‘రైతునేస్తం’ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో నాబార్డ్ ఛైర్మన్ డా|| చింతల గోవిందరాజులు
ఆగస్టు 2న హైదరాబాదు శివారు తారామతిపేటలో సేంద్రియ రైతు నాగరత్నం నాయుడిగారి ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో నాగరత్నంనాయుడి గారి సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ వారు సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… చరిత్రని ఒక్కసారి పరిశీలించినట్లయితే … కొన్నివేల సంవత్సరాల క్రితం ఆది మానవులు అందరూ మాంసాహారులే. అప్పట్లో వ్యవసాయం అనేది ప్రత్యేకంగా చేసేవారు కాదు. అడవులలో దొరికే పండ్లు, దుంపలు, కందమూలాలతోపాటు జంతువులను వేటాడుతూ.. వీటినే ఆహారంగా తీసుకుని జీవిస్తూ ఉండేవారు. ఏరోజుకారోజు అవసరమైన ఆహారాన్ని సేకరించి ఆరోజు పొట్టనింపుకునేవారు. ఆహారం కోసం ప్రతిరోజు వేటాడవలసిందే. ప్రస్తుతం జంతువులు వాటి పొట్ట నింపుకోవడం కొరకు ఏవిధంగా ఏరోజుకారోజు శ్రమిస్తవో అదేవిధంగా మనుషులు కూడా ఆరోజుకు కావలసిన ఆహారాన్ని శ్రమించి పొందుతుండేవారు. మగవారు వేటకువెళ్ళి జంతువులను వేటాడుతుండేవారు కాబట్టి ఆ సమయములో ఇంటివద్ద ఉండే మహిళలు తమ చుట్టుప్రక్కల ఉన్న మొక్కల యొక్క విత్తనాలను సేకరించి భద్రపరచి మరలా తిరిగి నాటుకుంటూ వస్తుండేవారు. కాబట్టి భూమిపై మొట్టమొదట వ్యవసాయం మొదలు పెట్టింది మహిళలే అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. ప్రవీణ్ రావు, తెలంగాణ ఉద్యానశాఖ కమిషనర్ ఎల్. వెంకట్రామిరెడ్డి, నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ వై. కృష్ణారావు, తెలంగాణ పశువైద్య, పశుసంవర్దకశాఖ డైరెక్టరు వి. లక్ష్మారెడ్డి, సేంద్రియరైతు నాగరత్నం నాయుడు, ‘రైతునేస్తం ఫౌండేషన్’ చైర్మన్ యడ్లపల్లి వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఒకప్పుడు అందరూ చేసింది ప్రకృతి వ్యవసాయమే
గ్రీన్ రెవల్యూషన్ రాకముందు అందరూ చేసింది ప్రకృతి వ్యవసాయమే. రసాయనాలు రాకముందు ప్రతి రైతు ఇంట్లో పశువులు, కోళ్ళు, మేకలు లాంటివి ఉండేవి కాబట్టి వాటి వ్యర్థాలను పంటలసాగులో ఉపయోగిస్తూ తమ సాగును కొసాగిస్తుండేవారు. రసాయనాలు ప్రవేశపెట్టబడిన తరువాత శాస్త్రవేత్తల సూచనలు ప్రక్కకు నెట్టి రైతులు విచక్షణారహితంగా రసాయనాలను వాడుతూ పంటల సాగు చేస్తూ ఉండటం వలన నేల, నీరు, వాతావరణం, ఆహారం మొత్తం కలుషితం అవుతున్నాయి. రైతులు విచక్షణా రహితంగా రసాయనాలను ఉపయోగించకుండా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సేంద్రియ పదార్థాలను కూడా తగినంతగా ఉపయోగిస్తూ అత్యవసరమయితేనే తప్ప రసాయనాల జోలికి పోకుండా సాగును కొనసాగించినట్లయితే పరిస్థితులు ఇంతగా దిగజారేవి కావు. కేవలం విచక్షణా రహిత రసాయనాల వినియోగం వలననే పరిస్థితులు చేయి దాటిపోతున్నవి కాబట్టి తిరిగి మనము సేంద్రియ సాగు గురించి మాట్లాడవలసి వస్తుంది అని గోవిందరాజులు గతాన్ని ప్రస్తుత పరిస్థితులతో పోల్చారు.
