పాడి పశువుల పోషణలో మిశ్రమ ఆహారం

సుస్థిరంగా అధిక పాల ఉత్పత్తి కావాలంటే పాడి పశువుకు పోషకాలు గల ఆహారం అందించాల్సిందే. పశువుకు అందించే ఆహారంలో నాణ్యమైన పచ్చిమేత, ఎండుమేతతో బాటు మాంసకృత్తులు, ఖనిజలవణాలు మరియు విటమిన్లు తగిన మోతాదులో దాణా రూపంలో అందిస్తుంటాం. పశువు శరీర అవసరాలను, పెరుగుదల ప్రత్యుత్పత్తి, పాల ఉత్పత్తుల కోసం ఇదెంతో ఉపకరిస్తుంది. తక్కువ పాలనిచ్చే పశువు తినే ఆహారంలో 66% శరీర పోషణకు ఉపయోగించుకోగా, అధిక పాల దిగుబడి నిచ్చేవి మాత్రం కేవలం 35% మాత్రమే శరీర పోషణకు ుపయోగించుకుంటాయి. పాలఉత్పత్తికయే ఖర్చులో మేతకే 55% మేర ఉంటుంది కాబట్టి, వీలైనంత నియంత్రణలో పోషకాల ఆహారం, స్థానిక వనరులతో తయారు చేసినవి ఉపయోగిస్తేనే, పాల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. గడ్డి కత్తిరించి మేపడం అలవాటు చేయాలి.

పోషకాల గని లాంటి దాణాలో సాధారణంగా మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, ఉలవలు, శనగలు, చెక్కలు, వరి తవుడు, చెరకు మడ్డి, ఖనిజ లవణాలు, విటమిన్లు, ఉప్పు లాంటి స్థూల పోషకాలుంటాయి.పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణాలు కలిపి ఒకేసారి మిశ్రమ దాణాగా అందించడాన్ని మిశ్రమ ఆహారం అంటారు. ఈ పద్ధతి ద్వారా పశువు జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అంతేకాక, కూలీ ఖర్చు ఆదా అవుతుంది. ఇలా ఆహారం అందించడం ద్వారా పశువు పొట్టలో ఉదజని సూచిక స్థిరంగా ఉండి సూక్ష్మజీవుల పెరుగుదల అధికంగా ఉంటుంది. సరిగ్గా లెక్కకట్టి మేపడం సాధ్యం అవుతుంది కాబట్టి పశుగ్రాసం, దాణా వృథా కూడా అరికట్టవచ్చు.


పశుగ్రాస కత్తిరింపు యంత్రంలో పచ్చిమేతను ముక్కలుగా కత్తిరించి, ఎండుగడ్డి, చొప్ప కూడా కత్తిరించి, దాణా కలిపి, 15 నుండి 20 నిమిషాలు మంచిగా కలిపి రోజుకు 3-4 సార్లు పశువుకు మేపాలి. మేతలు, దాణాల కొలతకై డిజిటల్‌ మీటర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దాణా తొట్టిలో సమంగా పడేలా చేసే యంత్రాలు కూడా దొరుకుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో పంటల వ్యర్థాలతో సైతం ఇలాంటి మిశ్రమ ఆహారం తయారు చేయవచ్చు. వివిధ వ్యవసాయ వ్యర్థాలైన చెరకు పిప్పి, జొన్నచొప్ప, ఎండుగడ్డి, పొద్దుతిరుగుడు కట్టె, వరిగడ్డి, ప్రత్తి కట్టె, సుబాబుల్‌ ఆకులు, ఎండిన టేకు ఆకులు, ఎండిన మామిడి ఆకులు, వేరుశనగ కట్టె లాంటి ఎన్నింటినో ఈ మిశ్రమ దాణా తయారులో తగు మోతాదుల్లో వాడవచ్చు. రుచికోసం మొలాసిస్‌ కలిపితే, దాణా రుచికరంగా ఉంటుంది.


ఈ పద్ధతి ద్వారా పశువులకు ఎక్కువ పీచు ఉండేపదార్థాలు సద్వినియోగంలోకి తేవచ్చు. కడుపు ఉబ్బరం ఏర్పడకుండా కొద్దికొద్దిగా మేపడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మిశ్రమ ఆహారం పాలఉత్పత్తి ఖర్చును తగ్గించడమేకాక, వెన్నశాతం పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకులలో అధిక మాంసకృత్తులుండే చెట్లయిన మునగ, మలబారు, గ్లైరిసిడియా, సుబాబుల్‌, అవిశె, తురకవేప లాంటి చెట్ల ఇంటి ఆవరణలో పెంచి, ఇట్టి చెట్ల ఆకులు వినియోగంలోకి తేవడం, పాల ఉత్పత్తి ఖర్చు తగ్గుదలకు మొదటి మెట్టు. ఏ వస్తువైనా అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, అట్టి వస్తువుకు వినియోగదారుడు చెల్లించే ధర తగ్గుతుంది. కానీ, ఇది పాడిపరిశ్రమ విషయంలో జరగడం లేదు. అందుకే విరివిగా దాణా కర్మాగారాల స్థాపన జరిగి, పచ్చిమేత, అజొల్లా, మాగుడు గడ్డి లాంటివి మహాత్మాగాంధీ ఉపాధి పథకంలో విస్తృతపరిస్తేనే, పాడి పల్లవిస్తుంది. పాల దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. 

మధుసూదనరావు, ఉప సంచాలకులు,

విజయ డెయిరీ, ఆదిలాబాదు, 9121160553

Read More

సమగ్ర సేద్యమే లాభదాయకం ఆకట్టుకున్న ‘రాయలసీమ ఆర్గానిక్‌ మేళా’

మన సంప్రదాయ వ్యవసాయ విధానమైన సమగ్ర వ్యవసాయ విధానంతో రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని ‘నాబార్డు’ చైర్మన్‌ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్తంగా తిరుపతిలో ఏప్రిల్‌ 8,9,10 తేదీల్లో ఇస్కాన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘రాయలసీమ ఆర్గానిక్‌ మేళా’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. 

మార్కెటింగ్‌ సమస్య లేని తిరుపతి లాంటి కేంద్రాల్లో ఆర్గానిక్‌ విక్రయాలకు అవకాశం ఉందని ఆయన విక్రయదారులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి సహాయ సహకారాలు అందిస్తామని నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆర్గానిక్‌ స్టోర్‌ ఏర్పాటు చేసేందుకు టిటిడి గానీ, ప్రకృతి వ్యవసాయదారులు గానీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పురాతన కాలంలో ప్రజలు ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను తినడమేనని వివరించారు. నేడు రసాయన ఎరువుల వాడకం రోజురోజుకూ పెరగడం వల్ల విషపూరిత ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తున్నాయని, ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారానే ఆరోగ్య భారత్‌ను చూడగలమని పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే వ్యవసాయదారులను తాము ప్రోత్సహిస్తామని తెలిపారు. 1982లో 4 వేల కోట్లతో ప్రారంభమైన నాబార్డ్‌ నేడు 7 లక్షల 50 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపారు.    

రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ పద్మశ్రీ వై. వేంకటేశ్వరరావు మాట్లాడుతూ 2012 నుంచి సేంద్రియ వ్యవసాయ విధానాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు వినియోగదారుల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యస్థాపకులు కుమారస్వామి మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు సేంద్రియ వ్యవసాయానికి వర్తింపజేస్తే ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటుందన్నారు.

ప్రధాని నుంచి సామాన్యుడి వరకు...

భారతీయ కిసాన్‌సంఘ్‌ జాతీయ సంఘటన కార్యదర్శి దినేష్‌ కులకర్ణి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆరోగ్యం కోసం ప్రకృతి, గోఆధారి వ్యస్తాయంపై ఆధారపడడం మంచి పరిమాణం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త నిర్వహణ కార్యదర్శి విజయ్‌ ఆదిత్య మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ విధానాలను పాఠ్యాంశాలుగా చేర్చితే దేశ వ్యవసాయ విధానంలో మార్పు తేవచ్చని వివరించారు. ఆప్కాబ్‌ ఎండీ శ్రీనాథరెడ్డి ప్రసంగిస్తూ సేంద్రియ రైతులు రైతు ఉత్పత్తిదరాఉలు సంఘంగా ఏర్పడితే అనేక సౌకర్యాలు, అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు సహకరిస్తామని ప్రకటించారు. నాబార్డు సీజీఎం ఉదయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌ పెంపొందించేందుకు రూరల్‌ మార్టులను రాయితీలతో ప్రోత్సహిస్తామని తెలిపారు. గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యకక్షుడు గంగాధరమ్‌, ప్రధాన కార్యదర్శి భరత్‌వర్మ, 300 మందికి పైగా ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు. 

Read More

వ్యవసాయాధారిత పర్యాటకం

వ్యవసాయాధారిత పర్యాటకం పర్యాటక రంగంలో ఒక నూతన ఒరవడిగా చెప్పుకోవచ్చు. రోజువారి యాంత్రిక జీవనంతో విసిగి వేసారిపోయి ప్రకృతి ఒడిలో మట్టి వాసనకు దగ్గరగా సేద తీరాలనుకునే నగరజీవులు ఎంతోమంది. తాము తినే అన్నం ఎలా పండిస్తారో, తాగే పాలు ఎలా పితుకుతారో, టమాటో మరియు వంకాయ మొక్కలకి తేడా తెలియని కార్పొరేటు స్కూలు విద్యార్థులు చాలామందే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో రైతుల పొలాల్లో ఒక మోస్తరు మౌళిక సదుపాయాలు కల్పించటం ద్వారా వారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు సృష్టించుకోవచ్చు.

పొలాల్లో విడిది చేస్తూ, వ్యవసాయంలోని రోజువారి కార్యక్రమాలను తెలుసుకుంటూ రైతుల యొక్క సాధక బాధల్ని అర్థం చేసుకోవడానికి, మరుగున పడిపోయిన తమ మూలాలను గుర్తు చేసుకునేందుకు, పిల్లలకు వ్యవసాయం గురించి అవగాహన కల్పించేందుకు, యాంత్రిక జీవనానికి అలవాటు పడిన సగటు నగరజీవికి ఈ తరహా పర్యాటకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాంటి పర్యాటకాన్ని ప్రోత్సహించడం వలన రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు సృష్టించినట్లే అవుతుంది.

ఈ తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించడం వలన లాభాలు

* విడిది చేయడానికి, సందర్శించడానికి రుసుము వసూలు చేయడం ద్వారా, పండిన వ్యవసాయ ఉత్పత్తులను అమ్మడం ద్వారా రైతులకు ఆదాయాన్ని కల్పించవచ్చు.*    గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువత మరియు మహిళలకు ఉపాధి దొరుకుతుంది. 

* ఆయా ప్రాంతాల్లో ఉండే కుటీర పరిశ్రమలకు (బొమ్మలు, చేనేత వస్త్రాలు, ప్రత్యేక తినుబండారాలు) ఊతం కల్పించినట్లు అవుతుంది. 

ప్రభుత్వ చొరవ అవసరం:

రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి, కృష్ణా జిల్లాలు ఈ తరహా పర్యాటకానికి చాలా అనువైనవిగా భావించవచ్చు. సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పాటు, వ్యవసాయ ఉద్యాన పంటల సాగు, డెయిరీ మరియు చేపల పెంపకం విరివిగా ఉండటం ఆ ప్రదేశాలకు కలిసివచ్చే అంశం. గత ప్రభుత్వం 2016-17లో ఈ తరహా పర్యాటకానికి ప్రోత్సాహం అందించే దిశగా ఆలోచనలు చేసినా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మరియు వ్యవసాయశాఖలు ఈ విషయమై దృష్టిసారిస్తే రైతులకు ఎంతో ప్రయోజనకరం.

మహారాష్ట్ర ఆదర్శం:

వ్యవసాయాధారిత పర్యాటకంలో మహారాష్ట్ర రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రిటూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను 2005లో ఏర్పరచి, రైతులకు శిక్షణ మరియు ప్రోత్సాహకాలను అందిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 30 జిల్లాల్లో 320కి పైగా అగ్రిటూరిజం సెంటర్లు ఉన్నాయి. 2014వ సంవత్సరంలో 0.40 మిలియన్లు, 2015లో 0.53 మిలియన్లు, 2016లో 0.70 మిలియన్ల పర్యాటకులు ఈ కేంద్రాలను సందర్శించినట్లు ఏ.టి.డి.సి. సర్వే లెక్కలు చెబుతున్నాయి. గ్రామీణ మహిళలకు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైనట్లు తెలిపింది. 2016వ సంవత్సరంలో ప్రత్యేక టూరిజం పాలసీని కూడా తీసుకువచ్చి, వ్యవసాయాధారిత పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా అడుగులు వేస్తోంది.             

