జీవన ఎరువులు నేలకు అమూల్యమైన ధననిధి

                    నేల దేశ సంపద, దేశం సుభిక్షంగా ఉండాలంటే నేల ఆరోగ్యంగా ఉండాలి. నేల అనగా అనేక బిలియన్ల బ్యాక్టీరియా, శిలీంధ్ర, నాచు ఇంకా అనేక రకాల సూక్ష్మజీవుల సహజీవనంతో తొణికిసలాడే సజీవమైన జీవధార వ్యవస్థగా గుర్తించాలి. ఇవి మొక్కల ఎదుగుదలకు పోషకంగానే కాక వర్షపు నీరును క్షామం కాలం వరకు ఉంచుకొని మొక్కలకు అందజేస్తా ఆరోగ్యంగా ఉంటేనే ఆహార భద్రత, ఆరోగ్యకరమైన పర్యావరణంతోనే  మానవాళి శ్రేయస్సు సాధ్యపడుతుంది.

                      ఇటీవల కాలంలో రైతాంగం విచక్షణ రహితంగా రసాయనిక ఎరువులను, పురుగు మందులను వాడడం, అలాగే పంటల అవ శేషాలను కాల్చి వేయడం ద్వారా భూసారం గణనీయంగా క్షీణించడమే గాక పర్యావరణ కాలుష్యం, ఉపయోగకరమైన బ్యాక్టీరియా వినాశనానికి దారి తీస్తూ జీవన వైవిధ్యం వినాశనం సంభవిస్తుంది. తద్వారా సరైన పోషకాలు లేని బీడు భూములు ఏర్పడుతున్నాయి. మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రతి కిలో ఎరువుకు 17 నుండి 18 కిలోల ధాన్యం పండేది. కానీ ప్రస్తుతం ప్రతి కిలో ఎరువుకు కేవలం 3 కిలోల ధాన్యం మాత్రమే పండుతుంది. ఇది భూసారం క్షీణించడాన్ని సూచిస్తుంది.

                 భూసారాన్ని పెంచడానికి, నేల ఉత్పా దకతను మెరుగుపరచడానికి సూక్ష్మజీవుల పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే ఇవి నజ్రజనిని స్థిరీకరిస్తాయి, పోషకాలను కరిగిస్తాయి. పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు సహజంగానే భూమిలో ఉంటాయి. కాని వీటి సంఖ్య త్వరీతంగా తగ్గుతూ వస్తుంది. పంటల దిగుబడిని పెంచడానికి సూక్ష్మ జీవులను కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సూటి అయిన ఘన పదార్ధాలలో కలిపి మరల భూమిలో వెయ్యవచ్చు.

నత్రజనిని స్థిరికరించే జీవన ఎరువులు :

జీవన ఎరువులు వాడవలసిన మోతాదు ఏ ఏ పంటలకు

రైజోబియం 200 గ్రా. కంది,పెసర , మినుము, శనగ వంటి పంటలకు

అజటోబాక్టర్ 2 కిలోలు పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు

అజో స్స్పైరిల్లం 2 కిలోలు వరి, చెరకు, ప్రత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు , అరటి పంటలకు

నీలి ఆకుపచ్చనాచు 4 కిలోలు వరి పంటకు మాత్రమే వాడాలి.

రైజోబియం: లెగ్యూమ్‌ జాతి పంటలు అనగా అపరాల (పప్పుజాతి) పంటలకు నత్రజని అందించే జీవన ఎరువుగా వాడవలెను. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైనవి కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు, వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చర్‌ను విత్తనమునకు పట్టించి ఉపయోగించాలి.
ఉపయోగించే విధానం: వంద మిల్లీలీటర్ల నీటిలో పది గ్రాముల పంచదార, బెల్లం, లేక గంజి పౌడర్‌ను కలిపి పది నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. ఈ చల్లార్చిన ద్రావణం పది కిలోల విత్తనాలపై చల్లి, దానికి 200 గ్రాములు రైజోబియం కల్చర్‌ పొడిని బాగా కలపాలి. విత్తనం చుట్టూ పొరలు ఉండేలా జాగ్రత్త వహించాలి.

 ఈ ప్రక్రియకు రైతులు పాలిథిన్‌ సంచిగానీ, ప్లాస్టిక్‌ తొట్టిని గాని ఉపయోగించుకోవచ్చు. పది నిమిషాలు నీడలో ఆరబెట్టిన తరువాత రైతులు పొలంలో నాటుకోవలెను

అజటోబాక్టర్‌: పప్పుజాతి పంటలను మినహాయించి, మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ బాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక, మొక్కకు కావాల్సిన హార్మోన్లు, విటమిన్లు అందిస్తుంది.

 ఈ బాక్టీరియా ముఖ్యంగా సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉన్న భూమిలో సమర్థవంతంగా పని చేస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువు ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటలకు సిఫారసు చేయబడుతుంది.

వాడే విధానం: ఏ పంటకు వాడినా రెండు కిలోల కల్చర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో ఒక ఎకరం నేలపై వెదజల్లాలి. ఇది చల్లిన సమయంలో కాని, వెనువెంటనే భూమిలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి

అజోస్ప్తెరిల్లమ్‌ : ఈ మధ్యకాలంలో దీని ప్రాముఖ్యత అధికంగా గుర్తించారు. ఈ బాక్టీరియా మొక్క వేర్ల చుట్టూ పెరుగుతూ అవకాశమున్న చోట వేర్లలోకి చరొబడి కూడా జీవిస్తాయి.
ఈ కారణంగా ఈ జీవన ఎరువు స్థిరీకరించిన నత్రజని నేరుగా మొక్కకు ఎక్కువశాతం అందుబాటులో ఉంటుంది. ఈ జీవన ఎరువును లెగ్యూమ్‌జాతి పంటలకు తప్పించి, మిగతా పంటలకు వాడుకోవచ్చు.
ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు, అరటి పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలలో ఇది పని చేస్తుంది.

ఉపయోగించే విధానం:

         తక్కువ కాలం పంటలకు రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ కల్చర్‌ను   80-100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో విత్తనం కింద పడేలా వేసుకోవాలి. నారుమడి వేసుకొనే పంటలకు నారు పీకేందుకు ముందుగా నారుమడి వద్ద 70 నుంచి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. 

 ఆ నీటిలో రెండు కిలోల అజోస్పెరిల్లమ్‌ జీవన ఎరువును బాగా కలిపి, ఆ ద్రావణంలో పది నిమిషాలు వేళ్లను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరకు పంట విషయంలో నాటే విత్తనం చెరకు ముక్కలను పది నిమిషాలు ముంచి నాటుకోవాలి.

       పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరం, భూమిలో చేరిన కొద్ది రోజుల వ్యవధిలో భూమి ఉదజని సూచకను అనుసరించి, వివిధ రకములైన లభ్యంకాని భాస్వరం రూపంలోని మారుతుంది. 

 ఒక వేళ భూమి క్షార గుణం కలిగి వున్న, వేసిన భాస్వరం కాల్షియం, మెగ్నీషియం ఫాస్పేట్స్‌గా మారి, మొక్కకు లభ్యంకాదు. 

 ఈ పరిస్థితుల్లో భాస్వరానికి సంబంధించి జీవన ఎరువులు వేస్తే లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరం మొక్కకు దొరుకుతుంది.

భాస్వరంను అందించే జీవన ఎరువులు
PSB (ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా) 2 కిలోలు/ 500 మీ.లీ/ఎకరాకు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్ప్ ఫంగై 2 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

ఫాస్పేట్ మోబి లైజింగ్ మైకోరైజా 5 కిలోలు అన్ని పంటలకు వాడుకోవచ్చు

పొటాషియం మోబిలైజర్స్:
ప్రటూరియా అరాషనియా 2 కిలోలు నూనెగింజల పంటలకు ఎక్కువ ఉపయోగపడుతుంది

ఫాస్పోబాక్టీరియా :
ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంకాని రూపంలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే రూపంలోకి మార్చుతుంది. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు.

