిలియన్‌ డాలర్లుండగా, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 35.16 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అయితే కరోనా ప్రభావంతో దేశపు మొత్తం ఎగుమతుల విలువ 2020-21లో ఏడు శాతం తగ్గి, 291.8 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. కరోనా ప్రభావం వల్ల అనేక దేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి, కొరత ఏర్పడింది. కాని భారతదేశంలో కరోనా కాలంలో కూడా వ్యవసాయ ఉత్పత్తులు పెరగటం వల్ల ఎగుమతుల ద్వారా 41.25 బిలియన్‌ డాలర్లుని ఆర్జించగలిగాము. వ్యవసాయ ఉత్పత్తుల విలువ మొత్తం దేశపు ఎగుమతుల్లో 14 శాతంగా ఉంది. 2020-21లో మొత్తం వ్యాపారలోటు 72.01 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా తగ్గినా కూడా వ్యాపార లోటు దాదాపు 20 శాతంగా ఉంది. 2021-22 లో ముడి చమురు ధరలు భారీగా పెరగటం వల్ల ఈ సంవత్సరం వ్యాపారలోటు దాదాపు 35 శాతానికి చేరుకోవచ్చు. వ్యవసాయ వాణిజ్యంలో మిగులు పెరగటం వల్ల దేశపు వ్యాపారలోటుని కొంతవరకు పూడ్చగలుగుతున్నది.


భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రధాన మార్కెట్లుగా అమెరికా, చైనా, బంగ్లాదేశ్‌, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, వియత్నాం, సౌదీఅరేబియా, ఇండోనేషియా, నేపాల్‌, ఇరాన్‌, మలేషియాలు ఉన్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఇండోనేషియా మార్కెట్లో రెట్టింపయ్యాయి. బంగ్లాదేశ్‌కు జరిగిన ఎగుమతుల్లో 96 శాతం, నేపాల్‌కు జరిగిన ఎగుమతుల్లో 57 శాతం వృద్ధి నమోదైంది. సేంద్రియ ఆహార ఎగుమతులు 51 శాతం పెరిగి, 1.04 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. యూరోప్‌కు చేస్తున్న బాస్మతీ బియ్యం ఎగుమతులు మాత్రం పురుగుమందుల అవశేషాల కారణంగా దెబ్బతిన్నాయి. యూరోపియన్‌ దేశాలు పురుగుమందుల అవశేషాల విషయంలో కఠిన నిబంధనలను విధించడం వల్ల బాస్మతీ ఎగుమతిదారులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇందుకోసం పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది రసాయనిక పురుగు మందుల వాడకాన్ని నిషేధించింది. పురుగు మందులు, శిలీంద్రనాశకాల వాడకాన్ని తగ్గించగలిగితే మన వ్యవసాయ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.