దాదిమి అనిల్‌కుమార్‌ రెడ్డి, 

వ్యవసాయ విస్తరణ విభాగం పరిశోధక విద్యార్థి,

ICAR – NDRI, Ph: 8106490810, 8639689900

Read More

నవజాత కోడిపిల్లలు – నాణ్యత

గుడ్ల ఉత్పత్తికి లేదా మాంసానికి బ్రోయలర్‌ కోళ్ళు పెంచేందుకు కోళ్ళఫారాల్లో అపుడే పుట్టిన పిల్లలను పెంచి పెద్ద చేయడం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమము. కోడిపిల్లల ఉత్పత్తి సంస్థలో ఎక్కడో జన్మించిన నవజాత కోడిపిల్లలు రైలులో, మోటారు వాహనాలలో, విమానంలో గంటల/రోజుల తరబడి ప్రయాణించి మన ఫారంలో అడుగుపెడతాయి. అవి చురుకుగా ఆరోగ్యంగా కనువింపుగా ఉంటె వాటిని దింపుకొని బ్రూడింగ్‌ చేస్తాము. దింపుకునే ముందు ఆ పిల్లలు మంచిగా, బాగుగా ఉన్నాయని నిశ్చయించుకున్న తరువాతనే దించుకుంటాము. చురుకుగా ఉంటె పిల్లలు నాణ్యంగా ఉన్నాయని ఊహించుకుంటాము. కోడి పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా, మంచిగా ఉండాలి. గలగల్లడుతూ బ్రూడింగ్‌ ప్రదేశంలో తిరగాలి. నీళ్ళు తాగాలి. మేతమేయాలి. పరిమాణంలో వ్యత్యాసం ఉండకూడదు. పెట్టెల్లో నలగకుండా ఉండాలి. ఎక్కువ సంఖ్యలో మరణించి ఉండరాదు. సాధారణంగా ఇవే మనం చూస్తాము.

కాని కోడిపిల్లల ఉత్పత్తి కేంద్రం వారి లెక్కలు వేరుగా ఉంటాయి. గుడ్ల నుండి ఎంత శాతం పిల్లలు పోదిగాయి? పెంకును  పగలగోట్టి రాలేనివి (ఆరిచీచీరిదీవీ) ఎన్ని? 3 రోజుల మరణాల శాతం ఎంత? పిల్లల మధ్య వ్యత్యాసం అధికంగా ఉందా? అనే దానిపై   లెక్కలు కట్టి కోడి పిల్లల ఉత్పత్తిలో మెరుగులు దిద్దుకుంటారు. కాని వాణిజ్య పద్దతులలో మనం పెంచే కోళ్ళ ఫారంలో పరిస్థితులు వేరు. వేసవిలో వేడి, వర్షాకాలంలో తేమ, తడి, శీతాకాలంలో చల్లదనం, ప్రయాణంలో ఆటంకాలు, ప్రయాణ సమయంలో ఒత్తిడి  ప్రతీసారి ఒకే విధంగా ఉండవు. తడవ తడవకు మారుతూ ఉంటాయి. అదే వాహనం రెండు మూడు ఫారాల్లో వేరు వేరు చోట్ల పిల్లలను దించి రావడం వలన మనకు దిగుమతి ఆలస్యం కావచ్చును. లేదా మనకే ముందు దిగవచ్చును. అందువలన పిల్లలు అనుకున్న సమయానికి మన ఫారంలో అడుగు పెట్టడం యల్లకాలం సాధ్యంకాదు. 

మంచి కోడిపిల్ల లక్షణాలు ఏమిటి?

ఏడు రోజులకు కోడిపిల్ల బరువా! కొద్ది రోజులలో తక్కువ  మేత తిని ఎక్కువ బరువు రావడమా! అతి తక్కువ మరణ శాతమా! గుడ్ల ఉత్పత్తి అధికమా! ఇవన్నీ మన పెంపకం, పాలన, మేత, పారిశుద్ధ్యం, రోగనిరోధక శక్తి పై ఆధారపడి ఉంటాయి. మరి రోజు వయసు కోడిపిల్ల బాగుండడం, బాగాలేకపోవడం అంటే ఏమిటి? మంచిరకం పిల్లలకు నాసి రకం పిల్లలకు తేడా ఏమిటి? మంచివాటినుండి చెడ్డవాటిని గుర్తించడం ఎలా? మంచివని,  నాసివని,  బాగాలేవని కంటి చూపు తో అంచనా వేస్తున్నాము. చెడు రకాలను నిర్నయిస్తున్నాము. ఒక్కొక్కసారి కంటి చూపు మంచి చెడులను నిర్ణయించడములో విఫలమవ్వచ్చును. నాణ్యతను కంటిచూపుతో నిర్ణయించలేము. ఖచ్చితంగా చెప్పలేము గనుక కొన్ని పరీక్షల ద్వారా అనుబంధ ప్రమాణాలను (ఆబిజీబిళీలిశిలిజీరీ) గుర్తించడం జరుగుతుంది. అవి ఏమంటే…

1. చురుకుదనం (Activity): కోడిపిల్లలు అట్టపెట్టె నుండి తీయగానే పరుగులు పెడతాయి. కలివిడిగా ఉంటాయి. నీరు ఆహారం కొరకు వెతుకుతాయి. బంతుల్లా గలగలా తిరుగుతూ ఉత్తేజంగా ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటే బ్రూడర్లో వేసిన వెంటనే వేడి కొరకు వెతుక్కుంటాయి. ఒకదానికొకటి హత్తుకుంటాయి. వేడిగా ఉంటే దూరంగా జరుగుతాయి. అరచేతిలో లేదా నేలపై వెల్లకిలా పండ బెడితే మూడు సెకన్లలో తిరగబడి కాళ్ళపై నిలబడతాయి.  

2. అగుపడడం: శుభ్రంగా, పొడిగా ఉండాలి. ఎక్కడా తడిగా ఉండరాదు. శరీరానికి పెంకులు, పొరలు అంటుకుని ఉండరాదు. మెడ వెనుక భాగం ముదర రంగు ఉండరాదు.
3. ఉదరము: కడుపు సమానంగా ఉండాలి. ఉబ్బరంగా, నిండుగా, పెద్దగా ఉంటే పచ్చసొన అధికంగా ఉన్నట్లు గ్రహించాలి. పచ్చసొన అధికంగా ఉంటే అనారోగ్యానికి దారి తీస్తుంది.                                                                కోడిపిల్ల మనదగ్గరకు పొదిగిన వెంటనే రాదు. కొన్ని గంటల సమయం పడుతుంది. అన్ని పిల్లలూ ఒకేసారి గుడ్డునుండి బయటపడవు. బలంగా పెద్దగా ఉన్నవి పెంకు పగలకొట్టి ముందు బయట పడతాయి. చిన్నవి బలహీనంగా ఉన్నవి తరువాత బయటకొస్తాయి. వాటిని హేచరిలో పెద్దపిల్లలను చిన్న పిల్లలను వేరు వేరు గుంపులుగా వర్గీకరిస్తారు. పిల్లలను వేరు చేయడం అంటే పరిమాణాలను గుర్తించి పెద్దవాటినుండి చిన్నపిల్లలను బుల్లి పిల్లలను విడివిడిగా ఉంచడం. గుడ్లపెట్టె కోడిపిల్లలు అయితే పుంజు పిల్లలను వేరు చేసి పెట్టపిల్లలను మాత్రమే పంపుతారు. ఇలాచేయడం చాలా సమయం తీసుకుంటుంది. అదీగాక టీకా మందులు వేయడం ఉంటుంది. ప్రతీ పిల్లను చేతిలోకి తీసుకుని టీకా వేయడం సమయంతో కూడుకొన్న పని. అన్నిటికీ   టీకా వేయడానికి 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే వేలసంఖ్యలో పిల్లలు పొదిగి బయటకు వస్తాయి. కొన్ని హేచరీలలో టీకాలను కోడి పిల్లలపై పిచకారి చేస్తారు. ఈ పనులన్నీ జరిగిన పిదప అట్ట పెట్టెలలో ఉంచి మోటారు వాహనంలో ఉంచుతారు. అది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మనదగ్గరకు రావడానికి కనీసం 10 నుండి 20 గంటలు సమయం పడుతుంది.  మధ్యలో రెండు మూడు ఫారాల్లో కోడిపిల్లలను దింపడం కూడా జరగవచ్చు. ఈ సమయంలో పచ్చసొనలో ఉన్న పోషక పదార్ధములే కోడిపిల్లకు ఆహారం. ఈ ప్రక్రియలో పచ్చసొన నెమ్మదిగ కరిగిపోవడంతో ఉదరం సమంగా ఉంటుంది. ఉదరం పొంగి గట్టిగ బిరుసుగా  అగుపిస్తే ఆ కోడిపిల్ల పొట్టలో పచ్చసొన ఇంకా మిగిలిఉందని పూర్తిగా వినియోగం కాలేదని తెలియచేస్తుంది. ఎక్కువగా ఉంటే పచ్చసొన కరగలేదని అర్ధం. పచ్చసొన కరగలేదంటే కోడిపిల్ల అనారోగ్యంగా ఉన్నట్లు గుర్తించాలి.   
4. కళ్ళు: విప్పారి స్పష్టంగా మెలుకువగా వెలుగులు పంచే కళ్ళు ఆరోగ్యాన్ని సూచిస్తాయి. మూసుకుపోతున్న కళ్ళు అలిసిన డస్సిపోయిన నీరసించిన పరిస్థితిని తెలియచేస్తాయి. మూతపడిన కళ్ళలో జీవం ఉండదు. అటువంటి కోడిపిల్లలు బ్రతకడం కష్టం. ఒకవేళ బ్రతికినా పుంజుకుని ఇతర పిల్లలతో సమానంగా వృద్ధి చెందడం వీలు పడదు.  
5. కాళ్ళు : మోకాళ్ళు ఎర్రగా ఉండడం మంచిదికాదు. కోడిపిల్ల రవాణాలోగాని, హేచింగ్‌ లో గాని ఇబ్బందులకు గురి అయినదని తెలియచేస్తాయి. మోకాళ్ళు వాచి ఉండరాదు. గాయాలుంటే నడవడం యిబ్బంది అవుతుంది. నేల మీద నిలవగలుగుతున్నదా, నడవగలుగుతున్నదా గమనించాలి. కాలి వేళ్ళు బాగున్నవా లేదా చూడాలి. ఒక్కొకసారి మూడు కాళ్ల పిల్లలు, ఒంకర కాళ్ల పిల్లలు, కుంటివి రావచ్చును.  