ఇది సమర్థవంతంగా పని చేసేందుకు సేంద్రియ కర్బనము అత్యవసరం. దీన్ని సేంద్రియ ఎరువుతో కలిపి వాడాలి. ఈ జీవన ఎరువు మొక్కకు రోగ నిరోధక శక్తిని పెంచి, తద్వారా పంట దిగుబడి పెంచుతుంది

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల ఫాస్పోబాక్టర్‌ను లేదా ద్రవ రూపంలో ఫాస్ఫరస్ సొల్యుబిలైజింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

పొటాషియం మొబిలైజర్స్ :
ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఈ జీవన ఎరువుల్లో ఉండేటటువంటి మొబిలైజింగ్ సూక్ష్మజీవులు, విడుదల చేసే ఎంజైముల వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది.

వాడే విధానం :
ఎకరాకు 2.0 కిలోల పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా లేదా ద్రవరుపం లో పొటాషియం రిలీసింగ్ బాక్టీరియా 500 మీ.లీ, 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలోగానీ, మొక్క నాటినప్పుడుగానీ సాళ్లలో పడేలా వేసుకోవాలి. వరి విషయంలో నాట్లు వేసిన మూడు నుంచి ఏడు రోజుల వ్యవధిలో వేసుకోవాలి. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

డా. ఎం. వెంకట లక్ష్మి(సస్య పోషణ), డా.డి.సుధా రాణి (సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి),
డా. కె. రేవతి (సస్య రక్షణ) కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల, కృష్ణాజిల్లా – 521 133. Ph: 8008201253

Read More

బయోచార్ తయారీ, వినియోగం మరియు వ్యవసాయంలో ప్రయోజనాలు

రైతు వ్యర్థంగా భావించే వరి గడ్డి, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టెలు, చెరకు ఆకులు, పప్పుధాన్యాల కాండాలు, కూరగాయ పంటల అవశేషాలు భూమికి అమూల్యమైన సహజ సంపద. వీటిలో సేంద్రియ పదార్థం, విలువైన పోషకాలు, నేల సారాన్ని పెంచే కార్బన్ సమృద్ధిగా ఉంటాయి. వాటిని కాల్చేస్తే ఈ సంపద మొత్తం నష్టపోతుంది. అదే శాస్త్రీయంగా వినియోగిస్తే నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, ఎరువుల వినియోగం సమర్థవంతమవుతుంది, సాగు ఖర్చు తగ్గుతుంది.

రైతులు పంట అవశేషాలను కాల్చడానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. ఒక పంట కోసిన వెంటనే మరో పంట వేయాల్సిన అవసరం, కూలీల కొరత, అవశేషాలను తొలగించడానికి అయ్యే అధిక ఖర్చు, యంత్రాల లభ్యత లేకపోవడం వంటి సమస్యలు వారిని ఈ నిర్ణయానికి దారి తీస్తున్నాయి. కానీ తాత్కాలికంగా సమయం ఆదా చేసినా, దీర్ఘకాలంలో నేల సారాన్ని, పంట ఉత్పాదకతను కోల్పోయే ప్రమాదం ఉంది.
అందుకే పంట అవశేషాలను కాల్చడం కంటే వాటిని కంపోస్టు, వర్మీ కంపోస్టు, మల్చింగ్, పశువుల మేత, బయోగ్యాస్ లేదా బయోచార్ రూపంలో వినియోగించడం ఉత్తమ పరిష్కారం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో బయోచార్ సాంకేతికత నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచడం, పోషకాల వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, నీటి నిల్వను పెంచడం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందుతోంది. పంట అవశేషాలను సమస్యగా కాకుండా విలువైన వనరులుగా మార్చుకునే ఈ సాంకేతికత రైతులకు స్థిరమైన, లాభదాయకమైన వ్యవసాయానికి కొత్త దిశను చూపుతోంది.

బయోచార్ అనేది పంట అవశేషాలు, చెట్ల కొమ్మలు, ఎండిన ఆకులు, కొబ్బరి చిప్పలు, ఇతర సేంద్రియ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్ పరిస్థితుల్లో 250-700°C ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే పైరోలిసిస్ ప్రక్రియ ద్వారా తయారయ్యే కార్బన్ అధికంగా ఉండే నల్లని ఘన పదార్థం. సాధారణంగా పంట అవశేషాలను బహిరంగంగా కాల్చితే వాటిలోని కార్బన్, గాలిలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో విడుదలవుతుంది. కానీ బయోచార్ తయారీ సమయంలో కార్బన్‌లో ఎక్కువ భాగం స్థిర రూపంలో నిల్వ ఉండి, తరువాత నేలలో కలిపినప్పుడు వందల నుంచి వేల సంవత్సరాల వరకు స్థిరంగా నిలిచి సేంద్రియ కార్బన్ నిల్వను పెంచుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరచి, నీటిని మరియు పోషకాలను నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంచుతుంది. బయోచార్‌లోని సూక్ష్మ రంధ్రాలు ఉపయోగకరమైన సూక్ష్మజీవులకు అనుకూల నివాసంగా పనిచేసి నేల జీవక్రియలను చురుకుగా ఉంచుతాయి.

  ప్రస్తుతం వాతావరణ మార్పులు, నేల సారం క్షీణించడం, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగానికి బయోచార్ ఒక స్థిరమైన పరిష్కారంగా గుర్తింపు పొందుతోంది. ఇది నేలలో కార్బన్‌ను దీర్ఘకాలం నిల్వ ఉంచడం ద్వారా కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హరితగృహ వాయువుల ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల బయోచార్ నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వాతావరణ అనుకూల మరియు సుస్థిర వ్యవసాయానికి కూడా కీలకమైన సాంకేతికతగా నిలుస్తోంది.

డ్రమ్ పద్ధతిలో బయోచార్ తయారి
చిన్న, సన్నకారు రైతుల స్థాయిలో తక్కువ ఖర్చుతో బయోచార్‌ను 200 లీటర్ల సామర్థ్యం గల పాత ఇనుప డ్రమ్ సహాయంతో తయారు చేయవచ్చు. ముందుగా డ్రమ్ అడుగు భాగంలో మరియు కింది ప్రక్కవైపున కొద్దిపాటి గాలి ప్రవేశించేలా చిన్న రంధ్రాలు చేయాలి. అనంతరం పొడి పంట అవశేషాలను చిన్న ముక్కలుగా చేసి డ్రమ్‌లో గట్టిగా నింపాలి. తరువాత డ్రమ్‌కు మూత బిగించి, మూత అంచులను బంకమట్టితో మూసివేయాలి. దీంతో డ్రమ్‌లోకి గాలి ప్రవేశించడం నియంత్రించబడుతుంది.

ఆ తర్వాత డ్రమ్‌ను పొయ్యి లేదా ఇటుకలతో ఏర్పాటు చేసిన మంటపై ఉంచి వేడి చేయాలి. సుమారు 20-25 నిమిషాల తర్వాత మూత అంచుల వద్ద నుంచి నీలిరంగు వాయువు విడుదల కావడం ప్రారంభమవుతుంది. ఈ దశలో డ్రమ్‌లో ఉష్ణోగ్రత 300-400°C వరకు చేరుకొని పైరోలిసిస్ ప్రక్రియ పూర్తవుతుంది.

నీలిరంగు వాయువు విడుదల తగ్గిన తర్వాత మంటను ఆర్పివేయాలి. అనంతరం డ్రమ్‌ను జాగ్రత్తగా దించి నేలపై ఉంచాలి. వెంటనే అడుగు భాగంలోని రంధ్రాలను కూడా బంకమట్టితో మూసివేయాలి. దీంతో గాలి లోపలికి ప్రవేశించకుండా నిరోధించబడి, పంట అవశేషాలు పూర్తిగా బూడిదగా మారకుండా కార్బన్ రూపంలో నిల్వ చేయబడతాయి.

డ్రమ్‌ను సుమారు రెండు గంటల పాటు అలాగే ఉంచి పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం మూతను తీసి బయోచార్‌ను బయటకు తీసుకోవాలి. బూడిద ఏర్పడి ఉంటే దానిని వేరుచేసి, బయోచార్‌ను చిన్న ముక్కలుగా లేదా పొడి రూపంలో తయారు చేయాలి. అనంతరం దీనిని కంపోస్టు, పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్టుతో కలిపి కొంతకాలం ఉంచిన తర్వాత పొలంలో ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
బయోచార్ తయారీలో ఆక్సిజన్ ప్రవేశం పరిమితంగా ఉండాలి. గాలి ఎక్కువగా ప్రవేశించినట్లయితే పంట అవశేషాలు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో నాణ్యమైన బయోచార్ తయారు కాదు.

