మే నెలలో సేద్యపు పనులు

కరోనాతో సంబంధం లేకుండా పంటల ఉత్పత్తి క్రితం 2 సంవత్సరాలలో జరిగింది. పండిన పంటను మార్కెటింగ్‌ చేయడంలో రైతులు ఇబ్బంది పడినారు. ప్రస్తుతం కరోనా మెల్లమెల్లగా పెరుగుతున్నది. మే నెలలో ఇంకా ఎక్కువయి థర్డ్‌వేవ్‌ రావచ్చని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మే నెల (భరణి, కృతిక, రోహిణి కార్తెలు)లో వ్యవసాయపు పనుల గురించి తెలుసుకుందాం.

వరి: తెలంగాణలో మద్దతు ధరకు వరి కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొని చర్యలు తీసుకుంటున్నది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పద్ధతి పాటిస్తే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాల పలుకుబడి కూడా పెరుగుతుంది. మే నెలలో చలికాలపు పంట మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. ధరలు తక్కువగా ఉన్నప్పుడు వడ్లను నిల్వ చేసి పాతయినాక బియ్యం చేసి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. ప్రతి రైతు వడ్లను బియ్యం చేసి అమ్ముకునేందుకు అనుకూలమైన చిన్న చిన్న మొబైల్‌ మిల్లులను సబ్సిడీలిచ్చి ప్రోత్సహిస్తే, పెద్ద మిల్లులపై ఆధారపడడం తగ్గుతుంది. రైతులకు, వినియోగదారులకు అనుకూలంగా ధరలుంటాయి. ప్రతి రైతూ వడ్లను పాతవయ్యేంతవరకు నిల్వ చేయడం, బియ్యం చేసి అమ్మడం వంటి కార్యక్రమాలు గ్రామాల్లో చేపట్టవచ్చు. వర్షాకాలపు వరి నారుపోయుట, మే చివరి వారంలో మొదలవుతుంది. రోహిణి కార్తె 25-5-22 నుండి 7-5-22 వరకు ఉంటుంది. ఈ కార్తెలో నారుపోసి, నాటిన వరి, చీడపీడల బారిన పడకుండా, చాలావరకు తప్పించుకుంటుంది. నీటి లభ్యత అనుకూలంగా ఉండి, ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి అనుకూలంగా లేని చోట మాత్రమే వరి వేస్తే మంచిది. వరి పంట దేశ అవసరాలకు మించి పండుతున్నందున, ఎగుమతి చేయడానికి విలువ పెంచిన సరుకు తయారు చేసి బయటి దేశాలకు పంపడానికి ప్రయత్నాలు ఎక్కువ చేయాలి. ప్రభుత్వాల మీద ఆధారపడకుండా స్వంతంగా మార్కెట్‌ చేసుకోగలమనే రకాలనే సాగు చేస్తే మంచిది. కొత్త రకాలను కొద్ది భూమిలో పండించి ఈసారి లాభసాటి ధరకమ్ముడుపోతే, వచ్చే సీజన్లలో వీటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు.

ప్రత్తి: ఈసారి ప్రత్తి ధరలు క్వింటాలు 10 వేల రూపాయలు దాటాయి. వర్షాలు బాగా పడి, లేక నీటి వసతి ఉన్న చోట మే నెల కడవారంలో (రోహిణిలో) విత్తేపత్తిలో చీడపీడల ముఖ్యంగా గులాబిరంగు పురుగు బాధ చాలా తక్కువగా ఉంటుంది. అధిక సాంద్రతతో చల్కా భూముల్లో కూడా సాగు చేయవచ్చు. సాలుకు సాలుకు 80 సెం.మీ. సాలులో మొక్కల మధ్య 20 సెం.మీ. దూరంలో మొక్కలు నాటి ఎకరాకు 25000 మొక్కలు పెంచవచ్చు. చైనా నుండి ప్రత్తి దిగుమతి ఆపి వేయడం వలన, గులాబి రంగు పురుగు ఉధృతి వలన ప్రత్తి లభ్యత తగ్గి క్రితం సంవత్సరం ప్రత్తి పంటకు మంచి ధర లభించింది. దిగుమతులు మానేస్తే మన రైతులే, ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, ఎక్కువ లబ్ది పొందే అవకాశముంది. అధిక సాంద్రత ప్రత్తి సాగును, వర్షాధారంగానూ, నీటితడులతోను సాగు చేయవచ్చు. విత్తన మోతాదు 3 కిలోలు/ఎకరాకు. ప్రత్తి పంట అధిక సాంద్రత పద్ధతిలో త్వరగా పూర్తి అవుతుంది. కావున తదుపరి పంటగా, శనగ, పెసర, మినుము, నువ్వులు, వేరుశనగ పంటలను సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్నచోట ఇది సాధ్యపడుతుంది. మే నెల చివరన ముంగారి ప్రత్తిని విత్తడం రాయలసీమ, తెలంగాణలలో అలవాటు. రాయలసీమలో శ్రీనంది రకం 8-9 క్వి./ఎ. దిగుబడినిస్తూ ప్రాచుర్యంలో కొస్తున్నది. ఇప్పటికే మంచి ప్రాచుర్యంలో ఉండి, అత్యధిక దిగుబడిలిచ్చుట మీరు గమనించిన రకాలను/హైబ్రిడ్‌లను ఎంపిక చేసుకొని ప్రత్తిని సాగు చేయండి. కొత్తరాలకు కొద్ది విస్తీర్ణంలో ప్రయత్నించి, దిగుబడి బాగుంటే వచ్చే సంవత్సరం విస్తీర్ణాన్ని పెంచవచ్చు. వ్యవసాయంలో ఒడిదుడుకులను తగ్గించాల్సిన అవసరముంది.

మొక్కజొన్న: అత్యధిక దిగుబడులు సాధించడానికి, మే చివరి వారం నుండి  జూన్‌ మొదటి వారం వరకు విత్తవచ్చు. భూమిలో తేమ తప్పనిసరి కాబట్టి మంచి వర్షం లేదా నీటి తడి అవసరం. ఎకరాకు 40-45 క్వి. దిగుబడినివ్వగలిగిన పలు ప్రైవేట్‌ హైబ్రిడ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

అల్లం: మే నెలలోపలే విత్తడం పూర్తి చేయవలసిన పంట. తర్వాత విత్తితే దుంపకుళ్ళు ఎక్కువ. దిగుబడులు బాగా తగ్గుతాయి. అధిక పచ్చి అల్లం మరియు ఎండుఅల్లం (శొంఠి) కొరకు అనువైన రకాలు: ఆంధ్రప్రదేశ్‌కు: రియోడిజనీరో, వైనాడ్‌లోకల్‌, తెలంగాణకు: రియోడిజనీరో, మారన్‌. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ లభ్యమయ్యే ప్రాంతాల్లో అల్లం దిగుబడి బాగా ఎక్కువ. కొంత ఎండ, కొంత నీడ తగిలే పందిరి కూరగాయతోటలు, ద్రాక్ష, మామిడి, కొబ్బరి, బొప్పాయి, నిమ్మ, జామ తోటల్లో కూడా ఈ పంట పండుతుంది. విత్తనమోతాదు: 600-800 కిలోలు/ఎకరాకు.

పసుపు: ఆంధ్రప్రదేశ్‌లో 6-7నెలల్లో తవ్వకానికి వచ్చే స్వల్పకాలిక రకాలను విత్తడానికి మే నెల చివరి వారం అనుకూలం. ఈరకాలనే తెలంగాణలో జూన్‌ మొదటి పక్షంలో నాటడం అనుకూలం. అధిక దిగుబడినిచ్చే స్వల్పకాలిక రకాలు: ఐ.ఐ.ఎస్‌.ఆర్‌. ప్రతిభ, దిగుబడి: 15-16 ట/ఎ. పంటకాలం: 185-190 రోజులు, రికవరి శాతం: 18.5; ఐ.ఐ.ఎస్‌.ఆర్‌.ప్రభ: దిగుబడి: 15 ట/ఎ, పంటకాలం: 195 రోజులు. రికవరి శాతం: 19.5.

నువ్వులు: వర్షాకాలంలో విత్తే నువ్వు పంటను అధిక దిగుబడుల కొరకు రాయలసీమలో మే-జూన్‌ నెలల్లోను, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో మే 15 నుండి మే 31 వరకు విత్తుకోవచ్చు. తెలంగాణలో మే రెండవ వారం లోపు లేక ఆగస్టు రెండవ పక్షంలో విత్తాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక దిగుబడినివ్వగల్గిన తెల్లనువ్వుల రకం జగిత్యాల తిల్‌-1 (జె.సి.ఎస్‌-1020): దిగుబడి 5-8 క్వి/ఎ. వర్షాకాలంలో పంటకాలం: 90-125 రోజులు. ఇతర నువ్వుల రకాల కంటే 2 క్వి./ఎ. ఎక్కువ దిగుబడినిస్తున్నట్లు వార్తలు. ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణాలోను విత్తనోత్పత్తి చేపట్టి అధిక దిగుబడితోపాటు అధిక ఆదాయం పొందవచ్చు. విత్తనాల కొరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస, జగిత్యాల వారిని 0874-277281 లేదా 9989625213 కు ఫోను చేసి సంప్రదించవచ్చు. చలికాలం, వేసవి కాలాల్లో కూడా ఈ రకం పండుతుంది. కావున విత్తనానికి అమ్ముకునే అవకాశం ఉంది.

కొత్తిమీర: మే నెలలో అధిక ఆదాయంతో పాటు అధిక రోగనిరోధక శక్తిని ఇవ్వగలిగిన పంట. కరోనా సమయంలో ఎక్కువ రోగనిరోధక శక్తినివ్వగలిగే పంటలకు ప్రాధాన్యం ఎక్కువ. కొత్తిమీర, ఎక్కువ ఎండ వేడి ఉన్న మే నెలలో సరిగా ఎదగనందున, పాక్షిక నీడ కలిగిక తోట పంటలు, పందిరి కూరగాయ పంటల నడుమ పెంచవలసి ఉంటుంది. షేడ్‌నెట్లు, నెట్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో ఈ పంట బాగా వస్తుంది. మే నెలలో కూడా చల్లగా ఉండే ప్రాంతాలైన చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం, తూర్పు కనుమలు, ఎత్తైన గిరిజన ప్రాంతాలు ఈ పంటను పండించడానికి అనుకూలం. అరకు, పాడేరు ప్రాంతాలు మొదలైన ఎత్తైన ప్రాంతాలు అనుకూలం. ఇక్కడ పండించిన కొత్తిమీరను మిగతా ప్రాంతాలకు రవాణా చేసుకుని ఎండాకాలంలో మంచి ఆదాయం పొందవచ్చు. జూన్‌ నెలలో కూడా కొత్తిమీరకు మంచి ధర వస్తుంది. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా పెరుగుతుంది. సాధారణ పొలాల్లో పంట పెట్టడానికి అనుకూలమైన అధిక దిగుబడినిచ్చే కొత్తిమీర రకాలు: హిస్సార్‌ఆనంద్‌, పంత్‌హరితిమా ద్వా, ఆర్‌.సి.ఆర్‌-446, కో-1, కో-2, కో-3. తెలివిగా మార్కెట్‌ చేసుకుంటే మంచి పంటకు ఎకరాకు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

పొదీన: రోగనిరోధక శక్తి ఎక్కువగా గల సూపర్‌ ఫుడ్‌లలో పొదీనా ఒకటి. ఎక్కువ ఎండల్లో కూడా పెరుగుతుంది. మే నెల పెండ్లిం డ్లలో, శుభకార్యాల్లో, మసాలా దినుసుగా బిరియానీలోకి దీనిని వాడుతారు. పొదీనాను అలాగే అమ్ముకోవచ్చు. ఎక్కువ విస్తీర్ణం పంటబెట్టితే తైలం తయారీ చేసి అమ్ముకోవచ్చు. మంచి రకాలు: కోసి, సక్షమ్‌, శిలిక్‌, హిమాలయ. ఎకరాకు 15-20 ట. పొదీన వస్తుంది. నూనె తీస్తే 70-75 కిలోలు వస్తుంది. ఈ పంట లాభదాయకమే.

పాలకూర: ఈ పంట అత్యధిక దిగుబడులు పొందాలంటే ఉదజని సూచిక 7.0కు దగ్గరుండాలి. ఉదజని సూచిక 10.5 ఉన్న భూముల్లో కూడా ఈ పంట పండుతుంది. ఈ ఆకుకూరలో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌, కాల్షియం, మాంసకృత్తులు దండిగా ఉంటాయి. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ: 24 ట/ఎ., జాబ్‌ నగర్‌ గ్రీన్‌ : 16-19 ట/ఎ. ఇతర ఆకుకూరలు: తోటకూర, మెంతికూర, చుక్కకూర, గోంగూర, పొన్నగంటి కూర, కొయ్యగూర, సోయకూర మొదలైనవి కొద్ది విస్సీర్ణంలో, కొద్దిపాటి నీటితో పండించి, మంచి ఆదాయం పొందవచ్చు. రోగనిరోధక శక్తి ఆకుకూరలలో అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. ఊబకాయం గలవారికి, మధుమేహ రోగగ్రస్తులకు బాగా ఉపయోగం.

 పూలు- కనకాంబరం: మే, జూన్‌ నెలల్లో నారు పెంచి ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. పూలకాడల్లో పూలు తెంపడం అయిపోయాక, పూలగుత్తులను, ఎండిన కొమ్మలను తీసివేస్తే సంవత్సరం పొడవునా కనకాంబరం పూలను పొందవచ్చు. వర్షాకాలంలో దిగుబడి తగ్గుతుంది. నాటిన 3 సం|| వరకు పూత పూస్తుంది. కాని, 2 సం|| పంట తీసుకొని తర్వాత తీసివేస్తే లాభదాయకం. రెండు సంవత్సరాలలో పూల దిగుబడి ఎకరాకు 1500 నుండి 2000 కిలోలు.

టమాట: విస్తీర్ణాన్ని నియంత్రించడం వలన, ఈ పంట ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఇదే పరిస్థితి మే నెలలో కూడా ఉండవచ్చు. జూన్‌, జులై నెలల్లో ధరలు పెరిగే అవకాశముంది. మేఘావృతమైన వాతావరణం, వర్షాల వలన, దిగుబడి తగ్గి ధరలు పెరగవచ్చు. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్‌ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.

రోహిణిలో నీటి లభ్యత-పంటలు: ఈ కార్తె (25-5-22 నుండి 7-6-22 వరకు)లో నీరు పుష్కలంగా ఉంటే, బెండ, గోరుచిక్కుడు, కాకర, పొట్ల, గుమ్మడి, సొర విత్తవచ్చు. వర్షాకాలపు కూరగాయల నార్లు పోసుకోవచ్చు. కంది, పెసర, మినుము పంటలను విత్తవచ్చు. రేగు, దానిమ్మ మొక్కలను నాటవచ్చు. కామంచి, పామరోజా వంటి సువాసన మొక్కల విత్తనాలు విత్తుకోవచ్చు.

మామిడి: పండ్లను తోటల్లోనే వరిగడ్డి, బోదగడ్డిలో కార్బైడ్‌ వేయకుండా మాగబెట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. మందులు వేయకుండా ప్రకృతి సిద్ధంగా మాగబెట్టినట్లు బోర్డు పెట్టితే నమ్మకమున్న వాళ్లంతా ఎక్కువ రేటిచ్చి కొంటారు.

కీరదోస: సాలాడ్‌గా బహుళ ప్రాచుర్యం పొందిన పంట. హరిత గృహాల్లో (పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌లు, షేడ్‌ నెట్లలో) ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నా ధరలు తగ్గకుండా వినియోగమవుతున్నది. అనుకూలమైన పార్థినోకార్పిక్‌ రకాలు: కియోన్‌, సన్‌-9728, సన్‌-3019.

బెంగుళూరు మిర్చి: ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో ఎక్కువగా వాడుతున్నారు. అత్యధిక దిగుబడి (40 ట/ఎ.) నివ్వగల్గిన రకాల విత్తనాలు బజార్లో దొరుకుతున్నాయి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పశువులమేత: ఎండాకలంలో పశువుల మేతకున్న గిరాకీని సొమ్ము చేసుకోవడానికి, ముందుగా పంటబెట్టిన అన్ని రకాల పశువుల మేతను సేకరించి ఎక్కువ ధరలకు ఎండాకలంలో అమ్ముకునే వీలుంది. జొన్నలో పి.సి.-6 అనే రకం సున్నారపు భూముల్లో కూడా పెరుగుతుంది. ఇటువంటి భూములలో సాగు చేసి పశువులమేతగా అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది.
జూన్‌-జూలైలో పెట్టే పంటల విత్తనాలు, ఎరువుల సేకరణ: విత్తనాలు, ఎరువులు సేకరించుకోవడానికి మేనెలను ఉపయోగించుకోవచ్చు. డిమాండు ఎక్కువగా ఉన్న రకాలు, దొరకవేమోననే అనుమానాలున్న వాటిని సేకరించి పెట్టుకోవచ్చు. వర్షాధార పంటలలో, తేమ ఆరిపోకముందే విత్తడం త్వరగా పూర్తి చేయవచ్చు.

మట్టిపరీక్షలు: మట్టి పరీక్షలు చేయించి, దాని ప్రకారం ఎరువులను వాడి, ఎరువుల ఖర్చు తగ్గించవచ్చు. దిగుబడులు అధికంగా ఉంచుతూ ఖర్చు తగ్గించి, లాభాన్ని పెంచవచ్చు.

శిక్షణలు: అన్ని ట్రైనింగ్‌ ప్రోగ్రాములను సద్వినియోగపరచు కొనుటకు మే నెలలో పనులు తక్కువగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. 

ఎఫ్‌.పి.ఓ.ల ఫెయిల్యూర్స్‌ తగ్గించడం: రైతు ప్రజా సంఘాలను పటిష్టపరచు కోవడానికి మే నెల అనుకూలం. ఎఫ్‌పిఓల ఏర్పాటు చేసుకోవడానికి, సమావేశాలకు సమయం కేటాయించే అవకాశం మే నెలలో ఎక్కువ. చిరస్థాయి గ్రామ సంఘాలు తొలుత ఏర్పాటు చేసి, వాటికనుబంధంగా ఎఫ్‌.పి.ఓలు ఏర్పాటు చేస్తే ఎఫ్‌పిఓల ఫెయిల్యూర్స్‌ చాలా వరకు తగ్గించవచ్చు. చిరస్థాయి రైతు ప్రజా (గ్రామ) సంఘాలు, ఎఫ్‌పిఓల డైరెక్టర్లను, తప్పిదాలు చేయకుండా కట్టడి చేస్తాయి. తద్వారా ఎఫ్‌పిఓ (రైతు ఉత్పత్తిదారుల సంస్థ)లు మునిగిపోకుండా, మునిగి పోయినవి కూడా తిరిగి పనిచేసేవిధంగా కాపాడుతాయి. ప్రతి పల్లెలోనూ రైతు ప్రజా (గ్రామ) సంఘం ఏర్పాటుద్వారా ఉత్పత్తిదారులను, వినియోగదారులను ఒకే సంస్థలో ఉంచవచ్చు. వినియోగదారుల్లో ఉన్న ఆర్థిక శక్తి, మేనేజ్‌మెంట్‌ క్యాపబిలిటీ, రైతుల ఆర్థిక శక్తిని మెరుగుపరచడానికి బాగా పనికొస్తుంది. మున్ముందు, ప్రతి పల్లె, ప్రతి జనావాసంలోని అందరి ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, ప్రభుత్వాలకు దోహదపడుతుంది. రాజకీయాలకతీతంగా జరిగే ఈ అభివృద్ధిని అన్ని పార్టీల మానిపెస్టోల్లో చేర్చుకుని, గెలిచినవారు ఆచరిస్తే, ఆ పార్టీ వారు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. పలు పంటలపైన, రైతు సంఘాల ఏర్పాటు, పటిష్టమైన ఎఫ్‌.పి.ఓ.ల ఏర్పాటు మీద వివరంగా తెలుసుకో గోరేవారు 94944 08619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.