6. బొడ్డు : బొడ్డు రంధ్రము పూర్తిగా మూయబడి ఉండాలి. చర్మము శరీరం రంగుతో కలిసి పోయుండాలి. నల్లటి మచ్చ, వేలాడుతున్నతీగ, మూతపడని బొడ్డు ఉన్న పిల్లలు వస్తాయి. అటువంటి వాటిని వేరు చేయడం మంచిది. అలా ఉంటే మంచిదికాదు.    
7. పొరలు: గుడ్డునుండి పిల్ల బయటకు వచ్చిన తరువాత కొద్దిసేపటకి శరీరం గాలికి ఆరి విప్పారుతుంది. బొచ్చు సున్నితంగా మెత్తగా దూదిలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పిల్లను చుట్టి ఉండే పొరలు సైతం విడిపోతాయి. ఫారంలో ప్రవేశించిన పిల్ల శరీరం పై ఏ విధమైన పొరలు, గుడ్డు తాలూకు పెంకులు లేకుండా ఉండాలి.
8. పచ్చసొన: ఎండిపోయిన పచ్చసొన దాని ఆవశేషాలు కాళ్ళపై ఇతర భాగాలపై కనిపించకూడదు. కోడిపిల్ల ఎలా ఉంది అని అడిగితే నలుగురు నాలుగు రకాలుగా చెబుతారు. గనుక కోళ్ళఫారంలో పనిచేసే అందరికి  ఎంతోకొంత అవగాహన ఉండడం మంచిది. యజమాని దూరంగా ఉన్నపుడు ఫారంలో పనిచేసేవారు రోజు వయసున్న  కోడిపిల్లలను దించుకోవలసి వస్తుంది. వారి విచక్షణా జ్ఞానం యజమానికి మేలు చేస్తుంది. పిల్లలు వచ్చే సమయం తెలియదు. చాలా కోళ్ళఫారాలలో సాధారణంగా పనివారే పిల్లలను స్వీకరించి బ్రూడింగ్‌ చేస్తుంటారు.    కోడిపిల్ల ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంటే వీపుపై పడుకోబెట్టిన 3 సెకన్లలో తన కాళ్ళపై నిలబడి పరుగులు పెడుతుంది. చివరి రెండుమూడు రోజులందు పెంకును పగలగొట్టి పిల్ల బయటపడుతుంది. ఆ సమయంలో హేచర్‌నందు ఎక్కువ వేడి, గాలిలో తేమ ఉంటే జీవక్రియల సంయమనం కుదరక ఉదరం పెద్దగా మందంగా ఉండడం నీరు నిలిచి ఉండే అవకాశాలుంటాయి. బొడ్డు పూర్తిగా మూసి, మానుపట్టి ఉంటే కోడిపిల్ల ఆరోగ్యంగా ఉన్నట్లే. గుదికాలు ఎరుపు రంగు ఉంటే పొదుగుతున్నపుడు వేడి ఎక్కువగా ఉందని అర్ధం. వేడి ఎక్కువగా ఉంటే ముక్కుపై ఎరుపు, రక్తం కారడం, రక్తపు చుక్కలు ఏర్పడతాయి. ఇంకా చిలకముక్కుపిల్లలు, వంకర ముక్కులు, వంకర కాళ్ళు, మూడు కాళ్ల పిల్లలు, గుడ్డివి అపుడపుడు వస్తూనే ఉంటాయి. వెంటనే గుర్తించకపోయినా రెండుమూడు రోజుల తరువాత అవే బయట పడతాయి.తల్లికోడి ఆరోగ్యం, ఆహారం, నివాసం, గుడ్ల సేకరణ, గుడ్లు శుభ్రం చేసే తీరు, గుడ్లు నిలవ ఉంచేవిధానం, పొదుగించే పధ్ధతి, పిల్లలను పరీక్షించి వేరుచేసే విధానం, టీకాలు, రవాణా, దూరం, సమయం మొదలగు విషయాలపై కోడిపిల్ల నాణ్యత ఆధారపడి ఉంటుంది. కోడిపిల్ల బాగుంటే మంచి ఫలితాలు పొందే అవకాశాలు హెచ్చుగా ఉంటాయి. తల్లికోళ్ళు ఒకే వయసులో ఉంటే వాటి గుడ్లు దాదాపుగా ఒకే బరువులో ఉండి వాటిపిల్లల బరువు సమానంగా ఉంటుంది. కాని వేలకొలది గుడ్లు పొదగవలసి వచ్చినపుడు వివిధ వయసున్న తల్లుల గుడ్లు కలిపి పొదిగించడం తప్పనిసరిగా జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో గుడ్ల బరువు వేరుగా ఉంటుంది. గుడ్డు పెంకును పగలగొట్టి కొన్ని పిల్లలు ముందు కొన్ని వెనుక గంటల తేడాలో బయటకు రావడం వలన పిల్లల బరువులో వ్యత్యాసాలు, ఆకారంలో తారతమ్యాలు సాధారణం. ముందు పిల్లకు ఆఖరు పిల్లకు 20 నుండి 30 గంటల వ్యత్యాసం  ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే పొదిగిన పిల్లలను బరువును బట్టి, పరిమాణాన్ని బట్టి వర్గీకరిస్తారు. ముందుగా పొదగిన పిల్లలు తరువాత పొదిగిన పిల్లలు ఒకేసారి మన ఫారానికి సరఫరా కావచ్చును. రెక్కలపై ఈకలను గమనిస్తే ముందు పొదగిన పిల్లల ఈకలు పెరిగినట్లు గుర్తించవచ్చు. పొదిగే గుడ్ల సంఖ్యను బట్టి, తల్లుల వయసును బట్టి కోడిపిల్లల బరువు పరిమాణంలో తేడాలుంటాయి.  కోడిపిల్లల నాణ్యతను నిర్దేశించడానికి పాస్గర్‌ స్కోరులో అసంకల్పిత చర్యలు, పూడుకుపోయిన బొడ్డు, కాళ్ళు, ముక్కు, పచ్చసొన అవశేషాలు చూస్తారు. టోన (ఊళిదీబి) స్కోరు కూడా కోడిపిల్ల మంచి చెడులను నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది.    మన ఫారంలో కోడిపిల్ల అడుగుపెట్టిన వెంటనే బరువు తెలుసుకోవాలి. అన్ని బుట్టలనుండి చేతికి అందిన 10 పిల్లల చొప్పున 100 పిల్లలను తూయవచ్చును. తూయడానికి ప్రత్యేకంగా కోడిపిల్లలను ఏరకూడదు. లేదా నాలుగు ఐదు బుట్టల బరువులను కాటా వేసి కోడిపిల్ల సగటు బరువును తెలుసుకోవచ్చును. పిల్ల బరువు గుడ్డు బరువులో 66-67 శాతం ఉంటుంది. పొదగబడిన గుడ్డు బరువు తెలియనప్పటికీ మనకొచ్చిన పిల్లల బరువు తెలుసుకోవలసిన భాధ్యత మనకుంది. ఈ తూకాలవలన పిల్లలు అన్నీ సమానంగా ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. బరువు తక్కువగా ఉన్న వాటిని వేరుగా పెంచడం వలన వేగంగా వృద్ధి వృద్ధి చెందుతాయి. చిన్నాపెద్ద కలిసివుంటే చిన్న పిల్లలు వెనుకబడి ఉత్పత్తి సామర్ధ్యం కుంటుపడుతుంది. చిన్న పిల్లలు మేతకోసం పెద్దవాటితో పోటి పడాల్సి వస్తుంది. ఇంకా కొన్ని హేచరీలలో కోడిపిల్ల పొడవును కొలుస్తారు. తల దగ్గరనుండి గోరుచివర వరకు కొలతలను తీసుకుంటారు. దాని ప్రకారం ఎక్కువ పొడవు ఉన్న కోడిపిల్ల ఎక్కువ ఉత్పత్తులను ఇస్తుందని వారి అంచనా. ఏమైనా నవజాత కోడిపిల్ల బరువు, చురుకుదనం, కళ్ళు, కాళ్ళు, కడుపు మొదలగువన్నీ చక్కగా ఉండాలి. ఎన్ని పిల్లలు వచ్చాయో లెక్కపెట్టి తెలుకోవడం కూడా అవసరమే. పిల్లల సంఖ్యను బట్టి మేత, టీకాలు, మందులు వాడకం ఉంటుంది. ఎన్ని మరణించాయో తెలుస్తుంది. ఎన్నింటిని అమ్మేమో తెలుస్తుంది. ఎన్ని గుడ్లు పెట్టాయో తెలుస్తుంది. ఓ్పుష్ట్ర ఏమిటో కనుగొనవచ్చు. ఆర్ధిక వనరులను తదనుగుణంగా ఏర్పాటు చేసుకోవచ్చు. లాభాలను పెంచుకోడానికి, పాలనా పద్ధతులను మెరుగుపరచుకోవడానికి తోడ్పడుతుంది. తడవ తడవకు వచ్చిన పిల్లల వివరములు, ఉత్పత్తి చేసినవారి వివరములు, పంపిణి పద్ధతులు, సమయం, వాతావరణం ఎప్పటికప్పుడు పుస్తకములో నమోదు చేసుకోవాలి. ఈ విధంగా రాసిఉంచుకోవడం వలన తేడాలుంటే గ్రహించగలుగుతాము. తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు.       
డా. నాగేశ్వరరావు, ఫోన్‌: 96521 05405 

Read More

పాలేకర్‌ బాటలో విజయరామ్‌

రసాయనిక వ్యవసాయం వలన సంభవించిన, సంభవిస్తున్న అనర్ధాల నుండి బయటపడడానికి అనేకమంది నిపుణులు, శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు, కొన్ని సంస్థలు రసాయనాలు అవసరం లేని వివిధ రకాల సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేస్తున్నారు. వీటిలో ఫుకుఓక ప్రకృతి వ్యవసాయ పద్ధతి, భాస్కరసావే పద్ధతి, చౌహాన్‌క్యూ పద్ధతి, నమ్మళ్వార్‌ పద్ధతి, సేంద్రియ వ్యవసాయ పద్ధతి, సుభాష్‌పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి లాంటి వాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటన్నింటిలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతులోగిళ్ళకు చేరింది. ఇంకా చేరేతూనే ఉంది అని చెప్పవచ్చు. సుభాష్‌ పాలేకర్‌ వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ పద్ధతి గురించి ప్రచారం చేయడంతోపాటు, కొన్ని ప్రభుత్వాలు ఈ పద్ధతిని ప్రోత్సహించడం మరియు రైతులు అమలుపరచటానికి అనుకూలంగా ఉండడం, ఈ పద్ధతిలో మన దేశీయ జాతి గోవు ప్రముఖ పాత్రను పోషించటం లాంటి వివిధ రకాల కారణాల వలన మిగతా పద్ధతులతో పోల్చుకుంటూ సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి చాలా వేగంగా రైతు లోగిళ్ళకి చేరిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే సుభాష్‌పాలేకర్‌ వలననే రసాయన వ్యవసాయం వలన జరిగిన, జరిగే నష్టాలు రైతులు తెలుసుకుంటున్నారు. రసాయన రహిత వ్యవసాయం ఇంత వేగంగా రైతులకు తెలియడంలో సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి ప్రధాన పాత్ర పోషించింది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పద్ధతిని సుభాష్‌ పాలేకర్‌ ప్రచారం చేయకుండా ఉండి ఉంటే రసాయన రహిత వ్యవసాయం రైతులోగిళ్ళకు చేరటానికి చాలా సమయం పట్టేది కావచ్చు. పాలేకర్‌ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడం, వారి పుస్తకాలు చదివిన వారు, వారి సభలకు హాజరయ్యి ఈ పద్ధతుల గురించి తెలుసుకున్న చాలామంది రైతులు తమ రసాయనిక సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ బాట పట్టించారు. పట్టిస్తున్నారు. వ్యవసాయేతర ఉద్యోగ, వ్యాపారం లాంటి వేరే రంగాలలో ఉన్న వారు కూడా సుభాష్‌ పాలేకర్‌ జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతుల గురించి తెలుసుకుని ఈ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణాజిల్లా, తరకటూరులో 8 ఎకరాలు, వికారాబాద్‌ సమీపములో 50 ఎకరాలు, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 58 ఎకరాలలో ప్రకృతి సాగు చేస్తున్న విజయరామ్‌.

వాస్తవానికి విజయరామ్‌ ఆర్టిస్ట్‌ (బొమ్మలు గీస్తుంటారు). ఆర్టిస్ట్‌గా తన వృత్తిని కొనసాగిస్తూ హైదరాబాదు నగరంలో ఇందిరాపార్కు సమీపంలో ఒక మిఠాయి దుకాణాన్ని నడుపుతూ వస్తున్న సమయంలో నీటి యొక్క విలువను తెలుసుకుని నీటి సంరక్షణకు సంబంధించిన సమాచారాన్ని మిఠాయి దుకాణంకి వచ్చిన వినియోగదారులకు తెలియచేస్తూ ఉండేవారు. అందుకు సంబంధించి చార్టులను తయారు చేయించి అవసరమైన వారికి ఆ చార్టులను ఉచితంగా అందిస్తూ ఉండేవారు. ఆవిధంగా తన ఆలోచనలని సామాజిక రంగాలవైపు కూడా మళ్లించి కొనసాగుతున్న క్రమంలో 2010వ సంవత్సరంలో సుభాష్‌పాలేకర్‌ గారి జీరోబడ్జెట్‌ నాచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతి గురించి తెలుసుకొని తాను కూడా గో-ఆధారిత వ్యవసాయం చేయాలనే తలంపుతో అటువైపు అడుగులు వేసి ప్రకృతి వ్యవసాయంలో అడుగు పెట్టారు. ఈ పద్ధతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే తలంపుతో సుభాష్‌పాలేకర్‌ గారి ద్వారా సదస్సులు ఏర్పాటు చేయడంలో తనవంతు పాత్రను పోషించారు…. పోషిస్తూన్నారు.

గోఆధారిత వ్యవసాయంలో ప్రధానమయినవి మన దేశీయ జాతి గోవులు, మన పురాతన నాటు విత్తనాలు కాబట్టి తన సాగులో ఈ పద్ధతులను అమలుపరచడంతో పాటు అంతరించి పోతున్న మన పురాతన విత్తనాలను అభివృద్ధి చేసి వాటి లభ్యత పెంచాలనే తలంపుతో మన పురాతన విత్తనాల సేకరణకు నడుంబిగించి వాటిని సేకరిస్తూ అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. వీటన్నింటికిగాను కృష్ణాజిల్లా తరకటూరులోని 8 ఎకరాల పొలం, వికారాబాద్‌ సీమపంలోని 50 ఎకరాల పొలంలో పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను మన దేశీయ జాతులు ఒంగోలు, గిర్‌ లాంటి ఆవులను మరియు ఎద్దులను కలిపి సుమారు 120 మేరకు పశువులను పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటలసాగులో వినియోగిస్తున్నారు. ఆవు పాల ద్వారా మన తాత, ముత్తాతలు పాటించిన పద్ధతులతో నాణ్యమైన ఆవు నెయ్యిని తయారు చేసి అవసరమైన వారికి అమ్ముతూ వస్తున్నారు.

