వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో ప్రపంచస్థాయికి ఎదగాలి

  • తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

2047 నాటికి వ్యవసాయ రంగంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని విశ్వవిద్యాలయం కులపతి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆకాంక్షించారు. భాగస్వాముల అందరితో సమన్వయం చేసుకుంటూ వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణలో పురోగతి సాధించాలని సూచించారు. రాజేంద్రనగర్‌లో 2 రోజులపాటు జరుగుచున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. రాజేంద్రనగర్‌లోని పి.జె.టి.ఎ.యు. క్రీడా మైదానంలో కిసాన్‌ మేళా, వ్యవసాయ ప్రదర్శనల్ని ప్రారంభించారు. వివిధ స్టాళ్లను పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వజ్రోత్సవాల మీనియేచర్‌ పైలాన్‌ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి అల్దాస్‌ జానయ్యతో కలిసి ప్రారంభించారు. కాన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీ గుర్తింపు పత్రాలని అందజేశారు. తర్వాత విశ్వవిద్యాలయం అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్లుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ అభివృద్ధికి అసమాన సేవల్ని అందించిందన్నారు. సొనామసూరి, తెలంగాణ సోనా వంటి వంగడాలు రూపొందించిందన్నారు. భవిష్యత్‌ ప్రణాళికల అమలులో విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్‌ సూచించారు. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ సహాయంతో విశ్వవిద్యాలయం త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌నీ ప్రారంభించడం అభినందనీయమన్నారు. వ్యవసాయ విద్యని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఫీజులు తగ్గించడం స్వాగతించదగినదన్నారు. జై జవాన్‌, జై కిసాన్‌ అనే నినాదం ఇచ్చిన మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చేతుల మీద ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వాతావరణ మార్పులు వంటి కొత్త సవాళ్లని ఎదుర్కొని మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గవర్నమెంట్‌ పిలుపునిచ్చారు. ఉదయం ఉత్సవాల ప్రారంభ సదస్సులోనూ.
స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిసాన్‌ మేళాలోను తుమ్మల నాగేశ్వరరావు రైతులని ఉద్దేశించి ప్రసంగించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా డిమాండ్‌ ఉన్న పంటలు, మన నేల స్వభావానికి తగ్గట్లుగా అనువైన పంటలు, అందుకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలను రైతులకు అందించాలని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలకి ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రైతు వ్యవసాయ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. రైతు బీమా, రైతు రుణమాఫీలతో పాటు సంక్రాంతి తర్వాత రైతు భరోసాను అమలు చేస్తామన్నారు. హార్టికల్చర్‌, పంటలు, కూరగాయలు పామాయిల్‌ సాగు పెరగాలన్నారు. బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, శీతల గిడ్డంగుల నిర్మాణానికి చేయుతనిస్తామన్నారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని వ్యవసాయ రంగంలో అధిక జనాభా నిమగ్నం కావాలని తుమ్మల ఆకాంక్షించారు. దేశ ప్రధానుల చేతుల మీద ప్రారంభమైన విశ్వవిద్యాలయం రైతాంగానికి ఎల్లప్పుడూ చేదోడువాదోడుగా ఉందని ఆయనన్నారు. గత కొన్నేళ్లుగా ఈ విశ్వవిద్యాలయం వెనుకబాటుకి గురి అయింది అని.. దాని అధిగమించి పూర్వ వైభవం తీసుకురావటానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని ఉపయోగించుకుని పరిశోధన, విస్తరణ విద్యలో ముందుకెళ్లాలని మంత్రి సూచించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి 10 ర్యాంకుల్లో నిలవాలని తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాల తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ”మోడల్‌ అగ్రికల్చర్‌ ఫార్మ్‌”ను అభివృద్ధి చేయాలన్నారు. వాతావరణ మార్పుల కనుగుణంగా కరికులమ్‌లో రీసెర్చ్‌లో మార్పులు తీసుకురావాలని, ఆర్టిఫిషియల్‌, డిజిటల్‌ టెక్నాలజీలను వినియోగించుకోవాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. వజ్రోత్సవ ఉత్సవాల ప్రారంభ సమావేశంలో భారత ప్రభుత్వ నీతి ఆయోగ్‌ సభ్యులు రమేష్‌ చంద్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ఉపకులపతి అల్దాస్‌ జానయ్యతో తనకు పూర్వం నుంచి పరిచయం ఉందని ఆయన నాయకత్వంలో విశ్వవిద్యాలయ అభివృద్ధి పథాన సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గత విజయాలతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తు లక్ష్యాల్ని నిర్దేశించుకోవాలన్నారు. నిధుల లభ్యత తగ్గడం వల్ల పరిశోధనలు వెనుకబడుతున్నాయని ఆ విషయంపై దృష్టి సారించాలన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆహార ధాన్యాల ఉత్పాదక గణనీయంగా పెరిగిందన్నారు. తెలంగాణలో నీటిపారుదల సౌకర్యాలు, ఆహార ధాన్యాలు ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. అయితే కూరగాయలు, ఉద్యానవన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని దీన్ని అధిగమించాలన్నారు. అదేవిధంగా వ్యవసాయ విద్యనభ్యసించిన వాళ్ళు కేవలం ఉద్యోగాల కోసమే చూడకుండా ఎంటర్‌ ప్రెన్యూర్‌లుగా తయారు కావాలని రమేష్‌ చంద్‌ సూచించారు. గతంలో రైతులకి దక్కిన గౌరవం నేడు దక్కడం లేదని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ఎం. కోదండ రెడ్డి అన్నారు. రైతుకి వ్యవసాయానికి మూలమైన విత్తనాలు 90 శాతం ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళ్లడం దురదృష్టకరమని ఆయనన్నారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి రైతులు, వ్యవసాయ సంక్షేమం ప్రథమ ప్రాధాన్యాలని అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పనిచేయాలన్నారు. శాస్త్రవేత్తలు గ్రామాల్ని దత్తత తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో సహకార వ్యవసాయ విధానం అవసరమని కోదండ రెడ్డి అన్నారు. రైతు సుఖంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. భూమి, విత్తనం, నీరు, రైతు చెమట వ్యవసాయానికి ఆధారాలన్నారు. మన వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశానికి తలమానికంగా ఉండాలని ఆకాంక్షించారు. పురుగుమందుల రహిత వ్యవసాయం కోసం మనమందరం కృషి చేయాలని పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయంలో అమెరికా అధ్యకక్షుడు జార్జి బుష్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్శించడం గొప్ప అనుభవం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యకక్షులు జి. చిన్నా రెడ్డి అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమధ్య ప్రధాని 131 కొత్త వంగడాలు విడుదల చేశారని వాటిలో కనీసం మన విశ్వవిద్యాలయం వంగడాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
విద్య, పరిశోధన, విస్తరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పటికీ జన్యు మార్పిడి పంటల సాగు నీ అనుసరించవలసిందేనన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇక్రిసాట్‌, క్రిడా వంటి సంస్థల సహకారం తీసుకోవాలని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, టెక్నాలజీలని వ్యవసాయ రంగంలో విస్తృతంగా వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు. రైతుల కష్టాలు నాటికి నేటికి అలానే ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. ధరల పెరుగుదల, వాతావరణ మార్పులకి అనుగుణంగా రైతులకి చాలా చేయవలసి ఉందని ఆయన అన్నారు. వందేళ్ళ క్రితమే వ్యవసాయంగా ప్రాముఖ్యత గురించి మహాత్మా గాంధీ చెప్పారని మరో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సమరసింహా రెడ్డి అన్నారు. వ్యవసాయానికి అవసరమైన అన్నింటిని రైతులకు అందుబాటులో ఉంచాలని సమరసింహారెడ్డి సూచించారు. 60 ఏళ్ల వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రస్తానాన్ని పి.జె.టి.ఎ.యు. ఉపకులపతి అల్దాస్‌ జానయ్య వివరించారు. నాటి ప్రధానులు లాల్‌ బహుదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీలు, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఉపరాష్ట్రపతి మొరార్జీ దేశాయ్‌లు వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం చుట్టూ సుమారు 10 భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి సంస్థలు ఉన్నాయన్నారు. అదేవిధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వల్ల హైదరాబాద్‌ విత్తన రాజధానిగా రూపొందిందని జానయ్య వివరించారు. 60 ఏళ్లలో సుమారు 500 వంగడాలని విడుదల చేశామన్నారు. అదేవిధంగా సుమారు 32 వేల మంది గ్రాడ్యుయేట్లు బయటకొచ్చారన్నారు. 12 రాష్ట్రాల్లో సుమారు 3 కోట్ల ఎకరాల్లో విశ్వవిద్యాలయం రూపొందించిన వరి విత్తనాలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇతర పంటల్లోనూ విశ్వవిద్యాలయం రూపొందించిన వంగడాలు విస్తృత వ్యాప్తి పొందాయన్నారు. 21 పేటెంట్లు సాధించామన్నారు అలాగే పౌల్ట్రీ, పశుసంవర్ధక రంగాల్లోనూ వ్యవసాయ విశ్వవిద్యాలయం అపూర్వ ప్రగతి సాధించిందని అల్దాస్‌ జానయ్య అన్నారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల విశ్వవిద్యాలయం ప్రయాణం పై ఒక లఘు చిత్రాన్ని విడుదల చేశారు. అలాగే వివిధ సాగు పద్ధతులపై అనేక ప్రచురణల్ని కూడా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ప్రకాష్‌ గౌడ్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎ.పి.సి. రఘునందన్‌ రావు, కమిషనర్‌ బి. గోపి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, ఆగ్రోస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బాల్‌ రాజు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ హార్టికల్చర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజి రెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌ నారాయణరెడ్డి, పద్మశ్రీ గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్‌ రెడ్డి, రాఘవ రెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్‌ రావు, పూర్వ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కిసాన్‌ మేళా వేదికపై పలువురు తమ రైతులకు ఈ సందర్భంగా అవార్డులను బహుకరించారు.