Read More

మామిడి సాగు

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 13 లక్షల ఎకరాల్లో మామిడి తోటలను రైతులు పెంచుతున్నారు. సాలీనా 25-30 లక్షల టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తిచేస్తున్నారు. అయితే మంచి సాగుపద్ధతులు పాటించి మరింత దిగుబడితోపాటు నాణ్యమైన పండ్ల ఉత్పత్తులను పొందవచ్చు. మన మామిడి పండ్లకు అనేక దేశాల్లో మంచి గిరాకీ ఉన్నప్పటికీ ఆయా దేశాలు నిర్దేశించిన గరిష్ఠ పరిమితులను మించి వీటి అవశేషాలు ఉండటం వల్ల ఆశించిన రీతిలో మామిడి ఎగుమతులను పెంచలేక పోతున్నాం. గత ఒకటిన్నర థాబ్దాల నుండి అభివృద్ధి చెందిన దేశాలన్నీ విషరహితమైన సేంద్రియ ఆహారాన్ని కోరుకుంటున్నారు. ఈ ఉత్పత్తులకు దేశవిదేశాల్లో గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల ఔత్సాహిక వ్యవసాయదారులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ అధిక ధరలను పొందుతున్నారు. మామిడిలో కూడా సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లకు దేశవిదేశాల్లో డిమాండ్‌ నానాటికీ పెరుగుతోంది. మామిడి రైతులకు నూతన మంత్రం సేంద్రియ సాగు

రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతుల్లో మామిడితోలను సాగు చేయడంవల్ల చెట్లకు పురుగులు, తెగుళ్ళను తట్టుకునే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. యునైటెడ్‌ కింగ్డమ్‌ భారతదేశం నుండి ఎగుమతి అయ్యే మామిడి పండ్లపై నిషేధం విధించిన్నప్పటికీ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లకు కొత్త మార్కెట్లలో డిమాండ్‌ వుందని రైతులు నమ్ముతున్నారు. సేంద్రియ వ్యవసాయంవల్ల రైతులకు సాగు ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు, ఆదాయం లభిస్తుంది. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో అధిక డిమాండ్‌ వుంది. రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి మార్కెట్లను వెతుక్కోనవసరం లేదు. కస్టమర్లు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుని నేరుగా రైతుల నుండి సరుకును కొంటారు. సూరత్‌, నవసారి, వేల్సాడ్‌లో మామిడి సాగులో వున్న 57,000 హెక్టార్లలో సుమారు 28,000 హెక్టార్లు సేంద్రియ సాగులో వున్నాయని వ్యవసాయ నిపుణుల అభిప్రాయం.
మామిడిలో హార్మోన్ల పిచికారి హానికరం

మామిడిలో పూత అధికంగా రావడానికి, దిగుబడులు పెరగడానికి రైతులు పాక్లోబ్యూట్రజోల్‌ వంటి హార్మోన్లను పిచికారి చేస్తారు.  ఈ హార్మోన్లు దీర్ఘకాలంలో మామిడి చెట్లకు హాని కల్గిస్తాయి. దీనివలన చెట్లలో వంధ్యత్యమేర్పడి వాటి జీవితకాలం 10 సంవత్సరాలు తగ్గుతుంది. ఒకసారి ఈ హార్మోన్లను పిచికారి చేస్తే భవిష్యత్తులో అవి సహజంగా పూత పూయలేవు. ప్రతి సంవత్సరం దిగుబడి రావడానికి హార్మోన్లను తప్పనిసరిగా పిచికారి చేయాలి. మామిడి తోటల్లో హార్మోన్లను పిచికారి చేయడంవలన ఆ ప్రాంతంలోని ఇతర మొక్కలలో పూత చక్రాలు దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్‌లో మామిడి పట్టణంగా పేరుగాంచిన మాల్డాలోని మామిడి తోటల్లో కూడా అధికంగా హార్మోన్లను పిచికారి చేయడంవలన ఇదే సమస్యతలెత్తింది. హార్మోన్ల పిచికారిపై లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన 5-10% ధనిక రైతులు మాత్రమే నికర ఉత్పత్తిని పొందగలిగారు. ఎకరన్నర తోటలో మంచి దిగుబడులు పొందడానికి రూ. 2 లక్షలు పైగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఈ తీవ్ర సమస్యకు సేంద్రియ సాగు మాత్రమే పరిష్కారం. 


భూమి తయారి : భూమిని దున్ని చదును చేయాలి. సరైన నీటి పారుదల, మురుగునీరు పారుదల సౌకర్యాలు కలిగించడానికి కొద్దిపాటి కాలువనేర్పాటు చేయాలి. మొక్కలు నాటడానికి గుర్తులు పెట్టిన తర్వాత వేసవి నెలలో 90þ90þ90 సెం.మీ. గుంతలు త్రవ్వాలి. గుంతలు తీసేటపుడు పై పొరల్లోని మట్టిని, క్రింద పొరల్లోని మట్టిని ప్రతి గుంతకు దగ్గరగా 2-4 వారాలు విడివిడిగా కుప్పలుగా పోసి వుంచాలి. దీని వలన హానికర శిలీంద్రాలు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. వేర్లకు బాగా గాలి సోకుతుంది. ప్రతి గుంతను 20 కి. పశువుల ఎరువు, 5 కి. వర్మింకపోస్టు, జీవన ఎరువులు (అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా)తో నింపాలి. వర్షాలు ప్రారంభమవగానే జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పైర్లను పెంచాలి. లెగ్యూమ్‌ జాతికి చెందిన పచ్చి రొట్ట పైర్లను పెంచడంవల్ల నత్రజని స్థిరీకరించబడి, మొత్తం క్షేత్రాన్ని అద్భుత పచ్చదనం కప్పివుంచడం వలన తేమ నష్టాన్ని నివారిస్తుంది.
మొక్కలను నాటే దూరం : వరుసల మధ్య, మొక్కకు, మొక్కకు మధ్య దూరం 7 నుండి 10 మీ. 

మొక్క అంట్లు : నాటు మొక్కల అంట్లను సేంద్రియ నర్సరీ నుండి సమకూర్చుకోవడం శ్రేయస్కరం.

రకాలు : నీలం, బెంగలోర, ఆల్ఫాన్సో, రుమాని, బంగినపల్లి, జహింగీర్‌, మల్గోవా, మల్లిక, అమ్రపాలి, అర్క అన్‌మోల్‌, అర్క అరుణ, అర్కపునీత్‌, అర్క నీల్‌కిరణ్‌.

మొక్కలు నాటడం : వర్షాలు, నీటిపారుదల సౌకర్యాల లభ్యతను బట్టి జులై – డిశంబర్‌ నెలల మధ్య కాలంలో నాటవచ్చు.

నీటి యాజమాన్యం : మొక్కల 2 సంవత్సరాల వయసు వరకు క్రమం తప్పకుండా నీరందించాలి. కొత్తగా నాటిన అంట్లకు ప్రతిరోజు 25-30 లీ. నీరివ్వాలి. పెరిగి చెట్లలో కాయలేర్పడిన తర్వాత 10 రోజులకొకసారి నీరిస్తే దిగుబడులు పెరుగుతాయి. డ్రిప్‌ పద్ధతిలో నీరందించడం మంచిది.

కలుపు యాజమాన్యం : మొదటి కొద్ది సంవత్సరాలు మొక్కల పొదులో వరిగడ్డితో ఆచ్భాదన చేయడం వల్ల కలుపు నివారణ జరుగుతుంది. పెరిగిన మామిడి తోటల్లో నీడ, రాలిన ఆకులవల్ల కలుపు సమస్య తక్కువగా వుంటుంది.

ప్రూనింగ్‌ : మొక్క పరిమాణం నియంత్రణకు, పండు రంగు మెరుగు పరచడానికి మామిడి చెట్లలో కత్తిరింపులు ముఖ్యం. చెట్లలో బాగా గాలి, వెలుతురు ప్రసరించడానికి ఫ్రూనింగ్‌ చేస్తారు. దీనివలన పురుగులు, తెగుళ్ళ సమస్య తగ్గుతుంది. కాయలు మంచి రంగుతో ఏర్పడతాయి. కొమ్మ చివర కుళ్ళు నివారణకు చెట్టులో చనిపోయిన కొమ్మలను కత్తిరించాలి.  నీటి కొమ్మలను, చెట్టులో క్రింది కొమ్మలను కత్తిరించాలి. చెట్టులో బాగా సూర్యకాంతి, గాలి ప్రసరణకు ఎగుడు దిగుడుగా, అడ్డదిడ్డంగా, తెగులు సోకిన, ఎండు కొమ్మలను, బలహీనంగా వున్న కొమ్మలను కత్తిరించాలి. మూడు సంవత్సరాలకొకసారి ఆగస్టు-సెప్టెంబర్‌ నెలల్లో ఫ్రూనింగ్‌ చేయాలి. సంవత్సరానికొకసారి ఆగస్టు-సెప్టెంబర్‌ నెలలో చివరి కొమ్మలను, బలహీనమైన కొమ్మలను కత్తిరించి ఆరోగ్యవంతమైన కొమ్మలనుంచాలి. 

అవసరమైన పోషకాలు : మామిడి నాటిన థ నుండి పూర్తిగా పెరిగిన చెట్లు థ వరకు పంచగవ్య, వర్మికంపోస్టు ఎరువులను వేసి చెట్లకు అవసరమైన పోషకాలను సరఫరా చేసి, పురుగులు, తెగుళ్ళను నివారించవచ్చు. వానపాములను ఉపయోగించి వర్మికంపోస్టు తయారు చేస్తారు. చురుకుదనం పెంచిన వానపాములున్న వర్మింకపోస్టు బెడ్‌ ద్వారా నీరుపారించి వర్మి వాష్‌ సేకరిస్తారు. ఇది అన్ని పంటలకు సేంద్రియ పిచికారిగా ఉపయోగిస్తుంది.
జీవసంబంధమైన పద్ధతులు : ఆచ్ఛాదన, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు, కంపోస్టు వాడటం. ప్రధాన పోషకాలు వాడదగిన సేంద్రియ పదార్థాలు నత్రజని  లెగ్యూమ్‌ జాతి మొక్కలు, ఆచ్ఛాదన, కోళ్ళ ఎరువు, బ్లడ్‌ మీల్‌, రక్తం, ఎముకలు, చేపల ఎమల్షన్‌, కంపోస్టుభాస్వరం రాక్‌ఫాస్ఫేట్‌, గుయాన, కంపోస్టు, రక్తం, ఎముకలుపొటాషియం కంపోస్టు, సీవీడ్‌, పొటాషియం సల్ఫేట్‌కాల్షియం సున్నపు రాళ్ళు, డోలమైట్‌, లైమ్‌శాండ్‌, మైక్రోనైజ్డ్‌ లైమ్‌మెగ్నీషియం డోలమైట్‌ లేదా మెగ్నసైట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌గంధకం జిప్సం, పొటాషియం సల్ఫేట్‌సూక్ష్మపోషకాలు కంపోస్టు, సీవీడ్‌, ఫిష్‌ ఎమల్షన్‌, నాచురల్‌ కీలేట్స్‌, ఐరన్‌ సల్ఫేట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌, బోరిక్‌ యాసిడ్‌ మామిడి తోటలో నాణ్యమైన పండ్ల ఉత్పత్తి సాధించిన రైతుల అనుభవం ద్వారా కోడిగుడ్లు, నిమ్మరసం ద్రావణం నాణ్యమైన పండ్ల ఉత్పత్తికి దోహదపడుతుందని రుజువయింది.ద్రావణం తయారు చేసే పద్ధతి : ఈ ద్రావణం తయారు చేయడానికి 10 కోడిగుడ్లను వెడల్పాటి మూతిగలగాజు సీసాలో జాగ్రత్తగా పగలకుండా అమర్చిగుడ్లు మునిగేంతవరకు సుమారు అర లీటరు నిమ్మరసం పోయాలి. గుడ్ల పైన నిమ్మరసం కనీసం ఒక అంగుళం ఉండాలి. మూత పెట్టగానే గ్రుడ్లలో నుంచి గాలి బయటకు రావడం, బుడగల ద్వారా గమనించవచ్చు. ప్రతి రోజు మూత తీసిగ్రుడ్ల పైన రసం ఉన్నదీ, లేనిదీ చూసి, లేని యెడల మరల కొంచెం నిమ్మరసం పోయాలి. ఈ విధంగా 10 రోజుల వరకు చేసి 11వ రోజున ప్లాస్టిక్‌ గిన్నెలో గుడ్ల ద్రావణాన్ని పోసి చేతితో బాగా పిసకాలి. ఈ విధంగా బాగా పిసికిన తర్వాత పలుచటి గుడ్డులో ద్రావణాన్ని వడపోసి దానికి 250 గ్రా|| నల్ల బెల్లం కలపాలి. ఈ ద్రావణాన్ని శుభ్రపరచిన సీసాలో పోసి మూత క్రింద ప్లాస్టిక్‌ పేపర్‌ పెట్టి గాలి చొరబడకుండా మూత బిగించాలి. *    ఈ ద్రావణం సుమారు 2 నెలల వరకు నిల్వవుంటుంది.*    200 మి.లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరంలోని పంటపై సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.*    కోడిగుడ్లు-నిమ్మరసం ద్రావణం ”అమినో యాసిడ్‌’గా పనిచేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తుంది.*    ఈ ద్రావణాన్ని పంటలలో పిచికారి చేయడం వలన పండ్ల నాణ్యత పెరుగుతుంది.మామిడి, కొబ్బరి చెట్లకు కునపజలం : మాంసం – 1 కి., మినుములు – 250 గ్రా., నువ్వులు – 250 గ్రా., ఆవుపాలు-1 లీ., నీరు-5 లీ. తయారు చేసే విధానం : మేక పోతు మాంసాన్ని చిన్న ముక్కలుగా కోసి శుభ్రంగా కడిగిన తర్వాత మట్టికుండతో పోసిన 5 లీ. నీటిలో కలిపి నీరు ఆవిరయ్యే వరకు ఉడకబెట్టాలి.*    ఈ మిశ్రమాన్ని పలుచని గుడ్డతో వడకట్టి అందులో మెత్తగా నూరిన మినుములు, నువ్వుల పొడి వేసి బాగా కలియబెట్టాలి.*    కుండపై మూతపెట్టి, గుడ్డతో వాసినకట్టి భూమిలోకాని, మట్టి దిబ్బలోకానీ, పెంటకుప్పలోగానీ 10 రోజులుంచాలి.*    10 రోజుల తర్వాత ద్రావణం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని పలుచని గుడ్డతో వడపోయాలి.*    ఈ విధంగా తయారైన 5 లీ. ద్రావణాన్ని 100 లీ. నీటిలో కలిపి ఒక ఎకరా పంటపై సాయంత్రం వేళ పిచికారి చేయాలి.*    ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను 1-2 సార్లు పిచికారి చేయవచ్చు. దీనివలన పంటలు ఆరోగ్యవంతంగా పెరిగి, పంటల నాణ్యత పెరగుతుంది.

మోతాదు :  అర లీటరు కునపజలాన్ని 10 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. 5 లీ. కునపజలాన్ని 100 లీ. నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి.ఆచ్ఛాదనకు ఉపయోగించే పదార్థాలు : చెట్టు బెరడు, వేరుశనగ పొట్టు, కలుపుమొక్కలు, గడ్డి మొక్కలు, ఉడ్‌చిప్స్‌, సైలేజి, వరి, గోధుమ గడ్డి, చెట్ల నుండి రాలిన ఆకులు, వరి ఊక, కొబ్బరి పీచు, అరటి, చెరకు చెత్త మొదలైనవి. ఆచ్ఛాదన భూమిలో తేమ ఆవిరైపోకుండా కాపాడుతుంది. కలుపు పెరుగదు. ఉష్ణోగ్రతలో మార్పులు తగ్గుతాయి. నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు : లెగ్యూమ్‌ జాతి పంటలను పెంచి భూమిలోకి కలియ దున్నాలి. దీనివలన భూమి భౌతిక నిర్మాణం, భూసారం పెరుగుతాయి. పంటకు పోషకాల లభ్యత పెరిగి దిగుబడి పెరుగుతుంది. భూమిలోని సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేసి అభివృద్ధి చెందేలా చేస్తాయి. జనుము, జీలుగ, విశిష్టమైన పచ్చిరొట్ట పంటలు. పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత వేరుశనగను అంతరపంటగా వేస్తే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. గ్లైరిసిడియా, సుబాబుల్‌, కానుగ మొక్కలను కూడా పచ్చిరొట్ట ఎరువుగా వాడతారు.

జీవన ఎరువులు : జీవన ఎరువులను సేంద్రియ వ్యవసాయంలో విస్తారంగా వాడతారు. రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబాక్టర్‌, ఫాస్ఫోబాక్టీరియా, బ్లూగ్రీన్‌ ఆల్గే వాటిలో ముఖ్యమైనవి. మామిడిలో అజోస్పైరిల్లం, ఫాస్ఫో బాక్టీరియా రైతులు ఎక్కువగా ఉపయోగించే జీవన ఎరువులు. ఎకరానికి 2 కి. ఫాస్ఫో బాక్టీరియా పశువుల ఎరువుతోగాని, ఇసుకతోగాని కలిపి చల్లాలి. 2-3కి. అజోస్పైరిల్లంను 10-15కి. పశువుల ఎరువుతో కలిపి చల్లాలి.

కంపోస్ట్‌ ఎరువులు : కంపోస్టింగ్‌ సన్న, చిన్న కారు రైతుల క్షేత్రాల్లో భూసారాన్ని పెంచి ఉత్పాదకతను పెంచే అద్భుత పద్ధతి. రైతుల క్షేత్రాల్లోని పంట అవశేషాలను, విసర్జితాలను ఉపయోగించి తామే కంపోస్టు తయారు చేసుకోవచ్చు. ఎలాంటి ఖర్చు లేకుండా భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులు, కంపోస్టు, వర్మికంపోస్టు వాణిజ్యపరంగా మార్కెట్లో లభిస్తున్నాయి.