ప్రస్తుతం వరి, చెరకు, ఉల్లి, పసుపు, అల్లం, వివిధ రకాల కూరగాయలు అరటి మొదలగు పంటలతో పాటు 5 అంచెల పద్ధతిలో (పూర్తి వివరాల కొరకు బాక్స్‌ చూడగలరు) వివిధ రకాల పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. దుక్కిలో ఘనజీవామృతం అందించడంతో పాటు జీవామృతాన్ని భూమికి అందిస్తుంటారు. అవసరాన్ని బట్టి జీవామృతం, నీమాస్త్రం, పుల్లటి మజ్జిగ లాంటి వాటిని పంటలపై పిచికారి చేస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతుంటారు. పంట దిగుబడిలో నాణ్యతకు, పోషకాలకు ప్రాముఖ్యతని ఇస్తూ ఎంత దిగుబడి వచ్చిందనే దానిని పట్టించుకోకుండా వచ్చిన దిగుబడి నాణ్యమైనదా కాదా అనే కోణంలో ఆలోచిస్తూ పంటల సాగు కొనసాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాటు విత్తనాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి కాబట్టి తను సాగు చేసే పంటలన్నింటికీ నాటు విత్తనాలనే ఉపయోగిస్తున్నారు. నాటు విత్తనాలను తన పంటల సాగులో వినియోగించడంతోపాటు తోటి రైతులకు అందచేస్తుంటారు. మన పురాతన విత్తనాలు అంతరించి పోతున్నవి కాబట్టి అందుబాటులో ఉన్న పురాతన విత్తనాలను ప్రత్యేకించి వడ్లను ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి వాటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో అభివృద్ధిపరచి తోటి రైతులకు అందచేసి మన పురాతన విత్తన నిధిని కాపాడుటలో విజయరాం ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు. పురాతన వడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి వీటిని ఆహారంగా తీసుకుంటే జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు అని తెలుసుకొని పురాతన విత్తనాల అభివృద్ధి మరియు పంపిణీని ఒక ఉద్యమంగా చేస్తున్నారు.

ఐదు అంచెల సాగు విధానం :

ఐదు అంచెల సాగు విధానాన్ని సుభాష్‌ పాలేకర్‌ బాగా ప్రచారం చేశారు. ఈ విధానంలో 36 అడుగుల దూరంలో మామిడి, నేరేడు లాంటి పెద్దగా ఎదిగే మొక్కలు పెంచుకొంటూ వాటి మధ్యలో వివిధ రకాల మొక్కలను, కూరగాయలు, ఆకుకూరలను 4 అంచలుగా సాగు చేయడం దాని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానం 36þ36 అని కూడా ప్రసిద్ధి చెందింది. ఈ 36þ36 విధానం ప్రచారంలోకి వచ్చిందేకాని క్షేత్రస్థాయిలో విజయం సాధించిన వారు పెద్దగా లేరు. కారణం ఈ విధానంలో దిగుబడులు సక్రమంగా రావడం లేదు అని తెలుసుకుని విజయరాం ఈ విధానానికి వేరే రూపం ఇచ్చారు. అంటే 36 కి బదులుగా 50 అడుగుల దూరం పాటిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయని అనుభవ పూర్వకంగా తెలుసుకుని 50þ50 అడుగుల దూరంలో 5 అంచెలుగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. 50 అడుగుల దూరంలో మొదటి అంచెలో నేరేడు, మామిడి, పనస, బాదం లాంటి పెద్దగా ఎదిగే వృక్షాలు 50 అడుగులలో సగం అంటే 25 అడుగుల దూరంలో రెండో అంచెగా బత్తాయి, నిమ్మ, నారింజ లాంటి మొక్కలు, 25 అడుగులలో సగం అంటే 121/2 అడుగుల దూరంలో 3వ అంచెగా బొప్పాయి, అరటి లాంటి మొక్కలు, 121/2 లో సగం 61/4  లో 4వ అంచగా మునగ, అవిశ లాంటి మొక్కలు 61/4 అడుగులకు మధ్యలో సొర, బీర, కాకర, బెండ లాంటి కూరగాయలతోపాటు తోటకూర, గోంగూర, చుక్కకూర లాంటి ఆకుకూరలు, పసుపు, అల్లం, చేమ దుంపలాంటి పంటలు పండిస్తున్నారు. వీటన్నింటిని పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులోనే పండిస్తున్నారు. 5 అంచెల విధానంలో లైనుకి లైనుకి 61/4 అడుగుల దూరం ఉంటుంది. లైనుకి లైనుకి మధ్య ఒక కాలువ చేసుకుని ఆ వచ్చిన మట్టి లైనులో ఎత్తుగా వేసుకోవడం వలన కలుపు సమస్య తగ్గడంతో పాటు లైనులో ఉన్న మొక్కలకు పోషకాలు బాగా అంది అవి ఆరోగ్యంగా పెరుగుతూ ఎలాంటి కషాయాలు, ద్రావణాలు అవసరం పడటంలేదు. తప్పనిసరి పరిస్థితులలో నీమాస్త్రం, పుల్లటిమజ్జిగ, జీవామృతం లాంటివి పంటపై పిచికారి చేస్తుంటారు. విజయరాం పండించే అన్ని పంటలకు నీటిని అందించటానికి ఎలాంటి డ్రిప్పు, స్ప్రింక్లర్‌ లాంటి విధానాలను ఉపయోగించకుండా కాలువల ద్వారానే నీటిని అందిస్తుంటారు. 5 అంచెల విధానంలో కాలువ ద్వారా నీటి అందిస్తూ ఆ కాలువలలో అరటి, బొప్పాయి లాంటి ఆకులు మల్చింగ్‌గా ఉపయోగిస్తుంటారు. 

ప్రకృతి వ్యవసాయంలో అడుగుపెట్టి, దేశీయ జాతి గోసంతతిని, మన పురాతన విత్తనాలను అభివృద్ధిపరుస్తూ తోటి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు నడిపిస్తూ పంట దిగుబడులు ముఖ్యం కాదు, నాణ్యమైన దిగుబడులు ముఖ్యం అంటూ విజయరాం ముందుకు నడుస్తున్నారు. మరిన్ని వివరాలు 8374662262 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

సమీకృత సేద్యంలో మల్లిఖార్జునరెడ్డి

మనది వ్యవసాయక దేశం అయినప్పటికీ వివిధ రకాల కారణాల వలన ఉన్నత చదువులు చదివిన రైతుల సంతానం వ్యవసాయరంగానికి దూరంగా ఉద్యోగ, వ్యాపార రంగాలలోకి వలసలు పోయి అందులో కొంతకాలం గడిచిన తరువాత కొంతమంది తిరిగి వ్యవసాయరంగంవైపు అడుగులు వేస్తున్నారు. వ్యాపార రంగంతో పోల్చుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎక్కువగా తిరిగి వ్యవసాయ రంగంవైపు చూస్తున్నారు. కారణాలు ఏమయినా కాని మన వ్యవసాయ రంగానికి, మనదేశానికి ఇది శుభపరిణామం అని చెప్పవచ్చు. సాధారణంగా మన దేశంలోని ఎక్కువమంది యువతీయువకులు ప్రధాన ధ్యేయం ఉన్నత చుదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో చేరడం పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా వరకు అదేదారిలో నడుస్తున్నారు. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలలో రాణిస్తూ వివిధ రకాల కారణాల వలన తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టడం వలన ఎప్పటి నుంచో వ్యవసాయంలో ఉంటూ అసంతృప్తితో కాలం వెల్లతీస్తున్న రైతులకు మనోధైర్యం పెరుగుతుందనడంలో సందేహం లేదు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం, పెద్దకూర్మపల్లికి చెందిన మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వ్యవసాయరంగంలో అడుగుపెట్టి రాణిస్తున్నారు. 

మల్లిఖార్జున రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. వరి సాగులో మల్లిఖార్జున రెడ్డి నాన్నగారు అధిక దిగుబడులు సాధించారు. అందరిలాగానే ఉన్నత చదువులు చదివిన మల్లిఖార్జున రెడ్డి ఉద్యోగ రంగంలో కొనసాగుతున్నారు. ఆ సమయంలో మార్కెట్‌లో దొరికే పప్పులు, నూనెలు అన్నీ కూడా కల్తీలు కావడం, తన స్నేహితులు కొందరు క్యాన్సరుతో ఇబ్బందులు ఎదుర్కోవడం దగ్గర నుంచి చూడడం జరిగింది. వీటన్నింటికి పరిష్కారం ఆలోచించసాగారు. వాటికి మరియు తమ ఆరోగ్యాలకు పరిష్కారం సేంద్రియ వ్యవసాయం అని నమ్మి 9 సంవత్సరాలు చేసిన ఉద్యోగాన్ని వదలి స్వగ్రామంలోని తండ్రి చేస్తున్న పంటల సాగులో అడుగుపెట్టారు వ్యవసాయంలో అడుగుపెట్టగానే సరిపోదు, వస్తున్న సంపాదనని వదలుకొని వచ్చాడు కాబట్టి ఒక వైపు సంపాదన గురించి ఆలోచించాలి, రెండోవైపు మన భవిష్యత్‌ తరాలకు కలుషితం కాని నేలను, వాతావరణాన్ని, ప్రస్తుత తరాలకు అవశేషాలు లేని ఆహారాన్ని అందించాలి. వీటన్నింటికి సరైనదారి  అదీను ఇప్పటి వరకు నేలలు రసాయనాలకు అలవాటు పడి ఉన్నాయి కాబట్టి ఒకేసారి మార్పుకు సహకరించకపోవచ్చు కాబట్టి మెల్లమెల్లగా రసాయనాలను తగ్గించుకుంటూ సేంద్రియ పదార్థాలు పెంచుకుంటూ వస్తే 5 సంవత్సరాలకి రసాయనాలను మానివేసి పూర్తి సేంద్రియ సాగుకి మరలడం జరిగింది. అంటే 2017 వ సంవత్సరం నుండి ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా పూర్తి సేంద్రియ పద్ధతులతో వరి, వస, పెసలు, మినుము, నూనెగింజల పంటలు పండించుకుంటూ వస్తున్నారు. పంటల సాగుతో పాటు సేంద్రియ సాగుకు అవసరమైన మనదేశీయ జాతి గోవులను పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నారు. వీటన్నింటితో పాటు రైతుకు అదనపు ఆదాయం కావాలంటే పంటల సాగు మరియు పశుపోషణతో ఆగకుండా సమీకృత సేద్యం తప్పనిసరి అని తెలుసుకుని గొర్రెలు, మేకలు, చేపలు, కోళ్ళు మొదలగు వాటిని పెంచుతూ తన సాగును లాభాల బాటలో నడిపిస్తున్నారు. 2021 ఖరీఫ్‌ మరియు రబీలలో 18 ఎకరాలలో వివిధ రకాల వడ్లను వెద పద్ధతిలో సాగు చేశారు. ఇందుకుగాను దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం అందించారు. ఆరుతడి పద్ధతిలో వరి పంటను సాగు చేశారు. ఆరుతడి పద్ధతిలో అయితే వేరువ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుకుని పెరుగుతుంది కాబట్టి చీడపీడల ప్రభావం తగ్గడంతోపాటు దిగుబడులు పెరుగుతున్నవి కాబట్టి ఈ పద్ధతిని పాటిస్తున్నారు. కలుపు నివారణకు తాను సొంతంగా పైపు మరియు ఇనుప చైన్లతో తయారు చేసుకున్న పరికరాన్ని ఉపయోగించి కొంత వరకు నివారించుకోవడంతో పాటు మిగిలిన కలుపును మనుషుల సహాయంతో నివారించుకున్నారు. వరి పంటకు అవసరాన్ని బట్టి జీవామృతం, మట్టిద్రావణం, వేస్ట్‌డికంపోజర్‌, నీమాస్త్రం, ఇంగువ ద్రావణం, మారేడు కషాయం లాంటివి ఉపయోగిస్తూ వచ్చారు. పంటలో నీటి అవసరం తెలుసుకునేందుకు 6 అంగుళాల పివిసి పైపుకు రంధ్రాలు చేసి ఆ పైపును వరి పంటలో భూమిలో పెట్టి అందులో ఊరిన ఊట నీటిని పరిశీలిస్తూ ఆరుతడి పద్ధతిలో నీటిని అందిస్తూ వచ్చారు. ఖరీఫ్‌లో ఎకరానికి 2500 కిలోలు, రబీలో ఎకరానికి 3500 కిలోలు వడ్ల దిగుబడి సాధించి సంవత్సరానికి రెండు పంటలకు కలిపి ఎకరానికి 6000 కిలోల వడ్ల దిగుబడి పూర్తి సేంద్రియ పద్ధతిలో సాధించారు. వడ్లను అదేవిధంగా అమ్మకుండా విలువజోడించి అనగా వడ్లను మరపట్టించి బియ్యాన్ని అమ్మకం చేస్తున్నారు. వీటితో పాటు కొంత ప్రాంతంలో మన ప్రాచీన వరి రకాలను కూడా సాగు చేసి మంచి దిగుబడి తీసి ఆ వరిగడ్డిని (ఉప్పుద్రావణం కోటింగు ఇచ్చి) పశువులకు మేతగా అందిస్తూ వస్తున్నారు.