నూనెలు వాడకం ఎక్కువ
ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో నూనెల వాడకం ఎక్కువ అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనం నూనెను తాగుతాము అదే అమెరికాలాంటి దేశాలలో నూనెని ఆహారంలో ఉపయోగిస్తారు కాని తాగరు. మన వంటకాలలో గారెలు, బూరెలు, పూరీలు లాంటి వాటికి నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. దేవుడికి అందించే ప్రసాదాలలో కూడా నూనెలు ఎక్కువగా అవసరమయ్యే గారెలు, వడలు లాంటివి తప్పనిసరిగా ఉంటవి. ఇతర దేశాలలో దేవుళ్ళకు అందించే ప్రసాదాలలో నూనెలు ఎక్కువగా ఉపయోగించరు. మనం తినే ఆహారాలనే దేవుళ్ళకు కూడా ప్రసాదాలుగా అందిస్తుంటాము. ప్రసాదాలను దేవుళ్ళు తినరు. వాటిని మనమే తింటాము కాబట్టి వాటినే మనం ప్రసాదాలుగా అందిస్తుంటాము. కేలరీలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తింటూ అందుకు తగిన శారీరక శ్రమ చేయలేకపోవటం వలన సమాజంలో రక్తపోటు, మధుమేహం లాంటి రోగాలు సర్వసాధారణమయ్యాయి. వ్యవసాయం చేయకముందు ఇలాంటి రోగాలు లేవు. అపుడు అందరూ తమ ఆహారం కొరకు శారీరక శ్రమ తప్పనిసరిగా చేసేవారు. కాని నేడు శారీరక శ్రమ అవసరము లేకపోవడంతోపాటు, అవసరమైన దానికంటే ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడంతో రక్తపోటు, మధుమేహం లాంటి రోగాలు మనలను వెంటాడుతున్నాయి. నూనెలకు గిరాకి ఏరోజుకారోజు పెరుగుతూ ఉంది కాబట్టి రైతులు నూనె గింజల సాగు పెంచవచ్చు. నూనెగింజ పంటలలో పామాయిల్ సాగు బాగా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం మనం పామాయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. మలేషియా, సింగపూర్ లాంటి దేశాలలో పామాయిల్ సాగు ఎక్కువగా ఉంది. అక్కడ వారు మన దేశానికి పామాయిల్ పంపిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పామాయిల్‌ను సాగు చేసినట్లయితే తక్కువ శ్రమతో రైతులు మంచి ఫలితాలను పొందవచ్చు. పామాయిల్ సాగు చాలా సులభం. 365 రోజులు నీటి వసతి ఉంటే పామాయిల్ సాగును చేపట్టవచ్చు. మన అదృష్టం కొద్దీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన తెలంగాణలో రైతులకు నీటి సమస్య లేదు. నీటి వృథాను తగ్గించేందుకు డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి పామాయిల్ సాగు వలన రైతులకు పలు విధాలుగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఆ దిశగా ఆలోచించవచ్చు.
రైతు సంఘాలకు నాబార్డ్ నుంచి ప్రోత్సాహం
పరిస్థితులకి అనుకూలంగా రైతులు మారుతూ ఉండాలి. వ్యవసాయ భూమి స్థిరంగా ఉంది. రైతుల సంఖ్య పెరిగింది. ఉన్న భూమిని రైతులు పంచుకోవలసిందే కాబట్టి ఒకప్పుడు పెద్దపెద్దగా ఉండే కమతాలు ఇప్పుడు చిన్నచిన్న కమతాలు అయ్యాయి. రైతుల సంఖ్య పెరిగింది కాబట్టి మంచి ఫలితాలు పొందాలంటే రైతులు సంఘాలుగా ఏర్పడాలి. రైతు సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. రైతు సంఘాలకు నాబార్డు నుంచి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలని డా|| గోవిందరాజులు రైతులకు విజ్ఞప్తి చేశారు.
