ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటైన అగ్రి ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటి, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు, చేవెళ్ళ ఎంపి రంజిత్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఎ ప్రకాశ్‌గౌడ్, ఎల్బి నగర్ ఎంఎల్ఎ సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ కిషన్‌రెడ్డి, జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్‌కుమార్, రంగారెడ్డి జెడ్పి ఛైర్పర్సన్ అనితాహరినాథరెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావులు పాల్గొన్నారు. తరువాత మంత్రులు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ళని పరిశీలించారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు స్వాగతోపన్యాసం చేశారు. నాబార్డ్ సహకారంతో ఈ హబ్‌ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సాయంతో దేశంలో ఏడు ఇంక్యుబేటర్లు ఏర్పాటు అయ్యాయని నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి అందరూ కృషి చేయాలని ఆయన అన్నారు. రీసెర్చ్, టెక్నాలజీలు కలిస్తే రైతాంగానికి మరింత మేలు జరుగుతుందన్నారు. కరోనా మహమ్మారి సమయంలో దేశంలో ఆకలిచావులు లేవని గోవిందరాజులు అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆహారపు అలవాట్లు బాగా మారాయని అందుకు అనుగుణంగా కొత్త వెరైటీలు తీసుకురావాలని ఆయన సూచించారు. అదేవిధంగా సమీకృత వ్యవసాయ పద్ధతులపై వర్సిటీలు పనిచేయాలన్నారు. ప్రస్తుత తరుణంలో వ్యవసాయరంగంలో స్టార్టప్‌లు చాలా అవసరమన్నారు. ఈ అగ్రిహబ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని గోవిందరాజులు అభిలషించారు.
భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కేటిఆర్ అన్నారు. ప్రపంచం అబ్బురపడే విధంగా స్వల్పకాలంలోనే కాళేశ్వరం ప్రాజక్ట్ పూర్తి చేసిన ఘనత కేసిఆర్‌కి దక్కిందన్నారు. మిషన్ కాకతీయ, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్ట్‌లు వంటి వాటి ద్వారా రాష్ట్రంలో, ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని కేటిఆర్ అన్నారు. నేడు తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారిందని ఆహారభద్రత ఒక సవాల్‌గా ఉండేదని దీన్ని విజయవంతంగా అధిగమించగలిగామని వివరించారు. వైవిధ్యానికి ఆలవాలమైన భారతదేశంలో విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నాయన్నారు. పౌష్ఠికాహార భద్రత ఆధించడం నేడు మన ముందున్న సవాల్ అని కేటిఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 24 గంటలు ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, రుణాలు రైతాంగానికి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ఆహారధాన్యాల సేకరణ పూర్తిస్థాయిలో చేపట్టామన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న చేరుకోలేదని కేటిఆర్ అభిప్రాయపడ్డారు. రైతులు ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతలనే మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారన్నారు. నేడు తెలంగాణలో రెండో హరిత విప్లవం, నీలివిప్లవం పెద్ద ఎత్తున వచ్చాయన్నారు. ఈ అధునాతన టెక్నాలజీల వల్ల సామాన్యులకి ఏ రకంగా ప్రయోజనం కలుగుతుందనే ముఖ్యమంత్రి కేసిఆర్ 24 గంటలూ ఆలోచిస్తున్నారని కేటిఆర్ అన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో భారతదేశం అందరికంటే ముందుంటుందని అన్నారు. ఈ అగ్రికల్చర్ హబ్ సామాన్య రైతులకి కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని కేటిఆర్ సూచించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే రైతులకి, వారి పిల్లలకి కూడా అగ్రిహబ్ తలుపులు తెరిచి ఉంచాలన్నారు. అదేవిధంగా ఈ పరిజ్ఞానాన్ని తెలుగులో అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతాంగం పంటల వైవిధ్యకత వైపు మళ్లేలా చర్యలు తీసుకోవాలని ఇంకా విస్తృతంగా పరిశోధనలు చేపట్టాలని కేటిఆర్ వర్సిటీకి సూచించారు.
తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరుగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వివరించారు. ఆహారధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ని సైతం అధిగమించిందన్నారు. అయితే, పెరుగుతున్న ఉత్పత్తికి అనుగుణంగా వ్యవసాయాధారిత పరిశ్రమలు మరిన్ని రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఆహారానికి ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. నూతన ఆవిష్కరణల సాయంతో సమతుల్య, పౌష్ఠికాహారం అందరికీ అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ అన్నింటికీ అనువైన ప్రాంతం అని వివరించారు. ప్రభుత్వపరంగా వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రైతాంగం కూడా సంప్రదాయ పద్ధతుల్నించి బయటకొచ్చి నూతన సాంకేతికతలవైపు మారాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.
వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగంపై పరిశోధనలు విస్తృతం కావాలన్నారు. ఉపకులపతి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు నేతృత్వంలో వర్సిటీ అద్భుతంగా పనిచేస్తున్నదని మంత్రి అభినందించారు. ప్రపంచంలోని అత్యుత్తమ వర్సిటీల స్థాయికి ఎదగడానికి వర్సిటీ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అతిత్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ చేతులమీదుగా వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించనున్నామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పరిశోధనల కోసమే వర్సిటీకి 100 కోట్లు ఇచ్చామన్నారు. ఆయిల్‌పామ్ సాగుని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అదేవిధంగా నూనెగింజల ఉత్పత్తి పెంచుకోవలసిన అవసరం ఉందని నిరంజన్‌రెడ్డి అభిప్రాయమపడ్డారు.
ఈ సందర్భంగా అగ్రిహబ్కి సంబంధించిన పుస్తకాల్ని విడుదల చేశారు. కొన్ని సంస్థల ఉత్పత్తుల్ని ప్రారంభించారు. కొన్ని సంస్థలలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో పరిశ్రమల ప్రతినిధులు, వర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. అగ్రిహబ్ ఎండి డాక్టర్ కల్పనాశాస్త్రి వందన సమర్పణ చేశారు.
– వన్నోజు సుధాకర్, ప్రజా సంబంధాల అధికారి, PJTSAU
