కాన్-టికీ (Kon-Tiki) బయోచార్ కిల్న్ అనేది ఫ్లేమ్ కర్టెన్ (Flame Curtain) సూత్రం ఆధారంగా పనిచేసే తలక్రిందుల శంఖాకార కిల్న్. పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో తక్కువ పొగతో బయోచార్గా మార్చడానికి ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది.
ముందుగా కిల్న్ అడుగు భాగంలో కొద్దిపాటి పొడి చెక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. అనంతరం వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు లేదా ఇతర పొడి పంట అవశేషాలను దశలవారీగా చిన్న పరిమాణాల్లో వేయాలి. పైభాగంలో ఏర్పడే మంట (Flame Curtain) పొగను దహనం చేస్తూ, కింది భాగంలోని అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ద్వారా బయోచార్గా మారుస్తుంది. చివరలో అవసరమైన స్థాయిలో బయోచార్ ఏర్పడిన తర్వాత మంటను ఆపి, నీరు చల్లి లేదా గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి.
కిల్న్ పరిమాణాన్ని బట్టి ఒక్కో బ్యాచ్‌లో వంద కిలోల నుంచి సుమారు ఒక టన్ను వరకు పంట అవశేషాలను ప్రాసెస్ చేయవచ్చు. ముడి పదార్థం స్వభావాన్ని బట్టి సుమారు 10-20 శాతం బయోచార్ లభిస్తుంది. సాధారణంగా ఒక బ్యాచ్ పూర్తవడానికి 2-4 గంటల సమయం పడుతుంది.
కాన్-టికీ కిల్న్ ద్వారా పొగ తక్కువగా విడుదలవుతుంది, నాణ్యమైన బయోచార్ ఉత్పత్తి అవుతుంది, తయారీ వేగంగా పూర్తవుతుంది మరియు పంట అవశేషాల దహనం వల్ల కలిగే పర్యావరణ కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఈ కారణాల వల్ల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, వ్యవసాయ శిక్షణా కేంద్రాలు మరియు పెద్ద రైతులకు ఈ సాంకేతికత అనువైన ప్రత్యామ్నాయంగా గుర్తింపు పొందుతోంది.
భారతదేశంలో అనేక సంస్థలు మరియు ఫ్యాబ్రికేషన్ యూనిట్లు వివిధ పరిమాణాల కాన్-టికీ కిల్న్లను తయారు చేస్తున్నాయి. కిల్న్ పరిమాణం, ఉక్కు మందం, తయారీ నమూనాను బట్టి ధర ₹40,000 నుండి ₹70,000 ల మద్య ఉండవచ్చు.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921
ఆవాలు సుగంధ ద్రవ్యమొక్క. గింజలు 1 మి.మీ. పరిమాణంలో చిన్నవిగా ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగులో ఉంటాయి. మొక్క 2 నుండి 8 అ. ఎత్తు పెరుగుతుంది. పసుపు రంగులో చిన్న పూలు ఏర్పడతాయి. ఆకులు సన్ననూగుతో కప్పబడి ఉంటాయి. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో పగటిపూట ఆకులు వడలి, రాత్రిపూట తిరిగి పూర్వస్థితికి వస్తాయి. మొక్క అనేక కొమ్మలు కలిగి వేగంగా పెరుగుతుంది. పూలు 7-9 మి.మీ. పొడవుంటాయి. కాయ సన్నగా, పొడవుగా ముక్కు కలిగి ఉంటుంది. ఇది 1-2 సెం.మీ. పొడవుంటుంది.
సాధారణ నామం : బ్లాక్‌మస్టర్డ్ శాస్త్రీయ నామం : బ్రాసికా నైగ్రా కుటుంబం: బ్రాసికేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
ఔషధ వైద్యంలో ఆవాల గింజల పిండిని ఉడకబెట్టి పుండుపై కట్టుకడతారు. గింజలను నూరి పేస్టు చేసి కీళ్ళ నొప్పులు తగ్గడానికి చర్మంపై పూస్తారు. దీనిని చర్మంపై పూసినపుడు రక్తాన్ని ఆ ప్రదేశంలోకి ప్రసరించేటట్లు చేసి బాధ, నొప్పులను తగ్గిస్తుంది.
నలగగొట్టిన గింజలపై వేడి నీరు పోసి కాళ్ళనుంచితే జలుబు, తలనొప్పులు తగ్గుతాయి. పురాతన ఔషధమూలికా వైద్యులు బట్టతల, మూర్ఛరోగం, పాముకాటు, పంటి నొప్పుల చికిత్సకుపయోగించేవారు.
గింజలను లోపలికి తీసుకుంటే ఆకలిని పెంచడం, జీర్ణశక్తిని పెంచడం, మూత్రవర్ధకం, వాంతి మందుగా పనిచేస్తుంది. గింజలను మొలాసెస్‌తో కలిపి లోపలికి మింగితే విరేచనకారిగా పనిచేస్తుంది. గింజల కషాయం కాలేయం, స్ల్పీన్ గట్టి పడటాన్ని తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు. దీనిని కార్సినోమా, గొంతు ట్యూమర్ల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఆవాలు గింజలను తింటే టానిక్‌గా, ఆకలి పెంచడానికి ఉపయోగపడతాయి.
