నూనెగింజలు, ఆయిల్‌పామ్‌ పంటలే లాభదాయకం

తెలంగాణలో రైతులు నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలను అత్యధికంగా సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వపరంగా రైతులను అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద రూ.46.14 కోట్లతో 2025-26కి గాను మేలిమిరకం వేరుసెనగ విత్తనాల ఉచిత పంపిణీని మంగళవారం సచివాలయం నుంచి ప్రారంభించారు. ‘ఇతర పంటల కంటే నూనెగింజలు, ఆయిల్‌పామ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. సాగును పెంచేందుకు వీలుగా 38,434 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను మహబూబ్‌నగర్‌, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఎంపిక చేసిన రైతులకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ల ద్వారా పంపిణీ చేయించాం. నూనెగింజల పంటలకు యూరియా వాడకాన్ని తగ్గించి, సమతుల ఎరువుల వాడకాన్ని అలవర్చుకోవాలి’ అని తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి సురేంద్ర మోహన్‌, సంచాలకుడు గోపి తదితరులు పాల్గొన్నారు.

Read More

మార్కెటింగ్‌, మార్క్‌ ఫెడ్‌, హాకా, ఆర్‌ఐసి సంస్థల ఎండీలతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల సమీక్ష

తెలంగాణా రాష్ట్రంలో వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణ, మరియు మార్కెటింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా వరి ధాన్య సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు, మున్నగు వాటి జిల్లాల వారి లభ్యతపై సమీక్షించారు.
మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, ఐనప్పటికి రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు రేపటి నుండి మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. అదేవిధంగా సోయాబీన్‌ కొనుగోలు కేంద్రాలు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
సిసిఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. కావున వెంటనే కలెక్టర్లు జిన్నింగ్‌ సెంటర్లు రేపటిలోగా నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌ఓడీని అన్ని పంటల కొనుగోళ్లకు సమన్వయ అధికారిగా నియమించడం జరిగిందని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకొని రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలకు ఎండి, వేర్‌ హౌజ్‌, వరంగల్‌ జిల్లాకు డైరెక్టర్‌, హార్టీకల్చర్‌, నల్లగొండ జిల్లాకు డైరెక్టర్‌, అగ్రికల్చర్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాకు ఎండి, హాకా, ఖమ్మం జిల్లాకు డైరెక్టర్‌ మార్కెటింగ్‌, ఆదిలాబాద్‌ జిల్లాకు డైరెక్టర్‌, సీడ్‌ సర్టిఫికేషన్‌, కరీంనగర్‌ జిల్లాకు ఎండి, ఆగ్రోస్‌, మెదక్‌ జిల్లాకు ఎండి, మార్క్‌ ఫెడ్‌, రంగారెడ్డి జిల్లాకు ఎండి, ఆయిల్‌ ఫెడ్‌ గార్ల స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్‌, హాకా ఎండీ చంథ్రేఖర్‌ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి పాల్గొన్నారు.

Read More

ధాన్యం సేకరణపై పౌరసరఫరాల సంస్థ కార్యాచరణ

తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లాలవారీగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు కార్యాచరణ సిద్ధం చేసింది. కొనుగోలు కేంద్రాల సంఖ్యనూ ఖరారు చేసింది. 5 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరణ లక్ష్యంలో నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలున్నాయి. హైదరాబాద్‌ మినహా మిగతా 32 జిల్లాల్లో 39.08 లక్షల టన్నుల సన్నాలు, 35.91 లక్షల టన్నుల దొడ్డు రకాలు సేకరించాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
సన్నాలు, దొడ్డు రకాలు కలిపి- ఖమ్మం జిల్లాలో 2,78,892 టన్నులు కొనాలని అంచనా. 326 కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్లలో 2,44,522 టన్నులు, 244 కేంద్రాలు, నారాయణపేట 2,35,917 -117, మహబూబ్‌గర్‌ 2,26,418 – 190, భువనగిరి 2,26,410- 325, కొత్తగూడెం 2,23,272-193, మహబూబాబాద్‌ 2,18,373 – 237 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించనున్నారు.

Read More

40 శాతం సబ్సిడీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం

తెలంగాణ రాష్ట్రంలో 2025-26లో 40 శాతం రాయితీతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకాన్ని అమలు చేస్తున్నామని, దీన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకురాలు యాస్మీన్‌ బాషా కోరారు. పండ్లు, పూలతోటలు, సుగంధ ద్రవ్యాలు, అల్లం, పసుపు, వెల్లుల్లి, పుట్టగొడుగుల పెంపకానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. ఆసక్తి గల రైతులు స్థానిక ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు.

