ప్రకృతి సేద్య రైతులకు ప్రయోజనం కలుగుతుంది

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయన ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్‌పామ్ తదితర పంటల కొనుగోళ్లపై సమీక్షించారు. విత్తన సరఫరా కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని.. పంటలకు ముందే నీరు విడుదల చేస్తున్న దృష్ట్యా విత్తనాలను వేగంగా పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ అదికారులను చంద్రబాబు ఆదేశించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులతో సాగు చేయించాలి. ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ ద్వారా మంచి ధరలు దక్కేలా చూడాలి. ప్రకృతి సేద్య విధానంలో పంటల్ని సాగు చేస్తే రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. ‘సేంద్రియ సాగుకు కంపోస్ట్ ఎరువును సరఫరా చేసేలా చూడాలి. మొక్కజొన్న సహా ఇతర పంటల ద్వారా ఇథనాల్ తయారీకి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలి. మామిడిని ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసేలా చూడాలి. తక్కువ యూరియా వినియోగానికి ప్రోత్సాహకాలను అందించే విషయమై కేంద్రంతో మాట్లాడాలి’ అని సూచించారు. సీజన్ కంటే ముందే చేప పిల్లల్ని సరఫరా చేయాలని చెప్పారు. అరటి, ఆయిల్‌పామ్, మిర్చి, కోకో తదితర పంటలకు మంచి ధర లభిస్తోందని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

Read More

నేల ఆరోగ్య పరిరక్షణకి ఉద్యానవన పంటల సాగు

నేల ఆరోగ్యం ఉద్యాన పంటల ద్వారానే పరిరక్షించబడుతుంది. కాబట్టి తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యానవన పంటలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయ వీసీ దండా రాజిరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉద్యాన కళాశాలలో ‘నేల ఆరోగ్య పరిరక్షణ- ప్రకృతి వ్యవసాయం’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మృత్తిక శాస్త్రవేత్త, ఐకార్ ప్రదర్శన శాస్త్రవేత్త బ్రజేంద్ర పర్మార్ ఇతర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More

ప్రకృతి వ్యవసాయ రైతులకు గుర్తింపు కార్డులు

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో భాగంగా తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన రైతులకు గుర్తింపు కార్డులు, ఇతర వస్తువులతో ఉన్న కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 489 ప్రకృతి వ్యవసాయ సమూహాల్లో ప్రతి క్లస్టర్‌కు 125 మంది చొప్పున, మొత్తం 61,125 మంది రైతులకు ఈ కిట్లను అందజేస్తారు. ఇందులో గుర్తింపు కార్డు, క్లాత్ బ్యాగ్, క్షేత్రదర్శిని డైరీ, చిన్న ప్యాకెట్ డైరీ, ప్రత్యేక క్యాలెండర్, టోపీ, పెన్ను ఉంటాయి. జిల్లాల్లోని రైతు వేదికలలో స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులకు కిట్లను పంపిణీ చేస్తారు. తర్వాత జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే ప్రతీ క్టసర్‌కు ఇద్దరు చొప్పున కృషి సఖిలను ఇందుకోసం ఎంపిక చేశారు. వీరి ద్వారా సేంద్రియ సాగు పద్ధతుల పై అవగాహన కల్పిస్తారు.

Read More

రసాయన రహిత సహజ సాగు ప్రాజెక్టును తెలంగాణాలో ప్రారంభించాం

కూరగాయలు, పండ్లు, పూలు, ఆయిల్‌పామ్ తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచుతామని, తెలంగాణా రాష్ట్రంలో సహజ సాగును పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ తెలిపారు. వ్యవసాయ వర్సిటీలో సోమవారం మెగా రైతుమేళాకు ఆయన హాజరై ప్రసంగించారు. ‘రసాయన రహితంగా ఉండే సహజ సాగు ప్రాజెక్టును రాష్ట్రంలో ప్రారంభించాం. రైతులకు శిక్షణ ఇచ్చి మరింత మంది దీన్ని అనుసరించేలా కార్యక్రమాలు చేపడతాం. మే 4-9వ తేదీ మధ్య గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన 12 అంశాలపై అవగాహన కల్పిస్తాం’ అని తెలిపారు.