గింజలతో తయారు చేసిన ద్రవంతో పుక్కిలిస్తే ట్యూమర్స్ నివారించబడతాయి. ఆవాల నూనె వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆవాల పిండి యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది.
వ్యవసాయరంగంలో …
ఆవపిండిని పశువులకు దాణాగా యిస్తే పాల దిగుబడి పెరుగుతుంది. ఆవాల నూనె చెక్క పంటలకు ఎరువుగా, పురుగు మందుగా పనిచేస్తుంది.
ఆవాల ఆకు ద్రావణాన్ని వేడి నీటితో కలిపి పిచికారి చేస్తే జ్యూట్ పంటలో కాండం కుళ్ళు తెగులు నివారించబడుతుంది.
ఈ ద్రావణాన్ని వేడి నీటితో కలిపి పిచికారి చేస్తే వరి పంటనాశించే గోధుమ రంగు మచ్చ తెగులు నివారించబడుతుంది. పశ్చిమ బెంగాల్ రైతులు ఈ పద్ధతిని విజయవంతంగా ఆచరిస్తున్నారు. ఆ విధంగా ఈ మొక్కని పర్యావరణహిత సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించవచ్చు. (ఘోష్, 2000).
భూమిలో నివసించే వైర్‌వర్మ్స్ లార్వాలు అనేక పంటలను ఆశిస్తాయి. ఆలుగడ్డ పంటలో వీటి నష్టాన్ని బ్రాసికా పచ్చి రొట్ట ఎరువుల్ని పెంచి నివారించవచ్చు. (ఫ్రాస్ట్, 2002).
ఆవాల నూనె స్పోడోప్టెరా లిట్టొరాలిస్, స్పోడోప్టెరాలిట్టొరాలిస్ మిమోలిమ్స్‌ను నివారించింది. ఫాట్ బాడిప్రోటీన్ పరిమాణాలను తగ్గించింది (ఖాట్టర్ అండ్ అబుల్ డాబ్, 2010).
ఆవాల ఎసెన్షియల్ ఆయిల్ క్యాబేజి లూపర్, ట్రైకోప్లూసియాని అతి సమర్థవంతంగా చంపగలిగింది (యాస్మిన్ అక్తర్, 2014).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
షామోమైల్ (503) : షామోమైల్ పూలను అవు చిన్న ప్రేవులలో నింపి శీతాకాలంలో సారవంతమైన భూమిలో కప్పిపెట్టాలి. కంపోస్టు కుప్పలలోని నత్రజని, కాల్షియం వాతావరణంలో కలిసి పోకుండా పట్టి వుంచుతుంది. పొటాషియం, మాంగనీస్, బోరాన్‌లతో పాటు అజటోబాక్టర్ బాక్టీరియా చర్యలను ప్రేరేపిస్తుంది. అజటోబాక్టర్ భూమిలో నత్రజనిని స్థిరీకరించే బాక్టీరియాలో అత్యుత్తమమైనది.
కొండీదురదగొండి (504) : కొండీ దురదగొండి మొక్కలను ఒక సంవత్సరంపాటు సారవంతమైన నేలలో పూడ్ౘ్ిపెట్టాలి. ఇది భూమిలో సేంద్రియ పదార్థం సరిగా కుళ్ళి పోవడానికి సహాయపడుతుంది. క్లోరోఫిల్ ఏర్పడటానికి భూమిలో ఇనుము, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం చర్యలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
ఓక్ చెట్టు బెరడు (505) : ఓక్ చెట్టు బెరడును ఆవు కపాలంలో ఉంచి చలి కాలమంతా నీటిలో వుంచాలి. కాల్షియం, భాస్వరం భూమి లోనికి జీవ రూపంలోచేరి మొక్కలను తెగుళ్ళనుండి కాపాడుతుంది.
డ్యాండెలియన్ (506) : ఆవు మీసెంటరీలోని డ్యాండెలియన్ భూమిలోని పొటాషియం / సిలికా బాక్టీరియాని ప్రేరేపించి పెరుగుదల శక్తులతో అతి సమర్థవంతంగా పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. మొక్కలకు కావలసిన వాటిని ఆకర్షించడానికి సిలికా సహాయపడుతుంది. పూతని పెంచడానికి దోసజాతి కాయలలో చివరి వరకు నింపడానికి సహాయపడుతుంది. ఆహార పదార్థాలలో పోషకాలను పెంచుతుంది. భూమిలో మెగ్నీషియం, బోరాన్, సెలీనియం చర్యలను ప్రేరేపిస్తుంది.