అంతరసేద్యం : తోటలో మధ్య ఖాళీ స్థలాన్ని దున్నడం ద్వారా నేలగుల్లబారి గాలి బాగా ప్రసరించి వేర్లు బాగా పెరుగుతాయి. కలుపు మొక్కలు రావు. అలాగే నేలలో వుండే పురుగులు నిద్రావస్థలో చనిపోతాయి. లేత తోటల్లో ఖాళీ స్థలాన్ని దున్ని అంతర పంటలు, పచ్చిరొట్ట పైర్లను సాగు చేసుకుంటే మొక్కలు ఏపుగా పెరిగి త్వరగా కాపుకొస్తాయి. కాపుకు వచ్చిన తోటల్లో తొలకరి వర్షాలకు ఒకసారి దున్నడం వలన వర్షపు నీరు బాగా నేలలోకి ఇంకి నేలకోత నాపుతుంది. ఆగస్టులో రెండవసారి దున్నితే కలుపురాదు. అలాగే నేలలో వుండే పిండి పురుగులు, పండు ఈగ నిద్రావస్థ థలోనే నశిస్తాయి. వాలుకి అడ్డంగా దుక్కి చేసి, కాంటూరు గట్లు వేసుకుంటే వర్షపునీరు, నేల సారం కొట్టుకుపోకుండా వుంటుంది. వేసవిలో చెట్లు ఎండిపోవు. ఎండుపుల్ల పడదు. వేరు కుళ్ళు ఆశించదు. పూత, కోత బాగా వస్తుంది.

పూత పెరగడానికి చర్యలు : తోటల్లో తేనెటీగ పట్టులను ఏర్పాటు చేసుకుంటే తేనెటీగల సంచారం వలన పరపరాగ సంపర్కం ఎక్కువగా  జరిగి పూత అధికంగా ఏర్పడుతుంది. దీనివలన పంట దిగుబడి, 20 నుండి 30 శాతం పెరుగుతుంది. పొలం నాలుగు మూలలా మార్కెట్లో లభించే తేనెపట్టుగదులను తెచ్చి తేనె పట్టుల నేర్పాటు చేసుకోవచ్చు. కొన్నిసార్లు తేనె పట్టులు సహజంగా చెట్లకు పడతాయి. వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మామిడి తోటల్లో సస్యరక్షణ : తోటని పరిశుభ్రంగా వుంచాలి. పురుగులు, తెగుళ్ళు ఆశించిన కొమ్మలు, కాయలు, ఇతర మొక్క భాగాలను కత్తిరించి నాశనం చేయాలి. తోటల చుట్టూ గాలులను తట్టుకునే ఎత్తైన చెట్లను నాటాలి. కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. జీవవైవిధ్యం పెంచాలి. బదనికలను ప్రోత్సహించాలి. పూతకు ఒక నెల ముందు 20 లీ. జీవామృతాన్ని 200 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత నీమాస్త్రం తయారు చేసి పిచికారి చేయాలి. పిందెలు ఏర్పడిన తర్వాత ఒకసారి జీవామృతం, 15 రోజుల తర్వాత నీమాస్త్రం, 30 రోజుల తర్వాత 6 లీ. పుల్ల మజ్జిగను 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. 

పురుగు వికర్షిణి : పంచగవ్య మొక్కల పెరుగుదలను పెంచే సేంద్రియ పదార్థం. దీనిని ఆవు పేడ, ఆవు మాత్రం, ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి సరైన పాళ్ళలో కలిపి తయారు చేస్తారు. దీనిని మొక్కలపై పిచికారి చేస్తారు. దీనిలో అనేక ప్రధాన సూక్ష్మపోషకాలు, ప్రయోజనకర బాక్టీరియా, శిలీంద్రాలు. ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు, సమర్థవంతమైన పురుగు వికర్షిణిగా పని చేస్తుంది.  ఒక ప్లాస్టిక్‌ లేదా సిమెంటు ట్యాంకు లేదా మట్టికుండలో 5 కి. తాజా ఆవుపేడ, ఒక లీటరు ఆవు నెయ్యి బాగా కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు బాగా కలపాలి. ఇలా 3-4 రోజులు కలపాలి. సుమారు 3 లీ. ఆవు పాలు, 2 లీ. ఆవు పెరుగు, 3 లీ. చెరకు రసం, 3 లీ. లేత కొబ్బరి నీరు, 10-12 బాగా మగ్గిన అరటి పండ్లను బాగా కలిపి ఈ మిశ్రామనికి కలపాలి. మొత్తం ద్రావణాన్ని 15 రోజులు పులియ నివ్వాలి. ఈ పాత్రను నెట్‌తో లేదా నూలుగుడ్డలో కప్పి వుంచి గాలి అడేలా చూడాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి రెండు, మూడు సార్లు కలుపుతూ 15 రోజుల అలా చేసిన తర్వాత ఉపయోగించవచ్చు. 6-7 సంవత్సరాల వయసున్న మామిడి చెట్లకు, ప్రతి చెట్టుకి 10 కి. వర్మికంపోస్టు, 30 లీటర్ల నీటిలో 1 లీ. పంచగవ్య మిశ్రమం కలిపిన ద్రావణం ఆకులపై, చెట్టు మొదలులో పిచికారి చేయాలి. పంచగవ్యను ఆకులపై పిచికారి చేయడం, చెట్టు మొదలులో పిచికారి చేయడాన్ని 4-5 సార్లు చేయాలి. పూత థ ముందు (జనవరి-మార్చి) మొదటి పిచికారి చేస్తే పూత ఎక్కువగా ఏర్పడుతుంది. 15-20 రోజుల తర్వాత రెండవ పిచికారి చేయాలి. ఈ ప్రక్రియను పూత చిన్న పిందెలుగా మారే థ వరకు కొనసాగించాలి. ఒకసారి చిన్న పిందెలు ఏర్పడటం ప్రారంభమవగానే నెలకొకసారి పిచికారి చేయాలి. పంచగవ్య, వర్మికంపోస్టు ఉపయోగించడం వల్ల కాయల పరిమాణం, సంఖ్య, రంగు పెరుగుతుందని గమనించారు.

సిఫారసు చేసిన పద్దతి: ఒక హెక్టారు క్షేత్రంలోని మామిడి చెట్లపై 25 లీటర్ల పంచగవ్యను 750 – 800 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. 4-5 టన్నుల వర్మింకపోస్టు వేయాలి. పంచగవ్య పిచికారి అన్ని కాయలు కొసే చెట్లలో సాధారణంగా ఆశించే పండు ఈగను సమర్థవంతంగా నివారిస్తుంది. సేంద్రియ ఎరువులు వాడిన చెట్లలో ఆకులు పెద్ద పరిమాణంలో వుండి, చెట్లు గుబురుగా పెరిగి, బలమైన వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. పండ్ల రుచి, నిల్వగుణం కూడా అతి సంతృప్తికరంగా వుంటాయి.
సేంద్రియ సాగుకి అనుకూలమైన మామిడి రకం ‘ఆల్ఫాన్సో’తమిళనాడులో కాంచీపురం, తిరునవ్వేలి జిల్లాలలో మామిడి రకాలలో రాజుగా పేరుగాంచిన అల్ఫాన్సో సేంద్రియ సాగు పద్ధతులలో అధిక దిగబడులనిస్తుంది. ఈ జిల్లాలలోని సన్న, చిన్న కారు రైతులు దీని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు, ఆదాయం పొందారని చెన్నైలోని ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లి. వైస్‌ ప్రెసిడెంట్‌ యస్‌.యస్‌. నాగరాజన్‌ చెబుతున్నారు.
ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతకర్త సుభాష్‌ పాలేకర్‌ సిఫారసులు సేంద్రియ మామిడి రైతులు ఈ క్రింది పెట్టుబడిలేని వ్యవసాయ పద్ధతులనాచరించి మంచి ఫలితాలు పొందవచ్చు.*    తోటవాలుకు అడ్డంగా రెండు మామిడి వరుసల మధ్య ‘ఙ’ ఆకారంలో (3 అ. వెడల్పు, 1.5 అ. లోతు)గాడిని త్రవ్వి గాడిలో కాష్టపదార్థాలు (పంట అవశేషాలు) పరచాలి.*    వర్షాకాలం మొదలైన తర్వాత గాడిలోని కాష్ట పదార్థాల మీద జీవామృతాన్ని (200-400 లీ. ఎకరానికి) పోయాలి. జీవామృతం వర్షం నీటితోపాటు అడుగున వున్న భూమి పొరల్లోకి చేరినపుడు భూమిలో సమాధి స్థితిలో వున్న సహజ దేశీయ వానపాములు ఉత్తేజితం చెంది భూమిపైకి మరియు లోపలికి కదులుతూ భూమిలో వుండే పోషకాలను మట్టితోపాటు తింటూ రంధ్రాలు చేస్తూ వాటి విసర్జితాలను భూమి మీద విసర్జిస్తుంటాయి. ఈ విసర్జితాలు అన్ని పోషకాలు కలిగి ఉంటాయి. క్రమంగా గాడిలోని కాష్టపదార్థాలు కూడా కుళ్ళిపోయి పోషకాలతో నిండిన జీవ సేంద్రియ పదార్థం ఏర్పడి మొక్కలకు అన్ని విధాల ఉపయోగపడుతుంది. ఈ విధంగా గుల్లబారిన నేల వర్షపు నీటిని బాగా పీల్చుకుని వర్షాభావ పరిస్థితులలో కూడా మొక్కలకు నీటి కొరత లేకుండా చేస్తుంది. ఇలా ఏర్పడిన సేంద్రియ పదార్థం వాతావరణంలోని తేమను గ్రహించి మొక్కలకు నీటికొరత లేకుండా చేస్తుంది. త్రవ్విన గాడికి రెండు వైపులా ఏకదళ, ద్విదళ బీజ పంటలను పెంచడం ద్వారా, నాలుగు మామిడి చెట్లు మధ్య మునగ చెట్ల వంటి వాటిని పెంచడం వలన వాతావరణంలో అధికంగా వున్న నత్రజని మొక్కలకందుబాటులోకి వస్తుంది.
మామిడి పంటకాలంలో సస్యరక్షణతేనె మంచు పురుగు : *    జనవరిలో పూత మొగ్గ బయటపడటానికి ముందు తేనె మంచు పురుగుల నివారణ కొరకు 100 లీ. నీటికి 5 శాతం వేప గింజల కషాయం లేదా 300 మి.లీ. 1500 పిపియం అజాడి రిక్టిన్‌తోపాటు 300 గ్రా. నీటిలో కరిగే గంధకం పిచికారి చేయాలి.*    ప్రత్యామ్నాయంగా లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3-5 గ్రా. ట్రైకోడెర్మావిరిడి, 2 గ్రా. బివేరియా బాసియానా, లేదా 3 గ్రా. వర్టిసిల్లియం లెకాని కలిపి పిచికారి చేయాలి.*    పూత కాడలు లేదా పుగుత్తులు బయటకు వచ్చి, పూలు వికసించడానికి ముందు లీటరు నీటికి 3-5 మి.లీ. పంచగవ్య లేదా 50 మి.లీ. జీవామృతం, 3 గ్రా. వర్చిసిల్లియం, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 5 గ్రా. ట్రెకోడెర్మా విరిడి కలిపి పిచికారి చేయాలి.
తామర పురుగులు *    ఫిబ్రవరిలో పిందె థలో తేనె మంచు పురుగు, తామర పురుగుల నివారణకు 1500 పిపియం అజాడిరిక్టిన్‌ లీటరు నీటికి 3 మి.లీ.,  5 గ్రా. ట్రెకోడెర్మావిరిడి, 3-5 గ్రా. బివేరియా బాసియానా, 3-5 గ్రా. వర్టిసిల్లియం లెకాని, 50 మి.లీ. జీవామృతం లేదా 3 మి.లీ. పంచగవ్య కలిపి పిచికారి చేయాలి. *    15-20 సంవత్సరాల వయస్సున్న చెట్టుకి 15-20 కి. వర్మికంపోస్టు, 5 లీ. జీవామృతం పాదులో పోసి నీరు పెట్టాలి. వీటితోపాటు చెట్టుకి 100 గ్రా. అజోస్పైరిల్లం, 100 గ్రా. ఫాస్పోబాక్టీరియా వాడితే మరింత ప్రయోజనకరం.*    మార్చి-ఏప్రిల్‌లో పిందెలు పెరగటం జరుగుతుంది. ఈ థలో పాదులో 15-20 రోజులకొకసారి నీరు పెట్టాలి.*    ఎండలో పెరిగే సమయంలో లీటరు నీటికి 15-20 గ్రా. నీటిలో కరిగే సున్నం కలిపిన ద్రావణాన్ని కాయలపై పిచికారి చేయాలి.*    పిందెలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నపుడు వీటిపై టెంక పురుగు గుడ్లను పెడుతుంది. వీటి నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. వేపగింజల కషాయం పిచికారి చేయాలి.
పండుఈగ  : మే-జూన్‌ నెలలో పండు ఈగ తాకిడికి పండ్లు చెడిపోకుండా కాపాడటానికి కోతకు నెలరోజుల ముందు ఎకరానికి 5-6 మిథైల్‌ యూజినాల్‌ పండు ఈగ ఎరలను ఏర్పాటు చేయాలి.

Read More

డెయిరీ ఫారం ప్రారంభించాలంటే…

పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.పాలు, పాల ఉత్పత్తుల అవసరం అనుదినం ప్రతి కుటుంబానికీ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, సగటు కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల పాలు, పాల ఉత్పత్తులకు క్రమేణా డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పాడి రైతులతో పాటు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువత అధిక పాల సార కలిగిన మేలు జాతి ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఎంత మంది చేపట్టినా గిరాకీ పెరుగుతూనే ఉండే రంగం ఇది.
    అయితే, పాడి పశువుల పెంపకం చెప్పినంత, విన్నంత సులభం కాదు. పశువుల పెంపకంపై ప్రేమ ఉండాలి. శాస్త్రీయ అవగాహనతో పాటు సంపూర్ణ నిమగ్నతతో కూడిన ఆచరణ తోడైతే విజయం మీ వెంటే ఉంటుంది. మేలు జాతి పాడి పశువుల పెంపకంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఆశించిన పాల ఉత్పత్తి పొందినప్పుడే పశుపోషణ లాభదాయకమవుతుంది.


పాడి పరిశ్రమను ఎవరెవరు చేపట్టవచ్చు?
    డెయిరీ ఫారాన్ని సంపన్నులు, నిరుపేదలు, పురుషులు, స్త్రీలు, ప్రగతిశీల రైతులు, విశ్రాంత ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, నిరుద్యోగులు.. ఎవరైనా చేపట్టవచ్చు.
    పాడి పశువుల పోషణపై ఆసక్తి, వాటిని ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. పాడి పశువుల పెంపకం చేపట్టబోయే ముందు కొన్ని డెయిరీ ఫారాలను కక్షుణ్ణంగా పరిశీలించాలి. రెండు నుంచి 10 పాడి పశువుల వరకు నౌకర్లపై ఆధారపడకుండా స్వయంగా రైతు కుటుంబమే నిర్వహించుకునేలా సంసిద్ధులై ఉండాలి. గడ్డి కోయడం దగ్గర నుంచి పాలు పితకడం వరకు అన్ని పనులను నేర్చుకోవాలి. ఒత్తిడులను ఎదుర్కొనేమనో నిబ్బరం కలిగి ఉండాలి.

 
తెలుసుకోవాల్సిన విషయాలు
    పాడి పరిశ్రమ స్థాపించే ముందు లాభాల బాటలో నడిచే డెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను కక్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా విషయ పరిజ్ఞానం కలుగుతుంది. కష్టేఫలి అని పెద్దలు చెప్పినట్లు.. నౌకర్లపై ఆధారపడకుండా, స్వయంగా కష్టపడి, పర్యవేక్షించి, పూర్తి సమయాన్ని వెచ్చించగలిగినప్పుడే విజయం చేకూరుతుంది.


కావల్సిన వసతులు
    పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను ఆలోచించాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్‌ సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పని వారి లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో నీటి లభ్యత తగ్గుతుంటే, అవసరం పెరుగుతోంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75-80 లీటర్ల నీరు అవసరం. వేసవిలో ఇది వంద లీటర్లకు పెరుగుతుంది. ఏడాది పొడవునా పశుగ్రాసం సాగు చేసుకోవడానికి అదనంగా నీరు అవసరం. కాబట్టి, నీటి లభ్యత అనేది అతి ముఖ్యమైన సంగతి.


ఎలాంటి పాడి పశువులను కొనుగోలు చేయాలి?
    పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ఆ ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనేది ముందుగా తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది.


10 ఆవులు, గేదెలకు ఎంత భూమి అవసరం?
    ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం అవసరం. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి అవసరమవుతుంది. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరం.


సంకర జాతి ఆవులు, గేదెలు ఎక్కడ దొరుకుతాయి?
    హెచ్‌.ఎఫ్‌., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల సార అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడుల్లోని చింతామణి, కోలార్‌, బెంగళూరు సబర్బన్‌ ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో దొరుకుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర పలుకుతాయి. గ్రేడెడ్‌ ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్‌లో రూ. 75 వేల నుంచి లక్ష పైన పలుకుతాయి. గ్రేడెడ్‌ ముర్రా గేదెలు గోదావరి ప్రాంతాల్లో దొరుకుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్‌ాహతక్‌, గుజరాత్‌లోని మెహసన ప్రాంతాల్లో దొరుకుతాయి.

మేలైన పాడి, అనుబంధ వ్యాపార అవకాశాలు ఎలా ఉంటాయి?
    పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికి పరిమితం అవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్‌ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్‌ గ్యాస్‌, వర్మీకంపోస్టు వంటివి తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు.


ఎన్ని రకాల పశుగ్రాసాలు పెంచాలి?
    అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేకుండా పాడి పశువులను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి 2-3 నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలి. పప్పుజాతి పశుగ్రాసాలు పావు వంతు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు ముప్పావు వంతు విస్తీర్ణంలో సాగు చేయాలి. గట్లవెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్‌, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవాలి.
పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏక వార్షికాలు: లూసర్న్‌, బెర్సీమ్‌. వీటిని సాధారణంగా సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలల్లో నాటుకోవాలి. 2. బహువార్షికాలు: లూసర్న్‌ కో, సుబాబుల్‌, హెడ్జ్‌ లూసర్న్‌, స్టైలో, జనుము.
ధాన్యపు జాతి పశుగ్రాసాలు రెండు రకాలు: 1. ఏకవార్షికాలు: పిసి-23, ఎస్‌.ఎస్‌.జి., జొన్న (మల్టీకట్‌). 2. బహువార్షికాలు : సూపర్‌ నేపియర్‌, ఎన్‌బి-21, కో-4, కో-5, ఎస్‌ఎన్‌-ఎపిబిఎన్‌. వీటిని జూన్‌-జూలైలలో వర్షాకాలంలో నాటుకోవాలి. చలికాలంలో వీటి ఎదుగుదల తక్కువగా ఉంటుంది.