Read More

రసాయన రహిత మొక్కల పెరుగుదలకు పరిశోధనలు జరగాలి

హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని జాతీయ మొక్కల ఆరోగ్య నిర్వహణ సంస్థ (ఎన్ఎస్ఐపీ హెచ్ఎం) ఆధ్వర్యంలో ‘స్థిర వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి మొక్కల ఆరోగ్య నిర్వహణలో ఆవిష్కరణలు’ అనే అంశంపై జాతీయ సదస్సు గురువారం ప్రారంభమయింది. ఎన్ఐపీ హెచ్ఎం డైరెక్టర్ జనరల్ సాగర్ హనుమాన్ సింగ్, ఐకార్ ఏడీజీ పూనం జస్రోరియా, సలహాదారు జేపీ సింగ్, మాజీ వీసీ ఎన్.పురి, మొక్కల సంరక్షణ సంస్థ అధ్యక్షుడు శరత్ బాబు, ఎంటమాలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎకలాజికల్ సొసైటీ, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీర్స్, ఇండియన్ ఫైటోపాథాలజికల్ సొసైటీల శాస్త్రవేత్తలు, అధికారులు, అగ్రి-టెక్ ఆవిష్కర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్సింగ్, ఇతర అధికారులు, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రసాయనాల వాడకం వల్ల వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఇది మొక్కల సహజ ఎదుగుదలను దెబ్బతీస్తోందని, పంట ఉత్పత్తుల ఎగుమతులకు విఘాతం కలుగుతోందని తెలిపారు. సహజ విధానాల్లో సాగు ద్వారా ఈ సమస్యలను పరిష్కరించవచ్చని, రసాయన రహిత మొక్కల పెరుగుదల కోసం విస్తృత పరిశోధనలు జరగాలని అన్నారు. అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు రావాలని.. ఇందుకు శాస్త్రవేత్తలు, విద్యార్థులు ఒక తాటిపైకి రావాలన్నారు. సహజ విధానాల్లో సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వాలని, జీవ ఎరువులు అందుబాటులోకి తేవాలని, మొక్కల ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

Read More

రైతుకు మేలు చేసే గొల్లభామ

పురుగు మందుల వాడకం పెరగడం వల్ల అంతరించిపోతన్న గొల్లభామ (మిడత) అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కనిపించింది. దీని శాస్త్రీయనామం మాంటెడ అని.. దాని ముందరి కాళ్లు ప్రార్థన చేస్తున్నట్లు ఉండటంతో ‘ప్రేయింగ్ మాంటిస’ అని పిలుస్తారని అనకాపల్లి వ్యవసాయ సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు. పంటలకు చీడపీడలు కలిగించే పురుగులను తినడం ద్వారా పరోక్షంగా అన్నదాతలకు సాయపడతాయన్నారు. గొల్లభామలు సాధారణంగా పచ్ౘ్రంగులో ఉంటాయని, ఇవి మాత్రం పరిసరాలు ఎలా ఉంటే ఆ రంగులో కలిసిపోతాయన్నారు.