వ్యాలీరియన్ (507) : వ్యాలీరియన్ పూలతో తయారు చేసిన టింక్బర్ భూమిలోని బాక్టీరియాని చైతన్యపరచి, భాస్వరం ప్రక్రియని ప్రోత్సహించి భాస్వరం, సెలీనియం, మెగ్నీషియం కదలికలను ప్రేరేపిస్తుంది. పూత ప్రక్రియకు సహాయ పడుతుంది. కంపోస్టు కుప్పచుట్టూ వెచ్చదనాన్ని పరుస్తుంది.
“పాలు ఇచ్చే ప్రతి పశువు… రైతు కుటుంబానికి ఒక ఆదాయ వనరు. దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి రైతు బాధ్యత.”
పాడి పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన వ్యాధుల్లో పొదుగు వాపు (మాస్టిటిస్) ఒకటి. ఈ వ్యాధి వల్ల పశువు పొదుగులో వాపు, నొప్పి, పాలలో గడ్డలు, రంగు మారడం లేదా ఇతర అసాధారణ మార్పులు, పాల దిగుబడి తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఫలితంగా పాడి రైతులు పాల దిగుబడి తగ్గడం, చికిత్స ఖర్చులు పెరగడం, పాల నాణ్యత తగ్గడం వంటి ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు. అయితే, సరైన అవగాహన, పరిశుభ్రత, శాస్త్రీయ నిర్వహణ పద్ధతులను పాటించడం ద్వారా మాస్టిటిస్ను చాలా వరకు నివారించవచ్చు. పొదుగు వాపు రావడానికి ప్రధాన కారణాలు, పాడి రైతులు తరచుగా చేసే పొరపాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే వ్యాధి వచ్చినప్పుడు అనుసరించాల్సిన చర్యలను తెలుసుకుందాం.
పొదుగు వాపు లక్షణాలు పొదుగు వాపు (మాస్టిటిస్)ను ప్రారంభ దశలోనే గుర్తించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే సకాలంలో చికిత్స ప్రారంభిస్తే పశువు త్వరగా కోలుకోవడంతో పాటు పాల దిగుబడిలో వచ్చే నష్టాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అందువల్ల ప్రతి పాడి రైతు ఈ వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలి. పొదుగు వాపు వచ్చిన పశువులలో ప్రభావితమైన భాగం ఉబ్బడం, గట్టిపడటం లేదా నొప్పిగా ఉండటం గమనించవచ్చు. ఆ భాగం సాధారణం కంటే వేడిగా అనిపించవచ్చు. పాలు పితికే సమయంలో పాలు గడ్డకట్టినట్లు కనిపించడం, పాలు పలుచగా లేదా నీరుగా మారడం, రంగు మారడం లేదా రక్తపు చారలు కనిపించడం వంటి మార్పులు కనిపించవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్దీ పాల దిగుబడి తగ్గుతుంది. కొన్నిసార్లు పాలు పితికేటప్పుడు నొప్పి కారణంగా పశువు కాలు ఎత్తడం, తన్నడం లేదా అసౌకర్యంగా ప్రవర్తించడం గమనించవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో జ్వరం, నీరసం, ఆకలి తగ్గడం వంటి సాధారణ ఆరోగ్య సమస్యలు కూడా కనిపించవచ్చు. ఈ లక్షణాల్లో ఏవైనా కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుడిని సంప్రదించాలి.
పొదుగు వాపు వచ్చినప్పుడు రైతులు ఏం చేయాలి? పొదుగు వాపు లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పశువైద్యుడిని సంప్రదించి, సూచించిన చికిత్సను వెంటనే ప్రారంభించాలి. స్వయంగా మందులు వాడడం లేదా ఇతరుల సలహాతో చికిత్స చేయించడం మంచిది కాదు. అలాగే, పశువు ఆరోగ్యం మెరుగుపడిందని భావించి చికిత్సను మధ్యలోనే ఆపివేయకూడదు.
చికిత్స జరుగుతున్న సమయంలో వ్యాధి సోకిన పశువును సాధ్యమైనంత వరకు ఇతర పశువులకు దూరంగా ఉంచడం మంచిది. పాలు పితికేటప్పుడు ఆ పశువును చివరగా పితకాలి. అనంతరం చేతులు, పాలు పితికే పాత్రలు లేదా యంత్రాలను పూర్తిగా శుభ్రపరచాలి.
అదేవిధంగా, చికిత్స సమయంలో వచ్చే పాలను పశువైద్యుడి సూచనల ప్రకారం మాత్రమే వినియోగించాలి లేదా పారవేయాలి. యాంటీబయాటిక్స్ చికిత్స పొందుతున్న పశువుల పాలను, పశువైద్యుడు సూచించిన విత్‌డ్రావల్ పీరియడ్ (మందుల అవశేషాలు పాలలో పూర్తిగా తొలగే వరకు వేచి ఉండాల్సిన గడువు) పూర్తయ్యే వరకు తాగకూడదు, అమ్మకూడదు లేదా ఇతర అవసరాలకు వినియోగించకూడదు.
