జార్జియా వంట… ఇదో విదేశీ వండని వంట!

ఈ వంట ‘వండని వంటలు’ శీర్షిక క్రిందికి వస్తుందో రాదో కాస్తా అనుమానంగా ఉంది. ఇందులో బచ్చలి ఆకులను ఆఫ్ బాయిల్ చేస్తారు. మిగతావి అన్నీ పచ్చి పదార్థాలనే వాడతారు. అవన్నీ దాదాపు మనకు కూడా దొరుకుతాయి!

జార్జియన్ బచ్చలి కూర కొత్తిమీర మరియు వాల్‌నట్ సలాడ్ – ‘ఇస్పానాఖిస్ ప్ఖాలీ’
ఇస్పానాఖిస్ ప్ఖాలీ అనేది “ప్ఖాలీ” వర్గానికి చెందిన ఒక సాంప్రదాయ జార్జియన్ వంటకం, ఇది జార్జియాలో వివిధ కూరగాయల ఆధారిత స్ప్రెడ్‌లు లేదా సలాడ్‌లకు ఉపయోగించే పదం. ప్ఖాలీ వంటకాలు తరచుగా చల్లగా వడ్డిస్తారు, మరియు జార్జియన్ విందులు మరియు వేడుకల్లో ప్రముఖ భాగంగా ఉంటాయి.

Pkhali యొక్క ఇతర సలాడ్స్ కూడా ఉన్నాయి. అవి బీట్‌రూట్, వంకాయ, పుట్టగొడుగులు, క్యాబేజీ లేదా రెడ్ బీన్స్ నుండి తయారు చేస్తారు. కానీ ఇస్పానాఖిస్ ప్ఖాలీ యొక్క ఆకర్షణీయమైన ముదురాకు పచ్చ రంగు, మరియు ఘాటైన బచ్చలి కూర రుచి నోరూరించే వంటకాలలో ఒకటి.

జార్జియన్ బచ్చలి కూర వాల్‌నట్ కొత్తిమీర సలాడ్ – ఇస్పానాకిస్ ప్కాలీ సలాడ్ చేసుకునే విధానం చాలా సులభం.

కావలసినవి:

  • 700 గ్రా. తాజా బచ్చలి కూర ఆకులు
  • 1 కప్పు (120 గ్రా) వాల్‌నట్‌లు, పచ్చివి లేదా కాల్చినవి.
  • 3 మీడియం లవంగాలు మరియు వెల్లుల్లి.
  • 60 గ్రా కొత్తిమీర
  • 1/4 కప్పు పార్స్లీ
  • 3 టేబుల్ స్పూన్లు (45 ml) కూరగాయల లేదా వాల్‌నట్ నూనె
  • 2 టేబుల్ స్పూన్లు (30 మి.లీ) వెనిగర్
  • 1/2 టీస్పూన్ (2.5 గ్రా) ఉప్పు
  • 1 1/2 టీస్పూన్లు (4.5 గ్రా) ఖ్మేలీ సునెలీ అనగా జార్జియన్ మసాలా మిక్స్ అదేమీ బ్రహ్మ పదార్థం కాదు.
  • (-1/2 టీస్పూన్ (1.5 గ్రా) గ్రౌండ్ బ్లూ మెంతులు, 1/2 టీస్పూన్ (1.5 గ్రా) పసుపు, 1/2 టీస్పూన్ (1.5 గ్రా)తో భర్తీ చేయవచ్చు.
  • దనియాలు
  • 1/4 టీస్పూన్ (0.5 గ్రా) ఎరుపు కారపు మిరియాలు
  • 1/4 టీస్పూన్ (0.5 గ్రా) నల్ల మిరియాలు వీటన్నిటినీ రోట్లో దంచుకొని తయారు చేసుకోవచ్చు).
  • చివరగా దానిమ్మ గింజలు, గార్నిష్ కోసం.
    * * *
    బచ్చలి కూరను కడగాలి మరియు అది వడలిపోయే వరకు ఒక గిన్నెలో గోరువెచ్చని లేదా వేడినీటిలో ఉంచాలి (సుమారు 3 నిమిషాలు) (దీన్నే ఆఫ్ బాయిల్ అన్నాము)

తర్వాత చల్లని నీటిలో బచ్చలి కూరను వేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బచ్చలి కూర చల్లారాక, బచ్చలికూరలో ఉన్న నీటిని చేతితో పిండి బచ్చలి కూరను పక్కన పెట్టుకోవాలి.