Read More

పురుగు మందుల నాణ్యతా ప్రమాణాలకు ప్రాధాన్యం

మనదేశంలో పురుగు మందులు వినియోగిస్తే కొన్నిసార్లు పురుగులు కాకుండా పంటలు నాశనమవడం, తెగుళ్లపై ఎలాంటి ప్రభావం కనిపించకపోవడం, రైతులు మరణించడం, పర్యావరణానికి తీవ్ర హాని జరగడం సర్వసాధారణంగా మారింది. మరోవైపు ఈ విపరిణామాల బాధ్యులు చట్టం నుంచి సులువుగా తప్పించుకుం టున్నారు. ఈ ధోరణిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం నాణ్యతకు, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… వాటిని ఉల్లంఘించిన వారికి రూ. అర కోటి జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ నూతన పురుగు మందుల నిర్వహణ (పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్) చట్టం తెస్తోంది. ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు తెలపాలంటూ తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. రైతులు, పౌరసమాజం సైతం సూచనలు చేయడానికి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. ముసాయిదా బిల్లును మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ agriwelfare.gov.inలోనూ ఉంచింది.
కేంద్రానికి సర్వాధికారాలు
ప్రస్తుతం అమలులో ఉన్న పురుగు మందుల చట్టం(1968), పురుగు మందుల నిబంధన(1971)ల్లో ఉన్న లోపాలను సవరించడానికే కొత్త చట్టం తెస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ‘పురుగు మందుల తయారీ, అమ్మకం నుంచి వాడకం వరకు పారదర్శకతను తీసుకురావడం, రైతులకు నాణ్యమైనవే అందేలా చూడటం, వాటి ప్రమాణాలు గుర్తింపు సామర్థ్యం పెంచడం, నకిలీలను నియంత్రించడం, కఠిన జరిమానాలు విధించడం, తయారయ్యే ప్రతి మందునూ ప్రయోగశాలల్లో పరీక్షల అనంతరమే ధ్రువీకరించడం, జీవ పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించడం, మానవులు, జంతువులు, పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించడం, స్వదేశీ తయారీ భారీఎత్తున పెంచడం” తమ లక్ష్యాలని వెల్లడించింది. ఈ చట్టం అమలులోకి వచ్చాక దేశవ్యాప్తంగా పురుగు మందుల నాణ్యత, పంపిణీ అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి.
తయారీదారులు ప్రమాణాలు పాటించాలి
పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీలను డబ్బాపై ముద్రించాలి. తయారీ సంస్థ పేరు, చిరునామా, ఉత్పత్తి స్థలం, వాడిన రసాయనాలు, ఇతర వివరాలుండాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో, భద్రత ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉత్పత్తి జరగాలి. క్యూఆర్ కోడ్ ద్వారా వివరాలు వెల్లడించే సాంకేతికతను వినియోగించాలి.
ఉల్లంఘిస్తే శిక్ష
పురుగు మందుల రసాయన మిశ్రమంలో మార్పులు ఉండి, ప్రభావాన్ని చూపలేకపోయినా, రైతుల ఆరోగ్యానికి హాని కలిగించినా, నాణ్యత తగ్గించేలా ఇతర పదార్థాలు కలిపినా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించి పురుగుమందుల తయారీ, దిగుమతి చేసుకున్నా… వాటి విక్రయంతో ఎవరైనా మృతి చెందినా, తీవ్రంగా గాయపడినా… ఉత్పత్తిదారుడు, సంస్థను బాధ్యులుగా పరిగణిస్తారు. వారికి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, లేదంటే రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఒకేసారి రెండూ విధించొచ్చు. రెండోసారి నేరం చేస్తే… మొదటిసారి విధించిన జరిమానా కంటే రెట్టింపు జరిమానా వేస్తారు. మూడోసారి నేరం చేస్తే… సంబంధిత సంస్థ రిజిస్ట్రేషన్, లైసెన్స్ శాశ్వత రద్దుకు పెస్టిసైడ్ ఇన్‌స్పెక్టర్ సిఫార్సు చేస్తారు. జరిమానాను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్ కమిటీ ఇచ్చే రికవరీ సర్టిఫికెట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆ మొత్తాన్ని భూమి శిస్తు బకాయిల్లా వసూలు చేస్తారు. అవసరమైతే ఆస్తిని జప్తు చేస్తారు.