డా వి మురళి, (సీనియర్ శాస్త్రవేత్త), జి. డయానా (రిసెర్చ్ స్కాలర్), జి . రాధిక (రిసెర్చ్ స్కాలర్), డా ఆనిత కుమారి (ప్రధాన శాస్త్రవేత్త), కూరగాయల పరిశోధన స్థానం, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్ -500030 సెల్: 6304749921

Read More

ఔషధ మొక్క…. మాచిపత్రి

మాచిపత్రి నేలబారుగా పెరిగే నిటారైన శాఖలు గల బహువార్షిక మొక్క. ఆకులు చామంతి ఆకుల వలే ఉండి, కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. అంచుల నుండి ఈనెల వరకు వివిధ పరిమాణాలలో నొక్కులు కలిగి ఉంటాయి. పూవులు పసుపుఛాయ కలిగి అతి చిన్న ముద్ద వలె ఏర్పడతాయి. దీనిని పిలక మొక్కలు మరియు విత్తనాల ద్వారా వ్యాప్తి చేస్తారు.

సాధారణ నామం : ఇండియన్ వర్మ్‌వుడ్ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా వుల్గారిస్ కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • ఆకులు, వేర్లు ఔషధగుణాలు కలిగి ఉంటాయి.
  • ఆకులలో ఆవిరయ్యే నూనె, సెస్క్యిటెర్పిన్స్, లాక్టోన్స్, ఫ్లేవనాయిడ్స్, కౌమారిన్స్, ట్రైటెర్పిన్ మొదలైన రసాయనాలుంటాయి.
  • మాచిపత్రి వాతం, చర్మవ్యాధులు, కంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.
  • దీనిని వీర్యవృద్ధికి, క్రిమిసంహారిణిగా, కడుపునొప్పి, ఉబ్బసం, నరాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • మహిళలు ఋతుక్రమాన్ని సక్రమంగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఆకలిని వృద్ధి చేయడానికి, మలేరియా నివారణకు కూడా ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో…

  • మాచిపత్రి (ఆర్టెమిసియా జుడైకా) ఎసెన్షియల్ ఆయిల్ అలసంద వీవిల్, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్ పెద్ద పురుగులను అత్యంత సమర్ధవంతంగా కీటకనాశక చర్య ద్వారా నివారించింది (అబ్డఎల్‌హాడి, 2012).
  • మాచిపత్రి (ఆర్టెమిసియా వుల్గారిస్) ఆకు (1500 పిపియం) మరియు పూల (4000 పిపియం) క్రూడ్ ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి 3, 4 వ దశ లార్వాలపై బలమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించాయి. ఆకుల ఎసెన్షియల్ ఆయిల్ దోమకాటుకు అధిక స్థాయిలో రక్షణ కల్పించింది (మాంగ్ మాండ్ మైయ, అతని అనుచరులు, 2016).
  • మాచిపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ట్రైబోలియం కాస్టానియం, రైజోపెర్తా డామినిక, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లను ప్యూమిగెంట్ విష చర్య ద్వారా నివారించింది (షారిఫియాన్, అతని అనుచరులు, 2012).
  • మాచిపత్రి (ఆర్టెమిసియా స్కోపారియా) ఎసెన్షియల్ ఆయిల్ కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్, సైటోఫిలస్ ఒరైజె, ట్రైబోలియం కాస్టానియంలను సమర్ధవంతంగా నివారించింది. ఈ ఫలితాలు సేంద్రియ ఆహార ఉత్పత్తిలో మాచిపత్రి సామర్థ్యాన్ని నిరూపించాయి (నెగాబాన్, అతని అనుచరులు, 2006).
  • మాచిపత్రి కాండం నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ ఈడెస్ ఈజిప్టి లార్వాలను తక్కువ మోతాదులో సమర్ధవంతంగా అరికట్టింది (సుజాత అండ్ రంజిత, 2013).
  • ఆసియా, యూరప్, ఉత్తర అమెరికాలో 500 ఆర్టెమిసియా జాతులున్నాయి. ఆర్టిమిసియా హెర్బాఆల్బా, ఆర్టెమిసియా ఆబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైబోలియం కాస్టానియం, ఒరైజోఫిలస్ సురినానెన్సిస్ పెద్ద పురుగులపై విష చర్యను ప్రదర్శించాయి (జెమా, 2014)
  • ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ ద్రాక్ష పండ్లను ఆశించి కుళ్ళజేసే ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్‌నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ శిలీంద్రాల పెరుగుదలను 100% అరికట్టింది. ఆయిల్ అఫ్లాటాక్సిన్, ఆక్రాటాక్సిన్ ఉత్పత్తి చేసే ఆస్పర్ౙిల్లస్ స్పీసీస్‌ని అరికట్టింది. మైకోటాక్సిన్ స్రవాన్ని పూర్తిగా అరికట్టింది. ఆయిల్‌తో ఫ్యూమిగేట్ చేస్తే 1కి. ద్రాక్ష పండ్లను ఈ శిలీంద్రాల నుండి కాపాడి నిల్వ కాలాన్ని 9 రోజులు పెంచింది (సోంకర్, అతని అనుచరులు, 2015)
  • ఆర్టిమిసియా నీలగిరిక ఎసెన్షియల్ ఆయిల్ రైజోక్టోనియా సొలాని, స్ల్కీరోషియం రాల్ఫ్సి, మాక్రోఫోమినా ఫేసియోలినా వంటి పంట…లో వేరుకుళ్ళు కలిగించే శిలీంద్రాలను అరికట్టింది. ఈ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంలపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది. ఆర్టెమిసియా సీరూలెసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్ ఆస్పర్ౙిల్లస్, ఆల్టర్నేరియా, ఫ్యుజేరియం శిలీంద్రాలను అరికట్టింది (పెట్రెట్టో, అతని అనుచరులు, 2013; స్టాప్పెన్, అతని అనుచరులు, 2014).
  • ఆర్టిమిసియా అబ్సింతియం ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యుజేరియం ఆక్సిస్ఫోరం, ఫ్యుజేరియం సొలాని శిలీంద్రాలపై గణనీయమైన యాంటి ఫంగల్ చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013)
  • అర్టిమిసియా డ్రాకన్‌క్యులస్ ఎసెన్షియల్ ఆయిల్ కొల్లెటోట్రైకం ఫ్రాగేరియే, కొల్లెటోట్రైకం గ్లియోస్పోరియాయిడెస్, కొల్లెటోట్రైకం ఆక్యుటేటంపై శిలీంద్రనాశక చర్యను ప్రదర్శించింది (బెయిలెన్, అతని అనుచరులు, 2013).
  • అర్టెమిసియా జుడైకా ఎసెన్షియల్ ఆయిల్ నుండి వేరు చేసిన ట్రాన్సఇథైల్ సిన్నమేట్, పైపర్‌టోన్‌కన్నా శక్తివంతంగా స్పొడోప్టెరా లిట్టురాలిస్‌ని పూర్తిగా తిండి తినకుండా చేసింది (అబ్డెల్లలీల్, అతని అనుచరులు, 2008).
  • మాచిపత్రి ద్రావణం ట్రైబోలియం కాస్టానియం లార్వాలను అత్యధిక శాతంలో చంపింది. (పుగజ్‌వెండన్, అతని అనుచరులు, 2012).
  • మాచిపత్రి ఆకు మిథనాల్ ద్రావణం క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను వేరు, కాండం ద్రావణాల కన్నా గణనీయంగా అధికంగా చంపాయి (ఇలాహి అండ్ ఉల్లా, 2013)
  • మాచిపత్రి ఆకునీటి ద్రావణం (10%) తేయాకు పంటలో ఎర్రనల్లి కలిగించే నష్టాన్ని తగ్గిస్తుంది (మామున్ అండ్ అహ్మద్, 2011)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

‘లాబ్’ (లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా)తో లాభాలు

మొక్కలకు కావలసిన పోషకాలను సహజంగా అందించడానికి లాక్టిక్ ఆసిడ్ బాసిల్లస్‌ను (లాబ్) ఉపయోగించాలి.
లాక్టిక్ ఆసిడ్ ద్రావణం తయారీ

ఇందులో ఉపయోగించుచున్న పదార్థాలలో సహజంగా ఉండే ఎన్నో రకాల సూక్ష్మజీవుల వలన శిలీంధ్రాలు మరియు వైరస్ తెగుళ్ళ నియంత్రణలో ఈ ద్రావణం బాగా పనిచేస్తుంది.