చికిత్సను పూర్తిగా కొనసాగించి, సూచించిన జాగ్రత్తలను పాటించడం వల్ల పశువు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వ్యాధి మళ్లీ వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
పొదుగు వాపు ఎందుకు వస్తుంది? ఎలా నివారించాలి? పొదుగు వాపు (మాస్టిటిస్) ఎక్కువగా వ్యాధికారక సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు ప్రధానంగా పాలు తీసే సమయంలో, అపరిశుభ్రమైన పశువుల కొట్టం వల్ల లేదా పొదుగుకు ఏర్పడిన చిన్న గాయాల ద్వారా లోపలికి చేరుతాయి. అందువల్ల పొదుగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ పాటించే పాడి నిర్వహణ పద్ధతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
పాలు తీసే సమయంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు తీసే ముందు పొదుగును శుభ్రమైన నీటితో కడిగి, ఒక్కో పశువును ప్రత్యేకమైన శుభ్రమైన పొడి గుడ్డతో తుడవాలి. పాలు తీసే వ్యక్తి చేతులు, ఉపయోగించే పాత్రలు లేదా యంత్రాలు కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిసారీ మొదటి కొన్ని పాల ధారలను ప్రత్యేక పాత్రలో సేకరించి జాగ్రత్తగా పరిశీలించాలి. పాలలో గడ్డలు, రక్తపు చారలు, రంగు మారడం లేదా పాలు పలుచగా కనిపించడం వంటి మార్పులు ఉంటే వెంటనే పశువైద్యుడిని సంప్రదించడం మంచిది. పాలు తీసిన అనంతరం చనుమొనలను పశువైద్యులు సూచించిన క్రిమిసంహారక ద్రావణంలో కొన్ని సెకన్ల పాటు ముంచడం (టీట్ డిప్పింగ్) వల్ల సూక్ష్మజీవులు నశించి, పొదుగు వాపు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే, పాలు తీసిన వెంటనే పశువు పడుకోకుండా కొద్దిసేపు నిలబడి ఉండేలా చూడాలి. ఇందుకోసం కొద్దిగా పచ్చిగడ్డి లేదా దాణా వేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చనుమొనలు సహజ స్థితికి చేరే వరకు సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించే అవకాశం తగ్గుతుంది. పాలు తీసే విధానం కూడా పొదుగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పాలను ఎల్లప్పుడూ పూర్తి చేతి పద్ధతిలో తీయాలి. పిడికిలి కణుపులతో (Knuckling) పాలు తీయడం వల్ల చనుమొనలకు గాయాలు ఏర్పడి, పొదుగు వాపు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే, పొదుగులో పాలు మిగిలిపోకుండా పూర్తిగా పాలు తీయడం, ప్రతిరోజూ ఒకే సమయానికి పాలు తీయడం కూడా పొదుగు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
పశువులు ఉండే పరిసరాల పరిశుభ్రత కూడా పొదుగు వాపు నివారణలో కీలకమైనది. కొట్టంలో పేడ, మూత్రం, బురద పేరుకుపోతే సూక్ష్మజీవులు వేగంగా పెరుగుతాయి. పశువులు పడుకునే ప్రదేశం ఎల్లప్పుడూ పొడిగా, పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో కొట్టం తడిగా, బురదగా మారకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల పొదుగు వాపు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. పశువు ఆరోగ్యం బాగుంటేనే పొదుగు ఆరోగ్యంగా ఉంటుంది. సమతుల్య పోషకాహారం, ఖనిజ లవణాల మిశ్రమం, విటమిన్లు, పరిశుభ్రమైన తాగునీరు తగిన మోతాదులో అందితే పశువు శారీరక స్థితి మెరుగుపడుతుంది. దీంతో సూక్ష్మజీవులను ఎదుర్కొనే శక్తి పెరిగి, పొదుగు వాపు వచ్చే అవకాశం తగ్గుతుంది. అదే విధంగా, ప్రసవం అనంతరం, అధిక పాలిచ్చే దశలో లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో పశువులపై మరింత శ్రద్ధ చూపడం అవసరం. ఈ దశల్లో సరైన పోషణ, మంచి నిర్వహణ అందిస్తే పొదుగు వాపు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
పొదుగు వాపును నివారించాలంటే పరిశుభ్రమైన పాడి నిర్వహణ, సరైన పాలు తీసే పద్ధతి, పశువుల ఆరోగ్యంపై నిరంతర శ్రద్ధ—ఈ మూడింటినీ రోజువారీ అలవాటుగా మార్చుకోవాలి.
“రోజువారీ పాడి నిర్వహణలో పాటించే చిన్న చిన్న జాగ్రత్తలే… పెద్ద నష్టాలను నివారిస్తాయి.”