Read More

ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించండి

ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందనీ, రసాయన వ్యవసాయాన్ని క్రమంగా వీడి ప్రకృతి సేద్యానికి మళ్లాలని రైతులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఒక సీజన్‌కు ఒక ఎకరాతో ప్రకృతి సేద్యాన్ని ప్రారంభించాలని, తద్వారా రాబడి పొందుతూ ఆత్మవిశ్వాసం పెరిగే కొద్దీ దానిని విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ప్రకృతి సేద్యం వల్ల దీర్ఘకాలంలో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. భూమి సారవంతం కావడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు సమకూరుతాయని సామాజిక మాధ్యమం ‘లింక్డిన్‌’లో బుధవారం పెట్టిన పోస్టు ద్వారా వివరించారు. గత నెలలో కోయంబత్తూరులో నిర్వహించిన ‘దక్షిణ భారత ప్రకృతి సేద్యం సదస్సు-2025’కు రైతులు ఆహ్వానించగా వెళ్లినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా సాధిస్తున్న విజయాలు తననెంతో విస్మయపరిచాయని పేర్కొన్నారు. వ్యవసాయదారులతో పాటు శాస్త్రవేత్తలు, విద్యాధికులు, వృత్తి నిపుణులు, కార్పొరేట్‌ ఉద్యోగాలు వదిలి వచ్చిన వ్యక్తులు కూడా ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపుతున్నారని తన దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రకృతి సేద్యం ద్వారా వివిధ రకాల ఆహార ధాన్యాలు పండించడం, అంతర పంటలుగా కూరగాయలు, వివిధ రకాల పండ్ల మొక్కల సాగు, వీటికి అనుబంధంగా పాడి పశువులు, చేపల పెంపకం తదితరాలను చేపట్టి విజయపథంలో కొనసాగుతున్నారని తెలిపారు. సంప్రదాయ పంటల విత్తనాల పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలనూ ప్రధాని మోదీ ప్రశంసించారు. వివిధ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మలచుకుంటున్నారని తెలిపారు.

Read More

రానున్న సంవత్సరాలలో ప్రకృతి వ్యవసాయానికి తెలంగాణలో అధిక ప్రాధాన్యం

తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ప్రణాళికను రూపొందిస్తున్నామని వ్యవసాయశాఖా మంత్రి తెలిపారు. సెక్రటేరియట్‌లో ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు విశ్రాంత ఐఏఎస్‌ విజయ కుమార్‌, ఇతరులు, పక్క రాష్ట్రాలలో, వివిధ దేశాలలో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను మరియు వారి అనుభవాలు ప్రకృతి వ్యవసాయం ఆచరించి అధిక ఆదాయం పొందుతున్న రైతుల విజయ గాధలు, ప్రకృతి వ్యవసాయంలో మెరుగైన నేల ఆరోగ్యం మరియు ఆరోగ్యకర ఉత్పత్తులను మంత్రికి వివరించి తాము తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసారు.
సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌, వ్యవసాయ శాఖా సంచాలకులు డా. గోపి ఈ సంవత్సరం నుండి ఆరంభించిన ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రగతిని వివరించి ఇప్పటికే రాష్ట్రంలో 489 క్లస్టర్లు ఏర్పాటు చేసి 61,125 రైతులను ఎంపిక చేసినట్లు (50 హెక్టార్లు ప్రతి క్లస్టర్లు), దీనికి గాను కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 42.07 కోట్లు కేటాయించిందని రిసోర్స్‌ పర్సన్‌లకు వాలంతరి ఆధ్వర్యంలో శిక్షణను పూర్తి చేశామని తెలియచేసారు. ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధులు సూచించిన విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రంలో ముందుకు తీసుకువెళ్తామని తెలియజేసారు.
తరువాత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటిదాకా రైతులలో ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తగ్గుతాయని ఒక అపోహ ఉందని, కానీ ఏపిసిఎన్‌ఎఫ్‌ ప్రతినిధుల అనుభవాలు మరియు నా అనుభవం, తోటి రైతుల అనుభవాలు ఇది తప్పని నిరూపించాయని, రైతుల నికరాదాయం, మొదటి సంవత్సరం నుండి పెరగడం ఆరంభమైందని తెలియజేసారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యకర ఉత్పత్తులు తీసి మార్కెటింగ్‌ అవకాశాలను పెంచుకొనే అవకాశం కలదని, వర్షాధార ప్రాంతాలలో కూడా 3 పంటలు తీసే అవకాశం కలదని, అలాగే కలుపు, చీడపీడల సమస్య కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రస్తుత కర్తవ్యం నేల ఆరోగ్యాన్ని కాపాడడం తద్వారా మానవాళి ఆరోగ్యం కాపాడడమే కాకుండా రైతుకు నికర ఆదాయం పెంచడమని, ఇది ఒక్క ప్రకృతి వ్యవసాయంతోనే సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read More