Read More

చపాట… వారసత్వ సత్తా

ఐదు దశాబ్దాల కిందటి నుంచే వరంగల్‌ మిర్చిగా సాగు.. నకిలీ బెడద లేకుండా రైతుల నుంచే మూల విత్తనాలు- రంగు, రుచిలో విశేష పేరు ప్రఖ్యాతులు, – జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌- ‘జీఐ’తో విదేశాల్లో మరింతగా డిమాండ్‌!, – వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలలో 25 వేలకు పైగా ఎకరాల్లో సాగు పెద్దగా కారం లేకుండా కొంచెం తీపి, సాధారణం కంటే మరింత ఎరుపు… కొంచెం లావు..పచ్చళ్లు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ.. విత్తనంలోనూ నాణ్యత..! ఇదీ చపాటా మిర్చి ప్రత్యేకత. ముడతలతో కనిపించే ఈ పంట ఐదు దశాబ్దాలుగా వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో సాగవుతోంది. ఆహారంలో రంగుల వినియోగంపై నిషేధం ఉన్న దేశాల్లో.. ప్రత్యామ్నాయంగా చపాటా మిర్చిలోని ఓల్యూరోసిన్‌ అనే ఎర్ర రంగు ద్రావణాన్ని తీసి వాడుతుంటారు. దీంతో విదేశాల్లో చపాటాకు డిమాండ్‌ పెరిగింది. మూల విత్తనాలను రైతులే తయారు చేసుకుంటుండడంతో నకిలీ బెడద ఉండదు. అయితే, తెగుళ్లు, నల్లతామర, వైరస్‌ దాడి తీవ్రతతో కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి రావడం లేదు. రైతులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చపాటా మిర్చికి తాజాగా భౌగోళిక గుర్తింపు (జీఐ) దక్కింది. ఈ మేరకు 2021 నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. జీఐ కోసం తిమ్మంపేట మిర్చి ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ 2022లో ధరఖాస్తు చేయగా ఇటీవలే భారత పేటెంట్‌ కార్యాలయం (ఐపీవో) ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ, మార్కెటింగ్‌ అవకాశాలు పెరుగుతూ ఇది అన్నదాతలకూ లాభదాయకం కానుంది. దేశ, విదేశాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు మెరుగవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.50 ఏళ్ళ కిందట పడిన విత్తనం 1972లో పరకాల మండలం నాగారం, నడికుడ, రంగాపురం, బంగ్లాపల్లి, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, వావిలాల తదితర గ్రామాల్లో చపాటా విత్తనాలను రైతులే తయారు చేస్తున్నారు. తొలుత నగర మిర్చిగా పిలిచినా… వరంగల్‌ మిర్చిగా మార్కెట్‌లో ప్రసిద్ధి చెందింది. లంబుకాయ, సింగిల్‌ పట్టి, డబుల్‌ పట్టి, టామట మిర్చిగానూ పేర్కొంటారు. చపాటాపై స్వీయ ప్రయోగం విజయవంతంతో విత్తనాలను ఇతర రైతులకు అందించారు. మొదటి కాతలో నాణ్యమైన, మంచి రంగుతో కూడిన కాయలను గ్రేడ్‌ చేసి 10-15 రోజులు, గింజలను వేరు చేసి మరో మూడు రోజులు ఎండబెడతారు. తర్వాత శుద్ధి చేసి భద్రపరుస్తారు. ఈ మిరప పొడిని పచ్చళ్లలో, ఎండు మిర్చిగా వాడుతుంటారు. విశిష్టత రీత్యా చపాటా మిర్చి సాగు పదేళ్ల నుంచి భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు విస్తరించింది. ఈ సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌లో 10 వేల, ఉమ్మడి ఖమ్మంలో 6 వేల, ఇతర జిల్లాల్లో 9 వేల ఎకరాల్లో పండిస్తున్నారు.మెక్సికన్‌ క్యాప్సికమ్‌లా.. మెక్సికన్‌ క్యాప్సికమ్‌ను పోలి ఉండే వరంగల్‌ చపాటా మిర్చి అరుదైన రకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పచ్చళ్లు చాలా రోజులు ఉండడంతో ఈ మిర్చికి దేశ, విదేశాల్లో డిమాండ్‌ నెలకొంది. ఆహార శుద్ధి పరిశ్రమలు, హోటళ్లు, బెవరేజెస్‌, పచ్చళ్ల తయారీతో పాటు లిప్‌స్టిక్‌, ఐస్‌క్రీంలో వినియోగిస్తుండడం విశేషం. ముఖ్యంగా థాయ్‌లాండ్‌, వియత్నాం, ఇంగ్లండ్‌, అమెరికా, స్విట్జర్లాండ్‌ తదితర దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంది. చపాటా మిర్చి ఉష్ణ విలువ 4000-8500 మధ్య స్కోవిల్లే హీట్‌ యూనిట్స్‌ మధ్య ఉంటుందని, అందుకే విదేశాల్లో బాగా వినియోగిస్తారని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Read More