ఎగుమతి ప్రోత్సాహకాలు
భారత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరగటానికి భారత ప్రభుత్వం కొంతమేరకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను అనేక దేశాలకు ఎగుమతి చేయడానికి, అధిక విలువ కలిగిన, విలువ జోడించిన ఉత్పత్తుల వాణిజ్యానికి ప్రాధాన్యమిస్తున్నది. ప్రపంచవాణిజ్యంలో భారత వాటాను రెట్టింపు చేయాలనే దీర్ఘకాల లక్ష్యంతో ఎగుమతిదారులు ఎదుర్కుంటున్న వ్యాపార అడ్డంకులను అధిగమించటానికి, వివిధ దేశాలు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను చేరుకోవటానికి ప్రత్యేక పథకాలను అమలు చేస్తున్నది. కొత్తగా ఎగుమతి కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఎగుమతిదారులకు అవసరమైన ధృవపత్రాలను ఆన్‌-లైన్‌ పద్ధతిలో అందించటం, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించటానికి కంట్రోల్‌ రూములను ఏర్పాటు చేయడం, ధృవపత్రాల కాలపరిమితి ముగుస్తున్నప్పుడు వాటిని పునరుద్ధరించడం వంటి చర్యలు ఎగుమతిదారులకు సాయపడుతున్నాయి. అనేక వ్యవసాయ ఉత్పత్తులకు, ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఉత్పత్తులకు రవాణా సబ్సిడీని, మార్కెటింగ్‌ సహకారాన్ని అందిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, ప్రాసెసింగ్‌ అభివృద్ధి అథారిటీ (ఏపిఇడిఏ), సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (ఎంపిఇడిఏ), టొబాకో బోర్డు, కాఫీ బోర్డు, టీ బోర్డు, సుగంధద్రవ్యాల బోర్డు, రబ్బర్‌ బోర్డు వంటి సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, ఎగుమతులకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ట్రిబ్యునళ్ళు, కోర్టుల్లో భారత్‌కు వ్యతిరేకంగా ఇతర దేశాలు పలు ఫిర్యాదులు చేస్తున్నాయి. పంచదార ఎగుమతులకు భారత ప్రభుత్వం సబ్సిడీలను ఇస్తున్నదనే ఫిర్యాదుపై ఇటీవల భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ కోర్టు ఆదేశాలనిచ్చింది. దానిపై మనదేశం వేసిన అప్పీలు విచారణలో ఉన్నది. ఇలాగే ఇతర దేశాలు అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పలు ఫిర్యాదులు విచారణలో ఉన్నాయి. వ్యాపార పరంగా ఉన్న చిక్కులు కారణంగా 1994 తర్వాత మరో వ్యాపార ఒప్పందానికి ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాల ఆమోదాన్ని సంపాదించలేకపోతున్నది.


దేశంలో పెరుగుతున్న వైరుధ్యాలు
దేశంలో ధనికులు, పేదల మధ్య ఆదాయ పరంగానూ, సంపద పరంగానూ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. 1991లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విధానాలు ఈ వ్యత్యాసాలు పెరగటానికి కారణమయ్యాయి. గత రెండేళ్ళుగా కరోనా ప్రభావంతో అధిక సంఖ్యాకులు ఉపాధిని, జీవనాధారాన్ని కోల్పోగా, ధనికుల సంపద మాత్రం విపరీతంగా పెరిగింది. వరుసగా మూడేళ్ళపాటు వాతావరణం అనుకూలించడంతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి. ఆ ప్రభావం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై కూడా పడింది. కాని వ్యవసాయదారుల ఆదాయాలు పెరగలేదు. వ్యవసాయరంగానికీ, ఇతర రంగాలకు మధ్య వ్యాపార తులనాత్మకత దెబ్బతిన్నది. ధరల వ్యవస్థ రైతులకు వ్యతిరేకంగా మారి, అధికోత్పత్తి, ఎగుమతుల పెరుగుదల వల్ల కలిగే ప్రయోజనాలు దోపిడీకి గురయ్యాయి. ఒకవైపు ఆహార భద్రతా సూచీలో భారత్‌ ఇతర దక్షిణాసియా దేశాల కన్నా వెనకబడి ఉందని అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు గోదాములు ఆహార ధాన్యాలతో నిండి, ఎగుమతులు పెరుగుతున్నాయి. 9 శాతం నిరుద్యోగంతో ఉపాధి లేని పెరుగుదల ఒక సమస్యగా నిలిచింది. రైతులకు ప్రయోజనం చేకూర్చని వ్యవసాయోత్పత్తుల పెరుగుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నది. ఆదాయ పంపిణీలో తీవ్రమౌతున్న అసమానతలు విధాన లోపాలను ఎత్తి చూపుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల్లో వృద్ధినీ, ఎగుమతుల్లో పెరుగుదలను రైతులకు ప్రయోజనకరంగా మార్చటం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సమస్య!


డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

సేంద్రియ పద్ధతులే శరణ్యం

లావణ్యా రమణారెడ్డి

పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలను తీర్చే ధ్యేయంతో వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టబడినవి. రసాయనాలు వచ్చిన కొత్తలో రైతులు తమ పంటల సాగులో రసాయనాలు వినియోగించటానికి విముఖత చూపగా శాస్త్రవేత్తలు బలవంతంగా కొంతప్రాంతంలో తగు మోతాదులో రసాయనాలు వినియోగించడము జరిగింది. రసాయనాలు వినియోగించిన ప్రాంతంలో పంటలు ఆశాజనకంగా కనిపించటముతో రైతులు రసాయనాలు వినియోగిస్తూ పంటలు సాగు చేయడం మొదలయ్యింది. అప్పట్లో శాస్త్రవేత్తల సలహాల మేరకు ఎక్కువ మొత్తంలో సేంద్రియ పదార్థాలను మరియు కొద్ది మొత్తంలో రసాయనాలను వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్న కాలంలో వివిధ రకాల కారణాల వలన కొంత మంది రైతులు సేంద్రియ పదార్థాలను ప్రక్కన పెట్టి పూర్తిగా రసాయనాలనే ఉపయోగిస్తూ పంటలు పండించడము మొదలు పెట్టారు. సేంద్రియ పదార్థాలను అసలు వినియోగించకుండా విచక్షణా రహితంగా రసాయనాలు వినియోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూండడము వలన మొక్కలలో రోగనిరోధక శక్తి తగ్గడము, చీడపీడల ప్రభావం పెరగటం, కొన్ని రకాల చీడపీడలు రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ రసాయనిక పురుగుమందులకు నివారణకాకపోవడంతో రైతులు చీడపీడల నివారణకు ఎక్కువగా ఖర్చుపెట్టవలసి వస్తుంది. అయినా చీడపీడలు నివారించలేక పంటను నష్టపోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సంవత్సరం మిరప రైతుల పరిస్థితి పరిశీలిస్తే విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలన జరిగే ప్రమాదం అర్థం అవుతుంది. మిగతా పంటలతో పోల్చుకుంటే మిరప పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ చీడపీడలను నివారించటానికి రైతులు యేయేటికాయేడు కొత్త మందులను వినియోగిస్తూ వస్తున్నారు. విచక్షణా రహిత రసాయనాలకు అలవాటు పడిన చీడపీడలు రోగనిరోధక శక్తిని పెంచుకొని నివారణ కాలేని పరిస్థితులు ఈ సంవత్సరం మిరప రైతులకు ఎదురయ్యింది. కొత్త రకం తామర పురుగులు మరియు నల్లి లాంటి పురుగులు మిరప రైతులను ఇబ్బందికి గురి చేసినవి. చేస్తున్నవి. ఎన్ని రకాల రసాయనిక మందులు ఉపయోగించినా కూడా ఈ చీడపీడలను నివారించలేక కొంతమంది మిరప రైతులు తమ పంటను పీకివేసి జొన్న, సోయా, మినుము, నువ్వు లాంటి పంటలు వేసుకుంటున్నారు. కొంతమంది వచ్చినకాడికి దిగుబడి వస్తుందనే ఆశతో మార్కెట్లో అందుబాటులోకి వచ్చిన అన్ని నివారణా మార్గాలవైపు పరుగులు తీస్తున్నారు. మొత్తానికి ఈ సంవత్సరం మిరప రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితులలో సేంద్రియ పద్ధతిలో మిరపను సాగు చేస్తే ఫలితాలు ఉంటవి అని నిరూపిస్తూ పంటల సాగుకు సేంద్రియ పద్ధతులే శరణ్యం అని అంటున్నారు నాగర్‌కర్నూలు జిల్లా, కారువంగ గ్రామానికి చెందిన సేంద్రియ రైతు దంపతులు లావణ్యా రమణారెడ్డి.


