మన దేశంలో దాణా కొరత పశుసంపద వృద్ధికి విఘాతంగా మారిందని, విధానపరమైన సమగ్ర కార్యాచరణ లేకపోవడం వల్లే పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలు ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని భారత సమ్మిళిత పశుదాణా తయారీదారుల సంఘం (సీఎల్‌ఎఫ్‌ఎంఏ) అధ్యకక్షుడు దివ్యకుమార్‌ గులాటీ అభిప్రాయపడ్డారు. అమెరికాలో జొన్న హెక్టార్‌కు 11 టన్నులు పండుతుంటే మన దేశంలో కేవలం 3 టన్నులే ఉందని.. అక్కడ జన్యుమార్పిడి విత్తనాల వినియోగం వల్ల ఉత్పత్తి పెరుగుతోందని మనదేశంలో దానిని చేపట్టడం లేదని, దేశంలో దాణా అవసరాల దృష్ట్యా పలు పంటల ఉత్పాదకతను పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వమే ఆ రంగాలను ఆదుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో జరిగిన సంఘం 66వ వార్షిక సదస్సుకు హాజరైన ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పశుసంపద, దాణా ఉత్పత్తి ఇతర అంశాల గురించి వివరించారు.
దాణా అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం.
మన దేశం పశుసంపదకు నిలయం. వ్యవసాయ జీడీపీలో మూడో వంతు వాటా పాడి, పౌల్ట్రీ, మత్స్యరంగాలదే. దేశంలో ఏటా 60 మిలియన్‌ టన్నుల దాణాను వాడుతున్నాం. అందులో 22 మిలియన్‌ టన్నులు మొక్కజొన్నలే. ప్రస్తుతం దేశీయ దాణా అవసరాల్లో సగం మాత్రమే దేశం ఉత్పత్తి చేస్తున్నందున ఇతర దేశాల నుంచి 50 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. ఇది పాడి, పౌల్ట్రీ, మత్స్య రైతులకు, ఉత్పత్తిదారులకు భారంగా మారుతోంది.
ఉత్పాదకతనైనా పెంచాలి
వరి లాంటి పంటలు అవసరానికి మించి సాగవుతున్నాయి, కానీ దాణా అవసరాల దృష్ట్యా మొక్కజొన్న, సోయా, నూనెగింజల విస్తీర్ణం, ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా ఆ మేరకు కృషి జరగడం లేదు. జొన్న, సోయా వంటి పంటలను ఎంత పండించినా కొనుగోలుకు ఆస్కారం ఉంది. విస్తీర్ణం పెంచకపోయినా ఉత్పాదకతను పెంచాలని అభ్యర్థిస్తున్నాం. అమెరికాలో మాదిరిగా జన్యుమార్పిడి వద్దనుకుంటే ఉత్పత్తిని పెంచే కొత్త వంగడాలపై భారత వ్యవసాయ పరిశోధన మండలి దృష్టి సారించాలని కోరారు.