ఎవర్ని సంప్రదించాలి?
    పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు వారితో, బీమా కంపెనీ వారితో, పశువైద్య నిపుణులతో సంప్రదించి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. పశుగ్రాస విత్తనాల విక్రయ కేంద్రాలతోనూ మంచి సంబంధాలను పెంపొందించు కోవాలి


పాడి పరిశ్రమలో రికార్డుల నిర్వహణ
    మేలైన పాడి పశువులను వాణిజ్య స్థాయిలో పెంచి లాభాలు ఆర్జించాలనుకునే వారు కొన్ని వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసుకుంటూ, సమీక్షించుకుంటూ ముందడుగు వేయాలి.
*    మేపు రికార్డులు: పశువులకు ఎంత మేత వేస్తున్నదీ రాసి పెట్టుకోవాలి.
*    ఆరోగ్య సంబంధ రికార్డులు: పశువుల ఆరోగ్య రక్షణకు ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు వాడిందీ రాసుకోవాలి.
*   పాల ఉత్పత్తి రికార్డులు: ఒక్కో పశువు రోజుకు ఎన్ని పూటలు, ఎన్నెన్ని పాలు ఇస్తున్నదో రాసుకోవాలి.
*   పునరుత్పత్తి రికార్డులు: ప్రతి పశువు ఎదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, ఈనిన తేదీ తదితర వివరాలను రాసి పెట్టుకోవాలి.
*    ఆర్థిక రికార్డులు: రోజువారీగా రాబడి, ఖర్చుల వివరాలను రాసుకోవాలి.


పాడి పశువుల ఎంపిక ఎలా?
    పాడి పశువు త్రికోణాకారంలో ఉండాలి. చురుకైన కళ్లు, మృదువైన చర్మం కలిగి ఉండాలి. పొదుగు నాలుగు భాగాలూ శరీరానికి అతుక్కొని, మృదువుగా, పెద్దవిగా, సమానంగా ఉండాలి. నాలుగు చనుమొనలు సమానంగా ఉండాలి. తొడలు దృఢంగా, కాళ్లు పొట్టిగా ఉండాలి. పొదుగుకు రక్తం సరఫరా చేసే పాలనరం స్పష్టంగా వంకరలు తిరిగి ఉండాలి. కడుపు పెద్దదిగా విశాలంగా ఉండాలి.
పశువుల షెడ్డు నిర్మించేదెలా?

    డెయిరీ ఫారం పెట్టాలనుకునే వారు స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు రవాణా, విద్యుత్తు, నీరు లభ్యత, మార్కెటింగ్‌ సదుపాయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పశువుల షెడ్డు తూర్పు పడమర దిశగా గాలి, వెలుతురు ఉండేలా, కాస్త ఎత్తులో నిర్మించుకోవాలి. డెయిరీ ఫారం చుట్టూ పశుగ్రాసానికి అక్కర వచ్చే చెట్లు పెంచాలి. షెడ్డును సులభంగా కడగడానికి నీళ్లు కొట్టే ప్రెషర్‌ పంపును సమకూర్చుకోవాలి. మేత వృథా కాకుండా చూసుకోవడానికి పచ్చి మేతను ముక్కలు చేసి వేయాలి. 

డెయిరీని ఏర్పాటు చేయదలచినవారు గమనించాల్సిన ముఖ్యాంశాలు
1.    పాడి పశువుల పెంపకంపై ఆసక్తి – ఆశావహ దృక్పథం,
2.    వసతులు-వనరులు,
3.    మేలుజాతి పాడి పశువులు,
4.    పాడి పశువుల మేపు,
5.    ఖర్చు తగ్గింపు, ఉత్పత్తి పెంపు,
6.    పశు ఆరోగ్య సంరక్షణ,
7.    పునరుత్పత్తి యాజమాన్యం,
8.    దూడల పోషణ,
9.    శుభ్రమైన పాల ఉత్పత్తి,
10.    పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్‌.


డెయిరీ ఫారం పెట్టే రైతులకు శిక్షణ ఎవరిస్తారు?
స్థానిక పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థ – కర్నాల్‌, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు – ఆనంద్‌, భారతీయ ఆగ్రోఇండస్ట్రీస్‌ ఫెడరేషన్‌- పుణే వంటి సంస్థలు మేలు జాతి పాడి పశువుల పోషణలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి.


రుణాలు… సబ్సిడీలు
మేలైన పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను, సంబంధిత ప్రభుత్వ శాఖలు / కార్పొరేషన్ల అధికారులను సంప్రదించవచ్చు. నాబార్డు, డీఆర్‌డీఏ, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, మైనారిటీ కార్పొరేషన్‌, ట్రైబల్‌ కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన వంటి సంస్థలను సంప్రదించాలి. జనరల్‌ అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75% బ్యాంకు రుణంగా ఇస్తుంది. ఈ విషయాలన్నిటినీ అర్థం చేసుకొని మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుంటే డెయిరీ ఫారాన్ని అత్యంత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.

Read More

ఉన్నత చదువులు వ్యవసాయానికి ఊతం

మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 80 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధరంగాలపై ఆధారపడి జీవించారు, జీవిస్తున్నారు. అయినా కాని వ్యవసాయంలో రైతుకి తగిన గౌరవం దక్కడం లేదు. ప్రస్తుతం 10 ఎకరాల రైతుకు లేని గౌరవం పదివేల జీతం సంపాయించే ఉద్యోగస్తునికి ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం మన గతం. గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే ఒకప్పుడు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుండేవారు. అతి కొద్దిమంది మాత్రమే ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉండేవారు. ఆ సమయములో ఉద్యోగరంగంలో ఉండేవారు సౌకర్యవంతంగా జీవితాలను గడుపుతుండేవారు. రైతులకి సౌకర్యాలు అంతగా అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి సౌకర్యవంతమైన జీవితం కావాలంటే వ్యవసాయం సరైన దారి కాదు, వ్యవసాంయలో ఉంటే కష్టపడవలసిందే. కాబట్టి సుఖపడాలంటే, సౌకర్యవంతమైన జీవితాలను గడపాలంటే వ్యవసాయాన్ని వదలి ఉద్యోగ రంగంలోకి పోవాలి అని భావించేవారి సంఖ్య ఎక్కువగా ఉండేది. అందుకనే బాగా చదువుకునే వారిని వ్యవసాయానికి దూరంగా ఉంచుతూ చదువురాని వారిని వ్యవసాయం మరియు పశుపోషణలో ఉంచే పరిస్థితులు అప్పట్లో నెలకొన్నవి. అందుకే అప్పట్లో చదువుకోని వారికి శిక్ష వ్యవసాయం అనేవిధంగా అంటే ఇంట్లో తమ పిల్లలని బాగా చదువుకో… లేకుంటే మట్టి పిసుక్కోవలసిందే, గేదెలు కాయవలసిందే లాంటి మాటలు ప్రతి ఇంట్లో ఉండేవి. అలాంటి పరిస్థితులలో వ్యవసాయం అంటే ఒక శిక్ష అనే భావం అప్పట్లోనే ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు గమనించినట్లయితే అదీను సేంద్రియ వ్యవసాయం ఊపందుకున్న తరువాత పరిస్థితులు గమనించినట్లయితే ఉన్నత చదువులు చదివి ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉండే చాలామంది వ్యవసాయరంగంలో అడుగుపెట్టి వ్యవసాయ రంగానికి నూతనోత్సాహాన్ని తెస్తున్నారు. ఇలాంటి వారి ఆలోచన ఉన్నత చదువులు వ్యవసాయానికి అడ్డంకి కాదు. ఉన్నత చదువులు వ్యవసాయానికి ఊతం అనేలా పరిస్థితులు మారుతున్నవి. ఇటీవల కాలంలో ఉన్నత చదువులు చదివిన చాలామంది యువత వ్యవసాయరంగంవైపు అడుగులు వేశారు. వేస్తున్నారు. ఈ కోవకే చెందుతాడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం, మాధవరం గ్రామంలో సేంద్రియ సాగు చేస్తున్న అరవింద్‌.
    అరవింద్‌ది వ్యవసాయ నేపథ్యం. ఉన్నత చదువులు చదివి తన చదువుకు తగిన ఉద్యోగ బాధ్యతలు చేపట్టి అందులో కొనసాగుతూవస్తూ .. ఒకానొక సమయంలో చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడంతో సంతృప్తికొరకు ఏ రంగం అనుకూలంగా ఉంటుందో విచారిస్తుండగా సంతృప్తి పొందాలంటే వ్యవసాయరంగమే సరైన దారి అని తెలుసుకుని తన ఉన్నత చదువులు మన దేశ ఆయువు పట్టు అయిన వ్యవసాయ రంగానికి ఊతం అవ్వాలని నిర్ణయించుకుని వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టాలని కుటుంబ సభ్యులను సంప్రదించి వారి నుండి ఏలాంటి అభ్యంతరాలు ఎదురవక పోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టి మొదట పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి కొన్ని రకాల కారణాల వలన దానిని ఆపి ప్రస్తుత వివిధ రకాల కూరగాయలు, పండ్లు, మినుము లాంటి పంటలు సేంద్రియ పద్ధతులలో పండిస్తున్నాడు. ప్రస్తుతం బీర, కాకర, టమాట, ఖర్జూర, సీతాఫలం, మినుము పంటల సాగుతో పాటు నాటుకోళ్ళ పెంపకం, తేనెటీగల పెంపకం కూడా చేస్తున్నారు.
బీర: 

ఒక ఎకరంలో బీర సాగులో ఉంది. డిసెంబరు రెండవవారంలో విత్తనాలను నాటించారు. లైనుకి లైనుకి 12 అడుగుల దూరం పాటించి లైనులో మొక్కకు మొక్కకు రెండు అడుగుల దూరం పాటించి శాశ్వత పందిరిలో బీర విత్తనాలను నాటించారు. దుక్కిలో మాగిన పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నుల చొప్పున అందించారు. వానపాముల ఎరువును బెడ్‌పై వేసి విత్తనాలు నాటించారు. క్రమం తప్పకుండా జీవామృతాన్ని ఎకరానికి 200 లీటర్ల చొప్పున నెలకు మూడుసార్లు చొప్పున అందిస్తూ వస్తున్నారు. పంటపై వేపనూనె, ఆవుమూత్రం, పుల్లటి మజ్జిగ, జీవామృతం లాంటివి అవకాశాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వస్తూంటే జనవరి మూడవ వారం మొదటలో బీర దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు 3000 కిలోల వరకు దిగుబడి వచ్చింది. కిలో 30/- నుంచి 60/- వరకు అమ్ముకుంటూ వస్తున్నాడు. ఇంకా దిగుబడి ఉంది.
కాకర: 

75 సెంట్లలో కాకర సాగులో ఉంది. ఇందుకు గాను ఈస్ట్‌వెస్ట్‌ కంపెనీ వారి ప్రగతి విత్తనాలను డిసెంబరు 2వ వారంలో నాటుకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో దిగుబడి మొదలయ్యింది. బీరకు పాటించిన సాగు పద్ధతులే కాకరకు కూడా పాటించారు. ఇప్పటి వరకు 2500 కిలోల దిగుబడి వచ్చింది. ఇంకా సుమారు 1500 కిలోల దిగుబడి రావచ్చు. 30/- ల నుంచి 50/-ల వరకు అమ్ముకుంటూ వస్తున్నారు.
టమాట: 

50 సెంట్లలో టమాట సాగులో ఉంది. పిహెచ్‌ఎస్‌448 రకం నారుని డిసెంబరుమొదటివారంలో నాటుకున్నారు. దుక్కిలో పశువుల ఎరువులో వేపపిండిని కలిపి ఉపయోగించారు. అవసరాన్ని బట్టి జీవామృతం, తులసి, పర్‌ఫెక్ట్‌ లాంటివి పంటపై పిచికారి చేసుకుంటూ వస్తే ఫిబ్రవరి 10 తరువాత దిగుబడి మొదలయ్యింది. ఇప్పటి వరకు 7000 కిలోలకు పైగా దిగుబడి వచ్చింది. ఇంకా 2000 కిలోల దిగుబడి రావచ్చు.

ఖర్జూరలో అంతరపంటగా సీతాఫలం: 

ఎకరానికి 75 ఖర్జూర మొక్కలను 2018 డిసెంబరులో నాటారు. ఒక్కొక్క మొక్క 4200/-లకు కొనుగోలు చేసి నాటారు. 3þ3 అడుగు సైజులో గుంతలు తీసి ఆ గుంతలలో మట్టి+వానపాముల ఎరువు, వేపపిండి-పశువుల ఎరువు కలిపి వేసి మొక్కలు నాటారు. 75 మొక్కలలో 60 ఆడ మొక్కలు, 15 మగ మొక్కలు చొప్పున రెండువైపులా 8 మీటర్ల దూరం పాటించారు. సంవత్సరానికి 5-6 సార్లు జీవామృతం పంపిస్తుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ప్రతి మొక్కకు పశువుల ఎరువు, వేపపిండి అందిస్తుంటారు. ఈ సంవత్సరమే పూత మొదలయ్యింది. ఖర్జూరలో అంతర పంటగా సూపర్‌ గోల్డెన్‌ సీతాఫలం మొక్కలు 250 నాటారు. దిగుబడి ఇంకా మొదలు కాలేదు. ఖర్జూరకు పాటించిన సాగు పద్ధతులనే సీతాఫలం సాగుకి కూడా పాటిస్తున్నారు.
    ఈ పంటలతో పాటు మినుము ఒక ఎకరాలో సాగు చేశారు. డిసెంబరులో నాటి మార్చిలో దిగుబడి పొందారు. ఎకరానికి 400 కిలోల దిగుబడి పొందారు. అరవింద్‌ పంటల సాగుతో పాటు సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించాలనే లక్ష్యంతో తేనెటీగల పెంపకం కూడా చేపట్టాడు. అంతేకాకుండా రెండు సంవత్సరాల నుండి కోళ్ళ పెంపకం చేస్తున్నారు. కోళ్ళలో బివి380, రాజశ్రీ, నాటుకోళ్ళు ఉన్నాయి. బివి380 గుడ్ల కొరకు మిగతావి మాంసం కొరకు పోషిస్తున్నారు. అన్నీ కలిపి ప్రస్తుతం 100 వరకు కోళ్ళు ఉన్నవి. ప్రతిరోజు కోడిగుడ్లను పొందుతూ ఒక్కొక్క గుడ్డు 10/-ల చొప్పున, లైవ్‌ చికెన్‌ 350/- కిలో చొప్పున అమ్మకం చేస్తూ వస్తున్నారు. రైతు ఆర్థికంగా బలపడాలంటే సమగ్ర వ్యవసాయమే సరైన దారి అని అరవింద్‌ ఆదారిలో నడుస్తున్నాడు. మరిన్ని వివరాలు 9885054562 కి ఫోను చేసి తెలుసుకోగలరు.     

                       
వ్యవసాయంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. మిగతా రంగాలతో పోల్చుకుంటే ఉద్యోగ, వ్యాపార రంగాలలో కంటే వ్యవసాయ రంగంలో విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పని సరి, అదీను సేంద్రియ వ్యవసాయంలో వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు రైతు స్థాయిలోనే తయారు చేసుకోవలసి ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత సమాజాన్ని గమనించినట్లయితే వ్యవసాయంలో అందరికీ కుటుంబ సభ్యుల సహకారం అందడం లేదు. కుటుంబంలోని పెద్దవారు మరియు ఆడవారు వ్యవసాయ రంగంలో తమ సహకారాన్ని అందించటానికి నిరాకరించడంతో పాటు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే సహకారాన్ని అందిస్తున్నారు. అరవింద్‌కి అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. అరవింద్‌ తండ్రి, భార్య, పిల్లలు అందరూ తాను చేస్తున్న సేంద్రియ సాగుకు తమ సహకారం అందిస్తూ తమవంతు పాత్రను పోషిస్తున్నారు. కాబట్టి తన పంటల సాగుని లాభాల బాటలో నడిపిస్తున్నానని ఇందుకు సహకరించిన అధికారులకు, కుటుంబ సభ్యులకు అరవింద్‌ కృతజ్ఞతలు తెలియచేశాడు.

Read More

ఆవు / గేదె జాతి పశువులలో  తిమ్మిర్లు / రిళ్లలు

తిమ్మిర్లు లేదా రిళ్ళలు అనేది మోకాలి ఎముకల సంబంధిత వ్యాధి. ఎక్కువగా ఆవు జాతి, గేదె జాతి పశువులలో వస్తుంది. ఈ వ్యాధి వెనుకకాళ్ళలో వస్తుంది. అందువల్ల పశువులు సరిగ్గా నిలబడలేవు. నేలమీద కూర్చోలేవు. నడవలేవు, వెనకకాళ్ళను దేకుతూ నడుస్తాయి. అందువల్ల రైతు వాటిని పొలం దున్నడానికి వాడలేడు. పాల దిగుబడి కూడా తాత్కాలికంగా తగ్గుతుంది. రైతు ఈ వ్యాధి మూలంగా ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం అంతగా లేదు కాని, పశువులు మానసికంగా ఒత్తిడికి గురై సరిగ్గా పనిచేయలేవు.

ఈ వ్యాధి అంటువ్యాధి కాని, ప్రాణాంతకమైనది కాని కాదు. దీనిని శస్త్రచికిత్స ద్వారా నయం చేయవచ్చు.

కారణాలు: 

1. ఈ వ్యాధి వంశపారంపర్య కారణాల వల్ల ఒక తరం నుండి మరొక తరంకు సంక్రమిస్తుంది.

2. మోకాలి చిప్ప అరగటం వల్ల మోకాలి చిప్ప తొంటి ఎముక పైభాగాన అంటిపెట్టుకుంటుంది, దీని వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు.

3. మోకాలి ఎముకలు దృఢంగా లేకపోవడం మరియు జాయింట్‌ చుట్టూ ఉన్న స్నాయువులు బలంగా లేకపోవడం

4. ఎత్తు పల్లాలు ఉన్న ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వ్యవసాయానికి వాడటం/కొండలు, గుట్టల లాంటి ప్రదేశాలలో పశువులను వినియోగించడం.

5. సరియైన వ్యాయామం లేకపోవడం వల్ల జాయింట్‌ చుట్టూ ఉన్న కండరాలు బలంగా లేక మోకాలి చిప్ప పటుత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా తిమ్మిర్లు రావచ్చు. 

6. సరియైన పోషణ లేకపోవడం వల్ల తొంటి ఎముక క్రింది భాగం (మోకాలి చిప్ప అతుక్కొనే చోట) బలహీనపడి మోకాలి చిప్ప తేలికగా కదలకుండా జాయింట్‌ మీద అంటిపెట్టుకోవడం వల్ల రిల్లలు రావచ్చు. 

7. విరామం లేకుండా ఎక్కువగా పనిచేయడం వల్ల రావచ్చు.