వాల్‌నట్‌లను కాస్త బరకగా దంచుకోవాలి, పూర్తిగా పౌడర్ చెయ్యకూడదు. అదే రోట్లో మిగిలిన పదార్థాలను (బచ్చలి కూర మినహా) వేసి, కాస్త నెమ్మదిగా అన్ని కలిసే వరకు దంచుతుండాలి. రోట్లో నుండి ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు నీళ్ళని పిండేసి పక్కన పెట్టుకున్న బచ్చలి కూరను రోట్లో వేసి ముద్దగా దంచుకోవాలి.

అన్ని దినుసులు వెనిగర్ మసాలాలు వాల్‌నట్‌లతో నూరిన ముద్దని వేరే గిన్నెలోకి వేసి, దాంట్లోనే బచ్చలి కూర ముద్దని వేసి రెండు మిశ్రమాలను చక్కగా కలుపుకొని ఒక గిన్నె సహాయంతో చక్కగా ముద్దలుగా మరో ప్లేట్‌లో పేర్చుకొని, పైన కొన్ని దానిమ్మ గింజలతో అలంకరించుకుంటే వంట రెడీ..

ఇది ఇలాగే తినొచ్చు, కావాలంటే దీనికి సరైన కాంబినేషన్ మజ్జిగ. ఇది తింటూ మజ్జిగ తాగుతుంటే ఆ రుచే వేరు.

రచనః మాందాటి రఘు

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… కొత్తిమీర పచ్చడి

కొత్తిమీరని మనం వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటాం. కూరల్లో, పచ్చళ్ళలో, పప్పులో, సాంబారులో చివరగా ఇంత కొత్తిమీర వేస్తే చాలు… ఆ ఘుమఘుమలు మనకు ఆ పదార్థం నచ్ౘ్కపోయినా రుచి చూసేట్టు చేస్తుంది. ఆనక తినేట్లుగా కూడా చేస్తుంది.

పచ్చి కొత్తిమీరలో విటమిన్ ఎ, బి, సి, కె, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది.

కొత్తిమీర గుండెకు చాలా మంచిది. కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. అల్సర్‌ని తగ్గిస్తుంది. కిడ్నీలను శుభ్రం చేస్తుంది. ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

కొత్తిమీర రోటి పచ్చడి కావల్సిన దినుసులు :
పది పన్నెండు ఎండుమిర్చి, పదిదాకా పచ్చిమిరప కాయలు.
జీలకర్ర›, గోలీకాయంత చింతపండు
చిన్న ముక్క బెల్లం, సరిపడా రాళ్ళ ఉప్పు, ఒక పెద్ద కట్ట కొత్తిమీర
నాలుగు వెల్లుల్లి రెబ్బలు (ఇష్టం ఉంటే వేసుకోండి)

