ప్రస్తుతం ఖరీఫ్‌లో సాగు చేసిన దీర్ఘకాలిక కంది, ఆముదం పంటలతో పాటు, రబీ లో సాగు చేసిన పంటల కోతలు, నూర్పిడులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. పొలాలన్నీ కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా చాలా మంది రైతులు ఖరీఫ్, రబీ పంటల కోతల తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ”దున్నకుండా వేస్తే కోయ్యకుండా పోతుంది” అనేది తెలుగు నానుడి. విత్తనాలు విత్తాలన్నా, నారు నాటేయాలన్నా దుక్కిని దున్ని విత్తేందుకు, నాటేందుకు అనుకూలంగా తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ సామెత తెలియచేస్తుంది. దుక్కి చేయకుండా భూమిని ఖాళీగా వదిలేయడం వలన కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు పెరిగి భూమిలోని తేమను, పోషకాలను గ్రహించి, భూమిని సత్తువ లేకుండా నిర్వీర్యం చేస్తాయి. దీని వలన భూసారం తగ్గి పోవటమే కాకుండా, నీరు భూమి లోపలి పొరల నుండి గ్రహించబడి ఆవిరి అయిపోతుంది. అంతే కాకుండా ముడి పోషకాల కొరత ఏర్పడి తర్వాత పంటలకు అత్యధిక మోతాదుల్లో ఎరువులు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కావున, ప్రస్తుత పరిస్థితుల్లో రైతు సోదరులు వేసవి లోతు దుక్కుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతులు వేసవిలో ముఖ్యంగా మే నెలలో కురిసే వర్షాలను సద్వినియోగపరుచుకొని దాదాపు 9 అంగుళాలకు తగ్గకుండా దుక్కులు చేసుకోవడం మంచిది. వీటినే వేసవి దుక్కులు (లేదా) ఎండు దుక్కులు అంటారు. వర్షాలకు ముందు భూమిని దున్నడం వలన తొలకరి వర్షాలు పడగానే మట్టి పెళ్లలు మెత్త పడతాయి. వర్షాలు పడిన తర్వాత నీరు బాగా ఇంకటం వలన అవసరమయితే ఈ నేలను మరోసారి దున్ని వెంటనే విత్తుకోవచ్చు.
లోతు దుక్కులకు ఉపయోగించే పనిముట్లు
కొయ్య నాగలి, రెక్కల నాగలి, పెద్ద మడక, మోల్డ్ బోర్డ్ నాగలి, పల్లెపు నాగలి, 5/7- కొయ్యల బాతు కాళ్ళ నాగలి.
వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు:
వేసవి లోతు దుక్కులతో భూమిలో తేమ నిల్వ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడం
సాధారణంగా చాలా మంది రైతులు సేద్యానికి గొర్రు, గుంటక, దంతె, కల్టివేటరు లాంటి పరికరాలను పదే పదే ఉపయోగించటం వలన నేల లోపల 3-5 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకొనే సామర్ద్యం తగ్గుతుంది. కాబట్టి నేలను లోతుగా దున్నటం వల్ల ఈ గట్టి పొర ఛేదించబడి నేలకు నీటిని పీల్చుకొనే శక్తీ అధికమవుతుంది. అంతే కాకుండా భూమిలోని లోతైన పొరల నుంచి నీరు ఆవిరి కాకుండా ఉంటుంది. లోతైన వేసవి దుక్కులు (30 సెం. మీ.) వాలుకు అడ్డంగా దున్నటం వలన వర్షపు నీరు వృధా పోకుండా భూమి లోపలి పొరల్లోకి చేరుతుంది. ఒకవేళ వాలుకు అనుకూలంగా దున్నితే నేల కోతకు గురయ్యే అవకాశం ఉంది. సాళ్ళ వెంట వర్షపు నీరు పరుగెత్తి సారవంతమైన మట్టినంతా ఒరవడికి గురిచేసి భూమిని నిస్సారంగా తయారు చేస్తుంది. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వలన ఈ సమస్య అధిగమించబడి, భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్ద్యాన్ని పెంపొందించుకుంటుంది. లోతు దుక్కుల వలన నేలలోని నీరు ఇంకని పొరలు తొలిగిపోయి, నీరు ఇంకే గుణం పెరుగుతుంది. దీని వలన భూమిపై పడిన ప్రతి వర్షపు నీటి బిందువు అక్కడికక్కడే ఇంకి, నీరు పరిరక్షింపబడుతుంది. తద్వారా నీటిని పరిరక్షించడమే కాకుండా నేల కోతను కూడా నివారిస్తుంది. వర్షాధార పంటలు వివిధ కీలక థల్లో బెట్టకు గురైనప్పుడు (లేదా) తక్కువ వర్షపాతం నమోదు అయినప్పుడు పంట వేర్లు లోతుగా పోవడం వలన నేల లోపలి పొరల్లోని తేమను మరియు పోషకాలను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తిని చేకూరుస్తుంది.