8. అధికంగా పాలు ఇచ్చే పశువులలో కూడా ఈ తిమ్మిర్లు/రిల్లలు రావచ్చు.

లక్షణాలు

1. తిమ్మిరి ఉన్న కాలు యొక్క మోకాలు ముడుచుకోదు. దాని వల్ల కాలు సాగదీసినట్టు ఉండి సరిగ్గా నిలబడలేదు.

2. నడిపించినప్పుడు తిమ్మిరి ఉన్న కాలు గెంటుతుంది లేదా దాని గిట్టలు నేలకు రాకుతూ నడుస్తుంది.

3. కొన్నిసార్లు విశ్రాంతి సమయంలో బాగానే ఉండి కాస్త పొలంలో నడవగానే తిమ్మిర్లు వస్తాయి.

4. కొన్నిసార్లు ఈ తిమ్మిర్లు కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు చూడవచ్చు (ఉంటాయి). మళ్లీ సాధారణంగా అవుతుంది. ఇలా ఉంటే తిరిగి మళ్లీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

5. కొన్నిసార్లు ఒక కాలు కాని రెండు వెనుక కాళ్లు ఒకేసారి కాని తిమ్మిర్లు రావచ్చు.

చికిత్స మరియు నివారణ చర్యలు

1. తిమ్మిర్లు వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న పశువైద్యాధికారి వద్దకు తీసుకెళ్ళాలి, పశువైద్యాధికారులు మోకాలికి సర్జరీ చేసి తిమ్మిర్లు తీస్తారు.

2. ప్రథమ చికిత్సగా మోకాలిని తడిమి చూసి మోకాలి చిప్ప పెద్ద కనుక స్థిరపడినట్లు ఉంటే వెంటనే మోకాలి చిప్పను క్రిందకు జారే విధంగా తాడాలి. అలా చేస్తే మోకాలి చిప్ప ఎద స్థానానికి వచ్చి ఎప్పటి లాగానే సాధారణ స్థితికి వస్తుంది. 

నివారణ చర్యలు

1. ముఖ్యంగా కొండప్రాంతాలు, ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవి ఏమిటంటే ఆవు జాతి, గేదె జాతి పశువులకు నిర్ణీత శారీరక శ్రమ మరియు విశ్రాంతి అవసరం.

2. ఎక్కువగా ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాలలో పశవులకు తక్కువ బరువు వేయాలి.

3. సరియైన పోషణ ఉండాలి. ముఖ్యంగా లవణాలు ఉన్న సమీకృత దాణాను వాడాలి.

4. సమాంతరంగా ఉన్న దారిలోనే పశువులను నడిపించాలి.

5. తిమ్మిర్లు రాకుండా మోకాలికి పటుత్వాన్ని పెంచే పట్టీలు (మమోకాలు పట్టీలు) వాడాలి.

డా. ఎన్‌. వేణుమాధవ్‌ (7989846261, 9490448540), (ఎం.వీ.ఎస్సీ), టీచింగ్‌ ఫ్యాకల్టీ, డా. ఎన్‌. రమ్య, ఎం.వీ.ఎస్సీ., అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, కోరుట్ల

Read More

వేసవిలో పశుసంరక్షణ

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణంలో వచ్చే మార్పులు పశువులకు ప్రతికూలంగా మారతాయి. కనుక వేసవిలో పశువులకు ప్రత్యేక యాజమాన్యం అవసరం.

ఆవులకంటే గేదెలు ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. గేదెల శరీరం నలుపురంగులో ఉండటం, శరీరం క్రింద కొవ్వు ఉండడం, స్వేదగ్రంథుల సంఖ్య తక్కువగా ఉండటం మొదలగు కారణాల వల్ల గేదెలు అధిక ఉష్ణతాపానికి లోనవుతాయి. సంకరజాతి ఆవులు వేసవి తీవ్రతను తట్టుకోలేవు. అలాగే కోళ్ళ మీద వేసవి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

వేసవిలో సాధారణంగా వచ్చే సమస్యలు

పాల దిగుబడి తగ్గటం: పశువులు మేత తక్కువ తింటాయి. వేసవిలో దాహంతో ఎక్కువ నీళ్ళు త్రాగి, 30-40% తక్కువ ఆహారం తీసుకుంటాయి. తద్వారా పోషకాలన్నీ అందవు. అంతేకాక జీర్ణక్రియ కుంటుబడుతుంది. పెద్దపొట్టలో అసిటిక్‌ ఆమ్లం ఉత్పత్తి తగ్గి పాలల్లో వెన్నశాతం పాల ఉత్పత్తి శాతం తగ్గుతుంది. కాబట్టి ఎక్కువ పోషకాల్ని తక్కువ పరిమాణం గల దాణాలో అందేవిధంగా చూడాలి. మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు, శక్తి, విటమిన్లు, ఖనిజలవణాలు సక్రమంగా అందేలా దాణాని తయారు చేసుకోవాలి.

పచ్చగడ్డి కొరత: వేసవిలో పచ్చగడ్డి కొరత సాధారణంగా చూస్తాము. ధాన్యపు జాతికి చెందిన నేపియర్‌ వంటి బహువార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకుంటే సంవత్సరం పొడవునా పచ్చిమేత దిగుబడి ఉంటుంది. వీటిని ఒకసారి నాటితే 3-4 సంవత్సరముల వరకు నిరంతరంగా పలుకోతలు తీసుకోవచ్చు. ఈ విధంగా వేసవిలో కూడా పచ్చగడ్డి అందించే విధంగా జాగ్రత్త వహించాలి. పచ్చగడ్డి లభ్యంకాని సమయాల్లో మాగుడుగడ్డి, యూరియా గడ్డిని పశువుల కందించాలి. సుబాబుల్‌, అవిశ ఆకులు, రెమ్మల్ని దాణాలో కలిపి ఇవ్వాలి. ఎండుమేత మేపినపుడు విటమిన్‌ ‘ఎ’ అదనంగా ఇవ్వాలి. ఎండుగడ్డిని ఎప్పుడూ రాత్రివేళల్లో మేపాలి. ఖనిజలవణ మిశ్రమాన్ని ప్రతిరోజు 30-40 గ్రాములు అందివ్వాలి. 

వ్యాధులు/ఆరోగ్య సమస్యలు

వడదెబ్బ: వాతావరణ ఉష్ణోగ్రత, గాలిలో తేమ అధికమైనపుడు పశువులు ఎక్కువగా వడదెబ్బకు లోనవుతాయి. పశువులను గాలి ప్రసరణ సరిగ్గాలేని ప్రాంతాల్లో, తక్కువ స్థలంలో ఎక్కువ పశువులను కిక్కిరిసి ఉంచినప్పుడు, నీటి సౌకర్యం అందుబాటులో లేనప్పుడు పశువులు అధిక శ్రమకు లోనవుతాయి. ఇలాంటి సందర్భంలో వడగాలుల తాకిడికి లోనైనప్పుడు వడదెబ్బకు గురవుతాయి. సాధారణంగా పశువులు ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వడదెబ్బ బారిన పడతాయి. తెల్లజాతి పశువులకంటే నల్లజాతి పశువులు ఎక్కువగా, త్వరగా వడదెబ్బకు లోనవుతాయి. వేసవికాలంలో బయట ఉష్ణోగ్రత, పశువుల శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువైనపుడు మెదడులోని హైపోతలామన్‌ స్వేద గ్రంథుల నిర్వహణపై పర్యవేక్షణ కోల్పోతుంది. ఆ సందర్భాల్లో చర్మంపై గల స్వేదగ్రంథులు చెమట అధికంగా ప్రసారం చేసి పశువులను అధిక ఉష్ణోగ్రతలకు లోనుకాకుండా కాపాడతాయి. చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోయి, శరీర ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడి వేగం పెరుగుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మూత్రవిసర్జన కుంటుపడుతుంది. పశువుల ఆరోగ్య పరిస్థితి విషమించి, అపస్మారక స్థితిలోకి వెళ్ళి శ్వాస ఆడక మరణిస్తాయి.

లక్షణాలు: వడదెబ్బ తగిలిన పశువుల శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీ ఫారెన్‌హీట్‌ కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం సున్నితత్వం కోల్పోయి గట్టిపడుతుంది. నోటివెంట చొంగపడుతుంది. పశువులు బలహీనంగా, సరిగ్గా నడువలేక తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి.  

చికిత్స: వడదెబ్బకు లోనైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే నీడ ప్రాంతానికి మార్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేర్చడానికి చల్లటి నీటితో పలుసార్లు కడగాలి. తడిగోనె సంచులు కప్పి నీళ్ళు చల్లాలి. త్రాగునీరు ఇచ్చి వెంటనే చికిత్స చేయించాలి.

శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీ ఫారెన్‌హీట్‌ దాటితే శ్వాస పీల్చటం కష్టమవుతుంది. ఫిట్సు లక్షణాలతో పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళి మరణిస్తాయి. వడదెబ్బ ప్రభావం వల్ల చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవిస్తాయి. పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడి, తాత్కాలిక వంధ్యత్వం సంభవింస్తుంది. పాడిపశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతుంది.

గొంతువాపు, జబ్బవాపు: వేసవిలో పశువుల్లో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. గొంతువాపు, జబ్బవాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండి, ముందే టీకాలు వేయించాలి.

పరాన్నజీవులు: బాహ్యపరాన్నజీవులు, వాటి కాటు ద్వారా సంభవించే వ్యాధుల నివారణకు బాహ్యపరాన్నజీవులు నిర్మూలన మందుల్ని పిచికారి చేయాలి. దూడల వెంట్రుకలు కత్తిరించాలి. పశువుల పొడవాటి వెంట్రుకలు కత్తిరించాలి. అంతరపరాన్నజీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు పశువులకు తాగించాలి. 

జీర్ణకోశ సమస్యలు: దాహార్తితో ఉన్న పశువులు మురికినీళ్ళు త్రాగటం వల్ల, పారుడు వంటి జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి గ్రామాల్లో నీటితొట్లు శుభ్రపరచి, పరిశుభ్రమైన త్రాగునీళ్ళను అన్నివేళలా అందుబాటులో ఉంచాలి.

పునరుత్పత్తలో సమస్యలు: వేసవిలో పునరుత్పత్తి ప్రక్రియ కుంటుపడుతుంది. అధిక వేడివల్ల ఎఫ్‌ఎస్‌హెచ్‌ హార్మోన్‌ ఉత్పత్తి కుంటుపడుతుంది. శరీరంలో గ్లూకోజ్‌ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల అండాశయాల్లో స్థబ్ధత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి. వేసవిలో ఎక్కువ ఎండుగడ్డి సంగ్రహించడం వల్ల కూడా విటమిన్‌ ఎ, కాల్షియం, కాపర్‌, మెగ్నీషియం మొదలగు ఖనిజలవణాల లోపం కూడా ఏర్పడి, పశువుల్లో తాత్కాలిక వంధ్యత్వం ఏర్పడుతుంది. పశువుల ఎదలక్షణాల్ని వేసవి తాపం వల్ల ప్రస్ఫుటంగా బహిర్గతం చేయలేవు. పశువుల్ని జాగ్రత్తగా గమనిస్తూ, టీజర్‌బుల్‌ సహాయంతో ఎదగుర్తించి వీర్యదానం చేయాల్సి ఉంటుంది. మన రాష్ట్రంలో ఆవులకంటే గేదెల సంఖ్య ఎక్కువ. గేదెలకు సంవత్సరం పొడవునా ఎదకొచ్చి పొర్లే స్వభావం ఉన్నప్పటికి, వేసవి వల్ల పునరుత్పత్తి ప్రక్రియకు విఘాతం కలగడం వల్ల ఈతల మధ్య వ్యవధి పెరిగి వేసవిలో చాలా గేదెలు ఈనవు, వేసవి వచ్చేసరికి కొన్ని పాడిగేదెల్లో అత్యధిక పాలదిగుబడి కాలం పూర్తవడం వల్ల వేసవిలో పాలకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి డిమాండ్‌ అధికంగా ఉండే వేసవిలో పాలు ఉత్పత్తి చేయాలంటే రైతులు పశువులపై వేసవి ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయాలి.

పొదుగువాపు: వేసవిలో ‘కొరినీబ్యాక్టీరియం పయోజన్స్‌’ అనే సూక్ష్మక్రియ వల్ల పెయ్యలు, వట్టిపోయిన పశువుల్లో పొదుగువాపు ఎక్కువగా/సాధారణంగా వస్తుంది. ఈ వ్యాధి వల్ల పొదుగు బాగా వాచి, గట్టిగా తయారవుతుంది. పొదుగులో పాలు చెడిపోవుట వలన దుర్వాసనలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో రొమ్ము పూర్తిగా పాడై కింద పడిపోతుంది. పశువు జ్వరంతో బాధపడుతుంది. సూక్ష్మక్రియ ద్వారా విడుదలయ్యే విషపదార్థాలు రక్తమంతా వ్యాపించి పశువు చనిపోతుంది. వ్యాధి నుండి కోలుకున్న పశువులలో దెబ్బతిన్న పొదుగుభాగం జీవితాంతం పనిచేయదు.

వేసవిలో పశువుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలు

*      వేసవిలో పగటివేళల్లో పశువుల్ని మేతకు వదలకూడదు. ఉదయం (10 గంటల ముందు), సాయంత్రం (5 గంటల తర్వాత) చల్లగా ఉండే సమయాల్లో మాత్రమే బయట తిరగనివ్వాలి. ముఖ్యంగా గేదెలు 80 శాతం ఎండవేడిమి స్వీకరించి, 20% వేడి మాత్రమే రిఫ్లెక్ట్‌ చేస్తాయి. కాబట్టి పశువుల్ని మేతకు మండుటెండల్లో పంపించడం వల్ల మేత లభ్యంకాకపోగా, చాలా దూరం నడవడం వల్ల శక్తి కోల్పోతాయి. నీరసపడతాయని గమనించాలి.

*    గృహవసతి యాజమాన్యం: 38 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న సందర్భాల్లో శీతల స్థితి కల్పించాలి. అందుకుగాను పశువుల కొట్టాలు 10-12 అడుగుల ఎత్తు ఉండేలా నిర్మించాలి. గాలి వీయడానికి అనుకూలంగా ప్రక్కగోడను పూర్తిగా కప్పివేయకుండా వదిలివేయాలి.

*    వేసవిలో తాటాకుల కొట్టం పశువులకు అనుకూలంగా ఉంటుంది. సిమెంట& రేకుల షెడ్‌పై గడ్డిపరచి మధ్యాహ్నం వేళల్లో నీళ్ళు చిలకరిస్తుండాలి.

*    వడగాలుల నిరోధానికి షెడ్‌ ఒక ప్రక్క పరదాలు కట్టి నీళ్ళు చల్లుతుండాలి.

*    పాకల చుట్టూ త్వరగా ఎదిగి నీడను, పశుగ్రాసాన్నిచ్చే చెట్లు పెంచాలి. అవసరమైతే షెడ్‌లోపల ఫ్యాన్స్‌, కూలర్స్‌, స్ప్రింక్లర్స్‌ ఏర్పాటు చేయాలి.

*    పాకల్లో పశువుల్ని కిక్కిరిసి ఉంచకూడదు. ప్రతి ఆవుకు 3 చ.మీ. కనీస స్థలం ఉంచాలి.

*    నీటి చెరువులు, కుంటలు ఉన్నచోట పశువులను నీళ్ళలో ఈదులాడనివ్వాలి.

*    పశువులపై మధ్యాహ్నం వేళల్లో 3-4 సార్లు నీళ్ళు చల్లుతుండాలి. ఇలా చేయగలిగితే ఈదటానికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉండదు.

*    రాత్రి సమయంలో ఆరుబయట విడిచిపెట్టినచో వేడి నుండి ఉపశమనం లభిస్తుంది.

*    పునరుత్పత్తి మెరుగుపరచడానికి ఎదలక్షణాలను క్రమంగా గమనించాలి. ఉదయం తోక, మడి వద్ద మట్టి అంటుకొని ఉందేమో చూడాలి. చల్లటి వేళల్లో (ఉదయం / సాయంత్ర సమయాల్లో) పశువులను కట్టించాలి.

ఈ విధంగా పశుపోషకులు మేలైన యాజమాన్య పద్ధతులు పశుపోషణ విషయాల్లో స్వల్ప శ్రద్ధ తీసుకోవటం ద్వారా ఎండవేడిమి బారి నుండి పశువుల్ని రక్షించుకోవాలి.  డా. ఎ. అనిత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎల్‌పిఎం విభాగం, ఎన్టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌, గన్నవరం – 521 102. ఫోన్‌: 9492514967

Read More

పాల ఉత్పత్తి – ఆదరవులు

పాడి పశువుల నుండి పాల ఉత్పత్తి అధికం చేయడానికి పాల రైతు మార్గాలు వెతుకుతూ ఉంటాడు. తోటి వారితో సంభాషిస్తాడు. పశు వైద్యుని సూచనలను అమలు చేస్తాడు. నిపుణులను సంప్రదిస్తాడు. అనుభవజ్ఞుల సలహాలను ఆచరిస్తాడు. తన ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం గర్వకారణం. దూడలు చెంగు చెంగున గంతులేస్తుంటే మనసు ఉప్పొంగి పోతుంది. అయినా నేలాకరున లెక్కలు చూసుకుంటే లాభం కనిపించాలి. ఎంత ప్రేమ, అభిమానం ఉన్నా డబ్బు మిగలకపొతే పశువులను ఎల్లకాలం మేపలేరు. పాల దిగుబడికి బాలింత పశువులు ముఖ్యం గనుక ఈనటానికి ఇరవై రోజులు ముందు, ఈనిన తరువాత మూడు నెలలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సమయం క్లిష్టమైనది, ముఖ్యమైనది. హార్మోన్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి. ఆహారం చాలినంత తినలేవు. ప్రసవ వేదన వర్ణనాతీతం. శరీరంలో వేగంగా జరిగే మార్పులు. ఆందోళన, భయం, నీరసం, భ్రమ, మానసిక కల్లోలం ప్రతి తల్లిని ప్రసవ సమయంలో సహజంగా ఆవరిస్తాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

అందువలన పాడిపశువులు నిస్సత్తువతో నిస్సారమై పోకుండా రక్షించుకోవలసిన భాద్యత మనమీదే ఉంది. అందుకుగాను సమీకృతాహారాన్ని అందచేయాలి. అందులో మాంసకృత్తులు, పిండి పదార్ధములు, కొవ్వులు, పీచు, విటమినులు, ఖనిజాలు, లవణాలు, ఎంజైములతోబాటు మరికొన్ని ఆదరవులు (Additives) పొందు పరాచాలి. ఈ సంచికలో ఆదరవుల గురించి చర్చించుకుందాము.