ఆక్వా రంగంలో 30% వృద్ధి సాధించాలిఅధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

ఆక్వా రంగంలో 30% వృద్ధి సాధించాలని.. కలెక్టర్లు దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘2014-19 మధ్య రాష్ట్రంలో ఆక్వాకు స్వర్ణయుగమే. కొన్ని కారణాల వలన మన మార్కెట్‌ను ఇతర దేశాలు ఆక్రమించాయి. ఆక్వా రంగంలో మళ్లీ మనం పురోగమించాలి’ అని సూచించారు. మత్స్య, పశు సంవర్థక రంగాలపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు.మీరేం కమిషనరయ్యా? నాణ్యమైన సీడ్‌ దొరకక రైతులు కోల్‌కతా నుంచి సీడ్‌ తెచ్చుకుంటున్నారని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి ప్రస్తావించగా.. చంద్రబాబు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. చెరువుల టెస్టింగ్‌ ఇతర విషయాలపై మత్స్యశాఖ కమిషనర్‌ డోలా శంకర్‌ ఇచ్చిన సమధానంపై ఆయన సంతృప్తి చెందలేదు. ‘మీరు చేసే కార్యక్రమాలు కలెక్టర్లకే తెలియడం లేదు. రైతుల్లోకి ఇంకేం తీసుకెళ్తారు? మీరేం కమిషనర్‌య్యా’ అని అసహనం వెలిబుచ్చారు. వచ్చే సమావేశానికి పూర్తి సన్నద్ధతతో రావాలని సూచించారు.