వేసవి లోతు దుక్కులతో భూసారాన్ని పెంపొందించుకోవటం
వేసవిలో లోతు దుక్కి చేసినపుడు భూమి గుళ్ల బారి, గట్టి పొరలు ఏర్పడకుండా మెత్తగా తయారవు తుంది. అంతేగాకుండా, లోతు దుక్కుల వలన ఖరీఫ్, రబీ పంట అవశేషాలు, కలుపు మొక్కలు, పంట మొక్కల నుండి రాలిన ఆకులు వంటి వివిధ సేంద్రీయ పదార్థాలు ఎరువుగా మారతాయి. తద్వారా నేలలో తేమ శాతం పెరగడంతో పాటు సేంద్రీయ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరుగుతాయి. దీని వలన మేలు చేసే సూక్ష్మ జీవులు గణనీయంగా వృద్ధి చెందటమే కాకుండా, వానపాములు కూడా వృద్ధి చెందుతాయి. తద్వారా భూసారం వృద్ధి చెందుతుంది. వేసవిలో లోతు దుక్కులు దున్నే ముందుగా భూమిలో పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, చెరువు మట్టిని గానీ వెదజల్లటం వలన నేల సారవంతం అవుతుంది. ఈ వేసవి లోతు దుక్కులు దున్నే ముందు పొలంలో పశువుల మందలు గానీ, గొర్రెల మందలు గానీ వదలాలి. ఇలా చేయడం వలన అవి విసర్జించే మల మూత్రాదులు భూమిలోనికి చేరటం వలన సేంద్రీయ పదార్ధం పెరిగి భూసారం వృద్ధి చెందుతుంది. తద్వారా, ప్రత్యేకించి పశువుల ఎరువును (లేదా) రసాయన ఎరువును కొనవలసిన ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా సేంద్రీయ ఎరువులను అందించటం ద్వారా పండించే పంటల్లో స్థూల-సూక్ష్మ పోషక పదార్థాల లోపాలను నివారించుకోవచ్చు. అంతే కాకుండా లోతు దుక్కుల వలన భూమి లోపలి పొరల్లోని మట్టి భూమి పైకి, భూమి పైమట్టి లోపలి పొరల్లోకి కలసిపోవడం ద్వారా భూసారం సమానంగా మొక్కలకు అందుతుంది.
వేసవి లోతు దుక్కులతో కలుపు నివారణ
కలుపు మొక్కలు, ఇతర గడ్డి జాతి మొక్కలు భూసారాన్ని త్వరగా గ్రహించి ప్రత్యక్షంగా నష్టం కలిగించడంతో పాటు పరోక్షంగా చీడ పీడలకు ఆశ్రయమిచ్చి పంట నష్టానికి దోహదమవుతున్నాయి. ముఖ్యంగా బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలైన తుంగ, గరిక, దర్భ, జమ్ము లాంటి సమస్యాత్మక కలుపు మొక్కలు అన్ని రకాల భూముల్లో, వివిధ పంటల్లో పెరిగి పంట మొక్కలతో పోటీ పడి సమస్యాత్మకంగా తయారవుతున్నాయి. వీటి వేర్లు, దుంపలు, కాయలు నేల లోపలి పొరల్లోకి బాగా విస్తరించి ఉండటం వలన నివారణ కష్టమవుతుంది. బహు వార్షిక మొండి జాతి కలుపు మొక్కలను పైపైన దున్నడం వలన పూర్తిగా నివారించడం జరుగదు. కావున లోతు దుక్కులు చేసినట్లైతే, తుంగ, గరిక లాంటి మొండి జాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు భూమి పైకి వచ్చి వేసవిలో ఉండే అధిక సూర్యరశ్మికి గురై నశిస్తాయి. అంతే గాక, నేల పైకి వచ్చిన వేర్లు, దుంపలు ఏరివేయటం ద్వారా వీటిని అరికట్టవచ్చు. వీటితో పాటు ఇతర గడ్డీ జాతి మొక్కలు, ద్విదళబీజ జాతి మొక్కల విత్తనాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవటం ద్వారా నశిస్తాయి. తద్వారా ఆ తర్వాత పంట కాలంలో కలుపు మందులకు, ఇతర క్రిమిసంహారక మందులకు వెచ్చించాల్సిన పెట్టుబడి ఖర్చు కూడా తగ్గిపోతుంది.