ఫీడ్‌ అడిటివ్స్‌ (Feed Additives): మనభాషలో ఆదరవులు, సంకలనాలు అందాము. ప్రపంచ జనాభా పెరుగుతుంది. పెరుగుతున్న జనాభాకి ఆహారావసరాలు పెరుగుతున్నాయి. జంతు సంబంధమైన ఉత్పత్తుల అవసరాలు అధికమౌతున్నాయి. వృక్షాలనుండి లభించే గింజలు, దినుసులు ఒకప్పుడు పశువుల మేతగా ఉపయోగపడేవి. ఇప్పుడు వాటిని మానవులకు ఆహారంగాను, ఔషధాలలోను, సౌందర్య సాధనాలలోను విరివిగా వాడుతున్నారు. గనుక పశువుల మేత తయారీ కష్టంగానూ, ప్రియంగాను మారింది. పాడిపశువుల మేత ఖరీదు ఎక్కువ, రాబడి తక్కువ అవ్వడం మూలాన పాల ఉత్పత్తికి, మాంసం ఉత్పత్తికి పశువుల పెంపకం ఆశించిన మేరకు పొందాలంటే శాస్త్రపరమైన అవగాహన అవసరం. అనుకోని అవాంతరాలు ఏర్పడినపుడు వెంటనే తేరుకోవాలి. ఫలితాలు ఆశించిన విధంగా రావాలంటే మంచి పాలన, పోషణ జరగాలి. మేత ఖర్చు తగ్గించడానికి శాస్త్రజ్ఞులు మార్గాలు వెతుకుతున్నారు. నిరంతర పరిశోధనల ఫలితం కొత్త కొత్త ఆదరవులను తయారుచేసి ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగిస్తున్నారు.       

ఒకప్పుడు పశు ఉత్పత్తులను పెంచడానికి అంటిబయోటిక్స్‌, హార్మోన్లు కొన్ని దేశాలలో విరివిగా వాడేవారు. మన దేశంలో పాలు పిండడానికి ఆక్సిటోసిన్‌ ఇంజక్షన్‌ ఇప్పటకీ కొన్ని చోట్ల వాడుతూనే ఉన్నారు. ఇవి మనుషుల ఆరోగ్యానికి చేటుచేస్తాయి గనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వాటి వాడకం నిషేధించింది. పశ్చిమ దేశాల్లోను, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మొదలగు దేశాలలో వాటి స్థానే ఆదరవులు (Feed Additives) సంకలనాలు (Supplements) వాడకంలోకి వచ్చాయి. 

నెమరు వేయు జంతువులలో వాడుకలో ఉన్న ఆదరవులు:

*     ఆమైనో ఆసిడ్స్‌   *    అంటిబయోటిక్స్‌

*     అసిడిఫయర్స్‌    *     అంటిఆక్సిడెంట్స్‌

*    టాక్సిన్‌ బైన్డర్స్‌    *    ఎంజైములు

*    సుగంధ ద్రవ్యాలు  *    ఖనిజములు

*    విటమినులు      *    బఫర్స్‌

*    మొనేన్సిన్‌        *     ప్రోబయోటిక్స్‌

*    ఈస్ట్‌               *     యుక్కా

ఫీడ్‌ అడిటివ్స్‌ అనబడు ఆదరవులు కొద్ది మోతాదులో, ఒకటి లేక మరిన్నికలియకలో పశువుల ఉత్పత్తి, ఆరోగ్యం, మెరుగవ్వడానికి సహకరిస్తాయి. తద్వారా పెరుగుదల, బరువు, ఆరోగ్యం, రోగనిరోధకశక్తి, ప్రత్యుత్పత్తి మెరుగవుతాయి.  

అంటిబయోటిక్స్‌ సూక్షక్రిముల వలన కలుగు రోగాలను తగ్గించడానికి మాత్రమే వాడకానికి ఇప్పుడు అనుమతులున్నాయి. ఉత్పత్తి పెంచడానికి ఉపయోగించడం ప్రపంచమంతా నిషేధించారు. అంటిబయోటిక్స్‌ వాడకం విరివిగా విచ్చలవిడిగా విచిక్షణా రహితంగా జరగడం వలన సూక్ష్మక్రిములు (Bacteria) అలవాటుపడి ప్రతిఘటించడం మొదలుపెట్టి నాశనము కాకుండ  బలాన్నిపెంచుకుని సూపర్‌ బగ్స్‌ (Superbugs) మారి పెద్దఎత్తున మానవ మరణాలకు దారితీస్తున్నాయి. హార్మోన్ల వాడకం వలన పశు ఉత్పత్తులలో వాటి అవశేషాలు ముఖ్యంగా బాల బాలికలలో తీవ్రమైన మార్పులు తీసుకు వస్తాయి. ఇంకా కేన్సర్‌, తదితర రోగాలకు కారణ మౌతున్నాయి. అందువలన ఇతర వస్తువులను, పదార్ధాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన, హాని కలిగించని విధంగా ఆదరవులను తయారు చేస్తున్నారు. ఆమైనో ఆసిడ్లు, ఎంజైములు, ఖనిజములు, విటమినులు ఎప్పుడు ఎలా వాడాలో గత సంచికలలో తెలుసుకున్నాము. మిగిలిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము.  

అసిడిఫయర్స్‌ (Acidifiers): ఫార్మిక్‌, సిట్రిక్‌, ప్రొపియోనిక్‌, లాక్టిక్‌. అసిటిక్‌, సోర్బిక్‌ అమ్లములను ప్రత్యేకంగా తయారుచేస్తారు. రూమేన్లో వాటి లక్షణాలు మారకుండా కేవలం ప్రేవులలో వినియోగం చెందేలా మార్పులు చేస్తారు. ఇంకా మేతలో దాగివున్న శిలీంధ్రాలను సైతం అణిచివేస్తాయి. కొవ్వు ఆమ్లముల (Fatty acids) తయారు చేస్తాయి.   

అంటిఆక్సిడెంట్స్‌ (Antioxidants) :  ఆహారంలో కొవ్వులుంటాయి. నిల్వ ఉంటే అవి మురిగి పోతాయి. చెడు వాసన వస్తాయి. జీర్ణం కావు. విటమిను ఏ, డి, ఈ లు, బి కాంప్లెక్స్‌ విటమినులు పనికిరాకుండా చేస్తాయి. లైసిన్‌ మొదలగు అమినో ఆసిడ్లు ఉపయోగపడవు. కొవ్వులు చెడిపోకుండా ఉండడానికి ఎతోక్సిక్యిన్‌ లేదా ఔకఊ మేతకు కలుపుతుంటారు. 

టాక్సిన్‌ బైన్డర్స్‌ (Toxin Binders): మైకోటాక్సిన్స్‌ అనగా శిలీంద్రముల నుండి ఉద్భవించే విష పదార్ధములు. వాతావరణంలో తేమ వేడి ఎక్కువగా ఉన్నపుడు బూజు  పడుతుంది. దానినుండి పుట్టే విషం మేతను కలుషితం చేసి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. విషాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు గనుక విషప్రభావం తగ్గించడానికి బైన్డర్స్‌ వాడతారు. ఈ బైన్డర్స్‌ విషాన్ని ఆకర్షించి జీర్ణం కాకుండా విష ప్రభావాన్ని తగ్గిస్తాయి. సోడియం బెంతోనైట్‌ అందుకు ఉపయోగపడుతుంది.  

సుగంధ ద్రవ్యాలు: అవులకు సునిశితమైన ముక్కు, నోరు ఉన్నాయి. సువాసనలను, రుచిని ఆస్వాదించ గలవు. మంచి వాసన, రుచిగల ఆహారాన్ని సంతోషంగా తింటాయి. మనిషి నాలుక గొంతులో 9,000 రుచిమొగ్గలుంటే, ఆవు నాలుక గొంతులో 25,000 రుచి మొగ్గలున్నాయి. గనుక రుచికరమైన ఆహారాన్ని ఎంత ఇష్టంగా తింటాయో ఊహించండి. పాలు ఉత్పత్తి చేయాలంటే మేత తృప్తిగా తినాలికదా! వెల్లుల్లి, సోపు, నల్లజీలకర్ర వాసనలు ఇష్టపడతాయి. చెరుకు మడ్డిని ఆస్వాదిస్తాయి.  

బఫర్స్‌:  రూమేన్లో ఆమ్లములు పెరగడం వలన జీర్ణశక్తి తగ్గి అనారోగ్యానికి గురిచేస్తుంది. మేతలో గింజల నిష్పత్తి అధికమైతే ఆమ్లములు ముంచుకొస్తాయి. పేడ పలచబడుతుంది. నురగ వస్తుంది. తిన్నది జీర్ణంకాక గింజలు పేడతో బహిష్కరించబడతాయి. జీర్ణమవ్వని జొన్న, సజ్జ గింజలను పేడలో చూడవచ్చును. నివారణకు మెగ్నీషియం ఆక్సైడ్‌ వంటసోడాల మిశ్రమము ఉపయోగిస్తారు.    

మొనేన్సిన్‌ : దీని వలన కొన్ని లాభాలున్నాయి. రూమేన్లోని సూక్ష్మక్రిములలో మంచివాటిని పెంపు చేస్తుంది. కీటోసిస్‌ వ్యాధి రాకుండ అడ్డుకుంటుంది. మొనేన్సిన్‌ అదనపు శక్తిని అందచేస్తుంది. అదనపు శక్తి బాలింత పశువుల పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇంకా కాక్సీడియోసిస్‌ వ్యాధిని రానివ్వదు.  

అప్టిజెన్‌ : అంతరాయం లేకుండా నత్రజనిని నెమ్మదిగా విడుదల చేస్తూ రూమేన్లోని సూష్మకణ జీవుల వృద్దికి తోడ్పడుతుంది. కొంత మేరకు సోయ, ఆవ తదితర చెక్కలను తగ్గించ వచ్చును. జీర్ణశక్తి పెరిగి ఎక్కువ ఆహారం వినియోగపడుతుంది. పాల ఉత్పత్తి పెరుగుతుంది. దాణా తయారీలో నత్రజని కొరకు యూరియా కలుపుతుంటారు. నత్రజని శాతం పెరిగితే ప్రోటీన్‌ శాతం పరోక్షంగా పెరుగుతుంది. యూరియా తిన్న వెంటనే అమోనియా రక్తంలో అధికంగా కనిపిస్తుంది. తినడం అయిపోయిన తరువాత నత్రజని ప్రాబల్యం ఉండదు. అంటే యూరియా వలన ప్రయోజనం తాత్కాలికం. ఆప్టిజెన్‌ నెమ్మదిగ విడుదల అవ్వడంతో రోజంతా నత్రజని రక్తంలో ఉండడం మూలాన ప్రయోజనం ఎక్కువ సేపుంటుంది.    

ప్రోబయోటిక్స్‌:  ప్రతి ప్రాణి శరీరంలో సూష్మజీవులు మంచివి, హానికరమైనవి ఉంటాయి. వాతావరణం, ఒత్తడి, కాలుష్యం వలన శరీరం పట్టు తప్పినపుడు రోగనిరోధకశక్తి క్షీణించి హానికరమైన జీవుల ప్రభావం పెరిగి వ్యాధులు అంకురిస్తాయి. అలా జరగకుండా కాపాడడానికి మేలుచేసే సూష్మజీవులను మేతలో కలుపుతారు. పులిసిన పదార్ధములు మజ్జిగ, పెరుగు, తర్వాణి మొదలగు వాటిలో మేలు చేయు సూష్మ జీవులు అధికంగా ఉంటాయి.  

ఈస్ట్‌:  రూమేన్లో పీచు పదార్థాన్ని జీర్ణం చేయడానికి కొన్ని ప్రత్యేకతలు కలిగిన సూక్ష్మజీవులుంటాయి. వాటి సంఖ్య పెంచడానికి ఈస్ట్‌ కణాలు సహాయం చేస్తాయి. నెమరు వేయు జంతువుల ఆహారంలో పీచు ఎక్కువ. రొట్టె తయారీలో ఈస్ట్‌ను వాడతారు.

యుక్కా: రక్తంలో, పాలలో నత్రజని తగ్గిస్తుంది. అమ్మోనియా వాయువును అధీనంలో ఉంచుతుంది. రక్తంలో నత్రజని మితిమీరితే గర్భధారణ ఆలస్యమౌతుంది. యూరియా ఎక్కువ మోతాదులో దాణాలో కలపడం వలన దాణా ఖరీదు తగ్గవచ్చును. కాని ప్రత్యుత్పత్తికి ఇబ్బందులొస్తాయి. 

అనయానిక్‌ సాల్ట్స్‌: అమోనియం క్లోరైడ్‌, అమోనియం సల్ఫేట్‌, మెగ్నీషియం సల్ఫేట్‌, కేల్సియం క్లోరైడ్‌ మొదలగునవి పాలజ్వరం రాకుండా అడ్డుకుంటాయి. పాల ఉత్పత్తి ఉధృతంగా ఉన్న సమయంలో రక్తంలో కేల్సియం తగ్గకుండా చేస్తాయి. అవసరమైతే ఎముకలనుండి కాల్షియంను గ్రహించి రక్తంలో నింపుతాయి. రక్తంలో కాల్షియం సమస్థాయిలో ఉంచడానికి పారధార్మోన్‌ హార్మోన్‌ అవసరం. ఆనయానిక్‌ సాల్ట్స్‌ అందుకు ఉపయోగం. బాలింత ఆవు అధికంగా పాలు ఇస్తున్నపుడు రక్తంలోని కేల్సియం పాలద్వారా బయటకు పోతుంది. అలాంటప్పుడు కాల్షియం లోపం జరిగితే పాలజ్వరంతో పాడిపశువు అడ్డం పడుతుంది. 

ఆదరవులు వాడకంలో తెలుసుకోవలసిన విషయాలు: 

1. మన పాడిపశువు సామర్ధ్యం మనకు తెలిసి ఉండాలి. ఎన్ని పాలు ఇస్తుంది. ఎంతకాలం ఇస్తుంది. అన్న విషయాలు తెలియాలి. సాధారణ పశువులపై ఆశలు పెట్టుకుని అంచనాలు పెంచుకుని నిర్ణయాలు తీసుకుంటే భంగపడాలి. 

2. పశువును బట్టి పోషణ ఉండాలి. ఉత్పత్తికి తగ్గ పోషణ ఉందా! లేకుంటే ఎక్కడ లోపం ఉందో తెలుసుకుని లోటుపాట్లు సరిదిద్దుకోవాలి.  

3. పాలన అంటే పాడిపశువు సౌకర్యం ఉండడానికి మనం చేసే ప్రయత్నాలు. అందుకు కావాల్సిన వసతుల ఏర్పాట్లు. గాలి, వెలుతురు, నేల, పరుండే చోటు, తిరగడానికి జాగా, విశ్రాంతి ప్రదేశము, మల మూత్రాల తొలగింపు, దోమల, ఈగల బెడద, అందుబాటులో మేత, శుబ్రమైన నీరు మొదలగునవి. అన్నీ ముఖ్యమే. 

4. ఆరోగ్యంగా ఉన్న పశువే ఉత్పత్తి పెంచగలదు. వ్యాధుల రక్షణకు అవసరమైన టీకాలు వేయించాలి. పొదుగు వాపు, కాళ్ల నొప్పులు పశువుల ఫారంలో అడుగు పెట్టకూడదు. పరిసరాల శుభ్రత పాటించాలి.

5. ప్రత్యుత్పత్తి మెరుగ్గా ఉంటేనే ప్రతి సంవత్సరం ఒక దూడని పెట్టి ఎక్కువ పాలు ఉత్పత్తి చేస్తాయి. పునరుత్పత్తి నిర్విగ్నం గా సాగాలంటే ‘ఎద’ కు వచ్చిన పశువును గుర్తించి సకాలంలో సంపర్కం చేయించడం అవసరం. యజమాని గమనిస్తూ ఉండాలి. 

6. పైన ఉదాహరించిన ఆదరవులన్నిటిని ఆదరించలేము. నిపుణుల సలహాలు తీసుకోవాలి. సలహాలు ఇచ్చేవారికి మన ఫారం పద్ధతులు తెలిసి ఉండాలి. అప్పుడే పూర్తి న్యాయం జరుగుతుంది.

7. మనం తయారుచేసి మేపే మేతలో ఇవ్వన్నీ ఉండవు. బయట నుండి తెచ్చే దాణాలో తయారీదారు తనకు వీలున్న విధానంలో తయారుచేస్తాడు. గనుక మేత పూర్వాపరాలు నాణ్యత తెలియడానికి పరీక్షలు అవసరం. 

8. ఖర్చు పెట్టినపుడు సరిపడా ఆదాయం వచ్చిందా! మనకి నచ్చిందని లేదా ఎవరో చెప్పారని అనవసరపు ఖర్చు చేస్తున్నామా అన్న విషయం తెలుసుకోవడం తెలిసి ఉండాలి.   

పాడి రైతు, పశు పోషకుడు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరుగుతుంది. ఇక ముందు పాడిపశువులు  ఫారాలలోనే ఉంటాయి. వ్యవసాయ భూములలో వాణిజ్య పంటలు పండుతున్నాయి. మరికొన్నిటిలో భవనాలు, కార్యాలయాలు మొలుస్తున్నాయి. ఇక చిన్నకమతాలెక్కడ సన్నకారు రైతులెక్కడ. రెండు మూడు ఆవులను గేదెలను ఎవరు సాకుతారు. 

పెద్ద సంఖ్యలో భారీ పెట్టుబడులతో పెంచేవారికి కొంతైన అవగాహన ఉండాలి కదా. భవిష్యత్తులో తక్కువ జాగాలో పాడిపశువులను పెంచాల్సి ఉంటుంది. దొరకిన పశుగ్రసాలు వాడాల్సి ఉంటుంది. ఇకమీదట సగటు ఆవులు గేదెలు ఫారాల్లో ఉండవు. నాటు ఆవులు, గేదెలు సంకరజాతి లో మార్పుచెందడం జరిగింది. మనదైన ఒంగోలు, పుంగనూరు, పొడ తూర్పు పాల ఉత్పత్తికి వాణిజ్య పరంగా అనువైనవి కావని తేలింది. వాటిని కొన్ని పరిశోధన కేంద్రాలలో పెట్టి మెరుగు పరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాణిజ్య పరంగా పాల ఉత్పత్తి చేయాలంటే ఆధికంగా ఉత్పత్తి చేయగల ఆవులను, గేదెలను పెంచాల్సి ఉంటుంది. 

అధికంగా పాలు పిండాలంటే …

1. జాతి ముఖ్యం. అందుకనే పాశ్చాత్య జాతులైన జెర్సీ, హోల్స్టీన్‌ ఫ్రిజియన్‌, బ్రౌన్‌ స్విస్‌ జాతులతో మన దేశవాళి పశువులను సంకరం చేస్తున్నాము. 

2. మంచిజాతి పశువుకు అధిక పోషణ చేయాలి. మేత, ఆహారం, పోషక పదార్ధాల ఆవశ్యకతను తెలుసుకున్నాం. మేతతో బాటు శుభ్రమైన మంచి నీరు ఏర్పాటు చేయాలి. 

3. సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేయాలి. గాలి, వెలుతురు, నేల, చల్లదనం, సులభంగా తిరగడానికి వీలుండాలి. 

4. ప్రేమ, అభిమానం, ఆదరణ చూపించాలి. అరవడం, కొట్టడం, భయపెట్టడం పనికిరావు. 