కావలసిన పదార్థాలు :
బియ్యపు కడుగు : 5 లీటర్లు
ఆవు పాలు : 10 లీటర్లు
బెల్లం : 1 కిలో

తయారు చేసే పద్ధతి :

  • 5 లీటర్ల బియ్యపు కడుగును ఒక కుండలో పోసి, మూతపెట్టి 7 రోజులు నీడలో ఉంచాలి.
  • 7 రోజుల తరువాత పై ద్రావణానికి 10 లీటర్ల ఆవుపాలను కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మూతపెట్టి మరలా 7 రోజులు నీడలో ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి దానికి బెల్లపు పొడిని కలపాలి.
  • మిశ్రమాన్ని కర్రతో బాగా కలియబెట్టాలి.
  • ఈ మిశ్రమాన్ని వడపోసి లీటర్ నీటికి 1 లేదా 2 మి.లీ. ద్రావణాన్ని కలిపి మె°క్కలపై స్ప్రే చేయాలి.

ఉపయోగాలు:

  • ఈ ద్రావణాన్ని అన్ని పంటలలోను, పండ్ల తోటలలోను వాడవచ్చు.
  • పంటకాలంలో 1-2 సార్లు పంటపై పిచికారి చేస్తే సత్ఫలితాలు పొందవచ్చు.
Read More

ఔషధ మొక్క… మోషపత్రి

మోషపత్రి ఒక వార్షిక మొక్క. దీని కాండం నిటారుగా ఉండి గోధుమ రంగు లేదా ఊదా గోధుమ రంగుతో ఉంటుంది. మొక్క నూగు లేకుండా సహజంగా 30 నుండి 100 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 3-5 సెం.మీ. పొడవుండి 2 లేదా 3 చిన్న ఆకులుగా విడిపోతాయి. ఆకులు అధిక సువాసన కలిగి ఉంటాయి. ఎండిన ఆకులలో 0 నుండి 1.5% వరకు ఆర్టెమిసినిన్ రసాయనముంటుంది. పూలు 2-2.5 మి.మీ. వ్యాసంతో వదులుగా ఉన్న కంకులతో ఏర్పడతాయి. వాటి రంగు ఆకుపచ్ౘ్పసుపు రంగులో ఉంటుంది. గింజలు గోధుమ రంగులో 0.6-0.8 మి.మీ. వ్యాసంలో ఉంటాయి. సగటు 1000 గింజల బరువు 0.03 గ్రా.