Read More

బోయినపల్లి మార్కెట్‌ను పరిశీలించిన రైతు కమిషన్‌

మార్కెట్‌ అధికారుల నిర్లక్ష్యంపై కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి సీరియస్‌

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ నిర్వహాణపై రైతు కమిషన్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కెట్‌ అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంపై కమిషన్‌ చైర్మన్‌ కొదండరెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకే రైతు కమిషన్‌ చైర్మన్‌తో పాటు సభ్యులు రాములు నాయక్‌, భవానీ రెడ్డి..మార్కెట్‌ను అకస్మిక తనిఖీ చేశారు. దాదాపు గంటన్నర పాటు అక్కడే ఉండి.. మార్కెట్‌ యార్డులో సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు, అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తించారు. చాలా సేపు మార్కెట్‌ యార్డులో తిరిగి అక్కడికి వివిధ రాష్ట్రాల నుండి వచ్చే రైతులు, వ్యాపారస్తులు, హామాలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.మార్కెట్‌ కార్యాలయంలోని రికార్డులను, అటెండెన్స్‌ రిజిస్టర్లను కమిషన్‌ బృందం పరిశీలించింది. గత మూడు, నాలుగు రోజులు మార్కెట్‌ సెక్రెటరీ అందుబాటులో లేకపోవడం, కింది స్థాయి సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంపై కమిషన్‌ చైర్మన్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఒకే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధుల్లో ఉండడం చూసి.. కమిషన్‌ ఆశ్చర్యానికి లోనైంది. ఇంత పెద్ద మార్కెట్లో ఒకే ఒక అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది అందుబాటులో ఉండడం ఏంటనీ ప్రశ్నించింది. ప్రతిరోజు బోయిన్‌పల్లి మార్కెట్‌ కు ఏఏ రాష్ట్రాల నుండి కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు వస్తాయో అడిగి తెలుసుకున్నారు. మార్కెట్లో కూరగాయల వ్యర్ధాలతో గ్యాస్‌ ఉత్పత్తి చేయడానికి గతంలో బయో గ్యాస్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత మూడు నెలల నుండి ప్లాంట్‌ నడవకపోవడంతో.. కూరగాయల వ్యర్ధాలను తరలించడానికి ప్రతినెల మార్కెట్‌ కమిటి నాలుగున్నర లక్షల రూపాయలను ఖర్చుచేస్తున్న విషయం కమిషన్‌ దృష్టికి వచ్చింది. మార్కెట్‌ యార్డులో కూరగాయల అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలపై కమిషన్‌ ఆరా తీసింది. బోయినపల్లి మార్కెట్‌ కమిటీలో ఉద్యోగుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, షాపుల వివరాలు అన్ని కమిషన్‌కు నివేదిక రూపంలో అందించాలని సూచించింది. మార్కెట్‌ను సందర్శించిన వారిలో కమిషన్‌ అధికారులు హారివెంకట ప్రసాద్‌, మహేష్‌ నాయక్‌ తదితరులు వున్నారు.

Read More

‘అగ్రి’ డిప్లొమా కోర్సులకు 8 నుంచి కౌన్సెలింగ్‌

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ‘అగ్రి’ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 8 నుంచి 11 వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ”ర్యాంకులు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజు మొత్తం తీసుకురావాలి. కౌన్సెలింగ్‌ తేదీల వారీగా ర్యాంకులు, ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtau.edu.in ను సందర్శించండి” అని స్పష్టం చేశారు.

Read More

వ్యవసాయంలో యాంత్రీకరణ పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలు, పట్టు సాగు విస్తరణకు ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్‌ ఛైర్మన్‌ కోదండరెడ్డి సూచించారు. గురువారం తన కార్యాలయంలో పంటల సాగు విస్తీర్ణం పెంపుపై కమిషన్‌ సభ్యులు, వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల్లో ఉద్యోగుల కొరతతోపాటు రైతులు యాంత్రీకరణ చేపట్టకపోవడం పంటల దిగుబడిపై ప్రభావం చూపుతోందన్నారు. ప్రభుత్వంతో చర్చించి వీటి పరిష్కారం కోసం కృషి చేస్తామని కోదండరెడ్డి తెలిపారు.

Read More

విజయవంతంగా ముగిసిన గ్రామగ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమం- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ సహకారంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం” కార్యక్రమం విజవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు. జూన్ రెండో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక చేయబడిన అభ్యుదయ రైతులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మరియు అధికారుల చేతుల మీదుగా విత్తన పాకెట్లను లాంచనంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు సుమారు 2500 క్వింటాళ్ల నాణ్యమైన మూల విత్తనాన్ని రాష్ట్రంలోని అన్ని రెవిన్యూ గ్రామాల్లో ఎంపిక చేయబడిన 35,000 మంది అభ్యుదయ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని మంత్రిగారు తెలపారు. వరిలో 20,000, జొన్నలో 1,522, కందిలో 4,568, పెసరలో 8,910 విత్తన కిట్లను రైతాంగానికి అందించడం జరిగిందని, నల్లగొండ జిల్లాలో అత్యధికంగా 2,192 కిట్లను, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జిల్లాలో అత్యల్పంగా 379 విత్తన కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా వ్వయసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ… ఈ నాణ్యమైన విత్తనాన్ని అందుకున్న రైతులు, సరైన యాజమాన్య పద్దతులు పాటించి వచ్చిన దిగుబడిని గ్రామంలోని ఇతర రైతులకు పంపిణీ చేయడం ద్వారా రానున్న రెండు, మూడు సంవత్సరాలలో ప్రతీ గ్రామం విత్తన స్వయం సమృద్ధి సాధించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతాంగానికి నాణ్యమైన విత్తనం అందించాలనే లక్ష్యంతో గత నాలుగు నెలలుగా ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసామని తెలిపారు.
భవిష్యత్తులో కూడా ఇలాంటి రైతు ప్రయోజనకరమైన వినూత్న కార్యక్రమాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు మరిన్ని చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతితో పాటు విశ్వవిద్యాలయ అధికారులు, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు.

Read More
  • 1
  • 2