5. రోగ నివారణ చేపట్టాలి. టీకాలు వేయించాలి. పొదుగు వాపు, కాళ్ల నొప్పులు, గర్భధారణ ఇక్కట్లు ఫారం లాభాలను కొల్లగొడతాయి. 

6. పాల ఉత్పత్తికి ప్రత్యుత్పత్తి మూలాధారం. ఒట్టిపోయే సమయం తక్కువగా ఉండాలి. ఎక్కువ కాలం పాలు ఇస్తూ ఉండాలి. అలా జరగాలంటే గర్బాధారణ సకాలంలో జరగాలి.

7. యజమాని ద్రుష్టి కేంద్రీకృతమై ఉండాలి. పర్యవేక్షణ, తనిఖీలు తప్పని సరిగా చేస్తుండాలి. 

8. సమాచారాన్ని నమోదు చేసుకుంటూ ఉండాలి. ప్రతి అవుకు సంబంధించిన సమాచారం సమయానికి ఉపయోగిస్తుంది. అది ఎంతో విలువైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. డానికి తోడు అనుభవం తోడైతే ఫారంలో పాల ఉత్పత్తి  అభివృద్ధిపథంలో నడుస్తుంది.    

ఇంతవరకు పోషణకు సంబంధించి మేత పరమైన విషయాలు తెలుసుకున్నాం. తదుపరి విషయం ప్రత్యుత్పత్తి. మున్ముందు తెలుసుకుందాం.  డా. నాగేశ్వరరావు, ఫోన్‌: 96521 05405

Read More

కోళ్ళలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

షెడ్డు నిర్మాణము, స్థలం ఎంపికలో తీసుకోవలసిన జాగ్రత్తలు

*  కోళ్ళ షెడ్డును వేరేవారి యొక్క కోళ్ళ షెడ్డుకు దూరంగా కట్టాలి. ఎందుకంటే అనివార్య కారణం వలన ఆ షెడ్డులో వచ్చిన వ్యాధులు ఈ షెడ్డుకు కూడా సంక్రమించవచ్చు. కనుక షెడ్డు నిర్మాణము 1-2 కి.మీ. దూరంలో నిర్మించాలి.

* షెడ్డును చెరువులు, కుంటలకు దూరంగా నిర్మించాలి. ఈ నీటి కొరకు వలస పకక్షులు మరియు పశువులు రావడం వలన ఆ పకక్షులకు మరియు పశువులకు ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే ఆ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది.

* షెడ్డు సరిహద్దు చుట్టూ కంచెను నిర్మించాలి. అదే విధంగా లోపల వివిధ షెడ్డుల యొక్క పైర్లు మరియు నిషిద్ధ ప్రాంతము యందు ”బయటి వారు లోనికి రాకూడదు” వంటి బోర్డులను కట్టవలెను.

* షెడ్డులోనికి ధారాళంగా గాలి, వెలుతురు వచ్చు విధంగా నిర్మించాలి. తద్వారా షెడ్డు లోపలి వాతావరణం కోళ్ళకు అనుకూలంగా ఉండి కోళ్ళను ఒత్తిడి నుండి కాపాడటమే కాకుండా, షెడ్డులో వెలువడిన అమ్మోనియా వంటి వాయువులు బయటకు వెళ్ళిపోవును.

* షెడ్డు నిర్మాణాన్ని అక్కడున్న వాతావరణానికి అనుకూలంగా నిర్మించాలి. ఉదాహరణకు, వేడి, తేమ ఎక్కువ ఉన్న ప్రదేశములో తూర్పు, పడమర దిశలో నిర్మించాలి. తద్వారా ఎండ యొక్క వేడిమి లోపల ఉన్న కోళ్ళపై ప్రత్యక్షముగా పడకుండా కాపాడవచ్చు.

* షెడ్డు లోపలికి బయటి నుండి పకక్షులు రాకుండా జాలిని కట్టుకోవాలి.

* షెడ్డు చుట్టూ మురుగు నీరు నిలువ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

* షెడ్డు అడుగు భాగమును కాంక్రీటు వేసినట్లయితే సరైన పద్ధతిలో, సులువుగా నేలను శుభ్రపరచుకోవచ్చును.

* ప్రవేశ ద్వారమందు వాహనముల యొక్క చక్రములు శుభ్రపరచుటకు, షెడ్డుకు ముందు భాగమున పాదములు శుభ్రపరచుటకు అనుకూలంగా ఒక చిన్న ట్యాంక్‌ను నిర్మించి అందులో తగు మోతాదులో క్రిమిసంహారక మందును పోయవలెను. తద్వారా బయటినుండి లోపలకు వ్యాధికారక క్రిములు రాకుండా కాపాడవచ్చు.

* షెడ్డును నిర్మించే సమయంలో ఈ క్రమములో షెడ్డు నిర్మించాలి. మొదటగా పిల్లలను పొదిగే షెడ్డును తరువాత పెరిగే కోళ్ళను పెంచు షెడ్డును నిర్మించాలి.

* షెడ్డుకు-షెడ్డుకు మధ్య దూరము 30 అడుగులు ఉండేవిధంగా నిర్మించుకోవాలి.

షెడ్డులో పనిచేయువారు తీసుకొనవలసిన జాగ్రత్తలు

* ఫామ్‌ లోపలికి వెళ్ళే ముందు ముఖద్వారము వద్ద కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోవలెను.

* ఫామ్‌లో పనిచేసేవారు శుభ్రమైన బట్టలు ధరించాలి. వారికి వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన ఉండాలి.

* ఏ షెడ్డులో పనిచేయువారు ఆ షెడ్డుకు మాత్రమే వెళ్ళవలెను. వేరే షెడ్డుకు వెళ్ళిన ఎడల, ఒకవేళ తను పనిచేసే షెడ్డులో ఏమైనా వ్యాధులు ఉన్నట్లయితే వేరే షెడ్డుకు కూడా వ్యాధులు వ్యాపించవచ్చు.

* అవసరమున్నప్పుడు మాత్రమే షెడ్డు యొక్క తాళము తెరువవలెను. మిగిలిన సమయంలో మూసి ఉంచి తాళం వేయవలెను.

షెడ్డు లోపల తీసుకొనవలసిన జాగ్రత్తలు

* ఒకవేళ ఇంతకు ముందు షెడ్డులో వ్యాధులు వ్యాపించి ఉన్నట్లయితే ఆ షెడ్డును శుభ్రముగా శుభ్రపరచి 3 వారాలు వేచి వున్న తరువాత కొత్త బ్యాచ్‌ను ప్రారంభించాలి. 

* షెడ్డు లోపల కీటకాల నివారణ చర్యలు చేపట్టవలెను లేని ఎడల ఈ కీటకాలు వ్యాధి వ్యాప్తిలో వాహకముగా పనిచేస్తాయి.

* ఎలుకలు, పందికొక్కుల నివారణ కూడా చేయవలెను. ఇవి కూడా వ్యాధి వ్యాపించడంలో తోడ్పడుతాయి.

* వ్యాధులు వ్యాపించడానికి ముఖ్యకారణం షెడ్డును శుభ్రంగా ఉంచుకోకపోవడం, ప్రభావవంతంగా షెడ్డును శుభ్రపరిచి క్రిమిసంహారక మందులు వాడి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లయితే చాలావరకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.

* పరిశుభ్రమైన, పరిశుద్ధమైన మంచి నీరు కోళ్ళకు ఎల్లవేళలా అందేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

* షెడ్డు యందు ఉపయోగించు అన్ని పరికరములను శుభ్రముగా కడగాలి. ముఖ్యంగా దాణా మరియు నీటి తొట్లను ప్రతిరోజు శుభ్రంగా కడగాలి.

* క్రమబద్ధంగా బ్లోల్యాంప్‌తో కేజ్‌లను శుభ్రపరచాలి. కేజ్‌లను శుభ్రపరిచే ముందు పేరుకుపోయిన కోళ్ళ రెట్టలను తీసి వేయాలి.

* లిట్టర్‌ యందు తడి తనము లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేని ఎడల శిలీంధ్రాలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది.

* గట్టిపడిన లిట్టర్‌ను ఎప్పటికప్పుడు తీసివేయాలి.

* గోడలను, నేలను క్యార్బనరి అమ్మోనియం కాంపౌండ్సుతో శుభ్రపరచాలి.

* చనిపోయిన కోళ్ళను ఎప్పటికప్పుడు తీసివేయాలి. వాటికి శవ పరీక్షలు పశువైద్యుని సహాయంతో జరిపించి పూడ్చి వేయాలి. శవ పరీక్షల ఆధారంగా పశువైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాలి. 

* ఎల్లవేళలా పరిశుభ్రమైన సమీకృత దాణాను ఇవ్వాలి.

* క్రమబద్ధంగా మందులు, వ్యాధినిరోధక టీకాలు ఇవ్వాలి. తద్వారా కోళ్ళు వ్యాధినిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.

డా. సి.హెచ్‌. శివప్రసాద్‌సహాయ ఆచార్యులు ఞ అధిపతి, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, కోరుట్ల. ఫోన్‌: 9866392292

Read More

ఉద్యోగం కంటే వ్యవసాయంలోనే తృప్తి

ప్రతి ఒక్కరికి అతి ముఖ్యమైనది తృప్తి. తృప్తి లేని జీవితం వ్యర్థం. ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని అవార్డులు, రివార్డులు సాధించినా తృప్తి లేకుంటే అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అనే విషయం అక్షర సత్యం. కాని ఈ సత్యాన్ని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు అంటే ప్రశ్నార్థకమే? అతి తక్కువమంది మాత్రమే తృప్తి యొక్క విలువను తెలుసుకొని అందుకు అనుగుణంగా తమ జీవితాలను మలచుకుంటున్నారు. కాని చాలామంది తృప్తి అనే దానిని పక్కకు నెట్టి ఇంకా, ఇంకా ఏదో సాధించాలనే తపనతో తమ జీవిత గమ్యం ఏమిటో గుర్తించలేకుండా గుడ్డిగా పరిగెడుతూ ఎంతో విలువైన కుటుంబాన్ని, సమయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నారు అనే విషయం ప్రస్తుత సమజాన్ని గమనిస్తే అర్థం అవుతుంది. ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది ఇదేబాటలో నడుస్తున్నా కూడా అతికొద్దిమంది మాత్రము తృప్తి యొక్క విలువను గుర్తించి జీవితంలో తృప్తి అతిముఖ్యమైనదని గ్రహించి తృప్తి లభించే రంగాలవైపు అడుగులు వేస్తున్నారు. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో తృప్తి లభిస్తుందని గ్రహించిన చాలామంది ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారు వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ కోవకు చెందుతాడు ప్రకాశం జిల్లా చందలూరుకు చెందిన నరేంద్రబాబు.

నరేంద్రబాబుది వ్యవసాయ నేపథ్యం. ఎం.బి.ఎ. వరకు చదివి కొన్ని రోజులు మార్కెటింగ్‌కి సంబంధించిన ఉద్యోగం చేసి అందులో తృప్తి లభించకపోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, వ్యవసాయ రంగంలోనే తృప్తి ఉంటుందని గ్రహించి వ్యవసాయరంగంలో అడుగుపెట్టాడు. 2018వ సంవత్సరం నుండి సేంద్రియ పద్ధతులను తన పంటలసాగులో పాటిస్తున్నాడు. ప్రస్తుతం శనగ, గోధుమ, వేరుశనగ, శనగలో అంతరపంటగా ప్రొద్దుతిరుగుడు, వివిధ రకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నాడు.

శనగ: 28 ఎకరాలలో శనగ పంట సాగులో ఉంది. దుక్కిలో ఎకరానికి 3 ట్రక్కుల చొప్పున పశువుల ఎరువు మరియు 40 కిలోల వేపపిండిని అందించాడు. పచ్చిరొట్ట పైర్లు కూడా వేసి భూమిలో కలియదున్నాడు. సాధారణంగా ఈ ప్రాంతంలో అక్టోబరు మరియు నవంబరు మాసాలలో శనగ పంటను విత్తుకుంటారు. కాని ఈ సంవత్సరం అధిక వర్షాల వలన శనగ పంట విత్తుకోవడం ఆలస్యం అయ్యింది. కాబట్టి నరేంద్రకుమార్‌ డిసెంబర్‌ మాసంలో శనగ పంటను వేశాడు. ఇందుకుగాను ఎకరానికి 30 నుంచి 40 కిలోల విత్తనం ఉపయోగించాడు. 28 ఎకరాల శనగకుగాను 10 ఎకరాలలో మిశ్రమ పంటగా ప్రొద్దుతిరుగుడు కూడా వేశాడు. ఇందుకుగాను 10 ఎకరాలకు గాను 2 కిలోల సూటిరకం ప్రొద్దుతిరుగుడు విత్తనాలను శనగ విత్తనాలతో కలిపి ఎదబెట్టించాడు. శనగ పంటకు ఎదుగుదలకు, పూత ఎక్కువగా రావడానికి, కాయ బరువు పెరగటానికి అవసరమయిన కషాయాలు మరియు ద్రావణాలు సమయానుకూలంగా అందిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతానికి పంట ఆరోగ్యంగా ఉంది. పంటకాలం 80 నుంచి 100 రోజులు ఉంటుంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 9 క్వింటాళ్లు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. శనగలో మిశ్రమ పంటగా వేసిన ప్రొద్దుతిరుగుడు వలన తేనెటీగల సంచారం పెరిగింది. ఈ విధానాలను అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం ఎక్కువ ప్రాంతంలో ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎర పంటగా శనగలో ఆవాలు కూడా వేశాడు.

కూరగాయలు: 20 సెంట్లలో వంగ, బెండ, గోరుచిక్కుడు, బ్రకోలి, బచ్చలి, బుట్ట చిక్కుడు, టమాట, ఉల్లి, క్యాబేజి, ఎర్ర క్యాబేజి మరియు వివిధ రకాల ఆకుకూరలను ఇంటి అవసరాలకు సాగు చేస్తున్నాడు. పొలాన్ని రెండు భాగాలు చేసి మొదటి భాగంలో కూరగాయల దిగుబడి మొదలైన వెంటనే రెండో భాగంలో విత్తుకుంటాడు. ఈ విధంగా చేయడం వలన సంవత్సరం పొడవునా కూరగాయల దిగుబడి పొందవచ్చు. సీజను బట్టి ఆయా సీజన్లలో పండే కూరగాయలను సాగు చేస్తూ సొంత అవసరాలకు ఉపయోగించుకుంటూ మిగిలినవి బయటికి అమ్ముతున్నారు. వచ్చే సంవత్సరం ఈ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచే ఆలోచనలో ఉన్నాడు.

వేరుశనగ: 70 సెంట్లలో వేరుశనగను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నాడు. ఇందుకు గాను కదిరి లేపాక్షి 1812 రకం వేరుశనగ విత్తనాలను కడప నుంచి కొనుగోలు చేసి ఉపయోగించాడు. పంట ఆరోగ్యంగా ఉంది. 

మిరప: 70 సెంట్లలో మిరప పంట సాగులో ఉంది. పచ్చిమిరప మరియు ఎండు మిరపకు రెండింటికి అనువైన 341 రకం విత్తనాన్ని ఎంపిక చేసుకున్నాడు. 70 సెంట్లకు గాను దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 300 కిలోల వేపపిండిని అందించడంతోపాటు ఇప్పటి వరకు 1000 లీటర్ల జీవామృతం భూమికి అందించాడు. నీమాస్త్రం, వేస్ట్‌డికంపోజరు, ఇంగువద్రావణం, పుల్లటి మజ్జిగ మరియు వివిధ రకాల కషాయాలను పంటపై పిచికారి చేయించాడు. వాస్తవంగా ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాల వలన మిరప పంట ఎదుగుదల సక్రమంగా లేదు. కొన్ని రోజులపాటు మిరప పంటలో నీరు నిలబడింది. ఆ సమయంలో మిరప మీద నేను ఆశలు వదులుకున్నాను. కానీ వర్షాలు తగ్గగానే మిరప పంట మరలా ఆశాజనకంగా కనిపించింది. తన పంటలో తామర పురుగు బెడద తక్కువగా ఉంది. పంటను గమనించినట్లయితే 70 సెంట్లకు గాను 5 క్వింటాళ్ళ దిగుబడి సాధించవచ్చు అని నరేంద్రబాబు అంటున్నాడు.

ఈ పంటలతో పాటు కొద్ది ప్రాంతంలో జొన్న, గోధుమ, ధనియాలు సాగు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా విత్తనాలను అభివృద్ధి చేసి నాటు విత్తనాలను తాను ఉపయోగించు కోవడంతో పాటు తోటి రైతులకు అందించే లక్ష్యంతో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాడు. సూటి రకం విత్తనాలను గురించి చాలా దూరం వెళ్ళి ఖరీదు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కొనుగోలు చేసి సాగు చేస్తున్నాడు. మరిన్ని వివరాలు 7671827692 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    

కుటుంబ సభ్యుల సహకారంతోనే వ్యవసాయంలో కొనసాగుతున్నాను

ఏరంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయరంగంలో ప్రస్తుత సమాజంలో కుటుంబ సభ్యుల సహకారం అందడం లేదు కాబట్టి చాలామంది వ్యవసాయరంగంలో అడుగు బెట్టలేకపోతున్నారు. కాని నరేంద్రబాబుకు అలాంటి ఇబ్బంది లేదు. ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగంలో కొనసాగాలన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయంలో కొనసాగగలుగుతున్నాను అని, తనకు సహకారం అందిస్తున్న కుటుంబ సభ్యులకు నరేంద్రబాబు కృతజ్ఞతలు తెలియచేశారు. 

Read More

ఏప్రిల్‌ నెలలో సేద్యపు పనులు

కరోనా ప్రభావం తగ్గిపోతున్నది. చలికాలపు పంటలు చేతికొచ్చే సమయం. వేసవిలో ఎండలు సాధారణం కంటే ఎక్కువ వుంటాయనే ప్రెడిక్షన్‌లు. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్‌ (రేవతి, అశ్విని, భరణి కార్తె తొలి రోజులు)లో వివిధ పంటలలో ఆచరించవలసిన పనులను గురించి తెలుసుకుందాం. పంటల నమ్ముకునేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కూడా తెలుసుకుందాం.