కోతుల సమస్యకి పరిష్కారం – పామాయిల్ సాగు
ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య కోతులు. పంటలను కోతులు నాశనం చేస్తున్నాయి. మిగతా పంటలతో పోల్చుకుంటే పామాయిల్ పంటను కోతులు పాడుచేయలేవు. మనం పామాయిల్‌ను మలేషియా, సింగపూర్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. తెలంగాణ రైతులు పామాయిల్ సాగు మొదలుపెట్టినట్లయితే ఆయిల్ దిగుమతులు తగ్గి నూనెగింజల ఉత్పత్తిలో స్వయంసమృద్ధిని సాధించడంతోపాటు ఈ పంటను కోతులు ఏమీ చేయలేవు కాబట్టి కోతుల బెడద నుంచి రైతులు బయటపడవచ్చు. పామాయిల్ సాగు పెరిగితే అనేకమందికి ఉపాధి అవకాశాలు పెరగటంతోపాటు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. రైతులు సక్రమంగా పామాయిల్ సాగును సద్వినియోగం చేసుకుంటే క్రూడ్ ఆయిల్‌కు గల్ఫ్ దేశాలు హబ్ అయినట్లు పామాయిల్‌కి తెలంగాణ హబ్ కాగలదని గోవిందరాజులు అన్నారు.
అన్నం పండించే రైతులు బ్రహ్మకంటే గొప్పవారు
ప్రపంచంలో అందరికి అత్యవసరం ఆహారం. మనిషి ఎన్ని వందల కోట్లు కూడబెట్టినా కూడా డబ్బు తిని బ్రతకలేడు. బంగారం తిని బ్రతకలేడు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం తప్పనిసరిగా అన్నం తినవలసిందే. అన్నం లేకుండా జీవితాలను కొనసాగించలేడు. అందుకే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు. ఆ అన్నాన్ని పండించే రైతులు బ్రహ్మకంటే గొప్పవాళ్ళు అని రైతు గొప్పతనాన్ని గోవిందరాజులు గుర్తు చేశారు.
ప్రముఖ సేంద్రియ రైతు నాగరత్నం నాయుడిగారి సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన సేంద్రియ వ్యవసాయ శిక్షణా కేంద్రం ప్రారంభించటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కేంద్రం ద్వారా రైతులకు శిక్షణను అందించడంతోపాటు రైతులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తూ రైతులను సంఘటితపరచడానికి కూడా కృషి చేస్తే ఫలితాలు బాగుంటాయని డా|| జి.ఆర్. చింతల అభిప్రాయపడ్డారు.
విలువ జోడింపుతోనే రైతులకు అధిక లాభాలు – ప్రొ|| వి. ప్రవీణ్‌రావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి
పరిస్థితులకు అనుకూలంగా రైతులు కూడా మార్పు చెందవలసిందే. మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. అవసరమైన దానికంటే ఎక్కువగా ఆహారధాన్యాలను పండిస్తున్నారు. అదే సమయంలో అపరాలు, నూనెగింజల ఉత్పత్తిలో మనం వెనుకబడి ఉన్నాము. వరి పంట సరిగ్గా లేని గుజరాత్ రాష్ట్రంలో వడ్లకు విలువజోడించే పరిశ్రమలు ఎక్కువగా స్థాపించారు. అందుకనే మన దగ్గర నుంచి ముడి సరుకు కొనుగోలు చేసుకుని వాటికి విలువ జోడించి తిరిగి మనకే అమ్ముతున్నారు. కాబట్టి రైతులు పంటల సాగుతో పాటు విలువ జోడింపు కూడా మొదలుపెట్టినపుడే ఆర్థిక ఫలితాలను పొందవచ్చు. ఉత్తర తెలంగాణలో సోయాబీన్ పంటను ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ సోయాబీన్‌కు విలువ జోడించగలిగితే ఫలితాలు బాగా ఉంటవి. పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. మన నేలలలో సేంద్రియ కర్బనం చాలా వేగంగా తగ్గుతుంది కాబట్టి పచ్చిరొట్ట పైర్లను వేసి నేలలో సేంద్రియ కర్బనం పెరిగే చర్యలు చేపట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ వి. ప్రవీణ్‌రావు అన్నారు.