వస: ఒకటిన్నర ఎకరాలలో ఔషధ పంట అయిన వస పంటను సాగు చేశారు. ఇందుకు అవసరమయిన విత్తన మొక్కలను తెలిసినవారి నుండి తెప్పించుకుని నాటారు. ఎకరానికి 40000 మొక్కల చొప్పున ఎకరంన్నరకు 60,000 మొక్కలు అవసరం అయినవి. వస మొక్కలను వరి నారు మాదిరిగానే ‘శ్రీ’ పద్ధతిలో నాటించారు. వస పంటలో 3 నెలల వరకు కలుపు సమస్య ఉంటుంది కాబట్టి కోనోవీడరు తిప్పటానికి వీలుగా మొక్కలను 2021 సంవత్సరం జులై నెలలో నాటించారు. వస సాగుకు గాను ఔషధ మొక్కల బోర్డు నుంచి ఎకరానికి 14000/- ప్రోత్సాహాన్ని కూడా మల్లిఖార్జున రెడ్డి పొందారు. ఇది 9 నెలల పంట. 2022లో దిగుబడి వచ్చింది. ఎకరంన్నరకు గాను 30 క్వింటాళ్ళ దిగుబడి పొంది క్వింటా 8000/-లకు అమ్మకం చేశారు. ఎకరంన్నరకు గాను పెట్టుబడి 1,10,000 వరకు అయ్యింది. పెట్టుబడి పోను ఎకరంన్నరకు సుమారు 1,30,000 వరకు ఆదాయం వచ్చింది.
అజొల్లా: అడుగు లోతు 10 అడుగుల వెడల్పు మరియు పొడవులతో ఒక తొట్టెను నిర్మించుకుని అందులో అజొల్లాను పెంచుతున్నారు. తొట్టిలో అడుగున 2 అంగుళాల మందంలో మట్టి, సుమారు 20 కిలోల ఆవుపేడ, అగ్గిపెట్టె పరిమాణంలో మినరల్‌ మిక్చర్‌ వేసి నీటిని నింపి అజొల్లా కల్చర్‌ని తెచ్చివేశారు. ఈ తొట్టెను నీడలో ఏర్పాటు చేసుకున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే 10 నుంచి 15 రోజులలో తొట్టి మొత్తం అజొల్లా అభివృద్ధి చెందింది. ప్రతిరోజు కొంత అజొల్లాను పశువులకు, కోళ్ళకు దాణాగా అందిస్తూ వస్తున్నారు. ప్రతివారం తప్పనిసరిగా అజొల్లా తొట్టిలోని నీటిని మార్చాలి. 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సుమారు 20 కిలోల పేడను అందించాలి. 6 నెలలకు ఒకసారి మట్టిని మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే 365 రోజులు అజొల్లాని పొందవచ్చు. అజొల్లాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కనుక పశువులు, కోళ్ళు లాంటి వాటికి దాణాగా అందిస్తే ఖర్చు తగ్గడంతో పాటు వాటి ఆరోగ్యం బాగా ఉంటుందని మల్లిఖార్జునరెడ్డి వివరించారు. వివిధ రకాల పంటల సాగుతో పాటు మన దేశీయ గోవులు మూడింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తూ వాటి పాల ద్వారా వచ్చిన వెన్నతో నెయ్యి తయారు చేయించి నెయ్యిని అమ్ముతూ ఆదాయం పొందుతున్నారు. వాటితో పాటు 10 గొర్రెలు, 50 మేకలు (పిల్లలతో కలిపి) 50 కోళ్ళు, సుమారు 300 వరకు చేపలను కూడా పెంచుతూ రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమీకృత వ్యవసాయమే సరైన దారి అని నిరూపిస్తున్నారు. మల్లిఖార్జున రెడ్డి చేస్తున్న సమీకృత వ్యవసాయం ద్వారా అన్నీ కలిపి సంవత్సరానికి 10 లక్షలకు తగ్గకుండా ఆదాయాన్ని పొందుతూ కుటుంబ సభ్యుల సహకారంతో ఆనందంగా సేద్యాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతున్నారు.

మరిన్ని వివరాలు 9704090613 కి ఫోను చేసి తెలుసుకోగలరు. 

Read More

ప్రకృతి వ్యవసాయానికి చిరునామా సూర్యనారాయణమూర్తి

మన తాతముత్తాతలు వ్యవసాయంలో పెద్దగా ఏమీ చేసేవారు కాదు. విత్తనాలు వేసేవారు. దిగుబడి తీసుకునేవారు. కాని రాను రాను పంటల సాగుకి పశువుల ఎరువు అందించటం మొదలయ్యింది. అప్పటి వరకు పరవాలేదు. పశువుల ఎరువు అందించి ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించారు. విత్తనాలను కూడా బయట కొనుగోలు చేయకుండా తమ సొంత విత్తనాలను లేదా తమ ప్రాంతాలలో అందుబాటులో ఉండే విత్తనాలను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ దిగుబడి గురించి ఆలోచించకుండా ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి తీసుకుంటూ జీవితాలను గడుపుతూ వచ్చారు. కానీ రాను, రాను వ్యవసాయంలో సాంకేతికత పెరగడం, జనాభా పెరిగి వారి ఆహార అవసరాలను తీర్చటానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టటం జరిగింది. ఈ పరిణామాల వలన అనుకున్న లక్ష్యం నెరవేరింది కాని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి రైతులు మరలా తిరిగి మన తాత ముత్తాతలు చేసిన పంటల సాగు విధానాలవైపు అడుగులు వేయాలని ప్రభుత్వాలు, అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వీరి మాటలు విని వాస్తవం తెలుసుకున్న కొంతమంది రైతులు తమ సాగు పద్ధతులను మార్చుకుని ప్రకృతి సాగు విధానాలవైపు అడుగులు వేశారు. వేస్తున్నారు. ఇదేకోవకు చెందుతారు కోనసీమ జిల్లా గంగవరం గ్రామానికి చెందిన అల్లూరి సూర్యనారాయణమూర్తి. 

సూర్యనారాయణమూర్తిది వ్యవసాయ నేపధ్యం. మొదటి నుంచి అంటే గత 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. వారి ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి వరి ప్రధాన పంటగా సాగు చేస్తూ వస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన వరి సాగులో కూడా రసాయనాలు అందిస్తూ సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ఎక్కువగా అధికంగా 50 బస్తాలకు పైగా దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దిగుబడి బాగానే వస్తుంది కాని వివిధ రకాల కారణాల వలన ఆదాయం రాకపోగా రసాయన పద్ధతులతో పండించిన బియ్యాన్ని తినడం వలన ఆరోగ్యాలు కూడా సక్రమంగా ఉండటం లేదు. దానికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయం అని తెలుసుకొని తన సాగుని సేంద్రియ పద్ధతులలోకి మార్చాలనే లక్ష్యంతో రసాయనాలను తగ్గిస్తూ సేంద్రియ పదార్థాలను పెంచుతూ కొన్ని సంవత్సరాలు చేసిన తరువాత అంటే 2014 వ సంవత్సరం నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వరి పంట సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన మొదటలో దిగుబడులు తగ్గినవి కాబట్టి పశువుల ఎరువు, జీవామృతం లాంటివి భూమికి అందిస్తూ వస్తూ గత రెండు సంవత్సరాల నుంచి భూమికి ఏమీ అందివ్వడం లేదు. నారు నాటుకోవటం, కలుపు నివారించటం, దిగుబడి తీయటం అంతే అంతకు మించి ఏమీ చేయకుండా అసలయిన ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా సూర్యనారాయణమూర్తి నిలుస్తున్నారు.

5 ఎకరాలలో వరిని సాగు చేస్తున్నారు. 2021వ సంవత్సరం ఖరీఫ్‌లో బి.పి.టి. రకం పండించి 75 కిలోల బస్తాలు ఎకరానికి 28 చొప్పున దిగుబడి సాధించారు. రబీలో ఆర్‌ఎన్‌ఆర్‌ 15048 రకం వరిని సాగు చేసి ఎకరానికి 25 బస్తాల దిగుబడిని సాధించారు. సొంత విత్తనాలను లేదా బయట కొనుగోలు చేసుకున్న విత్తనాలను నారు పోసుకుని ఖరీఫ్‌లో అయితే 35 రోజుల పెరిగిన నారు, రబీలో అయితే 25 రోజులు పెరిగిన నారుని నాటిస్తుంటారు. కలుపు సమస్య నుండి పంటను రక్షించుకోవడానికి నారు నాటే పద్ధతినే అవలంభిస్తున్నారు. ప్రస్తుతం తాను సాగు చేస్తున్న వరి పంటకు ఎలాంటి పదార్థాలు అందించడం లేదు. రబీలో మాత్రం వేడి తగ్గడానికి ఎండుద్రాక్ష, బార్లీగింజలు, మజ్జిగల మిశ్రమాన్ని పిచికారి చేస్తుంటారు. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం పడటం లేదు. వడ్లను బియ్యం ఆడించి నేరుగా వినియోగదారులకి బియ్యం అమ్మకం చేస్తున్నారు. 

సుమారు ఒక ఎకరం తొంభై సెంట్ల భూమిలో చుట్టూ 10 అడుగుల వెడల్పు 4 అడగుల లోతులో కందకం తవ్వి ఆ కందకంలో వచ్చిన మట్టిని మధ్యలో వేసి చదును చేయించారు. కందకంలో చేపలు పెంచుతూ మధ్యలో ఉన్న మట్టిలో వివిధ రకాల పంటలు అంటే తన కుటుంబానికి అవసరమైన అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వస్తుంటారు. ఈ ప్రాంతంలో సాగు చేసే పంటలలో సొర, బీర, కాకర, బెండ, వంగ, టమాట, సీతాఫలం, జామ, సపోట, వాటర్‌ యాపిల్‌ లాంటి తమ కుటుంబ ఆహారానికి అవసరమైన పంటలు ఉంటాయి. కందకంలో ప్రతి సంవత్సరం చేపలు పెంచి అవి పెరిగిన తరువాత వాటిని అమ్మి అదనపు ఆదాయాన్ని పొందుతుంటారు. 2021వ సంవత్సరం 200 చేప పిల్లలను పెంచారు. ఇందులో గడ్డి చేప, బొచ్చ, బంగారు తీగ, గచ్చ మొదలగు నాలుగు రకాలు ఒక్కొక్కటి 50 పిల్లల చొప్పున వేశారు. చేప పిల్లలకు ప్రతి రోజు 2 కిలోల చొప్పున తమ వడ్లను మర పట్టించినపుడు మిగిలే వృథాగా పోయే రద్దు నూకను అందిస్తుంటారు. రోజుకు 2 కిలోల చొప్పున నెలకు 60 కిలోల రద్దు నూకలను మాత్రమే అందిస్తుంటారు. తన వరి పంటలో వచ్చిన నూకలు చేపలకు ఆహారంగా సరిపోతుంటవి. బయట నుంచి ఏమీ కొనుగోలు చేయకుండా చేపలను పెంచుతుంటారు. నూకలను మరియు మట్టిని తింటూ చేపలు పెరుగుతుంటాయి. సంవత్సరంలో 1 కిలో వరకు తూగేలా బరువు పెరుగుతాయి. కిలో 250/-ల చొప్పున నేరుగా పొలం దగ్గర అమ్ముతుంటారు. వినియోగదారులు నేరుగా పొలం వద్దకు వచ్చి తమకు నచ్చిన రకాన్ని కొనుగోలు చేస్తుంటారు. వరి మరియు వివిధ రకాల కూరగాయలు, పండ్లు పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తూ చేపలకు కూడా బయట నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను అందించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పండించిన సొంత నూకలను అందిస్తూ నాణ్యమైన చేపలను పెంచి మంచి ధరకు అమ్ముతున్నారు. ఒక ఆవు మరియు రెండు గేదెలను పోషిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ తోటి సమాజానికి రసాయనాలు లేని ఆహారాన్ని అందిస్తూ సంవత్సరానికి ఎకరానికి లక్ష రూపాయలు పైగానే ఆదాయం గడిస్తూ నిజమైన ప్రకృతి వ్యవసాయానికి సూర్యనారాయణమూర్తి దారి చూపిస్తున్నారు.   