Dr. సంతోషిణి చింత, అసిస్టెంట్ ప్రొఫెసర్, Dr. బద్దం అఖిల, టీచింగ్ ఫాకల్టీ, పశువైద్య మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, పశువైద్య కళాశాల, కోరుట్ల. 7093198419
విత్తడం పూర్తయ్యి, తెలంగాణలో ఎక్కువ ప్రాంతాల్లో పత్తి పంట ప్రస్తుతం శాఖీయ పెరుగుదల నుంచి పూత, పిందె దశల్లో ఉంది. వర్షాల మధ్య పొడి వాతావరణం, ఆకస్మిక భారీ వర్షాలు, రాత్రి ఉష్ణోగ్రత మార్పులు చీడపీడల ఉధృతిని వేగంగా మారుస్తున్నాయి. కాబట్టి రైతులు క్యాలెండర్ ప్రకారం మందులు పిచికారీ చేయకుండా, చేనులో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.
పొలంలో తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశాలు ప్రతి 3–4 రోజులకు పత్తి చేనులో గులాబీ రంగు పురుగు (కాయ తొలచే పురుగు) లక్షణాలను తప్పనిసరిగా పరిశీలించాలి; పూత దశలో ముడుచుకున్న గులాబీ పువ్వులు కనిపిస్తున్నాయా, అలాగే 10–15 రోజుల పచ్చికాయలను కోసి చూస్తే లోపల పురుగు లేదా నల్లటి మచ్చలు ఉన్నాయా చూడాలి. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల అడుగుభాగంలో తామర పురుగులు, తెల్లదోమ ఉధృతి పెరుగుతుందనే కారణంగా ఆకులు దోనెల్లా లేదా పసుపు రంగులోకి మారుతున్నాయా గమనించాలి. అలాగే వర్షాల తర్వాత గాలిలో తేమ పెరిగినప్పుడు కాయలపై నల్లటి మచ్చలు ఏర్పడి కుళ్ళిపోతున్నాయా, కాయ కుళ్ళు లేదా బ్యాక్టీరియల్ తెగుళ్ల లక్షణాలను కూడా పరిశీలించాలి.
నాన్-బిటి విత్తనాలు వేయకపోతే ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు విత్తనాల సమయంలో సరిహద్దు పంటలు (నాన్-బిటి పత్తి లేదా కందులు) వేయకపోవడంతో గులాబీ రంగు పురుగు నేరుగా పత్తిపై దాడి చేసే అవకాశం పెరుగుతుంది. దీనిని తగ్గించేందుకు ఎకరానికి 4–5 లింగాకర్షక బుట్టలు కట్టి, రోజుకు ఒక్కో బుట్టలో 8 కంటే ఎక్కువ రెక్కల పురుగులు పడితే ఉధృతి అధికంగా ఉన్నట్లు భావించాలి. అలాగే ఎకరానికి 10–15 పసుపు, నీలి రంగు జిగురు అట్టలను పైరు ఎత్తుకంటే కొద్దిగా పైన అమర్చడం ద్వారా రసం పీల్చే పురుగులను సుమారు 40% వరకు తగ్గించవచ్చు.
పిచికారీ వ్యూహం (MoA Rotation) 45–90 రోజుల పంటలో రసం పీల్చే పురుగుల నియంత్రణకు వేప నూనె (NSKE 5%) లేదా నింబిసిడిన్ పిచికారీ చేస్తే సాలీళ్ళు, లేడీబర్డ్ బీటిల్స్ వంటి మిత్రపురుగులు రక్షించబడతాయి. గులాబీ రంగు పురుగు ఆర్థిక నష్టపరిమితి (ETL) దాటినప్పుడు శాస్త్రీయంగా సిఫార్సు చేసిన మందులను మాత్రమే వాడాలి. అలాగే ఒకసారి వాడిన మందును తదుపరి పిచికారీలో మళ్లీ వాడకూడదు.
భారీ వర్షాలు కురిసినప్పుడు వెంటనే చేపట్టాల్సిన చర్యలు పొలంలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే మురుగునీటి కాలవలు ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపాలి; లేకపోతే వేరు కుళ్ళు తెగులు వ్యాపిస్తుంది. గాలిలో ఆర్ద్రత పెరిగినప్పుడు Bacillus thuringiensis (Bt) లేదా NPV వంటి బయో-పెస్టిసైడ్స్ వాడకం మెరుగైన ఫలితాలు ఇస్తుంది.