రసాయనిక వ్యవసాయం చేస్తూ నష్టాలపాలై వ్యవసాయాన్ని వదలి వేరే రంగంలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నప్పుడు సేంద్రియ సాగు గురించి తెలుసుకుని తమ సాగులో సేంద్రియ పద్ధతులను ఆచరించడం మొదలు పెట్టారు. అప్పటినుంచి పెట్టుబడులు తగ్గడముతో పాటు మొదటలో దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నా కూడా ఏ మాత్రం వెనుకంజ వేయకుండా తమ సేంద్రియ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. క్రమంగా దిగుబడులు పెరగడము మొదలయ్యింది. వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్మడం మొదలుపెట్టారు. ఈ పరిణామాల వలన తమ పంటలసాగు లాభాల బాటలో పయనించడం మొదలయ్యింది. ఇంక వెనుకడుగు వేయకుండా తమ సేంద్రియ సాగును కొనసాగిస్తూ వివిధ రకాల పంటలలో అంటే మిరప, ప్రత్తి, కంది, వరి, జొన్న, సజ్జ, నువ్వులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర లాంటి చాలా రకాల పంటలు పూర్తి సేంద్రియ పద్ధతులలో పండిస్తూ అత్యధిక దిగుబుడలు అంటే రసాయనసాగు చేసే రైతులతో సమానంగా, కొన్ని పంటలలో రసాయనిక సాగు చేసే రైతుల కంటే ఎక్కువ దిగుబడులు సాధిస్తూ లాభసాటి సాగును కొనసాగిస్తున్నారు. మిగతా పంటలు ప్రక్కన పెడితే మిరప పంట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.


గత 20 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో మిరప పంటను పండిస్తూ వస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే మిరప పంటకు చాలా ప్రత్యేకత ఉంది. మిరప పంటకు పెట్టుబడులు ఎక్కువ. మిరప పంటకు చీడపీడల ప్రభావం ఎక్కువ. చీడపీడల నివారణకు రసాయనిక పద్ధతులు పాటించే రైతులు విపరీతంగా రసాయనాలు పిచికారి చేస్తుంటారు. కొంతమంది రైతులు నెలకు 6 సార్లకు తగ్గకుండా రసాయన కీటకనాశనులను పిచికారి చేయడంతోపాటు ఎకరానికి 30 బస్తాలకు పైగా రసాయన ఎరువులు అందిస్తూ మిరప పంటను సాగు చేసే రైతులు ఉన్నారు అంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అందువలన మిరప రైతులకు పెట్టుబడులు ఎక్కువగా అవుతుంటాయి. ఈ సంవత్సరం చీడపీడలను నివారించలేక రసాయన పద్ధతులు పాటించిన రైతులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులో కూడా పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న లావణ్యారమణారెడ్డి గారి మిరప తోట ఆరోగ్యంగా ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 20 క్వింటాళ్ళ ఎండుమిరప దిగుబడి వచ్చేలా ఉంది.