సాధారణ నామం : స్వీట్ వార్మ్‌వుడ్/స్వీట్ అన్నీ శాస్త్రీయ నామం : ఆర్టెమిసియా యాన్యువా కుటుంబం: ఆస్టరేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మోషపత్రిని సంప్రదాయకంగా మలేరియా అనుబంధ జ్వరాలతో సహా జ్వరాల చికిత్సకుపయోగిస్తారు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. మోషపత్రిలో ఉండే ఆర్టెమిసినిన్ రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది.
  • మోషపత్రి రసంలో ఉండే ఆర్టెమిసినిన్, ఆర్టెసునేట్‌లు క్యాన్సర్ చికిత్సలో అధ్యయనం చేయబడుతున్నాయి. వైరల్, బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ వల్ల వచ్చే జ్వరాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  • ఇవి ముఖ్యంగా డీసెంట్రి, సాధారణ జలుబు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ నివారణలో సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఆకలి లేకపోవడం, ఇతర జీర్ణ సంబంధ సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. సోరియాసిస్, ఎక్ౙిమా వంటి చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • మోషపత్రి ఆకు ద్రావణం అధిక నష్టం కలిగించే లెస్సర్ మల్బరి పైరాలిడ్, గ్లెåఫోడెస్ పైలోయాలిస్ గుడ్లు పొదగడాన్ని అరికట్టింది (రోయాకోస్రలి, అతని అనుచరులు, 2010).
  • మోషపత్రి ఆకు ద్రావణాలు, ఎసెన్షియల్ ఆయిల్స్ పురుగుల నివారణలో అనేక విధాలుగా బలమైన ప్రభావాన్ని చూపాయి. అవి వికర్షక, ఫూమిగెంట్, యాంటిఫీడెంట్, ఎంజైమ్‌ల చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పులు తెచ్చే పురుగులను నివారించాయి (సెండి, కోస్రలి, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ ఫ్యూమిగెంట్ చర్య ద్వారా ఎర్ర చీమలను నివారించాయి (లియాంగ్ టాంగ్, అతని అనుచరులు, 2013)
  • మోషపత్రి ఎసెన్షియల్ మరియు ద్రావణాలు వికర్షక, ఫ్యూమిగెంట్, యాంటీ పీడెంట్ చర్యలు, ఎంజైమ్ చర్యలలో జోక్యం, పురుగు పెరుగుదలలో మార్పు చర్యల ద్వారా పురుగులను సమర్ధవంతంగా నివారించాయి.
  • మోషపత్రి ద్రావణం నిల్వ ధాన్యంలో ఆశించే బీటిల్ ట్రైబోలియం కాస్టానియంని సమర్ధవంతంగా నివారించింది (జులాటి సెండి, అతని అనుచరులు, 2003)
  • మోషపత్రి వేరులోని ఎసెన్షియల్ ఆయిల్ 80% ట్రైబోలియం కాస్టానియం పెద్ద పురుగులను నివారించింది (గోయెల్, అతని అనుచరులు, 2007)
  • మోషపత్రి { మిరప ద్రావణాల మిశ్రమం ప్రత్తి పంటలో గులాబి రంగు కాయతొలుచు పురుగు (పెక్టినోఫొరా గాస్సిపియెల్లా)ను సమర్థవంతంగా నివారించింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగులు ట్రెబోలియం కాస్టానియం, కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌లపై విషపూరిత మరియు వికర్షణ ప్రభావాలను చూపించింది (త్రిపాఠి, అతని అనుచరులు, 2000).
  • మోషపత్రి ద్రావణం (500 పిపియం మరియు 250 పిపియం) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట, రోటివెంక్యులస్ రెనిఫార్మిస్ నెమటోడ్లను నివారించింది (షకీల్, అతని అనుచరులు, 2004).
  • మోషపత్రి ఆల్కహాల్ ద్రావణం (32.69%) మెలాయిడోగైన్ ఇన్‌కాగ్నిట గుడ్లను అత్యంత సమర్థవంతంగా పొదగకుండా చేశాయి (కటారి, అతని అనుచరులు, 2011).
  • మోషపత్రి 15, 10, మరియు 5% మిథనాల్ ద్రావణాలు పొటాటో పొడి కుళ్లు కల్గించే శిలీంద్రం ఫ్యుజేరియం సొలాని పెరుగుదలనరికట్టడం, శిలీంద్ర బీజాలు మొలకెత్తకుండా చేయడంలో అత్యుత్తమ ప్రభావం చూపాయి. మోషపత్రి15% మిథనాల్ ద్రావణం ఆలుగడ్డ దుంపల నిల్వ సమయంలో వేరుకుళ్ళు (డ్రైరూట్ రాట్) తెగులు ఆశించకుండా కాపాడింది (మసౌద్ జాకర్, 2014).
  • మోషపత్రి ద్రావణం క్యూలెక్స్ లార్వాలను నివారించింది (శర్మ, శ్రీవాస్తవ, 1998).
  • మోషపత్రి ద్రావణం కాలీఫ్లవర్ నాశించే డైమండ్ బ్యాక్‌మాత్ ప్లూటెల్లాక్ౙెలోస్టెల్లా గుడ్లను 77.7% చంపింది (రాకేష్‌కుమార్, అతని అనుచరులు, 2009).
  • మోషపత్రి ద్రావణం ప్రత్తి పంటనాశించే గులాబి రంగు కాయతొలుచు పురుగు లార్వాలు, జీవిత చక్రం, జీవిత కాలం, గుడ్లు పెట్టే సామర్థ్యం, గుడ్లు పొదిగే శాతంపై ప్రతికూల ప్రభావం చూపింది (రేడా, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి ఎండుఆకులు కలుపు మొక్క రెడ్‌రూట్ పిగ్ వీడ్‌పై అల్లెలోపతి ప్రభావం చూపాయి. (లైడాన్, అతని అనుచరులు, 1997).
  • మోషపత్రిలో ఉండే అర్టెమిసినస్ అనే రసాయనం స్ట్రెåగా విత్తనాలు మొలకెత్తడాన్ని నివారించింది. కాని చిక్కుడు, మొక్కజొన్న విత్తనాలపై ఎటువంటి దుష్ప్రభావం చూపలేదు (గోమెజ్, 2011).
  • మోషపత్రి ఎసెన్షియల్ ఆయిల్ నిల్వ ధాన్యంలో ఆశించే పురుగు కాల్లసోబ్రూకస్ మాక్యులేటస్‌ని నివారించడానికి ఉపయోగించవచ్చు. (మొటాగి, అతని అనుచరులు, 2014).
  • మోషపత్రి తాజా ఆకులు, ఎండిన పదార్థం నుండి తయారు చేసిన ద్రావణాలు బఠాణి పేనుబంక (ఆక్రితోసైఫం పైసమ్) రెక్కలు లేని ఆడపురుగులు, లార్వాలను చంపాయి. అంతేగాక, ఎండు పదార్థం కొలరాడో బీటిల్ పెద్ద పురుగులు తినడాన్ని అరికట్టాయి. ఎండు పదార్థం ద్రావణాలు (5%, 10%), తాజా ఆకుల ద్రావణం (30%) లీఫ్ బీటిల్ లార్వాల నష్టాన్ని తగ్గించాయి (మిలెనారూసిన్, అతని అనుచరులు, 2016).
  • ఆర్టెమిసియా హెర్బాఆల్పా ఎథిరిక్ ద్రావణం గ్రీన్‌పీచ్ ఎపిడ్, మైజస్ పెర్సికెని 100% నివారించింది (బిలాల్‌నియ, అతని అనుచరులు, 2015)
  • ఆర్టెమిసియా వుల్గారిస్ అద్భుతమైన యాంటిఫీడెంట్ లక్షణాలు కలిగి ఉంది (గురుసుబ్రమణ్యం, అతని అనుచరులు, 2008). ఈ మొక్కను పూత రాక ముందు సేకరించి ఆకులను, కాండాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఒక కిలో కత్తిరించిన ఆకులు, కొమ్మల ముక్కలను ఒక బకెట్‌లో తీసుకుని 10 లీ. నీరు పోసి 16-24 గంటలుంచాలి. తర్వాత ఈ ద్రావణాన్ని వడపోసి తేయాకు పంటనాశించే పురుగుల నివారణకు పిచికారి చేయాలి. 10% ద్రావణం పిచికారి చేసి ఎర్రనల్లిని నివారించవచ్చు.
  • మోషపత్రి అగ్రో మరియు డిస్టిలేషన్ వ్యర్థాలనుపయోగించి తయారు చేసిన వర్మికంపోస్టు టమాట రూట్‌నాట్ నెమటోడ్‌ని సమర్థవంతంగా నివారించింది (పాండె & కల్రా, 2010).
  • ఆర్టెమిసియా స్పీసీస్‌ని టమాట రూట్‌నాట్ నెమటోడ్ యాజమాన్యంలో జీవ సేంద్రియ వ్యర్థంగాను, ఎసెన్షియల్ ఆయిల్ ద్రావణం గాను ఉపయోగిస్తారు (బావ, అతని అనుచరులు, 2014, పాండె, 2005).
  • మెలాయిడోగైన్ ఇన్ కాగ్నిట (నెమటోడ్) యాజమాన్యంలో మోషపత్రి భూమి క్రింది భాగం (వేరువ్యవస్థ) వికర్షక చర్య ప్రదర్శిస్తుంది. మాషపత్రి వోలటైల్ రసాయనాలలో మోనోటెర్పిన్స్, సెస్క్యిటెర్పిన్స్ అధికంగా ఉంటాయి. అందువలన దీనిని \మాటలో అంతర పం\గా వేసి రూట్‌నాట్ నెమటోడ్‌ని నివారించవచ్చు. (సిడ్ని మ్వాంబ, 2016).
  • మోషపత్రి ద్రావణాన్ని ఉపయోగించి పొగాకు పంటనాశించే పేనుబంకను నివారించవచ్చు. ద్రావణం తయారీకి తాజా ఆకులను సేకరించి, నీడలో ఆరబెట్టి, ఆల్కహాల్‌లో రాత్రంతా నానబెట్టాలి. ఈ ద్రావణం పొగాకు పేనుబంకను సమర్ధవంతంగా చంపుతుంది. పొగాకు మొగ్గతొలిచే పురుగుని ఇథనాల్ ద్రావణం సమర్ధవంతంగా నివారిస్తుంది.
  • మోషపత్రి మిథనాల్ ద్రావణం లెస్సర్ మల్బరి పై రాలిడ్ (గ్లెåసోడెస్ పైలాలిస్)ని పంటనాశించకుండా ఆటంక పరచింది (రోయాకోసార్వి, అతని అనుచరులు, 2010).
  • ప్రత్తి మరియు ఇతర ముఖ్య పంటలనాశించే శనగపచ్చ పురుగు (హెలివకోర్సా ఆర్మిజెరా) నివారణకు మాషపత్రి ఎసెన్షియల్ ఆయిల్‌ని సిఫారసు చేశారు (మహ్‌బేబ్‌కర్, అతని అనుచరులు, 2015).
  • మోషపత్రి ఎసెన్షియర్ ఆయిల్ మరియు ఆకు ద్రావణాలను హెలికోవర్మా ఆర్మిజరాలార్వాల ఆహారంలో కలిపితే లార్వాల బరువు 69.71% మరియు 60.21% తగ్గింది (నీలిమ అన్షుల్, ఆమె అనుచరులు, 2014)
  • గుమ్మడి నారు మొక్కలలో పురుగుల నివారణకు మాషపత్రి ద్రావణం పురుగులను తట్టుకునే చర్య కలిగి ఉంది (యుయు, 2017)
  • మాషపత్రి ఆకులు, కాండం, పూల నుండి తయారు చేసిన ద్రావణాన్ని గుమ్మడి ఆకు కణాలపై ఒక చదరపు సెంటీమీటరుకి 1.5 మి.గ్రా. చొప్పున పిచికారి చేస్తే 100% ఎపిలాక్నా పీన్సులేటా లార్వాలు 87% స్పోడోప్టెరా ఎరిడానియా లార్వాలు తినకుండా ఆటంక పరచబడ్డాయి (డిటర్రెంట్ చర్య). (మాగి, ఆమె అనుచరులు, 2005)
  • మోషపత్రి ద్రావణం పొటాటో సిస్ట్ నెమటోడ్ (గ్లోబోడెరా రోస్టోకైనెన్సిస్) చిన్న పురుగులను అతి సమర్ధవంతంగా నివారించింది. కాని మెలాయి డోగైన్ ఇన్‌కాగ్నిట చిన్న పురుగులు (జువైనైల్స్) ఎక్కువ కాలం బయలుపరిచితేనే చనిపోయాయి. దీనికి విరుద్ధంగా ఈ ద్రావణం ప్రభావం మెలాయిడోగైన్ గుడ్లు పొదగడాన్ని అత్యంత సమర్ధవంతంగా నివారించింది కాని గ్లోబొడెరాపై అత్యంత తక్కువ ప్రభావం చూపింది. సేంద్రియ వ్యవసాయంలో సుస్థిర నులిపురుగుల యాజమాన్యంలో మోషపత్రి ద్రావణం ముఖ్య పాత్రపోషిస్తుంది. (అడ్డాబ్బో, అతని అనుచరులు, 2013)
  • 15% మోషపత్రి ద్రావణం బంగాళాదుంపలలో ఫ్యుజేరియం సొలాని కలిగించే పొడి వేరుకుళ్ళుని సమర్ధవంతంగా నివారించింది (మసాద్‌జాకర్, 2014).
  • టెట్రానికస్ సిన్నబారినస్ (నల్లి)ని మోషపత్రి 5 మి.గ్రా./మి.లీ. అసిటోన్ ద్రావణం 100% నివారించింది (జాంగ్‌యోంగ్ క్వియాంగ్, అతని అనుచరులు, 2008).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

పంట వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చే ట్రైకోడెర్మా విరిడె ద్రావణం

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని రైతులే సులభంగా తయారు చేసుకునే పద్ధతిని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని 100 మి.లీ. సీసాల్లో నింపి వ్యవసాయ కార్యాలయాల ద్వారా రైతులందరికీ రూ. 20 కి. అందించనున్నారు. ఈ ఒక్కసీసా రూ. 40 వేల విలువైన 200కి. ట్రైకోడెర్మా విరిడె పొడితో సమానంగా పనిచేస్తుంది.