లేట్ ఫ్లష్ (చివరి ఏరుత)లో దిగుబడి తగ్గకుండా పురుగు నియంత్రణ వ్యూహం చాలామంది రైతులు డిసెంబర్–జనవరిలో వచ్చే చివరి ఏరుత ద్వారా అదనపు ఆదాయం ఆశించినా, ఈ దశలో గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మందుల మోతాదు పెంచి అధిక ఖర్చు చేయకుండా, PB-Rope లేదా లింగాకర్షక బుట్టల్లో ల్యూర్‌లు మార్చి మగ పురుగులను ఆకర్షించడం ద్వారా సంతానోత్పత్తిని తగ్గించాలి. కాయ తొలిచే దశలోనే తక్కువ ఖర్చుతో జీవ నివారణ పద్ధతులు లేదా సిఫార్సు చేసిన స్ప్రేలు వాడాలి. చివరి ఏరుత అనంతరం పత్తి కట్టెలను పొలంలో వదలకుండా రొటోవేటర్ లేదా షెడ్డర్‌తో తుంచితే మిగిలిన పురుగులు, కోశస్థ దశలు నశించి తదుపరి పంటకు పొలం పరిశుభ్రంగా ఉంటుంది.
వాతావరణ మార్పుల ప్రభావం పత్తి సాగుపై స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని అధిగమించడం రైతు చేతుల్లోనే ఉంది. అధిక రసాయన పిచికారీలు పరిష్కారం కాదు; అవి ఖర్చు పెంచి పురుగుల్లో నిరోధక శక్తిని పెంచుతాయి. శాస్త్రీయ పర్యవేక్షణ (ETL), లింగాకర్షక బుట్టల వినియోగం, సకాలంలో మందుల మార్పిడి, పొలం పరిశుభ్రత ద్వారా వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చు. సాంప్రదాయ పద్ధతులకంటే క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా శాస్త్రీయ నిర్ణయాలు తీసుకునే రైతు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, ఎక్కువ లాభాలను సాధించగలడు.
“పరిస్థితులు మారినప్పుడు మన వ్యూహం మారాలి — శాస్త్రీయ పర్యవేక్షణే పత్తి రైతుకు నిజమైన రక్షణ!”.
కాగితాల పువ్వు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇది క్షీణిస్తున్న వాతావరణ పరిస్థితులలో కూడా పెరుగుతుంది. ఇది అన్ని చోట్లా పెరుగుతుంది. దీనిని హెడ్డి, పొద, ప్రాకే తీగగా కుండీల్లో పెంచవచ్చు. ఇది పదునైన మందమైన ముళ్ళు కలిగి ఉంటుంది. కనుక పశువులు, మేకలు, కోతులు, పక్షులు హని కలిగించవు. ఈ మొక్క సూర్యకాంతిని ఇష్టపడుతుంది. వేడి, పొడి వాతావరణంలో కొన్ని రకాలు కాంతివంతంగా, ఆకర్షణీయమైన రంగులలో పెరుగుతాయి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఈపూవుకి గుర్తింపుగా ఒక పోస్టల్ స్టాంప్‌ని విడుదల చేసింది.
సాధారణ నామం : బోగన్ విల్లియా శాస్త్రీయ నామం : బోగన్ విల్లియా గ్లాబ్రా/ బోగన్‌విల్లియా సైక్టాబాలిస్ కుటుంబం: నిక్టాజినేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
ఈ మొక్క ఆకులు పినిటోల్ అనే రాసాయనం కలిగియుండి మధుమేహ వ్యాధి చికిత్సలో ఉపయోగపడతాయి. డయాబెటిస్ చికిత్సలకు ఆకులను ఉపయోగిస్తారు.
కాగితాల పూలతో తయారు చేసిన టీని, శ్వాసకోశవ్యాధుల నివారణకు త్రాగిస్తారు.
ఈ మొక్క పూలు, కాండాలను ఎండబెట్టి నీటిలో మరిగించి టీ లాగా త్రాగుతారు.
ఆకులను డయేరియా, చికిత్సలలో ఉపయోగిస్తారు. దగ్గు, గొంతునొప్పి, ఎసిడిటి నివారణకు ఉపయోగిస్తారు.
పూల ద్రావణాన్ని తక్కువ రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. కొమ్మలు హెపటైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో …
కాగితాల పువ్వు మొక్క ఆకుల పొడి (10 గ్రా. గాఢత) చిక్కుడు గింజలు నిల్వ సమయంలో ఆశించే బీన్‌వీలిల్, అకాంతో సెలిడెస్ ఓబ్టెక్టస్‌ని అత్యధికంగా చంపింది. (విల్సన్, అతని అనుచరుడు, 2016) ఆకులలో ఫినాల్ అధిక పరిమానంలో వున్నాయి కనుక కీటక నాశక చర్య ప్రదర్శించాయి. (లీ, అతని అనుచరులు, 1997)
కాగితాల పువ్వు మొక్క ఆకుల డ్రావణం టమాట, చిక్కుడు పంటల నాశించే అనేక వైరస్ తెగుళ్ళను నివారిస్తుంది.
ఆకుద్రావణం తయారీ: ఒక లీటరు నీటిలో 200 గ్రా. తాజా ఆకులను కలిపి కనీసం 5 నిమిషాలు మిక్సీలో కలపాలి.