పైన చెప్పిన వాటిలో పచ్చిమిర్చి, ‘కొత్తిమీర సేంద్రియం కాకపోతే, కొంచెం ఉప్పు, పసుపు నీళ్ళలో వేసి పచ్చిమిర్చి తొడిమ తీసి వేసి పదినిమిషాలు ఉంచి, బాగా కడగండి. ఆ నీళ్ళు పారపోసి మళ్ళీ ఇంకో రెండుసార్లు కడగండి, ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే కొంతన్నా పోతాయి. కొత్తిమీర కూడా ఇదే ప్రాసెస్‌లో కడిగి, రెండూ తడి లేకుండా ఆరపెట్టుకోండి. తరువాత జీలకర్ర, పచ్చి, ఎండుమిర్చిని కలిపి మెత్తగా నూరి, అందులో ఉప్పు, వెల్లుల్లి వేసి మరింత నూరి, చివరికి కొత్తిమీర, బెల్లం వేసి మెత్తగా నూరి, గిన్నెలోకి తీసుకోవాలి.
పోపు అవసరం లేదు. వేడి అన్నంలో కలిపి, అవసరం అనుకున్న వారు నెయ్యి, లేదా కోల్డ్ ప్రెస్డ్ వేరుశనగ ఆయిల్ వేసుకుని తినవచ్చు. అవి లేకున్నా రుచిగానే ఉంటుంది. తడి లేకపోతే, మీరు చేసిన పచ్చడి వారమైనా పాడవదు.

రచన : కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

దోసకాయ-మామిడికాయ పచ్చడి

వేపకుండా, ఉడికించకుండా తయారుచేసే సహజాహార వంటకం ఈ ‘దోసకాయ-మామిడికాయ’ పచ్చడి
దోసకాయను-మామిడికాయను బాగా కడిగి, చెక్కు తీసి కానీ, తీయకుండా కానీ, చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కానీ, పండుమిర్చి కానీ, బాగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. (కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు).

సముద్రపు రాళ్ళ ఉప్పు కానీ, రాక్ సాల్ట్ కానీ తగినంత తీసుకోవాలి. మిక్సీలో కానీ రోట్లో కానీ పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి నూరుకోవాలి. తరువాత మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా నూరుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నూరు కున్న పచ్చడిని, మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు. లేదంటే దోసకాయ ముక్కలు దానిలో కలిపి దోసకాయ ష మామిడికాయ పచ్చడిగా కూడా తినవచ్చు.

రెండు రకాలుగా చేసుకోవచ్చు.

అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రోటీ, పుల్కా, చపాతీలలో కూడా బాగుంటుంది.

ఎండుమిర్చికంటే పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వాడుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది.
పండుమిర్చిఎండిన తర్వాత కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండుమిర్చి తక్కువ వాడుకుంటే మంచిది.

మామిడికాయ బదులుగా చింతపండు కూడా వాడుకోవచ్చు. కానీ చింతపండు ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది. అందుకని మామిడికాయ వాడుకుంటే రుచిగా ఉంటుంది.

ఈ పచ్చడిని ఏ రోజుకు ఆరోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

రచన : లతా కృష్ణమూర్తి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… ఉల్లిపాయ కారం

ముందుగా ఉల్లిపాయలలోని పోషకాల గురించి తెలుసుకుందాం ! ఉల్లిపాయలలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్ విటమిన్ ఎ, సి, ఇ, ఇంకా ఎన్నో ఉంటాయి. కేన్సర్ కణాలను నిరోధించటంలో ముఖ్యమైనది ఈ ఉల్లిపాయ. జుట్టు వత్తుగా, నల్లగా పెరగటానికి దోహదం చేస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్తంలో షుగర్ తగ్గించుకునేందుకు ఉల్లిపాయ ఉపయోగకరమైనది. చెడు కొలెష్ట్రాల్‌ని తగ్గించటమే గాక గుండె వ్యాధులను కూడా నిరోధిస్తుందని సంబంధిత నిపుణులు అంటారు.

కావల్సిన దినుసులు: ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర, పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ (అన్నీ ఉల్లిపాయకు తగినన్ని)

ముందుగా ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్రలని రోట్లో వేసి మెత్తగా దంచుకున్నాక, చింతపండు కూడా వేసి బాగా కలిసేట్లు దంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తగా దంచి, పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి.
మిక్సీలో కంటే రోట్లో చేసిన పచ్చడికి రుచి ఎక్కువ. పచ్చడి చేసేటప్పుడు నీరు తగలకుండా ఉంటే, ఈ పచ్చడి వారమైనా బయట కూడా పాడవదు. ఇది దోశెల్లోకి, అన్నంలోకి, జొన్నరొట్టెల్లోకి చాలా బావుంటుంది. రైస్‌లో తినేటప్పుడు కొంచెం కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వేస్తే రుచి పెరుగుతుంది.