Read More

వేసవిలో కోళ్ల పెంపకం – జాగ్రత్తలు

వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమగా పేరుగాంచిన కోళ్ల పెంపకం యజమానులకు వేసవిలో సవాలుగా మారింది. చలి, వర్షాకాలంలో అధికంగా కోళ్ల దిగుబడి పెరుగుతూ రైతులకు లాభాల బాటలో ఈ పరిశ్రమ కొనసాగుతుంటుంది. కానీ వేసవి కాలం రాగానే రైతులు భయపడి త్వరగా ఇతర రాష్టాలకు ఎగుమతి చేస్తారు. ఎందుకంటే ఎండ తీవ్రత పెరిగే కొద్ది కోళ్లు చనిపోతున్నాయి. వేసవికాలం ఆరంభం మార్చి నుంచి జూన్‌ వరకు కొనసాగే వేడి వాతావరణం కోళ్ల పరిశ్రమను నష్టాలలోకి తీసుకొని పోతుంది. అంతేగాక బ్రాయిలర్‌, లేయర్‌లను ఎగుమతి చేసి ఫారాలను ఖాళీగా ఉంచుతారు. ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడదెబ్బకు గురై 25-90 శాతం వరకు చనిపోతున్నాయి. ఇందుకోసం రైతులు తగు జాగ్రత్తలుతో పశుసంవర్థక శాఖ అధికారులతో సంప్రదించి ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే ఆర్థిక నష్టం రాకుండా చేసుకోవచ్చు. 

వేడిమి వల్ల కోళ్లలో వచ్చే లక్షణాలు ఏమిటి?

*    కోడి శరీరం చలిని తట్టుకునే విధంగా పూర్తిగా ఈకలతో కప్పబడి ఉంటుంది. వాటి శరీరంలో చెమట గ్రంథులు లేకపోవడం వలన ఉష్టోగ్రత 105-107 డిగ్రీల ఫారన్‌ హీట్‌ ఉంటుంది. వాతావరణ ఉష్టోగ్రత 107 డిగ్రీ ఫారన్‌హీట్‌ వరకు కోళ్లకు సదుపాయంగా ఉంటుంది. ఆపై కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. 

*    ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కోళ్లు ఆయాసపడుతూ తక్కువ మేత తింటూ ఎక్కువ నీళ్లు తాగుతాయి. అలాంటప్పుడు వడబెబ్బకు గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి కూడా బాగా పడిపోతుంది. 

*    వేడి వాతావరణము వల్ల కోళ్ల ఉత్పత్తి తగ్గుతుంది మరియు పెరుగుదల ఉండదు. అంతేగాక కోళ్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కోళ్లు ఆయాసపడుతూ ఉంటాయి. దీంతో దాణా తక్కువగా తింటాయి.

*    లేయర్‌ కోళ్లులో కోడిగుడ్డు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పౌష్టికమైన దాణా పెట్టిన గుడ్ల సైజు పెరగదు మరికొన్ని అసలు గుడ్లు పెట్టవు.

*    బ్రాయిలర్‌ కోళ్లు చనిపోతే రైతు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతాడు. వేసవిలో ఈ కోళ్ల ఎదుగుదల ఎక్కువగా ఉండదు. దీని వల్ల మాంసం ఉత్పత్తి తగ్గుతుంది. 

*    ఎండ వేడికి కోళ్లు, పిల్లలు నీరసంగా కనిపిస్తాయి. నీళ్ల విరేచనాలు అవుతాయి. సరిగా నిలబడలేవు. వణుకుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించగానే కోళ్ల ఫారం యజమానులు అప్రమత్తమై తగిన మందులు వేయించాలి. 

*    కోళ్లలో మెడలు వాల్చడం, సన్నగా మూలగడం, కళ్లనుంచి నీరు కారణం వంటి లక్షణాలున్న కోళ్లను వెంటనే ఇతర కోళ్ల నుంచి వేరు చేసి సరైన చికిత్స అందించాలి.

*    వేసవిలో వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అంటు వ్యాధులు కూడా వస్తాయి. దీంతో మందుల కొనుగోలుకు అధికంగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది.

*    10 అడుగుల ఎత్తులో నిర్మించబడిన షెడ్ల కన్నా ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న వాటిలో ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది.

*    కొన్ని జాతుల జన్యు సంబంధం మీద కూడా వాటి ప్రాణ నష్టం ఆధారపడి ఉంటుంది.

*    40 వారాల కన్నా తక్కువ వయస్సు గల కోళ్లలో మరియు కొత్తగా ఈకలు రాల్చిన కోళ్లలో ప్రాణనష్టం ఎక్కువ.
వేసవిలో కోళ్ళ దాణాలో తీసుకోవలసిన జాగ్రత్తలు

*    ముఖ్యమయిన జాగ్రత్త యేమిటంటే పోషకాలున్న దాణా పెట్టాలి. ఒకేసారి ఎక్కువగా దాణా వేయకూడదు.

*    వేసవిలో కోళ్లు తక్కువ మేత తింటాయి. ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్ది నీరు ఎక్కువగా తాగుతాయి. నీటిని ఎక్కువగా తాగుతుండడంతో దాణా తక్కువగా తీసుకుంటాయి. ఉష్ణోగ్రతలు తక్కువ ఉన్న సమయంలో దాణా ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి ఎక్కువ పరిమాణంలో దాణా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.

*    దాణాను కొద్దిగా తడిపి పెట్టడం ఉత్తమం. ఎక్కువ తడిపితే దాణాకు బూజుపట్టే ప్రమాదం ఉంది.*    వేసవిలో కోళ్లు పగటిపూట సరిగా తినవు. కాబట్టి ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత దాణా ఇవ్వాలి. కోళ్లకు నిత్యం ఉదయం నాలుగు గంటలకు 70 శాతం, రాత్రి 9 గంటలకు 30 శాతం దాణాను ఇవ్వాలి. మధ్యాహ్నం వేడిమి సమయంలో ఇవ్వకూడదు.

*    దాణాలో అవసరమైన మోతాదులో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండేలా చూసుకోవాలి. మాంసకృతులు తగ్గించాలి.*    ఒత్తిడికి లోనైన కోళ్లకు సి విటమిన్‌ ఎక్కువ ఇవ్వాలి. ఒక టన్ను దాణాలో వంద గ్రాములు విటమిన్‌-సి, 50 గ్రాములు విటమిన్‌-ఇ ఉపయోగించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగును. అంతే కాకుండా విటమిన్‌-సి వాడడం వల్ల గుడ్డు పొట్టు గట్టిగా ఏర్పడును. విటమిన్‌-2 ఫలధీకరణ శాతాన్ని, గుడ్ల ఉత్పత్తిని పెంచును. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీటిలో విటమిన్‌-సి కలిపినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ విటమిన్‌-ఇ మాత్రం ముందు జాగ్రత్తగా ఇవ్వాలి. టీకాలు వేయుటకు రెండు వారాల ముందుగా ఇవ్వడం ఎంతైనా మంచిది. 

*    మిథియోనిన్‌ అనే అమైనో ఆమ్లం కోళ్ల దాణాలో ఉపయోగించడం వల్ల ఎండ వేడి నుంచి కాపాడి గుడ్డు పొట్టు సాధారణంగా ఏర్పడుటకు సహాయపడును. దీ అమ్మోనియం క్లోరైడ్‌, పొటాషియం క్లోరైడ్‌ 0.25 శాతం ఇవ్వడం వల్ల కోళ్లు ఎక్కువగా నీరు తాగును. దీంతో శరీర ఉష్ణోగ్రత తగ్గించవచ్చు.
వేసవిలో కోళ్లకు నీరు విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు

*    తక్కువ నీరు ఇవ్వడం ఉత్తమం. 

*    కోళ్లు వేసవిలో ఎక్కువగానే నీళ్లు తాగుతాయి. దాణా, నీటి నిష్పత్తి 1:2 ఉంటుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు 1.4 నిష్పత్తి ఇవ్వాలి. కోళ్లకు వీలైనంత వరకు చల్లని నీటిని ఇవ్వాలి. అందువల్ల షెడ్లలో అదనంగా నీటి తొట్టెలు ఏర్పాటు చేసి అవసరం మేరకు నీటిని అందించాలి.

*    కోళ్లు తాగే నీటిలో ఎల్లక్ట్రోలైట్‌లు – విటమిన్‌ వంటివి కలిపితే అవి వత్తిడికి గురి కాకుండా చూడాలి.

*    నీళ్ల ట్యాంకులు చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. నీటి ట్యాంకుల మీద కొనే సంచులు కప్పి వాటిని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలి. దీనివల్ల ట్యాంకుల్లోని నీరు వేడెక్కదు. లేదంటే 2000 లీటర్ల నీళ్ల ట్యాంక్‌లో 20 కేజీల మంచు గడ్డలు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో వేసి ఉంచడం వలన నీటి ఉష్ణోగ్రతను 22 నుంచి 24 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు తగ్గించుకోవచ్చు.

*    నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు నియంత్రించాలంటే శుభ్రమైన నీటిని ఇవ్వాలి.*    ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కోళ్లపైన నేరుగా నీటిని పిచికారి చేయవచ్చు.వేసవిలో కోళ్లకు షెడ్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

*    సూర్యరశ్మి తగలకుండా ఉండాలంటే కోళ్ల షెడ్లను తూర్పు, పడమరగా నిర్మించాలి. వెడల్పు 30 అడుగులకు మించకుండా ఉండాలి. 

*    వేసవికాలంలో కోళ్ల షెడ్డు పైన గడ్డి, స్పింక్లర్స్‌ అమర్చి అరగంటకు ఒకసారి షెడ్డుపైన నీళ్లు చల్లాలి. దీంతో షెడ్డులోపల చల్లదనం చేకూరుతుంది. కోళ్లు మృత్యువాత నుంచి తప్పించుకోవచ్చు. షెడ్డుకు గాలి వచ్చే దిశలో పలుచని గోనె సంచులు లేదా గ్రీన్‌ నెట్‌ లాంటివి కట్టాలి. వాటిపై పది నుంచి పదిహేను సార్లు నీళ్ళు చల్లాలి. ఇలా చేయడం వల్ల వడగాల్పులు నేరుగా షెడ్డులోకి వెళ్ళకుండా ఉంటుంది. తడిచిన గ్రీన్‌ నెట్‌ వల్ల షెడ్డులోకి చల్లని గాలి వీస్తుంది. షెడ్డు లోపలి భాగంలో ఫాగర్స్‌ అమర్చి ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అరగంటకోసారి నీళ్లు వదిలినచో కోళ్లపై తుంపరగా పడటం వల్ల కోడికి చల్లదనం ఇస్తుంది.

*    కోళ్ల ఫారాలు ఇరుకుగా ఉండకూడదు.షెడ్డులో ఎప్పుడు తేమ లేకుండా పొడిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లిట్టర్‌ ఎత్తును తగ్గించి షెడ్డులో దుమ్ము, ధూళీ లేకుండా చూసుకోవాలి.

*    ఉష్ణోగ్రత తగ్గించేందుకు షెడ్డు పైన గడ్డిని దట్టంగా వేసిదానిపై అప్పుడప్పుడూ నీళ్లు చల్లుతుండాలి. దీంతో షెడ్డులోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది. షెడ్డు కప్పుపై తెల్లని రంగు వేసి కూడ కొంత వరకు ఉష్ణోగ్రతను తగ్గించవచ్చును.

*    షెడ్డు చుట్టూ పది అడుగుల దూరంలో నీడనిచ్చే చెట్లు పెంచాలి.

*    షెడ్లలో కోళ్లను డీప్‌ లిట్టర్‌ పద్దతిలో లేదా కేజీస్‌లో నిర్దేశించిన సంఖ్యలోనే ఉంచాలి. కేజీస్‌లో పెద్దకోడికి 0.75 వరకు చదరపు అడుగులు, డీప్‌ లిట్టర్‌ అయితే రెండు చదరపు అడుగుల స్థలంలో ఉంచాలి.వేసవిలో కోళ్లకు ఆరోగ్య విషయములో తీసుకోవలసిన జాగ్రత్తలు

*    వాతావరణం చల్లగా ఉన్నప్పడే కోళ్ల ముక్కలు కత్తిరించిడం, టీకాలు వేయించడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం వంటి పనులను పూర్తి చేయాలి. కోళ్ల వయస్సు ఎండ తీవ్రతను బట్టి దాణాలో ఆమైనో అవ్లూలు, విటమిన్లు, ఖనిజాలు, మోతాదును పెంచాలి.