తయారీకి కావలసిన పదార్థాలు :

  • 200 లీ. నీరు పట్టే ప్లాస్టిక్ డ్రమ్ లేదా సిమెంటు తొట్టి
  • 200 లీ. నీరు * 2 కి. బెల్లం
  • ట్రైకోడెర్మా విరిడె కల్చర్ (చిక్కని ద్రావణం) – 100 మి.లీ. సీసా

తయారీ పద్ధతి : నీడలో ఉంచిన డ్రమ్ములో 200 లీ. నీరు పోయాలి. 2 కిలోల బెల్లాన్ని పొడి చేసి నీటిలో వేసి కలిసేలా త్రిప్పాలి. సీసాలోని ట్రైకోడెర్మా విరిడె చిక్కని ద్రావణాన్ని బెల్లం కలిపిన నీటిలో పోసి కలియత్రిప్పాలి. డ్రమ్ముపైన మూత ఉంచాలి. ఉదయం, సాయంత్రం కర్రతో ఒక నిమిషం కలియత్రిప్పాలి. దీనిలో ట్రైకోడెర్మా విరిడె శిలీంద్రం విపరీతంగా పెరుగుతుంది. 4, 5 రోజులకు ద్రావణం వాడటానికి సిద్ధమౌతుంది.

ప్రతిసారి కొత్త సీసాలను కొనవలసిన అవసరం లేదు. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కలిపాక అందులో నుంచి 2 లీటర్ల ద్రావణాన్ని తీసి ప్రక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ద్రావణం తయారు చేసుకునేటపుడు 2 కిలోల బెల్లంతో పాటు 200 లీటర్ల నీటిలో కలిపితే రెండు రోజుల్లో మళ్ళీ సిద్ధమౌతుంది. బెల్లం రంగులో వుండే నీరు 2 రోజులకు తెల్లగా మారుతుంది. ఈ ద్రావణం రెండేళ్ళు నిల్వ ఉంటుంది. వెంటనే ప్రభావం చూపుతుంది. తయారు చేసుకున్న 5 లీటర్ల ద్రావణాన్ని ఒక క్యాన్‌లో పోసి మూత పెట్టుకోవాలి. 200 లీ. నీటిలో 2 కిలోల బెల్లంతోపాటు ఈ 5 లీటర్ల ద్రావణం కలపాలి. రెండురోజుల్లో మళ్ళీ వాడుకోవచ్చు. 15 రోజులకొకసారి పిచికారి, నెలకోసారి సాగునీరు లేదా డ్రిప్ ద్వారా ఇవ్వాలి.

ప్రయోజనాలు : విత్తనశుద్ధి : విత్తుకునే అరగంట ముందు విత్తనాలను ట్రైకోడెర్మా విరిడె ద్రావణంలో ముంచి తీయాలి. నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళడానికి : ఈ ద్రావణాన్ని పిచికారి చేస్తే పంట కోత తర్వాత మిగిలే మోళ్ళు, గడ్డి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది.

కంపోస్టు తయారీలో : చెట్ల నీడలో ప్లాస్టిక్ షీట్ పరచి దానిపై పంట వ్యర్థాలను పొరలా వేయాలి. 10 లీ. ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని పిచికారి చేయాలి. ఇలా 4Ð7 పొరల వరకు వేసుకుంటూ ద్రావణాన్ని పిచికారి చేయాలి. ప్రతి 7 రోజులకోసారి కంపోస్టుని తిరగెయ్యాలి. 60 శాతం తేమ ఉండేలా చూడాలి. 40 రోజులకు కంపోస్టు సిద్ధమౌతుంది.

ట్రైకోడెర్మా విరిడె ద్రావణాన్ని కర్ణాటక, కేరళ రాష్ట్రాల సేంద్రియ రైతులు పంటలు, తోటల్లో వాడుతున్నారు. దీనిని 1:1 నిష్పత్తిలో కలిపి 15 రోజులకోసారి ఎకరా పంటపై పిచికారి చేయాలి. పంటకు నెలకోసారి కాలువల ద్వారా సాగు నీటితో కలిపి పారించాలి లేదా డ్రిప్ / స్ప్రింక్లర్ ద్వారా ఇవ్వవచ్చు. జీవామృతం ఇచ్చిన రోజునే ఈ ద్రావణాన్ని యిచ్చినా ఫర్వాలేదు. కానీ వేర్వేరుగా ఇవ్వాలి. భూమిలో నివసించే శిలీంద్రాల ద్వారా కలిగే మాగుడు తెగులు, వేరుకుళ్లు, ఎండు తెగుళ్లను సమర్దవంతంగా అరికడుతుంది.
Read More

ఔషధ మొక్క… నల్లఈశ్వరి

సాధా రణ నామం: సర్పెంట్‌రూట్ ప్లాంట్
శాస్త్రీయ నామం: అరిస్టొలోకియా ఇండిక
కుటుంబం: అరిస్టోలోకియేసి

నల్లఈశ్వరి 5-6 మీ. ఎత్తు పెరిగే బహువార్షిక తీగ. ఆకులు కణుపుకి ఒకటి చొప్పున ఏర్పడతాయి. ఇవి తమలపాకు వాసన కలిగి దాదాపు దీర్ఘచతురస్రాకారంలో చివరి భాగంలో కొంచెం వెడల్పుగా, సూది లాంటి కొనగలిగి ఉంటాయి. పూవుల ఆకర్షణ పత్రావళి ఆకుపచ్చ ఛాయ గల వంగపండు రంగుతో చిన్న ఈగల వంటి కీటకాలు లోపలికి వెళితే బయటకు రావడానికి వీలు లేకుండా నూగు అమర్ౘ్బడిన గొట్టం లాంటి బోను వలే ఉంటుంది. కాయలు గుండ్రంగా ఉండి బద్ధలైతే ఉట్టి (తిరగబడిన గొడుగు) ఆకారంలో ఉంటాయి. దీనిని విత్తనాల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • మొక్కలోని అన్ని భాగాలు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. దీనిలో అరిస్టొలోకిక్ ఆమ్లాలు, ఆవిరయ్యే నూనె, టానిన్లు ఉంటాయి.
  • దీనిని పాము, పురుగుల కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు.
  • జ్వరం, గాయాలు, గుండెజబ్బులు, బొల్లి, కుష్టు, చర్మవ్యాధులు, మూర్ఛ, మానసిక వ్యాధుల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
  • దీని కషాయాన్ని వ్రణములు, ఉబ్బసం, బ్రాంకైటిస్ వ్యాదులను నయం చేయడానికి ఉపయోగిస్తారు.