రచన : శ్రీమతి కొలను పద్మావతి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… క్యారెట్ – పచ్చికొబ్బరి పచ్చడి

వండే పని లేకుండా అప్పటికప్పుడు సులభంగా చేసుకునే క్యారెట్ – పచ్చి కొబ్బరి ‘పచ్చి పచ్చడి’ తయారీ విధానం..

కావలసిన పదార్థములు:
పచ్చి కొబ్బరి ముక్కలు – ఒక కప్పు
క్యారెట్ ముక్కలు – ఒక కప్పు.
కొత్తిమీర – అర కప్పు
పచ్చిమిరపకాయలు – ఎనిమిది
శుభ్రం చేసిన చింతపండు నిమ్మకాయంత!
కొంచెం జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ.
రుచికి సరిపడినంత ఉప్పు

తయారీ విధానం:
క్యారెట్ దుంపలను శుభ్రంగా నీటిలో కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరిని కూడా ముక్కలుగా చేసుకోవాలి.

ముందుగా – కొబ్బరి, క్యారెట్టు ముక్కలను కలిపి, కొంచెం దంచిన తర్వాత మిగిలిన పదార్థాలు వేసుకుని, రోటిలో గాని మిక్సీలో కానీ రుబ్బుకోవడమే! అంతే !!

పొయ్యి మీద పెట్టే పని లేకుండా, సింపుల్‌గా చేసుకునే క్యారెట్ – పచ్చికొబ్బరి పచ్చడి రెడీ!

వేడి వేడి అన్నంలోకే కాదు… కొన్ని టిఫిన్లలోకి కూడా రుచికరంగా ఉంటుంది.

రచన : శాంత కర్రి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… అల్లం కారం

అల్లం కారం… వేపకుండా, వేడిచెయ్యకుండా తయారు చేసుకోగల వంటకం…

మామూలుగా అందరి ఇండ్లలో నెలకు సరిపడా అల్లమెల్లిగడ్డ రుబ్బుకునే అలవాటు ఉంటది.

జనరల్‌గా అల్లం ఎల్లిగడ్డ రుబ్బుకున్న మొదటి రోజు నుంచి, పది రోజుల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కారం చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటది. నోటికి రుచి లేకుండా ఉన్నపుడు, జ్వరంగా అనిపించినప్పుడు, ఏమి తినాలనిపియ్యనప్పుడు అల్లంకారం చేసుకుని అన్నంలో కలిపి తినవచ్చు. ఉల్లిపాయ కారం, ఎల్లిపాయ కారం లాగా, అల్లంకారంతో తింటే, కొత్త పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటది. ఇన్‌స్టంట్‌గా అయిపోతది.

ఈ కారం ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మాలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా కలిసిపోతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. రుబ్బుకున్నటువంటి అల్లం ఎల్లిగడ్డ పేస్టు నుంచి మనకి ఎంత కావాలి అంటే అంత తీసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం సమపాళ్లలో కలుపుకోవాలి. అయితే అల్లమెల్లిగడ్డ పేస్టు రుబ్బుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. పేస్టు, ఉప్పు, కారం మంచిగా కలిపి, దాంట్లోకి సరిపడా పచ్చడి నూనె వేసుకోవాలి. అంతే అల్లం కారం రెడీ అవుతుంది. ఇంట్లో చిన్న చిన్న పార్టీలు అయినపుడు కూడా దీన్ని ఒక డిష్‌గా పెట్టొచ్చు.