కాగితాల పువ్వు మొక్క ఆకులు మిథనాల్ ద్రావణం వరి పంటనాశించే లద్దె పురుగు స్పోడోప్టెరా మరిషియా 3 నుండి 6వ దశ లార్వాలు, పూలపై లార్వా సైడల్‌పై మరియు ప్యూపెసైడల్ చర్య ప్రదర్శించాయి. ఆకుల ద్రావణం { కీటక పెరుగుదల క్రమబద్దీకరం, ఫ్యూఫెనోక్సురాన్ పిచికారి స్పొడోప్టెరా మరిషియా నివారణకు అత్యత్తమ ఎంపిక అని ఫలితాలు వెల్లడించాయి. (ప్రసీజ, అతని అనుచరులు, 2015)
బోగన్ విల్లియా ఆకు ద్రావణం ఈడెస్ ఈజిప్టు లార్వా, ప్యూపాలను చంపింది. (రాజమోహన్ Ê లోగన్ కుమార్, 2012)
బోగన్ విల్లియా ఆకుల కషాయం కావలసిన పదార్థాలు: కలబంద ఆకులు – 1 కి., బోగన్ విల్లియా, ఆకులు 1 కి., బొప్పాయి ఆకులు – 1 కి. పసుపు పొడి – 200 గ్రా.
తయారు చేసే విధానం
పైన సూచించిన ఆకులను పసుపు పొడిని పైన పేర్కొన్న మోతాదులో తీసుకుని ఆకులను బాగా మెత్తగా నూరి 10 లీటర్ల నీరు పోసిన కుండలో వేసి దానికి 200 గ్రా. పసుపు పొడిని కలిపి పొయ్యిపై పెట్టి సన్నని సెగతో ఉడక బెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా తయారైన కషాయాన్ని వడకట్టి ఒక డ్రమ్ములో పోయాలి. దీనికి 100 లీటర్ల నీరు కలిపి నిల్వ వుంచకుండా వేంటనే ఒక ఎకరంలో పంటపై సాయంత్రం వేళలో పిచికారి చేయాలి.
పంటకాలంలో పంట దశ,తెగులు ఉధృతిని బట్టి రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు.
టాప్-లిట్ అప్‌డ్రాఫ్ట్ (Top-Lit UpDraft – TLUD) కిల్న్ అనేది పంట అవశేషాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా నాణ్యమైన బయోచార్గా మార్చే సమర్థవంతమైన సాంకేతికత. ఈ కిల్న్ సాధారణంగా ఇనుప లేదా స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారు చేయబడుతుంది. అడుగు భాగంలో నియంత్రిత గాలి ప్రవేశానికి రంధ్రాలు, పై భాగంలో పంట అవశేషాలను నింపేందుకు అనువైన ఏర్పాటు ఉంటుంది.
ముందుగా పొడి పంట అవశేషాలను 5–15 సెం.మీ. పొడవు ముక్కలుగా చేసి కిల్న్‌లో నింపాలి. అనంతరం పైభాగంలో కొద్దిపాటి పొడి గడ్డి, చిన్న చెక్క ముక్కలు లేదా ఇతర తేలికగా మండే పదార్థాలను వేసి మంట వేయాలి. మంట పైభాగం నుంచి క్రమంగా క్రిందికి వ్యాపిస్తుండగా, అడుగు భాగం నుంచి పరిమితంగా ప్రవేశించే గాలి కారణంగా అవశేషాలు పూర్తిగా కాలిపోకుండా పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా బయోచార్గా మారతాయి.
పైరోలిసిస్ పూర్తయిన తర్వాత గాలి ప్రవేశాన్ని నిలిపివేసి కిల్న్‌ను చల్లారనివ్వాలి. అనంతరం తయారైన బయోచార్ను బయటకు తీసి నిల్వ చేయాలి లేదా కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి పొలంలో ఉపయోగించవచ్చు.
ఈ పద్దతిలో పొగ తక్కువగా విడుదలవుతుంది, బయోచార్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది. తయారీ సమయం తగ్గుతుంది మరియు కార్బన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కారణాల వల్ల చిన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలకు ఇది అనువైన, వాతావరణ అనుకూల సాంకేతికతగా గుర్తింపు పొందుతోంది.
డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921
గుగ్గిలం ఒక మధ్య పరిమాణం నుండి పెద్ద పరిమాణం గల, తేలికగా విస్తరించే క్యానపి, కొద్దిగా వ్రేలాడే కొమ్మలు గల ఆకులు రాల్చే చెట్టు. సాధారణంగా దీని కాండం 3-5 మీ. పొడవుంటుంది. అడవులలో పెరిగేచెట్టు చుట్టుకొలత 1.2-1.8 మీ. ఎత్తు 9-15 మీ. ఉంటుంది. బెరడు చాలా పలుచగా, బూడిదఆకుపచ్చ, బూడిద లేదా ఎరుపు రంగులో ఉండి పలుచని, కాగితం లాంటి పొరలుగా విడిపోతుంది. ఆకులు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడతాయి. అవి 2.0-4.5 సెం.మీ. పొడవుండి కొమ్మల చివర్లలో గుంపులుగా ఏర్పడతాయి. చిన్న ఆకులు 1.7-3.1 సెం.మీ. పొడవుండి ఒకదానికొకటి ఎదురుగా ఏర్పడతాయి. పూలు తెల్లగా ఉంటాయి. 1.0-2.0 సెం.మీ. పొడవుంటాయి. పూలు కొమ్మల చివర గుబురుగా ఏర్పడతాయి. కాయలు 1-3 సెం.మీ. పొడవుండి 3 వాల్వులు, 3 గుండె ఆకారం, 1 విత్తనం గల పొరలను కలిగి ఉంటాయి.