Read More

చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

వాతావరణం మార్పుల కనుగుణంగా పంటలకు సోకే చీడపీడల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యకక్షుడు డాక్టర్‌ జి. చిన్నా రెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ”రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ ప్లాంట్‌ పాథాలజీ అండ్‌ ఇన్నోవేటివ్‌ అప్రోచెస్‌ ఇన్‌ ప్లాంట్‌ డిసీజ్‌ మేనేజ్‌మెంట్‌ (ఆర్‌ఏపీపీఐడి)” అన్న అంశంపై రెండు రోజులపాటు నిర్వహిస్తోన్న జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజేంద్రనగర్‌ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సును ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఫైటో పాథలాజికల్‌ సొసైటీ (సెంట్రల్‌ జోన్‌), దక్కన్‌ సొసైటీ ఆఫ్‌ ప్లాంట్‌ ఫాథాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్‌ చిన్నారెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమమేధ, మిషిన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీలను సస్యరక్షణలో వినియోగించుకోవాలని సూచించారు. ఆహార మరియు పోషణ, భద్రత కల్పించడంలోనూ వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ వంతు కృషి జరపాలన్నారు. ప్లాంట్‌ పాథాలజిస్ట్‌ లే మొక్కల డాక్టర్లని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ కె. గోపాల్‌, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ దండ రాజి రెడ్డి, గుంటూరు లాం లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ శారదా జయలక్ష్మి ప్రసంగించారు. పంటకోత అనంతర నష్టాలను తగ్గించడంపై ప్లాంట్‌ పాథాలజీ శాస్త్రవేత్తలు దృష్టి నిలపాలని కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ రాజిరెడ్డి సూచించారు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్‌ ప్రస్తుత అవసరమని ఆయన చెప్పారు. పర్యావరణ సమతుల్యతలు పాటించాలన్నారు. ప్లాంట్‌ పాథాలజీ రంగం మరింత ఆధునికతను సంతరించుకోవాల్సిన అవసరం ఉందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ శారదా జయలక్ష్మి అన్నారు. వివిధ పంటలకు సోకే రోగాల నిర్ధారణ, నివారణకు కూడా రిమోట్‌ సెన్సింగ్‌ అధ్యయనం ఎంతో అవసరమని ఆమె తెలిపారు. పలు విభాగాలకు చెందిన శాస్త్రవేత్తలు అందరూ కలిసి పనిచేయడం వల్ల సస్యరక్షణలో మెరుగైన ఫలితాలు సాధించగలమని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కె. గోపాల్‌ అభిప్రాయపడ్డారు. అంతకుముందు ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ జె. సత్యనారాయణ ప్రసంగించారు. ప్లాంట్‌ పాథాలజీ రంగంలో చేపట్టాల్సిన పరిశోధనలు వాటి అవసరాలను వివరించారు. ఈ రెండు రోజుల సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశాలను, చేపట్టనున్న ప్రధాన చర్చల గురించిన నివేదికను ఇండియన్‌ ఫైటో ప్లాంట్‌ ఫాథాలాజికల్‌ సొసైటీ (సెంట్రల్‌ జోన్‌) అధ్యకక్షుడు డాక్టర్‌ విద్యాసాగర్‌ వివరించారు. డాక్టర్‌ జి. రాజేష్‌ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 150 మంది ప్లాంట్‌ పాథాలజీ విభాగం శాస్త్రవేత్తలు, పీజీ, పీహెచ్‌డి విద్యార్థులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read More