రచన : శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… మామిడల్లం పచ్చడి

ప్రకృతి మానవాళికి ప్రసాదించిన ఒక మంచి ఆహారం ‘మామిడి అల్లం’ గురించి ఎక్కువ మందికి తెలియదు. ఇది అల్లం జాతికి చెందిన దుంప. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చూడ్డానికి అల్లం దుంపలా వున్నా, గిచ్చి చూస్తే పచ్చి లేత మామిడికాయ వాసనతో చిన్న పాటి వగరుతో వుంటుంది.

మామిడి అల్లాన్ని ఉపయోగించి ‘వండనివంట’గా రోజువారీగా ఉపయోగపడే రోటి పచ్చడి చేసుకోవచ్చు.
కొన్ని రోజులు నిల్వ వుండే ఆవకాయ పచ్చడి లాగా కూడా చేసుకోవచ్చు.

మామిడల్లంతో రోటి పచ్చడి తయారీ…
మామిడల్లాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. దీనికి తగినంత ఉప్పు, పచ్చిమిర్చి చేర్చి చింత పండు లేదా నిమ్మ రసం కలిపి కచ్చాపచ్చాగా నూరుకుని, అన్నంలోకి లేదా రోటీలోకి తింటే చాలా బావుంటుంది.. (అవసరం అనుకున్న వారు ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే మరింత రుచి.. )
ఈ పచ్చడి ఏరోజుకారోజు చేసుకోవడం మంచిది. ఎక్కువ రోజులు నిల్వ వుండదు.

రెండవ పద్దతి ‘మామిడి అల్లం – ఆవకాయ’
మామిడల్లాన్ని కడిగి తేమ లేకుండా ఆరబెట్టాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.
కోసుకున్న ముక్కలకు కొద్దిగ ఆవపిండి, కొద్దిగ కారం, సరిపడ ఉప్పు కలిపి, నువ్వుల నూనె కూడా సరిపడా కలిపి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా కలపాలి. తరువాత నిమ్మ రసం కలిపి వూరనివ్వాలి. ఇది అచ్చు చిన్న ముక్కల ఆవకాయ పచ్చడిలా వుంటుంది. కొన్ని రోజులు ఫ్రిజ్ సహాయం లేకుండా నిల్వ వుంటుంది. ఫ్రిజ్‌లో దాస్తే మరింత తాజాగా వుంటుంది. అభిరుచినిబట్టి తాలింపు అదనం. గింజలు తీసిన పచ్చిమిర్చి ముక్కలు, కారెట్ ముక్కలు, మామిడి పొడి కూడా కలిపి మిక్సెడ్ పచ్చడి చేయవచ్చు.

  • రచన : సుబ్బారెడ్డి మేడపాటి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

కాలీఫ్లవర్ పచ్చడి

1) గుప్పెడు కాలీఫ్లవర్ ముక్కలని (కట్ చేసుకున్నవి) శుభ్రం చేయడానికి, ఉప్పు నీళ్లలో 4,5 నిమిషాలు ఉంచి, తర్వాత బయటికి తీసి, మళ్ళీ మంచినీటిలో కడిగి, ఆ ముక్కలను తడి లేకుండా బట్టతో తుడవాలి లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

2) రెండు లావుపాటి నిమ్మకాయల రసం పిండుకోవాలి, అందులోని గింజలను తీసివేయాలి.

3) 4, 5 వెల్లుల్లి రిబ్బలు కచ్చాపచ్చాగాదంచుకోవాలి.

4) రెండు టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు.

కాలీఫ్లవర్ ముక్కలను, నిమ్మరసం, దంచిన వెల్లుల్లి, కారం, ఉప్పు… అన్నిటిని కలపాలి. ఓ పావుగంట నుంచి అరగంట వరకు అలా ఉంచాలి. (అన్నీ పచ్చివే.)

క్యాలీఫ్లవర్ ముక్కలకు పులుపు పట్టి, నములుతుంటే కరకర మంటాయి.