కే.సి.ఆర్ వ్యవసాయాన్ని పండగలా చేశారు : అరికెపూడి గాంధి, శేరిలింగంపల్లి శాసనసభ్యులు
మన ప్రియతమ ముఖ్యమంత్రి స్వయంగా రైతు. వారికి వ్యవసాయ క్షేత్రం ఉంది. రైతుల కష్టాలు స్వయంగా క్షేత్రస్థాయిలో చూశారు కాబట్టి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు నేరుగా నగదును అందిస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నారు. అనేక ప్రాజక్టుల ద్వారా తెలంగాణలో నీటివసతి పెంచటం జరిగింది. భవిష్యత్తు అంతా వ్యవసాయానిదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ‘రైతు దేశానికి వెన్నెముక’ అనే విషయం అందరికీ తెలుసు. అలాంటి వెన్నెముకను కాపాడవలసిన బాధ్యత అందరిపైనా ఉంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రియతమ ముఖ్యమంత్రి కే.సి.ఆర్. నాయకత్వంలో మన వ్యవసాయం పండగలా మారిందని నిస్సందేహంగా చెప్పవచ్చని శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధి అన్నారు.
రైతుల అభ్యున్నతికి నాబార్డ్ కృషి చేస్తుంది – వై. కృష్ణారావు, నాబార్డ్ తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్
రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించటానికి నాబార్డ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వ్యవసాయం చేసే రైతులతోపాటు పశుపోషకులకు, చేపల పెంపకందార్లకు, మిగతా వ్యవసాయ అనుబంధరంగాలలో ఉండే ఔత్సాహికులకు నాబార్డ్ సహకారం అందిస్తుంది. రైతులు సంఘాలుగా ఏర్పడి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ప్రారంభించినట్లయితే వారికి సుమారు 20 లక్షల రూపాయలను గ్రాంటుగా అందిస్తుంది. అలాగే నాప్ కిసాన్ ద్వారా 50 ఎఫ్పిఓలకి గ్రాంటు అందించాము. తెలంగాణలోని ఇంద్రవల్లి రైతు సంఘానికి 6 కోట్ల వ్యవసాయ రుణాన్ని అందించి అక్కడ సేంద్రియ పద్ధతిలో ప్రత్తి పండించే రైతులను ప్రోత్సహిస్తున్నాము. ఆ సంఘంలో 98%కి పైగా రైతులు గిరిజనులే. ఆ సంఘం వారు సొంతంగా జిన్నింగ్ మిల్లు పెట్టుకున్నారు. ఈ విధంగా రైతు అభ్యున్నతికి నాబార్డ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని నాబార్డ్ వారి స్కీములను వివరించారు.
ఆకుకూరలు, కూరగాయలతోనే పోషకాలలో సమతుల్యత సాధ్యం – ఎల్. వెంకట్రామిరెడ్డి, ఉద్యాన శాఖ కమీషనర్
మనం తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ప్రధాన పాత్రను పోషిస్తవి. అవసరమయిన పోషకాలను సమతుల్యంగా పొందాలంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు తప్పనిసరిగా ఆకుకూరలు మరియు కూరగాయలను అవసరమయిన మేరలో తమ ఆహారంలో చేర్చుకోవాలి. అందరికి అవసరమయినంత మొత్తంలో మనం సాగు చేయలేకపోతున్నాము కాబట్టి వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి రైతులు ఆకుకూరలు, కూరగాయలు సాగు విస్తీర్ణాన్ని పెంచవచ్చు. అదేవిధంగా నూనెగింజలలో కూడా మనం స్వయం సమృద్ధిని సాధించలేకపోయాం. చాలావరకు నూనెలను మనం దిగుమతి చేసుకుంటున్నాము కాబట్టి నూనెగింజలలో ప్రత్యేకించి పామాయిల్ సాగుకు తెలంగాణ రాష్ట్రంలో మంచి భవిష్యత్ ఉంది కాబట్టి రైతులు ఆదిశగా ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ కమీషనర్ ఎల్. వెంకట్రామిరెడ్డి రైతులకు సూచించారు.