వ్యవసాయరంగంలో …

  • నల్లఈశ్వరి మిథనాల్ ద్రావణాలు క్యూలెక్స్ జెలిడస్, క్యూలెక్స్ క్వింక్విఫేసియేటస్ లార్వాలను అత్యధికంగా చంపాయి. (కామరాజ్, అతని అనుచరులు, 2010).
  • అరస్టొలోకియా ఆకు ఇథైల్ ఎసిటేట్ ద్రావణం (5%) స్పోడోప్టెరా లిటూరపై అధిక యాంటిఫీడెంట్ చర్య (56.06%), తినడాన్ని అరికట్టడానికి లీథల్ కాన్‌సెంట్రేషన్ (3.69%), లార్విసైడల్ (40.66%), పూపిసైడల్ (28%), మొత్తం చావు (68.66%), పొడిగించబడిన లార్వల్ ప్యూపల్ సమయం (12.04 -13.08 రోజులు) నమోదు చేసింది (బాస్కర్, అతని అనుచరులు, 2011).
  • అరిస్టొలోకియా బీటికా మిథనాల్ ద్రావణం ట్రైబోలియం కాస్టానియంపై మంచి కీటకనాశక చర్యను ప్రదర్శించింది (జ్బిలో, అతని అనుచరులు, 2006).
  • అరిస్టొలోకియా బ్రాక్టియోలేట కాయల హెక్సేన్ ద్రావణం (5%) జొన్నగింజల నిల్వ సమయంలో ఆశించే ఖాప్రాబీటిల్, ట్రోగోడెర్మా గ్రానేరియం నుండి గింజలను కాపాడాయి (ఎలామిన్ అండ్ సత్తి, 2012).
  • నల్ల ఈశ్వరి మిథనాలిన్ ద్రావణంలో అరిస్టొలోకిక్ యాసిడ్, అరిస్టోలోకిక్ యాసిడ్ అనే రెండు మిశ్రమాలున్నాయి. అరిస్టోలోకిన్ యాసిడ్ అనోఫెలెస్ స్టెఫెన్సి లార్వాలపై అరిస్టాలోకిక్ యాసిడ్ కన్నా అధిక విషచర్యను ప్రదర్శించింది (ప్రదీప్ వెంకటరామన్, ఆమె అనుచరులు, 2015).
  • అరిస్టొలోకియా ఎలిగాన్స్, అరిస్టొలోకియా టగల ఆకుల ద్రావణాలు క్యాబేజి పంట నాశించే డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టిల్లాపై యాంటి ఫీడెంట్ చర్యను ప్రదర్శించాయి (కాస్సి, 1983).
  • నల్లఈశ్వరి ఆకుల క్రూడ్ ద్రావణం మరియు ఆకుల నీటి ద్రావణం నుండి సంకలనం చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ హెలికోవర్పా ఆర్మిజరా 3వ దశ లార్వాలపై గరిష్ట యాంటిఫీడెంట్ మరియు లార్విసైడల్ చర్యలను ప్రదర్శించాయి. (శివ అండ్ సంతోష్ కుమార్, 2015).అరిస్టొలోకియా టగల యాంటిఫీడెంట్ లక్షణాలు నమోదు చేయబడ్డాయి. (కాస్సి, 1983).
  • అరిస్టొలోకియా టగల డైమండ్ బ్యాక్‌మాత్, ప్లుటెల్లా క్ౙెåలోస్టెల్లాపై కీటకనాశక లక్షణాలను చూపాయి (మొరాల్లోరెసెసస్, 1985).
  • అరిస్టొలోకియా టగల స్పోడోప్టెరా లిటూరపై వికర్షక, యాంటిఫీడెంట్ చర్యలను ప్రదర్శించింది. లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల దశలపై ఈ ప్రభావాలు ప్రస్పుటంగా కనిపించాయి. (లిట్ అండ్ రెజెసస్, 1990).
  • ఈ మొక్క క్రూడ్ ద్రావణం ఆసియాటిక్ మొక్కజొన్న కాండంతొలుచు పురుగు, ఆస్ట్రినియా ఫర్నకాలిసీని నివారించింది (లిట్ అండ్ రెజెసస్, 1989).
  • ఈ మొక్క ద్రావణం డైమండ్ బ్యాక్ మాత్, ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లాపై విష చర్యను ప్రదర్శించింది (లిట్ అండ్ రెజెసస్, 1999)
  • ఈ మొక్క ఆకుల 5% ఇథైల్ అసిటేట్ ద్రావణం యాంటిఫీడెంట్, ఫీడింగ్ డిటరెంట్, లార్విసైడల్, ప్యూపిసైడల్, పూర్తిచావు, లార్వల్‌ప్యూపల్ సమయం పొడిగించబడటం వంటి చర్యలను ప్రదర్శించింది (భాస్కర్, అతని అనుచరులు, 2011)
  • నల్లఈశ్వరి ఆకుల ఆల్కహాల్ ద్రావణం (5%) 100% ప్రొడీనియాలిటూర, 3% ఆకుల ద్రావణం 100% యూప్రోక్టిస్ ఫ్రటర్నా; 3% ఆకులు, కాండాలు, లేదా కాయల ద్రావణం, 20% ఆకులు, కాండాల పొడి ద్రావణం 48% మామిడి తేనె మంచు పురుగు (హాపర్) పిల్ల పురుగులను చంపాయి. (పుట్ట రుద్రయ్య అండ్ సుబ్రమణ్యం, 1955Ð1956)
  • ఈశ్వరి వేరు ద్రావణం స్పోడోప్టెరా లిటూరపై గుడ్డు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది (అరివోలి అండ్ టెన్నిసస్, 2013).
  • ఈస్టర్న్ ఘాట్స్‌లోని ఎత్నిక్ కమ్యూనిటీలు నల్లఈశ్వరి ఆకుల ద్రావణాన్ని పురుగుల నివారణలో ఉపయోగించేవారు (శివరాజ్, అతని అనుచరులు, 2017).
  • అరిస్టొలోకియా బ్రాక్టియేట కంకిపొడిని వేరుశనగ పిండితో కలిపి తయారు చేసిన మిశ్రమాన్ని ఎలుకల బొరియల దగ్గర ఉంచి ఎలుకలను నివారించవచ్చు (పటేల్, గుప్తా, అతని అనుచరులు, 1991).
  • పురుగుల యాజమాన్యానికి నల్లఈశ్వరి సిల్వర్ నానోపార్టికల్స్‌ని సిఫారసు చేశారు (యశుర్ అండ్ రాణి, 2015).
  • అరిస్టొలోకియా రింజెస్ వేరు పదార్థం వేర్‌హౌస్‌మాత్, ఎఫెస్టియా కౌటెల్లా పెద్ద పురుగులను సమర్ధవంతంగా నివారించింది (ఐన్, అతని అనుచరులు, 2013).
  • నల్లఈశ్వరి ఆకుల నీటి ద్రావణం వరి పంటలో కాండం కుళ్ళు కలిగించే శిలీంద్రం, స్ల్కీరోషియం ఒరైజె పెరుగుదలనరికట్టింది (వెంకటేశ్వర్లు, అతని అనుచరులు, 2013). నేలవేము, జిల్లేడు, యూకలిప్టస్ 2% ఆకుల ద్రావణం రసాయన శిలీంద్రనాశనుల కన్నా అధిక సమర్ధవంతంగా కాండం కుళ్ళు తెగులును నివారించింది.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

మొక్క వేర్ల పెరుగుదలను పెంచే ట్రైకోడెర్మా, సూడోమోనాస్

సహజ జీవ నియంత్రణ కారకాలుగా, జీవ ఎరువులుగా వీటిని ఉపయోగిస్తారు. వీటిని నేల ద్వారా వ్యాపించే శిలీంధ్ర వ్యాధికారకాలను అణచివేయటానికి, వేర్ల పెరుగుదలను మెరుగుపరచటానికి, పంట దిగుబడులను పెంచడానికి, నేలలోని పోషకాలను కరిగించడానికి ఉపయోగిస్తారు.

తయారీకి కావలసిన పదార్థాలు : ట్రైకోడెర్మావిరిడె మదర్ కల్చర్, సూడోమోనాస్ మదర్‌కల్చర్, బెల్లం – 20 గ్రా.; ఈస్టు – 5 గ్రా.; ప్రెజర్‌కుక్కర్ – 10 లేదా 15 లీటర్లది; స్టీలు డబ్బాలు మూతగలవి; స్పిరిట్ లేదా డెటాల్, గ్యాస్ స్టవ్, ప్లాస్టిక్ బాటిల్స్ – 1 లేదా 2 లీటర్లవి.