అన్నంలో కలుపుకున్నా, ఉప్మా లాంటి వాటిలోనూ, చాలా రుచిగా ఉంటుంది. వేడి అన్నంతో తింటే, ఓ ముద్ద ఎక్కువే తింటారు.

ఫ్రిజ్‌లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఏ రోజుకారోజు తయారు చేసుకుని వాడుకోవడం మంచిది.

ఒక కాలీఫ్లవర్ పువ్వును, 3 లేదా 4 సార్లు ఇలా పచ్చడిగా పెట్టుకోవచ్చు.

  • రచన : తాయమ్మ కరుణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… దోసకాయ రోటి పచ్చడి

పచ్చడి కోసం కొంచెం గట్టిగా వుండే దోసకాయను తీసుకోవాలి!

కావలసిన పదార్థాలు: రెండు దోసకాయలు, మూడు నాలుగు పచ్చి మిరప కాయలు, నాలికకు కొంచెం చురుక్కు మనిపించాలనుకునే వారు ఇంకా ఒక మిరప కాయను వేసుకోవచ్చు. నాలుగు ఎల్లిపాయ రెబ్బలు (వెల్లుల్లి), కొంచెం జిలుకర (జీల కర్ర) రుచికి సరిపడ గల్లుప్పు (రాతి ఉప్పు లేదా దొడ్డుప్పు) ఇంతే సింపుల్.

చేసే విధానం: దోస కాయను చెక్కు తీసివేయాలి. తీయకపోయినా పర్వాలేదు. వారి వారి ఇష్టానుసారం చేసుకోవచ్చు. తీయకుంటేనే మంచిది. దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, అందులో పచ్చి మిరపకాయ ముక్కలు, జిలుకర, ఎల్లి పాయ, ఉప్పు కలిపి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సిలో వేసుకుని ఒక్కసారి తిప్పితే చాలు, తొక్కు రెడీ అయిపోతుంది. ఉడుకుడుకు (వేడి వేడి) అన్నంలో కలుపుకొని తినడమే ఆలస్యం. చెయ్యడం చాలా సులభం. ఈ దోసకాయ పచ్చడిని నిముషాలలో చేసుకోవచ్చు. ఏ రోజు చేసుకున్నది, ఆ రోజే వాడుకోవడం మంచిది. – సామల రాజవర్థన్

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి

Read More

వండని వంట… పప్పు పచ్చడి

పచ్చి పెసరపప్పు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన పెసర్లు కానీ, పొట్టు పెసరపప్పు కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు. పెసర్లు అయితే, నానడానికి టైం పడుతుంది. మొలకెత్తడానికి ఇంకా టైం పడుతుంది. వీటితో చేసుకోవాలంటే ముందుగా ప్రణాళిక ప్రకారం చేసుకోవాలి. అదే పొట్టు పెసరపప్పు కానీ, పెసరపప్పుతో కానీ అయితే అరగంటలో అయిపోతుంది.

దీనికి కావలసిన పదార్థాలు: పెసరపప్పు (ఏ రకమైన పప్పు అయినా, మీ ఇష్టం) ఒక చిన్న కప్పు. ఎండుమిర్చి (ఎవరి రుచి ప్రకారం వారు వేసుకోవాలి) ఐదారు.ఉప్పు – రాళ్ళ ఉప్పు (సముద్రపు ఉప్పు కానీ పింక్ రాక్ సాల్ట్ కానీ) తగినంత. నిమ్మరసం కానీ, పుల్లటి మామిడి కాయ కానీ రుచికి తగినంత.

ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ అన్ని కలిపి నీళ్ళు లేకుండా రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చాపచ్చాగా నూరుకోవాలి. మరీ మెత్తగా సుద్దలాగా నూరుకోకూడదు. మామిడికాయ అయితే, పప్పుతో పాటు వేసుకుని రుబ్బుకోవాలి. నిమ్మరసం అయితే ఆఖరున పిండుకోవాలి.

  • శ్రీమతి లతా కృష్ణమూర్తి
Read More