ఆశలు రేపుతున్న ఆయిల్‌పాం

రెండేళ్ల తర్వాత మళ్లీ టన్ను ధర రూ. 20 వేలపైకిదిగుమతి సుంకం పెంపుతో రైతులకు కలిసి వస్తున్న ధర తెలంగాణా రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగును గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇదే సమయంలో ఆయిల్‌పాం గెలల ధరల్లో పెరుగుదలతో రైతుల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. గతేడాది నవంబరులో రూ. 12,440 పలికిన టన్ను గెలల ధర.. ప్రస్తుతం రూ. 20,400కు చేరింది. అంటే రూ. 8 వేల వరకూ పెరిగింది. 2022 జూన్‌లో టన్ను గెలల ధర రూ. 23,400 పలకగా.. ఆ తరువాత క్రమేపీ పతనమైంది. 2023లో టన్ను ధర రూ. 14,205 కు మించలేదు. రెండేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పాత ధరలు వస్తుండడంతో.. సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం ఆధారంగా ధరలు ఆరేళ్ల క్రితం పామాయిల్‌పై దిగుమతి సుంకం 42 శాతం ఉండగా క్రమేపీ సున్నాకు తగ్గించారు. దీంతో దిగుమతులు పెరిగి దేశంలో ఆయిల్‌పాం గెలల ధరలు పడిపోయాయి. తాజాగా కేంద్రం దిగుమతి సుంకాన్ని 27 శాతానికి పెంచడంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలకు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 19.40 శాతం ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌ (ఓఈఆర్‌) అమలు చేస్తున్నారు. ఓఈఆర్‌ పెరుగుదలకు అనుగుణంగా రైతులకు ధర వస్తుంది.ఆయిల్‌పామ్‌ గెలల ధరలో మార్పులు ఇలా.. సమయం టన్ను ధర (రూ.) 2022 నవంబరు 13,741 డిసెంబరు 13,881 2023 నవంబరు 12,440 డిసెంబరు 12,448 2024 నవంబరు 20,413శుభపరిణామం టన్ను ఆయిల్‌పాం గెలల ధర రూ. 20 వేల స్థాయిని దాటడం శుభపరిణామం అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పంట సాగును పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఏటా సుమారు లక్ష ఎకరాల సాగు విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని, రైతులకు స్థిరీకరణ ధర కోసం కేంద్రాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Read More

ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి

కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లకు సీఎం ఆదేశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. కల్లాల్లోని పంట ఉత్పత్తులు తడవకుండా రైతులకు టార్పాలిన్లు అందజేయాలని తెలిపారు. వరి కోతల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా వ్యవసాయశాఖ ద్వారా అన్నదాతలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

Read More

మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు

పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయని రైస్‌ మిల్లర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు. బుధవారం కృష్ణాజిల్లా అవనిగడ్డ, ఘంటసాల, చల్లపల్లి మండలాల్లో ఆయన పర్యటించారు. అవనిగడ్డ మండల రెవిన్యూ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధాన్యంలో తేమ 25 శాతం వరకూ ఉన్నా తీసుకుంటామన్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 280 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని చెప్పారు. 24 గంటల్లో 93 శాతం మందికి సొమ్ము చెల్లించినట్లు వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మిల్లర్లు, దళారులు ధర తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపడతామన్నారు. అన్నదాతలు వాట్సప్‌ సేవలు వినియోగించుకోవాలని.. 7337359375 నంబరుకు రైతు హాయ్‌ అని పోస్టు చేస్తే అధికారులే వచ్చి ధాన్యం కొనుగోలు చేసే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. 1262 రకం ధాన్యం మొత్తాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఘంటసాల మండలం లంకపల్లిలో పలువురు రైతులు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోయగా మంత్రి మనోహర్‌, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం ఆరబెట్టేందుకు పెద్ద డ్రయ్యర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చల్లపల్లి, మాజేరులోనూ ఆరబోసిన ధాన్యాన్ని వారు పరిశీలించారు.

Read More

తెలంగాణకు రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేంద్రాలు మంజూరు

– పిజేటిఏయు ఉపకులపతి ఆల్థాస్‌ జానయ్య

తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంటకు సంబంధించి రెండు అఖిల భారత సమన్వయ పత్తి పరిశోధన కేంద్రాలకి (ఏఐసిఆర్‌పీ) భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్‌) ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాలను మంజూరు చేస్తున్నట్లు ఐసిఏఆర్‌ పిజేటిఏయు ఉపకులపతికి నిన్న అధికారికంగా లేఖ రాసింది. రాష్ట్ర విభజన అనంతరం భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిధిలో పత్తి పరిశోధన చేసే సమన్వయ కేంద్రాలు తెలంగాణ రాష్ట్రం పూర్తిగా కోల్పోయింది. ఫలితంగా గత పది ఏళ్లలో జాతీయస్థాయిలో పత్తి పరిశోధన వ్యవస్థలో పిజేటిఏయు భాగస్వామి కాలేకపోయింది. ఇటీవల నూతనంగా నియమితులైన ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య గత నెలలో ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ హిమాన్షు పాఠక్‌, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డా.టి. పి శర్మ లను కలిసి తెలంగాణలో పత్తి పంట ప్రాధాన్యతను వివరించి వెంటనే అఖిలభారత పత్తి సమన్వయ పరిశోధన పథకంలో పిజేటిఏయుకు భాగస్వామ్యం కల్పించి తదనుగుణంగా వరంగల్‌ లో ఒక ప్రధాన కేంద్రం, ఆదిలాబాద్‌లో ఒక ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. దానితోపాటు ఆయా కేంద్రాలకు ఐసిఏఆర్‌ సిబ్బందిని, నిధులను కేటాయించి పిజేటిఏయులో పత్తి పంటలపై పరిశోధనలను పునఃప్రారంభించి రైతులకు రాగల రోజులలో సాంకేతిక మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ విజ్ఞప్తికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ మరియు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సానుకూలంగా స్పందించి కేంద్రాలని వెంటనే మంజూరు చేస్తున్నట్లు నిన్న అధికారికంగా సమాచారం అందిస్తూ లేఖను ఉపకులపతి కి పంపించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ రెండు ఐఏసిఆర్‌పి కేంద్రాలలో పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్‌ అల్థాస్‌ జానయ్య తెలిపారు.