సొంత పంట నుంచి నాటు విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తనాలను బీజామృతంతో విత్తనశుద్ధి చేసుకుని నారుపోసుకున్నారు. 35-40 రోజుల వయస్సు గల నారుని బీజామృతంలో ముంచి నారు నాటించారు. దుక్కిలో ఎకరానికి 300 కిలోల ఘనజీవామృతం అందించారు. పంటకాలం మొత్తం ఎకరానికి 500 లీటర్ల వరకు ద్రవజీవామృతం భూమికి అందించారు. నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, థపర్ణి కషాయం, విషముష్టి కషాయం, పుల్లటి మజ్జిగలను అవసరాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వచ్చారు. పంటలో అంతర సేద్యం ఆపి వేసిన తరువాత ధనియాలు, ఉల్లి, వెల్లుల్లి, సోంపు, మెంతి, జీలకర్ర, ఆవాలు మొదలగు అంతర పంటలు నాటించారు. పంటలో అక్కడక్కడా ఎర పంటలుగా ఆముదాలు, బంతి మొక్కలు నాటించడంతో పాటు పచ్చ పురుగు మరియు లద్దె పురుగుకు సంబంధించి లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేశారు. ఎకరానికి 30 చొప్పున బులుగు రంగు మరియు పసుపు రంగు జిగురు అట్టలను అమర్చారు. అంతకుమించి ఎలాంటి రసాయనాలు వినియోగించలేదు. అయినాకాని రసాయనాలు వినియోగించిన పంటలతో పోలిస్తే వీరి మిరప పంట ఆరోగ్యంగా, ఆకర్షణగా ఉంది. 4 ఎకరాల మిరపలో ఒక్క మొక్క కూడా బొబ్బర మొక్క ఇప్పటి వరకు అంటే జనవరి 26 వ తారీఖు వరకు కనిపించలేదు. మొక్క ఎదుగుదల కూడా బాగా ఉంది. కొన్ని చోట్ల 5 అడుగుల వరకు మిరప పంట పెరిగింది. వాస్తవంగా పంట ఎదుగుదలను చూస్తే ఎకరానికి 40 క్వింటాళ్ళ దిగుబడి దాటవచ్చు అనిపిస్తుంది. కాని పంటను గమనించినట్లయితే ఎకరానికి 20 క్వింటాళ్ళకు తగ్గదు అనేలా ఉంది. వీరి పంటలో తాలు కాని, మచ్చ ఉన్న కాయలు కాని ఎక్కువగా లేవు. 10 శాతం కన్నా తక్కువే తాలు లేదా మచ్చ కాయలు ఉన్నాయి. మరిన్ని వివరాలు 7730061819 కి ఫోను చేసి తెలుసుకోగలరు.


డి. ప్రసాద్‌, రైతునేస్తం ప్రత్యేక ప్రతినిధి

Read More

స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతున్న ‘ఇక్రిశాట్‌’

ఇక్రిశాట్‌… అంతర్జాతీయ స్థాయిలో మెట్టపంటల గురించి పరిశోధనలు చేసే వ్యవసాయ సంస్థ. ప్రపంచంలోని సబ్‌ సహారా దేశాలను ఆకలి నుండి విముక్తి చేసి, ఆయా దేశాల్లోని నిరుపేదల జీవితంలో వెలుగులు నింపేందుకు పనిచేస్తోన్న ఓ వ్యవసాయ పరిశోధనా కేంద్రం. తాగునీటికే కష్టమై, బతుకు దుర్బరమై, రోజువారీ జీవితమే గడవటం కష్టంగా ఉన్న ఆఫ్రికాఖండంలోని నిరుపేద దేశాలతో పాటు ప్రపంచంలోని మెట్టప్రాంతాలలో జీవన స్థితిగతులు మెరుగుపడేందుకు వ్యవసాయరంగంలో మౌలిక మార్పులు తీసుకొచ్చి వారికి వెలుతురుతోవలు చూపేందుకు నిర్విరామంగా గత 49 సంవత్సరాలుగా పనిచేస్తోన్న సంస్థ. ఈ సంస్థ తన ప్రయాణంలో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. స్వర్ణోత్సవాలను భారత ప్రధాని ఫిబ్రవరి 5న లాంఛనంగా ప్రారంభిస్తారు.