తయారీ విధానం : ప్రెజర్‌కుక్కర్‌లో శుభ్రపరచిన స్టీలు డబ్బాని పెట్టి డబ్బా చుట్టూ అంగుళం మేర ఖాళీ ఉండునట్లు చూడాలి. ఈ స్టీలు డబ్బాలు 4 లేదా 8 లేదా 12 లీటర్ల పరిమాణంలో ఉండాలి. ఎంపిక చేసుకున్న కుక్కర్ పరిమాణాన్ని బట్టి డబ్బాల ఎంపిక ఉండాలి. ఎంపిక చేసుకున్న స్టీలు డబ్బాలో సూచించిన పరిమాణంలో నీరు, బెల్లం, ఈస్టు తీసుకోవాలి. నాలుగు లీటర్ల నీరు తీసుకున్నట్లయితే 80 గ్రా. బెల్లం, 20 గ్రా. ఈస్టు కలపాలి. డబ్బా మూతని బిగుతుగా బిగించి పెట్టాలి. కుక్కర్‌లో కూడా నీరు పోసి, మూత పెట్టి పైన విజిల్ పెట్టి స్టవ్ మీద వేడి చేయాలి. మొదటి విజిల్ సుమారు గంట తర్వాత వస్తుంది. తొలి విజల్ వచ్చిన మరో 40 నిమిషాలపాటు వేడి చేయాలి. బెల్లం నీరు మరిగి సూక్ష్మజీవుల రహితంగా మారుతుంది. స్టవ్ ఆపివేసి కుక్కర్‌ని దించి గది వాతావరణంలో చల్లబడిన తర్వాత స్టీల్ డబ్బాలోని బెల్లం ద్రావణాన్ని సీసాల్లో మూడవ వంతు వరకు నింపి దూదితో చేసిన ప్లగ్‌లు (బిరడాలు) పెట్టాలి. మార్కర్‌తో సూడోమోనాస్, ట్రైకోడెర్మావిరిడె వంటి లేబిల్స్‌ని సిద్ధం చేసుకోవాలి. సీసాలకు లేబిల్స్ అతికించిన తర్వాత ఆయా సీసాల్లో ఆయా శిలీంద్రం, బాక్టీరియా మదర్ కల్చర్ని ఒక చెంచా చొప్పున కలిపి బిరడా పెట్టుకోవాలి. ఒక వారం రోజుల వరకు ప్రతి రోజు సీసాలను ఊపుకోవాలి.

వాటి మదర్ కల్చర్లను  వ్యవసాయ పరిశోధనా స్థానాల నుండి పొందవచ్చు. ఒకసారి మదర్ కల్చర్ని సేకరించుకుంటే దాన్ని పునరుత్పత్తి చేసుకోవచ్చు. ఒకసారి తయారు చేసుకున్న తర్వాత 6 నెలల వరకు ఇవి నిల్వ ఉంటాయి.
Read More

ఔషధ మొక్క… సీతాఫలం

సాధారణ నామం : కస్టర్డ్ యాపిల్ శాస్త్రీయ నామం : అనోనా స్క్వామోసా కుటుంబం: అనోనేసి

సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చు. సీతాఫలం పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6, రాగి, పీచుపదార్థం, తక్కువ కొవ్వు కలిగి ఉండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను సమకూరుస్తాయి. సీతాఫలం ఆకులు, గింజలు మరియు ఇతర భాగాల్లో ‘అనోనైన’ అనే పదార్థం ఉండటం వలన చేదు గుణం కలిగి ఉంటుంది. అందుకే సీతాఫలం ఆకులను పశువులు, మేకలు తినవు. ఆకులు, గింజల నుండి తీసిన రసంలో కీటకనాశిని లక్షణాలున్నాయి.

ఉపయోగాలు : పురుగుల నివారణలో ఉపయోగించు సీతాఫలం ఆకులు, గింజలు, గింజల నూనె కషాయాలు

  • సీతాఫలం ఆకు కషాయం : 500 గ్రా. సీతాఫలం ఆకులను 2 లీ. నీటిలో ఉడికించాలి. ఒక లీటరు ద్రావణం మిగిలే వరకు ఉడికించాలి. ఈ ద్రావణాన్ని వడపోసి 10 15 లీ. నీటిలో కలిపి పురుగులు సోకిన మొక్కలు బాగా తడిచేటట్లు పిచికారి చేసి పేనుబంక, సుడిదోమ, గొంగళిపురుగులు, డైమండ్ బ్యాక్ మాత్, పచ్చదోమ, పచ్ౘ్నల్లి పురుగులను నివారించవచ్చు.
  • వివిధ ఆకుల కషాయం : వేపాకు1 కి., కానుగ 1 కి., బిల్వం 1కి., విషముష్టి 1/2 కి., వావిలాకు 1 కి., తంగేడు 1 కి., సీతాఫలం 1/2 కి., పిచ్చి తులసి 1 కి., పుదీనా 1/2 కి., పాలకొడిస 1/2కి., కొత్తిమీర 1/2కి., నేరేడు 1 కి., నేలవేము 1/2 కి., యూకలిప్టస్ 1 కి., అత్తాకోడలు ఆకు 1 కి., ఈ ఆకులలో ఏవైనా 5 రకాల ఆకులను పైన చెప్పిన మోతాదులో తీసుకుని 10 లీ. నీటిలో అరగంట సేపు బాగా ఉడికించి, ఉడుకుతున్న ఈ ద్రావణాన్ని కర్రతో మధ్య మధ్య కలుపుతూ, కషాయాన్ని బాగా చల్లార్చి పలుచని గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రా. సబ్బుపొడి లేదా 500 గ్రా. కుంకుడు రసం కలిపి, ఈ ద్రావణానికి 100 లీ. నీటిని చేర్చి సాయంత్రం వేళ పంటపై పిచికారి చేయాలి.
  • ఈ కషాయం అనేక పంటలనాశించే రసం పీల్చే పురుగులు, పెద్ద దశలోనున్న లద్దె పురుగులు, శనగపచ్చ పురుగులు, ఆకులనుతినే గొంగళిపురుగులపై బాగా పనిచేస్తుంది.
  • దశపర్ణి కషాయం : వేప ఆకులు 5కి., నల్లేరు ఆకులు 2కి., అరిస్టాలోకియా ఆకులు 2కి., బొప్పాయి ఆకులు 2కి., సీతాఫలం ఆకులు 2 కి., కానుగ ఆకులు 2 కి., ఆముదం ఆకులు 2 కి., గన్నేరు ఆకులు 2 కి., జిల్లేడు ఆకులు 2 కి., టైనోస్పోరా కార్డిఫోలియా ఆకులు 2 కి., పచ్చి మిరప కాయల పేస్టు 2 కి., వెల్లుల్లి పేస్టు 2కి., ఆవుపేడ 3 కి., ఆవు మూత్రం 5 లీ.
  • వీటినన్నింటినీ నూరి 200 లీ. నీటిలో కలిపి ఒక నెల రోజులు పులియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి మూడుసార్లు కలియతిప్పాలి. నెల రోజుల తర్వాత వడపోయాలి. ఈ కషాయాన్ని 6 నెలల వరకు నిల్వ చేయవచ్చు. ఈ కషాయాన్ని ఒక ఎకరం పొలంలో ఫాగింగ్ మెషిన్‌తో చల్లి తామర పురుగులు, ఆకుముడత పురుగు, లీఫ్ హాపర్స్‌ని నివారించవచ్చు.
  • సీతాఫలం విత్తన నూనె కషాయం : పచ్చి కాయల నుండి గింజలను తీసి గ్రైండర్‌లో వేసి నూనె తీయాలి. ఒక భాగం నూనెని 20 భాగాల నీటిలో కలిపి డైమండ్ బ్యాక్‌మాత్ ఆశించిన పంటపై పిచికారి చేయాలి.

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

కుళ్ళిన పండ్లు లేక కూరగాయల మిశ్రమ ద్రావణం

ఈ మిశ్రమం సూక్ష్మక్రిములకు, వానపాములకు ఆహారంగా ఉపయోగపడి మొక్క ఆరోగ్యంగా పెరుగుటకు దోహదపడుతుంది.

మోతాదు : ఎకరానికి 50 లీటర్లు

కావలసిన పదార్థాలు : ఆవుపేడ : 25 కిలోలు; నీరు : 50 లీటర్లు; కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలు : 20 కిలోలు.

తయారు చేయు విధానం: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో నీరు, ఆవుపేడ కలిపి నాలుగు రోజులు మురగబెట్టాలి. కుళ్ళిన పండ్లు లేదా కూరగాయలను ఒక డ్రమ్ములో వేసి మూతబెడితే 4 రోజులలో కుళ్ళిపోతాయి. వీటిని అదే రోజున మెత్తగా పిసికి, ఆవుపేడ, నీళ్ళు కలిపిన డ్రమ్ములో వేసి కలియ పెట్టాలి. ఆపైన మూత వదులుగా పెట్టి, మరుసటి రోజున ఈ మిశ్రమాన్ని కర్రతో కలిపి డ్రమ్ముపై మూతపెట్టాలి. 10 రోజులలో మిశ్రమం తయారవుతుంది. 11వ రోజున ఈ మిశ్రమాన్ని వడబోసి, సుమారు 50 లీటర్లు ఒక ఎకరం పొలంలో నీటిద్వారా గాని, లేదా కళ్ళాపిలా గాని నేలపై చల్లాలి.

Read More