Read More

సాగునీరు లక్ష్యం.. 42.11 లక్షల ఎకరాలు

యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు25 నుంచి సాగునీటి విడుదలప్రాజెక్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలని ‘స్కివమ్‌’ నిర్ణయం ప్రాజెక్టుల కింద యాసంగి పంటకాలానికి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని తెలంగాణా నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టం సమృద్ధిగా ఉన్నందువల్ల ఆరుతడి, తరి కలిపి 42.11 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనుంది. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన రాష్ట్రస్థాయి సమీకృత నీటి ప్రణాళిక, యాజమాన్య కమిటీ (ఎస్‌సీఐడబ్ల్యూఏఎం-స్కివమ్‌) సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (జనరల్‌) అనిల్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 19 సర్కిళ్ల ముఖ్య ఇంజినీర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, యాసంగి పంటల లక్ష్యం, వానాకాలం పంటల సాగు వివరాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. 17.92 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 24.19 లక్షల ఎకరాల్లో తరి పంటలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. వాటితో పాటు నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలోని లిఫ్టులు కలిపి మొత్తం 365.28 టీఎంసీల నీటిని యాసంగి పంటలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 25 నుంచి ప్రాజెక్టుల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. పంటల దిగుబడిలో మేలైన ఫలితాలు వస్తున్నందువల్ల ఆన్‌ అండ్‌ ఆఫ్‌ (వార బందీ) పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. జనవరి 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఐదు టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు రెండో థకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది వర్షాల మధ్య విరామం తక్కువగా ఉండటంతో నేలలో తేమ ఉన్నందువల్ల తక్కువ నీటి తడులు అవసరమయ్యే అవకాశాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు శ్రీరామసాగర్‌ ఎగువ నుంచి గోదావరిలోకి నీటి ప్రవాహం వస్తోంది. దిగువన కూడా వినియోగించిన నీరు (రీ-జనరేషన్‌) వచ్చి కలుస్తోంది. దీంతో యాసంగిలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు. కాళేశ్వరం కింద 98,570 ఎకరాల ఆయకట్టు ఉండగా యాసంగిలో 93,070 ఎకరాలకు 7.1 టీఎంసీలు అందించాలని గజ్వేల్‌ ఈఎన్సీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రధానంగా అనంతగిరి, రంగనాయకసాగర్‌ జలాశయాల కింద ఈ ఆయకట్టు ఉంది. ఈ నీటి కేటాయింపులపై కీలక చర్చ జరిగినట్లు సమాచారం. ప్రతిపాదించిన మేరకు కేటాయింపులు సాధ్యం కాకపోవచ్చని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. దీంతో కనీసం మూడు టీఎంసీలైనా రెండు జలాశయాలకు ఇవ్వాలని గజ్వేల్‌ ఈఎన్సీ సూచించినట్లు సమాచారం.

Read More

సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. డిసెంబరు 5న ఈ ఎన్నికలకు సంంధించి నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. తుపాను, ఇతర ఇబ్బందుల వల్ల జిల్లాల్లో పరిస్థితులు ఎన్నికలకు సానుకూలంగా లేవనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉంది. అందువల్ల ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయవద్దని జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. తదుపరి షెడ్యూలును ప్రభుత్వం మళ్లీ విడుదల చేస్తుంది.

Read More