గత ఐదు థాబ్దాల ఇక్రిశాట్‌ను పరిశీలిస్తే కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ పంటల పరిశోధనలో అత్యుత్తమ పరిశోధనలు జరిపారు. ఈ ఐదు పంటలు తీవ్ర వర్షాభావాన్ని కూడా తట్టుకుని రైతుకు కొంత దిగుబడినిచ్చే శక్తి కల్గి ఉన్నాయి. వాటి ఈ ప్రత్యేక లక్షణాలు ఆధారంగా ఆ పంటల్లో కనీస దిగుబడులు పెంచేందుకు చేసిన శ్రమ ఫలించింది. వీరు తీసుకొచ్చిన రకాలు, హైబ్రిడ్లు, సాగు పద్ధతులు ఆయా ప్రాంతాలలో గణనీయమైన మార్పుకు దోహదపడ్డాయి. పంటలలో సాగు విధానాలు, రకాల అభివృద్ధితోపాటు నీటి సంరక్షణ పద్ధతులు, అతి తక్కువ ఖర్చుతో భూమి యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ విధానాలు, వాటర్‌షెడ్‌ పరిజ్ఞానం, యాంత్రీకరణ విధానాలు సత్ఫలితాలనిచ్చాయి. మనదేశం, మన రాష్ట్రాల్లో కూడా వీటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. అన్నిరంగాలలో వెనుకబడిన పలు ఆఫ్రికాదేశాలకు అండగా నిలిచాయి. కొండంత భరోసా నిచ్చాయి.


తన 50 యేళ్ల గమనంలో ఎందరో భారతీయ శాస్త్రవేత్తలను అక్కున చేర్చుకుంది. విశ్వశాస్త్రవేత్తలయ్యేలా చేయడంలో కీలక భూమిక నిర్వహించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవటానికి ప్రేరణగా నిలిచింది. ఎంతోమంది విద్యార్థులు పరిశోధనలకు, ఆధునిక విజ్ఞాన ధోరణులు, పోకడలు, పద్ధతులు ఇక్కడివారికి తెల్సుకోవటానికి, ముందుకు సాగేందుకు ఓ బాట చూపిందనటంతో సందేహం లేదు. అందువల్ల ఇక్రిశాట్‌ ప్రభావాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా అంచనా వేసేందుకు కొలమానాలు లేవు. అంకెలు, లెక్కలతో తీరేది కాదు. మానవ అభివృద్ధిని ఏ పరిమితులుకు లోబడి కొలవాలి? ఎలా అంచనా వేయాలి? ఎలా అర్థం చేసుకోవాలి? వీటన్నింటికీ సమాధానం కాలమాన పరిస్థితులు ఆధారంగానే అంచనా వేయాల్సిఉంటుంది.


అందువల్ల ‘ఇక్రిశాట్‌’ 1972 నుండి కాలంతో పాటు మారుతూ వస్తుంది. దాని చిహ్నం లోగోలో కూడా మార్పులు కన్పిస్తాయి. దానికొచ్చే నిధుల ప్రవాహంలో కూడా తీవ్రమైన మార్పులు వచ్చాయి. నిధులలేమి వెంటాడుతూ ఉంది. ‘ఇక్రిశాట్‌’ కూడా తన నిధులను తను సమీకరించుకునే ప్రయత్నంలో భాగంగా కొత్తమార్పులకు తెర తీసింది. గతంకంటే పారదర్శకత పెరిగింది. భాగస్వామ్యం ఎక్కువయింది. అక్కడ ఉన్న శాస్త్ర, సాంకేతిక వనరుల బదిలీతోపాటు సద్వినియోగం చేసుకునేందుకు చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో భారతీయ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు రంగంలోని కంపెనీలు వారికి కావల్సిన ఒప్పందాలు, అవగాహనలు కుదుర్చుకున్నాయి. మరెన్నో అంకుర కంపెనీలు వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయి. ఒకరకంగా ఇవన్నీ శుభపరిణామాలే.


వ్యవసాయ పరిశోధనల పరంపరకొనసాగాలి. అది సమస్త మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి. ఆకలి, పేదరికంలేని ప్రపంచం కావాలి. ఆ దిశగా చిత్తశుద్ధితో అడుగువేసే ఏ సంస్థ అయినా చిరకాలం వర్ధిల్లాలి.

– వేంకటేశ్వరరావు

Read More