సమగ్ర వ్యవసాయంతోనే రైతులకు లాభాలు – డా|| వి. లక్ష్మారెడ్డి, పశువైద్య, పశుసంవర్థక శాఖ సంచాలకులు, తెలంగాణ
సాగు నీటి వసతి పెరిగిన తరువాత తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. వ్యవసాయంతోపాటు అనుబంధరంగాలను కూడా ఆదరించినపుడే రైతులు ఆర్థికంగా ఎదగగలరు. మన రాష్ట్రంలో పశుగ్రాసాల సాగు పెరిగిన తరువాత పాడి పరిశ్రమ ఊపందుకుంది. గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం బాగా సహకారాలు అందిస్తుంది. పెరటికోళ్ళకు కూడా రోజురోజుకు గిరాకి పెరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వీటితోపాటు చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు. ఈ విధంగా ఒక్క వ్యవసాయంపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా ఆదరిస్తూ సమగ్ర వ్యవసాయం చేయగలిగితే రైతుల లాభాలు పెరుగుతవని పశుసంవర్థకశాఖ డైరెక్టరు డా|| వి. లక్ష్మారెడ్డి అన్నారు.
రైతు సేవలో ‘రైతునేస్తం’ – యడ్లపల్లి వేంకటేశ్వరరావు, ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఛైర్మన్
రైతులకు తమకు చేతనయినంతలో చేదోడుగా ఉండాలన్నదే మా లక్ష్యం. ఈ లక్ష్యంతోనే రైతునేస్తం మాసపత్రికను ముద్రించడముతోపాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా రైతులకు ఉపయోగపడే వీడియోలను అందరికీ చేరుస్తున్నాము. రసాయనిక వ్యవసాయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నవి కాబట్టి దానికి పరిష్కారం సేంద్రియ సాగే అని నమ్మి సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో గుంటూరు సమీపములో కొర్నెపాడు గ్రామంలోని రైతునేస్తం ఫౌండేషన్‌లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. అది తెలంగాణలోని రైతులకు దూరం అవుతుంది కాబట్టి ఇక్కడ కూడ శిక్షణా తరగతులు మొదలుపెడితే బాగా ఉంటుందని భావించి నాగరత్నం నాయుడి గారికి తెలియపరచగా వారు వెంటనే స్పందించి అందుకు అంగీకరించటం జరిగింది. నాగరత్నం నాయుడుగారి వ్యవసాయ క్షేత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి శనివారం ఇక్కడ సేంద్రియ సాగుతో పాటు పశుపోషణ, కోళ్ళ పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, యంత్ర పరికరాల వినియోగం లాంటి వాటిపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. కాబట్టి ఈ ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఛైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా|| యడ్లపల్లి వేంకటేశ్వరరావు ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయం తక్కువేమీ కాదు… వ్యవసాయమే అసలైనది : ప్రముఖ సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు
ఏదైనా ఆగవచ్చు కాని వ్యసాయం ఆగకూడదు అని అందరికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని, ఇతర రంగాలు ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మూతబడతాయో నమ్మకం లేదు. వ్యవసాయరంగం ఎప్పుడూ మూతపడదు. మనిషి బ్రతికి ఉన్నంతకాలం వ్యవసాయం కొనసాగవలసిందే కాబట్టి వ్యవసాయం తక్కువ అనే భావనలో ఉన్నవారు వ్యవసాయమే అసలైన వృత్తి అని తెలుసుకుంటున్నారు. ఈ శిక్షణా తరగతులకు మా క్షేత్రాన్ని ఎంపిక చేసుకోవడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని సేంద్రియ రైతు నాగరత్నం నాయుడు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
– డి. ప్రసాద్, ‘రైతునేస్తం’ ప్రతినిధి