వరి: వార్తల్లో విశేషంగా వినిపిస్తూ, రాజకీయాలతో ముడిపడిన పంట. నవంబరులో విత్తిన వరి పంట కోతలు ఏప్రిల్‌లో ఉంటాయి. కొన్ని చోట్ల ఈ నెలలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు వచ్చి తయారైన పంట దెబ్బతినవచ్చు. వీటి నుండి వీలైనంత వరకు తప్పించుకోవాలంటే, పంట తయారైన వెంటనే కోయాలి. యంత్రాల సహాయం తీసుకుంటే పని తొందరగా అవుతుంది. పిలక, పూత, పాలుపోసుకొను, గింజ గట్టిపడుథ వరకు భూమిలో తేమ తగ్గకుండా ఉంచితే నూక శాతం బాగా తగ్గి, గట్టి బియ్యం ఎక్కువగా వస్తాయి. పంట కోసినాక ఏప్రిల్‌ ఎండల్లో తెగ ఎండితే, ఎక్కువగా నూకలొస్తాయి. కాబట్టి వడ్లను మోతాదుగానే ఆరనివ్వాలి. రైతులకు మేలు చేయాలంటే ప్రభుత్వాలు రైతుల దగ్గర కొని ఎక్స్‌పోర్ట్‌ చేయడానికి అపార అవకాశాలున్నాయి. అప్పుగా ఎక్స్‌పోర్ట్‌ చేసి, తర్వాత వడ్డీతో సహా వసూలు చేసుకుంటే నష్టాలు అంతగా ఉండవు. లాభాలు కూడా రావచ్చు. కొద్దిపాటి నష్టాలున్నా ప్రభుత్వాలు భరిస్తే ఆ ప్రభుత్వాలకు రైతుల్లో మహామంచి పేరొస్తుంది. పాతబియ్యానికి ఎక్కువ ధర వస్తుంది. వీలున్న రైతులు, రైతు సంఘాలు వడ్లను నిల్వ చేసి, పాతవయినాక బియ్యం చేసి అమ్మవచ్చు. వరి నిల్వకు పల్లెల్లో ఖాళీగా ఉన్న రూములు/ఇండ్లు వాడవచ్చు. ఎడగారు (రాయలసీమ), కత్తెర (తెలంగాణ), షష్ఠికం (ఉత్తరకోస్తా) పంటల పేరుతో ఈ నెలలో వరి విత్తే రైతులు, వరికి బదులుగా పశుగ్రాసాలు, పూలు అధిక ధరలు పలికే కూరగాయలు పంట పెట్టవచ్చు. ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఎక్కువ భూమిలో సాగు చేయవచ్చు. స్వంత అవసరాలకు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలో పండించాలనే రైతులకు ఈ నెల గొప్ప సదవకాశం. కనీసం పాతిక లేక అర ఎకరంలో సేంద్రియ పద్ధతిలో పండించి ఎక్కువగా ఉన్న పంటను అధిక ధరలకు అమ్ముకోవచ్చు. ప్రతి సంవత్సరం, విస్తీర్ణాన్ని కొద్దికొద్దిగా పెంచుతూ పోతూ, కొన్నేళ్ళల్లో మొత్తం సేంద్రియ పద్ధతిలోకి అదీ దిగుబడులు తగ్గకుండా పండించవచ్చు. మనుషుల, పంటల మరియు భూమి ఆరోగ్యంతో పాటు డబ్బు లాభాలు స్వంతం చేసుకోవచ్చు. ఇండ్ల ముందరకొచ్చి వడ్లను బియ్యం చేసే చిన్న మిషన్‌లను ప్రభుత్వాలు సబ్సిడీమీద ఇస్తే పెద్ద మిల్లుల మీద ఆధారపడడం తగ్గి రైతులు బాగుపడతారు.

జొన్న: హైదరాబాద్‌లో జొన్న పిండి కిలో 70 రూపాయలకు రిటైల్‌గా అమ్ముతున్నారు. రైతుకు మంచి ధర వస్తుంది. జనవరిలో విత్తిన జొన్నలో కంకినల్లి, గింజబూజు ఆశించే అవకాశమున్నది. వీటి నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు ఏప్రిల్‌లో తీసుకోవాలి.

సజ్జ: పంట కోతలు ఈ నెలలో ఉంటాయి. పిలక కంకుల కంటే, ప్రధాన కాండపు కంకి ముందుగా కోత కొస్తుంది. అందువలన కనీసం రెండుసార్లయినా కంకులు కోయాలొస్సుంది.

పెసర, మినుము: ఈ పంటల కోతలు ఏప్రిల్‌లో ఉంటాయి. ఊరి సంఘాలు రిటైల్‌గా అమ్మకాలు మొదలుపెడితే, మధ్యవర్తుల లాభాలు కూడా రైతులకే దక్కుతాయి. ఊరందరి వినియోగదారులకు తక్కువ ధరకు, పెసరపప్పు, మినపప్పు దొరుకుతుంది.

వేరుశనగ: డిశంబరులో విత్తిన వేరుశనగను ఏప్రిల్‌లో భూమిలో నుండి తీయాల్సుంటుంది. కాయలు తెగిపోకుండా భూమినుండి బయటకు తీయాలంటే, భూమిలో తగినంత తేమ ఉండాలి. ట్రాక్టరుతో నడిచే బ్లేడు గుంటక లేక వేరుశనగ డిగ్గర్‌ను వాడవచ్చు. పారనాగలి (నాగలి చివర పార ఉన్నది) కూడా ఉపయోగించవచ్చు. తక్కువ ధర వేరుశనగ డిగ్గర్‌లను ప్రాచుర్యంలోకి తేవాల్సిన అవసరముంది. సబ్సిడీలో సప్లయి చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాయలను చెనిగి చెట్ల నుండి వేరుచేయడానికి స్ట్రిప్పర్‌ను ఉపయోగించి త్వరగా పని ముగించవచ్చు. ప్రతి ఊరిసంఘం అద్దె పాత్రిపదికన యంత్రాలను రైతులకు సప్లయి చేయవచ్చు. సబ్సిడీ మీద ఇలాంటి యంత్రాలను ఇంకా ఎక్కువగా ఇచ్చి ప్రోత్సహించాలి. ఈ నెలలో పండిన కాయలను విత్తనానికి వాడాలంటే, నీడలో ఆరబెట్టాలి. ఎండలు తీవ్రంగా ఉండుట వలన ఎండలో ఆరబెడితే మొలకశాతం బాగా తగ్గుతుంది. కాయలను నిల్వ చేయాలంటే తేమ శాతం 9 కంటే తక్కువ ఉండాలి. పచ్చికాయగా అమ్ముకోవాలంటే, మట్టి లేకుండా శుభ్రం చేసి అమ్మితే ఎక్కువ రేటొస్తుంది.

కొత్తిమీర: ఎండవేడి ఎక్కువగా ఉన్నందున ఏప్రిల్‌, మే నెలలో కొత్తిమీర సరిగా ఎదగదు. కొంత నీడ, కొంత ఎండ ఉంటే ఎండాకాలంలో కొత్తిమీర బాగా వస్తుంది. షేడ్‌నెట్‌లు సబ్సిడీలో దొరుకుతుంటే తీసుకొని మంచి కొత్తిమీర పంట తీయవచ్చు. ఆర్థిక సంవత్సరంలో తొలి నెల నుండి ఏప్రిల్‌, మే నెలల్లో కూడా సబ్సిడీ మీద షేడ్‌నెట్లు దొరికే విధంగా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటే రైతులుకు మేలు జరుగుతుంది. చౌడు భూముల్లో సాధారణ రకాల కొత్తిమీర సరిగా ఎదగదు. కో-2 అనే రకం చౌడు భూముల్లో కూడా వస్తుంది. సాధారణ నేలల్లో విత్తడానికి అధిక ఆకుదిగుబడినిచ్చే రకాలు: ఆర్‌.సి.ఆర్‌-446, ద్వా-3, పంత్‌హరితిమా, హిస్సార్‌ ఆనంద్‌, సాధన, కో-1, కో-2, కో-3.

పొదీన: మసాలా కూరల్లో విరివిగా వాడే పుదీనా ఆకుకు కూడా ఎండాకాలంలో మంచి గిరాకీ ఉంటుంది. రంజాన్‌ నెల కూడా ఏప్రిల్‌లో ఉన్నందున దీనికి మంచి గిరాకీ ఉండే అవకాశముంది. ఈ పంటను, కాండపు ముక్కల ద్వారా మరియు వేర్ల ద్వారా వ్యాప్తి చేస్తారు. ఎకరా పొలానికి 3-4 క్వింటాళ్ళ కాండపు ముక్కలు నాటడానికి అవసరముంటాయి. వరుసల మధ్య 45 సెం.మీ. కాండపు ముక్కలు నాటి, మట్టితో కప్పాలి. చిగురు వచ్చి తీగలుగా ఎదుగుతాయి. దిగుబడి: 15-20 టన్నులు/ఎకరాకు. అనువైన రకాలు: సక్షమ్‌, కోసి, శిలిక్‌, హిమాలయ.

పాలకూర: అత్యధిక పోషక విలువలు గలిగిన ఆకుకూరల్లో పాలకూర కూడా ఒకటి. ఇందులో ఇనుము, కాల్షియం, మాంసకృత్తులు, విటమిన్‌ ఎ, సి, పుష్కలంగా ఉంటాయి. అధిక దిగుబడి రావాలంటే ఉదజని సూచిక 7.0 కు దగ్గర గా ఉన్న భూములు అత్యంత అనుకూలం. అయినా ఉదజని సూచిక 10.5 ఉన్న అధిక క్షారనేలల్లో కూడా, ఈ పంట తీసుకోవచ్చు. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: ఊటీ-1: దిగుబడి 24 ట/ఎ., జాంనగర్‌ గ్రీన్‌ : దిగుబడి 16-19 ట/ఎ. 

తోటకూర: అత్యధిక దిగుబడినిచ్చే రకాలు: పూసాకీర్తి: 22 ట/ఎ. పూసాకిరణ్‌: 14 ట/ఎ. ఎర్రతోటకూర రకాలు: అర్క సుగుణ, అర్క అరుణ, దిగుబడి: 3-5 ట/ఎ.

సిరికూర: కాండం కూడా కూరగా ఉపయోగపడుతుంది. దిగుబడి : 4-5 ట/ఎ.

మెంతికూర: ఆకు కోసం సంవత్సరమంతా సాగు చేయవచ్చు.విత్తిన 25-30 రోజులకు మొదటి కోత, తర్వాత 10-15 రోజుల కొకకోత 2-3 కోతలు తీసుకోవచ్చు. అనుకూలమైన రకాలు: గుజరాత్‌ మేథి, లాంమేథి-1 (ఎల్‌.ఎఫ్‌.సి-84), లాంమేథి-2 (ఎల్‌.ఎఫ్‌.సి-103).

టమాట: ప్రాజెక్టుల్లో చెరువుల్లో బాగా నీరున్నందున భూగర్భ జలాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. టమాట సాగు చేయడం రైతులకు బాగా వచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో పంట పెట్టడం వలన దిగుబడి ఎక్కువగా వస్తున్నది. వాతావరణంలో ఎండ బాగా ఉంటే దిగుబడి బాగుంటుంది. మేఘావృతమైతే దిగుబడి బాగా పడిపోతుంది. ప్రస్తుతం ధరలు తక్కువగా ఉన్నాయి. మేఘావృతమైన వాతావరణం ఏర్పడితే తప్ప దిగుబడి తగ్గదు. ధరలు పెరగవు. మంచి ధరలు రావాలంటే విస్తీర్ణాన్ని నియంత్రించాలి. తక్కువ రేట్లున్నపుడు టమాటతో విలువ పెంచే పదార్థాలు (వాల్యూయాడెడ్‌ ప్రాడక్ట్సు) చేసి విక్రయించుకోవాలి.

వంగ: టమాట ధరల కంటే వంగ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఈ పంట కాలం ఎక్కువవడం వలన రైతులు ఈ పంటపై తక్కువ మొగ్గుచూపుతున్నారు. ప్రాంతాలవారీగా వేరు వేరు రకాలను ఇష్టపడుట వలన అన్ని ప్రాంతాలకు అనువైన రకాలు. ఉత్పిత్తి తక్కువ. టమాట రేట్లతో పోలిస్తే ఈ పంట రేట్లు ఒడిదుడుకులు లేకుండా మధ్యస్థంగా ఉంటున్నాయి. నల్ల రకాల కంటే తెల్ల వంకాయలకు ధర ఎక్కువ. పుచ్చులను తెల్లరకాలలో గుర్తు పట్టడం సులభం కావడం కూడా తెల్లవంకాయల గిరాకీకి కారణం.

కీరదోస: ఎండలు ముదిరేకొద్దీ ఈ పంటకు గిరాకీ ఎక్కువ. పాలీహౌస్‌లు, నెట్‌హౌస్‌ల విస్తీర్ణం మరియు దిగుబడి పెరుగుతున్నది. కీరదోసపై ప్రజాదరణ కూడా పెరుగుతున్నది. ప్రతి ఫంక్షన్‌లోను కీరదోస ముక్కలు సాలాడ్‌గా పెట్టడం అలవాటైపోతున్నది. అందువలన, ఇప్పట్లో ఈ పంటకు మంచి ధరలే ఉండే అవకాశమున్నది. అనుకూలమైన ఆడ, మగ వేర్పాటు లేని (పార్థినోకార్పిక్‌) రకాలు: సన్‌-9728, సన&-3019, కియోన్‌.

కూరమిరప/కాప్సికం/బెంగుళూరు మిర్చి: పల్లెల్లో కూడా ఫాస్ట్‌ ఫుడ్స్‌ తినడం పెరిగిపోవడం, చైనీస్‌ వంటకాలైన నూడుల్స్‌ వంటి వాటికి ప్రజలు ఆకర్షితులవడం ఈ పంటకు గిరాకీ పెంచుతున్నది. ఎండాకాలంలో శుభకార్యాలు, ఫంక్షన్‌లు ఎక్కువగా ఉంటాయి. దీనికితోడు అనుకూలమైన, అత్యధిక దిగుబడి (40ట/ఎ) నివ్వగల హైబ్రిడ్‌లు, హరిత గృహాల్లో పండించడానికి విత్తనాలు బజార్లో పుష్కలంగా దొరుకుతున్నాయి. కొన్ని మంచి హైబ్రిడ్‌లు: ఎరుపు: ట్రిపుల స్టార్‌, నతాషా, ఇన్స్‌పిరేషన్‌, బోంబె, పసరిల్లా. పసుపు: సన్‌యెజ్‌, ఓరోబెల్లి, బచ్చాట, స్వర్ణ, ఆకుపచ్చ: యమున, ఇంద్ర.

చేమగడ్డ: ఏప్రిల్‌లో కూడా వీటిని నాటవచ్చు. అరటి, కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా దీనిని సాగు చేయవచ్చు. చేమ దుంపల పొలంలో మొదటి 2 నెలల్లో పంట పూర్తయ్యే ఫ్రెంచ్‌ బీన్స్‌, ముల్లంగి పంటలను అంతర పంటలుగా సాగు చేసి అధికాదాయాన్ని పొందవచ్చు. మంచి రకాలు: భావపురి (కె.సి.ఎస్‌-2): 8 నెలలు, 14 ట/ఎ. కె.సి.ఎస్‌-3: 5 నెలలు, 9.6 ట/ఎ. విత్తనంగా తల్లి దుంపల నుండి పిలకదుంపలు వాడినప్పటి కంటే ఎక్కువ దిగుబడి పొందవచ్చు. విత్తడానికి 300-400 కిలోలు/ఎకరానికి దుంపలు అవసరం. 

అల్లం: ఈ పంట విత్తడానికి ఏప్రిల్‌ తొలివారం నుండి మే కడ వరకు అనుకూలం. జూన్‌-జులైల్లో గాలులతో కూడిన అధిక వర్షాలకు పడిపోకుండా అల్లం మొక్కలు నిలదొక్కుకోవాలంటే ముందుగా విత్తడం అవసరం. భూమిలో తేమ తగినంతగా లేకపోతే నీటి తడి ఇచ్చి లేకపోతే వర్షం బాగా పడినాక విత్తుకోవాలి. ఎక్కువ ఎండ, ఎక్కువ వేడి, ఎక్కువ తేమ ఉన్న ప్రాంతాలు అల్లం దిగుబడికి అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ ఉండే ద్రాక్ష, నిమ్మ, బొప్పాయి, మామిడి, కొబ్బరి, జామ తోటలు పందిరి కూరగాయ తోటల్లోను ఈ పంటను పండించవచ్చు. అధిక పచ్చి అల్లం మరియు ఎండు అల్లం కొరకు అనువైన రకాలు తెలంగాణకు : మారన్‌, రియోడిజనీరో. ఆంధ్రప్రదేశ్‌కు : వైనాడ్‌ లోకల్‌, రియోడిజనీరో.

పసుపు: ఈ పంట తవ్వి తీయడం ఏప్రిల్‌లో ఉంటుంది. ఉడకబెట్టడం, ఆరబెట్టడం, పాలిషింగ్‌, గ్రేడింగ్‌, మార్కెట్‌కు పంపుట ఈ నెలలో ఉంటాయి. ట్రాక్టరుతో త్రవ్వించడం వలన ఎక్కువ విస్తీర్ణంలోని పంటను వెలికి తీయవచ్చు. తక్కువ గాయాలు తగిలిన దుంపలు పొందవచ్చు. ఈ పద్ధతిలో భూమిలో మిగిలిపోయే దుంపలు కూడా తక్కువ.

నిమ్మ, బత్తాయి: కొమ్మ కత్తిరింపులు, వేరుమూలాల్నుండి పెరిగే కొమ్మలు, కాండంపై 2 అడుగుల వరకు పెరిగే కొమ్మలు, నీడన ఉన్న అనవసరమైన, ఎండిన పుల్లలను కత్తిరించాలి. కత్తిరించిన చోట బోర్డోపేస్టు పూసి తెగుళ్ళు సోకకుండా కాపాడవచ్చు. 

పశువుల మేత: ఎండల్లో పచ్చిమేతకు మంచిగిరాకీ. ఈ నెలలో విత్తదగిన పశుగ్రాస పంట: జొన్న, పి.సి.-6 అనే రకం సున్నారపు నేలల్లో కూడా పెరుగుతుంది. ముందుగా విత్తిన పశువుల మేత పంటల నుండి, మేతను సేకరించి బాగా ఎక్కువ ధరకు ఎండాకాలంలో అమ్ముకునే వీలుంది.

మామిడి: ఈ పంటకు నీటి తడులను ఆపాలి. బాగా తయారైన లేత ఆకుపచ్చ రంగున్న కాయలు, అందులో కండ లేత పసుపు రంగుకు మారినటువంటి కాయలు కోయడానికి అనుకూలం. మామిడి కాయలను ఇథిలిన్‌ వాయువుతో మాగబెట్టవచ్చు. కాల్షియం కార్బైడ్‌ ద్వారా మాగబెట్టరాదు.

సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశీయ ఆవులను సబ్సిడీ రూపంలో ఇస్తే రైతుల, ప్రజల ఆరోగ్యానికి సేవ చేసినట్లవుతుంది.

పలు పంటలపైన, రైతు సంఘాలపైన సలహాలు, సూచనలు పొందగోరే వారు 9494408619 కు ఫోను చేయవచ్చు. సంఘాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కూడా ఏర్పాటు చేయించుకోవచ్చు. ఫేస్‌బుక్‌లో SALLA NARAYANASWAMY/Profsnswamy అకౌంట్లలో పోస్టింగులలో వివిధ విషయాలపై వివరణలను, ఫొటోలతో సహా చూడవచ్చు. సలహాలు, సూచనలు రైతులకు ఉచితం.

Read More