వేసవి లోతు దుక్కులతో చీడ పీడల నివారణ
సాధారణంగా పంట సాగులో ఉన్నపుడు వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు ఆశిస్థాయి. ఈ పురుగుల యొక్క జీవిత చక్రంలో పంటకు నష్టం కలగ చేసేవి లార్వాలు మరియు తల్లి పురుగులు మాత్రమే. అయితే, ఈ చీడపీడల లార్వాలు తల్లి పురుగులుగా మారే క్రమంలో కోశస్థ థ (ప్యూపా)కు చేరుకుంటాయి. ఈ కోశస్థ థలు పంటలకు ఎలాంటి నష్టం కలగచేయవు. సాధారణంగా పొలంలో పంట లేనప్పుడు, వేసవి కాలంలో భూమి ఖాళీగా ఉంటుంది. ఈ చీడ పీడలకు కూడా ఆహారం లభ్యం గాక, కోశస్థథల్లో కానీ, సుప్తావస్థ థల్లో గానీ ఇతర కలుపు మొక్కల మీద కానీ ఆశ్రయం పొందుతూ ఉంటాయి. వేరుశనగ, చెరకు, పండ్ల చెట్లను ఆశించే వేరు పురుగులు, అపరాలు, కంది, ప్రత్తి మొదలైన పంటలను ఆశించే పచ్చ పురుగు, లద్దెపురుగు, బొంత పురుగు, దాసరి పురుగు కోశస్థ థలు భూమి లోనే ఉంటాయి. వరిని ఆశించే కాండం తొలుచు పురుగు యొక్క కోశస్థ థలు, వరి కోసిన దుబ్బుల్లోనే ఉంటాయి. వరిని, ఇతర పంటలను ఆశించే మిడుత పురుగులు నేలలో 5 సెం. మీ. లోతులో గుడ్లు పెడతాయి. ముఖ్యంగా ఇవి పొలం గట్ల ప్రక్కన గుడ్లు పెడతాయి. తొలకరి వర్షాలకు గుడ్ల నుంచి పిల్ల పురుగులు బయటకు వస్తాయి. ఇంకా ఇతర తెగుళ్లను వ్యాప్తిచేసే అనేక శిలీంధ్రాలు కూడా భూమిలో ఆశ్రయం పొందుతుంటాయి. వేసవిలో లోతు దుక్కులు చేయటం వలన భూమిలో దాగి ఉన్న చీడ పీడల కోశాలు, గుడ్లు, ఇతర శిలీంద్ర జాలాలు కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు గురవటం ద్వారా నశిస్తాయి. అంతే గాకుండా, భూమి పైన బయట పడిన ప్యుపాలను, గుడ్లను కొంగలు, కాకులు మొదలైన పకక్షులు తిని నాశనం చేస్తాయి. దుక్కి దున్నేటపుడు, మనుషులు, పశువుల త్రోక్కిసలాటలో కొన్ని పురుగులు, ప్యుపాలు చనిపోతాయి. కావున సమగ్ర సస్యరక్షణలో వేసవి లోతు దుక్కులకు మొట్టమొదటి ప్రాధాన్యమివ్వాలి. తద్వారా పురుగు, తెగుళ్ల మందు ఖర్చు కొంతవరకు తగ్గుతుంది. వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
కావున రైతు సోదరులు వేసవిలో కురిసే తొలకరి జల్లులను ఉపయోగించుకొని భూమిని బాగా దుక్కి చేసుకోవాలి. తద్వారా భూమిలో తేమను నిల్వ చేసుకొనే శక్తీ పెరగటమే కాకుండా, భూసారం కూడా పెంపొందించుకోవచ్చు మరియు నేల కోతను నివారించు కోవచ్చు. అంతే గాకుండా మొండి జాతి కలుపు మొక్కల నివారణతో పాటు చీడపీడలను కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. కావున రైతులు ప్రతీ 2-3 సంవత్సరాలకైనా వేసవిలో లోతుదుక్కులను (20-30 సెం.మీ.) చేసుకోవటం వల్ల అనేక లాభాలు పొంది, వర్షాధార పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు.
ఎ. మల్లీశ్వర రెడ్డి, శాస్త్రవేత్త (సేద్య విభాగం); బి. సహదేవ రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త (మెట్ట వ్యవసాయం) మరియు అధిపతి వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురము.
Recent Posts
Categories
- 5 layer method 1
- agri news 1,321
- Agriculture 178
- Agriculture Technology 1
- Aquaculture 2
- coconut farming 1
- Courses 2
- Dairy Farm 37
- Dr.khadar vali 1
- Economy Solution 1
- Expo 1
- Fish Farming 1
- Harvests Innovations 3
- horticulture 1
- Kitchen Garden 1
- Latest News 7
- Live Stock 100
- Mango Farming 8
- Mela 2
- Millets 3
- mushroom farming 1
- Nature 1
- Organic Food 12
- Pets health Care 1
- Poultry 6
- Summer crops 1
- Terrace Garden 13
- turmeric 1
- Uncategorized 53