*    ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల సమయంలో కోళ్లను పట్టుకోవడం, కలత చెందించడం వంటివి చేయకూడదు. వేసవిలో ఉదయం పూట మాత్రమే టీకాలు వేయాలి.

*    ఒకవేళ వేడిమికి ప్రాణనష్టం జరుగుతూ ఉంటే పది నుంచి 20 గ్రాముల దాణా తగ్గించాలి. దాణా మీద బూజు పట్టకుండా కొంచెం నీటిని చిలకరించాలి.

*    వేసవిలో ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ వేడిగాలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎక్కువగా వ్యాధుల భారీన పడతాయి. కొక్కర, మారెక్స్‌, ఆర్‌డి, బర్డ్‌ప్లూ వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఎండకాలంలో వచ్చే వ్యాదుల నివారణకు ముందుగానే టీకాలు వేయించాలి.

*    మృత్యువాత గురైన కోళ్లను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు. మృత్యువాత పడ్డ కోళ్లను 7 లేదా 8 ఫీట్ల గుంత తవ్వి పూడ్చాలి. ఇలా చేయడం ద్వారా ఒక ఫామ్‌ నుంచి మరొక ఫామ్‌కు ఈ వ్యాధులు వ్యాపించవు. ఇలా వేసవిలో కోళ్ల పెంపకందారులు అప్రమత్తంగా ఉంటూ. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ల పెంపకాన్ని లాభసాటిగా చేయవచ్చు.    
డా. జి. రాంబాబు, పశు వైధ్యాధికారి, కడప. ఫోన్‌: 9618499184

Read More

పచ్చిరొట్ట – భూమికి రక్ష

భూసారం ఎంతగా పెరిగితే అందులో మనం పండించే పంటలు అంతగా దిగుబడిని అందిస్తాయి. నేటి కాలంలో వాడే ఎన్నో రకాల రసాయన మందుల వలన భూమి సారవంతత తగ్గుతుంది. దానితో పంట తక్కువ దిగుబడి వస్తుంది. వీటిని వీలైనంత తక్కువ వాడుతూ రసాయన ఎరువులు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టనూ ఉపయోగిస్తున్నారు. చాలామంది శాస్త్రవేత్తలు కూడా వీటి వినియోగాన్ని పెంచాలంటూ సూచిస్తున్నారు. ఈ పచ్చిరొట్టలు వేయడం వల్ల పంటలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

పచ్చరొట్ట ఎరువులను భూమికి రెండు విధాలుగా అందించవచ్చు.

1. పచ్చిరొట్ట ఎరువులు; 

2. పచ్చిఆకు ఎరువులు

పచ్చిరొట్ట ఎరువులు: జనుము, జీలుగు, పెసర, అలసంద వంటి పంటలను పూత వరకు పెంచి ఆ తర్వాత నెలలో కలిపి దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువులు అంటారు.పచ్చి ఆకు ఎరువులు: కానుగ, గ్లైరిసిడియా, అవిశ, సీమతంగేడు, వెంపలి వంటి మొక్కల ఆకులను కోసుకొచ్చి పొలంలో తొక్కి వేయడాన్ని పచ్చి ఆకు ఎరువులు అంటారు.

కట్టె జనుము: ఇది అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. పచ్చిరొట్టగా పశువుల మేతగా ఉపయోగించవచ్చు. ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనాలు చల్లుకోవాలి. దీనివల్ల 5 నుండి 6 టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది.

పిల్లిపెసర: దీనిని తేలిక మరియు బరువైన నేలల్లో సాగు చేయవచ్చు. చౌడు భూముల్లో ఇవి సాగుకు పనికిరావు. ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం అవసరమవుతుంది. దీనివల్ల మూడు నుండి నాలుగు టన్నుల పచ్చిరొట్ట లభిస్తుంది. నీలి వెంపలి: ఇవి చాలా ప్రదేశాల్లో కలుపు మొక్కలుగా కనబడతాయి. ఇవి అన్ని రకాల నేలల్లో వేసుకోవచ్చు. వీటిని పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవచ్చు. ఇవి ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాలను అందుకుంటాయి.
పచ్చిరొట్టపైరుకు ఉండవలసిన లక్షణాలు:  

* తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇచ్చేలా ఉండాలి.*    అన్ని రకాల నేలల్లో పెరిగే గుణాన్ని కలిగి ఉండాలి.

*    పచ్చిరొట్ట పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకు కలిగి రసభరితంగా ఉండాలి.

*    నేలలో కలియదున్నినప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసేటట్లు ఉండాలి.

*    త్వరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అరికట్టాలి.

*    పచ్చిరొట్ట వేర్లు చాలా లోతుకు పోయేలా ఉండాలి.

*    పప్పు జాతి మొక్కల వేర్లలో బుడిపెలు ఉండి వాతావరణంలో నత్రజని స్థిరీకరణ చేసే విధంగా ఉండాలి.

*    ఏ రకమైన నేలలో అయినా పెరిగే గుణాన్ని కలిగి ఉండాలి.

*    తక్కువ వనరులు వినియోగించుకుంటూ సాధారణ యాజమాన్యంలో త్వరగా పెరిగి అధికంగా పచ్చిరొట్ట పైర్లు అందించేలా ఉండాలి.
పచ్చిరొట్ట ఎరువుల వాడకంలో సూచనలు

*    పచ్చిరొట్ట ఎరువులను పూత థలలో ఉన్నప్పుడు కలిపి దున్నాలి.

*    నేలలో కలిపి దున్నే నాటికి పైర్లలో 40 నుండి 80 శాతం తేమ ఉండటమే కాకుండా, నేలలో కూడా సరిపడ నీరు ఉన్నట్లయితే అవి త్వరగా మురుగుతాయి. ఇక పైరు మొత్తం మురిగిన తర్వాత పాత నీటిని తీసివేయాలి. వేరే నీటిని అందివ్వాలి.

*    పచ్చిరొట్ట పంటలు సాగు చేసే నేలలో నత్రజని తక్కువగా ఉండడం వల్ల నత్రజని వేసినట్లయితే అవి ఏపుగా పెరిగి రొట్ట దిగుబడి ఎక్కువగా ఉంటుంది, వేరు బుడిపెలు కూడా పెరుగుతాయి. 
పచ్చిరొట్ట ఎరువుల వాడకం

ఒక ఎకరానికి 24 కిలోల జనుము, 12 నుండి 14 కిలోల జీలుగ, 14 నుండి 16 కిలోల పెసర మరియు, 6 నుండి 8 కిలోల అలసంద వంటి పచ్చిరొట్ట పంటలను పెంచుకోవచ్చు. 
పచ్చిరొట్ట పైర్ల సాగులో ఇబ్బందులు

 పచ్చిరొట్ట ఎరువులు వేసిన తర్వాత నేలలో వేసి కలియదున్నడానికి సుమారు 45 రోజుల వ్యవధి పడుతుంది. ఏపుగా పెరిగి ఎక్కువ పచ్చిరొట్టను ఇవ్వాలంటే తేమ అవసరమవుతుంది.
పచ్చిరొట్ట ఎరువుల లాభాలు

*    నేల భౌతిక స్థితి మెరుగుబడి, భూమి గుల్లగా మారి నేలలోకి నీరు ఇంకే గుణం పెరుగుతుంది.

*    నేలలో సేంద్రియ పదార్థం వేయడం వల్ల సూక్ష్మజీవుల వృద్ధి చెందుతాయి. జీవ రసాయనిక చర్యలవల్ల నేల సారం పెరుగుతుంది.

*    నేలలో లభ్యం కాని రూపంలో ఉన్న అనేక పోషకాలను లభ్య రూపంలోకి మారుస్తాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి పచ్చిరొట్ట ఎరువులు ఉపయోగపడతాయి.

*    జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పైర్లు వేసినప్పుడు వీటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమిలోపలి పొరల్లో నిక్షిప్తమైన అనేక పోషకాలను తెచ్చి పంటకు అందిస్తాయి.

*    పప్పుజాతి పంటల వల్ల రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. భాస్వరం, గంధకం వంటి పోషకాల లభ్యత గణనీయంగా ఉంటుంది.

*    పచ్చి రొట్ట పైర్లు ఎరువులగానే కాకుండా పశువులకు మేతకుగాను ఉపయోగపడుతుంది.       

ముదిగిరి చందన, ఇ. అనూష,

 పిహెచ్‌డి స్కాలర్స్‌, పి.జె.టి.ఎస్‌.వి.యూ.,

రాజేంద్రనగర్‌, తెలంగాణ.

ఇ-మెయిల్‌: chandanamudigiri@gmail.com

Read More

వేసంగిలో చుక్కల్ని తాకుతున్న నిమ్మకాయ ధరలు

ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటేగ్రేడు దాటి 50 డిగ్రీల వరకు వెళుతుంటాయి. పర్యావరణం నానాటికీ వేడెక్కుతున్నది. గాలిలో కార్బన్‌డైఆక్సైడ్‌ పెరగటం, గ్రీన్‌హౌస్‌ గాస్‌ల సాంద్రత పెరగటం, ఓజోన్‌ పొరలో పడ్డ రంధ్రం పెద్దది కావటం ప్రపంచ ప్రజలను గందగోళంలో పడేస్తున్నది. పారిశ్రామికీకరణ, వాతావరణ కాలుష్యం, వాహనాల వాడకం ఎక్కువ కావటం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. వర్ధమాన దేశాల్లో వ్యవసాయ రంగం కూడా అనేక కొత్త సవాళ్ళనెదుర్కోవలిసి వస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల్ని ఎక్కువగా వాడటం, ముడిచమురు, సహజ వాయువు, బొగ్గుల వాడకాన్ని తగ్గించటం ద్వారా భూమి వేడెక్కటాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వేసవి తాపాన్ని ఎదుర్కోవటంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే నిమ్మకాయలు ఈ వేసవిలో కనిపించటంలేదు. నింబూపానీ, నింబూసోడా వంటి పానీయాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. హోల్‌సేల్‌ స్థాయిలో కిలోకి రూ. 200/-లు రిటైల్‌ స్థాయిలో కిలోకి రూ. 350/- వరకు ధరలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూలేని స్థాయిలో నిమ్మకాయల ధరలుంటున్నాయి. ఒక్కో నిమ్మకాయ రూ. 15 నుండి 20 వరకు అమ్ముడవుతున్నది. గత సంవత్సర కాలంలో ఉత్పత్తి బాగా తగ్గటమే ధరల్లో వృద్ధికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

ఉత్పత్తిలో అగ్రస్థానం:

ప్రపంచవ్యాప్తంగా తోటల పెంపకం ఊపందుకుంటున్నది. భారత దేశంలో కూడా తోటల ఉత్పత్తులు ఆహార ధాన్యాల ఉత్పత్తిని అధిగమించాయి. ఆంధ్రప్రదేశ్‌లో తోటల ఉత్పత్తులు సాలీనా 12 శాతం చొప్పున పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం తోటల క్రింద 18 లక్షల హెక్టార్లు సాగవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అందులో పండ్ల తోటల విస్తీర్ణం ఏడున్నర లక్షల హెక్టార్లకు చేరింది. మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి ముఖ్యమైన పండ్ల ఉత్పత్తులు. తెలంగాణలో తోట పంటలకింద దాదాపు 9 లక్షల హెక్టార్లు సాగవుతున్నాయి. తోట ఉత్పత్తులు దాదాపు 100 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరుకున్నాయి. దాదాపు 50 లక్షల టన్నుల పండ్లు, 38 లక్షల టన్నుల కూరగాయలు, 8 లక్షల టన్నుల సుగంధ ద్రవ్యాలు పండుతున్నట్లు అంచనాలున్నాయి. సిట్రస్‌ జాతి పండ్లలో నాగపూర్‌ సంత్రాలు, ఈశాన్య భారతంలో మాండరిన్‌ ఆరెంజ్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 95,982 హెక్టార్లలో బత్తాయి, 43,000 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.

ప్రపంచంలో 1,73,84,130 టన్నుల నిమ్మకాయలు సంవత్సరానికి పండుతున్నాయని అంచనాలున్నాయి. అందులో అత్యధికంగా 29,78,000 టన్నుల నిమ్మకాయలు భారతదేశంలో ఉత్పత్తయ్యాయి. 24,29,839 టన్నులతో మెక్సికో, 23,29,863 టన్నులతో చైనా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆర్జంటీనా (16,78,337), బ్రెజిల్‌ (12,62,353)లు, స్పెయిన్‌ (8,57,754), టర్కి (8,50,600), అమెరికా (8,22,000) ఇతర ముఖ్య ఉత్పత్తిదార్లు. ఇరాన్‌, ఇటలీ, ఈజిప్ట్‌లలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నిమ్మకాయలు ఉత్పత్తవుతున్నాయి. ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నా వాటిని ఎగుమతిచేయడంగానీ, దిగుమతి చేడంగానీ జరగడం లేదు. దేశంలో ఉత్పత్తి స్థానిక అవసరాలకే వినియోగించబడుతున్నది.