సాధారణ నామం : ఇండియన్ ఒలిబానం శాస్త్రీయ నామం : బోస్వెల్లియాసెర్రేట కుటుంబం: బర్సరేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
వేలాది సంవత్సరాల నుండి గుగ్గిలం ద్రావణాన్ని వంటి వాపు, నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీనిని కీళ్ళనొప్పులు, డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు. గుగ్గిలం ధూపం డిప్రెషన్, ఆందోళనకు ఉపశమనం కల్గిస్తుంది.
ఆస్టియో ఆర్థరైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళనొప్పులు, బర్సొటిస్, టెండొనైటిస్‌ల నుండి ఉపశమనం పొందడానికి ఉపయోగిస్తారు. దీనిని అల్సరేటివ్‌కోలైటిస్, కడుపునొప్పి, ఉబ్బసం, హేఫీవర్, గొంతునొప్పి, సిఫిలిస్, మహిళలలో రుతు సమయంలో నొప్పులు, మొటిమలు, క్యాన్సర్ నివారణలో ఉపయోగిస్తారు.
దీనిని ఉత్తేజికం, మూత్రం పారడం అధికం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గుగ్గిలం రెసిస్ ఆయిల్, ద్రావణాలను సబ్బులు, కాస్మటిక్స్, ఆహార పదార్థాలు, పానీయాల తయారీలో ఉపయోగిస్తారు. గుగ్గిలం యాంటిక్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంది.
వ్యవసాయరంగంలో
గుగ్గిలం ఆకు ద్రావణం (5%, 10%, 15%), ఫ్యుజేరియం మొనిలిఫార్మె, ఫ్యుజేరియం సొలాని, ఆల్టర్నేరియా ఆల్టర్నేట పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది (పెట్కార్, 2013). గుగ్గిలం ఆకు ద్రావణం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలను గరిష్టంగా అరికట్టింది. గుగ్గిలం ఆకుద్రావణాన్ని పంటలలో తెగుళ్ళ నివారణకు జీవశిలీంద్రనాశినిగా ఉపయోగించవచ్చు. ఇది పర్యావరణహితమైనది. పశువులకు, మనుషులకు ఎటువంటి హాని జరగదు.
గార్గ్ (1974) ఫ్యుజేరియం మొనిలిఫార్మెపై గుగ్గిలం ఆకు ద్రావణం శిలీంద్రనాశక చర్యను రిపోర్టు చేశాడు. వరి పంటలో పురుగుల నివారణకు గుగ్గిలం ఆకులను పొలంలో వెదజల్లుతారు. గుగ్గిలం బంకని కాల్చి పొగ పెడితే ఈగలు, దోమలు వికర్షింపబడతాయి (శర్మ అండ్ సావంత్, 20120.
ఈరోజు హైదరాబాద్‌లోని వారి నివాసంలో ‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకాన్ని పూర్వ ఉప రాష్ట్రపతి ఆవిష్కరించి… రచయిత, సంకలన కర్త తుమ్మేటి రఘోత్తమ రెడ్డిని అభినందించారు. ప్రస్తుత బిజీ ప్రపంచంలో బయటి ఆహారం మీద ఆధారపడకుండా, అప్పటికప్పుడు చేసుకుని తినేవిధంగా పలువురు అందించిన ఈ వండని వంటలు ఈతరానికి ఓ ఆరోగ్య దిక్సూచి. ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగించడమే గాక, సమయాన్ని ఆదాచేసే ఈ పుస్తకం ప్రత్యేకించి బ్రహ్మచారులకు, ఉద్యోగాలు చేసుకునే జంటలకు మరింత ప్రయోజనకారి కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహారం నేపథ్యంలో పలు పుస్తకాలను అందిస్తున్న ‘రైతునేస్తం’ వ్యవస్థాపకులు శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి చొరవ ఇదే విధంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాలను వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పద్మశ్రీ డా॥ యడ్లపల్లి వేంకటేశ్వర రావు, రచయిత తుమ్మేటి రఘోత్తమ రెడ్డి, ‘మిసిమి’ పత్రిక సంపాదకులు అశ్వినీ కుమార్, వలేటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.
‘రైతునేస్తం పబ్లికేషన్స’ ప్రచురించిన ‘వంద వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777 కు సంప్రదించండి.