ముందువరుసలో ఆంధ్రప్రదేశ్‌

భారతదేశంలో మూడు లక్షల పదిహేడువేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగు చేయబడుతున్నాయి. అందులో మూడవవంతు విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నది. ఒక లక్షాపదివేల ఎకరాల్లో నిమ్మతోటలు సాగవుతున్నాయి. కానీ దేశంలో ఉత్పత్తవుతున్న 31,14,960 టన్నుల నిమ్మకాయల్లో 20 శాతం (6,93,870 టన్నులు) ఆంధ్రప్రదేశ్‌ నుండి లభిస్తున్నాయి. 17.8 శాతం వాటా (6,25,830 టన్నులు)తో గుజరాత్‌ రాష్ట్రం ద్వితీయ స్థానంలో ఉన్నది. మహారాష్ట్ర (3,46,320 టన్నులు), కర్నాటక (3,40,390 టన్నులు), మధ్యప్రదేశ్‌ (3,02,770 టన్నులు), ఒరిస్సా (2,88,030 టన్నులు), అస్సాం (1,57,320 టన్నులు) లు కూడా ముఖ్య ఉత్పత్తిదార్లు. తెలంగాణాలో 1,50,550 టన్నుల నిమ్మకాయలు ఉత్పత్తవుతున్నాయి. దేశపు ఉత్పత్తిలో ఇది 4.28 శాతం. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు నాల్గవ వంతు నిమ్మకాయలు ఉత్పత్తవుతున్నాయి. అయితే ఉత్పాదకతలో భారత్‌ ఇతర దేశాలకన్నా వెనకబడ్డట్లే, గుజరాత్‌ రాష్ట్రంతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో హెక్టారు ఉత్పాదకత తక్కువగా ఉంది. దేశపు సగటు ఉత్పాదకత హెక్టారుకి 20 టన్నులుగా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో సగటు ఉత్పాదకత 15 టన్నులు మాత్రమే.

నిమ్మ చెట్లకు పుట్టిల్లు ఆగ్నేయాసియా దేశాలైన భారతదేశమంతా ఆ తోటలు సాగులో ఉన్నాయి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు, చౌడుభూములు, ఒండ్రునేలలు కల ప్రాంతాలు నిమ్మ సాగుకి అనువైనవి కావు. నీరు ఇంకిపోయే స్వభావం కల ఎర్రనేలలు, గరువులు, తేలికపాటి నల్లనేలలు నిమ్మ తోటలకు పనికివస్తాయి. వారానికి ఒక తడిని కోరే నిమ్మ చెట్లు కొద్ది నెలల పాటు నీరు లేకున్నా బతికి ఉంటాయి. ఒకప్పుడు నాటు రకం విత్తనాలను వాడేవారు కాని ఇప్పుడు బాలాజీ, పెట్లూరు, సెలక్షన్‌-1 రకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ రకాలు కేంకర్‌ (గజ్జి)ని తట్టుకుంటాయి. అంటుకట్టిన మొక్కలు ఒక సంవత్సరం ముందుగా కాపుకి వస్తాయి. సాధారణంగా నాలగవ సంవత్సరం నుండి కాపు మొదలై, చెట్లు ఏడెనిమిది సంవత్సరాలకు పూర్తి కాపుకి వచ్చి 30 సంవత్సరాలపాటు బతికి ఉంటాయి. చీడ, పీడలు ఎక్కువగా ఉండే నిమ్మతోటలకు సంవత్సరంలో నాలుగైదుసార్లు సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. కొందరు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తుంటే, మరికొంతమంది రసాయనక ఎరువుల్ని, పురుగుమందుల్ని వాడుతున్నారు. సంవత్సరంలో మూడుకాపులు వస్తాయి. ముఖ్యపంట సెప్టెంబరు-అక్టోబరు మాసాల్లో పూతకు వచ్చి మార్చి నెలలో కాయలు కోసే స్థితికి వస్తుంది. దీనిని ‘హస్తాబహార్‌’ అని పిలుస్తారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూతకు వచ్చి, మే నెలలో కోతకు వచ్చే పంటను ‘అంబేబహార్‌’ అంటారు. జూన్‌, జులై నెలల్లో పూతకు వచ్చి, నవంబరు చివరకు కాయలు లభించే పంటను ‘మృగబహార్‌’ అని పిలుస్తారు. రైతులు తమ అనుభవాన్ని బట్టి, సంవత్సరంలో రెండు లేక మూడు పంటల్ని తీసుకుంటారు. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల్లో వచ్చే పంటకు తక్కువ ధర, వేసవి కాలంలో వచ్చే పంటకు ఎక్కువ ధర లభిస్తుంటుంది. మొత్తానికి సంవత్సరం పొడవునా దేశంలో ఏదో ప్రాంతం నుండి నిమ్మకాయలు మార్కెట్‌కి వస్తుంటాయి. ముఖ్య పంటను శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచి, గిరాకీని బట్టి మార్కెట్‌కి వ్యాపారులు తెస్తుంటారు. 

పెరుగుతున్న గిరాకీ

నిమ్మకాయకుండే ఔషధ గుణాల గురించి సామాన్యులకు కూడా తెలుసు. 2.26 శాతం సిబ్రిటక్‌ యాసిడ్‌ కలిగిన నిమ్మరసంలో ‘సి’ విటమిన్‌ సమృద్ధిగా ఉంటుంది. నియమం తప్పకుండా నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. నిమ్మకాయను క్రమం తప్పకుండా వాడితే చర్మం నిగనిగలాడుతుంది. వేడినీళ్ళతో కలిపి తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం దూరమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసన రాకుండా కాపాడుతుంది. బ్యాక్టీరియాని కూడా నిర్మూలిస్తుంది. మధుమేహుల్లో షుగర్‌ స్థాయిని నియంత్రిస్తుంది. ఇన్ని మంచి లక్షణాలున్న నిమ్మరసాన్ని ఎక్కువగా వాడితే పండ్లకుండే ఎనామిల్‌ పూతను తగ్గిస్తుంది. దంతాల క్షయానికి కారణమౌతుంది. నోటిలోని దంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ, నిమ్మరసాన్ని వాడుతుంటే ఆరోగ్యానికి మంచిది. గత రెండేళ్ళుగా కరోనా భయంతో బ్రతికిన ప్రజలకు ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోవాలనే కోరిక బలపడింది. అందుకోసం నిత్యం వాడాల్సిన పదార్థాల్లో నిమ్మరసం ఒకటి. దీనితో నిమ్మకాయలకు గిరాకీ బాగా పెరుగుతున్నది. కానీ గిరాకీకి తగ్గ సరఫరా లేదు. నిమ్మకాయల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నా, తలసరి లభ్యత మాత్రం చాలా తక్కువ. సంవత్సరానికి దేశంలో ఒక్కొక్కరికి రెండున్నర కిలోలు మాత్రం లభ్యమౌతున్నాయి. అంటే నెలకు రెండు వందల గ్రాములు. పది రోజులకు ఒక్క చిన్నకాయ మాత్రం అందుతున్నది. రెండుమూడు రోజులకు ఒక్కొక్కరు ఒక్క కాయవాడాలన్నా ప్రస్తుతమున్న ఉత్పత్తి నాలుగు రెట్లు పెరగాలి.

కానీ చాలామంది నిమ్మకాయను ఎప్పుడో కాని వాడరు. ఎంతోమంది ధర తక్కువగా ఉన్నప్పుడే వాటిని వాడతారు. ప్రతి సంవత్సరం మార్కెట్‌లో గిరాకీ పదిశాతం కన్నా ఎక్కువ పెరగదు. ఈ సంవత్సరం అసాధారణంగా పంట దెబ్బతిన్నందువల్లనే ధరలు పెరిగాయి. ఉదాహరణకు గుజరాత్‌లో 80 శాతం పంట నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో 20 వేల ఎకరాల్లో తోటలుంటే నీటి ఎద్దడి వల్ల ఏడువేల ఎకరాల్లో తోటలు ఎండిపోయినట్లు పత్రికల్లో వచ్చింది. ఇలా అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడల వల్ల దేశంలో కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరం ఒకేసారి చాలా రాష్ట్రాల్లో నిమ్మతోటలు పంట నష్టం వల్ల సరఫరా సగానికి తగ్గింది. గిరాకీ తగ్గకుండా సరఫరా తగ్గడంతో ధరలు భగ్గుమన్నాయి. కొత్త పంట వచ్చే కొద్దీ ధరలు సర్దుకుంటాయి. ఈ సంవత్సరం ధరల్ని చూసి చాలామంది రైతులు కొత్తగా నిమ్మతోటల్ని వేయవచ్చు. సరఫరా సాధారణ స్థాయికి చేరుకుంటే వచ్చే సంవత్సరం ధరలు తగ్గి, మళ్ళీ సరుకు సామాన్యుడికి అందుబాటులోకి రావచ్చు. సరఫరా సాధారణ స్థాయి కన్నా ఇరవైశాతం పెరిగినా ధరలు పడిపోతాయి. నోట్ల రద్దు చేసిన సంవత్సరం కొనే నాధులు లేక రైతులు బాగా నష్టపోయారు. రెండేళ్ళ కరోనా సమయంలో గిరాకీ ఉన్నా సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం వల్ల ధరలు తగ్గాయి. ఇలా ఆటుపోట్లు తప్పవు. పదేళ్ళలో ఏడు సంవత్సరాలు ధరలు గిట్టుబాటయితే రైతులు నిలదొక్కుకోగలుగుతారు. వరుసగా రెండుమూడు సంవత్సరాలు ధరలు తగ్గిపోతే రైతులు పాత తోటల్ని తీసివేస్తుంటారు.

లాభనష్టాలు

రైతులు తమ తోటల్ని చక్కగా యాజమాన్యం చేస్తే చెట్టుకో వెయ్యి కాయలు కాయించవచ్చు. ఎకరాకు 80 నుండి 100 చెట్లు పెడితే, అందులో 80 శాతం ఆరోగ్యంగా ఉండి బాగా కాస్తే ఎకరానికి లక్షరూపాయల వరకు లాభాన్ని ఆర్జించవచ్చు. ఉత్పత్తి గండంతో పాటు మార్కెట్‌ గండం కూడా ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఐదేళ్ళు లాభాలార్జించి, మూడేళ్ళు ఖర్చుల వరకు సంపాదించినా, రెండేళ్ళు వచ్చే నష్టాలను తట్టుకోగలుగుతారు. అన్ని వాణిజ్య పంటల్లోగానే నిమ్మకు కూడా మార్కెట్‌ ఆటుపోట్లు తప్పవు. పూర్తిగా నిమ్మతోటల్నే నమ్ముకోకుండా సగం భూమిలో వేరే పంటలు వేసుకోగలిగితే ‘రిస్క్‌’ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. నిమ్మకు పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో ఏటా ఐదుశాతం విస్తీర్ణాన్ని పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. మెరుగైన యాజమాన్య పద్ధతుల్ని రైతులు ఆచరించేలా సహాయపడటం వల్ల ఉత్పాదకత కూడా సంవత్సరానికి ఐదు శాతం పెంచవచ్చు. ఏటా పది శాతం సరఫరాను పెంచటం ద్వారా పెరుగుతున్న గిరాకీని సంతృప్తిపరచవచ్చు. ధరల్ని కూడా అదుపులో ఉంచవచ్చు. ఈ సంవత్సరంలాగా ధరలు పెరిగితే పేదలు నిమ్మకాయల్ని కొనలేరు. మధ్యతరగతి వారు కూడా డజను కాయలు కొనేవాళ్ళు ఒకటి రెండుతో సరిపెట్టుకుంటున్నారు. లెక్కలేకుండా ఖర్చు చేయగలిగిన వాళ్ళు మాత్రమే అవసరానికి తగ్గట్టుగా కొనగలుగుతారు. ఈ తాత్కాలిక ఉపద్రవం మళ్ళీ రాకుండా కొంత విస్తీర్ణాన్ని పెంచుతూ, ఉత్పాదకత పెరిగే చర్యలు చేపడుతూ అటురైతుకి, వినిమయదారుడికీ సంతృప్తి కలిగేలా చర్యలుండాలి.

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, 

(రిటైర్డ్‌ & కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More